శీలావీ చెక్కిన శిలాక్షరాలు

ముద్దుకృష్ణ వెలువరించిన ‘‘వైతాళికులు’’ మొదలు అనేక కవితా సంకలనాలు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి. ఇటీవలి కాలంలో ఆ ఉరవడి తగ్గింది. పలువురితో సంప్రదింపులు, కవితల సేకరణ, వాదవివాదాల వివేచన, సత్తాలేనివాటి తొలగింపు, అంశాలవారీ విభజన, క్రమానుగత చేర్పు, అక్షరదోషాల సవరణ, ప్రచురణ భారం, పంపిణీ శ్రమ… ఇట్లా అనేకానేక ఇక్కట్ల కారణంగా కవిత్వ బృహత్ సంకలనాలను భుజాలపై మోసే సంపాదకుల సంఖ్య తగ్గుతోంది.

ఈ ప్రహసనం గురించి స్పష్టమైన అవగాహన ఉన్నప్పటికీ ‘‘శీలాక్షరాలు’’ సంకలనం వెలువరించే బాధ్యతను ఇష్టపూర్వకంగా తాజాగా తలకెత్తుకున్నారు శీలా సుభద్రాదేవి గారు. తెలుగు సాహిత్యంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా కీర్తి గడించిన శీలా వీర్రాజు గారిని చిరంజీవిగా నిలబెట్టాలన్న సత్సంకల్పంతో ఆమె ఈ బృహత్కార్యానికి పూనుకొన్నారు. అట్లా అని, పనిగట్టుకొని చేపట్టిన కార్యం కాదిది. కొన్ని సందర్భాలు పరంపరగా తోసుకొచ్చి, ఆమె సాహసాన్ని సానుకూలం చేశాయి.

కవిగా, కథ-నవలా రచయితగా విశిష్ట గుర్తింపు తెచ్చుకున్న శీలావీ చిత్రకారుడుగానూ అంతే గౌరవాదరాలు అందుకున్నారు. ముఖ్యంగా, వైవిధ్యభరితమైన చిత్రాలతో కథ-కవితా సంపుటాల ముఖపత్రాలను అలంకరించటం ద్వారా పుస్తక ప్రచురణకు ఒక ఊపు తీసుకొచ్చారు. ఒక దశలో ఆయనతో ముఖచిత్రాల్ని డిజైన్ చేయించుకునేందుకు ‘వెయిటింగ్ లిస్ట్’లో పేరు నమోదు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన మాత్రం తొణక్కుండా బెణక్కుండా తన పని తాను చేసుకుంటూ, కవులు-రచయితలకు భరోసానిచ్చేవారు.

శీలావీ తన సృజనాత్మక చైతన్యాన్ని ముఖపత్రాలకే పరిమితం చేయకుండా; టైటిళ్లను, కవుల పేర్లను చేతిరాతతో సరికొత్తగా వెలిగించే ప్రయత్నం చేసేవారు. అట్లా ఆయన రాతకు ఓ ప్రత్యేక శైలి ఒనగూరింది. అక్షరాలకు ఒంపుసొంపులతో కూడిన సౌందర్యం సొంతమైంది. ఆయన ప్రత్యేకంగా తన చేతిరాతతోనే పుస్తకాలు ప్రచురించారు. ఆయన దూరమైనా ఆ రాత ఆర్తిగా హత్తుకునే ఉండిపోయింది. అరుదైన ఆ ముద్ర(ణ)ను సుస్థిరం చేయాలనుకున్నారు ఆయన శ్రీమతి, ప్రముఖ సాహితీవేత్త శీలా సుభద్రాదేవి గారు. అనుకున్నదే తడవుగా అన్నీ సిద్ధం కావు. శ్రమించారు. శీలావీ ఫాంట్‌ను రూపొందించారు. అనుభవజ్ఞుల సహకారంతో సాంకేతికాంశాలను సరి చూసుకున్నారు. ఒకటికి పదిసార్లు మార్పుచేర్పులు చేసుకున్నారు. అంతిమంగా 2024 డిసెంబరులో శీలావీ ఫాంటుతోపాటు సుభద్రాదేవి గారి ‘మాట్లాడటానికో మనిషి కావాలి’ కవితాసంపుటిని ఆవిష్కరించారు. అతిథిగా పాల్గొన్న సాహితీవేత్త, సేవాభిలాషి డాక్టర్ అమృతలత- శీలావీ ఫాంటు సౌందర్యానికి ముగ్ధులై, ఆ ఫాంటుతో 200 మంది కవితలతో ఓ సంకలనం వేస్తే బాగుంటుందని, అందుకు తన సంపూర్ణ సహాయసహకారాలు అందిస్తాననీ హామీ ఇచ్చారు.

‘అలవాటు లేని ఫాంటు పాఠకుడికి కనువిందు కలిగిస్తుందో లేదో’నన్న అనుమానం ఎవరికైనా రావచ్చు. ఆ సందేహానికి సమాధానంగా తొలుత సుభద్రాదేవి గారే తన ‘రెండు చిత్రాలు’ (2 దీర్ఘ కవితలు) శీలావీ ఫాంటుతో ప్రచురించారు. అమృతలత గారి ప్రోత్సాహంతో ‘‘శీలాక్షరాలు’’ రూపకల్పనకు నడుం బిగించారు. ఆమె ప్రకటనకు కవులు పెద్ద మనసుతో స్పందించారు. వందలాది కవితలు వాట్సాప్‌కు వరదలెత్తాయి. కొన్ని నిర్దిష్ట ప్రమాణాలు రూపొందించుకొని; ఎక్కువమంది వర్తమాన, వర్ధమాన కవులకు స్థానం కల్పించాలన్న ఉద్దేశంతో ఆ సంఖ్య రెండొందల యాభైకి చేరింది.

ఒక పేజీ నిడివి గల కవితలు మాత్రమే వేయాలన్న నిర్ణయంలో ఏ ఇబ్బందీ తలెత్తలేదు. కానీ, పాతతరం వారి కవితలు కూడా చేర్చాలా, వద్దా? కొత్త కవిత రాయలేకపోయామన్న సమాధానంతో సరిపెట్టిన ప్రస్తుత సీనియర్ కవుల్ని చేర్చాలా, వద్దా? ఇట్లా చాలా ప్రశ్నలు అడ్డుగా నిలిచాయి. నాళేశ్వరం శంకరం, అమృతలత గార్లతో విస్తృతంగా చర్చించిన మీదట ఒక స్పష్టత వచ్చింది.

పాతతరం నుంచి తాజాగా రాయటం ప్రారంభించిన తరం దాకా అయిదు భాగాలుగా విభజించుకున్నారు. సంకలనంలోని తొలి కవితగా శ్రీశ్రీ ‘‘ఋక్కులు’’ను శీలావీ ఫాంటుతో అభిషేకించాలని తీర్మానించుకున్నారు. ఇంకా ఆ తరం ప్రతినిధులుగా తిలక్, దాశరథి, శేషేంద్ర, సినారె, నాయని కృష్ణకుమారి, జ్వాలాముఖి, త్రిపుర వంటి ఉద్ధండుల కవితల్ని సుభద్రాదేవి గారే ఎన్నిక చేసి, సంకలనంలో చేర్చారు. రెండో తరం ప్రతినిధులుగా వరవరరావు, అద్దేపల్లి, శివారెడ్డి, మో, ఎన్.గోపి, అమ్మంగి వేణుగోపాల్, అలిశెట్టి తదితరుల కవితలకు చోటు కల్పించారు. మూడో తరంలో పాపినేని, దర్భశయనం, ఆదూరి సత్యవతీదేవి, ఘంటసాల నిర్మల, కొండేపూడి నిర్మల, ప్రసేన్, ఓల్గా, వంశీకృష్ణ, అఫ్సర్, అనిశెట్టి రజిత తదితరులకు స్థానమిచ్చారు.

నాలుగో తరానికి చెందిన అనిల్ డ్యానీ, ఇబ్రహీం నిర్గుణ్, శ్రీరామ్ పుప్పాల, సుంకర గోపాలయ్య, మెర్సీ మార్గరెట్, తగుళ్ల గోపాల్, తిరునగరి శ్రీనివాస్ వంటి ఎక్కువమంది కవితల్ని చేర్చటం… రేపటి కవిత్వంపై సంపాదకులకున్న ఆశావాద దృక్పథానికి సంకేతం. తాజాగా కంఠం సవరించుకుని కవిత్వంతో ప్రయాణం చేస్తున్న కుందుర్తి కవిత, గుర్రాల అనుషారెడ్డి, పూలన్, చిక్కొండ్ర రవి (అందరికన్నా చిన్నవాడు) వంటివారిని అయిదో తరం కింద సంకలనం చివర్లో చేర్చటం బాగుంది.

ఇంతటి అపురూపమైన పుస్తకం తయారీలో నెలల తరబడి శ్రమించిన శీలా సుభద్రాదేవి గారు, ఆమె వారసురాలు శీలా పల్లవిల కవితల్ని చిట్టచివర్లో ఉంచటం కేవలం వారి వినయసంపత్తికి నిదర్శనం. ఈ సంకలనం ముఖచిత్రానికి పల్లవి రూపకర్త కావటం మరో విశేషం.

250 మంది కవులు. 250 కవితలు. 270 పేజీలు. ఈ బృహద్గ్రంథం ప్రచురణకు అన్ని విధాలా అండగా నిలిచిన డాక్టర్ అమృతలత గారి సౌజన్యం అభినందనీయం.

ఈ గొప్ప ప్రయత్నాన్ని సొంతం చేసుకోవటం మన కర్తవ్యం.

(‘శీలాక్షరాలు’ కవితాసంకలనం, వెల: రూ. 300, ప్రతులకు: శీలా సుభద్రాదేవి @ 8106883099)                 

ఎమ్వీ రామిరెడ్డి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు