సంక్లిష్టతల చెలగాటం…

టీవలి నా కథలు రాయలసీమ సామాజిక రాజకీయ విషయాల చుట్టూ తయారవుతున్నాయి. నా కథా సమయాలన్నీ వాటి చుట్టూనే తిరుగుతున్నాయి. ఒక రచయితను తన నేలా , దాని నేపథ్యమే తయారుచేస్తుందని నేను నమ్ముతాను . వైయ్యక్తిక జీవిత అనుభవాలు కథలుగా మారుతాయి . సర్వసాధారణంగా ప్రతి రచయిత ప్రారంభం అలాగే జరుగుతుంది . నోస్టాల్జియా సంచి లోని అనుభూతులు వొడిసిపోయాక కొత్త అనుభవాల అన్వేషణ ప్రారంభమవుతుంది . ఆ దశలో రచయితలు వేరుపడతారు . ఒక్కొక్కరిని ఒక్కో విషయం పురిగొల్పుతుంది. నడిపిస్తుంది. అలాంటి దశలో నేను రాస్తున్న కథలు రాయలసీమ సామాజిక రాజకీయ వాస్తవాల వెలుగులో నిలబడుతున్నాయి. ఉద్యమ కార్యకర్తలతో తనదైన సంభాషణలు నెరుపుతున్నాయి.
నిజానికి యిది ఒక లిమిటేషన్ గా కొందరికి తోచవచ్చు . నేను కాదనను . ఇవే నేను రాయదగ్గ కథలుగా భావిస్తున్నాను.
నిమజ్జనం కథ నాలుగు పొరలలో అల్లుకున్నది .1. ప్రగతిశీల వుద్యమాల కార్యాచరణ, ప్రతిఫలనాలు .2. అస్తిత్వ ఉద్యమాలైన దళిత, ప్రాంతీయ అస్తిత్వ చైతన్యం. 3. కమ్ముకొస్తున్న హిందుత్వం. 4. పర్యావరణ స్పృహ.
కథలో ఒక కుటుంబంలోని తలిదండ్రులూ వాళ్ల కొడుకు ముగ్గురు పాత్రలు ప్రధానంగా కథను నడిపేవాళ్లు. నాలుగో ముఖ్య పాత్ర శ్రీను అనే దళిత యువకుడు.
స్థలం కర్నూలు లాంటి పట్టణ కేంద్రం. మరీ ముఖ్యంగా రాయలసీమలోని పట్టణం.
కథలోని తలిదండ్రులు ప్రగతిశీల వుద్యమాలలో పనిచేసిన వాళ్లు . ఆ వుద్యమాల సెట్ బ్యాక్ లో పునఃపరిశీలన చేసుకుంటున్నవాళ్లు. వాళ్లబ్బాయి క్రాంతి యేమో ప్రగతిశీల వుద్యమాల్ని, వాటి వైఫల్యాల్నీ సమానంగా చూస్తూ , కొత్త తరహా వుద్యమాల్ని కలగంటున్నవాడు. దళిత చైతన్యవంతుడైన శ్రీనూ , తన రాజకీయ ఎదుగుదల కోసం ఏం శక్తులతోనైనా పనిచేయాలనుకొని గుణపాఠాలు నేర్చుకొనే స్వభావం కలవాడు . క్రాంతి రాయలసీమ సాగునీటి పరిరక్షణ సమితి కార్యకర్త. రాయలసీమ విద్యావంతులు సంఘం బాధ్యుడు కూడా.
కథలో , హిందూత్వ పెరుగుదలకు వినాయక విగ్రహాల ఏర్పాటు, నిమజ్జనం ఒక బలమైన కారణంగా చెప్పడం జరిగింది. గత ఇరవై, ఇరవైయైదు సంవత్సరాల క్రితం లేని యీ ఆర్భాటపు తంతు యిప్పుడు విచ్చలవిడిగా పెచ్చరిల్లిపోతున్న వర్తమానంలో హిందూత్వ మారుమూల ప్రాంతాల్లో వూరూరికీ చేరిందనీ దానికి కారణం ప్రగతిశీల శిబిరం ప్రత్యామ్నాయంగా తనదైన సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలు ఆవిష్కరించక పోవడమేనని చర్చ నడుస్తుంది . దాన్ని ప్రగతిశీల శిబిరపు సీనియర్ మెంబర్లైన తలిదండ్రులిద్దరూ అంగీకరిస్తారు . ఈ కథలోని తండ్రి వైపు నుంచి కథ నడుస్తుంది . అతని అంతరంగంలో తమ వైఫల్యాల పట్ల చిన్నపాటి గమనింపు వున్నా ఎక్కువలో ఎక్కువ ప్రజలు తామెంతో ప్రచారం చేసినా తమవైపు రాలేదనే నెపమే వుంది . దీనికి తోడు యింకో విషయం వుంది , అది పర్యావరణ స్పృహ.
ప్రజలకు ప్రగతిశీల చైతన్యం రాలేదు సరే , కనీసం పర్యావరణ స్పృహైనా వుండాలి కదా , నీళ్లే లేని రాయలసీమ లో రసాయనాలు నిండిన విగ్రహాలను ముంచడమెందుకు . ఆ మాత్రమైనా తెలీదా అనుకుంటాడు . ప్రగతిశీల శిబిరం యీ దేశంలో పర్యావరణ స్పృహ గురించి ప్రచారం చేయలేకపోయిందనే విషయాన్ని మరచిపోయి ప్రజలపై యీ ఆరోపణ కల్గివుంటాడు . కథాకథనంలో సటల్ గా యీ విషయం వచ్చింది . కథ యీ ఆరోపణను నేరుగా చెప్పడం కంటే పర్యావరణ స్పృహను కథంతా అల్లడానికి ప్రయత్నించింది . దానికోసం కథలో మాజికల్ రియలిజం శిల్పాన్ని వుపయోగించుకుంది. కథలోని రాజకీయ వుద్యమ చర్చ పాఠకుడిని విసుగులోకి నెట్టకుండా కొంత శిల్ప వినియోగం జరిగింది.కథను నాలుగు శీర్షికల కింద రాయడం అందులో భాగమే అంతే కాకుండా కలలోనుండీ కథలోకి రావడం . కలకు అనుగుణంగా మాజికల్ రియలిజం ను వినియోగించడం జరిగింది.
*

నిమజ్జనం

       -జి. వెంకటకృష్ణ
 1.
నిద్రెగిరి పోయింది..
నల్లటి నీటి మీద వలయాలు వలయాలుగా వెలుగు అలలు. అలల మధ్యా తేలాడుతున్న పూలూ, పండ్లూ రంగు రంగు పడవల్లా తలలూ, ప్రతి తలకూ తీర్చిదిద్దిన కిరీటం. అప్పడప్పుడు తలదొర్లితే పైకిలేచే చేతులూ, చేతులకు ఆనుకొని పున్న భారీ పొట్టలూ. చేతుల్లోని ఆయుధాలు చీకటి వెలుగులో మెరుస్తూ… ప్రతి తలమీదా, పొట్టమీదా, ఎక్కితొక్కుతున్న మనుషులు. సుత్తులతో మోది ముక్కలు చేస్తూ మనుషులు, పట్టీలు కట్టుకున్న తలలున్న మనుషులు. ఆ నీటి మడుగంతా పట్టీలున్న తలలూ, కిరీటాలున్న తలలతో తొణికిసలాడుతోంది. ఆ నీటి అలల మధ్యా ఒక స్వరం, మంద్రంగా, తాంబుర నాదంలా వినిపిస్తోంది… కాదు, విలపిస్తోంది.
‘అరే నాయనలారా.. నిన్నా మొన్నటి దాకా తాగేకే నీళ్లు లేవని ఏడిస్తిరి. ఎవర్నో కాళ్లూ కడుపులూ పట్టుకొని యిన్ని నీళ్లు తెచ్చుకుంటిరి. నీళ్లు అపురూపమైన యీ సీమలో యిలాంటి పనులు ఎట్లా చేయబుద్ధి అవుతుందయ్యా మీకు. మంచి నీళ్లలో విషపు ముద్దలు అద్దుతున్నారే.. యిన్ని వందల విగ్రహలు శవాల్లాగా నాలో కలిపితే నేనేమయిపోవాలా… నాకేమైనా అయితే మీరేమైపోవాలా..’ అని వొకసారి ,
“అరేరేయ్ నా బిడ్డల్లారా మీరంతా నాకెంత పాపం అంటగడుతున్నారో మీకు తెలస్తోందిరా. నాలోకి నింపిన యీ విషంతోటే నన్ను మీ పొలాల్లోకి మీ పంటల్లోకి మీ కంచాల్లోకి చేర్చుకొని, వొళ్లంతా విషం చేసుకుంటున్నారు గదరా…!
అని యింకోసారీ వగపూ వేదనా నిండిన ఆ స్వరం అడుగుతున్నది. చుట్టూ గట్ల మీద నిలబడి వేడుక చూస్తున్న, కేరింతలు కొడుతున్న, పరవశులై వాళ్లకు తెలియనంత మైకంలో వున్న, భక్తి పేరుతో మంత్రముగ్ధులై వున్న, మతం పేరుతో విచక్షణ కోల్పోయి వున్న జన సందోహం నీట కలుస్తున్న ఆ రంగు ముద్దల్ని నీటి మీద తెట్టులా కడుతున్న శిథిలాల్ని, వాటిని ఎక్కి తొక్కుతున్న, మనుషుల్ని చూస్తూ చూస్తూ లోకాన్ని మరచి వున్నారు. చుట్టూ ఒక మాయావి సృష్టించిన తెర వల్ల మోదగా మోదగా ముక్కలు ముక్కలవుతున్న ఆ విగ్రహాల్లా, చోద్యంచూస్తున్న మనుషులు కూడా ముక్కలు ముక్కలుగా విడిపోయి వున్నారు. భక్తి అనే ముక్కగా, సంప్రదాయమనే ముక్కగా, మూర్ఖత్వమనే ముక్కగా, మూఢత్వమనే ముక్కగా, అరాచకమనే ముక్కగా, అల్పత్వమనే ముక్కగా, ముక్కలు ముక్కలుగా స్వయం నాశనమైపోతున్నారు. మనుషులట్లా అయిపోతూంటే పక్కనే వుండి పట్టించుకోకుండా, కనీసం గమనించకుండా వున్నారు. మనుషులు వొక్కక్కరూ కొంత కొంతగా నుసిలా రాలిపోతున్నారు. మనుషులు కరిగిపోతూ వున్నారు. యింత జరుగుతున్నా.. ఎవర్నీ యెవరూ పట్టించుకోవడం లేదే… విగ్రహాల్ని నీటముంచుతున్న వాళ్ళకి యెవరైనా చెప్పండి.. ఇదంతా యిట్లా అవుతోంది, యిదంతా అట్లెట్లా అవుతోంది, అవుతుంటే అట్లా యెందుకిట్లా ముంచుతూనే పోతున్నారో. యెవరైనా అరచి చెప్పండి . అరేయ్ బుజ్జోడా, ఆ బొజ్జను వూపడం ఆపరా… ఆ బొజ్జల్ని తోపడం ఆపరా… ఆపరా… రా… రా… రంబోలా రంబోలా రంబోలా హోయ్ హోయ్, రంబోలా రంబోలా రంబోలా… బావలు సయ్యా…యేంది యీ పాట అడ్డువస్తోంది.. ఆపరా అంటే, రంబోలా రంబోలా రంబోలా.. చెవులు చిల్లులు పడుతూ వినిపిస్తున్న పాటకు మెలుకువ వచ్చింది. పక్కకు వొత్తిగిలి కళ్లు తెరిస్తే కిటికీ యెదురుగా వీధిలో ఒకటే సందడి! ఇంతదాకా కలలో కన్పించిన భారీ భారీ విగ్రహాలు ట్రాక్టర్ల నిండా కొలువు దీరివున్నాయి. గతవారం రోజులుగా పందిళ్లలో వున్న వాటిని యీరోజు నీళ్లలో వేయడానికి తీసుకెళ్తున్న సందడి కన్పిస్తోంది. విగ్రహం చుట్టూ కొందరు యువకులు వాళ్ల ముఖమంతా కుంకుమ అద్దుకొని, నుదిట పెద్ద నామాలు దిద్దుకొని తలకు కాషాయం పట్టీలు కట్టుకొని, వొంటిమీద గుడ్డలు తడిసి అట్టలు కట్టీ వున్నా, వేసుకున్న ప్యాంట్లు జారిపోతున్నా పట్టించుకోకుండా నిర్లజ్జగా, వూగిపోతున్నారు… తాగి తందనాలు ఆడుతున్నారు. ఏవో లయబద్ధమైన పాటలకు బొజ్జలు వూపుతున్నారు. దెబ్బకు నిద్రగెరిపోయిరిది..!
 2 .మీరు ఫెయిల్యూర్..
ఇంట్లో శారద కన్పించకపోయేసరికి, ప్రసాద్ తలుపు విసురుగా తీసుకొని బయటికొచ్చాడు. కాంపౌండ్ వాల్ గేట్ వద్ద శారద నిలబడి వీధిలో జరుగుతున్న తతంగాన్ని చూస్తోంది. భక్తిని మంచి నీటి కాలువలో కలపడానికి వెళ్తూ , ఎగురుతూ అరుస్తున్న అరుపులను యింతింత చెవులతో వింటున్న, పొడుగాటి గొట్టంలాంటి ముక్కుతో పీలుస్తున్న, విగ్రహాల చుట్టూ డప్పులూ, డ్రమ్ములూ మోగుతున్నాయి. డప్పులూ, డ్రమ్ములూ కొడుతున్న కొన్ని నల్లటి శరీరాలు చెమటలు కక్కుతున్నాయి. డప్పు మోతలో లయ తగ్గినప్పుడు, డప్పుకుచిందేస్తున్న వాళ్లు నల్లటి శరీరాల వైపు గుడ్లురిమి చూస్తున్నారు. తాగిన మత్తులో బూతులు అందుకుంటున్నారు.
గుంపును చూస్తూ గేటు దగ్గర నిలబడ్డ శారదకు విసురుగా తలుపు తీసుకొని బయటికొచ్చి నిలబడ్డ భర్త మొఖంలో అసహనం కనపడి దగ్గరికొచ్చి, “తలుపు మీద కోపం చూపిస్తే యేమొస్తుంది” అంది. ఆమె మాటకు సమాధానమివ్వకుండా, “ఇదే డప్పులూ డ్రమ్ములూ మోగిస్తున్న వాళ్లు కూడా యీ విగ్రహాలను పెట్టి యిట్లా వూరేగిస్తామంటే, యిక్కడ ఎగిరెగిరి దుంకుతున్న వాళ్ళు వొప్పుకుంటారంటావా…” అన్నాడు.
“పెద్ద కులమోళ్లు యెట్లాగూ వొప్పుకోరు, సరే. అసలు, డప్పులు కొట్టే కులమోళ్లు యీ విగ్రహాల్ని పెడతామంటే నువ్వు నీ హేతువాదంతోనో , గతి తర్కంతోనో విమర్శించకుండా వొప్పుకుంటావా”.
అని యెదురు ప్రశ్న వేసింది.
“మన పిల్లబ్బుడు యేందో చిన్నచిన్న మట్టిబొమ్మలు యిండ్లలోనే పెట్టుకొని, మూడోనాడు వూరిబావిలో వదిలేస్తుంటిమి. యింత హంగామా, యింత అరాచకమా యెన్నడన్నా వూహించింటిమా. యేటేటా పెరిగిపోతాండాదే గానీ తగ్గిందిలా. వూరివూరికీ పాకిపోతా వుంది. ప్రతి వూర్లూనూ , వీధి వీధికీ విగ్రహాలు పెట్టి మనుషుల్ని మందలు మందలుగా తయారు చేసుకుంటున్నారు. తాగచ్చు, తినొచ్చు యెగుర్లాడొచ్చు, చందాలు వొసూలు వేసుకోవచ్చు, అడ్డం చెప్పేవాడికి మన ధర్మానికి వ్యతిరేకి అని ముద్రవేయొచ్చు. భక్తిపేరుతో యింత దౌర్జన్యం ఎక్కడా నడవదు.”
“మీ పిల్లప్పటి లెక్కనే ఇదంతా సింపుల్గా నడిస్తే, వూరూర్లోనూ నడిస్తే మీకభ్యంతరం లేదా…” మళ్లీ శారద యెదురు ప్రశ్న వేసింది.
“అభ్యంతరం లేదా అంటే అభ్యంతరమే గానీ, కనీసం నాలుగ్గోడల మధ్య వుండి మనుషుల్ని ఖరాబు చేయకుంటే చాలు గదా… అని అంతే”.
“మనం , యిదంతా తప్పని పాటలు పాడుతూ వూరూరా తిరిగి చెప్పినోళ్లమే గదా. మన కళ్ల ముందరే యిది పెరిగిపాయ, మనం శక్తి క్షీణించి చూస్తా నిలబడితిమి” శారద అంటూంటే, ప్రసాదుకు యేవేవో గత జ్ఞాపకాలు కదలాడినాయి. శారదతో పాటు, పార్టీ మీటింగ్ల వెంబడి, పాటలు పాడుతూ, వీధి, నాటికలూ వేస్తూ, బుర్ర కథలు వినిపిస్తూ, తమ శక్తిని యిట్లాంటి వాటికి వ్యతిరేకంగా, ప్రచారం చేస్తూ తిరిగిన జీవితం గుర్తొచ్చింది.
“అప్పుడు చేసిందంతా అప్పుడే హరించుకుపోయింది. అప్పటి ప్రత్యర్ధి యిప్పుడిలా విశ్వరూపం చూపిస్తూ మన శక్తిలేని తనాన్ని వెక్కిరిస్తోంది శారదా…”
“వెక్కిరించడమే గాదు, మనల్ని కూడా యేమార్చి తనలోకి లాగేస్తుంది…” అంది శారద.
“యింతకి క్రాంతి యెక్కడా…”
ప్రసాద్ మాటకు, చేయి జనంలోకి చూపించింది శారద.
వాళ్లబ్బాయి క్రాంతి, గుంపులో వూగుతున్న కుర్రాళ్లతో నవ్వుతూ పరాచికాలు ఆడుతూ కన్పించాడు . కలలో కనిపించిన విభ్రాంతి కంటే క్రాంతి అక్కడుండడం షాక్ లా అనిపించింది ప్రసాదుకు.
“శారదా వాణ్ణి పిలువూ అక్కడేం చేస్తున్నాడూ…” అరిచాడు.
శారద వెళ్లి క్రాంతిని పిలుచుకొచ్చింది.
“యేరా ఆ గుంపులో నీకేం పనిరా, వాళ్లతో పాటు తాగి వూగాలని వుబలాటంగా వున్నట్టున్నావు” తీవ్రంగా వుంది తండ్రి గొంతు.
“ఎందుకు అరుస్తావు నాన్నా మా శ్రీనూ వాళ్ల గ్యాంగంతా అందులో వున్నారు. వాళ్లను కాదనలేక చూస్తూ నిలబడినా అంతే…”
క్రాంతి చెంపలకున్న కుంకుమ మరకల్ని చూస్తూ
“యేరా నీకెన్నో విషయాలు చెప్తూ చాలా నేర్పించినాననుకుంటే నువ్వు గూడా ఆ రంగులో కలిసిపోతే యింకేమనుకోవాల్రా?” ఆ గొంతులో యెంతో
నిష్టూరం, అసహనం, ఆరోపణ లాంటివెన్నో ధ్వనించాయి ఇరవై నాలుగేళ్ల క్రాంతికి.
“నువ్వెంత నేర్పించినా, నేనెంత తెలుసుకోనున్నా, యింట్లో వున్నట్టు బయట వుండలేను నాన్నా. మన అభిప్రాయాలన్నీ బయట యధాతథంగా అమలు పరచలేము. బయటి ప్రపంచాన్ని వొద్దనుకోలేము. ఈ విగ్రహాలు పెట్టడాన్ని మీరేమనుకున్నా నేను యిది ఒక రకంగా సోషియల్ గాదరింగుకు అవకాశమిచ్చే సందర్భం అనుకుంటాను. మన సమాజంలో కల్చరల్ సమావేశాలకు వేరే కార్యక్రమాలు లేకపోవడం వల్ల యువత దీన్లలోకి వస్తున్నారు. జస్ట్ ఇట్సే సోషియల్ గాదరింగ్”
“జస్ట్ సోషియల్ గాదరింగా, భక్తి పేరుతో వూరూ వాడా రచ్చ చేస్తూ పర్యావరణాన్ని గబ్బుపట్టిస్తూ, అరాచకమైన అన్ హెల్తీ తతంగం. జస్ట్ సోషియల్ గాదరింగ్ అని వూరికే వొప్పేసుకోమంటావా”
“అంతే నాన్నా వీళ్లకి నిజంగా భక్తుంది అనుకుంటుండావా, లేదుగాక లేదు. వూరికే ఫన్ క్రియేషన్ అంతే. ఎప్పుడన్నా నిలదీస్తే ఆనాయాళ్లంటారూ, అరే మామా దేవతలు కూడా సురాపానం జేస్తూ ఎంజాయ్ జేస్తుంటార్రా, నువ్వేందిరా నీ హేతువాదం క్లాసులు మాకు పీకుతాపు, వదిలెయిరా సామీ అని. అందుకే యినన్నీ భక్తితో చేస్తున్న పనులు కాదు. “
“నిజమే భక్తి లేకపోవచ్చు, మీలాంటి యువతకు సరదాగా వుండొచ్చు, ఇదంతా మనల్ని విడదీసే వ్యవహారంగదా, ఆ పేరుతో హిందూత్వ శక్తులు బలపడడమే గదా…’
” అబ్బా నాన్నా, యిదంతా నువ్వు యింట్లోనూ, కాలేజీలోనూ యెప్పుడూ చెప్తూ వుండేదే, నేను వింటా ఉండేదే. నేను దీన్ని యింకొక రకంగా చూస్తున్నా..దీన్లోకి పోవద్దని మనం చెప్పాలంటే, వాళ్లు దేంట్లోకి పోవాల్నో అది చూపించాల గదా. ఒకమాట అడుగుతాను నాన్నా యిదంతా తప్పుగదా మరి, దీన్ని మీరు ఆపగలరా, మీలాంటి వాళ్లు ఈ డెబ్భై యేళ్లలో ఆపడానికి ఏమన్నా చేసారా..”
వెంటనే శారద “ఏరా మమ్మల్నే దబాయిస్తావు, మేం చేసాం, గుండెల మీద చేయిపెట్టుకొని చెప్పగలం. చేసామని”.
“చేస్తే యేమైపోయింది”.
“యిట్లాంటి విషయాల్లో యెప్పుడూ చేస్తానే వుండాలి, ఏ రోజుకారోజు చేయాలి”.
“అమ్మా, మీరు చర్చలు చేస్తూ, వుపన్యాసాలూ యిస్తే యేమీ మారదమ్మా. జనాలు పాల్గనే కార్యక్రమాలు తయారు చేసి యిచ్చుండాలి. మాకేదైనా రోల్ మాడల్ కార్యక్రమం వొకటైనా యిచ్చుండారా మీరు. యువతను మీవైపు తిప్పుకునే పని ఒక్కటి వుంటే చెప్పండీ, దాంట్లో పాల్గంటాను. అట్లాదేమీ లేకుండా వున్న దాన్ని తిడుతూ కూచుంటే యెవరు వింటారు. మీరే చెప్తారు గదా నాన్నా సంస్కృతీకరణ అని, కింద కులాలన్నీ పైకులాలని అనుకరిస్తూ ఉంటాయని, అందుకే ఈ పాత చెత్త రోజురోజుకీ బలుస్తావుంది. దీన్ని తోసేనే బలమైనదీ , కొత్తదైన చీపురు మీరు మాకివ్వలేరు..”
“ఒహో మేమేమీ ప్రత్యామ్నాయాలు నిర్మించలేదంటావా… అంటే మాలో నువ్వు లేవా..! మాలో వుండొద్దనుకుంటున్నావా…? మా అభిప్రాయాలకు నువ్వు వారసుడిని కావా. మీలాంటి యువకులు మా వెంట ఉంటారనీ వాళ్లేమన్నా కొత్తగా నిర్మించి మమ్మల్ని నడిపిస్తారనీ కలలు కంటూ వున్నాం క్రాంతి. సాంప్రదాయ వ్యవస్థ బలమైందే, పాతుకుపోయి వుంది. మా దగ్గర లోపం వుంది కాదనను. కొత్త ప్రత్యామ్నాయాలు నిర్మించాల్సిన బాధ్యత నీలాంటి వాళ్లు మోస్తారను కున్నాం . మీరు ఆ బరువును మోయకుండా యీజీగా వుందని వున్న దార్లోనే పోతామంటున్నారు. అది మనల్ని వెనక్కు తీసుకుపోతోందిరా…”
“నాన్నా యీ జార్గాన్ అంతా నేను వింటాను. నాకిది అలవాటు కాబట్టి అర్ధం చేసుకుంటాను. నాకొక వాతావరణాన్ని యిచ్చారు, నేను చాలా విషయాలు తెలుసుకున్నా , కానీ బయట నాయీడూ వాళ్లని మీరు చెప్పే విషయాలకంటే వేరే విషయాలు ఆకర్షిస్తాయి. నేను నేర్చుకున్న దాన్ని వాళ్లకు అర్ధం చేయించడం నాకు చేతకావడం లేదు. నాఫ్రెండ్స్ తో మీ టోన్ తో ఆర్గ్యూ చేస్తే, ఆ నాయాళ్లు పసిగట్టేస్తున్నారు. ‘రేయ్ రేయ్ అదంతా మన నాన్నల కాలపు మాటల్రా మామా. యిప్పుడు మన దారి అది కాదు, మొదట మనది బతకాల్రా బాబూ. యిప్పుడు ఎవడి బతకు వాడిదిరా, త్యాగాలు, మార్చడాలూ తలమీద పెట్టుకోకురా సామీ, నీ పనైపోతుంద’ని నవ్వుతున్నారు. మనం , మరీ ముఖ్యంగా నేను, బతకాల్సింది వాళ్లతోనే కాబట్టి వాళ్లేమిటో, వాళ్లు ఎట్లా అయితే నా వెంట వుంటారో, ఆ దార్లోనే కొంత కాలం వెళ్లాలనుకుంటున్నాను నాన్నా. ఆ తర్వాతే నా మాటలు వాళ్లు వినేలా చేయాలి. అది కూడా సాధ్యం అవచ్చు, కాకపోవచ్చు, అయినా మీ దార్లోనే నేను నడవాలంటే కాదు నాన్నా. మీది ఫెయిల్యూర్ దారి… యిప్పుడు కొత్తదారుల్తోనే పోవాలి. నాక్కూడా అది సరిగ్గా తెలీదు…తెలుసుకుంటూ పోవాలి..”
 ఆ మాటలని, చరవరా బయటికెళ్లి పోతున్న క్రాంతిని చూస్తుండి పోయారు ప్రసాద్ శారదలు. ఆ తర్వాత వొకర్నొకరు నిర్లిప్తంగా చూసుకున్నారు.
3. దారి మారాలి..
పచ్చని పొలాల మధ్య దారి. జనాలు నడిచి నడిచి ఏర్పడిన దారి. ఆ దారి ఒక విగ్రహం ముందు అంతమైంది. విగ్రహాన్ని కదిలించాలని తాకగానే అది రెండుగా మారింది. సరే అనుకొని మళ్లీ ప్రయత్నించగా రెండు నాలుగైంది. ప్రయత్నించిన ప్రతిసారీ రెట్టింపు అవుతూ వుంది. దారంతా విగ్రహాలతో నిండిపోతోంది. మూసుకుపోతోంది. కాలం గడిచిపోతుంది. ముందుకు వెళ్ళలేక పోతున్నాడు. తల తిప్పి చూస్తే పచ్చటి పొలాలు నిండా మిలమిలలాడుతున్న చిన్న చిన్న రంగు రంగు పురుగులు, విశాలమైన చెవులూ, పొడగాటి ముక్కూ తలకు కీరిటం ఉన్న పురుగులు. వాటిని చూస్తుంటే జిగుప్స తన్నుకు వస్తోంది. భయంతో పరుగులు తీయాలనుకుంటాడు. ఎంత పరిగెత్తినా విగ్రహాల మధ్యనే పడి లేస్తున్నాడు. అవి తాకి రెట్టింపవుతున్నాయి . వాటి మధ్యా దొర్లి దొర్లి పడుతున్నాడు… అంతలో పొలాల్లో నుండీ తనవైపు వస్తూ ఒక నల్లటి మనిషి, అతనికి బెదిరి పురుగులు పారిపోతున్నాయి. దగ్గరకు వచ్చి పైకి లేపడానికి చేయి అందించాడు. దిక్కులు శబ్ధం చేసాయి. దబ్ దబ్ మని.. తలుపు బాదుతున్న చప్పుడు వస్తుంటే ప్రసాద్ కు మెలకువ వచ్చింది. కాసేపటికి క్రాంతి గొంతు వినిపిస్తోంది. శారద ముందే వెళ్లి తలుపు తీసినట్లుంది. ప్రసాద్ లేచి హాల్లోకొచ్చాడు గానీ వొళ్ళంతా పురుగులు పాకుతున్న భావన అలాగే వుంది.
“నాన్నా శ్రీనుకు బలంగా గాయాలు తగిలాయి. కాలువ దగ్గర గలాటా జరిగింది.” క్రాంతి అంటున్నాడు.
“మా ఏరియాది ముందు ముంచాలంటే, మా ఏరియా విగ్రహాం ముందు ముంచాలనే గలాటాలే కదా, అలాంటి వాటిక్కూడ తగాదాలు పెట్టుకోవాలా, వాటిని
కూడా ఆపలేరా మీరు” ప్రసాద్ మామూలు ధోరణిలో అన్నాడు.
“కాదు నాన్నా విగ్రహం ముందు ముంచాలని కాదు వాళ్లను అడిగింది, క్యూలో వుండి అవకాశమొచ్చినప్పుడు ముంచుతూంటే అడ్డుకున్నారు. మా బ్రాహ్మల చేత పూజ చేయిస్తూ మాదిగల విగ్రహం ముంచిస్తారా మేం వొప్పుకోం అన్నారు. వాళ్ల తరఫున శ్రీనూ పోట్లాటకుదిగినాడు. నీది నువ్వు చూసుకో వేరే వాళ్లు సంగతి నీకెందుకని శ్రీనూ మీదికి వచ్చారు. శ్రీనూ యిప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు కదా, వాణ్ణి ఆపడానికి దీన్ని సాకుగా తీసుకొని మెత్తగా నీళ్లలో ముంచి, తొక్కారు. మేం కాసింత ఆలస్యం జేసినా వీడు నిమజ్జనం అయ్యిండేవాడు”
“ముందు నుంచీ మేం చెప్తున్నది అదేరా, దళితుల్ని హీనంగా చూసే వాళ్ల కార్యక్రమాల్లో దళితులకేం పనిరా. తలకిందల తపస్సు చేస్తే మాత్రం దళితుల్ని అంగీకరిస్తారా వాళ్లు. దళితులు యిలాంటి వాళ్లతో అంటకాగితే అంబేద్కర్ ఆత్మ సహిస్తుందారా, అంబేద్కర్ నన్నా సరిగ్గా నమ్మమని చెప్పరా నీ మిత్రులకు.”
“నాన్నా అవకాశమొచ్చింది కదాని అనడం కాదు. తరతరాలుగా వూరి బయట వున్న వాళ్లు, తమని కలుపుకుంటారని భరోసా యిచ్చే యెవరి వెంటైనా వెళ్లాలనుకుంటారు. వెళ్లిన తర్వాత గానీ తెలీదు ఆ పిలిచిన వాళ్ల అసలు వుధ్ధేశ్యాలు. శ్రీనూ ఔత్సాహికుడు, నాతో పాటు బీటెక్ చేసేప్పుడే వాడికి మంచి నాయకత్వ లక్షణాలుండేవి. దారి కనిపిస్తే దూసుకుపోయే రకం. అందుకే ఎదగడానికి వాళ్ల వెంటా ఒక మార్గముందని అనుకున్నాడు. వాడికి యిప్పుడు తెలిసొస్తుంది. ఎవరు ఎవరనేది. ఎవడి అనుభవం నుంచీ వాడు తయారపుతాడు గదా, నాన్నా. ఎవడి స్వంత అనుభవం వాడిని నిర్మిస్తుంది”.
“ఎవడి దుఖం వాడికి మహా అనుభవమైపోయి అందులో కూరుకుపోతే యెదుటివాడి దుఖం యెప్పుడు అర్థం కావలి “.
“నాన్నా మీరిట్లా మాట్లాడ్డం సులభం. కొంచెం ఆశతో ఆలోచించండి శ్రీనూ కొత్తగా కనిపిస్తాడు. శ్రీనూ లాంటి వాళ్ల నడక వాళ్లలో వాళ్లు నడిచే నడక కాదు. నాలుగడుగులు వేస్తే తలెత్తి చూడక తప్పదు. తలెత్తితే కనిపించే చూపుడు వేలునూ చూడక తప్పదు, నాలాంటి వాళ్లూ కనిపించక తప్పదు…”
“నువ్వు చెప్పేదీ నిజమే క్రాంతి, ఎవరి వెంట వెళ్లకూడదో, అలా వెళ్లకూడదని చరిత్ర చెప్పిందో, వాళ్ల వెంట వెళ్లకూడదనే స్పృహ చాలా అవసరం. అది వుంటే ఎవరితో పోరాడాలో స్పష్టత వుంటుంది. అప్పుడు మిత్రులు కూడా కనిపిస్తారు. కొత్తదారులు కనిపిస్తాయి. ఇంతకూ శ్రీను ఎలా వున్నాడ్రా”
“ఫర్వాలేదు. ఆసుపత్రిలోనే వున్నాడు… డిచార్జి అవుతాడు నాన్నా”
“నేనూ వస్తా చూడ్డానికి”
4. కొత్త కల..
చుట్టూ వందలాది మంది గుమికూడి వున్నారు. విద్యావంతుల వేదిక తరపున ధర్నా నడుస్తా వుంది.
“పోయిన ఏప్రిల్లో నీళ్లు లేవని తాగడానికి యిబ్బందులు పడ్డాం. కొలాయిలు వారానికి వొకసారే వదలి అరాకొరా నీళ్లతోనే సర్దుకోమని చెప్పిన జిల్లా యంత్రాంగం యిప్పుడు నిమజ్జనాలకు నీళ్లు లేవని బళ్లారికి పోయి టీబీ డ్యాం నీళ్లు అధికారులతో మాట్లాడి విడుపించుకొని తెచ్చారు. రాయలసీమ రైతుకు చుక్కనీళ్లు యిప్పించలేరు గానీ వాళ్ల నిమజ్జనాలకు మాత్రం నీళ్లు తెప్పిస్తారు. ఇందులోని దుర్మార్గాన్ని మనం గమనించాలి. ఇక్కడ యింకో విషయముంది. కాలవల నిండా పడి ఉన్న విగ్రహాల శిథిలాలు యెంత అనారోగ్యమో మనం గమనించాల, రసాయనాలు నిండిన ఆ శిధిలాలు నీళ్లలో నుండే మన వొంట్లోకి రావడానికి ఎక్కువ కాలం పట్టదు. ఇదంతా అవసరమా, దీన్నంతా యెక్కడో ఒకచోట ఆపాల్సిన అవసరం లేదా….”
క్రాంతి ధర్నాలో మాట్లాడుతుంటే, అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అంతలో విరిగిన చెతికీ, తలకూ కట్లతో శ్రీను కుంటుతూ సమావేశంలోకి వచ్చాడు. ఒక్కసారిగా సమావేశంలో కలకలం రేగింది.
‘దళిత నాయకుడు శ్రీనుపై జరిగిన దాడిని ఖండించండి’ అంటూ నినాదాలు చుట్టుముట్టాయి. క్రాంతి తర్వాత శ్రీనూని మాట్లాడమని అందరూ అడిగారు.
“…నాకు దేవుడి పేరుతో చేసే రాజకీయాలు వద్దు. జనాల పేరుతో జనాల కోసం చేసే రాజకీయమే కావాలి. నీళ్లు లేని రాయలసీమలో విచిత్రంగా కషాయం నీళ్లలో నిమజ్జనం అయిపోవాల్సిన వాణ్ణి. క్రాంతి, యింకా యిక్కడున్న కొందరు మిత్రుల వల్ల వొడ్డుకొచ్చా…మనకు వాళ్ల దేవుళ్లతో పనిలేదు, జనాల కోసం చేసేందుకు చేసేంత పని వుంది…” శ్రీనూ మాటలు వింటూంటే ధర్నా జనంలో ఉన్న ప్రసాద్ కు సంబరమేసింది. కలలో తనకు చేయి అందించింది యెవరో అర్ధమయింది.
*

వెంకట కృష్ణ

ఇంటర్మీడియట్ చదివే రోజులనుండి కవిత్వం రాస్తున్నా.నా తరం అందరిలాగే శ్రీశ్రీ ప్రభావం నామీదుంది.అయితే పుస్తకాలు చదివే అలవాటు వల్ల రా.వి.శాస్త్రి రుక్కులూ, రంగనాయకమ్మ బలిపీఠం హైస్కూల్ దినాలకే చదివున్నాను.యండమూరీ,చందూసోంబాబు,తదితర కమర్షియల్ సాహిత్యం కూడా ఇంటర్ రోజుల్లో విపరీతంగా చదివున్నా సీరియస్ తెలుగు సాహిత్యం తోనే నా ప్రయాణం కొనసాగింది.1994 నవంబర్ నెలలో మొదటి కథ ఆంధ్ర ప్రభ సచిత్ర వారపత్రికలో అచ్చైంది . అప్పటిదాకా రాసుకున్న అచ్చు కాని కవిత్వాన్ని 2000 సంవత్సరం లో లో గొంతుక గా నా మొదటి కవితా సంపుటి.1994నుండీ 2000 దాకా నెమ్మదిగా రాసాను.2000 తర్వాత రెగ్యులర్ గా రాస్తున్నా.

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు