వడ్డాణం

“ఇదిగో బాబు, చివరిగా ఎన్ని కాసుల్లో వస్తుందో చెప్పు నా మనవరాలికి వడ్డాణం” మూడో సారి అడిగింది అమ్మమ్మ కొట్టునంతా మరో సారి కలయ చూస్తూ.

“మీకు తెలీనది ఏముంది పెద్దమ్మగారూ? పాతిక కాసులు దాకా పడుతుంది. కాస్త అటు ఇటు అవ్వచ్చు” నసిగాడు సేటు కొడుకు.

“అటు ఇటు ఏంటయ్యా? ఇటైతే పర్లేదు. అటైతే? ఎగస్ట్రా వేస్తావుగా?”

“అంటే పాప కాస్త బొద్దు కదండీ. చేసేటప్పుడు కాస్త ఎక్కువ బంగారం పట్టచ్చు” అన్నాడు మాట మధ్యలో ఆవిడ మానవరాల్ని చూస్తూ.

తన కూతుర్ని అనేసరికి పక్కనున్న అమ్మమ్మ పెద్ద కూతురు నొచ్చుకుంది.

“అయ్యో రామ. మా బాధ కూడా అదే. ఒట్టి బొంతొళ్ళు. ఏం చేస్తాం? ఇంతకీ వడ్డాణం ఎప్పటికిస్తావ్?”

“వచ్చే ఏకాదశి నాటికి రెడీ చేస్తా పెద్దమ్మగారు” అన్నాడు చీమల్లాంటి అక్షరాలు చిన్న తెల్లటి చీటీ మీద రాసి అమ్మమ్మ చేతిలో పెడుతూ.

“సరే సరే….చెప్పినవన్నీ గుర్తున్నాయిగా? చుట్టూ కమలాలు చెక్కుడుండాలి. ఆ చెక్కిన వేస్టేజి నా బిల్లులో వెయ్యమాక. మధ్యలో లక్ష్మీదేవి విగ్రహం ఉండాలి. మంచి రాళ్లు వెయ్యి. రంగు రాళ్లు వేసి వాటికి రేటు కట్టకు. నడుము రెండు వైపుల నుండి మధ్యలో అమ్మవారి బొమ్మ వరకు కింద సన్నటి పూసల గొలుసులు పెట్టు. ఆవగింజ కన్నా సన్నగా ఉండాలి ఆ పూసలు” అని మరోసారి గదమాయించి లేచి బయటకు నడిచింది. అమ్మమ్మ వెనకే ఆవిడ కూతుర్లిద్దరు, మనవరాలు కూడా.

“తప్పకుండా పెద్దమ్మగారు. నేను అన్నీ వివరంగా రాసుకున్నాగా” అన్నాడు షాపు బయట వరకు వచ్చి సాగనంపుతూ.

అమ్మమ్మ కి ఉమ్మడి కుటుంబం బాధ్యతలెక్కువ. ఇద్దరు కొడుకులు, వాళ్ళ కాపురాలు, పిల్లల సెలవలకి వచ్చిన కూతుర్లిద్దరు. ఆమె నలుగురి సంతానంలో ముగ్గురికి మగ పిల్లలే. పెద్ద కూతుర్కి తప్ప. ఆమెకి ఒక కొడుకు, కూతురు. పదకొండు నిండగానే ఆ ఒకే ఒక్క మనవరాలికి కొత్త బట్టలివ్వాలని వేసవి సెలవలకి పిలిపించింది. వాటితో పాటు లాంఛనాలు. పెద్ద కమ్మోరి ముఖ్యమైన లాంఛనం ఆడపిల్లకి వడ్డాణం చేయించడం. ఇప్పుడు అది చేయించడానికి కూతుర్లిద్దరిని, మనవరాలిని కూడా తీస్కుని వన్ టౌన్ మార్కెట్ కి వచ్చింది.

వస్త్రలత మార్కెట్ దగ్గర కొత్త షాపులు వెలిసాయి. అక్కడ కొత్త మోడల్స్ కొందామని ఆవిడకి చెప్పే ధైర్యం కూతుళ్ళకి లేదు. ఆవిడ ముత్తమ్మ గారు కొన్న కంసాలి దగ్గరే ఇంట్లో అన్ని శుభకార్యాలకి నగా నట్రా చేయించింది. ఆ షాపు పెద్దదైంది. దాని యాజమాన్యం ఇప్పుడు నాలుగో తరం చేతిలోకొచ్చింది. అందులో పని చేసినవారు రిటైర్ అయ్యి, కొత్త వాళ్ళు కూడా వచ్చారు. ఈవిడ మాత్రం ఏమీ మారలేదు, మార్చదు.

వన్ టౌన్. విజయవాడ. సాయంత్రం నాలుగు కావొస్తోంది. రద్దీ మార్కెట్ వీధులు. బీడీ పొగలు, చెమట వాసనలు. తోపుడు బళ్ళతో కూలీలు. నిత్యావసరాల కోసం జనం పరుగులు. స్పీడు స్పీడు గా కాగితం పొట్లాల్లో, పురికొస వేసి సరుకులు కడుతున్న కుర్రాళ్ళు, తూకంలో మోసం అని పేచీలు, సేటు అరుపులు. రద్దీ. కాలు మోపలేని రద్దీ.

“అలా దేభ్యం మోహమేస్కుని చూస్తావేంట్రా? మనిషి వస్తుంటే కనపడట్లా? కారు తీయ్యి” అని డ్రైవర్ ని తిట్టింది అమ్మమ్మ.

“తీసినా వెళ్లలేమమ్మా. సరుకు లోడింగ్ టైం కదా. మొత్తం జాం అయింది. ఇక్కడ నుండి వించిపేట, ఇస్లాంపేట, జెండాచెట్టు సెంటర్ వరకు బండ్లు ఆగిపోయుండాయమ్మా. పోనీ కార్లో కూర్చుంటారేంటమ్మా? టీ పట్టుకొస్తాను” అన్నాడు డోర్ తీస్తూ.

“ఛీ ఛీ. ఇక్కడ టీ తాగే ఖర్మ మనకేంటంట? మేము నాలుగడుగులేస్తాము. రద్దీ తగ్గాక తారాపేటలో ఉన్న మన షాపు దగ్గరికి బండి తీస్కుని రా. చూసి నడిపి చావు. అసలే కొత్త అంబాసిడరు. ఈ గోలలో ఏం గీతలు పడి చస్తాయో” అడుగులు వేయడం మొదలెట్టింది. వెనకే ఆవిడ కూతుర్లిద్దరు, మనవరాలు కూడా.

“అలాగేనమ్మా” ఇంకా వొంగితే నడుము పడిపోగలదు అనేలా వినయం ప్రదర్శించాడు.

నిజానికి అంబాసిడరు కొని అయిదేళ్ళు దాటింది. అది ఇంటికొచ్చిన రోజు, “పెద్ద కమ్మారు ఫియట్ కారు అమ్మేసి అంబాసిడర్ కొన్నారట” అని వీధి వీధంతా గొప్పగా చెప్పుకున్నారు. దాన్ని ఎప్పుడైనా ఇంట్లో ఆడవారు బయటకి వెళ్ళినప్పుడో, కుటుంబమంతా ఏ గుడికో వెళ్ళినప్పుడో బయటకి తీస్తారు. ఇంట్లో మగవారి రోజూవారీ తిరుగుడు కోసం బులంద్ భారత్ కి బులంద్ తస్వీర్, హమారా బజాజ్.

పావుగంట తర్వాత తారాపేటలోని షాపుకు చేరుకున్నారు. తాతగారు టైర్ల డీలర్. షాపంతా ఒకటే రబ్బరు వాసన. తారపేట వైపు అన్నీ ఇలాంటి దుకాణాలే. ఆడవారు అటు వైపు వెళ్లడం చాలా అరుదు. ఎప్పుడైనా కాళేశ్వరరావు మార్కెట్ కి వచినప్పుడో లేదా కంసాలిపేటకి వెళ్ళినప్పుడో షాపు వరకు వెళ్తారు. అక్కడ ఆగి టీ తాగి ఫ్రూట్ బ్రెడ్, బ్రిటానియా బిస్కెట్లు తినడం ఆనవాయితీ.

“ఏంటి ఇలా వచ్చారు?” అన్నారు తాతగారు నల్లటి టైర్ల మధ్యన తెల్లటి పంచె, జుబ్బాలో కారు మబ్బుల చాటున దాగున్న చంద్రుడిలా మెరిసిపోతూ.

“అదే వడ్డాణం పని మీద….” అంది అమ్మమ్మ కుర్చీలో సతికిల పడుతూ.

“ఏమైంది వెళ్లిన పని?”

“ఆ ఆ…లక్ష్మి విషయాలు బయటెందుకు? మాపటికి ఇంటికొచ్చాక చెప్తాను” అంది మూలకి నిలబడున్న కుర్రాణ్ణి చూస్తూ.

“అలా కరెంటు స్తంభంలా నిలబడకపోతే వెళ్లి ఏదో ఒక పని చేయచ్చు కదరా? జీతం పుడుతోందిగా? టీ పట్రా పో” కసిరింది.

పిల్ల చేతిలో పెట్టిన డబ్బులు తల్లి లెక్కపెట్టి చెల్లెలు చేతికి ఇస్తే, వెనక నుండి చెల్లెలు “మీ పేరు?” అని అడిగి డైరీలో ఎంట్రీ వేసుకుంది. ఇవన్నీ గిఫ్టులు కావు. వాళ్ళు ఎంతిస్తే అంతే మళ్ళీ వాళింట్లో ఏదైనా శుభకార్యానికి వెళ్ళినప్పుడు తిరిగిచ్చేయాలి. కొందరు పేరు చెప్పడానికి మొహమాట పడ్డారు. “పర్లేదు చెప్పండి” అని చెల్లెలు బలవతం చేస్తే అతి కష్టం మీద చెప్పారు. కొందరు చెప్పకుండా వెళ్లిపోయారు. వాళ్ళకి పొడుగు జడ, పొగాకు రంగు చీర, జమ్మిచెట్టు కాలనీ ఆవిడ, టెక్కు (ఆవిడకి పొగరెక్కువ) రంగమ్మ, ఈపూరు చుట్టం. ఎలా రాస్తే గుర్తుంటుందో అలా రాసి సాయంత్రానికి ఆరు వేల మూడు వందల నలభై ఆరు రూపాయిలు అక్కకి లెక్క చెప్పింది.

ఈ తతంగమంతా ఓ గంటన్నర పట్టింది. అప్పటికే పిల్ల ఒళ్ళు కాలిపోతోంది. జ్వరం. మైకమొచ్చి పడిపోయేంత జ్వరం.

“అయ్యో అయ్యో దిష్టి తగిలిందే పిల్లకి. బొద్దుగా ఉంటుంది కదూ. వెంటనే కళ్ళల్లో పడుతుంది. పైగా పెద్ద కమ్మోరు పే….ద్ద నగ చేయించారని పాడు ముండల దిష్టి చూపులు ఒకటి. పిల్లలు ఎవరింట్లో లేరు? ఇలా వచ్చి అలా దిష్టి పెట్టి సచ్చారు. ఎండు మిరపకాయలు, కల్లుప్పు, పుల్లల చీపిరి పట్టుకురావే” అని తిడుతూనే పురమాయించింది అమ్మమ్మ.

సాయంత్రానికి అంతా సద్దుమనిగింది. భోజనాల్లో ఏం స్పెషల్ పెట్టారో, ఏం స్వీట్లున్నాయో ఏమీ చూడలేదు మనవరాలు. మాపటికి పడుకునే ముందు కాస్త పెరుగన్నం పెట్టారంతే. అసల ఫంక్షన్ మానవరాలిదా లేక వడ్డాణందా అర్ధం కాలేదు.

మర్నాడు ఉదయమే మొదలెట్టింది అమ్మమ్మ.

“ఒట్టి అక్కుపక్షి పిల్ల. దీనికోసం ఒళ్ళు హూనం చేస్కుంటే జ్వరం తెచ్చుకుని మూల పడింది. పక్క సందులో దీని తోటిది లేదూ? అదేనే ఆ ఉజ్వల. దానికీ దాని అక్కకి ఒకటేసారి చేసారు నిరుడు ఫంక్షన్. వీణ నేర్చుకుంటున్నారుగా రెండేళ్ల నుండి? ఎంత చక్కగా ఫంక్షన్ లో వచ్చిన వారికి వీణ వాయించి వినిపించారు అక్క చెల్లెళ్ళు. మన కుంకముండకి ఏదీ వచ్చి సావదు” తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది. అక్కడికీ జ్వరం మనవరాలి ఇన్విటేషన్ మీద వచ్చినట్టు.

నాలుగు రోజులు తర్వాత ఉగాది పండగొచ్చింది. మనవరాలికి మళ్ళీ వడ్డాణం పెట్టమంది అమ్మమ్మ.

“మళ్ళీ ఎందుకే?” అంది పెద్ద కూతురు.

“బోలెడు డబ్బులు పోసి కొన్నాం. బడులు తెరిచాక ఇంకెప్పుడు పెట్టుకుంటుంది? పెట్టండి” అని గదమాయించింది.

పట్టు లంగా మీద వడ్డాణం ఇలా పెట్టారో లేదో గేటు దగ్గర వెస్పా స్కూటర్ ఆగింది. వరండా నుండి తొంగి చూసింది చిన్న కూతురు. వచ్చింది అమ్మమ్మ తమ్ముడు.

“అమ్మా….బుల్లి మావయ్య వచ్చాడే”

“ఇప్పుడు వాడేందుకొచ్చినట్టు?”

“మొన్న ఫంక్షన్ కి ఊర్లో లేడు గా…చూసి పోదాం అని వచ్చాడేమో”

“అయ్యో! మాళ్ళీ దిష్టే. నాకు అప్పివ్వవు కానీ మనవరాలికి వడ్డాణం చేయించావని ఏడుస్తాడు. వెంటనే దాచేయ్.”

“ఆ సరే, ఇలా రావే వడ్డాణం తీసేస్తాను.”

“వడ్డాణం తీయడం దేనికే? బోలెడు డబ్బులు పోసి కొంటేను. అది అలానే ఉండనీ. పిల్లని ఆపాటినే తీస్కెళ్ళి చిన్న తమ్ముడి గదిలో ఉంచి తలుపు గొళ్ళెం పెట్టు”

“ఇదేం విడ్డూరం? బోలెడు డబ్బులు పోసి కొంటే దొడ్డిక్కూడా పెట్టుకుని పోతారా?” వాపోయింది కూతురు.

బుల్లి మావయ్య ఏదో పలకరింపుగా వచ్చి వెళ్తాడనుకుంటే రెండు గంటలైనా కదల్లేదు. అక్కడికీ అమ్మమ్మ ఉగాది పచ్చడి, పొద్దున వేసిన గారెలు, బొబ్బట్లు పెట్టి చివర్లో కాఫీ కూడా ఇచ్చింది. ఆయన కదల్లేదు. పది నిమిషాలని తలుపేసి గొళ్ళెం పెట్టిన వాళ్ళు ఎంత సేపటికీ తలుపు తెరవలేదు. వెనక బట్టలుతికే బండ దగ్గర ఇత్తడి బకెట్ల చప్పుడు వినిపించింది. ఆ టైంలో వాటితో పని చాకలి ఈశ్వరమ్మ కే ఉంటుంది. అంటే ఒంటిగంట దాటిందన్నమాట. మంచం మీద అలాగే కూర్చునుంది మనవరాలు. పడుకుంటే వడ్డాణం వంకర పోతుందని నూరి పోసిన జాగ్రత్తలు గుర్తు చేసుకుంది.

కూర్చుని కూర్చుని కాసేపటికి కునుకు పట్టి మంచం మీద వాలిపోయింది. గంట తర్వాతేమో తలుపు తెరిచారు. ఆ చప్పుడుకి లేచి నిలబడింది. అమ్మమ్మ లోనికి వచ్చింది.

ఇంకేముంది? పడుకున్నప్పుడు వడ్డాణం గొలుసులు చిక్కులు పడ్డాయి, వెనక ఎగస్ట్రాగా వేసిన రెండు కాసుల రేకు బెల్టు అష్ట వంకర్లు తిరిగిపోయింది.

“ఓసీ నీ బొంద బడా. ముదనష్టపు దాన. చేయించి వారం కూడా కాలేదు. అప్పుడే నాశనం చేసేసావ్. మీ అమ్మకి పెద్ద భారం నువ్వు. బొత్తిగా ఒద్దిక లేని పిల్ల. నిద్ర ఆపుకుని సావచ్చు కదా. బొంతొళ్ళు. నిద్ర రాక ఏమొచ్చి సస్తుంది?” అని పిడి గుద్దులు గుద్ది నానా తిట్లు తిట్టి వెళ్ళిపోయింది. ఈసారి ఆమె వెనక ఆమె కూతుర్లు వెళ్ళలేదు. మనవరాలు ఏడుస్తూ కూర్చుంది.

అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న పెద్ద కూతురు వెనక నుండి ఇంతెత్తున లేచింది.

“ఎందుకు అస్తమానం నా కూతుర్ని ఆడిపోసుకుంటావ్? నువ్వు అసల ఆడ పిల్లలకి ఏం చేసావని?”

“ఏం చేయకుండానే ఇంత వాళ్ళు అయ్యారా? అంత పెద్ద నౌకరీ ఎలా వచ్చింది నీకు?”

“నేను చదువుకుంటే వచ్చింది. చెల్లికి అది కూడా లేకుండా చేసావ్. దాన్ని గొడ్ల సావిటికి, కోళ్ల గూటికి అంకితం చేసేసావ్. అది చదువుకుని ఉపయోగం లేకుండా పోయింది.”

“ఇన్నేసి మాటలంటున్నావే నన్ను? నిన్న కాక మొన్న నీ కూతురికి అంత పెద్ద నగ కొని ఫంక్షన్ చేస్తే….:”

“నీ గొప్పకి చేసావ్” అమ్మమ్మ మాట పూర్తికాక ముందే మరోసారి అరిచింది పెద్ద కూతురు. “నా కూతురు నాకేం బరువు కాదు. అయినా ఒక్కరితో సరిపెట్టుకుంటే నువ్వే ఒక కన్ను కన్నే కాదు, ఒక సంతానం అసల సంతానమే కాదని పిల్లని కనే వరకు నన్ను సాధించుకు తిన్నావ్”

“ఆ అంటే? ఆడపిల్లని కంటావని నేను ఊహించానా?”

ఆ మాటకి కూతురు ఖంగుతింది. చెల్లెలు వంక చూసింది. ఇద్దరి మొహాల్లో బాధ కొట్టొచ్చినట్టు కనపడింది. అక్కడితో మాటలు ఆగిపోయాయ్.

ఆ తర్వాత రోజుల్లో అమ్మమ్మ దగ్గరికి వెళ్లడం సగానికి సగం తగ్గిపోయింది. వెళ్లినా ఒకటి అర రోజులు మాత్రమే. కొన్ని వేసవి సెలవలు, పండగలైతే ఆమె దగ్గరికి వెళ్లకుండానే గడిచిపోయాయి. తాతగారు ప్రతి శనివారం ఉదయం ఫోన్ చేసేవారు. తర్వాత అమ్మమ్మ మాట్లాడేది. ముభావంగా ఉండేవి ఆ మాటలు. జీవం లేనట్టు. ముసలితనం మీద పడి మెల్లగా షాపు అమ్మేసారు. తర్వాత కొన్నాళ్ళకి పట్నంలోనున్న పెద్ద కొడుకు దగ్గరికి వెళ్లిపోయారు. పెద్ద కూతురు బంగారం పట్నంలో కొనడం మొదలుపెట్టింది. ఆ తర్వాతర్వాత వన్ టౌన్ తో, మార్కెట్ తో, తారాపేట్ తో పూర్తిగా సంబంధం తెగిపోయింది. వడ్డాణం అమ్మమ్మ దగ్గర ఉండిపోయింది.

కొన్నాళ్ల తర్వాత ఓ ఆదివారం ఎవరో పెళ్ళికెల్తూ దారిలో పెద్ద కూతురింటి దగ్గర ఆగింది అమ్మమ్మ. గుమ్మం దగ్గర తల్లిని చూసి ఆశ్చర్యపోయింది కూతురు. లోనికి ఆహ్వానించింది.

మంచి నీళ్లు తెచ్చిస్తూ, “ఏంటి ఇన్నాళ్లకి మా ఇల్లు గుర్తొచ్చింది?”

“ఆ, మన డాక్టర్ ఆదిలక్ష్మి లేదు? ఆవిడ మనవడి పెళ్ళి. మనింట్లో అన్ని శుభకార్యాలకి వచ్చింది. కనపడి వద్దామని బయల్దేరాను. పెద్దాడు డ్రైవర్ ని ఇచ్చి పంపాడు లే. దారిలో నిన్ను పిల్లల్ని చూసిపోదామని ఆగాను. ఇంతకీ, పిల్లలేరే?” అడిగింది గ్లాస్ అందుకుంటూ.

“బాబు ట్యూషన్ కి వెళ్ళాడు, పిల్ల వంట చేస్తోంది” అంది కూతుర్ని బయటకి రమ్మని పిలుస్తూ.

“నేను రాను. షీ హేట్స్ గర్ల్స్. నేను మాట్లాడను ఆమెతో” తిరిగి వంటింటి నుండి కేక పెట్టింది పిల్ల.

“నోరుమూసుకుని బయటకి రా. మర్యాద లేదా నీకు?”

“చిన్న పిల్ల పోనీ” అమ్మమ్మ అడ్డుకుంది. “అయినా పిల్లకి అప్పుడే వంట పనులేంటే? ఎంత వయసని దానికి? మొన్ననే కదే పది పూర్తి చేసింది? పిల్ల ముండ చేతులు గట్రా కాలితే మనకే బాధ” కాస్త టెన్షన్ పడుతూ.

ఆ మాటలకి కూతురు కాస్త కరిగింది. దగ్గరుంటే కస్సుబుస్సులాడటం, దూరముంటే కావాలనుకోవడం. వీటినే బంధాలు అంటారేమో. జీవితాంతం పగ పట్టుకు కూర్చోవాలనిపిస్తుంది. కాస్త ప్రేమ చూపించగానే దుఃఖం పొంగుకొస్తుంది.

“మీ అల్లుడు గారి ఆలోచన. నేను ఆఫీస్ నుండి వచ్చే సరికి ఒక రోజు దాన్ని కూర్చోబెట్టి చెప్పారు. అమ్మ ఉద్యోగం చేస్తూ రెండు పూటలా మనకి వంట చేసి, మిగతా పనులు కూడా చెయ్యాలంటే అలిసిపోతుంది, నువ్వు కూడా కాస్త సాయం చెయ్యి అన్నారు. ఏమనుకుందో ఏమో వంట మొదలెట్టింది. మొదట్లో ఉప్పు తక్కువ, కారం ఎక్కువ, చేతులు కోసుకోవడం, కూరలు మాడ పెట్టడం చేసింది. ఇప్పుడు సాయంత్రం భోజనం తనే చేస్తుంది. త్వరగానే నేర్చుకుంది. అయినా నువ్వు దాని వయసులో ఉన్నప్పుడు నీకు నేను, చెల్లి పుట్టేసాము. పనులు గురించి నువ్వింత ఆశ్చర్యంగా అడుగుతున్నావేంటి?”

అమ్మమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చీర కొంగుతో తుడుచుకుని ఆలోచనలో పడింది. ఆమెని అలా చూసేసరికి కూతురి మనసు చివుక్కుమంది. ఆవిడ్ని అలా చూడటం అదే మొదటిసారి.

“ఏంటమ్మా?” అంది కూతురు దగ్గరకెళ్ళి కూర్చుంటూ.

“ఏం లేదే…ఆలోచిస్తుంటే అనిపిస్తోంది. ఆడవారికి ఏ తరానికి ఉండాల్సిన ఇబ్బందులు ఆ తరానికి ఉంటాయంటే ఇదే కదూ? చిన్న వయసులో నాకు పెళ్ళి చేసి పంపేస్తే ఏం తెలిసిందని? మీ నాన్నే దగ్గరుండి చాలా నేర్పించారు. ఆ రోజుల్లో టీవీలా పాడా? ఎంత సేపూ గొడ్డు చాకిరి. అత్తగారు నొచ్చుకోకూడదని మెట్టినింట వాళ్ళు ఎవరొచ్చినా పురుడ్లు పోసి పంపేద్దాన్ని. సత్రంలా ఉండేది ఇల్లు. మండిన పొయ్యి మండుతూనే ఉండేది. అంత మందికి పాలు పెరుగు ఎక్కడ నుండి తెస్తాం? అందుకే ఇంట్లోనే గీదలని, కోళ్ళని. మళ్ళీ వాటికి చాకిరి. మీ నాన్నతో కూర్చుని నాలుగు మాటలు మాట్లాడింది లేదు, సరదాగా బయటకెళ్ళింది లేదు. అస్తమానం పనులతో సతమతం అయితే ఇంకా కాలక్షేపం చేసే తీరిక ఎక్కడిది? అంతెందుకు? నీ కొడుకు పుట్టాక కదూ ఇంట్లోకి కారు, టీవీ వచ్చాయి?” కళ్ళు తుడుచుకుంటూ.

“ఏంటమ్మా ఎప్పుడూ లేనిది ఇవ్వాళ ఇంతలా బాధ పడుతున్నావ్? అసల నీలో ఇంత బాధ ఉందని నాకు తెలీదు?”

“ఆ మీ నాన్నకి మాత్రం తెలుసా ఏంటి? అంత పెద్ద సంసారం ముందుకు లాగాలంటే మూల కూర్చుని బాధ పడితే అవుతుందా?”

“నీకు ఎప్పుడూ నీ జీవితం ఇలా ఉండాలి, అలా అందరిలా బయట ప్రపంచం చూడాలనిపించలేదా?”

“నేను చూస్తే మీరేమైపోతారే? నాకు మాత్రం ఉండదా ఏంటి నా కూతుళ్లు మంచి బట్టలు కట్టుకోవాలని? నాకు బాగా గుర్తు. మీరు డిగ్రీ కి వచ్చాక మొట్టమొదటి సారి మీకు బట్టలు కొనాలని చెప్పుల్లో కాళ్ళు పెట్టానో లేదో, ఆ అమ్మాజీ కి పురిటి నొప్పులు మొదలైయ్యాయి. ఇంకేముంది గవర్నమెంట్ ఆసుపత్రికి పరిగెత్తాను. బట్టల సంగతి దేవుడికే తెలియాలి. మీ నాన్నకి ఏం కొనాలో ఎలా కొనాలో తెలీక తాను తాను పట్టుకొచ్చి అవే కుట్టించేసారు. మీ చిన్న చిన్న ముచ్చట్లు కూడా తీర్చలేకపోయాను.”

“ఎన్ని బాధ్యతలు మోసుంటుంది అమ్మ. ఎన్ని సార్లు తనూ, చెల్లి ఆమెని తిట్టుకున్నారు?” మనసులో అనుకుంటూ, “నీ బాధ అర్ధమైందమ్మా. అయిపోయిందేదో అయిపోయింది గా. ఊరుకో” తనూ కళ్ళు తుడుచుకుంది.

“నేను చివరికొచ్చాను. నీది సగం అయిపోయింది. అది పసి పిల్ల. దానికేం తెలుసు? చదువుకోనివ్వు. అది బాగా చదువుకుని సుఖపడాలి జీవితంలో. అనుకున్నవన్నీ సాధించాలి. మన పనులు మనం చేసుకుంటే తప్పేం లేదు. అలా అని ఇంట్లో ఆడవారు మాత్రామే పనులు చేయాలనే ఆలోచన పిల్లల మనసులో రానియ్యకు. పిల్లాడికి కూడా పనులు అప్పజెప్పు. మూడో తరం కూడా ఈ ఆలోచన నుండి బయట పడకపోతే ఇక మనం సాధించింది ఏంటట?”

వంటింట్లో నుండి గట్టిగా ఏడుపు వినిపించింది. మనవరాలు గోడకి ఆనుకుని మొహం చేతుల్లో పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది.

“అయ్యో ఏమైందే? మళ్ళీ ఏమైనా కోసుకున్నావా వంట చేస్తూ” అని తల్లి కంగారుగా వస్తూ. వెనకే అమ్మమ్మ.

పిల్ల అమ్మమ్మ ని పట్టుకుని గట్టిగా ఏడ్చింది.

“నువ్వు రాక్షసివి అనుకున్నా. నీకు నేనంటే అసహ్యం అనుకున్నా అమ్మమ్మ. యూ హేట్ గర్ల్స్ అనుకున్నా.”

“ఓసి పిచ్చి దానా? ఆ వడ్డాణం గొడవ ఇంకా మనసులో పెట్టుకున్నావా? మేము పడిన కష్టాలు మీరు పడకూడదని ప్రేమే అది. నీ మీద నాకెందుకే కోపం? అసలు కన్నా కొసరు మీదే ఎక్కువ ప్రేమే పిచ్చి తల్లి. ఛ ఛ ఇంటి లక్ష్మీ దేవి ఇలా ఏడిస్తే ఎంత అరిష్టం? కళ్ళు తుడుచుకో. ఏమేవ్? దీనికి మధ్య పాపిడి తీసి జడ వెయ్యి. వచ్చేటప్పుడు పెద్దాడి తోట నుండి కనకాంబరాలు తెచ్చాను. జడ నిండా పెట్టు. పెళ్ళికి తీసుకెళ్తాను. మన పిల్లని తెలియాలి కదా అందరికీ. దీని వడ్డాణం కూడా పట్టుకొచ్చాను. పట్టు పరికిణీ మీద చక్కగా ఉంటుంది” అంటూ పిల్ల బుగ్గలు పట్టుకుంది.

మళ్ళీ పొడుస్తుందేమో అనుకుంది మనవరాలు. ఆమె తనని ఇంకాస్త దగ్గరకి తీస్కుని ముద్దు పెట్టుకుంది.

తల్లీ కూతుర్లు నవ్వుతూ ఏడుస్తూ అమ్మమ్మని గట్టిగా కావలించుకున్నారు.

ఒక ఆంగ్ల రచయిత అన్నట్టు ‘ఇతరుల కోసం జీవించిన తల్లుల నుండి, తమ కోసం జీవించడానికి ప్రయత్నించే కూతుర్ల వరకు, ఏదో ఒక రోజు మన మనవరాళ్లు తమ కోసమే జీవిస్తారనే ఆశ ఇది.’

*

శ్రీ ఊహ

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • పరిణతితో కూడిన చక్కటి కథ. చివరి పేరా అవసరంలేదనిపించింది. అభినందనలు!

  • చాలా బాగుంది ఊహా కథ. తమ కోసమే జీవించే తరం కోసం…

  • కథ బాగుంది. తెలుగు కుటుంబాల్లో జీవన మధురిమలు, మమత్వాల మధ్య పెనవేసుకునే సున్నితమైన జీనవ సరళతను వడ్డాణంలా చుట్టిన ఈ కథ భిన్న తరాల మధ్య విభిన్న ప్రేమానుబంధాల హెచ్చతగ్గులను… మార్పులను… సహజంగా ఆవిష్కరించే ప్రయత్నం చేసింది.
    కథ ను దాని స్వభావరీత్యా ముగించాలే తప్ప సుధాకర్ సర్ అన్నట్లు… చివరి మాట అవసరం లేదు. అంతే! కథైతే మటుకు మనసు పొరల మధ్య పట్టుకుని వేలాడే చిన్న చిన్న అంతరాలకు అద్దం పట్టింది. శ్రీ ఊహ అంటే తారామతి లో జరిగిన కాల యంత్రం కార్య శాలలో సలాం హైదరాబాద్ మీద సమీక్ష చేసిన ఒక శ్రీ ఊహా గుర్తుకొచ్చింది. మరి ఈ రచయిత్రి ఇప్పటి కథన శైలిని ఇలాగే నిలుపుకుని మరిన్ని కథలు సారంగ కి అందించాలని.. ఆశిస్తూ…

  • కథ చాలా బాగుంది ఊహ గారు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు