వసుధా రాణి కవితలు రెండు

 1
సంశయం
ఉల్కలు మండిపోయే చోట
ప్రేమలు జన్మిస్తాయట
రాలుతున్న పూలు ఏమి
చెపుతున్నాయో విన్నావా?
సమయం లేదు మిత్రమా!
హృదయం చెప్పే మాటని
నాలుకతో బయటకు నెట్టు
ఉల్కాపాతం కింద నిలబడి
చేతులు చాచి కోరుకున్నదెవరినో
కనీసం వారికైనా చెప్పు!
      2
విసుగు
పిలుపులన్నీ ఆగిపోయే
చోటుకు ఎవరొస్తారు
పంపకాలు లేని చెలిమికి
ఎవరు సై అంటారు
సాయంకాలపు నడకలో
చేతిలో చెయ్యి లేదు
నా అడుగులో నీ అడుగు
నెమ్మదిగా పక్కకు
తొలగుతోంది
దీనికంతటికీ కారణం
మనమేనా?
ఏం సందేహంలేదు
ఎంతో అద్భుతమైనచిత్రాలను కూడా
నెమ్మదిగా చెరిపేయగల కాలం పనిది!
*
ఒక ప్రశ్న- ఒక జవాబు 
కవిత్వం ఎందుకు?
కవిత్వం నా జీవనాడి అని అనిపిస్తుంది. భావాలని సూటిగా సంక్షిప్తంగా వ్యక్తం చేయటానికి కవిత్వాన్నిమించిన సాహితి ప్రక్రియ లేదని అనిపిస్తుంది. ఏభావాన్ని అయినా కవిత్వంగా మార్చినప్పుడు దానికి  మరింత సొబగు చేరి పాఠకుల  హృదయంలోకి నేరుగా చొరబడుతుంది. ప్రపంచ సాహిత్యంలో కవిత్వం పాత్రని చూసినప్పుడు కవిత్వం ఎంత ప్రభావం చూపగలదో అర్ధం అవుతుంది. కవిత్వం ద్వారా పాఠకులకి చేరువ కావటం అన్న ఆకాంక్ష నన్ను కవిత్వం రాసేలా చేస్తోంది.

వసుధారాణి

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • వసుధారాణి కి అభినందనలు

  • కవిత్వం గురించి నిర్వచనం బావుంది. కవిత్వమూ బావుంది.

  • అద్భుతంగా ఉన్నాయి కవితలు!
    ఎంతో అద్భుతమైన చిత్రాలను కూడ
    నెమ్మదిగా చెరిపివేయగల కాలం పనిది!👌👌👌

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు