శంఖ ఘోష్ కవితలు రెండు

లాలస

ఈ నిశ్శబ్ద ఏకాంతం  ముసురుకొన్న వేళ

ఒంటరిగాలి  యధేచ్చగా తూగుతున్న  ఈ మునిమాపువేళ

విశాలగగనం దిక్కుగా తలతిప్పుతావు నువ్వు–

కళతప్పినముఖంతో, ఉదాసీనమేఘంలా, మసకచంద్రునిలా—

 

సుదూరతీరాల, నేను- మోయలేని కాంక్షా యాతనతో చలించిపోతాను

చీకటిగాలిలో నీ అమాయకముఖాన్ని కప్పేసిన పలుచటిముంగురులు

తుళ్ళిపడుతున్నాయి

ఆవేదనలో నివేదనలో పాలుపంచుకొంటున్న వేలవేళ్ళలా —

 

గుంపుకట్టే మబ్బులతో నింగి ఒడి బరువెక్కుతోంది

పదేపదే మెరుపుల్లా నిర్దయగా రగులుతోంది వాంఛ.

అతిశయ పారవశ్యంలో ఊగిసలాడాలని

హద్దుల్లేని చీకటిదూరాల్లో

చలించలేనితీరం చింతాఛాయలో,

వలపుటలల ఆరాటం.

తలతిప్పుతావు నీవు,

ఉదాసీనమేఘంలా, మసక చంద్రునిలా !

ఉదాసీనతతో విసిగి రోదించిన అవని

నిట్టూరుపులే, నీ ఎద లహరులు

చిరకాల నిరీక్షణలో, వేసారిన ప్రార్ధనలో

నీరసించిన బాహువులను ఆత్రంగా చాపుతావు

విశాలమైన ఆ అల్లరి ఆకాశం వైపుగా !

 

అనంత ఏకాంత వాయువులో

వారిని ఆవరించిన నిగూఢ తిమిరం,

కురుల మెలికలమర్మాలు,

వేనవేల సంగీతసుస్వరాలు.

 

మెల్లమెల్లగా సృజన చివురించే సమయమవుతోంది..

ఆకాంక్షతో ఉప్పొంగే  మీఎదల లోతుల్లోకి

మహాఘోషతో, ఉరుములతో, పిడుగులతో

కామనా మేఘాలు ఉరికి, కరిగిన

ఆ ఒకానొక పరమానందకర మధురక్షణం

పరిపూర్ణంగా ధన్యమయ్యే సమాగమం–

అప్పుడు, పతనమైన చిత్తడినేల నుండి

అహేతుకమైనదంతా పెకలించబడుతుంది.

ఆపైన, ఆపైన

ప్రభవిస్తుంది

ప్రసన్న ప్రశాంత ప్రభాతం!

*

 

తాగుబోతు

అతన్ని ఇంకాస్త తాగనివ్వండి

అలా కాకుంటే

ఈ ప్రపంచాన్ని ఎలా భరించగలడు?

నేస్తం! అతనింకా కుర్రాడే!

ఎదగనివ్వండి, అప్పుడు.

అట్లైతేనేగదా

ఈలోకం అతన్ని సహించగలిగేది.

బెంగాలి: శంఖ ఘోష్
ఇంగ్లీష్ : అరుణవ్ సిన్ హా
తెలుగు : ప్రసాద్ బొలిమేరు

*

ప్రసాద్ బొలిమేరు

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు