శరీరం, మనసూ, కాలం ఒకే కక్ష్య లో తిరిగితే…

స్త్రీ పురుషులు ఇద్దరి సమానత్వం కోసం ఎన్ని యుగాలు ఎదురు చూసినా వెసులుబాటు ఇద్దరికీ ఒకలా వుండదు ఎప్పటికీ.

నేను రాసిన కథలన్నీ దాదాపు నా చుట్టు పక్కల జరిగినవే. స్త్రీల జీవితాల నేపథ్యంలో రాసినవే. కాకపోతే రియాలిటీలో అలా జరక్కపోతే, కనీసం కథలో అయినా అలా జరిగితే బాగుండన్న ఆశతో పెట్టిన మలుపులూ, ముగింపులూ వుంటాయి వాటిల్లో. ఆ రకంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో నేనా కథల్లో వుంటా కాబట్టి అన్ని కథలూ నాకు బాగా నచ్చినవే. నా ప్రాణ స్నేహితుడు చనిపోయినప్పుడు తన కల గురించి మొదటి కథ రాసాను. ఆతర్వాత చాలా రోజులు మళ్లీ కథ రాయలేదు. అలా నెమ్మదిగా ఇప్పటికి పన్నెండు కథలు అయ్యాయి.

అన్నింటిలో ఒక కథ మాత్రమే ఈ శీర్షికకి ఎంచుకోవాలి కాబట్టి నాకు నచ్చిన, ఎక్కువమంది పాఠకులు మెచ్చిన కథ “25వ గంట” నేపధ్యం మీతో పంచుకుంటా.

మనందరికీ తెలుసు ప్రపంచంలోని కొన్ని దేశాల్లో Spring సీజన్‌లోనూ Autumn లోనూ టైం ని సెట్ చేస్తారు. దానివల్ల సంవత్సరంలో ఒకసారి ఒక రోజు 23 గంటలు, మరో రోజు 25 గంటలూ వుంటాయి.

అంతకు ముందు చాలాసార్లు ఈ విషయం గురించి విన్నా కూడా నా మనసుకి అంత ఎక్కలేదు కానీ మా అబ్బాయి చదువుకోసం UK వెళ్ళాక ఒకరోజు మా ఫామిలీ వాట్సప్ గ్రూప్ లో ఈ అదనపు గంట గురించి మాట్లాడుకున్నాం.

మగ పిల్లలంతా ఓ అర్థరాత్రి అదనంగా వచ్చే ఒక గంట గురించి పెద్దగా పట్టించుకోలేదు గానీ మా అమ్మా, అత్తమ్మా, అక్కా వీళ్ళకంతా ఒక ఎక్జయిట్‌మెంట్. ఐటి సెక్టార్ లో సీనియర్ ప్రొఫెషనల్ గా  ఊపిరాడకుండా వుండే మా అక్క అయితే ఆ గంట లో తన కోసం తను ఎన్ని చేసుకోవచ్చో బోలెడు చెప్పింది. రోజు మొత్తం మీద చేసే పనుల్లో అవి అందరి కోసం అంటూ చేసినా అందులో మనం కూడా వుంటాం అది వేరే విషయం. కానీ… కానీ… అచ్చంగా మన కోసం, కేవలం మనకోసం చేద్దాం అనుకునే కొన్ని పనులు వుంటాయి. వాటి కోసం అయితే కచ్చితంగా మన చుట్టూ వుండే మన వాళ్ళు కాస్త స్ట్రెచ్ అవ్వాలి. నిజంగా అవుతారా? అంటే అవుతారేమో.. అవుతారు కూడా. కానీ మనం చెప్పం. అలా tune అయిపోయింది మన మైండ్.

అప్పుడు పుట్టింది ఈ కథ. స్త్రీ పురుషులు ఇద్దరి సమానత్వం కోసం ఎన్ని యుగాలు ఎదురు చూసినా వెసులుబాటు ఇద్దరికీ ఒకలా వుండదు ఎప్పటికీ. మిగిలినవి అన్నీ పక్కన పెట్టి, కేవలం తనకోసం, తన ఆసక్తుల కోసం.. తన ఆనందం కోసం తాను ఏం చేయగలదు అన్నదాని వరకే ఈ కథని పరిమితం చేసాను. అందులోనూ ఒకవేళ సాహిత్యం ఆమె ప్రధాన ఆసక్తి అయితే?? అన్న పాయింట్ ఎందుకు తీసుకున్నా అంటే, అది మరీ neglected area కదా. తను ఒక సినిమా చూడాలంటే కుదురుతుందేమో కానీ ఒక పుస్తకం చదువుకోవడమో, ఏమన్నా రాసుకోవడమో అయితే మరీ కష్టం.  25వ గంట కథలో ఏ పాత్రకీ పేరుండదు. ఇది అందరి కథా అన్న ఉద్దేశ్యంతో  ఏ పాత్రకీ పేరు పెట్టలేదు.

IF SHAKESPEARE HAD HAD A SISTER …!!!

స్త్రీలు సాహిత్య కృషి చేయాలంటే, అందులో వాళ్ళు విజయం సాధించాలంటే, వాళ్ళకి స్వంత డబ్బు, దానిపై హక్కు, స్వంత సమయం, స్వంత గదీ ఉండాలంటూ A Room of One’s own వ్యాసంలో వర్జీనియా ఉల్ఫ్ ఒక మాటంటుంది.

“Shakespeare కి ఒక చెల్లెలుందనుకుందాం. తన పేరు జుడిత్ అనుకుందాం. ఆమెకి కవితలు రాయాలని యిష్టం. కానీ, ఎప్పుడైనా ఏదైనా పుస్తకం చదవాలనుకున్నా, రాయాలనుకున్నా, తల్లి ఆమెని అది వదిలేసి, కుట్టుపని చెయ్యమనో, మరో పని చెయ్యమనో అంటుంది. తండ్రి ఒక సంబంధం కుదురుస్తాడు. ఆమె వద్దని ఏడుస్తుంది. May be ఇంట్లోంచి పారిపోతుంది. తిండీ నిద్రా లేకుండా వీధుల్లో తిరుగుతున్న ఆమెని ఒకడు చేరదీస్తాడు. అతని వల్ల ఆమె గర్భవతి అవుతుంది. చివరికి ఆత్మహత్య చేసుకుంటుంది”.

ఒక ఊహగా వర్జీనియా ఈ విషయం రాసుండొచ్చు గాక.. వాస్తవంలో కూడా equal capabilities ఉన్న రెండు జెండర్స్ లో అవి నిరూపించుకునే వెసులుబాటు ఎవరికుంటుంది!!

“ఇంట్లో పనంతా అయ్యాక, అందరూ నిద్రపోయాక అర్ధరాత్రి డైనింగ్ టేబుల్ ని శుభ్రం చేసుకుని అక్కడే రాసుకునే దాన్ని” అని My Story లో కమలాదాస్ చెప్తుంది. అలా పగలంతా పని, రాత్రిళ్ళు మేలుకుని తెల్లారేదాకా రాసుకోవడం… వీటివల్ల ఆమె ఆరోగ్యం దారుణంగా దెబ్బతింది.

“Wipeout the paints, unmould the clay

Let nothing remain of that yesterday”

అని ఒకానొక రాత్రి రాసుకుంది. కానీ అదంత తేలికగా ఏం అవ్వలేదు.

చిన్న చిన్న ఆనందాలకోసం, ఆరోగ్యం కోసం…  మనకోసం… కేవలం మనకోసం ఉంచుకోవాలనుకునే చిన్న చిన్న spaces కి వెసులుబాటు లేకపోవడం across the regions and cultures చాలామంది ఫేస్ చేస్తున్న సమస్య.

శరీరం, మనసూ, కాలం ఒకే కక్ష్య లో తిరిగితే ఎంత బాగుంటుందో కదా.

అనుకున్న దానికన్నా మంచి రెస్పాన్స్ వచ్చింది కథకి. చాలామంది స్త్రీలు ఎక్కడెక్కడినుంచో కాల్ చేసారు. అందరూ ఇది తమ కథ అనుకున్నారు. గౌరీ కృపానందన్ గారు ఈ కథని తమిళ్ లోకి అనువాదం చేసారు. అక్కడా మంచి రెస్పాన్స్ వచ్చింది. తమిళనాడులో మా ఎల్ఐసీ మాగజైన్‌లో పబ్లిష్ అయింది.  ఇదొక Outdated కథ అన్న విమర్శ కూడా వచ్చింది. కానీ ముందే చెప్పినట్లు నా కథలన్నింటిలోనూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో నేను వుంటా కాబట్టి ఈ కథ కూడా ఇప్పటి కాలంలో నా చుట్టు పక్కల వున్నదీ, జరిగిందీనూ. కాబట్టి ఆ విమర్శను పెద్దగా పట్టించుకోలేదు. నిజానికి ఇలాంటి కథ Outdated ఆయ్యే రోజు కోసం ఎదురుచూస్తున్నా కూడా.

ఇదీ నాకిష్టమైన నా కథ గురించిన కథ.

*

25వ గంట!

“అప్పుడే మెడిసిన్ పెట్టను. కాకపోతే, కాస్త లైఫ్ స్టైల్ మార్చుకోవాలి”, అప్పుడే తీరం దాటిన షుగర్ లెవల్స్ చూస్తూ చెప్పాడాయన.

ఉన్నట్లుండి పది రోజుల క్రితం మోకాలు వాచి నెప్పి చేసింది. టాబ్లెట్లూ అవీ వాడి, తగ్గలేదని హాస్పిటల్ కి వచ్చింది మొన్న. డాక్టర్ చెప్పిన టెస్టులు చేయించుకుని మళ్ళా వచ్చింది యీరోజు.

“అంటే?” అన్నట్లు చూస్తున్న ఆమెతో

“నొప్పికి టాబ్లెట్స్ ఇచ్చాను. ఇప్పుడూ, రాత్రికీ వేసుకోండి. తర్వాత నొప్పి ఉన్నప్పుడు వేసుకోండి. నొప్పి తగ్గాక,  కనీసం ఒక 45 నిముషాలు నడవడం అలవాటు చేసుకోండి.  కాస్త వెయిట్ తగ్గితే మీకా మోకాలు నెప్పి కూడా తగ్గుతుంది. నొప్పి అక్యూట్ అయినా, ఇంకాస్త బరువు పెరిగినా మీరు వాకింగ్ చేయడం కష్టం” చాలా నార్మల్ గా అలవాటుగానే చెప్తూ బెల్ కొట్టాడు, నెక్స్ట్ పేషంట్ కోసం.

లేస్తూ అడిగింది. “వేరే ఆప్షన్? ఐ మీన్ ఫుడ్ ఎట్సెట్రా? ”

“కాస్త కార్బ్స్ తగ్గించండి. యూ కెన్ కన్సల్ట్ అవర్ నూట్రిషనిస్ట్ ఇఫ్ యూ..”, డాక్టర్ ఏదో చెప్పబోతుంటే అతని చేతిలో ఫైల్ లాక్కున్నట్లు తీసుకుని గబగబా బయటకి వచ్చింది.

ఇఫ్.. అని డాక్టర్ ఒక ఆప్షన్ ఇచ్చాక ఏం చేయాలో ఆమెకి తెలుసు. చిన్నప్పుడు రెన్ అండ్ మార్టిన్ లో చెప్పినప్పుడు తలకి ఎక్కక పోయినా ఇప్పుడు ఆమె కాలావసరాలు బానే నేర్పించాయి. అప్పటికే ఆఫీసు నుంచి ఆరుసార్లు కాల్. గంటలో వస్తా అని పర్మిషన్ తీసుకుని హాస్పిటల్ కి వచ్చింది. ఇంకో అరగంట లేట్ అయినా ఎవరూ ఏం అనరు. ఇన్‌కంటాక్స్ డిపార్ట్మెంట్ లో సీనియర్ టాక్స్ అసిస్టెంట్ గా చేస్తోంది. మామూలు ఎంక్వయిరీ అయి ఉంటుంది.  చాలా మంది  దగ్గర తన నంబర్ ఉంటుంది.  అయినా ఆమెకి ఇష్టం ఉండదు. నూట్రిషనిస్ట్ దగ్గరకి వెళ్ళకుండానే ఆఫీస్ కి పరిగెత్తింది.

బయటకి వచ్చి గేట్ దగ్గర అప్పుడే ఎవర్నో దింపుతున్న ఆటో దగ్గరకి వెళ్ళింది.

“ఎక్కడికి మేడం” అడిగాడతను

“వాకింగ్. నలభైఅయిదు నిముషాలు” పరధ్యానంగా చెప్పింది.

అంతలోనే తేరుకుని ఆఫీస్ అడ్రస్ చెప్పి అతని సమాధానం కోసం చూడకుండా ఆటో ఎక్కి కూర్చుంది.

అద్దంలోంచి వెనక్కి వింతగా చూస్తున్న అతన్ని పట్టించుకోకుండా ఫోన్లో యూట్యూబ్ తెరిచింది. హాస్పిటల్ నుంచి 20 నిమిషాలు ప్రయాణం.

“హౌ టు లూజ్‌ వెయిట్” అని టైప్ చేసింది. బోలెడు వీడియోలు. ఒకటి రెండు వింది ఇయర్ ఫోన్స్ పెట్టుకుని.

“రేపటినుంచీ అన్నం మానేయాలి. అసలు ఇప్పటినుంచీ ముందు మంచినీళ్ళు ఎక్కువ తాగాలి”, నాలుగైదు సార్లు మనసులో దృఢంగా అనుకుంది. మామూలుగా ఆఫీస్ లో నీళ్ళు ఎక్కువ తాగదు. అందరి మధ్యలోంచి వాష్ రూం కి పదే పదే వెళ్ళడం విసుగు. అలా కాన్ష‌స్‌ గా ఉండనక్కర్లేదని అందరికీ చెప్తుంది. కానీ అలా ఉండడం త‌న‌కి మాత్రం యిబ్బందే.

*       *          *

సీట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి నలుగురు ఎదురు చూస్తున్నారు. ఆఫీసు నుంచి నోటీసులు వెళ్ళి, వాటికి క్లారిఫికేషన్లు తీసుకుని వచ్చినవాళ్ళు. సామాన్యంగా ఆడిటర్ ద్వారా కాకుండా అలా ఆ డిపార్ట్ మెంట్ కి ఎక్కువమంది రారు. కానీ ఆమె ఫ్రెండ్లీగా ఉంటుంది. సలహా చెప్తుంది.

క్షమాపణగా ఒక చిరునవ్వు విసిరి, ముందు సీసా ఎత్తి గటగటా నీళ్ళు తాగి, వాళ్ళని ఎటెండ్ అవడం మొదలు పెట్టింది.

నవ్వు మొహం, అంతకన్నా మెత్తటి మాట. చకచకా ఎలాంటి సమస్య అయినా సాల్వ్ చేయగల నేర్పు. కాబట్టి పెద్దగా ఇబ్బందులుండవామెకి..

కాసేపటికి మొదలయ్యింది అనీజీనెస్. కొత్త అలవాటు కదా. అంతకు ముందు తాగిన పెద్దసీసా నీళ్ళు లోపల ఇబ్బంది పెట్టడం మొదలయింది. మోకాలొకటి నొప్పి. సీటు ముందున్న వాళ్ళని ఎటెండ్ అయి, నెమ్మదిగా టేబుల్ పట్టుకుని పంటి బిగువున నొప్పి ఓర్చుకుని నెమ్మదిగా వాష్‌రూం వేపు వెళ్ళింది.

వచ్చి కూర్చుని పనిలో పడితే మళ్ళీ అరగంటకి అవసరం పడింది. ఈసారీ అలానే వెళ్ళి వస్తుండగానే పక్క సీటాయన అడిగాడు. ” మేడం! హెల్త్  బాలేదా.”

“చెత్తగాడు. నా వాష్‌రూం విజిట్లు కూడా లెక్కేస్తున్నాడు”, మనసులో చిరాగ్గా అనుకుంది. మొహం కూడా చిరాగ్గానే పెట్టాల‌నుకుంది. కానీ అలవాటు ప్రకారం అసలేమీ అర్థంకానట్లు మామూలుగా సీట్లో కూర్చుంది. ఖాళీ అయిన మంచినీళ్ళ సీసాని టేబుల్ లోపల పడేసింది. ఈరోజుకి దీనికి నమస్కారం . కాలు నొప్పి. కదిలితే నరకం కనిపిస్తోంది. అంతకన్నా డయాబెటిక్ అవుతుందేమోనన్న భయం ఇంకా పీడిస్తోంది. ఈ ప్రెజర్వల్ల బిపి కూడా వస్తుందేమో. రేపటినుంచి కనీసం ముప్పావుగంట నడవాలి. ముప్పావుగంట.. ముప్పావుగంట.  ఇరవైనాలుగుగంటల్లో ముప్పావుగంట ఎన్నో వంతు? ఇరవైనాలుగు యింటూ అరవై బై నలభై అయిదు…. ముప్పైరెండో వంతు. ”హ్మ్మ్… ముందు ఈరోజు ఈ నెప్పి తగ్గనీ”. టెన్షన్  అయితే వాయిదా వేసింది గానీ ఆలోచనలు ముసురుతూనే ఉన్నాయి.

ఈమధ్య కాస్త వళ్ళు చేసింది. ఇర‌వై ఎనిమిది రోజులకు బొట్టు పెట్టినట్టొచ్చే పీరియడ్స్ ఇప్పుడు లెక్క తప్పుతున్నాయి. తల్లిని అడిగితే తను యాభై వరకు అవుతూనే ఉన్నానంది. అయితే తనకింకా ఆరేళ్లు టైం ఉంది అనుకుంది కానీ  ప్రీ మెనోపాజ్ అని డాక్టర్ కూడా కన్ఫర్మ్ చేశాడు.  ఇష్టపడి కొనుక్కున్న డ్రెస్ లూ, డిజైనర్ బ్లవుజ్ లూ మారాం చేస్తున్నాయి. ఇందాక హాస్పిటల్‌లో చూసుకున్న బరువు బీఎమ్మై  క్రాస్ అయినట్లు హెచ్చరించింది. కొలతేసి తయారు చేసినట్లుండే శరీరం అక్కడక్కడా పోగుపడి తేడాగా కనిపిస్తోంది.

“ఏదో ఒకటి చేయాలి”, అప్పటికి ఆలోచనలు పక్కన పెట్టి పెయిన్ కిల్లర్ వేసుకుని, రిపోర్ట్స్ భర్తకి వాట్సాప్ చేసి పనిలో పడింది.

ఇద్దరూ ఒకే డిపార్ట్‌మెంట్ లో చేస్తారు. ఈమధ్యే అతనికి ప్రమోషన్ వచ్చి వేరే ఊరు వెళ్ళాడు. ఆమె కూడా అన్ని డిపార్ట్మెంట్ పరీక్షలూ పాసయ్యింది. కానీ ఒకసారి పిల్ల చదువు, రెండోసారి కడుతున్న ఇల్లు సగంలో ఉందని, ఇంకోసారి మామగారి అనారోగ్యం ఇలా ఆమెకి ఆలోచించే వెసులుబాటు రాలేదు.

నిజానికి అతనికి ప్రమోషన్ వల్ల పెరిగే జీతం కన్నా అక్కడ యిల్లూ, వారం వారం తిరగడానికి ఎక్కువ అవుతుంది. వెళ్ళేముందు ఇద్దరూ ఎంతో ఆలోచించారు. కానీ అతను రాకరాక వచ్చిన ప్రమోషన్ని వదులుకోవడానికి ఇష్టపడలేదు. అసలతను ఎప్పుడూ వదులుకోలేదు. అది వేరే విషయం.

మధ్యాహ్నం లంచ్ బాక్స్ తెరిచినా తినాలనిపించలేదామెకి. కానీ, అంతకు ముందేసుకున్న పెయిన్ కిల్లర్ భయానికి బలవంతంగా తినేసింది. వాట్సప్ తెరిచి చూసింది. ఇంకా బ్లూ టిక్ పడలేదు. పైన లాస్ట్ సీన్ చూసింది. అంతకు ముందే అక్కడినుంచి వెళ్ళాడతను. చప్పున దుఃఖం వచ్చిందామెకి.

అరగంట తర్వాత ఫోన్ చేసాడతను. “మెసేజ్ చూసుకోలేదు. అంత నొప్పిలో సాయంత్రం బస్ ఎలా ఎక్కుతావ్. కాబ్ లో వెళ్ళు. అయినా ఒక నాలుగు రోజులు సెలవు పెట్టకూడదూ”

నిజాయితీ వినిపిస్తోందతని గొంతులో. అంతకు ముందున్న కోపం యిప్పుడు లేదామెకి. చెడ్డవాడేం కాదు. టేక్ ఫర్ గ్రాంటెడ్  గా తీసుకునే భర్తల్లో ఒకడు. అంతే. తన బెంగ, అసంతృప్తి, ఒక్కతే ఇక్కడ బాధ్యతలు చూసుకోవడం వల్ల కలుగుతున్న స్ట్రెయిన్.. ఇవన్నీ అతనికి చెప్పుకోవాలని అనుకుంటుంది. కానీ చెప్పదు. చెప్పే పరిస్థితి రాదు. అతను కన్వీనియెంట్ గా ఎవాయిడ్ చేస్తాడా? ఆమె అవకాశం తీసుకోదో?!

సెలవు పెట్టాలనే ఉందామెకి. కానీ సంవత్సరం క్రితం మామగారి అనారోగ్యం, ఆ తర్వాత ఆయన పోవడం మొత్తానికి మూడునెలలు సెలవు పెట్టింది. ఇప్పుడు అత్తగారికి వచ్చిన పక్షవాతం. ఆమె హాస్పిటల్ లో ఉన్నప్పుడు మళ్ళీ పదిహేను రోజులు. కాజువల్ లీవ్ లు పదిహేనుకీ పదిహేను కారణాలూ రెడీగా ఉంటాయి. అర్ధాంతరంగా వచ్చే అవసరాలు అదనం. ఇప్పుడు సెలవు అన్న ఆలోచనే చాలా కష్టం. అసలు అసాధ్యం కూడా.

లంచ్ అయ్యాక సీట్లో కూర్చుంది.  వెంటనే పనిలో పడకుండా ఫేస్‌బుక్ తెరిచింది.

రాత్రి తను అమృతా ప్రీతం రాసిన కవిత  “వారిష్ షా” కోసం  అనువాదం చేసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. దానికి 100 లైకులు, ఒక 40 కామెంట్లు. అమృత రాసిన ఇంకా కొన్ని కవితల గురించి అక్కడ మంచి చర్చ జరుగుతోంది. పుస్తకాలూ అందులోనూ కవిత్వం ఆమెకి ప్రాణం. ఏమాత్రం తీరిక దొరికినా చదవడం, తన భావాలని పంచుకోవడం అస్సలు వదులుకోదు..

అప్పటిదాకా ఉన్న నొప్పి, తనని కుంగ తీస్తున్న బెంగా మర్చిపోయి ఉత్సాహంగా ఆ లోకంలో పడిపోయింది. అన్నిటికీ ఓపికగా సమాధానం చెప్పింది.  దాదాపు ఒక అరగంట తర్వాత ఒక నోటీస్ డ్రాఫ్ట్ చేయడానికి సూపరింటెండెంట్ సీట్ దగ్గరకి వచ్చేవరకు ఆమె ఆ  లోకంలోనే ఉంది.

సాయంత్రానికి పూర్తిగా కాదు గానీ, నొప్పి కాస్త తగ్గింది. కాబ్ లో కనీసం ఐదువందలు అవుతుంది. నెలలో సగం రోజులు  వచ్చినా  పదివేలు అయిపోతాయి కాబట్టి ఆమె కాబ్ ఎక్కదు. మంచి ఇల్లు, తన అభిరుచికి అనుగుణంగా కావాలి కాబట్టి, సిటీకి 25 కిలోమీటర్లు దూరంగా 250 గజాల్లో స్థలం కొనుక్కున్నారు. తమకోసం, ఒక్కగానొక్క కూతురు కోసం, అత్త మామయ్య కోసం అంటూ వైనాలు వైనాలు గా ఇల్లు కట్టేటప్పటికి  యిల్లు కోటికి పైగా అయింది. సేవింగ్స్ అన్నీ పోను ఆ యీయ‌మ్మై ఇంకో ఇరవై ఏళ్ళ పాటు నెలకి దాదాపు లక్ష. అందరూ కలిసి బయటకి వెళ్ళడానికి కార్ కావాలి. దాని యీయ‌మ్మై ఒక ఇరవై వేలు. ఇద్దర్లో ఒక జీతం వీటికి పోతుంది. పిల్ల చదువుకీ భవిష్యత్తుకీ అని దాచే విషయంలో భార్యాభర్తా యిద్దరూ యిద్దరే. అసలు కాంప్రమైజ్ అవ్వరు.

భర్త ప్రమోషన్ తీసుకుని వెళ్ళాక పెరిగిన జీతం, అయ్యే ఖర్చూ లెక్కేస్తే అడిషినల్ గా ఇంకో 15 వేలు. మొత్తం మీద ఆమె కాబ్ ఎఫర్డ్  చేయలేదు ఇప్పట్లో.

ఆఫీసు నుంచి ఇంటికి గంటా గంటన్నర ప్రయాణం. బస్ ఎక్కగానే కిటికీ పక్కన కూర్చుని ఒక్క క్షణం ఊపిరి పీల్చుకుంది.  అమెజాన్ ఆడియో లో కొనుక్కున్న ఎలీనా ఫెరాంటే పుస్తకం వినడం మొదలెట్టింది. అంతకు ముందు చదివిన పుస్తకమే. కానీ మళ్ళా వినాలని ఆడియో కొనుక్కుంది. ఎందుకో ఆ రోజు యింక పుస్తకం వినాలనిపించలా ఆమెకి. ఏవో ఆలోచనలు, అనారోగ్యం స్థిమితంగా ఉండనివ్వడం లేదు. ఆమె సమయాలు ఎప్పుడూ శూన్యం కాదు. ఏదోరకంగా అందులో కాస్త తడి వంపుకుంటుంది. కానీ ఆ వంపుకునే క్రమం కూడా ఆమెకి చాలా అలసట అనిపిస్తోంది.  రాన్రానూ కుంగుబాటు ఎక్కువ అవుతోంది.

బస్ దిగేటప్పటికి ఆరున్నర. మనిషి అయిదున్నర ఎత్తుంటుంది. మెట్రో బస్ లో కాళ్ళు ఫ్రీగా పట్టవు. ముడుచుకుని కూర్చోవడం వల్ల కాలు మళ్ళీ నొప్పి చేసింది. కుంటుకుంటూనే ఇంటికి వెళ్ళింది. మంచాన ఉన్న అత్తమ్మకి ఇంతకు ముందు పొద్దున్నా రాత్రీ రెండు షిఫ్ట్ ల్లో యిద్దరు ఆయాలు ఉండేవాళ్ళు. ఇల్లు కట్టి ఖర్చు పెరిగాక రాత్రి పూట ఆయాని మానిపించి తనే చూసుకుంటోంది.

ఇంటికి రాగానే అత్తగారికి కాస్త కాఫీ పెట్టిచ్చి తనూ పెట్టుకుని ఆమె పక్కన కుర్చీ వేసుకుని కూర్చుంది. ఆయమ్మ వెళ్తూ శుభ్రం చేసి వెళ్తుంది. ఆ తర్వాత ఆమెకి ఏమీ అవసరం పడలేదు అనుకుంటా. మనిషి తేటగా ఉంది. తను రిఫ్రెష్ అయి వచ్చి వంటగదిలోకి వెళ్తూ ఆమెనీ వీల్ ఛెయిర్‌ లో తీసుకెళ్ళింది. వంట చేస్తున్నంతసేపూ యిద్దరూ కబుర్లు చెప్పుకుంటారు. అతను వేరేచోటకి బదిలీ అయ్యాక,  ఇంజనీరింగ్ కి వచ్చిన కూతురికి  తన లోకం తనది అయిపోయాకా అత్తా కోడళ్ళ మధ్య బంధం మరింత పెరిగింది. ఆమె అనారోగ్యం బారిన పడకముందు కోడలికి బాగా అండగా ఉండేది. ఆ రోజు కోడలు ముభావంగా వుండ‌డానికి కారణం అర్థం అయిందామెకి… అంతకు ముందే హాస్పిటల్ రిపోర్ట్స్ గురించి చెప్పింది కాబట్టి! శరీరం సంగతెలా ఉన్నా అత్తమ్మ మెదడు ఆరోగ్యంగా ఉంది.

ఏవో జాగ్రతలు చెప్తోంది అత్తగారు. అటు పక్కా ఇటుపక్కా కూడా డయాబెటిక్ హిస్టరీ ఉంది. వచ్చినా పర్వాలేదు అని  ధైర్యం చెప్తోంది పెద్దామె.

టైం ఏడయ్యింది. కూరగాయలు బయట పెట్టి టెర్రస్ మీద మొక్కలకి నీళ్ళు పోయడానికి వెళ్ళింది. కొత్తగా కట్టిన ఇల్లు. ట్రిప్లెక్స్. లిఫ్ట్ కోసం అంతా రెడీ చేసి, లిఫ్ట్ ఇన్స్టాల్  చేయకుండా వదిలేశారు. అప్పటికి డబ్బులు అయిపోయాయి. మూడో అంతస్తులో మొక్కల కోసం చాలా వదిలేశారు. పైన అంతా స్టాండ్స్ కట్టించి రకరకాల మొక్కలు పెట్టింది. అవి పెంచడం, ఆ ఫోటోలు అందరితో షేర్ చేసుకోవడం భలే ఇష్టం ఆమెకి.  ఏడు దాటింది టైం. అప్పటికే పూర్తిగా చీకటి పడింది కానీ, శనీ ఆదివారాలు తప్ప వెలుతురులో నీళ్ళు పోయడం అవ్వదామెకి. నీళ్ళు పోస్తూనే మధ్య మధ్యలో ఆకులు ఎండినవి తీసేస్తూ స్నేహితురాలి కి ఫోన్ చేసింది. ఏదో పుస్తకం గురించి అటూ ఇటూ కాసేపు సంభాషణ నడిచింది . తనకి ఎంతో యిష్టమైన వ్యాపకం అది.

కింద నుంచి కూతురు కాల్. ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి కూతురు ఇంకా రాలేదు. ఫోన్ కట్ చేసి కుంటుతూనే గబగబా రెండు అంతస్తులు దిగింది. రాగానే పాలు కలిపి యివ్వాలి కూతురికి. పద్దెనిమిది నిండాయి. కనీసం తనకి పాలు కలుపుకోవడం, తల్లికి చిన్న చిన్న పనుల్లో  సహాయంగా వుండ‌డం కూడా చేయదు. అసలు ఆ పిల్లకి నేర్పాలని తానే అనుకోదు. దూరంగా వినాయక చవితి పందిర్లో అనుకుంటా “రింగ రింగా  రింగ రింగా  రింగారింగారే..” పాట వస్తోంది. ఫక్కున నవ్విందామె. సినిమాల్లోలా సిట్యుయేషనల్ సాంగ్ అయితే  “ఆలయాన వెలసిన ఆ దేవుని రీతీ ఇల్లాలే ఈ జగతికి..” అని రావాలి ఈ టైం కి. కానీ యిది సినిమా కాదు కదా.

కిందకి వచ్చి వంట చేస్తున్నంతసేపు వేరే ధ్యాసలో ఉందామె. ఒక మాగజైన్ కి కాలమ్‌ రాస్తోంది, అప్పటికి రెండేళ్ల నుంచీ. మంచి రెస్పాన్స్ ఉంది ఆమె రచనలకి. ఈనెల నలత వల్ల ముందుగా ఏమీ ప్లాన్ చేయలేదు. ఆలోచనలు నడుస్తుండగానే భర్త ఫోన్ అటెండ్ అయింది. ఆమె ముభావంగా ఉంటే కోపం అనుకున్నాడతను.

తను ఆర్టికల్  మూడ్ లో ఉందని అర్థం అయ్యాక చిన్నగా అయినా ఒక మందలింపు వదిలి, ఫోన్ పెట్టేసాడు. తను రాయడం, చదువుకోవడం అతనికి యిష్టం లేకపోవడం కాదు. వాటికోసం అతను ఏ మాత్రం స్ట్రెచ్ అవ్వడు.

వంట అయ్యాక అత్తగారికి మెత్తగా కలిపి పెట్టి, తనూ కూతురు కాసేపు కబుర్లు చెప్పుకుంటూ తిన్నారు. అప్పటికి సమయం రాత్రి తొమ్మిది.

రేపటి వంట , టిఫిన్ ఆలోచనలు ముసురుతుంటే గబుక్కున ఫ్రిజ్ తెరిచి కూరలు చూసుకుంది. అట్లపిండి ఉందనుకోగానే హమ్మయ్య అని తెప్పరిల్లి,  రేపటికి కూరగాయలు కోసుకుని ఫ్రిజ్ లో పెట్టుకుంది. పాలు తోడేసుకుని వంటిల్లు మొత్తం సర్ది, తలుపులు వేసి లోపలికి వచ్చింది

అత్తగారికి మందులు యిచ్చి ఆమె పడుకున్నాక పక్కన పడక్కుర్చీ వేసుకుని జారగిలపడి లాప్టాప్ తెరిచింది.

రాత్రి పదిన్నర…

అది ఆమె సమయం. అతనికి భార్య, కూతురికి తల్లి, కోడలు, ఆఫీస్ లో సీనియర్ ఎంప్లాయీ  యివేవీ కాదు. తన ప్రపంచం అది. నచ్చినవి చదువుకుని రాసుకుంటుంది. ఊహా ప్రపంచం లో ఉంటుంది. లోపల్లోపల ఎక్కడో ఉన్న అశాంతి, శూన్యత మొత్తం వచ్చేస్తుంది బయటకి. అక్షరాలతో దాన్ని కప్పుకుంటుంది. నవ్వులూ కన్నీళ్లూ పంచుకుంటుంది.

పన్నెండున్నర వరకు ఆమె ప్ర‌పంచం.. కేవలం ఆమె ప్రపంచం అది.

ఆరోజు ఎప్పటిలా లేకపోయినా, శరీరంలో నొప్పి కలుక్కుమంటున్నా రాయాల్సిన ఆర్టికల్ రాసింది. ఎప్పటి నుండో ఒక కథ రాసి కంక్లూజన్ తట్టక వదిలేసిన కథ పూర్తి చేసింది.  పూర్తి చేసేటప్పటికి చేయి విపరీతంగా నొప్పెట్టింది. చాలా యిష్టమైన వ్యాపకం, యిదీ ఒక అలవాటుగా, ఆ తర్వాత ఒక పనిగా, చివరికి వొక తప్పనిసరి ప‌నిగా ఎప్పుడు   మారిందో అర్థం కాలేదు.

మధ్యమధ్యలో అత్తగారు నిద్ర‌పోతూ లేస్తూ యింకా ప‌డుకోలేదా అంటూ మందలిస్తోంది.

పడుకోబోతుంటే అప్పుడు లోపల్లోపల  కప్పేసిన డాక్టర్  హెచ్చరిక. ఇప్పటికిప్పుడు దగ్గరకి రాలేను కాబట్టి జాగ్రత్తగా మేనేజ్ చేసుకోమని చెప్పిన భర్త బుజ్జగింపులు, కూతురి గురించీ అత్తమ్మ గురించీ ఆందోళన, ఆరోగ్యం గురించి భయం. చివరికి అన్నిటి సారాంశం ఒక 45 నిముషాలు నడవాలి.. కొంచం పొద్దున్న.. ఒక గంట ముందు లేస్తే చాలు.

లేచి మళ్ళీ కూర్చుని పొద్దున్న 6 నుంచి రాత్రి పన్నెండున్నర వరకు చేసే పనులన్నీ రాసి పక్కన టిక్, యింటూ పెట్టడం మొదలెట్టింది.

6 to 6.30 ఫ్రెష్ అప్  అవ్వడం. అత్తగారికీ తనకీ కాఫీ, కూతురికి పాలు, 6.30 నుంచి 8 వంట, బట్టలుతకడం, ఆయమ్మ వచ్చేలోపు అత్తగారికి అత్యవసరం అయితే అటెండ్ అవ్వడం. ఒకవేళ వంటమనిషిని పెట్టుకుంటేనో?!  అవ్వదు. కనీసం పదివేలు ఇవ్వాలి. 8 నుంచి  8.30 తను రెడీ అవ్వడం. 8.45 నుంచి 10 ప్రయాణం. ఒకవేళ క్యాబ్ అయితే ఒక అరగంట నుంచి ముప్పావుగంట కలిసి వస్తుంది. కాసేపు ఆగింది అక్కడ. టిక్ పెట్టాలా? ఇంటూనా? ఊహూ. ఇప్పుడున్న బర్డెన్ లో అది కుదరదు.

అలా వరసగా వేసుకుంటూ వచ్చాక, రాత్రి త్వరగా పడుకుంటే గానీ పొద్దున్న 4 కి లేవలేను అని  అర్థం అయింది.

ఎందుకో ఒక్కసారి చప్పున ఏడుపు వచ్చింది.

నీరసం తరుముకు వస్తుంటే, లేచి లాప్టాప్ తెరిచి పత్రికకి మెయిల్‌ పెట్టింది

కొన్నాళ్ళు ఆర్టికల్  రాయలేను. ఇదీ సారాంశం.

తాను యాక్టివ్‌గా వుండే సోషల్ ప్లాట్‌ఫామ్స్ లో స్టేటస్ అప్‌డేట్‌ చేసింది. కొన్నాళ్ళు సెలవు.

….

….

….

పొద్దున్నే బలవంతంగా 4 గంటలకి లేవాలని చూసింది. కానీ, మొదటి రోజు కదా అయిదయ్యింది లేచేటప్పటికి. ఫ్రెష్ అయ్యి గబగబా వాకింగ్ కోసం బయలుదేరింది. బయట గేట్ దగ్గర పెట్టిన పారిజాతం అప్పుడే పూలు పూస్తోంది. అప్పుడే మొదటిసారి గమనించినట్లు కింద పడిన పూవు తీసి గాఢంగా  వాసన పీల్చింది. ఇంకా సూర్యుడు రాలేదు. స్ట్రీట్ లైట్ వెలుతురు లోనే నెమ్మదిగా నడవడం మొదలెట్టింది. కాలనీ లో అక్కడక్కడా రోడ్డు పక్కన చెట్ల కింద బెంచీలు ఉన్నాయి. నొప్పి చాలా వరకు తగ్గింది. ఎక్కడో కాస్త కలుక్కుమంటోంది. నడవలేకపోతే కాసేపు పక్కన కూర్చుందాం అనుకుంది.  అమెజాన్ లో కొనుక్కున్న  కొత్తపుస్తకం వినడం మొదలెట్టింది.  ఇంతలో ఫోన్ వచ్చి ఆడియో ఫైల్ పాజ్ అయింది. పనమ్మాయి ఫోన్. ఎవరో బంధువులు చనిపోయారని, రెండురోజులు రాననీ కబురు. ఒక్క క్షణం ఆమెకి విషాదంగా అనిపించింది . కానీ, ఎప్పటిలానే ఆ మాటల్నీ, విషాదాన్నీ ఎక్కువసేపు మనసులో వుంచకుండా తీసి పారేసింది.

ఒకవేళ తను యిప్పటిదాకా చదివినవి, లేక తను చదివి తన స్నేహితులకి చెప్పినవి కాస్త ప్రాక్టీస్ చేసినా అంత యిల్లు, అంత స్ట్రెస్ ఇంత  అనారోగ్యం ఏదీ ఉండేది కాదు. కానీ తనకీ భద్ర జీవితమే కావాలి. తను చాలా సక్సెస్‌ఫుల్‌ అనిపించుకోవాలి. తాను కూడా ఒక టిపికల్ స్త్రీ.

వదులుకోలేనివి అని యిన్నాళ్ళూ అనుకున్నవి చిటికెలో వదిలేసింది. కానీ, వదల్లేని పనులు తరుముతున్నాయి ఆమెని.

నడక మొదలెట్టిన అయిదు నిముషాల నుంచి వాచ్ చూసుకుంటోంది..

శరీరం, మనసు, కాలం ఒకే కక్ష్యలో తిరుగుతూ  సముదాయిస్తే ఎంత బాగుంటుందో.

చివరి గిన్నె కడిగి సింక్ శుభ్రం చేస్తుండగా మొబైల్ లో ఫిక్స్ చేసుకున్న వాయిస్ ఎలర్ట్ మోగింది. ” ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఓవర్”

విరక్తి గా నవ్వుకుంది.

“ఇప్పుడా నలభై అయిదు నిమిషాలు కోసం నా రోజులో 25 వ గంట రావాలి”.

*

ఉమా నూతక్కి

వృత్తి రీత్యా ఎల్ఐసి లో Administrative Officer ని. పుస్తకాలు చదవడం ఇష్టం. నచ్చిన భావాలను స్నేహితులతో పంచుకోవడం ఇష్టం. ఏ ఇజాన్నీ అనుసరించలేక పోవడం, ఏ చట్రం లోనూ ఇమడ లేక పోవడం. నా బలం నా బలహీనతా ఇవే.

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఈ అనవసరపు బరువులు దించుకుంటే తప్ప “మన సమయం” ఎప్పటికీ మనకు దొరకదు. Thought provoking story 😍❤️

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు