విమర్శ అనేది లేదు- అన్నీ సమీక్షలే!

సమకాలీన సాహిత్య అంశాలపై చర్చలో భాగంగా మొదటి చర్చ కథారచన, కథా సాహిత్య విమర్శ గురించి మొదలుపెడ్తున్నాం. మీ అభిప్రాయాలు ఇక్కడ వ్యాఖ్యల రూపంలో పంచుకోండి!

పదమూడేళ్ళ కథల్లో నేను చదివిన మేరకు శిల్ప ప్రయోగాలు కనిపించాయి. అలా అని అన్నీ కాదు,గానీ గతం మీద శిల్పశ్రద్ధ పెరిగిందని చెప్పొచ్చు. ఇదే సందర్భంలో వస్తువు మాత్రం సమూహాలకు, సమాజానికీ దూరం అయింది. కథ 2017 కి నేనూ,మధురాంతకం నరేంద్ర సంపాదకులుగా ఉన్నపుడు దాదాపు ఆ సంకలనం కోసం 70 కథలూ, వేరుగా రెగ్యులర్ రీడింగ్ లో మరో 50 కథలు చదివి వుంటాను.

వాటిలో నేనూ, నరేంద్ర గమనించింది  ‘… కథలు సమకాలీన సాంఘిక జీవితపు ముఖ్య పార్శ్వాలను గమనించ వలసినంతగా గమనించ లేదన్నది..’ ఉదాహరణకు…ముఖ్యమైన సాంఘిక ఘటనలు – నోట్ల రద్దు, జీయెస్టీ, మత దురభిమానం, ప్రాంతీయ వైరుధ్యాలు, అవినీతి స్కాములూ, పౌర స్వేచ్ఛ పైన జరుగుతోన్న దాడులు మొదలైనవి ఏవీ కనిపించలేదు. ముఖ్యంగా కథ సీరీస్ వారు ఇచ్చిన 70 కథల్లో. బహుశా నేనూ రెగ్యులర్గా చదివిన వాటిల్లో కొన్ని కథలు వీటిని ప్రతిఫలించి వుండొచ్చు. వాటిని సీరీస్ వారికి గుర్తు చేయలేక పోయి ఉండొచ్చు. యేమైనా మెజారిటీ కథ సమూహానికీ,సాంఘిక ఘటనలకు దూరం అయిందని భావన.

ఇక కథావిమర్శ యెక్కడ వుంది? రెగ్యులర్గా వచ్చే కథలను స్థల,కాలాల నేపధ్యంలో విశ్లేషించే, విమర్శించే పని ఇపుడు కనిపించటం లేదు. యెవరో పత్రికల వారు అడిగితే రాసే విమర్శ వ్యాసాలు తప్ప. నాకు గుర్తు ఉన్నంతవరకు గతంలో కోడూరి శ్రీరామమూర్తి గారు రెగ్యులర్గా వచ్చే కథలను విశ్లేషించేవారు. మరికొందరు కూడా చేసేవారు. ఇపుడు అన్నీ సమీక్షలే.

నా మటుకు నాకు కథా సంకలనాల దోహదం బాగుందనిపిస్తోంది.

అందులో ప్రాంతీయ సంకలనాలు…తెలంగాణ,కళింగాంధ్ర నుండి వస్తున్న సంకలనాలు ఆయా ప్రాంత రచయితలకు ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. అలాగే…కొత్త కధ సంకలనాల వలన మంచి కథకులు,కొత్త కధకులు వస్తున్నారు. ఆ విధంగా అచ్చు పత్రికల కంటే సంకలన కర్తల దోహదం కథను వెలిగిస్తోంది.

*

అట్టాడ అప్పల్నాయుడు

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు