వీరయ్య చెప్పిన మరో విషాద గాథ

    ఫ్రికా సాంప్రదాయం ప్రకారం బిడ్డ పుట్టగానే మొదటి సారిగా బిడ్డ చెవిలో మాత్రమే తన పేరు మెల్లగా చెప్పాలి ఆ తరువాతే సమాజానికి తెలియజేయాలి. తనెవరో తనకే ముందు తెలియాలన్న పురాతన ఆఫ్రికా సాంప్రదాయం వారు యిప్పటికీ పాటిస్తూ వస్తున్నారు. అమెరికాలో వుంటూ ఏడవ తరానికి చెందిన అలెక్స్ హేలీకి తన ముందు తరాల వారెవరో,ఎక్కడ నుంచి వచ్చారో తెలుసుకోవాలన్న జిజ్ఞాస

“ROOTS” అన్న ప్రపంచ ప్రసిద్ధ పుస్తకం రాయడానికి ప్రేరణ అయ్యింది. ప్రపంచ సాహిత్యంలో ఆ పుస్తకం గురించి తెలియని వారుండరు. తెలుగులో “ఏడు తరాలు” అన్న పేరుతో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు సంక్షిప్త అనువాదం కూడా ప్రచురించారు. ఆ కోవలోకి చెందిన పుస్తకమే ఈ “వీరయ్య” నవల. 

     ఈ  రచయిత గుబిలి కృష్ణగారి ముత్తాత వీరయ్య గారు బ్రిటిష్ సామ్రాజ్యపు చెరుకు ఫారాలలో పని చెయ్యడానికి బానిసల స్థానంలో వివిధ దేశాలకు పంపబడ్డ 13 లక్షల భారతీయుల్లో ఒకరు. వీరయ్య గారి గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస కృష్ణ గారి చేత ఈ పుస్తకం ఆంగ్లంలో రాయిస్తే దాన్ని కృష్ణ గారి తండ్రి గుబిలి గురుమూర్తి గారు తెలుగులోకి అనువదించారు. ‌సాహితీ ప్రపంచంలో అరుదైన

 సంఘటన యిది.

2.10.2020 హిందూస్తాన్ టైమ్స్ పేపరులో వచ్చిన వార్త ప్రకారం బ్రిటిష్ పార్లమెంట్ అనుబంధ మ్యూజియంలో 9500 కళా సంగ్రహాలను సమీక్షిస్తూ అందులో 232 కళా సంగ్రహలు బ్రిటిష్ సామ్రాజ్యం 17, 18 యింకా 19 వ శతాబ్దాలలో జరిపిన ఖండాంతర బానిస వ్యాపారంతో సంబంధం వున్నవే అని స్పీకర్ పేర్కొనడం జరిగింది. అంతేకాదు స్పీకర్ తన మాటలలోనే యిలా అన్నారు “…. However, many British people continued to have direct financial gain from the trading and use of enslaved labour and indentured labour in the West Indies, America, India and elsewhere.” ఇద్దరు బ్రిటిష్ ప్రధాన మంత్రులు పీల్, గ్లేడ్సస్టోన్ కాక 1742 నించి 1811 మధ్య కాలంలో ఎందరో రాజకీయ నాయకులు బానిస కూలీలు వ్యాపారం వల్ల లాభం పొందారని పేర్కొన్నారు.

        యాంత్రిక విప్లవం తరువాత బ్రిటన్ దేశంలో చేనేత పరిశ్రమ విపరీతంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో వారికి “నీలిమందు” ఎంతో అవసరమయ్యింది. తమ ఆధీనంలో వున్న భారతదేశంలో బీహార్ ప్రాంతం నీలిమందు పంటకు ఎంతో అనుకూలమని రైతులు తమ పొలాల్లో కొంత భాగం ఆ పంటనే పండించి తమకే ఆ పంటని తాము నిర్ణయించన ధరకే అమ్మాలని ఒత్తిడి చేయడంతో గాంధీ నాయకత్వంలో జరిగిన “నీలిమందు పోరాటం” మనకు కొంతైనా తెలుసు. కానీ అదే సమయంలో బ్రిటిష్ సామ్రాజ్యం ఆధీనంలో వున్న దేశాలలో విపరీతంగా లాభాలు తెచ్చి పెట్టే చెరుకు ఫారాలలో రోజుకు 14-15 గంటలకు పైగా బానిసల్లా పనిచేయించుకోవడానికి భారత దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి 13 లక్షలమందికి పైగా కాంట్రాక్టు పద్ధతిలో రప్పించుకోవడం జరిగింది., అక్కడ వారు పడ్డ బాధలు మనం తెలుసుకోవాల్సిన ప్రయత్నం ఎన్నడూ చేయలేదు. చెరుకు తోటల్లో పనిచేయడానికి సరే అంటే ఐదు రూపాయల జీతమే కాక (ఆ రోజుల్లో ఆ జీతం ఎక్కువే) ఉచితంగా యితర వసతులూ కల్పిస్తామని ఆశలు కల్పించి వారితో ఐదేళ్లకు కాంట్రాక్టు రాయించుకుని తీసుకుని పోయేవారు. ఆ ఉచ్చులో 1917లో  ఇండెంచెర్ వ్యవస్థ అంతమయ్యే వరకూ చిక్కుకున్న 13 లక్షల మందిలో వీరయ్య గారు ఒకరు. ఒక్క సౌత్ ఆఫ్రికా దేశానికే భారత దేశంనించి వీరయ్యగారితో పాటు 1,52,184 మంది ఇండెంచర్ కూలీలుగా వెళ్ళారు.

      చిన్నప్పుడు కృష్ణగారికి నాయనమ్మ నాంచారమ్మగారు చెప్పిన అనేక కథలలో ఒకసారి కృష్ణగారి ముత్తాత వీరయ్య సౌత్ఆఫ్రికా జీవిత విశేషాలు చెప్పడంతో ఆయన గురించి మరింత తెలుసుకోవాలన్న కోరిక కృష్ణగారిలో వయసుతో పాటు పెరుగుతూనే వచ్చింది. కృష్ణ గారికి బాల్యంలో ఒక సారి వేసవి సెలవల్లో అటకపై సామానులన్నీ దించి శుభ్రం చేస్తూవుండగా సౌత్ఆఫ్రికా స్టేంపులు అతికించిన ఓ వుత్తరం దొరికింది. దాన్ని మరిచిపోలేక ఆ చిరునామాకే ఎన్నో సంవత్సరాలుగా వుత్తరాలు రాస్తూనే వున్నారు. చివరకు 1995 మార్చి నెలలో ఒక వుత్తరం సౌత్ ఆఫ్రికా నించి వచ్చింది.అది తాతగారి అక్క చెంగమ్మ గారి మనవడు కృష్ణగారికి వరసకు అన్నయ్య అయిన “డేనియల్ నాయుడు” రాసినది. వర్ణవివక్షత సౌత్ ఆఫ్రికాలో అంతమై 1994 ఏప్రిల్ 26న నల్లవీరుడు నెల్సన్ మండేలా విడుదలై స్వతంత్ర ఎన్నికలు జరిగాక వీస్తున్న స్వేఛ్చా గాలి పీలుస్తు న్నాననీ, యింతవరకూ రాసిన వుత్తరాలన్నీ చేరాయనీ “అపార్ధియడ్” వలనే  యిన్నాళ్ళూ జవాబు రాయకపోవడానికి కారణమని ఆ ఉత్తరం సారాంశం. కానీ ఈ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. మళ్ళీ సౌతాఫ్రికా నించి వుత్తరాలు రావడం ఆగిపోయాయి. కృష్ణ గారు పెళ్లి చేసుకుని 1998 లో నాయనమ్మ ప్రోద్బలంతో అమెరికా వెళ్ళిన తరువాత మళ్ళీ వీరయ్య గారి గురించి వెతుకులాట యింటర్నెట్ సహాయంతో ప్రయత్నాలు కొనసాగించినా ప్రయోజనం లేకపోయింది దానితో ఆ ప్రయత్నాలు చాలా కాలం కృష్ణ గారు వదిలేశారు. కానీ మండేలా ఆత్మకథ “Long Road to Freedom” కృష్ణ గారు చదివాక మళ్ళీ వెతుకులాట కొనసాగించారు.

2005లో యింటర్నెట్ ద్వారా భారతదేశం నుంచి సౌతాఫ్రికాకు వెళ్లిన 1,52,184 యిండెంచర్ కూలీల జాబితాలో వీరయ్య గారి పేరు వెతికినా ఫలితం లేకపోయింది. రచయిత తన సమస్యని గ్రీకు పురాణాల్లో “సిసిఫస్” తో సరిపోల్చుకుంటారు. ఆ తరువాత 2010లో సౌతాఫ్రికా ప్రభుత్వం ప్రచురించిన డాటాబేస్లో వెతికినా వీరయ్య గారి గురించి ఏమీ సమాచారం లభించలేదు.. 2011లో హైదరాబాద్లో కాలు విరిగిన నాయనమ్మను చూడాలనిపిస్తే  అక్కడ అనుకోకుండా మనవలూ మనవరాళ్లుతో వున్న వీరయ్య గారి ఫోటో దొరకడంతో మళ్ళీ వెతుకులాట కొనసాగించారు. 2013లో ఫోటో సహాయంతో ఫేస్ బుక్ ద్వారా వీరయ్య గారి అక్క చెంగమ్మగారి మనవడు డానియల్ నాయుడు కూతురు “డనే” పరిచయం లంకెతో మళ్ళీ చిగురించిన ఆశతో వీరయ్య గారి గురించి 30 ఏళ్ళ వెతుకులాటలో పడ్డ శ్రమకు ఫలితం దక్కింది. వారితో సంప్రదింపులు ఫోన్ ద్వారా కొంతకాలం జరిగినా వీరయ్య గారి గురించి వారికి ఎక్కువ వివరాలు తెలియకపోవడం వలన కృష్ణ గారు 2014లో స్వయంగా సౌతాఫ్రికా వెళ్లి డర్బన్ నగరంలో ఇండెంచర్ కూలీల ఆర్కైవ్స్లో వెతకాలని నిర్ణయించుకుని వెళ్ళి చూసినా ఏమీ దొరకలేదు. చివరికి గాంధీ గారిని రైలుపెట్టెనించి కిందకు తోసేసిన పీటర్ మారిట్జ బెర్గ్ నగరంలో వున్న ఆర్కైవ్స్ పరిశీలించిమని ఎవరో చెప్పడంతో అక్కడ  2014 క్రిస్మస్ పండుగ ముందు రోజున వీరయ్య గారి వివరాలు 1932 సంవత్సరం రికార్డులలో లభ్యమవ్వడం జరిగింది. సౌతాఫ్రికాలో వున్న బంధువులందరికీ కృష్ణ గారు అక్కడకి రావడం తెలియడం అందరినీ కలవడం జరిగింది. కానీ యిదంతా జరిగేలోగా వీరయ్య గారి వివరాలు తెలుసుకుని సంతోషపెడదామనుకున్న కృష్ణ గారి నాయనమ్మ , అలాగే తనకు వరుసకు అన్నయ్య అయిన సౌతాఫ్రికా నివాసి డేనియల్ నాయుడు చనిపోవడం కూడా జరిగింది. మిగిలిన సౌతాఫ్రికా బంధువులందరినీ 2015లో కృష్ణ గారు కలవడం జరిగింది.

మొదట రెండు అధ్యాయాలలో చిన్నప్పటి నుంచి వీరయ్య గారి వివరాలు తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నాల గురించి రాస్తే మూడవ అధ్యాయం నుంచి పన్నెండు వరకూ వీరయ్య గారి సౌతాఫ్రికా ప్రయాణం మళ్ళీ భారతదేశానికి తిరుగు ప్రయాణం వివరాలు ఫ్లేష్ బేక్ పద్దతిలో రాశారు కృష్ణ గారు. ఈ అధ్యాయాలలో ఎంత కల్పన జోడించారో ఆయనే పుస్తకంలో వివరించారు. 

     అయితే కృష్ణ గారు సౌతాఫ్రికాలో బంధువులందరితో కలవడం వరకూ ఆయన కథ సుఖాంతమైనా నవలకు ఎవరూ ఊహించని మలుపు యిచ్చారు.

పదమూడవ అధ్యాయంలో కృష్ణ గారు ఉద్యోగరీత్యా అమెరికా భారత దేశాల మధ్య ప్రయాణించే సమయంలో దుబాయ్, దోహా వంటి గల్ఫ్ దేశాల్లో కొన్ని రోజుల ఆగవలసి రావడం వలన ఆ దేశాల్లో భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న భారతీయుల పరిస్థితిని వివరించారు. ఆనాడు సౌతాఫ్రికా చెరుకు ఫారాలలో పనిచేసిన యిండెంచర్ కూలీల జీవితాలూ,  ఈ నాడు గల్ఫ్ దేశాల్లో ఏ విధమైన రంగంలో ప్రత్యేక నిపుణత లేక అక్కడ పనికోసం చేరిన భారతీయుల పరిస్థితీ ఒక్కలాగే వుందని వివరించారు. ఆ దేశాలకు వెళ్లి సంపాదించుకోవాలన్న కోర్కెతో మోసపోయిన వాళ్ళ కథనాలు చదివాం కానీ అక్కడ చేరాక వాళ్ళ జీవితం ఎలా వుందో పుస్తకంగా రాసే ప్రయత్నం ఎవరూ చేయలేదు. కృష్ణ గారు ఆ ప్రయత్నం కొంత వరకూ చేసి దుబాయిలో కట్టుబానిసలుగా (దీన్ని “కఫాలా” పద్ధతి అంటారు) పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తున్న బసంత్ రెడ్డి గారి వివరాలు ఈ అధ్యాయంలో పొందుపరిచారు.

అలా ఆ దేశాల్లో పనిచేయడానికి మన దేశం నుంచి చాలా మంది వెళ్తున్నారు వారి పరిస్థితిని మెరుగు పరచడానికి అక్కడ మన దేశం దౌత్య కార్యాలయాలు కూడా ఏమీ చేయటంలేదు. వీరయ్య గారి గురించి మొదలైన ప్రయత్నం దానితో ముగించక తన ముత్తాత కూలీగా అనుభవించిన వ్యధలూ, ఈ నాడు కఫాలా పద్దతిలో  గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయుల బాధలూ ఏ మాత్రం భిన్నంగా లేవని అది బాగుపడాలని కోరుకుంటూ ముగించడం గొప్ప విషయం. “ఈ మాట” అంతర్జాల పత్రికలో గత అయిదు నెలలుగా దాసరి అమరేంద్ర గారు రాస్తున్న హృద్యమైన యాత్రా కధనం “గల్ఫ్ గీతం” కాక మరొక ఛిద్రమైన “విషాద గీతం” కూడా వుందని ఈ పుస్తకం చదివాక అవగతమయ్యింది. అలెక్స్ హేలీ “ఏడు తరాలు” సరసన నిలబడుతుంది ఈ వీరయ్య నవల.

*    

(ప్రచురణ: అన్వీక్షకి పబ్లికేషన్స్ -2020: హైదరాబాద్, వెల: 275/- )

ఆర్ . ఎస్ . వెంకటేశ్వరన్ .

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)
  • You made our entire generation look back and reflect with proper evidence for the penalised British rule of india.there are many still who say British brought education and railways to India. Along with natural resources they took our men as slaves,our intelligentsia as glorified clerks. The relentless efforts of the author made a big rentbin my heart. I wish to buy the book.please provide any phone contact.my email id is sailaja7074@gmail.com.i am waiting for your response.many thanks.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు