షేమ్… షేమ్… పప్పీ షేమ్!

అతని కూతురేమీ లేచిపోలేదు. కులంకాని వాడినో, వేరే మతం వాడినో పెళ్లి అని పట్టుబట్టలేదు. ట్రాన్స్ జెండర్ గా మారతాననో, పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని కంటాననో కూడా అనలేదు.

లవంతంగా కళ్లు తెరిచాడు.

భళ్లున కుమ్మరించినట్టు ఒక్కసారిగా భరించలేనంత వెలుతురు.

చప్పున మళ్లీ కళ్లు మూసుకున్నాడు.

లేవాలని ప్రయత్నించాడు. కానీ, ఒళ్లు సహకరించలేదు. కానీ, తప్పదు అర్జంటుగా లేవాలి.. లేచి తీరాలి. లేకపోతే పరుపు తడిసిపోయేట్టుంది. గట్టిగా ఊపిరి తీసుకుని కూర్చున్నాడు. నడుం పైభాగమంతా కూర్చోడానికి సహకరించడం లేదు, వెంటనే వాలిపోయేట్టు ఉంది. తల.. అసలు తలేనా? పది టన్నుల బరువున్నట్టు తోస్తోంది.

నిన్నటి నుంచి తాగుతున్నది సరిపోనట్టు.. తెల్లవారుజామున మెలకువ వస్తే మళ్లీ తాగాడు. ఆలోచనలను సమాధి చేయడానికి, మనసును జోకొట్టడానికి.

కానీ.. కానీ.. ప్రయోజనం శూన్యం.

అతడేమీ తాగుబోతు కాదు. కానీ, నిన్న అన్ని ఛానెల్స్ లోనూ మార్మోగిపోయిన బ్రేకింగ్ న్యూస్ అతడి హృదయాన్ని కూడా బ్రేక్ చేసింది. ఇక దొరికిందే చాలన్నట్టు ఇంగ్లీష్, తెలుగు, లోకల్, నేషనల్.. అన్నిట్లోనూ అవే కథనాలు.

అవే.. అతడి ఆలోచనల్నీ, మనసునీ కకావికలం చేసేశాయి.

ఆ బ్రేకింగ్ న్యూస్ లూ, కథనాలూ అన్నీ అతడి కూతురు గురించే. అంటే, కేవలం కూతురు గురించే అని కాదుగానీ.. జరిగిన దానికి అతడి కూతురే వ్యూహకర్త.

‘తెల్లారినా ఇంకా అదే న్యూస్ మోగిస్తున్నారా? లేక..’

అర్జంటు అవసరం ఆలోచనల్ని ఆటంకపరిచింది. బలవంతంగా లేచి నిలబడ్డాడు. ఏదో, ఎప్పుడూ నిలబడటం తెలీనివాడు నిలబడినట్టు అలా కొన్ని సెకన్లు నిలబడి.. బ్యాలెన్స్ కుదరక, గోడలు, తలుపులు పట్టుకుని నడుస్తూ బాత్ రూమ్ లో దూరాడు.

పైజమా విప్పుకుంటూ కమోడ్ లోకి చూశాడు. లోపలున్న దోసెడు నీళ్లల్లో మత్తెక్కిన ముఖం స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతలో.. ఆ ముఖ ప్రతిబింబంపైకి కట్టలు తెంచుకుని దూకింది ప్రవాహం. ఆపుకోవాలనుకున్నాడు. కానీ, అతని ప్రయత్నం ఫలించలేదు.

కార్యక్రమం ముగిసింది.

పైజమా కట్టుకుంటుంటే రిలీఫ్ గా అనపించింది. కానీ, ఆ ఫీలింగ్ ఎక్కువసేపు నిలువలేదు. వాష్ బేసిన్ దగ్గర ఆగి ముఖం మీద నీళ్లు చల్లుకుంటూ అద్దంలోకి చూసుకుంటే..ఇందాకటి దృశ్యం గుర్తొచ్చింది.

‘తన ముఖం మీద తానే పోసుకోవడం’అనే ఊహ చాలా అసహ్యంగా అనిపించింది. వెంటనే ముఖం మీద జల్లుకున్న నీళ్లను వాసన చూశాడు, అనుమానంగా.

సోప్ తీసుకుని ముఖం అంతా బరబరా రుద్దేసుకున్నాడు.

హాల్లో ఏసీ ఆన్ చేసుకుని అలా తడి ముఖం మీద తగులుతున్న చల్లనిగాలితో రిలాక్స్ అవుతూ సోఫాలో వాలిపోయాడు. ఆ రిలాక్సేషన్ ఫీలింగ్ ఎంతోసేపు నిలువలేదతనికి.

మనసులో మంట భగ్గుమని మళ్లీ రాజుకుంది.

నిశ్శబ్దంగా వున్న ఇంటి వాతావరణం అతడిని మరింతగా ఆలోచనల్లోకి.. తెలియని లోతుల్లోకి నెడుతోంది.

తండ్రికి బాగోలేదని చూడటానికి వెళ్లింది ఆమె.

‘వాళ్లమ్మకి ఈ విషయాలన్నీ తెలిసాయోలేదో? తెలిస్తే.. ఖచ్చితంగా ఫోన్ చేసేదే’ అనుకున్నాడు.

‘‘మమ్మీ ఎలాగూ లేదు కదా, రెండ్రోజులు హాస్టల్లో ఫ్రెండ్స్ దగ్గర వుంటా’’నని చెప్పిపోయింది కూతురు.

‘పోనీలే..’అనుకుని ‘సరే’ అన్నాడు.

తీరా చూస్తే.. చివరికి..

‘ఎంతపని చేసింది’ అనుకున్నాడు కూతురునుద్దేశించి.

అతని కూతురేమీ లేచిపోలేదు. కులంకాని వాడినో, వేరే మతం వాడినో పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టలేదు. ట్రాన్స్ జెండర్ గా మారతాననో, పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని కంటాననో కూడా అనలేదు.

‘షేమ్..షేమ్.. పప్పీ షేమ్’ ఫేస్ బుక్ లో ఇప్పుడో పాపులర్ పేజీ. వేలల్లో లైకులు, వందల్లో షేర్ లు. అందరూ అమ్మాయిలే, ఏ కొందరో అబ్బాయిలు. అమ్మాయిలకు మద్దతు తెలియజేస్తూ పోస్ట్ లు.

అతని కూతురుదే ఈ ఆలోచన. ఈ ఫేస్ బుక్ పేజీకి అడ్మిన్ కూడా తనే. ఆరు నెల్లో, పది నెల్లో గడిచాక.. ఈ క్యాంపెయిన్ ను మరింత విస్తృతం చేయడానికి ట్విట్టర్ అకౌంట్ కూడా ఓపెన్ చేశారు. విదేశాల్లో చదువుకుంటున్న ఇండియన్ అమ్మాయిలంతా పోలోమంటూ ఫాలోయర్లుగా చేరిపోయారు.

స్త్రీల సమస్యల గురించి చర్చించే ఆ పేజీ గురించి అతడికి అప్పట్లోనే తెలుసు. కాకపోతే, కూతురు ఏదో హడావిడి చేస్తోందిలే అనుకున్నాడు గానీ.. పెద్దగా పట్టించుకోలేదు.

‘పట్టించుకోకపోవడం వల్లే ఇప్పుడు ఇంత వరకు వచ్చింది’ అనుకున్నాడు విసుగ్గా.

మండే మనసును చల్లార్చాలంటే.. మరి కాస్త ఒంపుకావాల్సిందే అనుకున్నాడు. ఎదురుగా టీవీ పక్కనున్న అల్మారా తెరిచాడు. పుస్తకాల వెనుక అడుగు అరలో నిండు కుండల్లా రెండు బాటిల్స్ కనిపించాయి.

ఓ బాటిల్ చేతిలోకి తీసుకుని.. గ్లాస్ కోసం వెతుక్కుంటూ తూలాడు.

పడబోతూ షోకేస్ ను పట్టుకున్నాడు.

టప్ మని ఏదో పడిన చప్పుడు.

గాజు ఫొటో ఫ్రేమ్ అది. పగిలిందేమోనని.. కంగారుగా పైకి తీశాడు.

పగల్లేదు.

కానీ, అందులో వున్న కూతురు ఫొటో చూడగానే.. దాన్ని పగలగొట్టేయాలనిపించింది.

చెయ్యి పెకెత్తాడు.

మళ్లీ ఎందుకో, ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. చేతిలోని కూతురు ఫొటో వైపు చూశాడు.

ఎల్లో కలర్ టీషర్ట్ వేసుకుని, బ్లూ కలర్ ప్యాంట్ పాకెట్లలో చేతులు పెట్టుకుని, తల ఎగరేస్తూ భలే ఫోజు కొడుతోంది.

ఫొటోను దగ్గరకు తీసుకుని గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు.

‘లిటిల్ బీయమ్’ అనుకున్నాడు.

బీయమ్ అంటే బుజ్జి ముండా అని. పిల్లలకు బ్యాడ్ వర్డ్స్ తెలియకూడదని ఇలా షార్ట్ చేసి పిలిచేవాడు.

‘కానీ.. అదే ఇవాళ పెద్ద బ్యాడ్ పని చేసింది’ అనుకున్నాడు చిరాగ్గా.

ముందు కొడుకు, తరువాత కూతురు. ఇద్దరికీ పెద్ద ఎడం లేకపోవడంతో ఇద్దరిలో ఎవరి పుట్టినరోజు వచ్చినా ఇద్దరికీ కొత్త బట్టలు కొనేవాళ్లు. ఇద్దరూ పెద్దవాళ్ల కాళ్లకు నమస్కారాలు పెట్టి డబ్బులు తీసుకునేవారు.

సరిగ్గా అలాంటప్పుడే వచ్చింది సమస్య. ఇచ్చిన డబ్బులను వాడు ప్యాంట్ పాకెట్ లోనో, షర్ట్ పాకెట్ లోనో పెట్టుకునేవాడు. పెట్టుకోడానికి దాని డ్రస్ లకు పాకెట్ లు ఉండేవి కావు. అందుకని వాళ్ల అమ్మకో, నాన్నకో ఇవ్వాల్సి వచ్చేది.

ఆవిధంగా స్టయిల్ గా-గర్వంగా కూడా కావచ్చు-పాకెట్ లో డబ్బులు పెట్టుకునే సౌకర్యం లేకపోవడం దానికి నచ్చలేదు.

‘‘ప్లీజ్ డాడీ.. నాకు కూడా పాకెట్ లు ఉండే ప్యాంట్ గానీ, షర్ట్ గానీ కొను’’ అని అడిగింది.

దాని ఫీలింగ్స్ అర్థమవుతూండటంతో వెంటనే ‘‘సరే’’ అన్నాడు.

‘‘ఇప్పుడే.. ఇప్పుడే’’ అని మారాం చేసింది.

ఎలాగూ, సెలవు పెట్టాం కదా అని, కూతురు ముచ్చట తీర్చాలని నిర్ణయించుకున్నాడు.

ఒకటి కాదు, రెండు కాదు.. పది షాపులు తిరిగాక అతనికి అర్థమైంది-తల్లిదండ్రులు మారినంతగా సమాజం-అంటే షాపులవాళ్లు మారలేదని. ఎక్కడా పాకెట్ లు వున్న పాంట్ కానీ, షర్ట్ కానీ దొరకలేదు.

చివరగా ఓ షాపు నుంచి వచ్చేస్తుంటే.. దానికి ఏడుపొచ్చేసింది. అతడి నడుమును కరుచుకుని గట్టిగా ఏడ్చేసింది.

‘‘పాకెట్ లుండేవి దొరికితే తప్పకుండా కొనిచ్చేవాడినిగా, లేకపోతే నేనేం చేస్తా చెప్పు. రెండు రోజులు పోయాక.. కోఠీ, అబిడ్స్, ప్యారడైజ్ దగ్గర చూద్దాం. సరేనా, బంగారు తల్లులు ఎక్కడైనా ఏడుస్తారా చెప్పు’’ అని కూతురును ఊరడించాడు.

అది ఏడుపు సౌండైతే ఆపింది కానీ, ఎప్పటికీ పాకెట్ లుండే డ్రస్ దొరకదని అర్థమవడం వల్లనేమో.. తెలియని ఉక్రోషంతో గుండెలు ఎగసిపడుతున్నాయి.

వెంటనే కూతురును ఎత్తుకుని, గట్టిగా ముద్దు పెట్టుకుని.. బండిపైన ముందు కూర్చోబెట్టుకుని ఇంటికి తిరుగుముఖం పట్టాడు.

అలా కాస్త దూరం వెళ్లాడో లేదో, హఠాత్తుగా అతడికి వెలిగింది.

వెంటనే బండిని వెనక్కితిప్పి రాంగ్ రూట్ లోనే ఇందాకటి షాపు దగ్గరకు వచ్చి ఆపాడు.

‘‘మళ్లీ ఎందుకు తీసుకొచ్చావ్’’ ఏడుపు జీరతోనే అడిగింది కూతురు.

‘‘నీకు పాకెట్ లుండే ప్యాంట్ కొనిస్తా’’

‘‘ఈ షాపు వాళ్లు లేవని చెప్పారుగా..’’ దాని గొంతులో సందేహం.

ఏమీ మాట్లాడకుండా షాపులోకి తీసుకెళ్లాడు.

బాయ్స్ కీ, గర్ల్స్ కీ- పిల్లలే కాబట్టి ఫిజిక్ లో పెద్ద తేడా ఉండదు. ఒకరి డ్రస్ లు ఒకరికి సరి పోతాయి. ఆ ఆలోచనతోనే షాపులోకి వెళ్లి దానికి సరిపోయే బాయ్స్ ప్యాంట్ లు నాలుగు కొనిచ్చాడు.

పాకెట్ లుండే ప్యాంట్ లే అన్నీ. ఒకటి కాదు, రెండు కాదు. ముందు రెండు, వెనుక రెండు.. మొత్తం నాలుగు పాకెట్ లు.

కూతురు ముఖం వెలిగిపోయింది. వారం రోజులపాటు పవర్ కట్ పాటించినా.. దాని కళ్లు, దాని ముఖంలోని వెలుగుతోనే ఆ షాపు దగధగ్గాయమానంగా వెలిగిపోయేట్టుంది.

ఇంటికి రాగానే విజయగర్వంతో దూకింది బండిమీంచి. గబగబా వాళ్లమ్మ మీదకు ఎక్కి తన డబ్బులు ఇప్పించుకుని పాకెట్ లో పెట్టుకుని.. అప్పుడు అందరి వైపు ఓ చూపు విసిరింది.

‘నాకు మా డాడీ ఉన్నాడు. నా కోసం ఏమైనా చేస్తాడ’నే చూపు-అది.

‘ఎస్.. అది నా కూతురు.. దాని కోసం ఏమైనా చేస్తా’ అని అతడు బయటకు అనలేదు.

కానీ, ముప్పిరిగొన్న సంతోషంతో నిశ్శబ్దంగా మీసం పాముకున్నాడు.

‘ఇప్పుడు చచ్చిన పాములా అయిపోయింది నా పరిస్థితి’ అనుకున్నాడు.. ఎదిగిన కూతురు చేసిన పనిని తలుచుకుంటూ.

అప్పుడు కొన్న బ్లూ ప్యాంట్ ఇదే. అప్పటి నుంచే దానికి కాస్త పొగరెక్కువైనట్టుంది. లేదంటే.. నేనే గారం చేసి, దాన్ని చెడగొట్టానా?

ఆలోచిస్తూనే మొబైల్ తీసుకుని ఫేస్ బుక్ ఓపెన్ చేశాడు.

‘ఫక్ దెమ్’, ‘వుయ్ ఆర్ విత్ యు’, ‘షేమ్.. షేమ్..’ ‘లవ్ యూ డియర్స్’ వంటి కాప్షన్స్ తో ఫొటోలు.. చేతులు చాపి ఆహ్వానిస్తూ, నోటిపై నుంచి రెండు చేతులూ విసురుతూ ముద్దులు కురిపిస్తూ. అమ్మాయిలదీ, అబ్బాయిలదీ వేషమే కాదు, భాష కూడా ఒకటే.

ఇప్పుడీ ‘షేమ్..షేమ్.. పప్పీ షేమ్’ పేజీలో తక్కువే అయినా, కొందరు ఫారినర్లు కూడా ఉన్నారు. ఇక్కడి వాళ్ల ప్రాబ్లమ్ విని ‘రియల్లీ’ ‘సప్రైజింగ్’ ‘షిట్’ అంటూ సపోర్ట్ గా పోస్టులు.

అతడు మొబైల్ లో బ్యాక్ బటన్ నొక్కాడు. అది రిఫ్రెష్ అయి టాప్ లో వుండే పోస్టును చూపిస్తోంది. కానీ, అతడు ఆ పోస్టును చూడటం లేదు. దానిపైనున్న కవర్ ఫొటోను చూస్తున్నాడు.

దాదాపు ఎనమండుగురు అమ్మాయిలు. ఫొటో ఫ్రేములోకి అంతమందే వచ్చారు. పక్కన ఇంకా చాలామందే ఉన్నట్టు తెలుస్తోంది. ఆ అమ్మాయిలంతా గోడవైపు తిరిగి ఉన్నారు. ముఖాలు మాత్రం వెనక్కి తిప్పి.. ఒక చేత్తో విక్టరీ సైన్ చూపిస్తున్నారు.

అతడిని అంతగా డిస్ట్రబ్ చేసినది ఆ ఫొటోనే.

‘రేపు ఈ విషయం ఆఫీసులో, చుట్టుపక్కలవారికి తెలిస్తే..’

‘ఆ ఫొటోను వెనక నుంచి తీశారు, ఎవడైనా రహస్యంగా ముందు నుంచి తీస్తే..’

తల అడ్డంగా ఊపాడు.

‘తన కూతురు భవిష్యత్ ఏమైపోతుంది? మిగిలినవాళ్లూ.. తన కూతుళ్లలాంటి వారే. వీళ్ల ఫ్యూచర్ ఏమైపోవాలి?’

కోపంతో కళ్లు బాగా తెరుచుకున్నాయి. ఒంట్లోకి ఏదో శక్తి వచ్చినట్టయ్యింది. ఫోన్ ని హాల్లోనే ఆ చివర వున్న డైనింగ్ టేబుల్ పైకి విసిరేశాడు.

కూతురు అటువంటి తీవ్ర నిర్ణయం తీసుకోడానికి తాను కూడా ఒక కారణమని అతడికి అప్పుడు తెలీదు.

బహుశా, ఇంకెప్పటికీ తెలియకపోవచ్చు కూడా.

ఇంటర్ లో వుండగా.. ఓ రోజు కాలేజీ నుంచి రాగానే డ్రస్ ఛేంజ్ చేసుకుని, కార్గో, టీ షర్ట్ వేసుకుని జుట్టు ముడేసుకుంటూ హాల్లోకి వచ్చింది. అప్పటికే టీవీ చూస్తున్న అతడి ఒళ్లోకి పిల్లో విసిరి.. సోఫాలో పడుకుని అతడి ఒళ్లోని పిల్లోపై తల పెట్టుకుంది.

రిమోట్ లాక్కుని ఛానెల్స్ అన్నీ మారుస్తోంది. ఏదీ కొన్ని సెకన్లపాటు కూడా చూడటం లేదు. రెండ్నిమిషాలు చూసి, విసుగొచ్చిందతడికి.

‘‘ఏం కావాలమ్మా. అలా మార్చేస్తుంటే.. ఏ ఛానెల్లో ఏమొస్తున్నాయో, ఎలా తెలుస్తుంది’’ అన్నాడు.

‘‘నన్నేమీ మాట్లాడించొద్దు డాడీ.. నాకు పిచ్చెడు కోపంగా ఉంది’’ అంటూ దెయ్యంలా చేతులు బిగించింది. కాసేపు కళ్లు మూసుకుంది. అటు దొర్లింది, ఇటు దొర్లింది. టక్కున స్ప్రింగ్ లా లేచి కూర్చుంది.

‘‘ఇవాళ ఏమైందో తెలుసా’’ అంది, అని ఓసారి వంటింట్లోకి చూసింది. ఎవరూ కనబడలేదు.

‘‘మన రాక్షసి ఏది’’ అంది లోగొంతుతో.

‘‘నీకు అప్పుడప్పుడు పిచ్చెక్కుతుంది. మీ మమ్మీకి అది ఎప్పుడూ ఆన్ లోనే ఉంటుందిగా’’ అన్నాడు సినిమా డైలాగ్ ను అనుసరిస్తూ.

ఆ డైలాగ్ కు కూతురు కూడా నవ్వింది. ఇద్దరూ ఒకరి చేతుల్ని ఒకరు చరుచుకున్నారు.

‘‘ఇప్పుడు మమ్మీనెందుకు కదిలిస్తావ్. తలనొప్పిగా ఉందని.. బెడ్ రూంలో పడుకున్నట్టుంది’’ అన్నాడు – ఇక విషయమేంటో చెప్పు అన్నట్టు.

‘‘అందరూ బస్ స్టాప్ ల దగ్గర, ఎక్కడంటే అక్కడ పాడు చేసి.. కంపు కొట్టిస్తున్నారు. బస్ కోసం రెండ్నిమిషాలు నిలబడాలంటే..’’

‘‘ఉపోద్ఘాతం ఎందుకురా, విషయం చెప్పు’’ అన్నాడు.

‘‘పెద్దాడివి అవుతున్నకొద్దీ నీకు ఓపిక తగ్గిపోతోంది డాడీ.

అందుకని మా గ్యాంగంతా ఓ డెసిషన్ తీసుకున్నాం. ఎక్కడైనా అలాంటి పని చేస్తుంటే.. వెనకాల చేరి చప్పట్లు చరుస్తూ గేలి చేశాం’’ అంది.

అతడు ఖంగుతిన్నాడు. ఏం మాట్లాడలేకపోయాడు.

‘‘వాళ్లంతా హడావిడిగా పారిపోతుంటే ఎంత నవ్వొచ్చిందో తెలుసా. కొంతమందికి అయితే.. ప్యాంట్ లు కూడా తడిసిపోయాయి’’ అని పెద్దగా నవ్వింది.

అతడు కోపంగా..

‘‘నువ్వేమైనా ఇంకా చిన్న కూచిననుకుంటున్నావా. అయినా, కొజ్జా వాళ్లలా చప్పట్లు కొడుతూ.. ’’ అని ఇంకా ఏదో అనబోయాడు-

కూతురు మధ్యలోనే అడ్డుకుంది. తండ్రి నుంచి ఎదురుచూడని దెబ్బ.

తెల్లని ఆమె లేత ముఖం ఎర్రబడుతోంది. ఎగశ్వాసతో ముక్కు ఎగసెగసి పడుతోంది. కాటుక పెట్టుకోని ఆ కళ్లల్లో మేఘాలు కమ్ముకున్నాయి.

‘‘నువ్వు ఎంతో ప్రొగ్రెసివ్ అనుకున్నా. నువ్వు.. నువ్వు కూడా అంతమాట అంటావా? నీకూ.. బయటవాళ్లకీ తేడా లేదు’’ అంటూ.. పిల్లోని తండ్రి మీదకు విసిరేసి, రిమోట్ ను నేల కేసి కొట్టింది.

వాస్తవానికి వీళ్లు అలా చేస్తుండగా ఓ దగ్గర గొడవయ్యింది. వీళ్లకెవరూ సపోర్టు రాలేదు.

పైగా ‘సిగ్గు లేకుండా ఏంటా పని’అని వీళ్లనే తిట్టారు.

ఆ విషయం షేర్ చేసుకుని తండ్రి సలహా తీసుకోవాలనుకుంది. తనేం చేసినా వెనకేసుకొచ్చే తండ్రే అలా అనేసరికి తట్టుకోలేకపోయింది.

గబగబా తన గదిలోకి వెళ్లి తలుపేసుకుంది.

విచక్షణ కోల్పోయి ఎంత మాటనేశాడో అప్పుడు స్ఫురించిందతడికి.

‘‘అయినా, అది చేసిందేమైనా.. మామూలు పనా? వయసుతోపాటు బుద్ధి కూడా పెరగద్దూ?’’ అనుకున్నాడు.

ఇప్పుడు-‘అప్పుడే ఇంకాస్త గట్టిగా మందలించి వుండాల్సింద’నుకుంటున్నాడు.

‘షేమ్..షేమ్.. పప్పీ షేమ్’ పేజీ అప్పట్నించీ కొత్త రూపం తీసుకుంది. వయసుతోపాటు పెరుగుతో వచ్చిన అవసరం, ఆ అవసరం పట్ల కన్న తండ్రితోసహా ఎవరికీ కన్సర్న్ లేకపోవడం ఆమెను మరింత రెచ్చగొట్టాయి.

హైస్కూల్ కు వచ్చాక తోటి గర్ల్స్ తో కలిసి కన్నీళ్లు పెట్టుకోవడం, కాలేజీకి వచ్చాక ప్రిన్సిపాల్ కో, కరస్పాండెంట్ కో రిప్రజెంటేషన్ ఇవ్వడం ఏవీ వాళ్ల సమస్యను తీర్చలేదు. సరికదా, అవమానించబడ్డారు. విషయం తెలిసిన కొందరు లెక్చరర్ల చూపుల్లో వెకిలితనాన్నీ పసిగట్టారు.

కొన్ని ప్రొగ్రెసివ్ మహిళా సంఘాలతో కలిసి ర్యాలీలు, నిరసనలు చేపట్టారు. అయినా, ఫలితం శూన్యం.

అక్కడక్కడ ఒకటీ అరా లేడీస్ టాయిలెట్ లు ఏర్పాటుచేసినా..అవి భయంకరమైన దుర్గంధంతో అలరారుతుండేవి. అంతేకాదు, ఏ పెంటకుప్పల మధ్యనో, లోపలికి వెళ్లడానికి దారిలేని విధంగానో ఏర్పాటు చేసిన ఆ టాయిలెట్ లు ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మిగిలాయి.

చుట్టుముట్టిన అవహేళనల నుంచీ, నిర్లక్ష్యాల నుంచీ వారిలో ఆగ్రహం రాజుకుంటూంది. అదే వారిలో కసినిపెంచి.. ముందుకు నడిపిస్తోంది.

ఇంజనీరింగ్ లో చేరినప్పటి నుంచీ ఫ్రెండ్సందరి మధ్యా ఓపెన్ డిస్కషన్ మొదలుపెట్టింది.

తన ఆలోచనకు మద్దతు పలికిన ఫ్రెండ్స్ తో కలిసి ఎఫ్బీ పేజీలో మార్పులు చేసింది. మొదట్లో ఎన్నో ఫోన్లు, వాట్సప్ మెసేజ్ లు.

తరతరాలుగా పేరుకుపోయిన భయాలు, ఏవేవో ఆందోళనలు.

‘‘ఇంట్లో వాళ్లకు తెలిస్తే..’’ చాలామంది బయటపెట్టిన సందేహాల్లో ప్రధానమైంది.

‘‘అన్నీ వాళ్లకు చెప్పే చేస్తున్నామా’’అనేసరికి.. అందరి నోళ్లూ మూతపడ్డాయి.

ఇది కేవలం మన కోసం మాత్రమే కాదని, మన తర్వాత తరాల వాళ్లకు కూడా మేలు చేస్తుందని వివరించింది. మనం ఇలా తెగిస్తే తప్ప ఈ ప్రపంచపు మొద్దు శరీరంలో కదలికరాదని గొంతుచించుకుంది.

కూతురు కోపం అతడికి కొత్త కాదు. ‘చిన్నప్పటి నుంచీ అది అంతే. అది ఏదైనా కావాలంటే ఇవ్వాల్సిందే, అనుకుందంటే సాధించి తీరాల్సిందే. చిన్నప్పట్నించి ఇచ్చిన అలుసు, గారమే కాదు. తన కూతురు సగటు ఆడపిల్లలా పెరగాలనుకోకపోవడం కూడా అందుకు కారణం. కానీ, ఈ రోజు మగరాయు డిలా అది చేసిన పని..’ అతడి ఆలోచనలు అక్కడ ఆగాయి.

‘మగ పిల్లలైతే మాత్రం అంత ధైర్యం చేస్తారా?’ అతడి ఊహకు అందలేదు.

ఒక్కసారిగా తాను అశక్తుడిననిపించింది అతడికి.

కూతురు చిన్నతనంలో కూడా ఓసారి ఇలాగే అశక్తుడిగా మిగిలిపోయాడు.

పాకెట్ వుండే ప్యాంట్ లు కొనుక్కోవడం అలవాటై పోయినప్పటి నుంచి అది.. తనకు తాను అబ్బాయిననే అనుకునేది. మగరాయుడిలాగే డైనమిక్ గా ఉండేది. కరాటే నేర్చుకునేది. జడలు వేసు కోకుండా హెయిర్ కట్ చేయించుకునేది. కూతురు సంగతి తెలుసు కాబట్టి అతడెలానూ కొనేవాడు కాదు. కానీ, బంధువులు అప్పుడప్పుడు ఇచ్చిన గౌన్లను.. ఎప్పుడైనా వేసుకోమంటే-ససేమిరా అనేది.

‘‘అన్నయ్య వేసుకుంటే నేనేసుకుంటా’’ అనేది.

‘‘వాడు బాయ్ కదమ్మా’’ అంటే..

‘‘నేను కూడా బాయ్ నే అని నీకెన్నిసార్లు చెప్పాలి’’ అని ఎదురుతిరిగేది.

కానీ, నెమ్మది నెమ్మదిగా దానికే తెలిసొచ్చింది తాను బాయ్ కాదని.

అప్పుడు అది సెకండ్ క్లాస్ చదువుతోంది. ఓసారి అది స్కూలు నుంచి వచ్చేసరికి.. ఎందుకో, అతడు ఇంట్లోనే ఉన్నాడు.

అది బ్యాగ్ సోఫాలోకి విసిరికొట్టి గబగబా బాత్ రూంలోకి పరిగెట్టింది.

‘‘అంత అర్జంట్ అయితే స్కూల్ లోనే పోవచ్చు కదరా’’ అన్నాడు-అది బయటకు వచ్చాక.

‘‘నీకేం తెలీదు డాడీ… నా ప్రాబ్లమ్స్’’ అని ఐడీ కార్డు, స్కూలు బెల్ట్ అక్కడ విసిరిపడేసి టీవీ ఆన్ చేసుకుంది.

అతడు కంగారుపడ్డాడు.

‘ఇంత లేదుగానీ.. ఎంత మాటంది’ అనుకున్నాడు.

‘దానికెంత కష్టమొస్తే.. అంత మాటందో’ అని సర్ది చెప్పుకున్నాడు.

అతడి కళ్లు కాస్త చెమ్మగిల్లాయి.

కూతురు దగ్గరకు పోయి ఒళ్లోకి తీసుకున్నాడు.

‘‘నువ్వు చెబితేనే కదరా తల్లీ.. తెలిసేది. ఏంటో ఆ ప్రాబ్లమ్ ఒక్కసారి చెప్పు. ప్లీజ్..’’ అని బతిమాలాడు.

‘‘చూడు డాడీ..’’ అని అది మొదలు పెట్టింది.

‘‘బాయ్స్ కేమో రెండు టాయిలెట్స్ ఉన్నాయి. మాకూ రెండే ఉన్నాయి..’’

‘అంటే.. బాయ్స్ కీ గర్ల్స్ కీ సేమ్ అన్నమాట’

‘‘అందుకే డాడీ.. నీకు చెప్పనన్నా. బాయ్స్ కి టూయే వున్నా. వాళ్లు ఒకో దాంట్లో మూడు మంది, నాలుగు మందిలు (దాని తెలుగంతే) పోతారు.

మేము మాత్రం ఒక్కళ్లమే వెళ్లాలి. లోపలికి పోయాక.. ఫ్రాక్ ఓపెన్ చేసుకోవాలి, చెడ్డీ విప్పుకోవాలి-ఒన్ పోవాలి. మళ్లీ అన్నీ వేసుకోవాలి’’

‘‘ఓహ్..’’

‘‘ఓ కాదు, వెంటనే ఫ్లష్ కూడా చేయాలి. టీచరేమో మా టాయిలెట్ దగ్గరే నిలుచోనుంటుంది. బాయ్స్ మో మంచిగా టుస్.. టుస్ మంటూ పోసేసి వెళ్లిపోతారు. వాళ్ల లైన్ ఫాస్ట్ గా మూవ్ అయిపో తుంది. మాది మాత్రం స్లో..ఎంత స్లో అంటే యాంట్ లాగా అనుకో. బ్రేక్ టైమేమో ఓన్లీ టెన్ మినిట్సే’’ అంది.

ఆ సమస్య తను పరిష్కరించగలిగేది కాదని అతనికి అర్థమయ్యింది. అయినా..

‘‘ఓ పని చేయమ్మా.. ఇంటి దగ్గర వున్నప్పుడు ఎక్కువ వాటర్ తాగు. స్కూల్ లో ఉన్నప్పుడు తక్కువ తాగు’’ అన్నాడు-కాస్తయినా ఉపశమనం దొరుకుతుంది కదాని.

‘‘అందుకే డాడీ నీకేం తెలీదన్నది. లంచ్ తినేప్పుడు వాటర్ తాగొద్దా. అప్పుడు వాటర్ తాగకపోతే గొంతు నొప్పెడుతుంది. తాగాక ఒన్ పోకపోతే స్టమక్ నొప్పెడుతుంది. ఇంటికొచ్చాక పోతే.. నువ్వేమో ఇన్ని ప్రశ్నలడుగుతావ్’’ అని అరిచింది.

అతడు బిక్కచచ్చిపోయాడు. శక్తిహీనుడిలా మిగిలిపోయాడు.

ఇప్పుడు-ఇన్నేళ్ల తర్వాత మరోసారి.

ఇంట్లోని నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టడానికన్నట్టు టీవీ ఆన్ చేశాడు.

‘షేమ్..షేమ్.. పప్పీ షేమ్’ పేజీలోని కొత్త ఆలోచన పట్ల కేవలం తన కాలేజీయే కాదు, వేర్వేరు కాలేజీల వాళ్లతో వాగ్వాదాలు జరిగాయి. విషయం యూనివర్సిటీలకు పాకింది. అక్కడ కూడా తన వాదనతో అందరినీ ఒప్పించింది.

ఇలా అందరినీ కూడగట్టడానికి రెండేళ్లపైనే పట్టింది.

మొత్తానికి ఇంజినీరింగ్ ఫైనలియర్ కు చేరుకునేసరికి కార్యరూపం దాల్చింది. సిటీలోని ఇతర యూనివర్సిటీల్లోని సీనియర్ మేల్ స్టూడెంట్స్ కూడా మద్దతు పలికారు. ఇబ్బందులెదురైతే రక్షణగా నిలవడానికి కొందరు సిద్ధపడ్డారు.

అదే సమయంలో మరో స్టూడెంట్ యూనియన్ వాళ్లు అడ్డంపడ్డారు. భారతీయతను, స్త్రీత్వాన్ని కించపరిచే చర్య అంటూ ఆమె ఆలోచనను నిరసించారు. వాదనలు జరిగాయి. తమ మాట వినకపోతే దాడులు తప్పవని హెచ్చరించారు.

అక్కడే ఆమె తన తెలివినంతా ఉపయోగించి, చాకచక్యంగా వ్యవహరించింది.

‘‘ఇది ఎక్కువరోజులు కొనసాగేది కాదు. కేవలం ఒక నిరసన చర్య మాత్రమే. మేం ప్రతిరోజూ ఇలాగే చేయం, చేయలేమని కూడా మాకు తెలుసు. ప్రధానమైన సమస్య గురించి తెలిసీ నిద్ర నటిస్తున్న ప్రబుద్ధులను, ప్రభుత్వాలను, ప్రభుత్వంలోని వివిధ విభాగాలవారినీ, బాధ్యతాయుతమైన అధికారులను షాక్ కు గురి చేయడమే మా నిరసన ప్రధాన ఉద్దేశం’’ అని వివరించింది.

చివరికి కొన్ని షరతులతో అంగీకారానికి వచ్చారు. ఎప్పుడూ బొట్లూ, కాటుకలు ఎరుగని అమ్మాయిలంతా తప్పకుండా వాటిని పెట్టుకోవాలన్నారు.

చాలామంది ఒప్పుకోవద్దని అన్నారు. వాళ్లు దాడులుచేస్తే మనమూ, మనవాళ్లమూ చేయగలమని వాదించారు. కానీ, తాననుకున్న నిరసన వాయిదా పడటం ఆమెకు ఇష్టం లేదు. అంతేకాదు, ప్రతీ ప్రతికూలతనూ అనుకూలంగా మార్చుకోగల నేర్పు ఆమె సొంతం.

నిరసన రోజు మాత్రం అమ్మాయిలంతా బొట్టూ కాటుక పెట్టుకుంటారని హామీ ఇచ్చింది.

దగ్గర్లోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవం వుండటంతో ఆ రోజునే నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించుకున్నారు.

పలు సిటీల నుంచి ఆన్ లైన్ మార్కెటింగ్ సైట్లకు వేలల్లో పీ ఫన్నెల్స్ ఆర్డర్లు అందాయి.

చివరికి ఆ రోజు రానే వచ్చింది.

గాజు కుప్పెలో సముద్రాన్ని దాచిపెట్టినట్టు.. అమ్మాయిలందరిలో ఒకటే ఉద్విగ్నత. తమ నిరసన అనంతరం జరగబోయే పరిణామలపై ఎవరికివారే అంతూదరీలేని ఆలోచనలు చేస్తున్నారు.

నిరసనలో తప్పకుండా పాల్గొంటామన్న అమ్మాయిల్లో కొంతమంది రాలేదు.

వచ్చిన వారిలో చాలామంది వీరికి బాసటగా నిలిచారేగాని.. అసలైన ‘నిరసన చర్య’లో పాల్గొనలేదు.

అయితేనేం.. సిటీలోని వివిధ ప్రాంతాల్లో అమ్మాయిలు చేపట్టిన నిరసన పెద్ద సంచలనంగా మారిపోయింది.

ఆ నిరసన గురించి విన్నవారెవరికీ నోట మాట పెగల్లేదు. ఇక ప్రత్యక్షంగానో, టీవీల్లోనో చూసినవారి సంగతైతే.. చెప్పనే అక్కర్లేదు.

సెంటర్ లోని రోడ్డు పక్కన గోడల దగ్గర అమ్మాయిలు నిలబడి చేస్తున్న పనేంటో అర్థంకాగానే.. అందరూ గబగబా పక్కకు తప్పుకున్నారు. అక్కడక్కడా నిలబడి వున్న జనం.. దూరం నుంచే చూసీ చూడనట్టు చూస్తూనే కంగారుగా కదిలిపోయారు.

తరతరాలుగా వారిలో నిబిడీకృతమై వున్న ప్రవాహమంతా ఉరుకులు పరుగులుతో కట్టలు తెంచు కుని దూకుతోంది. నుదుటన ఎర్రెర్రని కుంకుమ బొట్లు, రెండు కళ్లనిండా ఇంతేసి కాటుకతో.. మూర్తీ భవించిన ‘భారతీయత’తో వారు విజయదరహాసాలు చిందించారు.

గోడమీద ఎవరో పార్టీవారు గీసిన భారత దేశ చిత్రపటం తడిలో తళతళలాడుతోంది. చిత్రపటానికి ఆ చివరనున్న భారతమాత ముఖం విజయగర్వంతో నవ్వుతోంది.

అమ్మాయిల నడుముల మీదుగా మరికొందరు పట్టుకున్న బ్యానర్ రెపరెపలాడుతూ ‘షేమ్..షేమ్.. పప్పీ షేమ్’ అని అందరినీ వెక్కిరిస్తోంది.

‘INDIA’S DAUGHTERS PISS ON US’ అంటూ ఛానెళ్లలో కథనాలు మొదలయ్యాయి.

కరెంట్ పోయి టీవీ ఆఫ్ అయ్యింది.

కర్టెన్లు మూసేసిన ఆ ఇంట్లో చీకటీ, నిశ్శబ్దం జమిలిగా సంచరిస్తున్నాయి.

సరిగ్గా అప్పుడే ఎవరో తలుపు కొడుతున్నారు.

చప్పుడు వినిపిస్తోంది.. కానీ…

అతడిలో ఏ కదలికలూ లేవు.

*

దేశరాజు

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)
‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు