వొకానొక రాత్రి శ్రీశ్రీ………….

శ్రీ శ్రీది భవిష్యత్ వాదం: అంటే, రేపటిని ఈ క్షణాన దర్శించగలిగిన ముందు కాలపు చూపు.

1980.

అప్పుడు కాలేజీ అంటే వొక ఉద్యమం. రోజూ సాయంత్రాలు ఖమ్మంలోని రిఖాబ్ బజార్ స్కూలు ముందో వెనకో కూర్చొని, లోకం మీద ఆగ్రహాన్ని ప్రకటిస్తున్న రోజులు. పట్టలేని ఆగ్రహాన్ని చల్లార్చుకోలేక పక్కనే వున్న కాప్రి హోటెల్లో ఇరాని చాయ్ పంచుకొని “మన సోషలిజం ఇంతవరకేనా? ప్చ్…” అని ఆ పూటకి చప్పరించేసుకొని, రంగు డబ్బాలు తీసుకుని ఖమ్మం గోడల్ని ఎరుపెక్కించిన రాత్రులు. “నీ రాత స్ట్రోక్స్ శ్రీ శ్రీలా వున్నాయి” అని వొకరికొకళ్ళం కితాబులు ఇచ్చి పుచ్చుకునే అమాయక కాలం. కాని, ఇంకా శ్రీ శ్రీ కవిత్వం పూర్తిగా చదవలేదు అప్పటికి.

అలాంటి వొకానొక సాయంత్రం చీకటి వైపు పరుగు తీస్తుండగా…

అది చరమ రాత్రి అయితే బాగుణ్ణు అనిపించిన రాత్రి అది. ఆ రాత్రి శ్రీ శ్రీని కలిశాను. ఆయన వొక నిజం నిషాలో, నేను మరో రకం నిషాలో వున్నాం. ఆలోచన అలలు మాటల రూపంలో కొన్ని సార్లు అందంగా పెనవేసుకుంటున్నాయి.

ఆ రాత్రి మా ఇద్దరినీ కలిపినవాడు జేంస్ జాయిస్. అది కూడా నిజమే! పిచ్చి పట్టినట్టు జాయిస్ రచనలు చదువుతూన్న ఆ సమయంలో నా దగ్గిర వొక అమూల్యమయిన పుస్తకం వుండేది. దాని పేరు ” పిక్టొరియల్ గైడ్ టు యులిసిస్”. పుస్తకం ఎంత అందంగా వుండేదంటే,ఇంటికి తీస్కువెళ్ళి మరీ చాలా మందికి ఆ పుస్తకం చూపించేవాణ్ణి. అది నేను హైదరాబాద్ ఆబిడ్స్ లో వొక ఆదివారం రోడ్డు పక్క ఆ రోజుల్లో నాలుగు వందలు పెట్టి కొన్న పుస్తకం.

మాటల మధ్యలో ఆ పుస్తకం సంగతి చెప్పాక, శ్రీ శ్రీ గబుక్కున లేచి,గబ గబా చొక్కా వేసేసుకొని “ఇప్పుడే ఈ క్షణమే ఆ పుస్తకం చూడాలి” అంటూ నన్ను బయటికి లాక్కు వచ్చాడు.
“మీరు ఇక్కడే వుండండి. నేను తీసుకొస్తా.” అన్నాన్నేను.
“ఇక్కడ వున్నట్టే , రా!” అని హుకుం జారీ చెయ్యగానే నేను నా డొక్కు సైకిలు(చలం గారి భాషలో ముసలి గుర్రం) మీద రెక్కలు కట్టుకుని యెగిరిపోతున్నట్టుగా, రివ్వున దూసుకుపొయి, ఆ పుస్తకం తెచ్చి శ్రీ శ్రీకి చూపించడం మొదలెట్టాను. విద్యార్థి రాజకీయాల వల్ల, చదువు వెనక్కి పట్టి, ఇంట్లో అసమ్మతి పవనాల్ని యెదుర్కొంటున్న వొక ఇంటర్మీడియట్ కుర్రాడి అసంత్రుప్త బతుకులో అదొక అపూర్వ క్షణం. చాలా రోజుల శ్రమ, చాలా కన్నీళ్ళు ఆ పుస్తకం సంపాదించడం వెనక వున్నాయి. వొక్క క్షణంలో అవన్నీ యెగిరిపోయాయి.

ఆ పుస్తకంలో జాయిస్ “యులిసిస్”లో వర్ణించిన వూళ్ళూ, భవనాలూ, వాటి చరిత్రా వున్నాయి. ఆ నలుపూ తెలుపూ బొమ్మలు చాలా కాలం నా కలల్లోకి వచ్చి వెళ్ళిపొయేవి. ఒక రచయిత నిజం నించీ ఊహలోకీ, కల నించి తన ఇరుగుపొరుగులోకీ ఎలా ప్రయాణిస్తాడో బొమ్మ గీసినట్టుగా చూపించే పుస్తకం అది.

ఆ చిత్రాల్ని చూస్తూ, తన వృద్ధాప్యంముసురుకున్న వేళ్ళతో ఆప్యాయంగా తాకుతూ ఆ పుస్తకం తను చదివిన అనుభవాల్ని, అసలు తన వచనంలోకి చాలా భాషల చాలా మంది రచయితలు పరకాయ ప్రవేశం చేయడాన్ని ఆయన చెప్పుకుంటూ వెళ్ళాడు. ఆ రాత్రి శ్రీ శ్రీతో కలిసి వుండకపోతే, శ్రీ శ్రీ అంటే చాలా మందికి మల్లెనే నా ఆలోచన కూడా ‘మహాప్రస్థానం’ దాకానో, ‘మరో ప్రస్థానం’ దాకానో ఆగిపొయ్యేది. ఆ రెండు విస్తృతమయిన ప్రపంచాలని కాసేపు పక్కన పెట్టి, వచనంలో శ్రీ శ్రీ ఆవిష్కరించిన తనదయిన ప్రపంచాన్ని అర్ధం చేసుకునే ప్రయత్నం ఈ వ్యాసం.

*
శ్రీ శ్రీ అనే సంతకంలో వున్న ప్రత్యేకత ఏమిటంటే, అది ఎప్పుడూ వొక కొత్త గాలిని వెంటబెట్టుకొని వస్తుంది. దాన్ని ఇప్పుడు మనం “ఆధునికత” అనుకున్నా, ఇంకో పేరుతో పిలిచినా, ఏదో వొక కొత్తదనం కొట్టొచ్చినట్టు కనిపించడం దాని తక్షణ లక్షణం. ఈ కొత్తదనం వస్తువులోనూ, రూపంలోనూ కనిపిస్తుంది. వస్తుపరంగా శ్రీ శ్రీ ఎప్పుడూ రాజీ పడలేదని ఇప్పుడు నేను విడిగా చెప్పక్కరలేదు, కాని, ఆ వస్తు నవీనత ఎలాంటి రూపాల్లో అతని వచనంలో వ్యక్తమయ్యిందో ఇప్పటికీ ఒక సంక్లిష్టమయిన విషయమే. ఒకే దృక్పథాన్ని అంటి పెట్టుకున్న అనేక వస్తువుల భిన్న రూపాల కలయిక శ్రీ శ్రీ వచనం.

వచనంలో శ్రీ శ్రీ – అటు సొంత రచనలూ, ఇటు అనువాదాలూ చేశాడు. అవి రెండూ వొక యెత్తు అయితే, ఉత్తరాల రూపంలోనో, వివిధ వ్యాసాల రూపంలోనో, ప్రసంగాల రూపంలోనో శ్రీ శ్రీ విస్తారమయిన/ సారవంతమయిన వచన సేద్యం చేశాడు. ఆ ప్రతి వచన రచనా విడిగా కూలంకషంగా చర్చించదగిందే. కాని, అది ఒక పెద్ద పరిశోధనా గ్రంధమే అవుతుంది. కాబట్టి, ఆయా వచన రచనలు వడపోసిన వొక సారాంశాన్ని మాత్రమే ఇక్కడ చూద్దాం.

శ్రీ శ్రీ కవిత్వం కానీ, వచనం కానీ వొకే వొక అంతస్సూత్రాన్ని అంటి పెట్టుకుని వుంటాయి. అది శ్రీ శ్రీ భవిష్యత్ వాదం: అంటే, రేపటిని ఈ క్షణాన దర్శించగలిగిన ముందు కాలపు చూపు. శ్రీ శ్రీ కవిత్వం రాస్తున్న కాలానికి అతను మార్క్సిజం చదివాడా లేదా అన్న ప్రశ్న ఇప్పటికీ వుంది. కానీ, మార్క్సిజాన్ని ఒక పుస్తక రూపంలోనో, సిద్ధాంత రూపంలోనో చదవడానికి ముందే శ్రీ శ్రీ చుట్టూ ఒక పారిశ్రామిక వాడ వుంది. కార్మిక సమూహం అతనికి ఇరు వైపులా కాకపోయినా కనీసం వొక వైపు అయినా వుంది. ఆ స్థానిక ప్రపంచంలో శ్రీ శ్రీ లీనం అయి వున్నాడనడానికి అతని జీవన కథనాల్లో చాలా దాఖలాలు చూడ వచ్చు. అది శ్రీ శ్రీ చూస్తున్న వర్తమానం. కాని, అక్కడితోనే నిలిచిపోతే అది శ్రీ శ్రీ వ్యక్తిత్వం కాదు.

స్థానికత, వర్తమానం గీసిన బరిని దాటుకుని వెళ్ళే చూపు శ్రీ శ్రీది. ఒక వలస రాజ్యం సృష్టించిన నగరం విశాఖ. అక్కడి పరిశ్రమలూ, జన జీవనం, కళా సాంస్కృతిక రంగాల మీద ఆ వలస పాలన నీడలు కనిపిస్తాయి. శ్రీ శ్రీకి వాటి స్పృహ కూడా వుంది. కాని, వాటిని దాటి వెళ్ళే వలసానంతర వాదం శ్రీ శ్రీది. ఈ ప్రయాణం మనకి శ్రీ శ్రీ వచనంలోనే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వచనంలో శ్రీ శ్రీ స్థానికతని బయటి లోకంతో ముడి పెట్టే అంతర్జాతీయ వాది. వర్తమానాన్ని విమర్సనాత్మకంగా చూసే భవిష్య వాది.
ఈ వ్యాసాన్ని నేను జేంస్ జాయిస్ పుస్తకం పట్ల శ్రీ శ్రీ చూపించిన అభిమానంతో మొదలు పెట్టాను. జేంస్ జాయిస్ పుస్తకం పట్ల శ్రీ శ్రీ చూపించిన ఆతృతని జాగ్రత్తగా గమనిస్తే, అందులో ఒక శ్రీ శ్రీ సాహిత్య వ్యక్తిత్వానికి సంబంధించిన వొక అంశ వుంది. అది తన పరిసరాలకీ, తన స్థానికతకీ ఎడంగా స్పందించడం! (బహుశా, కొత్త అంశాల పట్ల తెగని ఆకర్షణ కూడా వుంది). తన కాలానికి చెందని వొక ఆలోచనని అందుకోవాలన్న వొక ఉబలాటం వుంది. శ్రీ శ్రీ వచన రచనల్లో నేను ఆ లక్షణం చూశాను. అయితే, ఆ ఆలోచనని తన కాలంతో ముడి వేసి, ప్రయోగించడం శ్రీ శ్రీ దారి. శ్రీ శ్రీ తన వచనాన్ని వూహించే ముందు ఇలాంటి కొంత మంది రచయితలు తనని ఆవహించేంతగా ఆ పఠనంలో మునిగిపోయాడు. కాని, ఆ మునక తరవాత మళ్ళీ వొడ్డుకి చేరడం ఎలాగో తెలిసిన వాడు కనుక, అతని అంతర్జాతీయ దృష్టి మళ్ళీ స్థానికతలోకి క్షేమంగా చేరుకుంది.

శ్రీ శ్రీ వచనంలో అనువాదాలు ఎక్కువే.అవి వివిధ దేశాల వివిధ రచయితలవి. కాని, ఈ అనువాదాలన్నీ ఒక్క సారిగా చదివితే, ఆ విడి విడి లోకాల్ని శ్రీశ్రీ ఒకే సూత్రంతో కట్టే ప్రయత్నం చేసాడని మనకి అర్ధం అవుతుంది, విలియం సారోయన్ మొదలుకొని ఆంటాన్ చెఖోవ్ దాకా. అదే చేత్తో, అతను చిన్న కథల్నీ, నాటికల్నీ, వ్యాసాల్నీ, సంభాషణల్నీ కలిపాడు. అనువాద వచన రచనలు శ్రీ శ్రీలో ఎదుగుతున్న/ క్రమ పరిణామం చెందుతున్న ఒక నవీన పంథాని ఆవిష్కరిస్తాయి. ఈ పనిని రెండు రకాలుగా చేశాడు శ్రీ శ్రీ. ఒకటి: అనువాదాల్ని అందించడం; రెండు: ఆ అనువాదాల వచనాన్ని తన సొంత రచనల్లోకి ప్రయోగించి చూడడం. ఇవి రెండూ విడదీయలేని కోణాలు.

అనువాదంలో శ్రీ శ్రీ ఆయా రచయితల వచన రూపాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తే, తన సొంత రచనల్లో ఆ రూపాలను స్థానిక సంస్కృతికి మార్చి, పరీక్షించి చూసుకున్నాడు. ఇలా చెయ్యడం ద్వారా కొత్త రూపాలు తెలుగు సాహిత్య సాంస్కృతిక వాతావరణంలోకి ఎలా తీసుకు రావచ్చో బేరీజు వేసుకున్నాడు. “చరమ రాత్రి” దీనికి బలమయిన ఉదాహరణ. అది ఎంత బలమయిన వుదాహరణ అంటే, శ్రీ శ్రీ సాధారణ కవిత్వంతో తృప్తి పడని వాళ్ళు కూడా ఆ రచనని వొప్పుకునేంతగా!

అలాగే,ఈ వ్యాసం మొదట్లో నేను సమకాలీన సాహిత్యంతో నా అసంతృప్తిని కూడా చెప్పాను, వొక పాఠకుడిగా! శ్రీ శ్రీ వచన రచన ద్వారా ఏం చెప్పాడన్న దానికి అందులో ఒక సమాధానం వుంది.

శ్రీ శ్రీ వచన రచనలో పాఠకుడు చాలా ముఖ్యమయిన కోణం. తన పాఠక వర్గాన్ని తానే సృష్టించుకున్నాడు శ్రీ శ్రీ. అది ఎలాంటి వర్గం అన్నది అతని కవిత్వంలో కన్నా బలంగా అతని వచనంలోనే కనిపిస్తుంది. అది – పూర్వ సాహిత్య రూపాలని ప్రశ్నించి, కొత్త జవాబులు వెతుక్కునే తరం- పాత భావాలని ధిక్కరించి ఆధునికతని అక్కున చేర్చుకునే వర్గం. ఈ పాఠక వర్గానికి కావల్సిన కొత్త అలవాట్లని నేర్పే అనువాదాలూ, ప్రయోగాత్మక వచనం కొంచెం కొంచెం రుచి చూపించి, అభిరుచిని పెంచిన లాబరేటరీ ఆ వచనం అంతా!

ఈ రోజు శ్రీ శ్రీకి మనం ఇవ్వదగిన కానుక – ఆ వచన పాఠాల్ని తిరగదోడడమే!

(పాత వ్యాసమే…)

అఫ్సర్

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • SriSri is a legendary classic writer. He is a symbol of transformations. His lexicography and narrating style changed according to the times and ideas. I have differences about his idea of economic politics. He ignored the anti caste movements in his living time. For that he must not be rejected and abused. There is a lot of logo world in his writings to be explored and explained still. His vachanam is a theoretical question for me. It needs to be understand from contemporary philosophical and sociocultural linguistics. Your article is provoking to look into his Vachanam. Congratulations for this insightful article.

  • అప్పటి, ఇప్పటి, తదుపరి తరాలు కూడా ఉత్తేజం పొందే కవి శ్రీ శ్రీ. వ్యాసం ఎప్పటిదైతేనేం సర్ చాలా చక్కగా ఉంది. ధన్యవాదాలు & అభినందనలు💐💐

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు