వాయనం డెలివరీ యాప్

ట్రింగ్ ట్రింగ్ అని ఫోన్ మోగడంతో నిద్రలేచింది ఉమ. స్వతంత్ర దినోత్సవం అంటారు కానీ కాసేపు పడుకోనివ్వరు కదా అని తిట్టుకుంటూ “హలో” అనగానే కంచులా మోగింది వల్లి కంఠం అవతలివైపు నుండి. “నీకో సర్ప్రైజ్ వదినా!!  కాసేపట్లో  కాలింగ్ బెల్ మోగుతుంది. వెంటనే వెళ్ళి తలుపు తీసేయ్” అని పెట్టేసింది. నిద్ర ముఖం కడగటానికి బయల్దేరుతు ఈ వల్లి ఏదో ఒక తంటా తెస్తూనే ఉంటుంది. మొన్నామధ్య అత్తగారికి మావగారికి ఆన్లైన్ షష్టిపూర్తి అని హడావిడి చేసింది, ఇప్పుడు సర్ప్రైజ్ అని మరెలా తినబోతోందో నా బుర్ర అనుకుంటుండగానే కాలింగ్ బెల్ మోగింది. కొంచెం ఆత్రంగానే తలుపు తీసింది ఉమ. ఎదురుగుండా పాతికేళ్ళ లోపున్న అమ్మాయి పట్టు చీరలో, ఒక చేతిలో డెలివరీ బాగ్ తో ” ఉమ గారు మీరేనా? నేను  వరలక్ష్మి వాయనం డెలివరీ నుండి మేడమ్” అంది. ఓహో ఇదేనా వల్లి చెప్పిన సర్ప్రైజ్ అనుకొని ఆ అమ్మాయిని లోపలికి పిలిచి కుర్చీ చూపించింది. ఇంతలో వల్లీ నుండి “వదినా!! నీక్కూడా నా మంగళ గౌరీ వ్రతం వాయనం అందుతోంది చూశావా” మెసేజు. ఏమిటే ఈ గోల అనుకుంటూ “అమ్మాయి నీ పేరెంటి?” అని అడగ్గా “శ్రావణి” శ్రావ్యంగా పలికింది ఆ అమ్మాయి గొంతు.

“శ్రావణి గారు ఏమిటండీ ఈ వాయిదాల డెలివరీ యాప్” అని అడిగింది ఉమ.
“ఏమిటి మీకు తెలీదా అని ఉరిమి చూసింది” శ్రావణి, ఇదేదో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఆక్రమణ కన్నా పెద్ద విషయం లాగా.

“ఇదిగొండి మేడమ్ ఈ వీడియో చూడండి” అంటూ తన ఫోన్ చూపించింది. ఇప్పుడు ఈ వీడియో చూడక పోతే ఆ అమ్మాయి కదలదు, తరువాత ఈ వల్లి సాధిస్తుంది. తప్పదులే అనుకుంటూ వీడియో చూడటం మొదలెట్టింది ఉమ.

సుమనస వందిత సుందరి మాధవి అంటూ  మొదలై అష్ట లక్ష్మి స్తోత్రం background సంగీతం తో లక్ష్మీ దేవికి పూజ చేస్తున్న అలనాటి సినీతార జయప్రద.
అమ్మవారికి నమస్కారం చేసి మనవైపు తిరిగి
“మీరు అమెరికా లో అట్లతద్ది చేసుకుంటున్నారా? స్విజ్జర్లాండ్ లో సంతోషీ మాత వ్రతం?
ఈ కరోనాలో ఏం వాయినం ఇస్తాం, అన్ని వ్రతాలు ఆగిపోయినట్టే అని నిరాశ చెందుతున్నారా?
మీలాంటి వారికోసమే ఈ వరలక్ష్మీ వాయినం డెలివరీ యాప్.
మనం ఎక్కడ ఉన్నా మన సంస్కృతి మరిచిపోకూడదు కదా!! కాదంటారా??
మీరు ఏ దేశంలో ఏ రాష్ట్రంలో వ్రతం చేసుకున్నా అక్కడ మీకు ముత్తైదువులు దొరకక బాధపడుతున్నారా?
మీకోసమే వరలక్ష్మీ వాయినం డెలివరీ యాప్.
మీరు కేవలం మీ వ్రతం చేసుకుంటే చాలు, వాయినం ముత్తైదువలకి చేరవేసే బాధ్యత మాది. మా ఉద్యోగులు మీరు సూచించిన విధంగా మీరు చెప్పిన వంటకాలతో పాకేజ్ సిద్ధం చేసి మీరు చెప్పిన చిరునామాకి ముత్తైదువు లాగా వెళ్ళి వాయినం ఇస్తారు. మీరు మీ చుట్టాలకి ఫోన్ లోనే ‘ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటినమ్మ వాయినం’ అని చెప్పొచ్చు.”
ఇంతలో స్క్రీన్ మీద సింహాలు పులులు అడవిలో తిరుగుతున్న చిత్రం. ఒక నడి వయస్కురాలు సోఫాలో కూర్చుని మాట్లాడుతోంది. “నా పేరు ప్రతిభ. మేము దక్షిణ ఆఫ్రికా లో ఉంటామండి. మేమున్న చోట  చాలా తక్కువమంది భారతీయులు ఉంటారు అందులో తెలుగువాళ్లు ఒక్కరే ఉన్నారు వారు అన్యమతస్థులు. దానితో నాకు ఏ వ్రతం చేసుకున్నా తాంబూలం ఇవ్వడానికి ముత్తైదువులు దొరికే వారు కారు. ఆఫ్రికన్ వనితలని తీసుకొచ్చి కుంకుమ గంధం ఇస్తూ ఉంటే “వాట్ ఇస్ దిస్ హిహిహి” అని నవ్వేవారు” (ఆవిడ కూడా హహహ అని నవ్వింది). గత రెండు సంవత్సరాలుగా నేను వరలక్ష్మి వాయినం డెలివరీ యాప్ వాడుతున్నాను ఇప్పుడు వ్రతం చేసుకుంటుంటే చాలా సంతృప్తిగా ఉంది” అనగానే మరలా జయప్రద స్క్రీన్ మీద కనిపించింది.
“మీరు కూడా వెంటనే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీ వ్రతాలు సంపూర్ణం చేసుకోండీ” అని ‘ఇస్తినమ్మ వాయినం’ అని జయప్రద అనగానే ‘పుచ్చుకుంటినమ్మ వాయినం’ అని జయసుధ కనపడింది స్క్రీన్ మీద ఈసారి. ఇద్దరి చేతుల్లో వాయినం పళ్ళాలతో వీడియో ముగిసింది.
ఎప్పుడొచ్చారో తెలీదు, ఉమ మామగారు పక్కన నుంచుని  అంతా చూసినట్టున్నారులా ఉంది, “కలికాలం” అని వారి గదిలోకి వెళ్ళిపోయారు.

ఈలోపు శ్రావణి తన బాగ్ లోనుండి పసుపు కుంకుమ గంధం లాంటివి పెట్టుకున్న పోపులాడబ్బా ఒకటి బయటికి తీసింది, అలాగే ఒక డిస్పోజబుల్ పళ్ళెంలో  తగరం డబ్బాల్లో పోసిన శనగలు, నాలుగు బూరెలు, తమలపాకులు, వక్క, అరటిపళ్లు అన్నీ కలిపి తాంబూలం లాగా అమర్చి దానిని ఒక ప్లాస్టిక్ కవర్ తో మూసి సిద్ధం చేసిన పాకేజ్ కూడా బయటకి తీసింది.

‘ఒక్క నిమిషం మేడమ్ ఫోన్ ఇస్తారా’ అని ఫోన్ తీసుకుని అందులో “వాయినం డెలివరీ” యాప్ నుండి వల్లికి వీడియో కాల్ చేసింది. వల్లి పర్యవేక్షణ ఉండాలి కాబోలు, అవును మరి వినియోగదారుల సంతృప్తి ముఖ్యం కదూ.
“మేడమ్ బొట్టు పెట్టించుకోండి, కాళ్ళు చూపండి మేడమ్ పసుపు రాస్తాను”  అంటూ తనపని చేసుకు పోతోంది శ్రావణి ఫోన్ ఉమ చేతిలో పెట్టి.
“వదినా నువ్వు ఎప్పటినుండో నూటోక్క ఫలాల నోము అంటున్నావు కదా, ఇలా ప్రయత్నించు వదినా నేను కూడా గంగి గోవుల వ్రతం చేద్దాం అనుకుంటున్నా ” అని మాట్లాడుకుపోతోంది వల్లి. కనకాంబ్రాలు, చామంతులతో శ్రావణి చేతికి కట్టిన తోరం గమనిస్తోంది ఉమ.
ఇంతలో శ్రావణి పళ్ళెం చేతిలోకి తీసుకుని దానిమీద చీరకొంగు కప్పింది. ఫోన్ ని  కనపడేలా సోఫాలో పెట్టి చేతులు చాచింది ఉమ కొంగుని వడిలా పట్టి. శ్రావణి వాయనం ఇస్తోంటే ఫోన్లో ఉమ కూడా ఒక పళ్ళెంతో ‘ఇస్తినమ్మ వాయనం’ ఉమ అప్రయత్నంగానే ‘పుచ్చుకుంటునిమ్మ వాయనం’ ఇలా మూడు సార్లు అన్నాక “నా వాయనం పుచ్చుకున్నది  ఎవరు?” అని వల్లి అనగానే “నేనే మంగళగౌరి దేవి” అంది ఉమ. “ఉంటాను వదినా” అని ఫోన్ పెట్టేసింది వల్లి. “అమ్మాయ్ ఇంకో నాలుగు బూరెలు ఇస్తావా, పిల్లలు ఇష్టంగా తింటారు” అంది ఉమ. లేదు మేడమ్, పాకేజ్ లో ఉన్నదే ఇవ్వమని రూల్. “ఇంకో రెండు ఇస్తే ఈ వల్లి సోమ్మేం పోయేదో” అని గొణుక్కుంది ఉమ. “అయినా ఇవన్నీ అమ్మవారికి సరాసరి నైవేద్యం పెట్టినట్టు కాదు కదా! అది కూడా వీడియోలో చేస్తారా ఏమిటి?” దెప్పింది ఉమ. “మీరు పెట్టే నైవేద్యం కూడా పటానికే కదా మేడం” కొంచెం ఘాటుగానే చెప్పింది శ్రావణి తన డెలివరి బాగ్ సర్ధుకుంటూ. ఉన్నట్టుండి ఇంకో అనుమానం వచ్చింది ఉమకి. తలుపు దగ్గరకి వెళ్ళాక అడిగింది ” అమ్మాయి, ఇంతకీ నీకు పెళ్లయిందా?” అని.

ముసి ముసిగా నవ్వేసి వెళ్లిపోయింది శ్రావణి సమాధానం చెప్పకుండానే.    

*

లలిత నిగేష్

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు