వానప్రస్థ – The Northern Winds

“నేను సంతోషంగా ఉన్నానా అంటే ఉన్నాను. కానీ ఏదో తెలియని వెలితి..”

డియారం ముళ్ళు సరిగ్గా 5:00 మీదకు రాగానే, తెల్లారిందని తెలియజేస్తూ అలారం మోత సులోచన చెవులను తాకింది. అప్పటికే తను మేలుకుని చాలా సేపు అయ్యింది. కాలిఫోర్నియా వచ్చి దాదాపుగా రెండు నెలలు అవుతున్నా అక్కడి పద్ధతులకు,వాతావరణానికి శరీరం, మనసు ఇంకా అలవాటు పడలేదు.

చెవిలో జోరీగలాగా అలారం మ్రోగుతూనే ఉంది. దాన్ని నొక్కబోయింది. కానీ,చీకటిలో తత్తరపాటుతో గడియారం ధడేలున కిందపడి మరికాస్త పెద్ద శబ్దం చేసింది. తన కంగారుకు మనసులో తనని తాను తిట్టుకుంది. ఇదంతా తన తప్పే. అసలు అంత త్వరగా లేవాల్సిన అవసరం ఏముంది ? అదీనూ,తన కొడుకు ఇంట్లో. కానీ, గత 45 ఏళ్లగా అలవాటైపోయిన అలవాటు. ఇప్పుడు, మార్చుకోవాలన్నా మారేది కాదు. పద్దెనిమిది సంవత్సరాలప్పుడు, పెళ్ళైన తొలి నాళ్లలో, తను మాత్రం ఎన్నిసార్లు అనుకోలేదు- ఒక్క రోజైనా మరికాసేపు పడుకుందామని. కానీ, ఉమ్మడి కుటుంబంలోని అవసరాలు తనకి ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. పోనీ , ఇప్పుడు పడుకుందామంటే కంటి మీదకు కునుకు రాదే?

***

“అమ్మా, మాతో పాటు అమెరికా వచ్చేసేయి. నీకు అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటానుగా. కావలసినన్ని సౌకర్యాలు,సదుపాయాలు ఉన్నాయి. అందరం కలిసుండొచ్చు.” మూడు నెలల క్రితం సాగర్ తనతో అన్న మాటలు గుర్తొచ్చాయి సులోచనకి.

ఆ క్షణంలో సాగర్ చెప్పింది సబబుగానే తోచింది తనకి. కొడుకు కోడలు మనవడు మనవరాలు. వీళ్లే కదా ఇప్పుడు తనకున్న కుటుంబం. అంతకన్నా ఇంకేం కావాలి అనుకుంది .

***

సరిగ్గా వారం క్రితం,

“అమ్మా .. ప్రొదున్నే అంత త్వరగా లేవడం ఎందుకు? హాయిగా పడుకోవచ్చు కదా. పొద్దు పొద్దునే కిచెన్లో శబ్దాల వల్ల మృదులకి మెలకువ…. ” మాటలు పూర్తవ్వకముందే కళ్ళలో ఉబుకుతున్న కన్నీటిని దాచుకుంటూ, “సరేలే రా!” అంది.

సన్నని కన్నీటి పోర వల్లనేమో బెడ్ పక్కనున్న గడియారంలోని అంకెలు మసకబారి కనిపించాయి. కళ్ళు నులుముకుని చూసింది. తెల్లవారుఝాము 5:30 కావస్తోంది. కాసేపు విష్ణు సహస్రనామం వల్లించింది. ఎందుకో మనసు కుదురుగా లేదు. ఏదో తెలియని అలజడి. తన కళ్ళను అప్రయత్నంగా కుడి పక్కనున్న టేబుల్ వైపు తిప్పింది. డ్రా లోని నీలి రంగు లెటర్ కళ్ళ ముందు తళుక్కుమంది. దాని నిండా ఊరి వార్తలను అక్షరాలుగా పోగు చేసి రాసింది శ్యామల. లేచి వెళ్ళి తెచ్చుకుంది.

సులు! సంధ్య వాళ్ళ అబ్బాయికి ఐఐటీలో సీట్ వచ్చింది . మొక్కులు తీర్చే పనిలో గుళ్ళు తిరుగుతోంది ఇప్పుడు. వీధిచివరి విశాలాక్షి వాళ్ళ అమ్మాయి వాళ్ళ కాలేజీ లెక్చరరుతో జండా ఎత్తేసింది. ఎంత అమాయకంగా ఉండేదని పిల్ల. ఎన్నడైనా అనుకున్నామా ఇలా చేస్తుందని! ఉల్లిపాయలు ధర కిలో 100 దాటేసింది. వచ్చే వారం ఊళ్ళో జాతర చాటింపు వేస్తున్నారు. మూర్తి గారి మనవరాలి బారసాల భలే బాగా చేశారనుకో. పాప పేరు ఆద్య. రాజ్యం వాళ్ళింట్లో అద్దెకున్నవాళ్ళు ఎట్టకేలకు పోయిన నెలాఖరున ఖాళీ చేసేసారు. ఇల్లు గుల్ల చేశారని లబోదిబోమంది…’

 ఇలా లెటర్ మొత్తం ఊరి కబుర్లతో నింపేసింది. అది చదివినంత సేపు శ్యామల పక్కన్నే ఉన్నట్లుగా అనిపించింది సులోచనకి. ఎన్ని సార్లు చదివిందో. చదివిన ప్రతిసారి లెటర్ మధ్యలో శ్యామల అడిగిన ప్రశ్న దగ్గర గొంతులో ఏదో అడ్డుపడినట్టు అయ్యేది.

ఇంతకీ నువ్వక్కడ సంతోషంగా ఉన్నావా సులు? ‘

‘సంతోషంగా ఉన్నానా ?’, తనని తాను ప్రశ్నించుకుంది సులోచన.

శ్యామలని ఏమార్చలేదు తను. అదేంటో శ్యామలకి అన్నీ ఇట్టే తెలిసిపోతాయి- సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలోని సీతకు మల్లె. ఇప్పుడనే కాదు,గత నలభై సంవత్సరాలుగా.

కాసేపటికి కిచెన్ లో అలికిడి వినిపించింది. ఒక తుఫాను రాబోతుందని అది ఒక గంటా, ముప్పావుగంట పాటు ఉంటుందని సులోచనకి అర్థం అయ్యింది. సంద్రం యొక్క ఉప్పెన తాకిడి తెలిసిన బెస్తవాళ్లలాగా, నిమ్మళంగా లేచి స్నానం చేయడానికి సిద్ధమైంది. వంట చేయడం, పిల్లల్ని రెడీ చేయడంతో పాటు ఆఫీస్ నుండి ఫోన్ కాల్స్ మాట్లాడటం, లాప్టాప్ లో ఈ-మెయిల్స్ చూసుకోవటం ఇలా అన్నీ పనులు ఏకకాలంలో చక చకా జరిగిపోతాయి. సాగర్ తన ఆఫీసుకు వెళ్లే దారిలో పిల్లల్ని స్కూల్లో దింపేస్తాడు. మృదుల మరో కారులో ఆఫీస్ కు వెళ్తుంది. సులోచన రెడీ అయ్యి వచ్చే సరికి అందరు తమ తమ విధులకు వెళ్ళడానికి సిద్ధంగా వుంటారు. ఎప్పటిలానే ఈరోజు కూడాను. ఒక్కసారిగా నిశ్శబ్దం ఇల్లంతా అలుముకున్నట్లు అనిపించింది సులోచనకి. మెల్లగా టిఫిన్ చేసి లివింగ్ రూంలో సోఫాలో కూలబడింది. సూర్యుడు దట్టమైన దొంతెరల్లోంచి లోనికి తొంగి చూస్తున్నాడు. చలికాలపు వెచ్చటి సూర్యరశ్మి నెమ్మదిగా తనని తాకుతోంది.

‘భజ గోవిందం…భజ గోవిందం….గోవిందం భజ మూఢమతే…’ నిర్జీవంగా ఉన్న నిశ్శబ్దంలో ఒక కూనిరాగం అందుకుంది సులోచన. మనసుకు ఊరటగా అనిపించింది. టేబుల్ డ్రా లోని నీలి రంగు లెటర్ గుర్తొచ్చింది. లెటర్ తో పాటు మధురవాడ, ఇల్లు, పెరడు,అందులోని ఉయ్యాల, తను ఎంతగానో ప్రేమించే పూల మొక్కలు, శ్యామల, పని పిల్ల రంగి,ఎప్పుడు ఫోన్ చేసినా వెంటనే సరుకులు పంపే అంగడి సదాశివం, ఎదురింటి పంకజం ఇలా అందరూ, అన్నీ కళ్లెదుట నిలిచాయి. ఈ చిన్ని జీవితంలో ఎన్ని మలుపులు? ఎందరితో పరిచయాలు? అక్కరకు రాని బంధాలు కొన్నైతే, అక్కున చేరదీసినవి మరికొన్ని.

మధురవాడతో, అక్కడి మనుషులతో తన అనుబంధం అటువంటిది. ఊరిని వదిలి కాలిఫోర్నియా రాలేక తను ఎన్ని రాత్రులు మానసిక సంఘర్షణ అనుభవించిందో తలుచుకుని భారంగా ఒక నిటూర్పును వదిలింది.

‘అయినా,గతంలో బ్రతకడమేంటి నా పిచ్చి కాకపోతే…ఛ !’అంతలోనే భారమైన గుండెని దిటువు చేసుకుని జ్ఞాపకాల మబ్బుని విదిలించుకుని లేచింది. డైనింగ్ టేబుల్ పైన సగం తాగి మిగిల్చిన పాల కప్పులు కనిపించాయి. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో తన మీద తనకు వచ్చిన కోపంతో వాటిని తీసి వాష్ బేసిన్లో పడేసింది

అప్పటికే మధ్యాహ్నం 12:30 దాటింది. ఫ్రిడ్జ్ డోర్ తెరచి చూసింది. రుచి లేని కూరలు అందులోకి ఎండిపోయిన చపాతీలు. వాటిని వేడి చేసుకుని తినాలనిపించలేదు సులోచనకి. డైట్ గీటు అంటూ మృదుల తన నోటికే కాక సాగర్ నోటికి కూడా తాళం వేసేసింది. పాపం సాగర్. అసలే భోజన ప్రియుడు. సులోచన అమెరికా వచ్చిన కొత్తలో తన చేతి వంటని ఆవురావురమంటూ లాగించాడు.

***

“ఎన్నాళ్ళు అయ్యింది అమ్మ, ఇంత కమ్మని భోజనం తిని…”

“అత్తయ్యా …రొయ్యల ఇగురు చేయడంలో మీకు మీరే సాటి,” అత్తగారికి కితాబిచ్చింది మృదుల.

“నానీ ఈజ్ ఎ గ్రేట్ చెఫ్!” మనవడు కితాబిచ్చాడు. దాని అర్థం సాగర్ చెబితే సంబరపడిపోయింది సులోచన. పట్టాలు తెచ్చుకునేంతగా చదువుకోకపోయినా, పాకశాస్త్రంలో మాత్రం పట్టభద్రురాలు. ఉమ్మడి కుటుంబం- సంసారం, వంటిల్లు-వంట ఇవి తప్ప తనకి పెద్దగా ఏమి తెలియదు. ఆశించనూలేదు. అందుకే మృదులను ఎప్పుడు చూసినా చాలా గర్వంగా అనిపిస్తుంది. తెలివిగలది, అనర్గళంగా మాట్లాడుతుంది, ఇప్పటి పోటీ ప్రపంచంలో ధీమాగా ముందుకెళ్తోంది. అందుకే తనకి వీలైనంత వరకు కిచెన్ లో మృదులకి చేదోడువాదోడుగా ఉండాలనుకుంది. కాలిఫోర్నియా వచ్చిన కొత్తలో వంట జోలికి మృదులను రానిచ్చేది కాదు. మృదుల కూడా హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది.

“ఓ గాడ్ ! కొలెస్ట్రాల్ ! క్యాలోరిస్ ! సాగర్ కాస్త చూసి తిను. ఇవి బర్న్ చేయాలంటే మినిమం 2 గంటలు వర్క్ అవుట్ చేయాలి. అరె,నువ్వన్నా చెప్పొచ్చుగా ఫుడ్ లో ఆయిల్ అండ్ మసాలా తగ్గించమని,” మృదుల రుసరుసల గుసగుసలు సులోచన చెవినిపడ్డాయి నాలుగు రోజుల క్రితం. అయినా ఎవరి కోసం చెబుతోంది. కొడుకు ఆరోగ్యం కోసమే కదూ అని సముదాయించుకుంది.

***

ఉన్న ఆకలి మందగించడంతో ఫ్రిడ్జిలోంచి మంచినీళ్లు తీసుకుని తడారిపోయిన గొంతును తడుపుకుని బెడఁరూంలోకి వెళ్లి కాసేపు కునికిపాట్లు పడింది సులోచన.

నీలి రంగు ఆకాశాన్ని దట్టమైన నల్లటి మబ్బులు కమ్మేశాయి. అప్పటిదాకా సన్నగా వీచిన పిల్ల గాలి జోరందుకుని బలంగా వీయడంతో కిటికీకి వేలాడదీసిన కర్టైన్స్ సులోచనని విసురుగా తట్టి లేపాయి. ఒక్క ఉదుటున లేచి కూర్చుంది. బయటకు తొంగి చూసి గాబరాగా పెరడులోకి పరుగు తీసింది.

‘అయ్యో !! అందరు వచ్చేలోపు బట్టలు ఆరకపోతే ఎట్లా?’ గొణుగుకుంది.

కాలిఫోర్నియా వచ్చినప్పటినుండి బట్టలు ఉతకడం, ఆరేయడం తనకొక పెద్ద సమస్య.

***

విశాలంగా ఉన్న పెరడులో బట్టలు ఆరవేయడానికి ఒక దండెం కట్టమని సాగర్ ని అడిగినప్పుడు, “అలా చేయడం వీలుకాదు అత్తయ్య,” అని కాస్త ఘాటుగానే జవాబిచ్చింది మృదుల. ఆ తరువాత సాగర్ నోరు మెదపలేదు.

కాసేపటికి, “ఇక్కడి మనుషులు, వాళ్ళ పద్ధతులు వేరు అమ్మా ! మన ఊర్లోలా కుదరదు. అందులోనూ,ఈ ఏరియాలో మనం తప్ప ఇండియన్స్ ఎవరు లేరు. కాబట్టి వీళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండాలి.” దండెం వేయడం కుదరదని సున్నితంగా తిరస్కరించాడు సాగర్.

“అయినా, అత్తయ్య మీ బట్టలు వాషింగ్ బాస్కెట్ లో వేసేయండి. ఎలాగూ ప్రతి ఆదివారం అందరివీ ఉతుకుతాము. అలాగే మీవినూ.” నిష్ఠూరంగా అంది.

మైల బట్టలు నిలువ ఉంచడం సులోచనకు మింగుడు పడని ఒక చేదు గుళిక. నేటి తరాల వారికి ఒక చాదస్తపు ధోరణిలా అనిపించినా,ఏరోజు బట్టలు ఆరోజే ఉతకడం అన్న అలవాటును మార్చుకోలేని నిస్సహాయత తనది. అందుకే ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన బట్టలని ఉతకడం,ఆరేయడం, మడత పెట్టడం చక చకా జరిగిపోతాయి.

పరదేశంలో తన చిన్న విజయం. ఒక చిన్న రహస్యం.

***

పడమటి గాలి వేగం పుంజుకుంది. సులోచన పరుగు లాంటి నడకతో ఆరేసిన బట్టలని చేతిలో బిగియపట్టి వడి వడిగా ఇంట్లోకి వచ్చి సోఫాలో ఉసూరుమంటూ కూలబడింది.

***

“మళ్ళీ ఎప్పుడొస్తావు సులు? ఇంతకీ అసలు వస్తావా?” రేపు తన ప్రయాణం అనగా ఇవ్వాళ అడిగింది శ్యామల.

గుండెల్లో గునపం దించినట్టయింది సులోచనకు.

వినీ విననట్టు మౌనంగా కిచెన్ లో సామాన్లు ప్యాక్ చేస్తూ ఉండిపోయింది.

గత 45 సంవత్సరాలుగా అలవాటుపడ్డ ఊరిని, తన గమనంలో మమేకమైన మనుషులను వీడలేక ఒక వారం రోజులుగా తను అనుభవిస్తున్న వ్యధ ఎక్కడ శ్యామలకి తెలిసిపోతుందో అన్న ఆదుర్దా.

“పోనీ, మరొకసారి సాగర్ కి నా మాటగా చెప్పనా, మేమందరం ఉన్నామని…నీకు ఏ లోటు ఉండదని?”

సాగర్ వినడు. అది శ్యామలకి కూడా తెలుసు. అందుకు కారణం- నెలన్నర క్రితం తననే కాక మధురవాడను కూడా కుదిపేసిన విషజ్వరాలు.

సులోచన పరిస్థితి బాగా క్షీణించడంతో సాగర్ భయపడ్డాడు. అమెరికా నుంచి హుటాహుటీన వచ్చేసాడు. సులోచనను తనతో అమెరికా వచ్చేయమని పట్టు పట్టాడు. అందుకు కావలసిన సన్నాహాలు చేయడంలో నిమగ్నమైపోయాడు. సులోచన సాగర్ మాటకి ఎదురు చెప్పలేకపోయింది ఆ సమయంలో.

“నీకు అక్కడ ఒకవేళ న..చ్చ..క పో..తే ..సులు?” నీళ్లు నమిలింది శ్యామల.

***

ఉలిక్కిపడింది సులోచన. లివింగ్ రూమ్ అంతా కలియ చూసింది. చుట్టూరా నిశ్శబ్దం. గడియారంలో సమయం సాయంత్రం 4:00 సూచించింది.

మధురవాడలో ఐతే ఈపాటికి శ్యామల, తాను టీ తాగుతూ కబుర్లు చెప్పునేవాళ్ళు. కూరగాయలు, పూలు అమ్మేటోళ్లు వసారాలో కూర్చున్న తమని పలకరించందే పోరు. కబుర్లతో కాలక్షేపం తరువాత ఇద్దరు కలిసి రామాలయానికి నడుచుకుంటూ వెళ్లేవారు. ఆరోగ్యానికి ఆరోగ్యం, పుణ్యానికి పుణ్యం.

సుపరిచితమైన వీధులు,మనుషులు. మరి ఇక్కడ బోసిపోయిన రోడ్డుకి ఇరువైపులా గంభీరంగా కనిపించే దట్టమైన చెట్లు. అలికిడి కరువైన పెద్ద పెద్ద చెక్క ఇళ్ళు. వారాంతంలో తప్పిస్తే మిగతా రోజుల్లో మనుషుల సందడి దాదాపుగా శూన్యం. ఎవరి ప్రపంచంలో వారు లీనమై వుంటారు, పక్క వాడితో సంబంధం లేనట్టుగా.

***

ఇవ్వాళ సాగర్ ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేసాడు. తనతో పాటు పిల్లలు కూడాను. పిల్లలు డ్రాయింగ్ రూమ్ కూర్చుని హోంవర్క్ అని కార్టూన్స్ అని వాళ్ల కృత్రిమ లోకంలో లీనమైపోయారు. సాగర్ సులోచనతో కాసేపు మాట్లాడాక ఏదో ఆఫీస్ పనంటూ లాప్టాప్ ముందేసుకుని కూర్చున్నాడు.

మరికాసేపటికి మృదుల ఆఫీస్ నుంచి వచ్చింది. రోజులా ఇవ్వాళ లేదు. అలసిన కళ్ళు తనకేసి కోపంగా చూస్తున్నట్టనిపించి ముభావంగా లేచి ఏదోపనున్నట్టు వంటిట్లోకి వెళ్ళింది సులోచన.

“హే మృదు ! How had the day been?” లాప్టాప్ మీద నుంచి కళ్లు తిప్పకుండా అడిగాడు సాగర్

నోరు మెదపలేదు మృదుల.

“Bad day at office huh?” ఈసారి తనకేసి చూస్తూ అడిగాడు.

“కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయ్ సాగర్.” మెల్లగా అంది మృదుల.

“Is all Ok?”

“ఇప్పుడు కాదు, తరువాత…,” అంటూ సోఫాలో ఒరిగి తన రెండు చేతులతో ముఖాన్ని దాచుకుంది. సులోచనకి ఏమి చేయాలో పాలుపోలేదు. మృదులకి కాఫీ కావాలేమో అన్నట్టుగా సాగర్ కి సైగ చేసింది. వద్దన్నాడు. చేసేదేమిలేక తన రూంలోకి వెల్లింది సులోచన.

సుమారు ఒక గంట తరువాత…

“అసలు…ఈ ఇల్లు ఇల్లులా లేదు !” రుసరుసలాడింది మృదుల.

“విషయమేంటో సూటిగా చెప్పు,” మెల్లగా అడిగాడు సాగర్.

“ఆవిడ పొద్దున్నే మడి, స్నానం అంటారు. పిల్లల స్కూల్ టైంకు అడ్డు వస్తోంది. మనమందరం వెళ్ళాక ఖాళీయేగా. అప్పుడు చెయ్యొచ్చుకదా. ఇక ఫుడ్ … ఓహ్ గాడ్ !! ఎంత వేస్టేజ్ తెలుసా? నిన్న చేసింది ఈరోజు తినరట. నేను చేస్తాను అంటారు. అంతంత ఎందుకు వండటం ? చూసుకోవాలిగా …పైగా ఆయిలీ ఫుడ్. ఛ ! తన ధోరణి తనదే. అరె ! ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోవాలిగా. పైగా, బట్టలు రోజూ ఊతక్కండి అని ఎన్ని సార్లు చెప్పాను ? విన్నారా ? లేదు! ఎవరికి తెలియకుండా ఉతికేస్తోంది. ఇవ్వాళ Mrs.స్మిత్ కనిపించి హేళనగా అడిగింది. ఫెన్సింగ్ పైన బట్టలేంటి అని. It was damn embarrassing !మారుతున్న కాలంతో పాటు ఈవిడ కూడా మారాలి.”

“మెల్లగా !! అమ్మ వింటే బాగోదు…listen, నేను మాట్లాడుతా తనతో “సర్ది చెప్పబోయాడు సాగర్.

“ఎనఫ్ సాగర్ ! చాలా ట్రై చేశాను. నాకు తెలుసు ఆవిడ నీకు ఇంపార్టెంట్ అని. But, I have lost my patience. నా వాళ్ళ కావట్లేదు. పిచ్చెక్కిపోతోంది. I don’t have my privacy anymore. ఒక్కోసారి పిల్లల్ని తీసుకుని ఎక్కడికైనా వెళిపోవాలనిపిస్తోంది” అగ్ని పర్వతం భద్దలైనట్టు ఆక్రోశాన్ని వెళ్లగక్కింది మృదుల.

క్షణంపాటు గుండె కొట్టుకోవడం ఆగినట్టు అనిపించింది సులోచనకు. నిర్జీవంగా నిలుచుండిపోయింది. మసక వెలుతురులో గోడపైన రెపరెపలాడుతున్న రెండు నీడలు దగ్గరయ్యాయి. మరో రెండు నీడలు కూడా ఒకటవ్వడంతో గోడపైన నల్లటి ఆకారం మరికాస్త పెద్దదైంది. నల్లటి మబ్బులా తనని కమ్మేసింది.

ఆలోచనల మధనంలో ఏమి వినపడట్లేదు సులోచనకి. పరధ్యానంగా బెడ్ వైపు అడుగులు వేసింది. కూర్చుని కళ్ళు మూసుకుంది. అలా చాలా సేపు ఉంది.

***

ప్రియమైన శ్యామలకు –

అక్కడ అంతా కులాసా అని తలుస్తున్నాను. కాలిఫోర్నియా బాగుంది. పడమటి పోకడలకు అలవాటు పడటం ఈ వయసులో కాస్త కష్టం అనిపించినా అలవాటు పడక తప్పదు. పెద్ద కష్టమైనది కాదు కూడా ,ఎందుకంటే జీవితాంతం మనం చేసింది అదే కాబట్టి!

సాగర్, మృదుల,పిల్లలు ఇలా అందరినీ చూస్తుంటే చెప్పలేనంత సంతోషంగా ఉంది. పిల్లలకి నేను అలవాటు పడటానికి కొంత సమయం పట్టొచ్చు. వీడియో కాల్స్ లో తప్పిస్తే నేరుగా వాళ్ళు నన్ను చూసింది చాలా తక్కువ కదా. మరో లెటర్ రాసేలోపు చేరికవుతారేమో చూడాలి. నేను సంతోషంగా ఉన్నానా అంటే ఉన్నాను. కానీ ఏదో తెలియని వెలితి. బహుశా నేను మధురవాడాకు వచ్చాక తీరిగ్గా అలోచిద్దాములే.

అవును. నువ్వు సరిగ్గానే చదివావు !

పేపర్ పై తెలియకనే జారిన కన్నీటి బొట్లని చీర కొంగుతో జాగ్రత్తగా తుడిచింది.

అమెరికాలో అవసరంలేని ఒంటరి తాను, అని గోడపై ఒకటైన నీడలు మరొకసారి గుర్తుచేశాయి సులోచనకు.

*

పెయింటింగ్: సత్యా బిరుదరాజు

సుచిత్రా రెడ్డి

సుచిత్రా రెడ్డి

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు