పొద్దున్నే లేచి, కారిడార్‌లో ఉండే పాల పేకెట్లు, ‘హిందూ’ పేపరు ఇంట్లోకి తీసుకురావడం అతని పని. అంతేకాదు, ఫిల్టర్‌ని శుభ్రం చేసి, కొత్త డికాక్షన్ కోసం ఏర్పాటు చెయ్యడం కూడా. ఒక ప్రక్క పళ్లు తోముకుంటూనే – పాలు పొంగిపోకుండా కాపాడుకుంటూ కాచినందుకు – మైక్రోవేవ్ అవసరంలేని వేడివేడి మొదటి కాఫీ అతనికి బోనస్.
నిదానంగా కాఫీ త్రాగుతూ పేపర్ చదువుదామనుకుంటాడా, అప్పటికే ఈ మహారాణి లేచి కూర్చుంటుంది. సుడోకుతో కుస్తీ. రాకపోతే ఒక్కోసారి అడుగుతుంది. ఒక చూపు చూసి, ‘ఐదూ’, ‘ఏడూ’ – అనేస్తాడు.
“నీ మొహం, నిన్నడగడం నాదే బుద్ధి తక్కువ,” అంటుంది. పేపర్‌ని పంచుకొని హెడ్‌లైన్స్ చదువుతూంటే,
“ఇవాళ సేమ్యా ఉప్మా,” అంది మహారాణి.
అంటే ఉల్లిపాయలూ, అల్లం, పచ్చిమిరపకాయలూ తరగడం అతని డ్యూటీ.
అదిసరే, ఇక్కడినుంచి వంటింట్లోకి ఎలావెళ్లడం? దారి తెలియలేదు.
‘ఇదేమిటి, ఇడ్లీ వచ్చింది? సేమ్యా ఉప్మా అంది కదా? వీడెవడు? నామొహమ్మీద మొహంపెట్టి, నోటి దుర్వాసనతో అరుస్తున్నాడు, నాకేమన్నా చెముడా?’
“సాంబారు మీద పోసుకోకండి. బిబ్బు కడతానంటే ఒప్పుకోరు. పళ్లు పెట్టుకొనే వచ్చారా? నిన్న మర్చిపోయారు”.
“మా ఆవిడేదీ? ఆవిడకి ఇడ్లీ అంత ఇష్టంలేదుగాని తింటుంది”.
“లండన్ వెళ్లారు, ఇహిహి! మీరు తింటూ ఉండండి. వచ్చేస్తారు”.
లండన్ ఎందుకు వెళ్లినట్టు? వెళితే అమ్మాయి దగ్గరకి, ఆస్ట్రేలియా వెళ్లాలిగానీ? అయినా నాకు చెప్పకుండా వెళిపోతుందా?
ఒక ఇడ్లీ తినగలిగాడు.
“గురువుగారూ! మీ కాఫీ!…మీద ఒంపుకోకండి!”.
గుంటనక్క మొహం, వీడూనూ. పేరు గుర్తురావడం లేదు.
“క్వార్టర్లీ ఎడ్వాన్స్ పేమెంటు! మీరిస్తారా? మీ అమ్మాయిగారిని అడగమంటారా?” అరుస్తున్నాడు, వెధవ!
“మా ఇద్దరికీ – నేనే ఇస్తాను”.
“మీదివ్వండి, చాలు. ఎమౌంట్ తెలుసుకదా?”
“ఓ యెస్. డెబిట్ కార్డు రూంలో ఉంది”.
“పిన్ గుర్తుందా?”
పిన్!… మొదట్లో పుట్టిన సంవత్సరం ఉండేది. దాన్ని మార్చినట్లు గుర్తు. ఇప్పుడది అమ్మాయి పుట్టిన సంవత్సరం కదూ?
“మీ అమ్మాయిగారు ఇస్తారులెండి. డాలర్లయితే మాకూ సుఖం. ఇదిగో ఇక్కడ సంతకం పెట్టండి. సంతకం!… అంటే మీ పేరు!”
“అవును. నాకు తెలుసు. అదే ఆలోచిస్తున్నాను”.
“అవసరం లేదులెండి. వేలిముద్ర చాలు. నా ఫోన్‌తో ఒక ఫొటో తీసుకుంటాను. కొంచెం నవ్వండి”. యూకేలో పీఎచ్‌డీ చేసినవాడిని. వేలిముద్రకి వచ్చేసాను.
కాఫీ తాగడం పూర్త యింది. గుంటనక్క మళ్లీ ప్రత్యక్షం.
“రూంకి వెళ్లగలరా? నర్సుని తోడు రమ్మంటారా?”
రోషం వచ్చింది.”నా అంతట నేనే వచ్చానా, లేదా? ఐ కెన్ గో ఆన్ మై ఓన్!”
“కోపం వచ్చినట్టుంది. అందుకే ఇంగ్లీషు వచ్చేసింది! ఇహిహి! వాకర్ మర్చిపోకండి”.
వాకర్‌ని ఈడ్చుకుంటూ రూము చేరుకొనేసరికి మహారాణి మంచంమీద చిటపటలాడుతూ కూర్చొని ఉంది.
“బ్రేక్‌ఫాస్ట్‌కి రాలేదేం?” అని అడిగితే మొహం ముడుచుకుంది.
“సేమ్యా ఉప్మా అన్నావా? బఠాణీలు లేవు మరి. కరివేపాకూ లేదు,” ఏదో ఒకటని మాట కలపాలి కదా?
“పెద్ద సైంటిస్టువి, ఫూలిష్‌గా మాట్లాడకు,” అనేసి, అక్కడినుండి మాయమైంది. ఈ మధ్య ఇలా కనబడి, అలా మాయమవడం ఎక్కువైపోయింది. ఏమైనా తిందో లేదో మరి? రోజూ ఉప్మా అంటే ఎలా కుదురుతుంది?
మంచమ్మీద జేరబడి టీవీ ఆన్‌చేశాడు.
నేషనల్ జియొగ్రాఫిక్. ఇంతకుముందు చూసిందే. సౌండు బాగా తగ్గించాడు.
సింహాలు గుంపుగా జీబ్రాలమీద దాడిచేసి పరుగెత్తలేకపోయిన ఒక ముసలి జీబ్రాని లాక్కుపోయాయి. ఆకలితో ఉన్న సింహాల పక్షం వహించాలా? లేక నీళ్లు తాగి వాటిమానాన్న పోతూన్న జీబ్రాల పక్షాన నిలబడాలా? తేల్చుకొనేలోగా సింహాలు తమ పని కానిచ్చాయి. తను ఏ పక్షం అయితే ఎవడిక్కావాలి? దాహం-నీళ్లు, ఆకలి-తిండి; వాటి బ్రతుకులకు ఆ మేరకు అర్థం ఉంది కదా?…
చిన్న కునుకుతీసి, గభాలున లేచాడు. గంట మ్రోగింది. రూంబాయ్ టీ తీసుకొచ్చాడు. అప్పుడే పదకొండైందా? టీ త్రాగుతూ టీవీ వైపు చూశాడు.
యవ్వనంలో దృఢంగా ఉన్న మొగపక్షుల బీజంకోసం ఆశిస్తూనే, ఆడపక్షులు బెట్టుచేస్తున్నాయి. వాటి దృష్టిని ఆకర్షించడానికి మొగపక్షులు నానాతంటాలూ పడుతున్నాయి పాపం. వయసుపైబడి, ఈకలురాలిన ఒక మొగపక్షి అవస్థ మరీ దయనీయంగా ఉంది. ఎంచేతోగాని జంతువుల్లో బలాత్కారాలుండవు. నో అంటే నో! – అంతే…. ఛానెల్ మార్చేడు.
పాత హిందీ పాట. బ్లాక్ అండ్ వైట్లో. గుడ్లప్పగించి చూస్తూ, సౌండు పెంచాడు. ఎవరామె? కొంచెం మహారాణిలాగానే ఉంది.
“జరాసీ ఆహట్ హోతీ హై,
తొ దిల్ సోచ్‌తాహై –
కహీ యే వోతో నహీ,
కహీ యే వోతొ నహీ”.
లతా నాలుగోసారి మెలితిప్పి మరీ ‘కహీ యే వోతో నహీ’ అని సాగదీసినప్పుడు, సరిగ్గా అప్పుడే, అదే క్షణంలో – అతని ఎనభై ఏళ్ల జీవితం అతని కళ్లముందు కదలాడింది. ముఖ్యంగా ఒక తెల్లవారుజామున అమ్మా-నాన్నలతో చేసిన రైలు ప్రయాణం, వేసవి మధ్యాహ్నపుటెండలో ఎవర్నీ ఏదీ అడక్కుండా ఏక్‌తారా వాయించుకుంటూ ఏదో భాషలో ఒక బిచ్చగాడు పాడిన పాట, మరో చలికాలపు సాయంత్రాన నిర్మలాకాశంలో విరిసిన నక్షత్రాల మిణుకు-మిణుకు – ఈ మూడూ గుర్తుకొచ్చాయి.
వాటన్నింటి గురించీ మహారాణితో వివరంగా మాట్లాడాలని బలంగా అనిపించింది.
‘టీ తాగదు, ఫిల్టర్ కాఫీ కావాలంటుంది,’ అనుకుంటూ టీ కప్పు సైడ్‌టేబిల్ మీద పెట్టి అటూఇటూ చూశాడుగానీ ఆమెగారు కనబడలేదు. మళ్లీ అలిగినట్లుంది.
అప్పుడతనికి ఎక్కిళ్లు వచ్చాయి. ఆగిపోతాయేమోనని చూశాడు, ఆగలేదు.
టేబిల్‌మీద ఉన్న మంచినీళ్ల బాటిల్‌ని అందుకుందామని ముందుకి వంగాడు. గుండెలో నొప్పి.
టీలో అల్లంగాని ఎక్కువైందా? అనుకుంటూనే –
అక్కడే, ఆ మంచంమీదే కుప్పకూలిపోయాడు.
సగం కప్పు అల్లం టీ అలాగే చల్లారిపోయింది.
*
చిత్రం: చరణ్ పరిమి
అదృష్టవంతుడు 80 దాకా బతికాడు.
ఒంటరిగా.
80 లలో వున్నవాళ్ళు ఈ కథ చదివిన వెమ్మటే ఝడుసుకుని ఛస్తారు!
రచయితలు హైదరాబాదు నివాసిలుగా వుండటం వారి రచనల మీద ప్రభావం చూపిస్తోందా? హిందీ సినిమాల పాటల ప్రస్తావన కనబడుతోంది ఇటీవల ! లేదా హిందీ పాటలంటే ఇష్టమా!
సరదాగా ఉంది ఇతని గొడవ .
అల్జీమర్స్, ఙాపకశక్తి పోవడం అనే వ్యాధి ఇప్పుడు ఇండియా లో కూడా కనిపిస్తోంది. కారణాలు ఇదమిత్థంగా తెలియవు. వ్రుధ్దాప్యంలో వచ్చే ఈ జబ్బు కి ఏ మందులు సరిగ్గా పని చేయడం లేదు. ఒక రోజు ఇతర సమస్యల వల్ల సగం తాగిన అల్లం చాయ్ కప్పు ఆరిపోతుంది.
చాలా బాగుంది sir
వయసులో పెద్దవాళ్ళను బయపెట్టే పని పెట్టకున్నారట్టుంది. కథ బాగుంది.అల్లం టీ చల్లారితే చేదెక్కుతుంది కాబోలు.
జంతువుల్లో బలాత్కారాలు ఉండవా? 😳😳
మన ఊళ్లలో కుక్కలు కోళ్లను చూడలేదా ఎప్పుడూ..