వీరుడు మహావీరడు

-కాళీపట్నం రామారావు

“బలం” 
ఇది ఉన్నవాడు లేనివాడిని అణగదొక్కడం సహజంగా జరిగేదే. 
దాన్ని వినోదంగా చూసి చొక్కా దులుపుకుని పోవడమూ మామూలే. 
అలాంటి పోరాటాలు జరిగేది – వ్యక్తుల మధ్యనేనా? 
జవాబుని అతి గుంభనంగా చెప్పిన కథ – కాళీపట్నం రామారావు మాష్టారి రచన – 
“వీరుడు-మహావీరడు” 
*

“శ్రీరామనవమి సంబరాల్లో గంజిపేట రౌడీకీ, అల్లిపురం వస్తాదుకీ ‘టగ్గాఫార్’ పడింది. ఇద్దరూ హోరాహోరీ కొట్టేసికుంటున్నారు.

గంజిపేట రౌడీ యింతుంటాడు. అంగుళం దళసరి కళ్ళద్దాలెట్టుకు చూస్తే గాని అగుపించడు మనిషి. అయితే నల్లిక నరంలా సాగుతున్నాడు.

అల్లిపురం వస్తాదు సెట్టంత మనిషి. తలుసుకుంటే యీడిలాటి రౌడీలు యిద్దరు ముగ్గురు కాదు – అరడజను మందొస్తే కరకర యిరిసేసి సున్నంలోకి ఎవిఁకి లేకుండా నలిపేస్తాడు. అయితే ఎందుకు పస్తాయిస్తున్నాడూ – సుట్టూతా జనం వున్నారు.

మళ్లా ఆ జనఁవైనా ఎవళూ? ఎవళేనా వయసులో వున్న గుంటల్నేడిపిస్తుంటే యీళ్ళూ ఆ మందలో జేరిపోయి, మర్నాడుదయం అదంతా తమ ప్రతాపఁవే అని చెప్పుకునే యువకబృందమూ; రోజల్లా పులేసా లెనక తోకలు మోసి మోసి అలిసి పోయినాక, పులులు మందుకొట్లకేసిపోతే టీ సుక్కలకి టికాణాలేక యీదురోమని యిళ్లకు పోతున్న మాజీ పుల్లూ, యింటికాడ ఆడంగులు యీదిల తొంగోమంటే నిద్దరట్టక సంబరాల సర్దాలేనా సూద్దాఁవని బజారునపడ్డ బోసిపుల్లూ; కంబైండ్ స్టడీస్‌కని బయల్దేరి నేస్తాలిళ్లల్లో పుస్తకాలిసిరేసి ఈదినపడ్డ కుర్ర విద్యార్థులూ; బేరాల్లేక బెల్లులు మోగిస్తూ కూకునే రిక్షా వోళ్లు; డొక్కు దుకాణాల్లో కప్పులు కడుక్కునే కుర్ర గుంటలూ – యీళ్లే అక్కడున్న జనం.

ఆళ్ల మద్దె నేనే కసింత నదరైన మనిషిని.

నేనేటీ – సంబరం సూదాఁవని బయల్దేర్లేదు. మినర్వాలో జేమ్సుబాండుగాడి పిక్చరొచ్చిందంటే రెండు మైళ్లూ కాళ్లీడ్చుకుని రెండో ఆట సినిమాకెళ్లేను. ఎళ్తే బుకింగ్ బంద్. ఉఁహ్ – రానే వచ్చేనని అలా మెయిన్ రోడ్డున పడి రెండు మూడు పందిళ్లు చూసుకుని, నిద్దర దండుగయ్యిందని తిట్టుకుంటూ యింటికెళ్లిపోతున్నాను. ఇంతలో ఈ స్టంటు సీను తగిలింది.

ఏటర్రా! ఏటి సంగతంటే ఎవడూ సెప్పడు. పదిమందినడిగితే ఒక్కడుగావాల అన్నాడు “ఏదో ఆడపిల్ల తగువు నాగుందండి” అని. ‘ఒహ్హో ‘ అనుకొని, సుట్టూసూస్తే ఏ ఆడపిల్ల కనపడు. ఇంకోడన్నాడు – “ఈడూ ఇంకోడూ తన్నుకుంటుంటే ఆడొచ్చినాడండీ. ఇడిపిచ్చినట్టే ఇడిపిచ్చి ఈణ్ణాడు పట్టేసి ఆ ఇంకోడిసేత తన్నించేసినాడు. అందుకని ఆ కసికొద్దీ సాల్లేనని తెలిసీ, ఈడు అతడితో దెబ్బలాడుతున్నాడు,” అంటూ కసింత క్లూ ఇచ్చేడు.

ఈడు – అంటే గంజిపేట వీరుడు. ఆడంటే – వస్తాదు. మొదట తగువు తెచ్చినోడు ఎప్పుడో జారుకున్నాట్ట. సెప్పొద్దు. నాకు మా చెడ్డ కోపం వొచ్చింది – తంతున్న వాడిమీదా కాదు – తాపులు తింటున్న వాడిమీదా కాదు. చూస్తున్న జనం మీద.

అవునండీ! మీరూ నేనూ తన్నుకుంటుంటే మన తగువేదో మనం సెటిల్ చేసుకోవాల. ఇంకోడొచ్చి ఇంట్రఫియరవడం, అలాటప్పుడు సుట్టూవున్న జనం చూస్తూ వూరుకోడఁవా? ఆడు వస్తాదైతే? ఆడు ఒక్కడు… జనం వందమంది. తలో చేయీ ఏసేస్తే ఏవఁవుతాడు? వస్తాదు కాదు – ఆణ్ణి పుట్టించిన జేజమ్మయినా భూఁవిలోకి దిగడిపోతాడు. అదేం కాదుట, కోడిపుంజులో గొర్రెపొట్టేళ్లో కుమ్ముకుంటుంటే సూస్తారూ, అలా సూస్తన్నారు జనం. పోనీ యీక్వల్ ఫైటా? అదీ కాదు – సముజ్జీ దెబ్బలాడుతున్నారనటే – ఏదో పేద ప్రజ! టికెట్ లెని ఎంటర్‌టైన్‌మెంటు – ఎఫ్ఫెస్‌గా  సూస్తే సూసేరని సరిపెట్టుకుందును.

అడు చూస్తే జమాజెట్టి – అల్లిపురం వస్తాదు ఆరడుగులు పైనేగానీ కిందకుండడు! ఆడు ఒక్కొక్క గిల్లంతా యిస్తే మూడు మూడు పిల్లిమొగ్గలేస్తున్నాడు ఈ గంజిపేట గుంటడు – పడి వూరుకోడే – ‘లంజకొడకా! కొడతావురా! చిన్నోణ్ణిచేసి కొడతావా! ఇడిపించడానికొచ్చి కొడతావా! నీ నెత్తురు కళ్లజూస్తాను,” అంటూ మళ్ళా మళ్ళా పైకొస్తాడు. మళ్లీ ఆడొక్క తాపు తంతే ఎగిరి అల్లంత దూరంలో పడతాడు.

చెప్పకేఁవీ, ఆడి పౌరుషం తల్చుకుంటే నాకిప్పటికీ ఒళ్ళు జలదరిస్తది. గొప్ప పౌరుషంలే. మనిషిని చూస్తే వస్తాదులో నాలుగోవంతు కాదు, పదో వంతేనా ఉంటాడా అనిపిస్తాడు. వస్తాదు ఆరడుగుల మనిషి. తయ్యారీలు గియ్యారీలు, కడుపెక్కతిని, కసరత్ గిసరత్ చేసిన మనిషేఁవో – అంతకో జబ్బా యింతకో తొడా – ఏనుగులాగున్నాడు. ఈడూ వయసులో ఉన్న కుర్రోడే! అయితే ఈ పూతకుంటే ఆ పూటకి టికాణా లేని గంజిపేట సరుకు. ఈడు ఆడితో దెబ్బలాడ్డఁవంటే మాటలేటి! అందులోనూ అంతకు ముందొకడితో కలబడి కొంత చితిగున్నాడు.

అయితే మనిషికా ఫైటింగ్ స్పిరిటు వొకొక్కప్పుడలా వొచ్చేస్తాది. ఎలాటప్పుడు? న్యాయం నీ పక్కనుండాల. అవతలోడు ఫౌలు గేమాడాల. అదేఁవంటే, దౌర్జన్యానికి దిగాల; సూస్తున్నోళ్ళు సీఁవ కుట్టనట్టు మాటాడ కూరుకోవాల! జనం అవతలోడి బలానికి జడిసి అన్యాయానికి నోరెత్తకుండా ఉన్నారని నువ్వు గ్రహించాల. ఆ జనం పిరికితం చూసి ఆడి జులుం మరీ మరీ పెరిగి పోతుండాల. అదిగో అలాటప్పుడు వొచ్చేస్తాది ఎక్కళ్లేని ఫైటింగ్ స్పిరిటూ. అప్పుడు పిల్లి లాటోడైనా పిల్ల పులై పోతాడు. పులి పిల్లలా ఎగిరి ఏనుగు కుంభస్థళఁవైనా అందుకోడానికి పంజాసాస్తాడు.

నీలోనే లొసుగుందనుకో. అప్పుడూ నువ్వు దెబ్బలాడొచ్చు. కాని సందు దొరికితే సాలు, సంధికి రడీ అయిపోతావు.

ఇద్దరు దెబ్బలాడుతుంటే ఎవడిది తప్పని ఎవ్వళ్నీ అడగక్కర్లేదు. అడిగితే ఆడిది తప్పని ఈడూ, ఈడిదే తప్పని ఆడూ, ఎలాగూ సెప్తారు. అడక్కుండా ఆ పక్కన్నిలబడి ఆళ్ళ మొహాల్లోకి చూడు, తప్పెవళదో ఎవడూ సెప్పక్కర్లేకుండానే కరక్టుగా నువ్వే చెప్పేస్తావు.

అందుకే నా సింపతీ అల్లిపురం వస్తాదుమీద కాక గంజిపేట రౌడీ మీదే వుండీది.

ఆ డొక్కొక్క కిక్కిస్తుంటే అది రౌడీగాడి పక్కలో కాకుండా నా డొక్కలో తగిల్నట్టుండీది. రౌడీగాడు కిందపడి లేస్తుంటే ‘అమ్మయ్యా!’ అనుకునే వాణ్ణి. ఈడి దెబ్బలు ఆడికేం తగిలీవి కావు. తగిలిందో పడపడ సప్పట్లు కొట్టీయాలనిపించీది. ఒక్కొక్కసారి ఏఁవనిపించీది తెలుసా, ఏఁవైతదైంది ఎళ్ళి నేనూ వస్తాదుగాడి మీద కలియ్‌బడిపోదునా అనుకునేవాణ్ని. కాని కుదరదు. ఎంచేత? ఏసుకున్న టెర్లిన్ బట్టలు సిరిగిపోతాయ్. ఎన్నడూ దెబ్బలాడినోళం కాం.  ఆడు సూడబోతే వస్తాదు. దెబ్బలాడ్డమే ఆడి బిజినెస్సు. సుఖానున్న ప్రాణం దుఃఖాన పెట్టుకోవడం తప్ప లాభఁవేటి? మళ్ళా అనుకునీవాణ్ణి… ఆడిని మించి పోనక్కరలేదు-ఆడితో సమఁవైపోయినా, ఆడొక్కడూ మేమిద్దరం కాబట్టి ఆణ్ణి కొట్టీసుందుం. నాకెప్పుడూ అనిపించలేదు గాని, అప్పుడు మాత్రం కసరత్ చెయ్యనందుకూ, స్ట్రీటు ఫైటంటే సిగ్గనిపించినందుకూ మహా చెడ్డ విసవిసలనిపించింది.

సరిగ్గా అలాట్టైంలో వొచ్చేడు కొత్తపేట శాండో. కొత్తపేట శాండో అంటే, మీరెప్పుడైనా ఆణ్ణి సూసేరా? ఒకపాలి సూస్తే మరి మరిచిపోరు. అలాటి విగ్రహం ఆ మనిషిది. ఆరున్నర అడుగుల పొడవు, అరవై అంగుళాల ఛాతి. అలాటి మనిషి యిండియాలో ఎక్కడా దొరుకుతాడు? సైంటిఫిక్ లైన్లో పెంచిన బాడీయేమో మోచెయ్యెత్తి గుద్దితే ముప్ఫై టన్నుల రాయైనా ముగ్గు ముగ్గయిపోతాది.

అయితే ఆడు కొత్తపేట శాండో అన్న సంగతి అక్కడా శానా మందికి తెలీదు. నాకూ, నాలాటి వాళ్లే లోకపితలు ఇంకెవరైనా వుంటే ఆళ్ళో కొందరికీ, జనం ఎనక నక్కి నిల్చున్న ఆడి శిష్యులిద్దరికీ తెలుసు. అల్లిపురం వస్తాదు ఎరిగే వుంటాడని ఏరే చెప్పక్కర్లేదు.

నర-నారాయణులు పోరాడే రణరంగభూఁవిలో నారదుల వారిచే పిలువబడి భూఁవికి అవతరించిన పరమశివుడిలా పోజు పెడుతూ వొచ్చేడు శాండో. వచ్చి ‘ఏటిది ‘ అన్నాడు. దెబ్బలాడుతున్నోళ్ళు ఎవళ్లెవళో ఇలాగిలాగ సూస్తూ.

ఆణ్ణి సూస్తూన్న జనం యీడెవడన్నట్టూ, యీణ్ణి తెచ్చిన నారదు డెక్కడన్నట్టూ దిక్కులు పరికిస్తున్నారు. కథ ముదురుద్ది గాఁవాలనుకున్నా న్నేనున్నూ.

అప్పటికప్పుడే నూరుసార్లు మన్ను తిని నూటొకటోసారి లెగడఁవే ఓ ఫీటుగా లెగుస్తున్న గంజిపేట వీరుడు – “లెంజాకొడకా? నే నియ్యాళ నీ సేతులో సచ్చైనా పోతాను గాని, నీ రకతం కళ్ల జూడక మానన్రా” అంటూ తూలి తూలి నిలబడుతూ కొత్తగా దిగిన శాండో కళ్ళ కడ్డఁవైతే యీడెవడన్నట్టు మసక్కళ్ళు అప్పళించి చూసేడు.

“రారా భాడకావ్. నీకు ఏ లంజకొడుకడ్డుపడతాడో నేనూ సూస్తా” అన్నాడు వస్తాదు.

తమాషా తెలుసా? అంతవరకూ చెయ్యీ కాలూ యిసరడం తప్పించి నోరు తెరవలేదు వస్తాదుగాడు. శాండోని చూశాక అలాగన్నాడు.

ఇది గమనించడంవల్లో, ఆ మాట మీద కొత్తపేట శాండో తల తిప్పిన పద్ధతి చూసో, జనం కందరికీ గుండెల్లో రాయి పడిపోయింది. అందరి సంగతెందుకు – నా మటుకు నాకే ఇంకిక్కణ్నించి జారుకోవడం మంచిదనిపించింది.

అయితే – గంజిపేట రౌడీ తగ్గడే! ఆడు అలిసలిసి ఉన్నాడేఁవో మాట మాటకీ జాపోసి పోతున్నాడు. ఏక్షన్ సేస్తూ మాటాడదాఁవవంటే చేతులూ తలా లేవవు. మునిసిపల్ దీపాల ఎల్తురవ్వబట్టి గాని పగలైతే ఆడి మొహం చూడలేవనుకుంటాను. అయినే ఆడి గొంతులో మాత్రం పవరు తగ్గలేదు.

“ఈ లంజకొడుకు యిడిపించడానికొచ్చి తంతన్నాడు; ఈడు, నన్ను-ఒంటిగాణ్ని సేసి – తంతన్నాడు. ఈడి వస్తాదు వొడుపులన్నీ సిన్నోణ్నని నామీద ఇసురుతున్నాడు,”… అని “ఈడు నన్ను సంపీనానికి నెట్టుకున్నాడ్రో”  – అని ఒక్క బొబ్బందుకుంటూ పరూగునెళ్లి ధన్‌మని లెగిసిపోయేడు ఆకాశంలోకి!

అలాంటప్పుడు – కొత్తపేట శాండో… ఎవడు? అంతవరకూ దెబ్బలాడిన అల్లిపురం వస్తాడు కాదు – అప్పుడే వచ్చిన కొత్తపేట శాండో – అమాంతం ఎళ్ళి ఆడి కుడిచెయ్యి టక్‌ని అందుకున్నాడు. జనం కకావికలై చినుకుల్దెబ్బకి చీమల పుట్టలు చెదిరిపోయినట్టు చెదిరిపోతున్నారు. పట్టుకున్న ఆ చెయ్యి వెనక్కి తిప్పుతూ అన్నాడు… ఎవడితో? గంజిపేట రౌడీతో – అంటే దెబ్బలు తింటున్న వాడితో. ఏవనీ?

“ఇంక శాంతించు.”

“ఆ మాట ఆడితో చెప్పు.”

“ఆయన్తో కాదు. నీతోనే చెప్తున్నాను.”

“ఆ మాట ఆడితో చెప్పరా శాండో, ఆడితో చెప్పు. నువ్వు కొత్తపేట శాండోవని నాకు తెల్సు. నీ వెనక బోల్డు బలగం ఉందనీ నాకు తెల్సు. తాపులు తింటున్నది నేను. తంతున్నది ఆడు, ఆడు నన్నే కాదు, నిన్ను కూడా సవాల్ చేస్తున్నాడ్రా! నీ క్కలేజా వుంటే దెబ్బలాడు. నాతో కాదురా ఆడితో, లేదా – తప్పుకో!” అన్నడు ఒక్క బొబ్బెట్టి.

క్షణకాలం పిన్‌డ్రాప్ సైలెన్సు.

ఆ తర్వాత – “సరే, నీమాటే కానీ” అంటూ – మెలిదిప్పిన చెయ్యి పట్టుకుని, చెయ్యినీ, చెయ్యితోబాటు శవంలాంటి ఆ మనిషినీ ఒక్కదుట్న యెనక్కి లాగి ఒకిసురుడు ఇసిరీసేడు శాండో. ఆ దెబ్బకు మూడంతర్లు కొట్టి, తెరిచి పెట్టిన అల్లిపురం వస్తాదు కబంధ హస్తాల్లో పడ్డాడు రౌడీ. ఆడెక్కడెళ్లి పడతాడో తెలిసిన వాళ్లాగ, అతడికి తగిన పని చేసేనన్నట్టుగా వెనక్కి తిరిగైనా చూడకుండా ఎళ్ళిపోయాడు శాండో…”

“తరవాతే వయ్యింది!”

“ఏఁవౌద్ది! రణగొణ ధ్వనీ, సంకులసమరమూ జరిగినవి. గంజిపేట రౌడీ ప్రజల తటస్థ వైఖరిని నిరసిస్తూ ఆడి భాషలో జనంగాళ్లకి అప్పీల్ చెయ్యడం మొదలెట్టాడు. దాంతో జనం రెచ్చిపోయి తలకో చెయ్యీ ఏసీసేరు”.

“ఎవరిమీద”

“మరెవరిమీద, గంజిపేట రౌడీ మీద!”

“… …”

“అవునండీ తనకి తోచనైనా తోచాల. ఒకడు చెప్పినప్పుడు యినుకోనైనా యినుకోవాల, శాండో ఎందుకీణ్ణి సైడు చెయ్యలేదు? ఈళ్ళిద్దరూ అల్లిపురం వస్తాదుని కొట్టలేరనా, ఈడి సాయం కూడా దేనికీ? ఆడు ఊ అంటే ఆడెనకున్న శిష్యులే భక్షించేస్తారు – ఒక వస్తాదుని కాదు, వొరసపెట్టి నలుగుర్ని.

అయితే? అంతతో అయిపోయిందేటి?  అల్లిపురంలో యింక వస్తాదుల్లేరా? ఆళ్లుగాని గాజులు తొడిగించుకుంటారా! గొప్పకి పోయి ఆర్తజన త్రాణమూ, అండర్ డాగ్ పక్షమూ అన్నాడంటే, అప్పుడు కొత్తపేట శాండోల్నందర్నీ దింపాల ముగ్గులోకి.

దింపేడో పుచ్చెలెగిరిపోతాయ్. పోలీసులొస్తారు. ఒకటా గొడవ? రెండో వొరల్డు వారే! టౌన్ హేమాహేమీలంతా ఇన్వాల్వవ్వాల్సొస్తాది.

ఆ ఒక్క క్షణం పిన్‌డ్రాప్ సైలెన్సులోనే యిన్ని పోయింట్లూ ఆలోచించీసేడు కొత్తపేట శాండో. అందుకే “నేగ్గా” ఆ గొడవ అలాగ పీస్‌ఫుల్‌గా సెటిల్ చేసీసేడు. లేప్పోతే అబ్బో ఆ మట్టున శానా గొడవై పోద్ది. అయితే ఇక్కడో సిన్న పోయింటుంది.

అదే – ఆడి ఒంటికే మొప్పం వొస్తే ఆడు అలాగ ఒగ్గీసునా?

ఒగ్గడు. నిజవే. అప్పుడాడి పేటోళ్ళనందర్నీ పిలుస్తాడు. అసలాడు పిలవక్కర్లేదు. ఆడి బక్తులు ఆడు పిలుపక్కర్లేకుండానే అగ్గిలో దూకేస్తారు. బిగ్‌పవర్‌లో ఉన్న ఆకర్షణే అది. మనఁవనుకుంటాంగాని  యే కాలంలోనైనా, ఏ లెవల్లోనైనా బిగ్గూ, స్మాలూ తేడాలు వుండనే ఉంటాయి. ఇప్పిడీ ఎలట్రీ పవరే వుంది. మొదట జనరేటరుంటే కదా – ఈ హీటర్లు, ఇంజనాలు దీపాలెలగడం. మెయిన్ దెబ్బ తినీసిందంటే తక్కినోటికి బతుకేదీ?

కొత్తపేట శాండో లాజిక్కు మనకందదుగాని, అందితే అదే సరైనదనిపిస్తాది. నన్నడిగితే గంజిపేట వీరుడికి ఆ మర్యాద అలా జరగవలసిందే. లేప్పోతేనే ప్రమాదం.

అవును గురూ! అలాటోళ్ళు, ఏటనుకుంటారంటే, జనంజూస్తూ అన్నేయాలు జరగనిస్తారా? అనుకుంటారు. అనుకుని – న్యాయం ధర్మం – అని పెద్ద పెద్ద కబుర్లతో చిక్కుల్లో పడతారు. పడి ఒకళ్లకి తెద్దునా, అందరికీ తెద్దునా అని క్రైసీసులు సృష్టిస్తారు.

ఒక్కసారి జనం సంగతేటో తెలిస్తే మరింకెప్పుడూ అలాటి ఎర్రి కుట్టి ఏషాలెయ్యడు. అందికే ఆడి మంచికోరే నేనూ ఆడి మీద ఓ చెయ్యేసీసేను”.

 

(ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక: 5-4-1968 లో ప్రచురితం)

శ్రీనివాస్ బందా

పుట్టిందీ పెరిగిందీ విజయవాడలో. ఆకాశవాణిలో లలితసంగీతగీతాలకి వాయిద్యకారుడిగా పాల్గొంటున్నప్పుడే, సైన్యంలో చేరవలసివచ్చింది. ఆ యూనిఫారాన్ని రెండు దశాబ్దాల పైచిలుకు ధరించి, బయటికి వచ్చి మరో పదకొండేళ్లు కోటూబూటూ ధరిస్తూ కార్పొరేట్‌లో కదం తొక్కాను. రెండేళ్లక్రితం దానికి కూడా గుడ్ బై చెప్పి, గాత్రధారణలు చేస్తూ, కవితలు రాసుకుంటూ, అమితంగా ఆరాధించే సాహిత్యాన్ని అలింగనం చేసుకుంటూ ఢిల్లీలో నివసిస్తున్నాను.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు