విస్మృత యోగి, తత్వవేత్త సందడి నాగదాసు  

ఆంధ్రయోగుల గురించి బిరుదురాజు రామరాజు గారు ఏడు సంపుటాల్లో వందల మందిని పరిచయం చేసిండు. ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర పేరుతో రాసిన పుస్తకంలో చాలా మంది కొత్తవాళ్లని పరిచయం చేసిండు. అయితే యోగియే గాకుండా 50కి పైగా పుస్తకాలు రాసిన సందడి నాగదాసు గురించి తెలుగు పాఠకులకు తెలిసింది చాలా తక్కువ. యక్షగానాలు, నాటకాలు, శతకాలు, హరికథలు, కీర్తనలు, అచల బోధనలు, తత్వాలు రాసిన సందడి నాగదాసు తత్త్వవేత్తలకే తత్త్వం బోధించే తాత్వికుడు. ఆయన తాత్విక సాహిత్య నిఘంటువు ‘సకల తత్వార్థ దర్పణం’ అనే గ్రంథాన్ని ప్రామాణికంగా వెలువరించి మార్మిక విషయాలను అందరికీ చెప్పిండు. రచనలు, అచల బోధనలు, తత్త్వ జ్ఞాన వ్యాప్తి చేస్తూ తెలుగు నేలను సుసంపన్నం చేసిండు.

19వ శతాబ్దపు ద్వితీయార్థంలో (బహుశా 1868 ప్రాంతం) కృష్ణాజిల్లా నందిగామ తాలూకాలోని దబ్బాకుపల్లె గ్రామంలో రామయ్య, పార్వతమ్మ అనే కురుమ దంపతులకు జన్మించిండు. చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మిక విషయంలో ఆసక్తి మెండుగా చూపించిన ఈయన లీలలను వర్ణిస్తూ ‘శ్రీమత్‌ ఆంధ్ర మహాభక్త విజయమ్‌’ పుస్తకంలో పంగులూరి వీరరాఘవుడు కొంత రాసిండు. సందడి నాగదాసు సమారాధనలకు సాక్షాత్‌ భగవంతుడే అన్ని సమకూర్చినాడనే భావన ఈ రచనలో ఉన్నది. సరే ఈ విషయాల్లో వాస్తవం ఎట్లున్నా ఆయన రచనలు ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆయన తత్వజ్ఞాన నిపుణతకు అద్దం పడుతుంది. మదరాసులో 1880ల్లోనే పుస్తకాలు అచ్చేయించాడు. ఆయన రచనలు అనేకం పునర్ముద్రణలు పొందాయి.

విద్యార్జన అనేది బీసీలకు ఏమాత్రం అందుబాటులో లేని సమయంలో స్వయంగా చదువుకొని విషయాలను మూలాల్లోకి వెళ్లి పామరులకు సైతం అర్థమయ్యే విధంగా చెప్పే జ్ఞానాన్ని సముపార్జించాడు. అచల బోధకుడిగా ఆంధ్రా అంతటా తిరిగి ప్రచారం చేసిండు. ఎంతో మంది శిష్యులకు బోధనలు చేసిండు. స్వయంగా సమారాధనలు నిర్వహించడమే గాకుండా 1906లో దబ్బాకుపల్లెలో లక్ష్మీనారాయణ మందిరాన్ని నిర్మించాడు. ఈ మందిర స్థాపన కాలంలో ధ్వజ స్థంభం ఏర్పాటుపై ఒక కథ ప్రచారంలో ఉన్నది. ఎంతమంది ప్రయత్నించినా ధ్వజస్థంభాన్ని నిలబెట్ట లేక పోయారు. అయితే నాగదాసు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆ ఊరాయిన ఒకరు ఏదో ఆవహించినట్టు వచ్చి ధ్వజస్థంభాన్ని నిలబెట్టాడట.

నాగదాసు చిన్ననాటి ముచ్చట్లను పంగులూరు వీరరాఘవుడు ఇట్లా పేర్కొన్నాడు. ఆకలి అని అడగనట్టి, బట్టలపై షోకులేనటువంటి బాల నాగదాసు గురించి పద్యాల్లో చెప్పాడు.

సీ. ఆకలియని తల్లి నడుగబోడన్నంబు

యెఱిగి పెట్టినచో భుజియుచుండు

ఈడు బాలుర గూడి ఆడబోడెన్నండు

వొంటిమైచరియించి యొప్పుజూపు

వస్త్రభూషణములు వాంఛిపడెన్నండు

రామభజనలు సేయ గోముగాంచు

గృహకృత్యముaలజోలి కే పోవడేవేళ

హరిచరిత్రల విన నరుగుచుండు

గీ. ఊడర జంతువులనుగును గొన్నవేళ

వైరమూనక నిజప్రాణి వలెనె యెంచి

పరమకృతప జూపుదనదగు బాల్యమందె

నాగదాసుసామాన్య మానవుడె తలప

(శ్రీమత్‌ ఆంధ్ర మహాభక్త విజయము, పంగులూరు వీరరాఘవుడు, పే. 415-416)

సీ. కలసదృశ్యంబెన్నటికి నేని నశియించు

నని మదినూహించు కొనగవలయు

బుట్టి చచ్చెడి వస్తువుల కెద్ధి హేతువో

దానినే మాయగా దలపబలయు

అఖిలమై యద్దాని కంటక నిర్మలం

బునునది యేస్థిరం బనగవలయు

కడకదే మూడస్తలకు సాక్షియునుమ్మ

టంచు నీలోపల నెంచవలయు

గీ. అట్టి యాత్మనె యీశ్వరుండను చునమ్మి

నిండు భక్తినిభజయించు చుండవలయు

కడు భయంబున గాలంబు గడపి తుదకు

భవముదరియించి మోక్షంబు బడయుమబల

(పంగులూరు వీరరాఘవుడు, ఉదాహృతంÑ నాగదాసు హరికథ)

నాగదాసు చిన్ననాటి నుంచి ఆధ్యాత్మిక విషయాల్లో ఎక్కువగా ఆసక్తి చూపించేవాడు కావడంతో ఆయనకు మిత్రబృంధం ఉండేది కాదు. తల్లిదండ్రులు కొడుకు ప్రవర్తన పట్ల భీతిల్లి పెండ్లి చేస్తే కుదురుకుంటాడేమో అని అచ్చమాంబ అనే అమ్మాయితో వివాహం చేయిస్తారు. మొదట్టో నాగదాసు సంతర్పణలు గురించి విసుక్కున్నా ఆ తర్వాత తత్త్వం బోధపడడంతో అచ్చమాంబ భర్తకు పూర్తిగా సహకరించింది. వీరికి రామదాసు అనే ఒక కుమారుడు ఉన్నాడు. ఈ రామదాసు తన తండ్రి రాసిన ‘లక్ష్మీనారాయణ శతకము’ని 1938లో దాదాపు 52 సంవత్సరాల తర్వాత పునర్ముద్రించి తండ్రి వారసత్వాన్ని కొనసాగించాడు.

నాగదాసు రచనల్లో కొన్ని.ఇలా ఉన్నాయి.

  1. భగవద్గురు కీర్తనలు, 2. లక్ష్మీనారాయణ శతకము, 3. శ్రీపతి శతకము, 4. భజగోవింద కందార్థములు, 5. భగవద్తీతా కందార్థములు, 6. సకలతాత్వార్థ దర్పణము, 6. జీవన్ముక్తి విచారము, 7. జీవన్ముక్తి విచారము, 8. అచల బోధ సీసార్థము, 9. సర్వమతసమత్వ సిద్ధాంతము, 10. రామనామ ప్రభావము, 11. పంచాక్షరీ మహాత్మ్యము, 12. బ్రహ్మ విదైక్య సారము, 13. మొక్ష మార్గదర్శనము, 14. దుర్మత ఖండనము, 15. వర్ణాశ్రమ తత్వబోధిని, 16. మతవివాద పరిష్కారము, 17.తారకనామ కీర్తనలు, 18. పూర్ణబోధ గీతార్థము, 19. పుత్రీషణతాష్ట్ర్యగోపాయము, 20. భక్త దూషణ నిరసనము, 21. అచలాంతరార్థ ప్రకాశము, 22. సర్వోదయము, 23. నామదేవు చరిత్ర, 24. సత్యనారాయణ వ్రత మహాత్మ్యము, 25. నిఖిల రోగ నివారణోపాయము, 26. ప్రారబ్దదీపిక, 27. రోహిదాసు, కబీరుదాసు సంవాదం, 29. నారాయాణ నామ ప్రభావము., 29. భద్రాచల మహాత్మ్యము, 30. ద్రౌపదీవస్త్రాపహరణము, 31. రంతీదేవు చరిత్రా, 32. భక్తిసార సంగ్రహము (కీర్తనలు), 33. లక్ష్మీనారాయణ కీర్తనలు, 34. విశ్వజనని శతకము, 35. విగ్రహార్చన సిద్ధాంతము, 36. కర్మస్వరూప సిద్ధాంతము తదితరులున్నాయి.

1890 (వికృతి) సంవత్సరంలో ఈయన రాసిన పంచాక్షరీ ప్రభావము అనే గ్రంథాన్ని మదరాసులోని గీర్వాణభాషా రత్నాకరము ముద్రణా సంస్థ తరపున అన్నదేవర వీరేశలింగం ప్రచురించారు. ఈ గ్రంథంలో సందడి నాగదాసు రచనలుగా లక్ష్మీనారాయణ శతకము, శ్రీపతి శతకము, భగవద్గుణకర్తీనలు, భజగోవింద కందార్థములు, అచల బోధ సీసార్థములు, శ్రీరామ శతకము, జీవన్ముక్తి విచారము, భగవద్గీత కందార్థములు, స్వర శాస్త్రము, రసర్వమత సమత్వ సిద్ధాంతము, సకల తత్వార్థ దర్పణము’’ అనే వాటిని పేర్కొన్నారు. అంటే పాతికేండ్లు నిండకుండానే ఆయన స్వరశాస్త్రము లాంటి వాటి మీద పట్టు సాధించాడె, దీని వల్ల ఆయన బహుముఖ ప్రతిభ అర్థమవుతుంది.

‘‘పాశుపతార్థము తపోదీక్ష నున్న యర్జునుని కింద్రుడు పంచాక్షరీ మంత్రోపదేశము చేయుచటయే యిందలి ముఖ్య విషయము. ఇంద్రార్జున సంవాదమని యీ గ్రంథ నామాంతరము. దీనఁగథ యేమియు లేదు. చివరికి శివుడు ప్రసన్నుడగుట చెప్పబడినది. గ్రంథము యక్షగానమని పేర్కొనఁబడినది రచన కొంత ప్రౌడమైనదే’’ అని యక్షగాన వాఙ్మయ చరిత్రలో యస్వీ జోగారావు పేర్కొన్నారు.

శతక పద్యాల్లో ‘లక్ష్మినారాయణాబ్జాక్ష లలిత వక్ష’ అనే మకుటంతో 108పద్యాల్లో రాసిన లక్ష్మినారాయణ శతకమును 1885 (తారణ నామ సంవత్సరం)లో పూర్తి చేసిండు. అయితే ఇది 1886లో అచ్చయినట్లు మలి ముద్రణలో ఉన్నది. ఈ మలిముద్రణ 1938లో లక్ష్మాంబ కోరిక మేరకు నాగదాసు కుమారుడు రామదాసు సంపాదకత్వంలో చ్రురించాడు. ‘‘అస్మజ్జనకులును కీ.శే.నగు శ్రీశ్రీశ్రీ సందడి నాగదాస దేశికులవారీ శతకమును బాల్యమందే సీసపద్యములుగా నియమ లక్షణములతో రచియించి (1886 సం॥) అచ్చొత్తించి ప్రచురించి ప్రసిద్ధి చెందిరి. ఏతద్గ్రంధ రచయిత ప్రపథమ మనుకొన నిప్పటికీ శతక ముద్రణమై చాలాకాలమౌటచే ప్రస్తుతాభిలాషలకులకు లభించకుండుట గాంచి ద్వితీయ ముద్రణ మొనర్ప ఎట్టకేల కొక శిథిల గ్రంధమును సంపాదించి జూడ (8) పద్యములు పూర్తిగా శిథిలమౌటచే వారి నెఱిగిన మిత్రులను శిష్యులను శతక పాఠకులను విచారించితిని. కాని వారికిని యీ శిధిల పద్యములే జ్ఞప్తి లేనందువలన శిధిల పద్యములు శక్తి కొలది పూర్తి చేయనెంచి శతక నామమునకు భిన్నము లేకుండుట చేతను అవకాశమివ్వక ముద్రణకై లక్ష్మాంబ త్వరపడుట వలనను గుర్వాజ్ఞ యింతే యనుకొని విరమించితిని. శతకాభిలాషుల కోర్కె దీర్ప పలుశ్రమల కోర్చి ద్వితీయ ముద్రణకై తోడ్పడిన శ్రీమతి వినగంటి లక్ష్మాంబగారికిని చదువరులకును మిగుల కృతజ్ఞుడను’’ అని ఈ శతకము ముందుమాటలో సంపాదకులు పేర్కొన్నారు.

దీని రచన గురించి కవి ఇలా పేర్కొన్నాడు.

సీ. శాలివాహనశక సంవత్సరంబులు

ఋతునభ దిగ్గజ రూపసంఖ్య

జనుచుండగా దట స్థంబైన తారణ

వర్షమందున మార్గశీర్ష శుద్ధ

తదియలవరకు సందడి నాగదాసుచే

నుతిగ నష్టోత్తర శతము సీస

పద్యముల్‌ రచియింప బడెను నారాయణ

స్వామికర్పణగ నీ శతకమెవరు

చదివినను వ్రాసినను విన్న సకలభోగ

కామ ధర్మార్థ మోక్షముల్‌ గలుగు భువిని

నతజన సురక్ష ఘన కరుణా కటాక్ష

లక్ష్మినారాయణాబ్జాక్ష లలిత వక్ష

(లక్ష్మీనారాయణ శతకము).

శ్రీపతి శతకములో ఒక పద్యము ఇలా ఉన్నది.

(శ్రీపతి శతకము, 25 వ పద్యము)

సీ. నీదాస పరుల సన్నిధి గల్గినటులైన

వైకుంఠమునకేగు వాంఛయేల

నీదాస పరుల వర్ణింపఁగల్గినజాలు,

విగ్రహార్చన మీద వేడ్కలేల

నీదాసవరుల ప్రమోదింప జేసిన

చాలు యజ్ఞముఁజేయుశీలమేల

108 పద్యాల్లో తారణ సంవత్సరమందు ఈ గ్రంథ రచన పూర్తయినట్లు కవి తన శతకము ముగింపులో పేర్కొన్నాడు. ఈయన శతక పద్యాల గురించి ‘శతక వాఙ్మయ చరిత్ర’లో వంగూరు సుబ్బారావు రేఖామాత్ర పరిచయం చేశారు. ఇప్పుడీయన రాసిన మూడు శతకాలూ అందుబాటులో లేవు. నేను అతి కష్టమ్మీద లక్ష్మీనారాయణ శతకము సంపాదించాను. అందులో ఆయన ఫోటో కూడా ముద్రితమయినది.

గీ.        యట్టి నీదాస సాంగత్య మనవరతము

గులగ వరము నత జనసురక్ష ఘన కరుణా కటాక్ష

లక్ష్మీనారాయణాబ్జాక్ష లలిత పక్ష

ప్రసాదింప వలయు దేవ

ఈయన కవితా కులగురువు రామానుజాచార్య, మంత్రార్థములు నేర్పించిన గురువు వేంకటరాయలు, యోగవిద్య గురువు వేంకటయ్య. నాగదాసు పూర్వ కవుల గురించి ఇట్లా పద్యాలో చెప్పుకున్నాడు.

కులగురు స్తుతి

కం.      పరికింపగాను మత్కుల

గురువగు నల్లానికులయ కూపార నిశా

కరుడగనగ వినుతి గాంచిన

గురువరు రామానుజార్యు గొలిచెద నెపుడున్‌

సుకవి నుతి

గీ.        సకలలోకోపకారంబు సలుపగోరి

కావ్యములు జేసి సత్కీర్తిగాంచినట్టి

వ్యాసవాల్మికీకవి కాళిదాస బాణ

వరమయూరలకును జేతు వందనములు

కవిస్తుతి

కం.      సందడి రామాహ్వయ ప్రియ

నందనుడను విష్ణుభక్తి నైష్టికుడను సా

నందుడ నాగన నాముడ

పొందుగ వేదాంతవిధుల బొగడెడి వాడన్‌

నాగదాసు కొన్ని వందల కీర్తనలు రాసిండు. అందులో ఒకటి ఇలా ఉన్నది.

 

త్యాగి అయితె నేమీ తా రాగి అయితె నేమీ

ఆగమోక్తంబుగను సచ్ఛిదాత్మను గనుగొన్నవాడు                        ॥త్యాగి॥

రాతీరి పగలనక నొక్క రీతిగా వెలిగేటి

యాపోజ్యోతి యందు మానసంబు జొక్క జేసియుండువాడు ॥త్యాగి॥

కామలోభ ముఖ శత్రు ఖండ నాజేసియునీత్య

ధూమరహితానలసిఖల తులదూగుచు నుండేటి వాడు      ॥త్యాగి

సత్తుచిత్తానందములనూ చక్కగా గన్గొనియు

చిత్తవృత్తి శూన్యుడై వెలుగుచుండు పండితుండు మిగుల    ॥త్యాగి॥

శ్రోతత్వ గ్జిహ్వ ఘ్రాణ నేత్ర యింద్రియము చేత రాత్రి

పగలు బొందు విషయరాజి బ్రహ్మంబనెడు వాడు             ॥త్యాగి॥

బాగుగా వెంకటరామ యోగిని గొనియాడు సందడి

నాగదాసు నేలు చిదానందునీ సేవించువాడు                               ॥త్యాగి॥

(భగవద్గుణకీర్తనలు: వ్యయ నామ సంవత్సరము, రచన, ప్రచురణ:1888, శ్రీరంగ విలాస ముద్రాక్షరశాల, చెన్నపురి)

నాగదాసు గురించి ఏ సాహిత్య చరిత్రలోనూ రికార్డు కాలేదు. 50కి పైగా రచనలు చేసినప్పటికీ ఆయన సాహిత్యం`జీవితంపై పరిశోధనలు జరగలేదు. బహుశా బీసీ కులానికి చెందిన వాడు కావడంతోనే ఆయనను ఎవ్వరూ పట్టించుకోలేదని చెప్పవచ్చు. ఇప్పటికైనా ఆయన భక్త బృందం, సాహిత్యాభిమానులు, బీసీ ఉద్యమకారులు పట్టించుకొని ఆయన సాహితీ ప్రతిభను, ధన్యమైన యోగ జీవితాన్ని విపులంగా రాసి వెలువరించినట్లయితే మరుగున పడ్డ మాణిక్యాన్ని వెలుగులోకొ తెచ్చిన వారమవుతాము. వివిధ రాగ, తాళల్లో కృతులు కూర్చడమే గాకుండా యాలపాటలు, మేలుకొలుపు పాటలు, లాలిపాటలు, మంగళహారతులు ఎన్నో రచించిండు.

నాగదాసు 20వ శతాబ్దంలో పరాభవ నామ సంవత్సరం, ఆషాడ బహుళ, ఆమావాస్య నాడు ఉదయం వేళ పద్మాసనాసీనుడై తనువు చాలించిండు. ఇది 1927 ప్రాంతము.

ఆయన రాసిన మూడు శతకాల్లో ఒక్క లక్ష్మినారాయణ శతకము మాత్రము అందుబాటులో ఉన్నది. కొన్ని భగవద్కీర్తనలు లభ్యమవుతున్నాయి. వాటినన్నింటిని సేకరించి సాహిత్య విలువగట్టి తెలుగు సాహిత్య చరిత్రకు కొత్త చేర్పునివ్వాలి.

*

సంగిశెట్టి శ్రీనివాస్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు