వాదాలని దాటి స్వేచ్ఛ కోసం అన్వేషణ

మ పుస్తకం వేస్తోందంటే నా పుస్తకం వచ్చిన అంత సంతోషపడ్డాను. కథ, కథ కి తన పరిశీలన ఒప్పుదలా,  హుందాతనం  పెరగడమూ,  పదునెక్కడమూ  గమనిస్తూనే ఉన్నాను. కాబట్టి ఆ కథలన్నీ ఒకే గుచ్ఛం లాగ చదువుకోవటం చాలా బాగుంది. ప్రింట్  క్వాలిటీ చాలా బాగుంది, ఇంత బాగా తీసుకొచ్చినందుకు పర్స్పెక్టివ్స్ ప్రచురణలకి ధన్యవాదాలు చెప్పాల్సిందే.

ఇకపోతే కథల్లోకి వస్తే కొన్నేళ్ల క్రితం మనం ఒక ప్రకటన చూసేవాళ్లం. స్కూటీ వచ్చిన కొత్తల్లో అనుకుంటాను.  ఒక అమ్మాయి స్కూటీ కొనుక్కొని దానిమీద స్వేచ్ఛగా వెళ్తూ వై బాయ్స్ షుడ్ హావ్ ఆల్ ద ఫన్?? అని అడుగుతుంది చాలాసార్లు ఆ ప్రశ్న చాచి కొట్టినట్టు అనిపిస్తుంది నాకు.  బాపుగారి  డైలాగ్ లాగా నువ్వు నేను సమానం కానీ నేను ఇంకాస్త ఎక్కువ సమానం అనే పరిస్థితులు అన్ని వర్గాల్లోనూ కుటుంబాల్లోనూ ఇంకా గమనిస్తూనే ఉన్నాం. మారింది కేవలం కుటుంబానికి అవసరమైన సౌకర్యవంతమైన స్వేచ్ఛ  మాత్రమే గాని, అది ఒక మనిషికి కావాల్సిన నిజమైన స్వేచ్చ అవునో కాదో తెలుసుకోలేని సందిగ్ధంలో  నేటి మహిళ ఉంది.

అలాంటి కథానాయకల కలకి, నిజానికి మధ్య ఉండే పెనుగులాట ఈ కథలు.

ఉమ తెలివైన కథకురాలు. ఆమె పాత్రలు వృత్తంలో ఉండే తనకంటూ అస్తిత్వాన్ని సృష్టించుకుంటాయి ఎదురయ్యే సమస్యల్ని సవాళ్లని  నిపుణంగా  ఎదుర్కోవడంలో, తన పాత్రలు మెట్టు మెట్టు ఎక్కటం మనం గమనిస్తూనే ఉంటాం. అంతేకాక ఫెమిజానికి నిజానికి మధ్య ఉన్న , తెరలు, పొరలు ఉమ పాత్రలకి బాగా తెలుసు. అలాగే ఎదురయ్యే సమస్య నుండి పారిపోకుండా వాటి పై పట్టు సాధించడం కూడా తెలిసి ఉన్నట్టే ఉంటుంది ప్రతి పాత్ర.

ఇంకో విషయం తన కథలో నాకు నచ్చేది ఏంటంటే ఏ వాదంలోనూ ఇజంలోనూ బందీ కాకపోవడం. నాకు ఎప్పుడూ ఒక ప్రశ్న వేధిస్తూ ఉంటుంది, ఇంత చదువుకున్న తెలివైన ఆడవాళ్లు ఎంతో కొంత అబ్యూస్ ని, హింసను భరించటం. కానీ ఇక్కడ ఉమ రాసిన కథల్లో, పాత్రలు తనదైన శైలిలో తిరగబడతాయి అదే తిరగబడే ప్రక్రియలో గొప్ప విషయం ఏంటంటే తమదైన సున్నితత్వాన్ని, జీవనోత్సాహాన్ని కోల్పోకుండా ఉండడం. ఇందులో ఏ పాత్ర బండగా చేదుగా ఉండవు. సంగీతాన్ని, సాహిత్యాన్ని,సహనాన్ని, స్వేచ్ఛని, ప్రేమని వదులుకోగలగడాన్ని ఏ తీర్పు లేకుండా సహజంగా స్థిమితంగా అలవర్చుకుంటూ ఎంజాయ్ చేస్తున్న పాత్రలవి. ఉన్నంతలో తగిన  పరిష్కారాన్ని వెతికే దిశలో అసలు ఆలస్యం చేయని మహిళల కధలు ఇవి. అది శిశిర కావచ్చు మయూర కావచ్చు గౌరీ కావచ్చు, మిధున కావచ్చు… చందమామలో మచ్చ ఉందని వెన్నెలని కాదనుకునేంత తెలివి తక్కువ వాళ్ళు కాదు. మచ్చని మరిపించేంత వెన్నెలని అందులో హాయిని సొంతం చేసుకోవడానికి ప్రయత్నించే కష్టజీవులు.

నేను చాలా సార్లు అనుకుంటూ ఉంటాను సహాయం చేయడం కన్నా సహాయం తీసుకోవడం, అన్ కండిషనల్ గా ప్రేమ పంచడం కన్నా, కండిషనల్ బంధాల్లో, తన చోటుని స్థిమితాన్ని వెతకడం మరీ కష్టమని. ఉమ పాత్రలోని ఆధునిక మహిళ సహాయం అడగడానికి కాస్త సంకోచిస్తుందేమో గాని ఊపిరాడనివ్వని ఉరివేత లో నిత్యం బతకదు. ఈ కథలోని సంస్కారవంతమైన సహాయక పాత్రలు నాకు భలే నచ్చాయి అది సరోజినమ్మ కావచ్చు శారదమ్మ కావచ్చు హుక్కు కథలో అత్తమ్మ కావచ్చు కానీ తాము పడిన కష్టాలు పెనుగులాటలు తన పిల్లలు పడకూడదు అనే తల్లి మనస్తత్వం, మంచితనం ప్రతి ఒక్కరిలోనూ ఉండడం అంత సహజం కానప్పటికీ మనసుకి హాయినీ,  మానవత్వం మీద నమ్మకాన్ని ఇస్తుంది. చాలా హుందా గా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకుంటూ అవసరమైన చోట సున్నితమైన ఖచ్చితత్వాన్ని అలవోకగా ప్రదర్శించే పాత్రలవి. కేవలం మహిళ కాబట్టి తాను చేసేదంతా సరైందే అనే  భ్రమలో ఉమా పాత్రలు ఉండవు.

ఒకవైపు చూపించే తీర్పుల తర్జని లో, నాలుగు వేళ్ళు తన వైపే ఉన్నాయనే స్పృహ నిండుగా ఉన్న మనుషులు వాళ్లు. ఇవాల్టి మహిళ మైదానంలో రాజేశ్వరి కన్నా, కొడవటికంటి కుటుంబరావు కథల్లో ఆడవాళ్ళ కన్నా ఒక మెట్టు ఆర్థికంగా ఎక్కువగా ఉన్న మానసికంగా ఉద్వేగంగా చాలా వొత్తిడిలో ఉంది. వోల్గా గారు ఒకసారి అన్నారు ఒకప్పుడు యుద్ధం శత్రువు కచ్చితంగా గీతలు గీసినట్టు ఉండేవారు ఇప్పుడు అది కూడా లేదు ఆని కాబట్టి ప్రతి నిమిషం అస్తిత్వ కదనరంగమే అని నాకు అనిపిస్తుంది.

అయోమయం  నుండి స్పష్టత వైపు ప్రయాణించే ఈ అమ్మాయిలు, అమ్మలు రేపటి భారం కాని, నిజమైన స్వేచ్ఛ స్వరాలు.

*

సాయి పద్మ

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • “కలకి, నిజానికి మధ్య ఉండే పెనుగులాట ఈ కథలు.”-
    ఉమా కథల మీద సాయి పద్మ గారి కామెంట్. ఒక్క మాటలో కథల అంతసూత్రాన్ని పద్మగారు చెప్పారు. ఈ పెనుగులాటకి గడప లోపల బయట ఉన్న జీవితం నుంచి వచ్చినవే ఈ కథలు. వీటన్నిటి నేపథ్యం సమాజం. ఆ నేపథ్యాన్ని అర్థం చేసుకునేందుకు సహకరించేవే సామాజిక చలన సూత్రాలు. ఈ అవగాహన ఒక్కోసారి మనకు తెలియకుండానే సమాజం నుంచి మనం అందిపుచ్చుకుంటాం. దాన్ని ఒక ఇజంలో బందీకావటం అనటం సరైంది కాదేమో. సమాజాన్నీ మానవ ప్రవుత్తినీ అర్థం చేసుకునే సూక్ష్మదర్శిని, దూరదర్శిని ఆ సైద్ధాంతిక తాత్విక ప్రాతిపదికలు. ఈ కథల్లో రెండు సారంగలో మొదట చదివినప్పుడు కథల్లోని ఫ్రెష్ నెస్ ఎంతో నచ్చి ఉమాని మేమే పుస్తకం కోసం అడిగాం. మీ చిన్న రివ్యూ లో ఉమా కథల అంతరంగాన్ని బాగా చెప్పారు. కాలo విధించిన నిషేధాలని బ్రేక్ చేయటమే 25వ గంట అయితే మీరన్నట్లు ఉమా తన తొలి కథా సంకలనంతో ఆ కాలపరిమితులని అధిగమించింది. మీ ఇద్దరికీ అభినందనలు. .. ఆర్ కె ( పర్ స్పె క్టివ్స్ )

    • నేను కావాలనే ఇజం తో వాదం తో బందీ అయ్యే సంఘర్షణ గురించి రాసేను అండీ.. మీరు అన్నది నిజమే.. కాల పరిమితి, పెనుగులాట లు దాటి, ముసుగులో గుద్దులాట లేని స్వేచ్చ అవసరం. దానికి ఇజం కూడా , ఒక బంధనమే అన్నది నా అభిప్రాయం మాత్రమే కాదు. ఈ పెనుగులాటల పరిష్కారం గా ఉమా రాసింది. అదే చెప్పాను. ఉదాహరణ కి ఒక మనిషి సెక్సువల్ ఐడెంటిటీ ని నేను గుర్తించటం మాత్రమే కాదు, హుందా గా వొప్పుకున్నాను అన్నది ఒక కధలో అంతఃసూత్రం

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు