ముస్లిం మగ రచయితల చైతన్యరాహిత్యం

తెలుగు ముస్లిం రచయితల నుంచి కవిత్వం, కథ విరివిగా రావడం చూశాం. నవల ఎందుకు రావడం లేదు అనే ప్రశ్న ఉదయిస్తుంది. కాస్త ఈ రచయితలు తమను తాము తరచి చూసుకోవాలి. రచయిత సమాజం కన్నా ముందుంటాడు. మరి ముస్లిం సమాజం ఏ విషయాల్లో వెనుకబడి ఉందో, ఛాందసంగా ఉందో అర్ధం చేసుకోవలసి ఉంది. కవిత్వంలో ముస్లిం కవులు చాలామంది బలంగా ఛాందసత్వాలను విమర్శించారు. కథల్లో చాలా తగ్గింది. మూడు నవలలు రాసిన సలీం, ఒక్కొక్కటి రాసిన స్కైబాబ, షాజహానా రచనల్లో ఛాందస భావాల చిత్రణ ఉంది.
వతన్‌, కథామినార్‌, చోంగారోటీ, మొహర్‌ సంకలనాలే కాక వ్యక్తిగతంగా ఎందరో ముస్లిం రచయితలు చాలా కథలు రాశారు. ఎన్నో కోణాలు ఆవిష్క ృతమయ్యాయి. వాటిల్లో కొన్ని ముస్లిం కథలు కాకపోవచ్చు. పేర్లు మారిస్తే అది ఎవరి కథైనా అయ్యే కథలు ముస్లిం కథలు కావు. అది వేరే చర్చ. కానీ నేను గమనించినంతవరకు ముస్లింలలోని ఛాందస భావాల మీద కథలు తక్కువగా వచ్చాయి. రాయడానికి జంకుతున్నారు. ముస్లింల పరిస్థితులు దేశంలో బాగలేవు కాబట్టి అంతర్గత సమస్యల మీదగానీ, సంస్కరణవాద కథలు గానీ రాయడం ఇప్పుడు సరైంది కాదు అనే వంకను తోడు తెచ్చుకుని ముఖ్యంగా ముస్లిం మగ రచయితలు తప్పించుకుంటున్నారు. ఆ రకంగా వీరు కొన్ని సత్యాలను రాయకుండా దాటవేస్తున్నారు. అంతర్గత సమస్యల గురించి మాట్లాడకుండా తప్పించుకుంటున్నారు.
నిజానికి ముస్లింవాద కథ మొదలైనదే ముస్లిం సంస్కరణవాద కథలతోటి. ముస్లింవాద ఆది కథకులు షేక్‌ హుసేన్‌ సత్యాగ్ని 1989లోనే వేసిన పాచికలు కథా సంపుటిలో ముస్లిం స్త్రీల సమస్యలను తీసుకొని సంస్కరణవాద కథలు రాశారు. తరువాత పి.షహనాజ్‌, బా రహమతుల్లా, ఖాజా, స్కైబాబ, షాజహానా లాంటి రచయితలు తప్ప ఈ అంశాలను ముట్టుకోడానికి చాన్నాళ్లుగా ఎవరూ ముందుకు రావడం లేదు. స్కైబాబ ముస్లిం స్త్రీల సమస్యలను, వారి భగ్న ప్రేమలను, పోరాటాలను, సున్నిత అంశాలను ఎన్నింటినో తీసుకొని రాసినా, వాటిని మిగతా ముస్లిం రచయితలు చూసీ  చూడనట్లు ఉండిపోయారు. ఈమధ్య షాజహానా సంపాదకత్వంలో పర్‌స్పెక్టివ్‌ ప్రచురణగా వెలువడిన తొలి ముస్లిం స్త్రీల కథా సంకలనం ‘మొహర్‌’లో ముస్లిం స్త్రీలు గొంతెత్తడం కనిపిస్తుంది. అందులోనూ సంస్కరణవాద కథలు తక్కువే! రుబీనా పర్వీన్‌ మాత్రమే ఆశాకిరణంగా కనిపిస్తున్నారు.
నేడు ఏ సమాజాలు కూడా మతం పేర ఛాందసంగా ఉండడం, తమ స్త్రీలను అణచి ఉంచడం చేయడం లేదు. ముస్లింలు మాత్రం మతం పేర ఎన్నో అకృత్యాలు చేస్తున్నారు. 14 వందల ఏళ్ల నాటి సాంప్రదాయాలను పాటించడం, స్త్రీలపై రుద్దడం చేస్తున్నారు. ఈ అంశాలపై కథలు రావలసి ఉంది. కన్నడ ప్రముఖ రచయిత్రి సారా అబూబకర్‌ లాగా, కన్నడ రచయిత ఫకీర్‌ మహమ్మద్‌ కట్పాడి లాగా, ఉర్దూ, రాజస్థానీ తదితర రాష్ట్రాలలోని కొందరు ముస్లిం రచయితల్లాగా, తొలి తరంలో రషీద్ జహాఁ, ఇస్మత్ చుగ్తాయి తదితర రచయితల్లాగా  తెలుగులో రాయడానికి ముందుకు రావలసిన అవసరం ఎంతైనా ఉంది.
ఈ వాతావరణం నెలకొంటేనే ముస్లింల నుంచి నవలలు విరివిగా వస్తాయి. నవల రావాలంటే జీవితం మొత్తాన్ని చిత్రించాల్సి వస్తుంది. తమ సమాజంలోని మంచీ చెడూ అన్నీ రాయవలసి వస్తుంది. ముస్లిం జీవితాల్లో పేరుకుపోయిన ఛాందస భావాలను, ముఖ్యంగా ఆచార వ్యవహారాల పేర ముస్లిం స్త్రీల అణచివేత గురించి రాయకుండా, ముస్లిం సమాజంలోని సగభాగమైన స్త్రీల గురించి దాచిపెట్టి నవల ఎలా రాస్తారు? అందుకే ముస్లిం రచయితల నుంచి నవలలు రావడం లేదని నా అబ్జర్వేషన్‌.
దీనికి మరొక చేర్పు, దర్గా సంస్కృతి , మొహర్రం సంస్కృతులను  కూడా ముస్లిం రచయితలు ముట్టుకోవడం లేదు. కేవలం అఫ్సర్, స్కైబాబ, వేంపల్లె షరీఫ్‌ మాత్రమే ఈ సబ్జెక్టుపై కథలు రాశారు. నిజానికి తెలుగులో ఈ సంస్కృతులు  ముస్లిం జీవితాలతో పెనవేసుకొని ఉన్నాయి. అయినా ముస్లిం రచయితలు ఈ విషయాలను రాయడానికి ముందుకు రావడం లేదు.
ఎందుకు ఈ అంశాల మీద రాయడానికి జంకుతున్నారని చింత చేస్తే ముస్లింలలోని ఛాందసవాదులు, సంస్క ృతి పేర విమర్శించే, దాడులు చేసే అవకాశముందనే భయం. హాయిగా పేరొచ్చే రచనలు చేసుకుంటే ఏ ఇబ్బందీ ఉండదని వీరు భావిస్తున్నారని అనుకోవాల్సి వస్తోంది. ఆ కారణంగా ముస్లిం స్త్రీల, మత బాధితుల సమస్యలను వీళ్ళు చూసీ చూడనట్లు నటిస్తున్నారు.
*

స్కైబాబ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు