వ‌క్క‌పొద్దులు మా ఇంటా వంటా కాదు!

రంజాన్ పండ‌గంటే మాయ‌మ్మ గుర్తుకొచ్చాది. మాయ‌మ్మ గురించి ఆలోసిచ్చే ఏడుపు, భ‌య‌మూ త‌న్నుకోనివ‌చ్చాయి.

నేను పిల్ల‌ప్పుడు–

మాయ‌బ్బ రంజాను పండ‌గ‌కు సిమాపల్లెకు మ‌సీదుకాడికి పోతాండ‌.
మా నాయిన పోతాండ మ‌సీదుకు.

మా ఊర్లో ఉండే మా నాయిన పెద‌నాయిన కొడ‌కులు.. ఉండే ఐదిండ్లోళ్లు ప‌నులు సేచ్చారు. క‌ష్ట‌ప‌డ‌తారు. ఒక్క రంజాన్ పండ‌గ‌కే మ‌సీదుకు అందురు న‌డుసుకుంటా, క‌లిసి పోతాండ్రి.

మా దేవుడు గూగూడు కుల్లాయ‌సోమి. అనంత‌పురం జిల్లా నార్ప‌ల ద‌గ్గ‌ర ఉండే గూగూటికి పీర్ల‌పండ‌గ‌కు ప‌తి సంవ‌చ్చ‌రం త‌ప్పోకుండా పోతారు. యాట‌లు పెట్టుకుంటారు. కొందురు పిల్లోల్ల‌కు ఎంటిక‌లు ఆడ‌నే తీయిచ్చాండ్రి. ఆడ‌నే ఉండి సిన్న శెరిగిత్తు, పెద్ద శెరిగిత్తు చూసుకోని పీర్లు ఏటికి పోయినాక ఇంటిదావ ప‌డ‌తాన్యారు. గూగూడు రాజ‌కులాయ‌ప్ప సోమి అంటే మా వాళ్ల‌కు అంత పాణం. అయితే రంజాన్ పండ‌గ‌కూడా మీదే క‌దా అని మా ప‌క్క‌నుండే స‌మాజం. ఊర్లో ఉండాకండి ఒక్క‌సారి మ‌సీదుకు రాండి అని చెప్పే ఖాజీసాబ్‌ల మాట‌లు ఈళ్ల‌ను రంజాన్ పండ‌గ‌నా పొద్దు మ‌సీదుకు ప‌ట్ట‌క పోతాయి. ఈ ఇష‌యం మాయ‌మ్మ చెప్పింది.

రంజాన్ పండ‌గకి ముందు వ‌క్క‌పొద్దులు ఉండ‌టం మా ఇంటా వంటా కాదు. అస‌లు మా ప‌క్క దూదేకులోళ్లు ఎవ‌రూ ఉండ‌రు. ఎవుర‌యినా గ‌డ్డాలు పెంచి, అర‌బిక్ చ‌దివినోళ్లు ‘రోజా’ ఉంటాము అంటాంటిరి. ‘ఏంది.. మీరు ఉండ‌రా. అల్లాను న‌మ్ముకోవాలి. అల్లా కోసం మనం మారాల‌’ అనేవాళ్లు. పెద్దోళ్ల‌కు ప‌నులు చేయందే ఇండ్లు గ‌డ‌వ‌దు. పిల్లోల్ల‌కు ఆక‌లి ఎక్కువ‌. ఆడోళ్ల క‌ష్టాలు అలివిగావు. కూలి ప‌న‌ల‌కు పోనిదే కుద‌ర‌దు. క‌రువు జిల్లాలో ఆక‌లి ఎక్కువై తినేవాళ్లు ఎక్కువుండారు కానీ ఆక‌లి దిగ‌మింగుకోని, ఎంగిలికూడా ముయ్య‌కుండా, నీళ్లు తాగ‌కుండా ఉండటం ఎవ‌రి చేతా అయ్యేది కాదు. మా క‌ల్ల రోజా ఉండే వాళ్లు ఆధునికులు. వ‌క్క‌పొద్దు వొక్క‌రోజు కూడా ఉండ‌నోళ్లు మొర‌ట‌నాకొడుకులు.

రంజాన్ పండ‌గొచ్చాంద‌ని క్యాలెండ‌రులో డేటు సూసి, సిమాప‌ల్లెకు పోయిన‌పుడు పండ‌గ ఎప్పుడు ప‌డ‌తాదో సెప్పించుకోని వ‌చ్చాండ మా నాయిన‌. రంజాన్ పండ‌గ ముందు రోజు ఊర్లో మేక‌పోతులు, పొట్టేల్లు మిద్దెసాయిబు వాళ్లు కోచ్చాండిరి. త‌లా ఇంత తీసుకుంటాంటిమి. ఒక్కోపారి  ప‌ద్ద‌న్నే సిమాప‌ల్లెకు పోయి కోడిసీలు(చిక‌ను), పొట్లిసీలు (మ‌ట‌ను) ఇంత తెచ్చి మ‌ల్ల నీళ్లు పోసుకోని మ‌సీదుకు పోతాండ మా నాయిన‌. న‌న్ను పిల్చ‌క‌పోతాడేమోన‌ని బ‌య‌ట బ‌య‌టే తిరుగుతాంటి త‌ప్పించుకుంటా. చ‌క్కా గుడ్డ‌లు కుట్టే టైల‌రు ద‌గ్గ‌రికో పోతాంటి అట్ల బ‌య‌టికి. మా నాయిన మ‌సీదుకు అట్ల పోతానే కోడిసీలు, పొట్లిసీలు కురాక్కు పొయ్యి అంటించ్చాండ‌. మ‌ల్ల పాలు పోసి సేమాల కీరు చేసేది. తిర‌వాత బువ్వ‌, ఉత్త‌బువ్వ ఇంత సేచ్చాండ‌. మా నాయిన మ‌సీదుకు పోయి వ‌చ్చినాక కీరు తిందువులే. సదింపులు సేయాల అని మాయ‌మ్మ అంటాండ‌. తింటే ఏమ‌యితాది అని అలిగి నుల‌క మంచంమీద ప‌నుకుంటాంటి. చూడ‌లేక మాయ‌మ్మ నాకు కీరు పెట్టేది. అది తియ్యగుంటాద‌ని తిన‌క‌పోయేవాన్ని. రోంత తిన్యాక నాకొద్దుపో అనే వాడ్ని.

మ‌సీదుకాడ‌నుంచి ఇంటికి ప‌ద‌కొండుకు వ‌చ్చానే స‌దింపులు సేచ్చాండ మా నాయిన‌. నేను సీలు తిన‌న‌ని మాయ‌మ్మ అదే ప‌నిగా నా కోస‌రం పొప్పు, సెన‌గ‌క‌ట్టు సేచ్చాండ‌. సీలు తిన‌మ‌ని బ‌తిమాలినా తినేవాడ్ని కాదు. జీవ‌హింస పాపం అంటాంటి. సీల‌వాస‌న ప‌డేది కాదు. నేను ప‌ప్పుతో తిన్యాక ‘ఇంగ పోయి గొల్లోల్ల‌ను, బ‌డికాడ అయివార్ల‌ను పిల్చ‌క‌రాపో’ అంటాండె. మాయ‌మ్మ, మా నాయిన మా బ‌జార్లో వాళ్ల‌ను రెండుమూడు మాట్లు పిలిచ్చే క‌దిలేవాళ్లు. అంద‌రితో పాటే మా నాయిన తింటాండె. అందురూ తిన్యాక *మీరు రంజాన్ పండ‌గ బాగా సేచ్చారు. ప‌ర్వాల‌* అంటా వాళ్లు పోతాండిరి. వాళ్లు ఇంటికి పోయినాక మాయ‌మ్మ తింటాండేది. ఒక్కోసారి మాయ‌మ్మ‌కు తిన‌టానికి సీలు కూడా ఉండేవికావు. పుల్చుతో తింటాండ‌. అట్లాంటి బీద‌రిక‌పు రోజుల‌యి.

పండ‌గ పండ‌గ‌కూ ప‌దిమందికి పెడితే పుణ్య‌ముంటాద‌ని మాయ‌మ్మ సెప్తాండ‌. ‘వొమా.. వాళ్లేమ‌న్నా మ‌న‌కు ఉగాది పండ‌గ‌కు, దీపావ‌ళికి సీలు ఏపియ్య‌రు, మ‌నం ఎందుకు పెట్టాల‌’ అని అడుగుతాంటి. ‘మ‌న‌మూ ఆ పండ‌గ‌లు సేసుకుంటాం. దూదేక‌లోళ్లం కాబ‌ట్టి రంజాన్ చేసుకుంటాం. మ‌న‌కు ఇదీ, బ‌క్రీదే క‌దా. మన పీర్ల‌పండ‌గ‌కు మ‌నం ఈడ ఉండం. సోమికాడ‌కి పోతాం. అయినా రాజావ‌లి.. ఏదైనా తిండి తిని ఏరిగితే పోతాది. మంచిత‌న‌మే, మాన‌వ‌త్వ‌మే చ‌చ్చినాక మ‌న ఎన‌కంబ‌డీ వ‌చ్చేది’ అని ఓ పారి నాకు మాయ‌మ్మ బుద్ధి సెప్పినాది. ఆ పొద్దునుంచి తిండికాడ అసూయ నాలోంచి మా ఊరు దేలంతిక్కు దెంకోని పోయినాది… వ‌ల‌క‌లు ఆత‌ట్టుకి.
ఏడో త‌ర‌గ‌తి నుంచి ‘మ‌సీదుకుపో’ అంటాండ‌.
 నేను పోను, వాళ్ల బాష రాదు. తురుకోళ్లు న‌గుతారేమో. న‌మాజు రాదు. ఎట్ల వంగాలో తెలీదు అన్యా. అది విని మా నాయిన ‘మీయ‌బ్బ‌కు న‌మాజు రాదు. నాకు రాదు. అయ్య చెప్తాంటాడు. ఆయ‌ప్పను చూసో, మ‌న చుట్టూ వాళ్ల‌ను సూసో సేచ్చే అయిపాయ‌’ అన్యాడు.

‘ఏమో నా నాకు బ‌యం* అన్యా.

‘పోతాంటే అదే వ‌చ్చాది’.
ఆ త‌ర్వాత సంవ‌చ్చ‌రం మ‌సీదుకు ఎగ్గొట్టినా. తొమ్మిదో త‌ర‌గ‌తి నుంచి డిగ్రీ వ‌ర‌కూ రంజాన్ పండ‌క్కు పోతే పులింద‌ల‌కు పోతాంటి, ల్యాకుంటే ఇంట్లో అట్ల‌నే ప‌నుకుంటాంటి బ‌య‌ట‌కు రాకుండా.
బ‌య‌టికొచ్చే ‘మ‌సీదుకు ప‌దాం పా’ అని పోయేవాళ్లు అంటారేమోన‌ని.., ల్యాకుంటే ‘మ‌సీదుకు పోలేదా’ అని బ‌జార్లో వాళ్లు అడుగుతార‌ని నేనంత‌కు నేనే ఊహిచ్చుకోని బ‌య‌ప‌డి బ‌య‌ట‌కి రాకుండా ఇంట్లో దూరుకుంటాంటి.

పులింద‌ల‌కు ర‌మ్మ‌ని మా మామ సెప్పంపిచ్చే జ‌మ్మంగా పోతాంటి.
పులింద‌ల్లో ఉన్య‌ప్పుడు రంజాన్ రోజున ప‌ద్ద‌న్నే లేచి మా పెద్ద‌మ్మ కొడుకు ఈర‌య్య‌, మా చిన్న‌మ్మల కొడుకులు రియాజు, బాబా ష‌రీఫు ఇట్ల అంద‌రం క‌లిసి శ్రీరామ హాలుకాడ ఉండే పెద్ద మ‌సీదుకు పోతాంటిమి. సిరిచాప‌లు, బంత‌లు, ర‌గ్గులు తీస‌క‌పోతాంటిమి మ‌ట్టి అయితాద‌ని. ఆటికి పోయినాక బ‌య‌ట చెప్పులు ఇడిచ్చే యాడ‌పోతాయోన‌ని అంద‌రం ఒకే చాట ఇడుచ్చాంటిమి. కొత్త చెప్పులు పోతాయేమోన‌ని బ‌య‌ప‌డ‌తాంటి నేను. మాటి మాటికి అట్ల ఓ క‌న్నేచ్చాంటి. మా మామ బాబు బంగారు ప‌నివాడు. త‌న స్నేహితులైన బంగారు అంగ‌ళ్లోళ్లు అంద‌రం ఒక‌చాట‌నే కూకుంటాంటిమి.

మైకులో న‌మాజు చ‌దువే ఖాజీసాబు *కూర్చోండి బెరీన‌, ఆడ త‌లం ఉంది. అక్క‌డ లైను సొట్ట ఉంది. దూరంగా కూర్చోవాకండి. వ‌ర‌స‌లు పూర్త‌యినాక ఎన‌క్కి పోండి* అంటాండిరి.
బెరీన న‌మాజు అయిప‌జేసుకోని ఇంటికి పోవాల‌ని లేదా అని మైకులో అరుచ్చాండిరి.

అందురూ కుచ్చున్యాక న‌మాజు స్టార్టు సేచ్చాండ‌. అంత‌లోకే అంద‌రం మూతిగుడ్డ కోనుమాదిరి మ‌డిచి నెత్తికి టోపీ మాదిరి క‌ట్టుకుంటాంటిమి. రానోళ్ల‌కు పెద్దోళ్లు క‌డ‌తాండిరి. నేను ప‌క్క‌ల‌కు, ఎదురుగ్గా చూసి సేచ్చాంటి. ఆ అర‌బిక్ ప‌దాలు అర్థ‌మ‌య్యేవి కావు. వేల‌మంది ఒక‌చోట గుంపుగా న‌మాజు సేచ్చాంటే.. అల్లాహు అక్బ‌ర్ అనే శ‌బ్ధంలో ఏదో గొప్పత‌నం ఉంద‌ని అనిపించేది. గుండుసూది ప‌డినా శ‌బ్ద‌మొచ్చేట్లు ఉంటాండ‌. మైకులో మాత్రం అయ్య న‌మాజు చ‌దివ‌చ్చాండ‌. చిన్న‌పిల్ల‌లు అట్లే కూర్చోని ఉండే వాళ్లు, న‌మాజు చేసేవాళ్లు నాయిన‌గారి ప‌క్క‌న కూర్చుంటాండిరి. న‌మాజు అయినాక ఒక‌రికొక‌రు క‌ర్సుకున్యాక నిమ్మ‌ళ‌మ‌య్యేది. కొంద‌రు దూదేక‌లోళ్లు తురుకోళ్ల‌మాదిరి కావాల‌నే హిందీ మాట్లాడ‌తార‌ని మా మామ సెప్పేవాడు. తుర‌కం నేర్చుకుంటే మ‌న‌కు ఇల‌వ ఇస్తారు అంటాండె. ఒక్కోపారి  పులివెందుల మ‌సీదులో ముంద‌ర కూర్చోన్న వాళ్లు ఉంగ‌రాలో, మెడ‌లో గొలుసులో, బ్రాస్ లేట్లో పెట్టుకోని ఉంటే.. ‘మీరు మార‌రు. ల‌ద్దాఫీలు బంగారు ఏస‌క‌చ్చుకుంటారు. ఎంత సెప్పినా ఇన‌రు. బుర్ర ఉప‌యోగించండి. మ‌నం బంగారం వేసుకోని మ‌సీదులోకి రాకూడ‌దు’ అంటూ తిట్ల‌కు వేసుకునేవాళ్లు మ‌సీదులోని తురుకోళ్ల పెద్ద‌లు. అందుకే మ‌సీదు స్టార్టు అయితానే కొంద‌రు ఉంగ‌రాలు ప్యాంటు జోబీలో ఏసుకుంటాండిరి. వాళ్లు అరుచ్చారేమోన‌ని భ‌య‌ప‌డ‌తాండ్రి. నేను మ‌సీదుకు పోయిన సంవ‌చ్చ‌రం ఏదో సాధించిన‌ట్లు బిల్డ‌ప్పు కొడ‌తాంటి, గ‌ర్వంగా ఉంటాండ‌.
రంజాన్ పండ‌గ మ‌న‌ది అని మాయ‌మ్మ‌, నాయిన మ‌న‌స్పూర్తిగా న‌మ్మ‌ల‌. అయితే అంద‌రి ప‌కారం న‌డుచుకోవాల అంటాండిరి. తుర‌కోళ్ల మాద‌రి మ‌నం సేసుకోలేమా అనేది. ప‌దిమందికి భోజ‌నం పెట్టే రంజాన్ పండ‌గ మా జీవితంలో మెల్ల‌గా భాగ‌మైంది. అయితే హైద‌రాబాద్ కి వ‌చ్చినాక మ‌సీదుకు పోకుండా రూమ్‌లో ప‌డుకుంటాంటి. ‘పండ‌గ పూట ఏమి ఖ‌ర్మ‌. ఊరికి వ‌చ్చింటేమి’ అంటాండె మాయ‌మ్మ‌. ఒక‌ట్రెండు రంజాన్ పండ‌గ‌లు ఊర్లో సేసుకున్యాం. ఖ‌చ్చితంగా(2010)రంజాన్ పండ‌గ వ‌క్క‌పొద్దుల్లో మాయ‌మ్మ‌కు ఆరోగ్యం బాగాలేక హైద‌రాబాద్‌కి వ‌చ్చినాది. బ్రెయిన్ ట్యూమ‌ర్ స‌ర్స‌రీ టైంలో హైదరాబాద్ హ‌లీమ్‌, పండ‌గ సంద‌డి చూసి మాయ‌మ్మ మురిసిపోయినాది. మాకు ఆ సంవ‌చ్చ‌రం పండ‌గ‌లేదు ప‌బ్బ‌మూ లేదు. ఆ త‌ర్వాత మాయ‌మ్మ‌కు ప‌చ్చ‌పాతం వ‌చ్చింది. కాళ్లు స‌చ్చుబ‌డినాయి. బాగయినాక ఊరికి పోయినాం. త‌ర్వాత సంవ‌చ్చ‌రం మాయ‌మ్మ ప‌క్ష‌పాతం వ‌చ్చింద‌ని పండ‌గ ఏంటికిలే అనింది. ఎందుకూ అన్యా. ఒక‌ప్పుడు మాద్దిరి కాదు అనింది. మా నాయిన ఆ సంవ‌చ్చ‌రం మ‌సీదుకు పోయినాక నేను మాయ‌మ్మ‌తో య‌వారాలు సేచ్చాండ‌. న‌మాజు అయినాక సీలు తీసుకోని వ‌చ్చినాడు. మాయ‌మ్మ చేసినాది. తిన‌టానికి పిలిచ్చే ఎవ‌రూ రాలేదు. అంద‌రం తిన్యాం అన్యారు.
నేను బాగున్య‌పుడు అంద‌రూ వ‌చ్చినారు. ఇప్పుడు బాగ‌లేను. నేను చేసింది తింటే రోగం వ‌చ్చాదేమోనని వాళ్ల‌కు భ‌యం. ఇంక మ‌న జీవితంలో రంజాన్ పండ‌గ‌లు లేవు* అన్యాది. ఎంతో నమ్మిన త‌న స్నేహితులు, బంధువులు.. క‌నీసం ప‌ల‌క‌రించడానికి కొంద‌రు రాలేదు. మాయ‌మ్మ చానా బాధ‌ప‌డింది. ‘మ‌నుషులు బాగుంటేనే ప‌ల‌క‌రిచ్చారు. మంచం మీద ప‌డితే పంకియ్య‌రు’ అన్యాది. అట్లెందుకు అంటావంటే.. ఇదిలోకం రీతి అన్యాది. లాభముంటే మ‌న ఇండ్ల‌కు వ‌చ్చారు. ల్యాకుంటే క‌న్నెత్తి కూడా చూడ‌రు. ఎప్పుడూ ఈ కాలం నాకు ఉంటాదా. నాకు కాళ్లు బాగా రావా అన్యాది మాయమ్మ ఏడుపు మ‌గంతో.

త‌ర్వాత నా పెండ్లి నాలుగేండ్ల‌కు అయినాది. పెండ్ల‌యినాక అత్త‌గారింటికి రంజాన్ పండ‌గ‌కు పోయేవాణ్ని.

ఈడ ఎందుకులే పులింద‌ల‌కే పో అంటాడె మాయ‌మ్మ‌నాయిన‌. ఒక‌ట్రెండు మాట్లు హైద‌రాబాద్‌లో ఉన్యాం. రెండేండ్ల కింద‌ట మాయ‌మ్మ పాణం ఇడిచినాది. మాయ‌మ్మ‌తో క‌లిసి ప‌క్ష‌పాతవాయి వ‌చ్చినాక రంజాన్ స‌మ‌యాన్ని గ‌డిపే అవ‌కాశం రాల నాకు. మాయ‌మ్మ పోయినాక రంజాన్ అంటే బాల్యంలో మాయ‌మ్మ వండిన వంట‌లే గుర్తొచ్చాయి. ఇప్పుడు తింటాన సీలు. అయితే వండిపెట్ట‌డానికి మాయ‌మ్మ లేదు. ఇప్పుడు మ‌సీదు బ‌యం పోయింది. మ‌సీదుకు పోతాన‌.
మా నాయినా నా పిల్ల‌ప్ప‌టినుంచి మ‌సీదుకు సిమాప‌ల్లెకు పోతానాడు. ఆడ మా చెల్లెలు ర‌జియా ఇంటికి పోతాంటాడు. నేను ర‌మజాన్ పండ‌గ‌కు యాడుంటానో నాకే తెల్దు.

మ‌సీదుకు పో.. మ‌సీదుకు పో అని మాయ‌మ్మ బంగ‌పోతాండ‌.

నేను ‘పోనుపో’ అంటా గ‌దురుకుంటాంటి మాయ‌మ్మ‌ను. ఈ సంవ‌చ్చ‌రం మ‌సీదుకి పోలేను క‌రోనా ఉంది కాబ‌ట్టి.

పెద్ద‌యినాక .. మాయ‌మ్మ సూడంగ‌.. నేను మ‌సీదుకు పోలాక పోతినే అనే బాధ న‌న్ను జీవితాంతం వేధిచ్చాంటాది.
అందుకే రంజాన్ పండ‌గంటే మాయ‌మ్మ గుర్తుకొచ్చాది.
మాయ‌మ్మ గురించి ఆలోసిచ్చే ఏడుపు, భ‌య‌మూ త‌న్నుకోనివ‌చ్చాయి.

*

 

రాళ్ల‌ప‌ల్లి రాజావ‌లి

రాళ్ల‌ప‌ల్లి రాజావ‌లి

18 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • Memories are the real and permanent assets which will be with us forever. Memories are mix of good and bad. Of course we have some regrets too.
  Festival means sharing joy with near and dears.
  Bro, your narration of the past events and happenings is emotional and heart touching.
  Your mother,though uneducated,seems a great philosopher. From your writings ,I understand that your mother is everything to you. You are more attached to your mother.
  From this ,one thing is clear that you are secular in your thoughts. You are one such secular among a few.
  It was heartening that the neighbors didn’t attend Ramjan feast when your mother was ill.
  On the whole ,the narration reflected your thoughts around festival,mother,and delicious food ,mosque etc. Keep going ,Bro!

  • Thankive so much sir. నాలోని ఆలోచనను అందుకున్నారు. మీ లాంటి గొప్ప పాఠకుడు దొరకడం నా అదృష్టం!

 • మనుషులు బాగుంటేనే పలకరిస్తారు మంచమీదుంటే పంకియ్యరు👍👍👌👌అమ్మ చుట్టూ అల్లుకున్న జ్ఞాపకాల పందిరి.. ఆర్థతను దృశ్యామానం చేసిన మంచి కధనం… రంజాన్ శుభాకాంక్షలు రాజా💐💐💐💐💐💐

 • Ranjan panduga gurichi & madyatargathi kutunbalu paristitulu ela untayi baga chepav valli. Mee Amma garu mankunna Danilo naluguriki bojanalu pettalani cheppindi ayamma ku manchi manasu undi.

 • రాజమవలి గారు మీరు చెప్పే పద్ధతి చాలా అద్భుతంగా ఉందండి. మా చిన్నప్పటి స్నేహితుల్ని కలుసుకున్నట్లు ఉంది మీ మాండలీకం,

  మీ అమ్మ గారు చెప్పిన సత్యాలు…. ఇప్పటికే కాదు ఎప్పటికీ నిత్య సత్యాలు. నలుగురికి పెట్టాలి మనం తినాలి, డబ్బుంటేనే ఎవరైనా గౌరవిస్తారు – కాలము ఏ మాత్రం మారలేదు. –

  మొత్తం మీద అ చాలా మంచి కథను చదివామన్న భావనను కలిగించారు. సారీ.. కథ కాదు సంఘటనలను గుర్తుకు తెచ్చారు. – మోహన్ కృష్ణ

 • Padmavathi Vuduthala తిన్నది అరిగి పోత ది, మంచితనం మానవత్వం మిగిలి పోతది అని నమ్ముకున్న అమ్మకి ఆరోగ్యం బాలేనప్పుడు చూడటానికి ఎవరు రాకపోవడం ఆమె ప్రేమతో చేసిన వంట తినడానికి భయపడటం విషాదం అమ్మని మానసికంగా ఎంత కృంగ దీసి ఉంటది ఆరోగ్యం బాలెనప్పుడు మన వాళ్ళు బంధువులు స్నేహితులు చూపించే ఆదరణనే మనిషికి గొప్ప ఔషధం కాదా.

  • బాగున్నపుడు పాలు, పెరుగు, నెయ్యి, సీలు, చనక్కాయలు తీసుకపోయినోళ్లు.. బాగలేనపుడు మరిచిపోయినారు madam . లోకరీతి చూసి మాయమ్మ చానా బాధపడినాది

 • గూగూడు జిల్లా పరిషత్ స్కూల్లో ఐదేళ్ళు టీచరుగా పనిచేశా. కానీ ఏ సంవత్సరమూ పీర్ల పండుగ చూసే అవకాశం రాలేదు. ఎండాకాలం సెలవుల్లో వచ్చేది మొహరం. అక్కడి పిల్లలు ఇప్పటికీ రమ్మని పిలుస్తుంటారు. పులివెందుల మ్యూజింగ్స్ నాక్కూడా ఎన్నో జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నాయి.

  • ధన్యవాదాలు అక్కా మీ స్పందనకు. నేను పిల్లపుడెపుడో పీర్లపండగ చూసినా .

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు