లావణ్య కవితలు రెండు

నా పేరు లావణ్య. పెద్దపెల్లి జిల్లాలోని గోదావరిఖని మా ఊరు. నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో “తెలుగు సాహిత్యంలో బొగ్గు గని కార్మికుల జీవణ చిత్రణ” పైన పరిశోధన చేస్తున్నాను. నా బాల్యం, చదువు అంతా సింగరేణి ప్రాంతంలో జరిగింది. ఏ రాజకీయ, భావజాల ప్రత్యక్ష ప్రభావం లేకుండానే ఉస్మానియా యూనివర్శిటీ దాకా వచ్చాను. యూనివర్శిటీకి వచ్చాక నేను చదివిన సాహిత్యం, సంపాదించుకున్న జ్ఞానం నాకు చాలా విషయాలు నేర్పించాయి. సమాజానికి సాహిత్యానికి మధ్య సంబంధం ఎలా ఉండాలి, సామాజిక సమస్యలకు ఎలా స్పందించాలి, ఆ స్పందనను ఎలా సృజనాత్మకంగా వ్యక్తీకరించాలి అనే విషయాలను నేర్పింది. సాహిత్యం నేర్పిన ప్రాపంచిక దృక్పథం నుండి సృజనాత్మకంగా చేస్తున్న నా స్పందనే నా కవిత్వం.

1.
పాలస్తీనా ప్రేమలేఖ

ఆకాశంలో చందమామను కాదు ,
నా నేల నెత్తుటి ప్రతిబింబాన్ని చూస్తూ రాస్తున్న ప్రేమలేఖ
హమాస్ ఆయుధంలో కన్నీళ్ల సిరాను నింపి,
కూలుతున్న కలల కాగితంపై రాస్తున్న ప్రేమలేఖ
గతం నీకు గుర్తుంటే నా గుండె పగిలిన ప్రతీసారి
నీ ప్రేమ కోసం ఒక ప్రేమ లేఖ రాసాను, మళ్ళీ రాస్తున్నాను.

ఇక్కడ నేనే కాదు ఎవరూ క్షేమంగా లేరు,
శత్రువు బలవంతపు ఆక్రమణ కౌగిలి
రోజు రోజుకి ఇంకా బిగుసుకుపోతుంది
ఊపిరి పీల్చుకుందామనుకున్న ప్రతీసారి
ఇక్కడి నేల వేల ప్రాణాల్ని బలికోరుతుంది.
కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూడని పసిపాపలు
ఇక్కడ ప్రపంచ యుద్ధాన్ని చేస్తున్నాయి

అమ్మ స్తన్యం చూడనీ లేత పెదాలు
ఇక్కడ చావు స్తన్యాన్ని ముద్దాడుతున్నాయి
శత్రువు తుపాకుల శబ్దాలతో
పసిపాపల చెవుల దగ్గర లాలిపాటలు పాడుతున్నాడు
బాంబుల తాకిడితో కంపించిన నేలే
ఇక్కడ పిల్లలని నిద్రపుచ్చే ఉయ్యాల అవుతుంది.

ఇక్కడ పిల్లలే కాదు తల్లులూ క్షేమంగా లేరు,
పిల్లలని ప్రసవించాల్సిన ఇక్కడి తల్లుల గర్భాలు
చనిపోయిన శవాలను ప్రసవిస్తున్నాయి.
ఎదిగిన కొడుకు తుపాకి పట్టుకుని
దేశానికి రేపటిని హామీ ఇచ్చి యుద్ధానికి వెళ్తే,
స్మశానానికే తప్పకుండా తిరిగి వస్తాడని
తల్లుల కన్నీళ్లు చివరి చూపుల కోసం ఎదురుచూస్తున్నాయి.

ప్రియమైన ప్రపంచమా,
సరిహద్దులు లేని ప్రపంచం కోసం
నేను రాసిన ఈ ప్రేమ లేఖ నీ చేతికి చేరకముందే
ఇక్కడ సరిహద్దుల దగ్గర నా బిడ్డలు వదిలిన
చివరి శ్వాసలు వేలల్లో నా గుండెకు చేరుతున్నాయి
వాళ్ళ మరణాలు నింపుకున్న మానవత్వాన్ని
లేఖలో రాసి నీ బదులు కోసం ఎదురుచూస్తున్న
అయినా నా ప్రేమలేఖ నీకు అర్దం అవుతుందో లేదో
నీకు అర్థం కాని బాధితుల భాష కదా,
నేను ప్రాణంగా ప్రేమించే ప్రాణం లేని ప్రపంచమా
నా ప్రేమలేఖకు కాస్త ప్రేమను బదులివ్వు.

******

2.
రంగుల పూల తోట వాడిపోయింది

 

కిరణాల పరిమళాలు పంచిన పువ్వు ఒకటి
సాయంకాలం పూట ఓ సముద్రంలోకి రాలిపోయింది
రంగుల పూల తోట వాడిపోయింది

వెన్నెల వసంతాన్ని చల్లిన పువ్వు ఒకటి
అమవాస్య రాత్రి చీకట్లోకి జారిపోయింది
రంగుల పూల తోట వాడిపోయింది

మకరందాన్నంత మట్టిపై విసిరేసిన పువ్వొకటి
కరవు కాలంనాడు కరిగిపోయింది
రంగుల పూల తోట వాడిపోయింది

ఎన్ని పువ్వులు నేల రాలినా
రాలిన పువ్వులతో నేలంతా ఎరుపెక్కినా
ఇంకో పువ్వును పొత్తిళ్ళలో గర్వంగా ఎత్తి పట్టిన
రంగుల పూల తోట నేడు వాడిపోయింది

ఆకులు రాలిపోయినా
నీళ్ళు ఇంకిపోయినా
మట్టి మనసు నుండి వేర్ల ప్రేమను వేరుచేయని
రంగుల పూల తోట వాడిపోయింది

పూలు పంచిన సుగంధాలు
నిన్నటి జ్ఞాపకాలలోనే మిగిలిపోయాయి
పూలను అలముకున్న అందాలు
గతం కంటిపాప పైనే ఆగిపోయాయి
రంగుల పూలతోట వాడిపోయింది

ఉత్తర పడమరాలు ఉమ్మడిగా
వదిలిన వేడి వేడి గాలులకు
వేర్లతో సహా వణికిపోయింది
రంగుల పూలతోట వాడిపోయింది

వాడిపోయిన పూలతోట
వాడి విజయానికి చిహ్నం అవ్వచ్చు
రాలిన పూలను గంపల్లో నింపి
వాడు ఊరేగింపులు కూడా తీయచ్చు
కానీ మట్టి ఒకటి ఉంటది కదా
ఎన్నటికీ వాడిపోకుండా
పూల నెత్తుటి తడి ఆరిపోకుండా

మట్టి ఒకటి ఉంటది కదా
రాలిన పూలను కన్నీళ్ళలో నింపుకుంటూ
వాటి అమరత్వాన్ని అలల శబ్ధాల్లో పాడుకుంటూ

మట్టి ఒకటి ఉంటది కదా
చీకటిని మౌనంగా తిట్టుకుంటూ
వెన్నెలను గుండెల్లో తలచుకుంటూ

మట్టి ఒకటి ఉంటుంది కదా
కన్నీళ్లను ఆవిరిస్తూ
కరువులో కారుమేఘానికి ఊపిరిస్తూ

మట్టి ఒకటి ఉంటది కదా
గర్భంలో విత్తనాల్ని నింపుకుంటూ
పూల ప్రపంచాన్ని కలలు కంటూ..

******

లావణ్య తీగల

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • ప్రేమలేఖ…. రంగుల పూలతోట వాడిపోయింది
  రెండు కవితలు చాలా బావున్నాయి.

  మట్టి ఒకటి ఉంటది కదా
  గర్భంలో విత్తనాల్ని నింపుకుంటూ
  పూల ప్రపంచాన్ని కలలు కంటూ.♥️

 • ఈ రెండు కవితలూ బావున్నాయి.
  పాలస్తీనా ప్రజలబాధను తన అక్షరాల్లోకి వంపి రసిన రచన.మూడవ యూనిట్ లోని భావనలు ఆర్ద్రంగా ఉన్నాయి.
  రెండవ కవితలో అమరులు జీవితాన్ని త్యాగం చేసిన తీరును ధ్వని మయంగా,ప్రతీకాత్మకంగా బాగా చిత్రించారు.రెండు మంచి కవితలు.
  మా పెద్దపల్లి జిల్లా కవయిత్రిని ఇలా సారంగలో చూసినందుకు సంతోషంగా ఉంది.
  కన్నీళ్లను ఆవిరిస్తూ
  కరువులో కారుమేఘానికి ఊపిరిస్తూ

  …లాంటి వాక్యాల్లో క్రియల రూపాన్ని మరోసారి పరిశీలించాలని కవయిత్రికి అభ్యర్థన.

 • అద్భుతంగా వున్నాయి కవితలు. రెండో కవితలోని మార్మికత హత్తుకుంది. మట్టి ఒకటి ఉంటది కదా కలల్ని కనడానికి ఆ మట్టి కలల నుంచి లావణ్యను కన్నది. అభినందనలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు