శ్రీకాంత్ కవిత ఒక్కొక్కటీ ఒక పురాతన స్మరణ ఏదో….

అనేక రకమైన భావాలు.. కరుణా, చిరాకూ, ఆహ్లాదమూ, భరించలేని బాధా, తట్టుకోలేని ప్రేమా, ప్రాణం పోయేంతటి నొప్పీ, సేద తీర్చే హాయీ……

వులు కవిత్వాన్ని ఎక్కడినించో పుట్టించరు.
మన చుట్టూ ఉన్న సమాజాన్నే, ప్రకృతినీ, మనుషుల్నీ వాటితో పెనవేసుకున్న అనుభవాల్ని అనుభూతి చెంది తన పదాలతో, పదబంధాలతో వ్యక్తపరుస్తారు. ఆ రాతలు పాఠకుల మనసు పొరల్లో అణిగిపోయి మరుగునపడ్డ ప్రపంచాన్ని వెలికిదీయడం గానీ లేక ప్రపంచాన్ని కొత్తగా చూడగలిగే దృష్టిని గానీ ఇవ్వగలిగితే అవి సార్ధకమైనట్టే. కవి తన భావజాలాన్నీ లేదా జీవలక్షణాన్నీ తను వాడే పదాలలోనో లేక మెటాఫర్ ల లోనో చూపించడంవల్ల ఆ కవిత్వ ప్రభావం మన మీద వివిధ రకాలుగా ఉంటుంది. ఉదాహరణకి మహాప్రస్థానం చదివి మూసేసాక సమభావ సమాజం కోసం కవి పడ్డ ఆవేదన మనలో ఒక ఇన్స్టెంట్ విప్లవావేశాన్ని పుట్టిస్తుంది. అదే, గీతాంజలి చదివాక ఒక సాధారణ జీవితంతో మమేకమైన ఈశ్వరప్రేమ ఆర్ధ్రంగా మనసుని కమ్మేస్తుంది!
కానీ శ్రీకాంత్ కవిత్వం పూర్తిగా విరుద్ధం. అతను కవిత్వం రాస్తాడో లేక కధలకి కవిత్వాన్ని అలంకరిస్తాడో మరి ఒక్కొక్కటీ చదివాక ఒక దీర్ఘమైన పురాతన గాధ ఏదో విన్నట్టు మనసు వివిధ పోకడలు పోతుంది!!
అలుపు తీర్చుకోడానికి అరుగు మీద చేరగిలబడ్డ అమ్మ పైట కొంగు అధాటున ముఖం మీద వాలినట్టూ..
మనసంతా బురద కాళ్ళతో చిత్తడి చిత్తడి గా తొక్కినట్టూ…

అప్పుడే కడిగిన నాపరాయి మీద నాలుగైదు పారిజాతాలు జలజలమని రాలినట్టూ…

ఎవరో తీరిగ్గా మణికట్టు నరాన్ని సన్నగా కోస్తున్నట్టూ…

అప్పటికప్పుడు లేచెళ్ళి బాకీ ఉన్న ముద్దు లెక్కలన్నీ తేల్చు కోవాలన్నట్టూ…

గుండ్రాయితో బాదంకాయికి బదులు వేలు మీద చితక్కొట్టుకున్నట్టూ..
దారితప్పి గంధర్వుల గాన కచ్చేరీలోకి వచ్చినట్టూ..
అనేక రకమైన భావాలు.. కరుణా, చిరాకూ, ఆహ్లాదమూ, భరించలేని బాధా, తట్టుకోలేని ప్రేమా, ప్రాణం పోయేంతటి నొప్పీ, సేద తీర్చే హాయీ…… ఏ కవిత ఏ అలౌకికానుభూతిని వదిలి వెళ్తుందో చదవడమయ్యేవరకూ చెప్పలేము. సాధారణ జీవితాన్ని అబ్బురమైన మాటల్లో ఎలా చెప్తాడో అసాధారణ సంఘటల్ని అంతే సావకాశంగానూ అలజడి లేకుండానూ వివరిస్తాడు!
శ్రీకాంత్ కవిత్వంలో పిల్లలు మూడడుగుల మల్లెపూవులవుతారు… వృద్ధాప్యపు అరచేతుల అమ్మ ఓర్పుతో పలకరిస్తుంది… స్త్రీలు చితికిన యోనిలాగా, నమిలి ఊసేసిన పెదాలులాగా ఉండనివ్వమంటారు… వర్షం కురిసే కళ్ళుంటాయు.. స్వప్న సువాసనలని అనువదించే నవ్వులుంటాయి!
‘ఎందుకో ప్రేమిస్తారు స్త్రీలు’ తో పరిచయమయ్యాడు. ఆ ఉలికిపాటుని ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పటికీ అందులోని ‘ ఎందుకో కానీ నీకు మృత్యువుని పరిచయం చేసి మృత్యుంజయులుగా మిగిలిపోతారు స్త్రీలు’ అన్న వాక్యం గొణుక్కుంటూనే ఉంటాను. తేలికగా ఎలా ఉండాలో తెల్సుకోవాల్సిందేనని పట్తుదలతో తన ‘పురాకృతం’ గాఢతలో ఎప్పటికప్పుడు మునిగిపోతూనే ఉంటాను.

నా వరకూ  శ్రీకాంత్ కవిత్వం అంటే ఒక మిస్టీరియస్ అరణ్యంలో తప్పిపోవడం లాంటిది.. దారి దొరికి బయటకొచ్చేలోపల అంతులేనన్ని భావోద్వేగాలు పలకరించి వెళ్తాయి.

I am glad he happened to us!
– నిషిగంధ 

శ్రీకాంత్ కొత్త కవిత్వ సంపుటి నుంచి కొన్ని కవితలు:

December moon

 

సన్నగా గాలి తాకిడి, నా భుజంపై

నువు తలను వాల్చినట్లు –

చుట్టూ, రాత్రి కురుల సువాసన!

 

తలంటు పోసుకున్న ఒక పిల్లవాని

ముఖంవలె చంద్రుడు!

తుడిచే తల్లి చేతులైన, రెండు

 

తెల్లని మబ్బులు, అదే ఆకాశంలో!

“ఎన్నడూ అమ్మేనా?”

అని అన్నావు నువ్వు ఆనాడు,

 

చెట్లు వీచే గొంతుకతో, కనులతో!

****

సన్నటి గాలి: తలను జరిపి, నువు

లేచినప్పుడు, క్రమంగా

దూరమయ్యే నీ శ్వాసలా, లిపిలా!

***

అర్థరాత్రి దాటుతోంది – డాబాపైన

ఇక ఒంటరిగా మిగిలి

నిను తలచే ఈ పద్యం, నీడల్లో

 

నలిగిన ఓ ముఖం, భుజంపై అలా

మిగిలిన మహాశూన్యం –

ఇంకా, ఇప్పటికీ, అతనిని కుదిపి

 

వొణికించే, ఒక డిసెంబర్ మూన్!

 

విముక్తి

 

 

రాత్రి నువ్వు ఇంటికి చేరుకునే సరికి, చీకటి నదిలో

లాంతరు కాంతిలో, నెమ్మదిగా సాగే

ఒక పడవలా ఇల్లు –

 

తన చేతివేళ్ళ సువాసన ఇంకా తార్లాటలాడే, దగ్గరగా

వేసి ఉన్న తలుపు. ఆ మసక కాంతిలో

గదుల్లో, కదిలే పూలవంటి

 

శబ్దం. తెరచిన బాల్కనీ కిటికీలోంచి నిదురించే పిల్లల

శ్వాస వంటి గాలి. డైనింగ్ టేబుల్పై నీకై

ఉంచిన అన్నం పాత్రా,

 

బోర్లించిన ఒక ప్లేటూ, గాజు గ్లాసూ, ఆనక నువ్వు మరి

చేయి తుడుచుకునేందుకు ఒక నాప్కినూ –

ఆపై, పడుకునేందుకు

 

సిద్ధం చేసిన మంచంపై, మడత పెట్టిన ఒక దుప్పటీ,

మంచం పక్కగా చీకట్లో నువ్వు లేస్తే, నీకు

తేలికగా అందేలా ఒక నీళ్ల

 

బాటిలూ, ఇంకా, ఉదయాన్నే వెలుతురు మరి నిన్నిక

మేల్కొల్పకుండా, కిటికీలను మూసిన

చిక్కని, గోధుమ రంగు కర్టెన్లూ …

***

రాత్రి నువ్వు ఇంటికి చేరుకునే సరికి, చీకటి నదిలో

నెమ్మదిగా, లాంతరు కాంతిలో సాగే

పడవలాంటి ఇంటిలో, అన్నీ

 

సర్ధబడి, అన్నీ ఎక్కడివక్కడే అమర్చబడీ, ఎంతో

పొందికగా, అలసటతో నిదురించిన

తన శరీరపు చెమ్మతో, అక్కడ …

 

బహుశా, ఆ నిశ్శబ్ధంలో, నువ్వు ఇన్నాళ్ళూ వినలేని

స్వరాలు. తన ఆత్మంతా నిండిన

ఎదురు చూపులూ, నొప్పీనూ …

***

మరి ఇక, నువ్వు అన్నం తినే వేళకి, అవి అన్నీ అట్లా

ఎట్లా సమకూర్చబడ్డాయో, ఆ ప్రక్రియ

ఏమిటో, దానిలో నువ్వేమిటో

 

ఒక్కసారైనా నీకు తడితే, ఆ స్పృహ నిను వీడక మరి

నీ వెన్నంటే ఉంటే, ఇక నువ్వీ జన్మకి

విముక్తి చెందినట్టే!

 

వాన దీపం

 

రాత్రంతా కూర్చున్నావు. ఎవరో

గుర్తొచ్చారు, చీకట్లో –

ముఖంపై వెన్నెల వాళ్ళు

 

అని అనుకున్నావు కానీ, చివరకి

అదంతా ఒక బేరం,

కూడికలూ తీసివేతలూ అని

 

నీకు తెలియనే లేదు. ఎదురుగా

సవ్వడి ద్వారా,

తనని తాను పాడుకునే చెట్టు

 

వాటి ఆకులు, నీ హృదయంలో

రెపరెపలాడితే,

కొంచెం ఉపశమనం, శాంతీ!

***

కూర్చున్నావు రాత్రంతా అలాగే

ఒక్కడివే, చీకట్లో –

నిన్ను నువ్వు, విసిరేసుకునీ

 

లాక్కునీ, కౌగలించుకునీ, ఆనక

అక్కడే నిద్రపోయీ –

అంత చీకట్లోనూ, తోడుగా నీకు

 

వెలుగుతూనే ఉంది రాత్రంతా,

బయటా, లోపలా

తడచినా ఆరని ఓ వానదీపం!

 

ఆ సాయంత్రం

 

నీ అరచేతిని పుచ్చుకుని కూర్చున్నాను

ఆ సాయంత్రం –

చల్లగా నీ చేతివేళ్ళు, తడిచిన వేర్లలా –

 

ఆ లేత ఎండలో గాలిలో ఊగే తూనీగలు

పచ్చిక వాసనా,

నీళ్లు ప్రవహించే శబ్దం నీలో: నాలోనూ –

 

‘వెళ్ళనా?’ అన్నావు నువ్వు. తల ఊపాను

నేను, ఎటువైపో

ఇప్పుడు గుర్తులేదు. రెక్కలు తెగుతూ

 

ఊపిరి ఆగిన, ఆ క్షణం మాత్రమే గుర్తు –

***

నీ అరచేతిని వదిలివేసి లేచి నిలబడ్డాను

నేను ఆ దినం,

మరి పూర్తిగా ఖాళీయై, తెగిన చేతినై

 

రాత్రిని తెచ్చే, ఒక సాయంత్రాన్నయ్యీ!

 

 

వేళ్ళకు అంటిన నీళ్ళు

 

నువ్వు చూసి ఉండవు: గాలికి

తెరచి ఉంచిన ఒక పుస్తకపు పుట ఏదో మరలినట్టు, తను ముఖం

తిప్పుకున్నప్పుడు

 

వేగంగా పూలతోటల మీద

వ్యాపించిన నీడలని. పైన, గుమికూడిన కారు మబ్బులనీ, లేచిన

ధూళినీ –

 

కళ్ళల్లో దుమ్ము పడకుండా

నువ్వు చటుక్కున చేతులు అడ్డం పెట్టుకుని ఇంటి దారి పట్టావు

కానీ, అక్కడే

 

నుల్చుని ఉండిపోయింది తను

వణుకుతున్న చేతులతో, రాలి నేలపై దొర్లిపోయే ఎండిన ఆకులని

చూస్తూ, నెమ్మదిగా

 

మొదలయ్యిన జల్లులో

ఆరేసిన దుస్తులు తీయడం మరచిపోయి, అట్లా తడచిపోతూ ఏదో

గొణుక్కుంటూ –

 

ఆనక, ఇక నువ్వు ఇంటికి వచ్చి

ఒక కవిత్వం పుస్తకం తెరిచి, నాలుగు వాక్యాలేవో రాసుకుని, వేలితో

చాలా యధాలాపంగా

 

పుటను తిప్పితే, నీ వేళ్ళను

వదలకుండా అంటుకున్న అశృవులూ, నీ నాలిక పైకి పేగు తెగిన

నెత్తురు రుచీ

 

ఎక్కడి నుంచి వచ్చాయో ఇక

నీకు ఎప్పటికీ అర్థం కాదు –

 

A Migraine Poem

 

ఆధాటున వస్తాయి అవి, ఈ పార్శ్వపు నొప్పులు

ఎప్పటివో పాత ప్రేమలలాగా,

మరి ఇక ఒక పట్టాన వదలవు అవి నిన్ను –

 

నిన్నో చోట నిలకడగా నిలబడనివ్వవు, అలాగని

నింపాదిగా కూర్చోనివ్వవు,

ఉన్నచోటే నిన్ను పొట్టుగా చెక్కే ఈ ప్రేమలు,

 

కణతల మధ్య నిన్ను నువ్వు నొక్కిపట్టుకున్నట్లు

అతి ప్రయాసతో వాటిని

ఆపుదామని అనుకుంటావు కానీ, అంతా

 

వృధా ప్రయాస! ప్రతి చిన్న అలికిడీ నీలో చేరి ఇక

నీ నొప్పిని ద్విగుణీకృతం

చేసినట్లు, ఈ చలిరాత్రీ, గాలీ, ఇంకా నువ్వు!

***

అధాటున వస్తాయి అవి, ఈ పార్శ్వపు నొప్పులు

గతించని ప్రేమలలాగా, ఒక

కొత్త ఎరుకని నీకు అందిస్తూ: ఆ నొప్పి వల్లనే

 

నీకు ‘నువ్వు’ ఉన్నట్లు తెలిసి వచ్చిందనీ, లోకం

ఈ మనుషులూ ఉన్నారనీ

ఔషధం వాళ్లేననీ, ఎంత నొప్పితోనైనా సరే

 

వాళ్ళని ప్రేమిస్తో బ్రతకడంలో తప్పేం లేదనీ!

 

దిగులీక

 

ఆ అమ్మాయి వచ్చింది

నా వద్దకు. జడలో ఒక గులాబీ పూవేమీ లేకుండా

పట్టించుకోలేదు పెద్దగా నేను కూడా –

 

ఇక ఆ తరువాత

 

పగలు రాత్రిగా మారే

క్షణాన, తను నా అరచేతిని గట్టిగా పుచ్చుకుని, దగ్గరకి

లాక్కుని, నా ముఖాన్ని

 

తన అరచేతుల్లోకి

అదుముకున్నప్పుడు నిజంగానే నాకు, సాయంత్రం

గుమ్మం ముందు, గుండెకు

 

ఒక బొమ్మని అదుముకుని

పని కోసం వెళ్ళిన తన తల్లి కోసం ఎదురుచూసే

దిగులు చారికల, మట్టి మరకల ఐదారేళ్ళ

 

తడి కళ్ళ పాపే జ్ఞాపకం

వచ్చింది. గుండెలో ఒక బాకు దింపి మెలిపెట్టినట్టు

అయ్యింది. గొంతు బిగుసుకుపోయి

 

ఊపిరాడక లోపల ఎవరో

బావురుమన్నట్టు అయ్యింది. చిగురాకల్లే శ్వాస కోసం

ఎవరో విలవిలలాడుతున్నట్టూ అయ్యింది

 

శరనార్ధికి దొరికిన

ఒకన్నం ముద్దా వొలికిపోయినట్టూ అయ్యింది –

(అవును. ఇది నిజం)

 

ఒక అమ్మాయి వచ్చింది

జడలో గులాబీ పూవేమీ లేకుండా. ఒక అమ్మాయి

వెళ్ళిపోయింది, జడలో

 

గులాబీ పూవేమీ లేకుండా –

*

నిషిగంధ

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • కొంచెమే రాసారు.. బాగా రాసారు. కానీ ఇంకా రాయాల్సింది… మనసుని మెలిపెట్టే శ్రీ కాంత్ కవిత్వం మన్ని ఏమేమి చేయగలదో…

  • ధన్యవాదాలు ప్రభు గారు. అవునండీ, నాక్కూడా అనిపించింది ఇక్కడ మళ్ళీ నా వాక్యాలు చదువుతుంటే చాలా తక్కువైందని. శ్రీకాంత్ కవిత్వానికి పరిచయ వాక్యాలు రాయడానికి చేసిన ప్రయత్నమంతే..

 • December Moonని వెతకటానికి మీ ఈ కాసిన్ని మాటలతో సరిపెట్టుకోవాల్సిందేనా??

  • ధన్యవాదాలు నాయుడు గారు.
   ఇది శ్రీకాంత్ కవిత్వానికి కేవలం పరిచయ ప్రయత్నమంతే.

   డిసెంబర్ మూన్ ని వెదకడానికీ, వెదికి పట్టి మనతోనే ఉంచుకోడానికీ మీరన్నట్టు ఈ కానిన్ని మాటలు అస్సలు సరిపోవు.

 • నిషీ, మీ పరిచయం బావుంది, గాయం అయితే అయింది గాక, చదువుతూ పోవాలని తప్ప మరేమీ అనిపించని శ్రీకాంత్ గారి కవితలు….!

  • అవును రేఖా! ఆ గాయానికి ఉపశమనం మళ్ళీ ఆయన కవితల్లోనే దొరుకుతుంది..

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు