శిల్పం ఆయన ప్రాణం

అద్దేపల్లి అమూల్యమైన లేఖ

ద్దేపల్లి రామ్మోహన రావు గారితో నాకు ఒక అనూహ్యమైన రీతిలో పరిచయం లభించింది. మినీకవితను ఒక ఉద్యమంగా చేపట్టి జనాన్ని కుదుపు కుదిపిన అద్దేపల్లి నన్ను పద్యకవితలోంచి తెలుగు వచన కవితలోకి నడిపించారనడంలో అతిశయోక్తి లేదు. 1978లో సాంస్కృతీ సమాఖ్య మినీ కవితల పోటీని నిర్వహించింది. వరంగల్ లో ఇంటర్మీడియట్ చదువుతున్న నేను ఈ పోటీలో పాల్గొని రూ.50  బహుమతి సంపాదించాను.

ఈ  బహుమతి కోసం నేను వరంగల్ నుంచి రైలులో విజయవాడ వెళ్లాను. విజయవాడలో జిల్లా గ్రంథాలయం డాబాపై  పెద్దిభోట్ల సుబ్బరామయ్య, అద్దేపల్లి రామ్మోహనరావు నాకు బహుమతి ప్రదానం చేశారు. ఆ సభలో నేను మాట్లాడిన తీరు చూసి వరంగల్ లో సాంస్కృతీ సమాఖ్య సభలు నిర్వహిస్తున్నామని, అందులో మాట్లాడాలని నిర్వాహకులు కోరారు. ఆ తర్వాత వరంగల్ బిఇడి గ్రంథాలయంలో ‘తెలుగు కవిత్వంపై మార్క్సిస్టు ప్రభావం’ అన్న అంశంపై ప్రసంగించాను. ఈ  ఉపన్యాసం కోసం నోట్స్ సంపాదించే ప్రయత్నంలోనే నాకు వరవరరావు, జగన్మోహనాచారి తదితరుల పరిచయం, నేను సహజంగానే వారి పట్ల ఆకర్షితులు కావడం జరిగింది. ఆ తర్వాత అద్దేపల్లి మినీకవితా ఉద్యమాన్నే విమర్శిస్తూ నేను సృజనలో ఒక వ్యాసం రాశాను. అయినప్పటికీ అద్దేపల్లికీ నాకు మధ్య స్నేహం వీడలేదు. నాకంటే 26 సంవత్సరాలు కొనసాగించారు. ఇటీవల ఆయన ఉత్తరం ఒకటి ఒక పుస్తకం మధ్యలో దొరికింది. అందులో అమూల్యమైన ఆయన అభిప్రాయాలు మనకు తెలుస్తాయి.

1980 వ దశకంలో ఉధృతంగా విప్లవరాజకీయాలు తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేశాయి. ఈ ప్రభావంలోనే నేను ఆయనతో శిల్ప-వస్తు చర్చ చేశాను. శిల్పం కన్నా వస్తువు ప్రధానమనేదే నా ఆనాటి అభిప్రాయం. అందుకోసం నేను అనేక మార్కిస్టు పుస్తకాలు చదివి  నా రచనలో ఉటంకించాను. 21-12-1982లో డియర్ ఫ్రెండ్, అని నన్ను సంబోధిస్తూ ఆయన కాకినాడ నుంచి రాసిన లేఖలో  వాక్యాలు ఉటంకిస్తాను.

1.మీరు మీ ఉత్తరంలో రాసిన విషయాలన్నీ బేసిక్ థియరీస్. రాజకీయ విప్లవాన్ని ఎదురుగా ఉంచుకుని, దాన్ని సాహిత్యంలోకి పరిపూర్ణంగా తేవడానికి చేసే ప్రయత్నం లో నుంచి ఆ సూత్రాలు వస్తై. (సాహిత్యం, రాజకీయం వేరు వేరు కాదు అని మీరు చెప్పబోయేది నాకు తెలియదనుకోకండి. కాని సాహిత్య స్పృహని కూడా గుర్తిస్తే మీ సిద్దాంతాలు వేరుగా ఉంటై. సాహిత్య స్పృహను వేరుగా ఎందుకు గుర్తించాలి? అంటే రాజకీయోపన్యాసానికీ, రాజకీయ కవిత్వానికీ తేడా ఉండబట్టి.

 1. ఒక ఉత్తేజం కలిగించడమే ప్రధానమైతే, మీలాంటి strong conviction ఉండాలి. కాని ఆ ఉత్తేజం పార్టీ ప్రజలకే కాదు, అందరికీ కలిగించాలి అనే భావం ఉంటే సాహిత్య స్పృహ ఉండాలి.సాహిత్య స్పృహే బూర్జువా లక్షణం, పాలకవర్గాల భావం అంటూ ఎన్నైనా చెప్పవచ్చు. ఇవి చెప్పడానికి బేస్ ఏమిటి? మీ కళ్లముందు  విప్లవ రాజకీయ సిద్దాంతం ఉండటం. దాని దృష్ట్యా సాహిత్యంలోని భావజాలాన్ని  విడదీయడం. ఇదే కరెక్ట్ అని మీరనుకుంటారు. అలా అనుకోవడానికి కారణాలున్నై.అలా అనుకోవడంలో మీకు రాజకీయంగా బలం ఉన్నది. సాహిత్యపరంగా బలహీనత ఉన్నది. బేసిక్ విప్లవ సిద్దాంతాలు నాకు చెప్పకండి. కారణం చెబుతాను.
 2. మీరు బికామ్ పూర్తి చేశారు. మీ వయస్సు 21, 22 ఉండవచ్చు ( నిజానికి అప్పుడు నా వయస్సు 20 మాత్రమే). ఆ ఏజ్ కు నేను సాహిత్యంలోకి రాలేదు.ఇప్పుడు నేను 46 ఇయర్స్ ఏజ్ లో ఉన్నాను.చిన్నప్పటి నుంచీ విశ్వనాథ సాహిత్యాన్ని అభిమానించాం. కాని నా కుటుంబ పరిస్థితి, నాలో ఉన్న సామాజిక కసి నన్ను హేతువాదిగా, ప్రోగ్రెసివ్ పోయెట్ గా తయారుచేసినై. 67-68లో నేను రచించిన అంతర్జ్వాల మీరు చదివి ఉండకపోతే ఒకసారి చదవండి. ఆనాడు అలంకార శాస్త్రాల ప్రభావం, రష్యా, అమెరికా, ఫ్రాన్స్ ల్లో వస్తున్న ఆధునిక విమర్శా సిద్దాంతాల ప్రభావం ఉండడం, అన్నీ కలగలుపుగా ఉండడం, ఇవేవీ అసహజంగా భావించబడలేదు. ఈనాటి విరసం సభ్యులు,విరసంలో చేరి బయటకు పోయిన కవులూ ఎవరూ దీనికి exception కాదు. రాజకీయ సిద్దాంత పునాది ఏర్పడిన తర్వాతనే, వారి సాహిత్య సిద్దాంతాలు రాజకీయ పునాదులతో అన్వయించడం ప్రారంభమైంది. సరే, సాహిత్య విమర్శ complete రాజకీయ విమర్శ కావడం చూస్తూనే ఉన్నాం.

4.నేను తర్వాత తర్వాత రాజకీయాల్లో left wing ని అభిమానించడం ప్రారంభించాను.నందిగామ కళాశాలలో 1969-71 మధ్య పనిచేసినప్పుడు సిపిఐ కుర్రాళ్లంతా నా మాట మీద ఉండేవాళ్లు.70లలో  విప్లవ సాహిత్య ప్రభంజనం నన్ను లోగొన్నది. నాకు రాజకీయ స్పృహలో లోతు లేదు.అప్పుడూ లేదు, ఇప్పుడూ లేదు.(left wing  సాహిత్య కారుడికి అవసరమని  కూడా నేను అనుకోను. అవసరం అనుకనే వ్యక్తి , కవి పండితుడై ఉండితీరాలనుకునే ప్రాచీనతా వాది లాంటి వాడే). ఇతే తీవ్రమైన కసి ఉంది. విరసం వాళ్లతో చాలా ఊళ్లు తిరిగాను.Local గా, ఈ చుట్టుపక్కల అనేకమంది యువకవుల్ని విరసం అభిమానులుగా తయారు చేశాను. నేను, రాను రాను విరసం ఎప్పుడు  పూర్తిగా రాజకీయ స్పృహ కావాలన్నదో అప్పుడు దూరంగా ఉండిపోయాను. నేను తయారు చేసిన  సుమారు 15 మంది కవులు విరసంలో చేరిపోయారు.అదంతా ఉత్త ఆవేశం. నాకు తెలుసు. వారంతా స్థిరంగా రాజకీయాల్లోంచి వచ్చిన వాళ్లు కాదు. వాళ్లు నిలవరు. నాకు తెలుసు. సరే, ఈనాడు ఎవరెలా ఉన్నారో మరో సారి చెబుతాను.

5.అప్పటి నుంచీ, ఇప్పటి దాకా  రాజకీయం, సాహిత్యం ఎంతవరకు కలవాలి, ఎంతవరకు అక్కర్లేదు అన్న విషయమై నాకు అనుభవం మీద ఏర్పడ్డ  భావాలు చాలా ఉన్నై. ఒక రాజకీయ సిద్దాంతం పెట్టుకుని ‘అదే ఇది’ అనెయ్యడం చాలా సులభం. మీకంటే ఇంకా తీవ్రంగా సిద్దాంతీకరణ చెయ్యొచ్చు.(మీరే ఇంకో 20 ఏళ్లు పోతే చెయ్యకపోవచ్చు). కాని అది ఎంతవరకు నిలుస్తుందనేది కూడా ఆలోచించాలి. ఎవరిలో నిలవాలి?  కేవలం మన ideasతో మమేకం చెందిన వారిలో కాదు నిలవాల్సింది.ఈ భావాలవైపు సాధ్యమైనంత మంది హృదయాల్ని  లాగడానికి కావాలి. అక్కడ సాహిత్యం అవసరం ఉంది. లేకపోతే సాహిత్యం ఎందుకు?  విప్లవ సిద్దాంత కార్యాచరణే చాలు. సాహిత్యం వల్ల ప్రభావం ఎలాంటిది?అది ఏ తరగతుల మీద పనిచేయాలి?ఎలా ప్రభావితం చేయాలి అనే దాన్ని లోతుగా ఆలోచిస్త పోతే- అక్కడ శిల్పం అవసరం  కనిపిస్తుంది. ఇది ఇంకా ఇంకా విశ్లేషించవచ్చు. లేదా ఈ విశ్లేషణే అనవసరం. ఇది పాలకవర్గాలకు  మేలు చేస్తుంది- అనవచ్చు.అది కేవలం విమర్శలోకి నినాదాన్ని తేవడం అవుతుంది. రెండూ ఒకటే అన్నది ప్రజల్లో తిరిగితే, మన అనుభవం రుజువు చెయ్యదు. కొ.కు కూడా చివరి దాకా రాజకీయమే సాహిత్యం  కాదని చెప్పడానికి, కథా శిల్పాన్ని వివరించడానికి కారణం ఇదే.

6.ఒక రాజకీయ సిద్దాంతంతో కాని, మరో సిద్దాంతంతో కాని మమైకమైన వారికి ఒ క అడ్వాంటేజ్ ఉంది. అదేమిటంటే స్థిరత్వం. అది ఎంతకాలం ఉండనీ. అలా కాదు.( రాజకీయంగా తన  స్పృహ పెంచుకుంటూ పోయిన వ్యక్తి తన సిద్దాంతం మీదే ఉండవచ్చు.అక్కడా దేశ కాల పరిస్థితులున్నై. రష్యాలో Yuri Barabash, Avner Zism  చెప్పేదీ సామ్యవాదమే. ఫ్రాన్స్ లో Sartre చెప్పేదీ అదే. ఐతే, సాహిత్యం, రాజకీయం కలవడంలో దేశ కాల పరిస్థితుల నిష్పత్తి ఉంది. అందుకే ఇన్ని సిద్దాంతాలు).

 1. సాహిత్యంలోంచి బయలుదేరి రాజకీయ స్పృహ పెంచుకునే నాలాంటి వాడికి స్థిరత్వం ప్రోగ్రెసివ్ నేచర్ మీద ఉండొచ్చు గాని, రాజకీయ సిద్దాంతాన్ని అన్వయించడంలో ఉండదు. అసలు అన్వయించే అభిప్రాయంలోనే భేదాభిప్రాయం ఉంటుంది. అందుకే నా కవిత్వాన్నీ, నా విమర్శనా వ్యాసాల్ని చూస్తుంటే, ఒక సంకీర్ణత, ఊగిసలాట కనిపిస్తుంది. ముఖ్యంగా రాజకీయ వాదికి. అదీగాక ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎప్పుడో రాసింది మరెప్పుడో ప్రింట్ కావడం జరుగుతుంది. విమర్శా వేదికలో వచ్చిన వ్యాసాలు ఎప్పుడో రాసినవి. పదేళ్ల తర్వాత ప్రింట్ అయినై. ఆ నాటికీ, ఈ నాటికీ ఎంతో మార్పుంది నా ధోరణిలో. వెంటవెంటనే పుస్తకాలు వస్తే ఆ పరిణామం క్లియర్ గా  ఉంటుంది. అందువల్ల 67 నుంచి 82 దాకా ఒకేలా లేను. పరిణామంలో ఉన్నా ఊగిసలాటలు. మీకు ఇందాక చెప్పిన కారణమే.ఐతే మార్పూ, పరిణామమూ వాటి dialectics వాటికి ఉంది.ఒక్కో కాలంలో అవి ఒక్కో విధంగా పరిగణించబడతాయి.

8.ఫలితం ఏమిటంటే ఆనాటి నుంచీ ఈనాటి దాకా  నాకు కొన్ని వందలమంది leftists తెలుసు. సాహిత్యంలో నించి రాజకీయాల్లోకి, రాజకీయం లో నుంచి సాహిత్యంలోకి  ప్రభావితులైన వాళ్లు తెలుసు. ఏ మార్పు ఎందువల్ల వచ్చినయ్యో కూడా తెలుసు.(స్థిరంగా ఉండలేకపోవడం వ్యక్తుల దోషం అంటారు  మీరు మీ ప్రస్తుత దృష్టిలో.అది కూడా కొంతకాలానికి మారవచ్చు. మారకపోయినా, మార్పు వచ్చే అవకాశాన్ని అంగీకరిస్తారు చుట్టూ ఉన్న సమాజాన్ని చూస్తే.

9.అందువల్ల ‘శిల్పం’ అనేది మీ  భావాల్ని మీ పక్షం వారికే కాక మిగిలిన వారందరికీ అందించడానికి కావాలి. ఆ మిగిలిన వారు కూడా మాకు అక్కర్లేదనుకునేవారు సాహిత్యంలో కలవక్కర్లేదు.ఉద్యమంలోనే పనిచేయవచ్చు. కాబట్టి మనం సాహిత్యం చదివించే  ప్రజల్లో తరగతులున్నై. వారి వారి అంతరువులను బట్టి మన శిల్పం – మారుతుంది, ఇది నేను అనుభవంతో ఆలోచిస్తే వచ్చిన conclusion.అందుకే judgementకి వస్తే (అది అనవసరం అనడం. నాకు ఉద్యమమే కావాలి అనడం. అటువంటి స్థితిలో అసలు సాహిత్యం అవసరం లేదు.)

 1. చెరబండరాజు కంటే శివసాగర్ గొప్ప కవి అంటాం. దానికి కారణాలుంటై కదా.అది చెప్పడమే శిల్పాన్ని వివరించడం.అలా చూడనే కూడదు అనవచ్చు.అలా అనడానికి చెప్పే కారణాలు నాకు తెలియనివీ కావు, నేను చెప్పనివీ కావు. అందువల్ల basic గా రాజకీయ దృష్టి ని ఒక వైపుంచి- సాహిత్యం ప్రయోజనం అది ఎవరి మీద ఎలా ముద్ర వేస్తోంది గట్రా ప్రశ్నలమీదకు మీరు వస్తే,నా అనుభవంతో ( నా అనుభవం తక్కువది కాదు. కొన్ని వందల ఊళ్లు తిరిగిన వాణ్ని. ప్రభావాన్ని study చేసిన వాణ్ని.)మీకు ఎన్నో విషయాలు రాయగలను.. లేదా సూటిగా నా సిద్దాంతం ప్రకారమే ప్రతి విషయాన్నీ చూస్తాను అంటే, అసలు  సాహిత్యాన్ని గూర్చి ఆలోచన  సాగదు. మీది ఒ   క దృక్పథమైపోతుంది. దానిలో ఆలోచన లేదు. ఆవేశమే ఉంది. అనుభవం లేదు. చదువే ఉంది).
 2. ఇక శ్రీశ్రీ విషయం-అతణ్ని గూర్చి నేను వేసిన ఆనాటి అంచనా రైటని నేను ఈనాడు అనుకోను. కాని శ్రీ శ్రీ గూర్చి కొన్ని శిల్ప విశేషాలు చెప్పానని నేను నమ్ముతాను. దానికి కారణాలు పైపైన  రాసుకుంటే తేలదు. ఉదాహరణలు తీసుకుని చర్చించుకోవాలి. ఆ పని తర్వాత చేద్దాం.
 3. నేను పైన రాసిందంతా మీకు గందరగోళంగా (ఈనాటి స్టేజ్ లో) కనబడవచ్చు. కాని ఆలోచించండి. మీ ఆలోచన కూడా ఏకముఖంగానే సాగుతుంది.Of course, మీకు అదే యిప్పుడు కావల్సిందీ, ఉండేదీనూ,  నేను కాదనను. కాని కొంచెం, ఇంకో side ఉందని ఆలోచించండి.  చాలా facts బయటపడతై. మీ ఉత్తరానికి వెంటనే  రాశాను, అందువల్ల ఎక్కడైనా వాక్య నిర్మాణంలో తొందరపాటు ఉంటుంది. అయినా, మీకది అర్థమౌతుంది. ముఖ్యంగా, కార్యాచరణకీ, భావ ప్రచారానికీ ఉన్న భేదాన్నిఆలోచించారా? ఆనాటి శ్రీకాకుళ పోరాటం నుంచి ఈనాటి సృజన రచనల్లోని పరిణామాన్ని గమనించారా? మేధావుల, కవులలోని మార్పుల్ని,  వాటి basic కారణాల్ని అంచనా వేశారా?ఇవన్నీ మీ స్థిర దృష్టితో కాదు చెయ్యవలిసింది. అలా అయితే మీకెప్పుడూ ఒకే answer వస్తుంది. వారి వైపు నుంచి ఆలోచించండి. ఈ పై విషయాలన్నీ గాలిలో అనుకున్నవే. తర్వాత concrete గా మాట్లాడుకుందాం. మళ్లీ రాయండి.- మీ  రామ్మోహన రావు

దాదాపు 39 ఏళ్ల క్రితం ఆయన రాసిన లేఖ ఇవాళ అన్ని ప్రభావాలూ నాపై వీడిన తర్వాత, చైతన్యంలేని ఉద్యమాలను, ఉద్యమాలు లేని చైతన్యాలను చూసిన తర్వాత   చదువుతుంటే సాహిత్యంలో నాడు జరిపిన చర్చల ఆవశ్యకత ఈనాడూ ఉన్నదనిపిస్తోంది. ఆనాడు ఒక 20 ఏళ్ల కుర్రవాడికి 13 పేజీల ఉత్తరం రాసి సాహిత్యంలో అత్యంత ముఖ్యమైన అంశాల గురించి అత్యంత తేలికభాషలో వివరించడం అద్దేపల్లి గొప్పతనాన్ని సూచిస్తుంది. బహుశా ఆనాడు నేను ఆయన లేఖ విలువలను గ్రహించి ఉండకపోవచ్చు. ఆయన కూడా అదే ఊహించారు. కాని ఆయన ప్రస్తావించిన అంశాలను నేడు అవలోకనం చేసినా, వాటిపై చర్చించినా సాహిత్యానికి మేలు జరుగుతుందనే నాకు నిశ్చితాభిప్రాయం. వస్తు-శిల్పాల ఐక్యత గురించిన చర్చ ఏనాడూ సమసిపోదు.

*

కృష్ణుడు

వారం వారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఢిల్లీ నుంచి కాలమ్ రాసే ఎ. కృష్ణారావు, అడపా దడపా కవితలు రాసే కృష్ణుడూ ఒకరే. జర్నలిస్టుగా 34 సంవత్సరాల అనుభవం ఉన్న కృష్ణుడు కవి, సాహితీ విమర్శకుడు కూడా. ఇండియాగేట్, నడుస్తున్న హీన చరిత్ర పేరుతో రాజకీయ వ్యాసాల సంకలనాలు వెలువరించిన కృష్ణుడు ఇంకెవరు, ఉన్నట్లుండి, ఆకాశం కోల్పోయిన పక్షి అనే కవితా సంకలనాలను వెలువరించారు.

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • చాలా మంచి పని చేశారు మిత్రమా . అద్దేపల్లి రామ్మోహన రావు గారిని ఆంధ్రా అస్సోసియేషన్ ఢిల్లీ వారు అప్పటి అద్యక్షులు కిశే కృష్ణమూర్తి గారు పిలిచారు అప్పుడు నేను వారి ప్రసంగం విని ఆయన తో స్నేహం చేశాను. మీకు రాసిన ఉత్తరంలో వారు వివరంగా రాసిన చాలా విష్యాలు, ముఖ్యంగా కవిత లో రాజకీయం ద్సిల్పం గురించి బగరాసారు. కేవలం పాఠకుడినైన నాలాంటి వారికి ఎన్నో విషయాలు తెలిపింది.

  కృషుడిని అభినందిస్తున్నాను ఎన్నో ఏళ్ల కితమ్ అద్దేపల్లి వారి రాసిన ఈ ఉత్తరం లోని ముఖ్య అంశాలు తెలియ చేసినందుకు

 • ఒకప్పుడు ఇలాంటి లేఖలు పెద్దవారు విరివిగా రాసేవారు
  ఇప్పుడు అది కనుమరుగయింది
  మీరు పరిచయం చేసిన అద్దేపల్లిగారి లేఖ మంచి జ్ఞాపకమే కాదు..ప్రాసంగికత కలిగుంది

  • అవును రాంబాబు గారూ.. ఇలాంటి వారితో ఉత్తర ప్రత్యుత్తరాలు చేసిన అదృష్టం నాకు దక్కింది

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు