సంఘర్షణలోనే అందం ఉంది

సంఘర్షణలోనే అందం ఉంది

పూలపాన్పులు కావాలా స్వేదస్నానాలు కావాలా? ఎంతో పెద్ద విషయాన్ని ఎంతో అల్పమైన పద్ధతిలో చెప్పిన – ‘బన్సీలాల్ పర్మార్’ హిందీ కథ “సంఘర్ష్ హీ సౌందర్య హై”కు స్వర్గీయ ఆర్ శాంతసుందరి తెలుగు అనువాదం – “సంఘర్షణలోనే అందం ఉంది”

హిందీ మూలం బన్సీలాల్ పర్మార్

తెలుగు అనువాదం ఆర్ శాంతసుందరి

న్ను గనుల్లోంచి తవ్వి తీసి ఉక్కు కర్మాగారాల్లోకి తీసుకొచ్చారు. ఆ తరువాత కర్మాగారంలో కోక్ బొగ్గు, సున్నపురాయి, ఇంకా ఏవేవో పదార్థాలని కలిపి నన్ను విపరీతమైన వేడిగల అగ్గిలో కాల్చి, కరిగించిన లావాలాగా తయారు చేశారు. అచ్చుల్లో పోసి, నన్ను రైలు పట్టాలుగా మార్చారు. నన్ను రైలు పెట్టెల్లోకి ఎక్కించి, కొత్త రైల్వే లైను వేసే చోటికి చేర్చారు. అక్కడికి నేనొంటరిగా పోలేదు, నాతోబాటు ఎంతోమంది స్నేహితులు కూడా వచ్చారు.

స్లీపర్ల పరుపుల మీద మమ్మల్ని పడుకోబెట్టారు. కొందరు నాతో కలిశారు, కొందర్ని నాకు సమాంతరంగానూ కొందర్ని నా పక్కనే విడిగానూ పేర్చారు. రైల్వే స్టేషన్ కి దగ్గరగా, మెయిన్ లైన్లు మారేచోట నన్ను ఉంచటం మంచిదయింది. కానీ నా కన్నా ఎక్కువ లోకజ్ఞానం ఉన్న నా స్నేహితురాలొకతె “నేనెంతో అదృష్టవంతురాలిని. జీవితాంతం సుఖంగా ఉంటాను. ఎందుకో తెలుసా? నేను సైడ్ లైన్లో ఉన్నాను. కానీ నిన్ను చూస్తే నాకు జాలి వేస్తోంది!” అంది.

నేను భయం భయంగా, “ఎందుకు?” అని అడిగాను.

“నువ్వు మెయిన్ లైన్లో ఉన్నావు, ఒక్క క్షణం కూడా నీకు విశ్రాంతి దొరకదు. రైలుబళ్ళు నీమీదినుంచి ఇరవై నాలుగ్గంటలూ వెళ్తూనే ఉంటాయి. వాటి బరువుకీ, అవి చేసే చప్పుడుకీ నువ్వు చచ్చూరుకుంటావు.” నా మీద సానుభూతి కురిపించింది నా స్నేహితురాలు.

ఆ రాత్రి నాకు నిజంగానే నిద్ర పట్టలేదు. నేను చాలా దిగులుగా ఉండసాగాను. చివరికి కొత్త రైల్వే లైన్ ప్రారంభోత్సవం జరిగింది. నా స్నేహితురాలు చెప్పింది అక్షరాలా నిజం! చాలా బిజీ లైనవటంతో రోజూ ఎడతెరిపి లేకుండా రైళ్ళు నా మీంచి పరిగెత్తుతూనే ఉంటాయి. అలుపు తీర్చుకోవడానికి తీరికే దొరకదు. నెమ్మది నెమ్మదిగా నేను దానికి అలవాటుపడిపోయాను. కొద్ది రోజులకి నా రూపంలో మార్పు వచ్చింది. నేను వెండిలా ధగధగ మెరవసాగాను. కానీ నా దురదృష్టాన్ని చూసి జాలిపడిన నా స్నేహితురాలు రోజురోజుకీ మెరుపు తగ్గిపోసాగింది. కర్మాగారం నుంచి నీలం రంగులో వెలికి వచ్చిన తను తుప్పుపట్టి అందవికారంగా తయారయింది.

నామీది అసూయతో ఒకరోజు అడిగేసింది, “ఏమే! నీ అందం రోజురోజుకీ ఇలా పెరిగిపోవటం వెనక ఉన్న రహస్యం చెప్పవూ? నేను మాత్రం ఇలా కళ తగ్గి ఘోరంగా తయారవుతున్నాను. ఏమిటే కారణం?”

“సంఘర్షణ చేసేవాళ్ళెప్పుడూ అందంగా తయారవుతారు, దాన్నించి దూరంగా పారిపోయేవాళ్ళు నీలాగ అందవికారంగా అయిపోతారు” అన్నాను.

అదే సమయంలో ఒక రైలుబండి అమితవేగంతో నా మీదినుంచి వెళ్ళింది. ఇవాళ అది చేసే చప్పుడు నాకు రొదలాగ అనిపించలేదు, చెవికింపైనసంగీతంలా అనిపించింది, దాని స్పర్శ నన్ను పులకరింపజేసింది. నిజంగానే ఈ రోజు నాకెంతో ఆనందంగా ఉంది!

*

శ్రీనివాస్ బందా

పుట్టిందీ పెరిగిందీ విజయవాడలో. ఆకాశవాణిలో లలితసంగీతగీతాలకి వాయిద్యకారుడిగా పాల్గొంటున్నప్పుడే, సైన్యంలో చేరవలసివచ్చింది. ఆ యూనిఫారాన్ని రెండు దశాబ్దాల పైచిలుకు ధరించి, బయటికి వచ్చి మరో పదకొండేళ్లు కోటూబూటూ ధరిస్తూ కార్పొరేట్‌లో కదం తొక్కాను. రెండేళ్లక్రితం దానికి కూడా గుడ్ బై చెప్పి, గాత్రధారణలు చేస్తూ, కవితలు రాసుకుంటూ, అమితంగా ఆరాధించే సాహిత్యాన్ని అలింగనం చేసుకుంటూ ఢిల్లీలో నివసిస్తున్నాను.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు