వాన చినుకుల వెంట కొన్ని కథలు!

“ఆనాటి వాన చినుకులు” ఆవిష్కరణ డిసెంబర్ 21

మీకు ఒక రహస్యం చెప్పదలుచు కున్నాను — నేను ఈ ముందు మాట రాస్తున్నప్పటికి ఈ పుస్తకం ఇంకా చదవలేదు. నాకుండే సహజమైన బద్ధకం వల్ల కాదు, సత్యం వేమూరి గారు  పెట్టిన నిబంధన మూలాన. అందుచేత ఈ సంకలనం లోని కథల గురించి నేను చెప్పబోవటం లేదు. దానికి బదులు, ఈ కథల సంకలనం వెనక ఉన్న కథ, ఈ ప్రయత్న సందర్భం, ఇంకా ఇతర కథా సంకలనాల వెనక ఉన్న కథలు చెబుతాను. ఆ విషయాలు మీకు ఈ కథా సంకలనం మీద ఇంకొంచెం ఎక్కువ ఆసక్తి  కలిగిస్తాయని ఆశిస్తున్నాను.

సాధారణంగా వచ్చే సంకలనాలు, “ఉత్తమ కథలని” పాఠకుల ముందుకు తెస్తాయి. ప్రతి సంవత్సరం వచ్చే కథసాహితి వారి కథ (28 వ సం 2017) సంకలనం ఇందుకు ఉదాహరణ.  కొన్ని ప్రాంతీయ ప్రాతిపాదిక మీద వచ్చే సంకలనాలు ఉంటాయి. గుంటూరు కథలు, లేదా తెలంగాణా కథలు ఇలాగన్నమాట. మరికొన్ని ఒక ఇతివృత్తం మీద వచ్చే సంకలనాలు ఉంటాయి. స్త్రీ వాద కథలు, ముస్లిం జీవితాల కథలు ఇటువంటివి, వస్తువు, రచయితల దృక్పథం, వారి అస్తిత్వం లాంటి వాటిని  కేంద్రంగా చేసుకుంటాయి.

మరి, “ఆ నాటి వానచినుకులు” కథా సంకలనం ఎటువంటిది?

ఈ విషయం గురించి ఆలోచించాలంటే, ముందు కథా సంకలనాల గురించి, వాటి పుట్టు పూర్వోత్తరాలు గురించీ తలుచుకోవాలి. కథలు విడి విడిగా చదివే కంటే, అన్నీ కలిసి ఉంటే ఏదయినా ఉపయోగమా? నిజానికి ఉత్తమ కథా సంకలనాల్లోని ప్రతి కథా, దేనికది నిలుచుండే కథే. పక్క కథ తోటి పోలిక తోటీ, తేడాలతోటీ ఒక కథ చదవడం మరింత రక్తి కెక్కడమంటూ ఉండదు. ఏ కథ దారి దానిదే. అయితే, తప్పకుండా పాఠకులకి కొనుక్కోడానికి సదుపాయంగా ఉంటుంది.

సాధారణంగా చూసే ఇతివృత్త కేంద్రం గా ఉండే కథా సంకలనాలకి  వేరే సమస్య ఉన్నది. అవి నిజానికి ఒక విషయాన్ని తీసుకుని పలు కోణాల నుంచి చూసి, పాఠకులకి ఒక సమగ్రమైన దృక్పథాన్ని ఇవ్వగలవు. అయితే, ఆచరణలోకి వచ్చే సరికి, చర్విత చర్వణంలాగా తోస్తాయి. ఉదాహరణకి, స్త్రీ వాద కథల్లో స్త్రీ వాదానికి వ్యతిరేకంగా ఏ కథ కూడా రాదు. విప్లవ కథల్లో, సంప్రదాయవాద కథలు రావు. పోలిక, భేదం — ఇవి రెండు ఏ విషయం గురించి నేర్చుకోవాలన్నా ముఖ్యమైన ఉపకరణాలు. యాధృచ్చికంగా అయినా, ఇతివృత్త ప్రధాన సంకలనాలు పోలిక, సారూప్యత లాంటివే ఎక్కువగా వచ్చేటట్లు చూస్తాయి. ఇవి పాఠకులకి సమగ్రానుభవాన్ని ఇవ్వవు.

నిజానికి ఎటువంటి విషయం, లక్షణం మీదయినా కథల సంకలనం తీసుకు రావచ్చు. సంకలన ఫలితం చూడాలంటే ఒకే ఒక్క గీటు రాయి ఏమిటంటే, ఈ కథలు విడిగా చదవడం కంటే, అన్నీ కలిపి ఒక చోట ఉంటే పాఠకుడికి ఏదయినా మేలు కలుగుతుందా? అంతకన్నా ముఖ్యం, కథలకే ఏమైనా మెరుగు వస్తుందా? అన్నది చూడాలి.

ఉదాహరణకి, ప్రతి కథ లోనూ హీరో ఒకే పేరు ఉన్న సంకలనం తెచ్చామనుకోండి. అంటే రాముడు అని ఉన్న సినిమాల నన్నీ ఒక ఫిల్మ్ ఫెస్టివల్ లో చూపించినట్లు. ఈ కథలు ఒక సంకలనంగా ఉన్నంత మాత్రాన, ఏమీ ఉపయోగం లేదు. ఒక కథకీ మరొక కథకీ ఏమీ సంబంధం లేదు. నిజానికి, ఈ లక్షణం (అంటే హీరో పేరు) కథని ఏ మాత్రం వర్ణించదు.

కొన్ని కొన్ని లక్షణాలు కథను వర్ణించక పోయినా, నియంత్రిస్తాయి. అంటే, కథకి కొన్ని నియమాలు ఇవ్వడం ద్వారా, రచయితకి కొన్ని కట్టుబాట్లు సృష్టిస్తాయి. ఉదాహరణకి, కథ కేవలం 280 అక్షరాల్లో రాశామనుకోండి — అవి ట్విట్టర్ కథలవుతాయి. కాలం దాటని కథలు, పోస్టు కార్డు కథలు ఈ తరహాకు చెందినవే.  వీటన్నికంటే, మన ప్రాచీన సాహిత్యంలో కొన్ని కొత్త ప్రయోగాలు కనబడతాయి. ఛందస్సు నుండి, బంధ కవిత్వం వరకు పద్యాలు ఎలా ఉండాలో శాసిస్తే, ప్రబంధ కావ్యాల్లో ఇటువంటి వర్ణనలు ఉండాలని నియమాలు కథలనే శాసిస్తాయి.

మరి ఇటువంటి నియమాలు సృజనాత్మకతకి సహాయ పడతాయా? పెట్టిన నియమాల బట్టి అని చెప్పుకోవచ్చు. ఉదాహరణకు, ఛందస్సు మూలాన, పద్య నిర్మాణంలో నూతనత్వం చేయడం కోసం, తెలుగు భాష లో అనేక ప్రయోగాలు జరిగాయి. కానీ, ఇవన్నీ వస్తువు, శైలి, పాఠకుడు — వీటికి నష్టం కలిగించాయని చెప్పుకోవచ్చు. ఉదాహరణకి, నగర వర్ణనే ఉండాలనే నియమం ఉంటే, పూర్తి ఆటవిక సాహిత్యం ఎలా పుడుతుంది?

ఉదాహరణకి రష్యన్ సాహిత్యం తీసుకోండి. జార్ ప్రభువుల కాలంలో, చెప్పదలుచుకుంది సూటిగా చెబితే జైలు ప్రమాదం. అందుకని రచయితలు పైకి ఒక విధంగా, లోపలి అర్థం వేరే విధంగా, ఒక రకమైన వ్యంగ్య ధోరణి లో కథలు రాశారు. అటువంటి ఒక నియంత్రణ మూలంగా ఆ ప్రక్రియ ఒక పరాకాష్టకు చేరింది.

కేవలం భాష మీద కాకుండా, వస్తు నిర్దేశం ద్వారా సృజనాత్మకతను పెంచగలమా అని ప్రశ్నించుకుంటే, దాన్ని ఎంతవరకు నిర్దేశిస్తున్నాం అన్న దాని మీద ఆధార పడుతుంది. ఉదాహరణకి ఆక్స్ ఫోర్డ్ లో అత్యంత కష్టమైన పరీక్షలో ఒక భాగం వ్యాస రచన. దానికి వాళ్ళు ఇచ్చే టాపిక్ కేవలం ఒక పదం మాత్రమే. కొన్ని నమూనా పదాలు — ఇన్నోసెన్స్, నావెల్టీ. ఇలాగ ఉండే పదాలు ఎలాగ అన్వయించుకొని రాశారా అన్నది సృజనాత్మకత, నేర్పరితనం బయటకి చూపెడతాయి.

ఇప్పుడు “ఆ నాటి వాన చినుకులు” టాపిక్ దగ్గిరకి వద్దాం.  ఈ విషయం మీద అనేక రచయితలు రాసిన కథలు ఈ సంకలనంలో కనబడతాయి. యాదృచ్చికంగా ఒక రిక్షా వెనుక రాసి ఉన్న ఈ నాలుగు పదాలు వేమూరి సత్యం గారిని అనేక ఏళ్ళు వెంటాడి, ఈ సంకలనాన్ని తెచ్చింది. ఈ కథలన్నీ, ఈ టాపిక్ ఇవ్వగా రాసిన కథలే! అన్నీ ఈ సంకలనం కోసమే రాసిన కథలు. అందుకనే కథలో ఎంత కథ ఉన్నదో, ఈ కథ రచయిత ఎందుకు ఎన్నుకున్నాడో, అందులోనూ ఒక కథ ఉండి ఉంటుంది.

ముందు ఈ టాపిక్ లోని పదాల్ని, సూటిగా పరిశీలిద్దాం. ఇవి చినుకులు. అంటే, తుప్పర కాదు — అలా అని జడి వాన కాదు. ఇవి ఆనాటివి.  “గతించిన దినాల తలపోత బరువు చేత” అన్నట్లు, “ఆ నాడు” అంటే ఒకప్పటి జ్ఞాపకాల కథలు. ఆ జ్ఞాపకాలకి నేపథ్యం వాన చినుకులు. వాన చినుకుల జ్ఞాపకాలు కాదు — వాన చినుకులు పడుతున్నప్పటి జ్ఞాపకాలు.

జ్ఞాపకాలకు, కథలకు సంబంధం ఏమిటి? ప్రతి కథా జ్ఞాపకం నుంచే పుడుతుంది. మనిషి జ్ఞాపకమైతే వ్యక్తిగతమైన కథ అవుతుంది. జాతి జ్ఞాపకమైతే, ఒక చరిత్ర అవుతుంది. ఒక మతమౌతుంది. ఒక జీవన విధానమౌతుంది. జ్ఞాపకం  కాలం మరుగున పడి, కొత్త కల్పనలు రంగరించుకుంటుంది. జ్ఞాపకం జరిగిన దారుల్లో కాకుండా, ఎవరూ ప్రయాణం చేయని దోవల్లో కూడా పోయి ఒక ఊహ అవుతుంది. ఒక సృజన అవుతుంది.

చిన్నప్పుడు అమ్మ కొంగు కింద తుప్పర నుండి దాగి, చేతులు బయటికి చాచి వాన చినుకుల తడి, వేడి, చలీ అన్నీ అనుభవిస్తూ, ప్రపంచ పరిచయం చేసుకున్న జ్ఞాపకం నుంచి ఒక కథ పుట్టవచ్చు. ఆ అమ్మ ఎందుకు పిల్లవాడిని చంకకేసుకొని బయటకు వెళ్ళింది? అది ఒక కథ. అసలు అంత చిన్న పిల్లకి అప్పుడే పిల్లలు పుడితే, ఎలా పెంచగలదు? అర్థమవనివీ, అర్థంలేనివీ, చూసినవీ, విన్నవీ — ఇటువంటి అనుభవాలు కొత్త జీవితానికి పునాది అవుతుంటే, మనిషిగా ఎలా ఎదిగింది? ఇది ఆనాటి వాన చినుకుల నేపథ్యంలో అమ్మ ఒడిలోని కథ.

సంపాదకులు వేమూరి సత్యం

పోనీ, చిన్నతనంలో, వాన చినుకుల మధ్య, పొలాల మీదుగా, ఉసిరికాయలు చెట్ల కిందుగా పరిగెత్తుకుంటూ బడికి  కెళుతుంటే, ఆ జ్ఞాపకం వేరే కథ కావచ్చు. మరి చిన్న పిల్లగాడికి చదువంటే తెలుసా? అశోకుడి చరిత్ర, బీజ గణితం, కర్బన ద్వి ఆమ్లజని, గురుత్వాకర్షణ, సవర్ణ దీర్ఘ సంధి — వీటన్నిటికీ, తన రాబోయే రోజులకీ ఏమిటి సంబంధం? బ్రతుకు భయం ఇంకా తెలియనప్పుడు, ఉన్న ఒక్క చొక్కా సంచిలో దాచి, వానలో తడిచినా ఫరవా లేదనే సావాసగాడి జీవితానికీ, తన జీవితానికీ మధ్య ఉన్న తేడా తెలుసుకోగలడా? ఇది ఆనాటి వాన చినుకుల నేపథ్యంలో బాల్యపు కథ.

తొలి యవ్వనపు వాన చినుకుల మధ్య ఆనాటి కలలు ఎవరి కళ్ళలో చూస్తామో? బస్టాండ్ దగ్గర వాన చినుకుల పుణ్యమా అని, ఇద్దరూ వానలో ఒక పాక కింద చేరి, కాఫీ తాగుతూ, ప్రతి మాటలో కొత్త రాగాలు వెతుకుతూ ఉన్నపుడు, ఇదే జీవితం, ఇంతకు మించి ఏమీ అక్కరలేదు, ఒకరికొకరు తప్ప వేరే జీవితావసరాలు లేవు అని నిర్ణయానికి వచ్చిన రోజుల కథ మరో కథ అవుతుంది. అయితే, అదే ఇద్దరూ పెరిగి, ఆఫీసులూ, ఆసుపత్రులూ, బడులూ, బ్యాంకులూ వీటన్నిటి మధ్య, వానచినుకులు చిరాకు కల్పిస్తే, మాటలో మంత్రం పోతే, సంగీతం పోతే, కళ్ళల్లో కలలు పోతే ఆ కథకు మంచి ముగింపవుతుందా? లేక, ఎప్పుడో ఆ వాన చినుకులే, ఆ వాన వాసనలే, ఆ చినుకుల సడులే ఆ జ్ఞాపకాన్ని తట్టి లేపుతుందా? ఇది ఆనాటి వానచినుకుల ప్రేమ కథ.

ఈ కథలు ఎలా పుడతాయి?  ప్రతి రచయిత  మొదటి కథలు చిన్న నాటి జీవితం నుండే పుడతాయంటారు. ఇది ఎంత సర్వ సాధారణమంటే, దీనికి ఒక పేరు ఉన్నది “బిల్డంగ్స్ రొమాన్” అని. ఫిక్షన్ గురించి రాసిన పాఠ్య పుస్తకాల్లో ముందు ఈ అంశం గురించే రాస్తారు. జ్ఞాపకాలు రచయితలకి ఒక గని. దాని నుంచి తవ్వి తవ్వి కథలు తీస్తారు.

వాన చినుకుల నేపథ్యంలో ఏం జ్ఞాపకాలు ఉంటాయి? ఏది కథకు అర్హం? మన దేశంలో వాన అన్నింటికీ ప్రధానం. వాన లేక పోతే జీవితమే ఉండదు. ఒక ఆంగ్ల రచయిత “చేజింగ్ ది మాన్సూన్” అని ఒక పుస్తకం రాసాడు — వాన చినుకుల వెంట దేశమంతా  ప్రయాణం చేసి. భారత భౌగోళిక, సాంఘిక చరిత్రంతా ఆ నేపథ్యంలో కనబడుతుంది. పల్లెటూళ్ళో నాట్ల దగ్గరినుంచి వాన జీవితాన్ని నిర్దేశిస్తుంది. పొలానికి వెళ్ళటం, గేదెలు తోలడం, కలుపు పీకటం, ప్రత్తి తీయడం, ఇలాగ వాన లేని జ్ఞాపకం ఉండదు. వినాయక చవితికి వానలో పత్రికి వెళ్లడం, పిడుగుల భయంతో ఆరె నార మొలతాడుకి కట్టుకోవడం ఎన్నెన్ని జ్ఞాపకాలో!

లేదా పట్టణంలో వేరే జ్ఞాపకాలు. వానలో పరిగెత్తుకుని వెళ్లి సినిమా హాలులో దూరడం, కాఫీ తాగుతూ వాన చినుకులు చూడడం, వాన వెలిసిన తర్వాత తారు రోడ్డు మీద నీళ్ల గుంటలు దూకి మార్కెట్ కి వెళ్లడం, గొడుగు కింద చేరి రోడ్డు దాటటం, ఇలా పట్టణ వాసులకి వేరే జ్ఞాపకాలు ఉండనే ఉంటాయి.

అయితే, ఉట్టి జ్ఞాపకాల గురించి రాస్తే కథ కాదు. పక్కింటి వాళ్ళ హైస్కూల్ రీయూనియన్ లో అనుకోకుండా చిక్కుకు పోయి,  వాళ్ళ కథలు విని ఎంత తొందరగా బయట పడదామా అనుకున్నట్లు ఉంటాయి, ఈ జ్ఞాపకాల కథలు. ఆ జ్ఞాపకం చెప్పే వాడికే నచ్చుతుంది. లేదా, ఆ జ్ఞాపకం పంచుకున్నవారికే నచ్చుతుంది. సుబ్బారావు వాన చినుకుల్లో తడుస్తూ, ఆరు మైళ్ళు నడిచి సుబ్బలక్ష్మి హాస్టల్ దగ్గరికి వెళ్లేసరికి వార్డెన్ దర్శనమివ్వడం, ఆ సుబ్బారావుకి, సుబ్బలక్ష్మికి, వారి మిత్రబృందానికే మళ్ళీ మళ్ళీ చెప్పుకోబుద్ధవుతుంది.

మరి కథ అందరికీ ఎలా చెప్పాలి? కథ పాఠకుడి చెవిలో ఎలా రహస్యం పంచుకోవాలి? అసలే, తెలుగు కథల్లో భావోద్వేగం ఎక్కువ. ఆకాశం నుంచి కిందకు పడిన వాన చినుకుల లాగే, తెలుగు కథలు కిందకు దిగి, మనుషుల భాషలో చెప్పగలవా? కథ నిస్వార్థంగా పాఠకుడి కోసమే ఎలా ఉండగలదు?

ఒక కవి రాస్తాడు, ప్రతి రచన, రెండు విషయాల మిశ్రమమని: మెమరీ, డిజైర్. అంటే, జ్ఞాపకం, కోరికల కలగలుపులతో రచన సాగుతుంది. మరి జ్ఞాపకానికి కోరికని ఎలా కూడడం? కోరిక ముందుముందు ఏమి జరగాలనో ఊహిస్తుంది. జరిగిన దానికి, జరగవలసిన దానికీ సన్నిధానం ఈ జ్ఞాపకాల కథలు తెలుపుతాయి. మనిషికీ, ప్రకృతికీ మధ్యన, మనిషి కీ, సమాజానికీ మధ్యన, సమూహానికి,  సమూహానికి మధ్యన, మనిషి కీ, మనిషికీ మధ్యన సంబంధాలను పరిశీలించే కథలు ఎలాగ జనం చేత చదివించవచ్చు? అది ఒక జ్ఞాపకం మీద ఆధారపడి ఉంటే, ఆ జ్ఞాపకం ఎంత వ్యక్తిగత రహస్యమైతే, ఎంత విశ్వ జనీనమైతే, అంతగా ప్రజలు ఆకథను సొంతంగా భావిస్తారు.

కిటికీ పక్కన కూర్చొని, బయట ముసురుగా వాన పడుతుంటే, వేడి వేడి పకోడీలు తింటూ, దుప్పటి కప్పుకొని, కళ్ళు మగతగా మూసుకొని మన జ్ఞాపకాల్లో మనం మునిగి పోవచ్చు. లేదా, ఆనాటి వానచినుకుల జ్ఞాపకాల కథలు చదువుకోవచ్చు. ఈ రకరకాల రచయితలు తమ తమ రహస్యాలు మీతో పంచుకుంటారో? మరి ఆ జ్ఞాపకం మీలో వేరే జ్ఞాపకం లేపుతుందో? ఈ కథ ద్వారా, మీ ప్రపంచ దృక్పథం మారుతుందో? లేదా ఉన్న దృక్పథమే బలపడుతుందో?  

“ఆ నాటి వానచినుకులు” ఈ రచయితలకు కావలసిన ఒక కాన్వాస్ ఇచ్చింది. వాళ్లకు పూర్తిగా స్వేచ్ఛ లేదు, అలాగని పూర్తిగా కట్టుబాట్లు లేవు. వాళ్ళు ఈ స్వేచ్ఛనీ, కట్టుబాట్లనీ, ఉపయోగించుకుంటూ,  ఏ విధంగా, ఎటువంటి విషయం మీద రాస్తారో కుతూహలంగా ఉంది, నాకైతే! మీరుకూడా చదివి చూడండి!

*

 

 

రామారావు కన్నెగంటి

రామారావు కన్నెగంటి

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు