లైలామజ్ను-3

ప్రేయసితో తానేమో

దూరమాయె ప్రేమికుడు;

కుంగిపోయె, కుమిలిపోయె,

హృదయమే పగిలిపోయె.

 

చక్రవర్తి కిరీటాలు

గద్దె లే పోయినట్లు,

అస్తమించు సూర్యుడిలా

తేజస్సును కోల్పోయె.

 

 

జడలు కట్టె నెలికురులు,

లేకపోయె పైవస్త్రం,

సెగలు రేగు వడగాల్పుకు

వళ్ళంతా కనలిపోయె.

 

మితిలేని దుఃఖంతో

నిస్సహాయుడైపోయె,

ప్రాణమిత్రులతోనైన

సేదదీరుతుందేమో!

 

ఉన్నారింకా మిత్రులు

ఆ దుర్దశలో సైతం,

గాఢమైన బంధమది

వారి చెంత చేరాడు.

 

వారి సందిట సైతం

కుదురు లేకపోయింది,

ప్రేమతప్త హృదయాన్ని

మాన్చలేదు చిరునవ్వు.

 

మళ్ళీ పరిగెత్తాడు

దూరాన ఆ చోటుకి,

ఎక్కడ చేజారిందో

తన ప్రేమ అక్కడికి.

 

 

కేకవేసి పిలిచాడా

మహిమాన్వితమైన పేరు,

కనరాదు తానక్కడ

తనవారు ఎవరు లేరు.

 

ఎవరులేని ఒంటి చోటు

నిర్జనం, నిస్తేజం;

వేలసార్లు పిలిచాడు

ఫలితమే లేకపోయె.

 

 

జవాబివ్వడానికని

ఎవ్వరూ లేరక్కడ;

తన గోడు వినేదెవరు?

దరిజేరే వారెవ్వరు?

 

*

 

తరలిపోయింది లైలీ

నజ్దు పర్వతాల దరికి

తనవారి వెంట తాను

మునుముందే అప్పటికి.

 

 

 

 

ప్రేమికుని తలపు తాను

తీపి జ్ఞాపకాలుగా

మరువదాయె ఎన్నటికీ;

గాఢమైనదా ప్రేమ!

 

ఆ కొండ కోనల్లో,

ఆ అడవిదారుల్లో,

కైజు వెతకబోయాడు

నిశ్శబ్దపు లోయల్లో.

 

ఆ తాటితోపుల్లో

నీడపట్లలో నిలిచి,

పిలిచాడు పలుమార్లు

మరల మరల పిలిచాడు.

 

ఎన్నిసార్లు పిలిచినా

లేదాయెను జవాబు;

చోటుమార్చి కొత్తచోట

పిలిచినా వినరాదే!

 

బదులుగా ప్రతిధ్వనులు

పర్వతాల మోగాయి,

లైలీ లైలీ అంటూ పిలిచి

నలుదిక్కులు అదిరాయి!

 

 

మంత్రశబ్దమైపోయి

అన్నింటా నిండిపోయె,

అదేపేరు అదేపేరు-

లైలీ! లైలీ! లైలీ!

 

దీనంగా కరుణతోటి

రాలె మంచుబిందువులు,

పాలిపోవు చెంపలపై

ముత్యాలై మెరిసిపోయె.

 

కనుబొమలు ముడివేసిన

ఇరుకిరుకు లోయల్లో,

తుప్పల్లో ఒంటరిగా

తచ్చాడుతూ తిరిగాడు.

 

బండరాళ్ళు తాము కూడ

శోకిస్తూ అతనితోటి

కలిసిపోయి పాడాయి

ఏదో విషాదగీతిక.

 

*

 

 

 

 

 

ఆ లైలీ సౌందర్యం

అందదా సదా యింక?

భరిస్తాడా ఆ ఊహ?

లేదు లేదు ఎన్నటికీ!

 

గుండెలోని ఆవేదన

పెచ్చుమీరి పోతుంటే,

ఒకనాటి ఉదయాన

చెప్పసాగె పవనానికి:

 

*

 

స్వచ్ఛమైన చిరుగాలీ!

ఓ ఉదయ పవనమా!

పరిమళభరితం నువ్వు,

కలువు నా ప్రేయసిని.

 

ఘనమైన తన కురుల

దాగిపోయి నువ్వు

నా బాస, నా ప్రేమ

ప్రకటించి చెప్పవా?

 

 

 

 

 

తన జడల నడుమ చేరి

సుగంధాలు వెదజల్లే

తైలసంస్కరణలోన

కలగలిసిపోగలవా?

 

నా ఆత్మను ఎవరైతే

వశం చేసుకున్నారో

వారితోనె వెళ్ళి చెప్పు

నేనెలా పడివుందీ!

 

వొద్దికైన మాటలతో

సూటిగా తెలిసేలా

తన చెవిలో వూదవా

నా యీ సందేశాన్ని?

 

నా కళ్ళల్లో ఎప్పటికీ

ఉన్నది నీ రూపమే,

పగలైతే నీ ధ్యాసే,

రాత్రుల్లో నీ కలలే!

 

ఆత్మ ముక్కలైనపుడు

దుఃఖించే దీనుడికి

పగిలిన ఆ గాయాలే

తియ్యనైన కానుకలు.

 

 

చూసిన ప్రతి చూపులో

గాయమే కనిపిస్తుంది,

చెప్పలేని ఊసు వెలికి

మాయగా ప్రవహిస్తుంది.

 

కరుణ కరిగి జాలువారు

నీ దివ్య సౌందర్యానికి

దోసిట్లో ఆత్మనుంచి

సమర్పించలేని వాడు

 

కట్టతెగిన ఆవేశం

నిలువెల్లా ముంచేసి

హృదయవేగం పెరిగి

ప్రేమకు లొంగనివాడు

 

మంచుపర్వతంలాగ

ఘనీభవించినవాడు

తానెంతటివాడైనా

మానవుడనిపించుకోడు.

 

అంతటి సౌందర్యానికి

మనసు కరగనివాడిని

అలా వుండిపోనివ్వు,

ఆ బతుకు నిరర్థకం.

 

 

తియ్యని ఆ పెదవుల్లో

దివ్యమైన మాధుర్యం;

ఆ పెదవులనిలా తెచ్చి

నా పెదవులకానించు.

 

ఆనందం కలిగించే

సుమగంధం వెదజల్లి

ప్రకాశిస్తుందా మోవి

ఎర్రనైన మణిలాగ.

 

ఎవరో నా హృదయాన్ని

దిష్టిపెట్టి పొడిచారు,

నాటుకున్న ములుకుల్ని

వెలికి తీసె నీ అందం.

 

ఎన్ని రంగుల పువ్వులో

మొగ్గతొడిగి మురుస్తాయి,

ఎక్కడైతే విరుస్తాయో

అక్కడే పడి నశిస్తాయి.

 

తేజంలో నీ అందం

మధ్యందిన రవిబింబం,

నీ రూపలావణ్యం

అచ్చరలకు ఆనందం.

 

 

చవులూర కవులు చెప్పు

దివ్యసంపద నువ్వే,

స్వర్గమే నిన్ను చూసి

చల్లగా దోచేస్తుంది.

 

ఎంతటి మాధుర్యమది!

ఎంతటి స్వచ్ఛందనం!

ఎంతటిదా తేజస్సు!

నేలమీద వుండతగదు.

 

(మూడవ ఆశ్వాసం సమాప్తం)

 

                                                      -ఇంకావుంది

Avatar

దాదా హయాత్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు