లోలోపలి భిన్న అస్తిత్వాల అన్వేషణ

క మనిషి అస్తిత్వానికి ఉన్న విలువ ఎలా నిర్ధారితమవుతుంది? అసలు అస్తిత్వం ఒకటే అంశమా లేక భిన్నంగా మారిపోయే స్వభావం కలదా? మనిషి తన గురించి తాను ఎలా అభిప్రాయం ఏర్పరచుకుంటాడు? మనిషి తనను తన నుండి వేరు చూసుకుని చూడగలడా? మనిషి తనలో ఉన్న విరుద్ద స్వభావాలను ఇతరుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది? తనలోని భిన్న అస్తిత్వాలను జడ్జిమెంటల్ తీరు లేకుండా అన్వేషణ చేయడం ఎలా ఉంటుంది? ఈ దృక్కోణంలో వ్లాదిమిర్ నాబొకోవ్ రాసిన నవలే ‘ది ఐ.’

నాబొకోవ్ రచనా శైలిలో కథ కన్నా భావాలకే ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. అందుకే కథ కూడా పాత్ర మనస్తత్వ ధోరణిని చెప్పే ప్రయత్నమే చేసినట్టు ఉంటుంది.ఇందులో కథకుడు ఎలాంటి వాడు? రష్యా నుండి వచ్చి బెర్లిన్ లో ఉంటున్న ఒక ఇమిగ్రెంట్. ఓ ఇంట్లో పిల్లలకు ట్యూటర్ గా ఉండే ఇతనికి స్త్రీల పట్ల ఆసక్తి ఉంది. ఓ వివాహితతో పెట్టుకున్న సంబంధం వల్ల అతని భర్త చితకబాదడంతో ఆత్మహత్యా ప్రయత్నం చేస్తాడు.

ఈ ఆత్మహత్య తర్వాత అతను ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ ఉంటాడు. ఇక్కడ నుండి కథలో కథకుడు ప్రేక్షకుడిలా ఉంటూ ‘స్మూరోవ్’అనే పాత్ర గురించి పాఠకులకు చెప్తూ ఉండటం, అందులోనూ అతని చిన్న చిన్న దొంగతనాల గురించి, అతను ఆ ఇంట్లో ఉండే వన్య పట్ల ప్రత్యేక ఆసక్తి కలిగి ఉండటం గురించి, తన గురించి గొప్పలు చెప్పుకునే క్రమంలో అబద్ధాలు చెప్పడం గురించి;ఇలా అనేకం కథకుడు చెప్తూ ఉంటే అది కథకుడే అన్న స్పృహ పాఠకులకు కలగనే కలగదు. ఈ నేరేషన్ స్టైల్ లో రెండు లోకాల్లో జీవిస్తూ ఉండే మనిషి గురించి రాయడం మామూలు విషయం కాదు. అందులోనూ తనలోని చెడ్డ విషయాలను, సమాజంలో తనను అలా చూసే దృష్టిని చెప్పుకోవడం కూడా విభిన్నంగా అనిపిస్తుంది.

ఏ మనిషికైనా తన గురించి తాను మంచిగా అనుకోవడం, తనను తాను గొప్పవాడిగా పరిచయం చేసుకోవాలన్న తహతహ ఉండటం సహజం. అలాగే కథకుడి పాత్రతో రచయితకు ఉండే అనుబంధం కూడా అలాంటిదే. కానీ ఆ కథకుడి అస్తిత్వాన్ని, అతనిలో ఉండే అనేక స్వభావాలను పరిచయం చేస్తూ, సమాజం జడ్జిమెంట్స్ తో ఆ పాత్రను పరిచయం చేస్తూ, దానిని నిజాయితీ కన్నా కూడా ఓ రకమైన కుతూహల ధోరణిలో ఉండేలా రాయడం వల్ల ఇది ఓ రకమైన థ్రిల్లర్ అనుభూతిని కూడా కలిగిస్తుంది.

ఈ నవలాంశాన్ని జీవిత వాస్తవికతతో పరిశీలిస్తే వాస్తవిక విరుద్ధ నవలే ఇది. సాధారణంగా మనిషి తన జీవితంలో తన పనులతో,బాధ్యతలతో మునిగిపోయి ఉంటాడు. ఎక్కువగా తన లోపలి మనిషి గురించి ఆలోచించుకుంటూ,విశ్లేషించుకుంటూ జీవితాన్ని గడిపే ఆలోచనతో ఏ మనిషి కూడా సాధారణంగా ఉండడు. అలాగే ఈ విశ్లేషణతో కూడిన ఆలోచన కథకుడి జీవితంలో ఏదైనా ప్రభావాన్ని చూపిందా ?అది లేదు. పరాయి దేశంలో స్నేహితులు,మిత్రులు ఎక్కువగా లేని ఒక ఒంటరి వ్యక్తి తనలో తాను పూర్తిగా మునిగిపోతూ,తన గురించి తాను నిర్లజ్జగా ఒప్పుకుంటూ; అది ఎలాంటిదైనా మారే ఆలోచన లేకుండా అలా తనను తన పరిశీలన అనే అద్దంలో చూసుకుంటూ తనలో పరిస్థితులను బట్టి ఏర్పడే అనేక బింబాలను దర్శిస్తూ;తర్వాత జీవన పయనంలో కూడా ఇంకా ఎన్ని బింబాలు ఏర్పడతాయో చూద్దాము అన్న శైలితో జీవితాన్ని చూసే విచిత్ర వ్యక్తి కథ ఇది.

నాబొకోవ్ తన తొమ్మిది నవలలు బెర్లిన్ లో ఉన్నప్పుడే రాశారు,అక్కడే తన భార్యను కలిశారు. రష్యాదేశస్తుడు అయినప్పటికి కూడా అమెరికా పౌరసత్వం పొంది,అక్కడ కొన్నాళ్లు ఉన్నాక యూరప్ తిరిగి వచ్చారు. కొంత ఆ అనుభవ నీడలు ఈ నవలలో కనిపిస్తాయి.

అన్ని తెలుసు అనుకునే మనం ఆ తెలిసిన సాధారణ విషయాలు కూడా నలుగురిలో చెప్పుకోవడానికి సిగ్గు పడతాము. దానికి కారణం సమాజానికి పునాది మనుషుల అభిప్రాయాల వల్ల బలపడటం వల్ల. ఆ అభిప్రాయాలను, భావాలను విమర్శించే విధానంలో కాకుండా సహేతుకంగా వ్యక్తి తన గురించి కొత్త రకంగా స్వగతం చెప్పుకునేలా రాయడం ఈ నవలలో ఉన్న చమక్కు. కథకుడి కుతూహలం ఉన్నంతవరకు ఈ అస్తిత్వ బింబాలు అతనికి గోచరిస్తూనే ఉంటాయి.

*

రచన శృంగవరపు

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు