వాడికోసం

సగం కాలి మిగిలిపోయిన మత గ్రంధాల్నీ, పనికిరాకుండా పోయిన మా పూర్వీకుల పని ముట్లనీ బయటకి తీశాం.

1.

మాకెపుడన్నా వినోదం తక్కువైనా,
కాలాన్ని కత్తిరించాలనుకున్నాప్పుడల్లా,
లేక నీతివంతులమైన మా పూర్వీకుల ద్వారా, మా ద్వారా
నిర్మించబడ్డ యీ సమాజానికి ముప్పు వాటిల్లేటప్పుడైనా,
మేం వాడికోసం వెతికేవాళ్లం.

వాడేమో గడిచిన రాత్రిలోని నిశ్చబ్దాన్నీ, నిర్వేదాన్నీ పిండేసి మొఖాన చల్లుకుని,
గాలికీ, ధూలికీ రాసుకుంటో యెగిరిపోతో వుండే యెవరో చింపి పడవేసిన కాగితపు వుండలా
నీరసంగా రోడ్లన్నీ చుట్టేస్తున్నప్పుడు
వొకానొక మలుపులో కాల్లీడ్చుకుంటో వెళ్తో కనిపించేవాడు.

మేం జేబులో పెట్టుకున్న
పొడుగాటి శూలాలన్నిటీనీ బయటికి తీసి
అప్రమత్తమయ్యేవాళ్లం.
మేం వాడి వెనకాతలే దగ్గిరగా వెళ్లేప్పటికి ఉలిక్కిపడ్డాం.

‘రేయ్! వాడు తలను నరుక్కుని చేతిలో పెట్టుకు తిరుగుతున్నాడ్రా!’
‘అయితే యిదీ మరీ దగాకోరుతనం,బరి తెగింపుతనం, అయితేనేం, యింకా నేల రాలలేదు కదా’
అంటో మా బళ్లాల్తో వాడి తలని నేలకి గిరాటేశాం.

వాడు అదాటున కలవరపడి
బిత్తర చూపులు చూస్తూ
దొర్లుకుంటో పోతోన్న తన తలను తిరిగి చేతుల్లోకి
తీసుకుని దిక్కులు చూసుకుంటో పరిగెత్తాడు.

మేం విజయంతో వెనుదిరిగాం.

2.

సమాజాన్ని నిర్మించటానికి
మా పూర్వీకులు మాకిచ్చిన
పనిముట్లు, ఆయుధాల్తో రాత్రి పరామర్శకి
వాడి యింటికి వెళ్లేవాళ్లం.

యెప్పట్లాగే,
రోజూ రాత్రి వాడి యిల్లు మంటల్లో దగ్దమవుతో వుండేది.
మేం నిరాశతో వెనుదిరిగేవాళ్లం.

ఉదయన్నే మళ్ళీ
వాడిని వాడే మొలిపించుకునేవాడు.

మేం మళ్లీ యే కూడలి మలుపులోనో కాపు కాసేవాళ్లం.

3.

కొన్నాళ్ల తరువాత వాడు కనిపించడం మానేశాడు.
యెవరికీ కూడా.

మాకు అకలి తగ్గిపోయింది.
కడుపులో విపరీతమైన యేవో నొప్పుల్తో మేం సతమతమయ్యేవాళ్లం.
అందరం డాక్టరు దగ్గిరకి పరిగెత్తుకెళ్లాం. ఆయనా విలవిల్లాడిపోతున్నాడు కడుపులో నెప్పితో.

మేం దేవుణ్ణి ప్రార్దించాం.
‘నీతిపరులమైన మమ్మల్నీ, మాచే నిర్మించబడ్డ యీ సమాజాన్నీ,
రాబోయే విపత్తును నుంచి కాపాడు తండ్రీ’ అని.

దేవలయాల్లో అర్చనలు చేయించాం.
చర్చిల్లో బైబుల్లు చదివాం.
మసీదుల్లో నమాజు చేశాం.

యేదో విపత్తునీ,కీడునీ శంకించాం.

4.

కొన్నాళ్లకి వాడు మళ్లీ కనిపించాడు.
మేం పట్టలేని సంతోషంతో
మళ్లీ పరుగెత్తాం.

కానీ ఆశ్చర్యం,
వాడు మొండెంపై తలని పాతుకుని తిరుగుతున్నాడు.

యీ దారుణమైన కుట్రనీ, మోసాన్నీ మేమెంతకు సహించలేకపోయాం.
వాడొక దగాకోరూ,తీవ్రవాది.

మా కళ్లలో, జేబుల్లో దాచుకున్న బళ్లాల్నీ, శూలాల్నీ మళ్లీ బయటికి తీసి
వాడి వెనకాతలే వెళ్లి కసిదీరా పొడిచాం.

ఆశ్చర్యం, వాడికేం అవ్వలేదు,
పైగా నింపాదిగా వెనక్కి తిరిగి, చిన్న నవ్వు రువ్వి తాపీగా
నడుచుకుంటో వెళ్లిపోయాడు.

మేం మొహాలు చూసుకున్నాం.
యింతలో హఠాత్తుగా మా గుంపులోంచి కేకలు.
వొక్కకరి అవయవాలు విరిగి పడుతున్నాయి.
వొకడివి నాలుక తెగిపడుతోంది,యింకడిది కాళ్లు, యింకొకడిది చేతులు,
కొందరివి తలలు,
యెవరికి వారు అతికించుకోవాలని చూసినా
యేదీ అతుక్కోవటం లేదు.
చేసేదేం లేక
యెవరి అవయవాల్ని వాళ్లు తమ యింటికి మోసుకెళుతున్నారు.

5.
మేం అందరం సమావేశమైన చోటుకి యెవరో వొగర్చుకుంటో వొచ్చి చెప్పారు,
మా యిళ్లన్నీ మంటల్లో కాలిపోతున్నాయని.

6.
కొన్ని రోజులకి ఎంక్వయిరీ కమిటీ తేల్చింది.
మా యిళ్లలో రేగిన మంటలకోసం నిప్పుని రాజేయటానికి
యెవరో మా పనిముట్లనీ, మతగ్రంధాల్నీ వాడారంట.

మళ్లీ మాకు అన్నం సయించటం లేదు.
అందరూ రోడ్లపైనే వాంతులు చేసుకుంటున్నారు.
ఇప్పుడు అందరూ బయట సంచీల్తో కనపడుతున్నారు.
యెప్పుడు యే అవయవం తెగిపడుందోనని,
అన్నీ సంచీల్లో సర్దుకుని యింటికి తీసుకెళుతున్నారు అతికించుకోటానికి.

యెవరైనా చూస్తారోమోనని బిక్కుబిక్కుమంటో సంచరిస్తూ వున్నారు.

అందరం మళ్ళీ ముక్త కంఠంతో ప్రార్ధించాం.
యీ జగత్తుపైకేదో మహా విపత్తు సంభవించబోతోందని,
నీతిగల మమ్మల్ని, లోకాన్ని కాపాడమనీ,

7.

వొకరోజు నించి వాడు కనబడ్డం మానేశాడు.
మేం వూపిరి పీల్చుకున్నాం.

గబ గబా మా యిళ్లకి పరిగెత్తుకెళ్లి
సగం కాలి మిగిలిపోయిన మత గ్రంధాల్నీ,
పనికిరాకుండా పోయిన మా పూర్వీకుల పని ముట్లనీ
బయటకి తీశాం.

సమాజాన్ని జాగృతం చేయటానికుపయోగపడే
మా పని ముట్లని
మేం మరమ్మత్తులు చేయించాం.

అందరం మతగ్రంధాల్ని శుద్ది చేసి
మళ్లీ తిరగరాసుకున్నాం.

*

పెయింటింగ్: పఠాన్ మస్తాన్ ఖాన్

Avatar

శ్రీధర్ చందుపట్ల

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు