లక్ష్మీ నరసింహ రాంబో

బర్మా క్యాంపు కథలు

“జవాని జానెమన్  హసీను దిల్ రుబా … మిలేతు దిల్ జవా .. నిసార్ హోగయా ”  మైకు లోంచి పాట  హోరెత్తిపోతుంది.

గుంట లంతా   నిక్కర్లేసుకొని నడ్డి తెగ తిప్పుతున్నారు. ఒక అర డజను మంది గుంటలు  మైకు కింద చేరి గెంతుతున్నారు.

కాంపోళ్లు పనిచేసే నేవల్  ఆర్మెంట్ డిపో లోనూ, డాక్ యార్డ్ లోనూ జరిగే  కార్తీక మాసం పికినిక్కుల్లోనూ హిందీ పాటలే.

” మేరా అంగన్ మె తుమ్హారా కియ కామ్  హై ”  అని అమితాబ్ గొంతు  కంగు కంగు మంటోంది.

అటు ఒరిస్సా  నుంచి వలస వొచ్చిన వొడ్డోళ్లతోను, ఇటు కలకత్తా వాళ్లతోను మాట్లాడాలన్నా  హిందీయే.

హిందీ వార్తలు, సినిమాలు కేంపోళ్ల  జీవితంలో భాగం అయిపోయాయి.

బర్మా కేంపులో  శనివారం దూరదర్శన్ లో ” రామాయణంలో పిడకల వేట” లాంటి సినిమాలు పది అంతరాయాలతో అయిపోయాక, ఆదివారం ఉదయం ” రామాయణ్ ” మధ్యాహ్నం ప్రాంతీయ  భాషా చిత్రం, సాయంత్రం ” యాదోన్కి బారాత్ ” లాంటి సినిమాలు తెగ చూసేవారు.

ఇక ఇండియా క్రికెట్ మ్యాచ్ జరిగితే మగాళ్లంతా ఒక చోట చేరి “డయనోర ” టీవీ డోరు జాగ్రత్తగా తీసి, మ్యాచ్ అయ్యే వరకు రోజంతా అక్కడే వుండే వారు.

గుంటలైతే  క్రికెట్ మ్యాచ్ సీజన్లో క్రికెట్టు, మిగతా సీజన్లో అన్ని ఆటలూ ఆడే వారు. ఇక రామాయణం చూసొచ్చిన కేంపు  గుంట లంతా అల్లీకాయలాట  అయిపోయాక కొబ్బరి చీపురుపుల్లలకు దారాలు కట్టి బాణాలాట  ఆడేవోరు.

” ఒరే ఈనుపు పుల్లలతో  బాణాలాట  ఆడితే కళ్ళు పోతాయి” అని ఏ ముసిల్ది అయినా తిట్టిన్దనుకో అక్కడ్నుంచి మకాం మార్చి మరో చోట ఆడు కునే  వాళ్ళు.

అయినా  కేంపు లో గుంటలాడు కోడానికి స్థలాలకేం కొదవ. కాందిశీకుల రేకుల ఇళ్ల ముందు చెట్టు కింద ఆడుకోవచ్చు. నూకాలమ్మ పండగకి అగ్నిగుండాలు తొక్కేకాడ ఆడుకోవచ్చు. గుడి ముందర ఆడుకోవచ్చు. కొండెక్కి ఆడుకోవొచ్చు. గంటల్లారీల ఆఫీసు ఎదురుగా వున్నా శ్మశానం బయట ఆడుకోవొచ్చు.

ఇలా హిందీ పాటలతో, టీవీ ప్రోగ్రాములతో, రకరకాల ఆటలతో కాలక్షేపం చేస్తున్న  కేంపు జనాలకు, గుంట లకు  కొత్తమవా స్య  నాడు వొచ్చే అమ్మవారి పండుగ  ముందు వారం రోజులూ  వీధి కళాకారులతో  మిమిక్రీలు,  సైకులు ఫీట్లు చేయించే వారు.  ఇంకా సరిపోక వీధిలో తెరకట్టి  సినిమాలు వేసేవారు.  సిమెంటు గోనెలు, జనపనార గోనెలు చంకలో చుట్టుకొని జనం గుడి ముందు వున్న రోడ్డుమీదకు చేరిపోయేవారు.  రోడ్డుకు అడ్డంగా తెరకట్టి సినిమా మొదలెట్టేసేవారు. మోకాళ్ళు వొంచలేనోళ్ళు ఓ పక్కకు కుర్చీలు వేసుకోగా, గోడలెక్కి, మేడలెక్కి జనం వీధి సినిమాలు తెగ చూసేసేవారు.

అక్కడ వేసేది సినిమా ఒక్కటేనా , గుంటల  వీప్ సాప్ , దొంగా  పోలీస్, టీ  అమ్మకం, బఠానీల  అమ్మకం  అన్నీను.

ముందుగా ఆటో లో ప్రొజెక్టర్ వొచ్చేది.

ఆ తరువాత కాసేపటికి ఎప్పుడో రీలు డబ్బా వొచ్చేది.

తెర మీద బొమ్మ, తెర ముందు బామ్మ, తెర మీద హీరో, తెర  ముందు ఎగరేసిన కాగితం ముక్కలు.

ఎప్పటికో అర్ధ రాత్రికి సినీమా ముగిసేది.

సినిమా అయ్యేసరికి కుక్కలు కూడా రోడ్డు మీదే బొజ్జునేవి.

*  * *

నెలకోసారి ప్రభుత్వం రేషన్ ఇచ్చినట్లు, సంవత్సరానికోసారి మా నాన్న మమ్మల్ని బర్మాక్యాంపుకి కిందనున్న ఊర్వశీ ధియేటర్ కో , పరమేశ్వరీ పిక్చర్ పేలస్కో తీసుకెళ్లేవారు. ఇక సంవత్సర మంతా ఆ సినిమాను తలచుకోవడమే.

మా పెంకుటిల్లు కెదురుగా వున్నా మేడింట్లో  అద్దెకుండే ఆరెంపీ  డాక్టర్ గారి అమ్మాయి చెప్పే సినిమా కథలూ , మా ఇంట్లో మనిషిలా కలిసి పోయి పనిచేసే సత్తెమ్మ చెప్పే సినిమా కథలూ నాకు ఆహారం. సినిమా పేర్లు పడటం దగ్గర నుంచి, విశ్రాంతి, శుభం వరకూ వాళ్ళు చెబుతుంటే టికెట్ లేకుండా సినిమా చూసే భాగ్యం కలిగేది.

ఇలా సినిమాలకు కరువాసిపోయిన నేను వీధిలో తెరకట్టి వేసే సినిమాకు వెళతాను అని అడిగితే….

” కుదరదు పడుకో అనే వారు మా నాన్న “.

ఇంట్లో అందరూ పడుకున్నాక మెల్లిగా లెగిసి ఇంటి బయట  గెడపెట్టి వీధి సినిమా చూసొచ్చిన నాకు పొద్దున పట్ట పగలు సినిమా కనిపించింది.

* * *

కప్పరాడ  మునిసిపల్ బడి నుంచి కాళ్లీ డ్చుకుంటూ   వొచ్చిన నేను, జ్ఞానాపురం సెయింట్ పీటర్స్  మిషనరీ  స్కూల్నుంచి  షర్ట్ అంతా  నల్ల గా మసి లాగా చేసుకొచ్చిన మా పెద తమ్ముడు, కంచరపాలెం శారదా కాన్వెంట్ నుంచి రిక్షాలో ఊడిపోయిన టక్కు తో  వొచ్చిన ఆఖరు తమ్ముడూ  కలిసి మా ఇంటి ముందు ఈనుపు పుల్లలు వికెట్లలా పెట్టి రబ్బరు బంతితో , కొబ్బరి మట్ట బేటు తో ఆడుతుంటే ….

అప్పుడే  డూటీ నుంచి వొచ్చిన  మా నాన్న ” తొందరగా తయారవ్వండ్రా ” అన్నారు.

ఎందుకో అడగక గబ గబా .. మేం ముగ్గురం తయారయిపోయాం.

తయారయిన మా ఆఖరు తమ్ముడ్ని ఏడుస్తున్నా మా అమ్మ దగ్గర ఉంచేసి, నన్నూ , మా పెద తమ్ముడ్ని సైకులు మీద ముందొకరిని, వెనక కేరేజీ మీద ఒకరిని కూర్చో బెట్టుకొని  చాలా వేగంగా సైకులు తొక్కుకుంటూ 104 ఏరియా దగ్గర వున్న నేవల్ క్వార్టర్స్ ఎదురుగా,  కొత్తగా  కట్టిన డిజిటల్ డాల్బీ థియేటర్ ” లక్ష్మీ నరసింహ “సినిమా హాలు ముందు  ఆపారు.

అందంగా వున్నా హాలు తీరిగ్గా చూసే సమయం లేదు.

కట్ చేస్తే హాల్ లో సీట్లలో వున్నాము.

చల్లటి ఏసీ, చక్కని సౌండు, తెరంతా పెద్ద బొమ్మ.

రాంబో… సిల్వెస్టర్ స్టాలోన్ హీరో, బాంబులు, బాణాలు, తుపాకులు, దెబ్బలు.

చేతికి తగిలిన దెబ్బకి హీరో స్వంతంగా కమీజు కుట్టుకున్నట్లు కుట్లు వేసుకుంటుంటే అప్పటి వరకు వీధి సినిమాలు, పరమేశ్వరీ లోను, ఊర్వశీలోను ఫ్యామిలీ సినిమాలు చూసిన కళ్ళతో  ” లక్ష్మీ నరసింహలో .. రాంబో ” ను చూసేము.

* * *

ఆ మరుసటి రోజు నుంచి రామానంద సాగర్ రామాయణ్ లోని ఈనుపు పుల్లల బాణాల్ని, టీవీలో క్రికెట్ చూసి కపిల్దేవ్ ,గవాస్కర్ ల జ్ఞాపకార్ధం  దాచిన కొబ్బరిమట్ట బేటుని  పెంట మీద పడేసి.

ఒక యెర్ర రిబ్బను, నల్ల రిబ్బను కొనుక్కొని తలకు కట్టుకొని.

” రాంబో నేనే రాంబో , నేనే రాంబో ” అని అరవడం మొదలెట్టాం.

అప్పటికే నూకాలమ్మ పూనకాల ఆట కూడా వేపమండలతో ఇంట్లోనే ఆడేయటం మొదలెట్టిన  మా ముగ్గురన్నదమ్ముల వీపు విమానం మోత  మోగిందని వేరే చెప్పనక్కరలేదనుకుంటా.!

*

 

హరివెంకట రమణ

కొంతకాలం హైదరాబాద్ , విశాఖ లో చిన్న పత్రి క‌లలో ప‌నిచేసాను, త‌రువాత యానిమేష‌న్ రంగంలో చాలా కాలం ఉన్నాక మున‌సోబు ఫ్లుకువోకా ( జపనీస్ రైతు ) ప్రభా వంతో ఉన్న ఉద్యో గం వ‌దిలేసి స్వతంత్రంగా బ్రతకాలనే నిశ్చ‌యంతో ఫ్యాకల్టీ ,కన్సల్టెంట్ , మార్కెటింగ్ , ఎన్‌జీవో ఇలా ర‌క‌ర‌కాల వృత్తులు చేసేను , చేస్తున్నాను. కొన్ని డాక్యూమెంటరీలు, మరికొన్ని యానిమేషన్ చిత్రాలు తీసాను. చాల తక్కువ కథలు పత్రికలలో వొచ్చాయి , తెలుగు మ‌రియు సోష‌ల్ వర్క లో పీజీలు చేసేను. భార‌త ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక యువ‌జ‌న అవార్డు 2014 లో వచ్చింది. ప్రస్తుత నివాసం విశాఖ‌ప‌ట్నం.

10 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)
 • ఆ రోజులలో సినిమా చూడడం గురించి చెప్పడం చాలా బావుంది. కథ చాలా మలుపులతో బాగా సాగింది.

 • లక్ష్మీ నరసింహ రాంబో కధ చాలా బాగుంది

 • మంచి కథనం….మాండలికంలో మంచి పట్టున్న రచయిత గా హరిగారు నిరూపించుకున్నారు….తెలుగు భాషను మరియు ‘యాస’లు జీవించి ఉంటాయి ఇటువంటి రచనలవల్ల…మీ ప్రయత్నం బాగుంది…. శుభాకాంక్షలు…

 • రంజైన కంచరపాలెం కథలకి కేరాఫెడ్రస్సు రఁవణగారే!

 • చిన్నప్పుడు ఙ్నాపకాలు చక్కని కధగా చాలా బాగా రాసారు. మా మిత్రులు హరి గారు. చాలా బాగుంది సార్.
  ఈ కధ చదువుతుంటే మాకు కూడా చిన్నప్పుడు జరిగిన విషయాలు గుర్తు వస్తుంది. చాలా బాగుంది.
  సార్ 😊🤝🎉🎉🎉🎉

 • కథ పై మీ అభిమానానికి, స్పందనకు ధన్యవాదాలు కళాసాగర్ గారు, గోగుల శ్రీనివాస్ గారు, కృష్ణ కుమారి గారు, కోరాడ రాంబాబు గారు, సుధాకర్ ఆరిశెట్టి గారు, ఆరాధ్యులు సుబ్రహమణ్యం గారు, శ్రీనివాస్ మనోహర్ ద్వారంపూడి గారు.

 • After having read the story I’m envious of the author’s alluring childhood. I have travelled to the author’s place without moving an inch. Gripping and eloquent !!

 • కథలు చాలా సరళంగా ఉన్నాయి.కథలో విషయం కూడా హృద్యంగా ఆకట్టు కుంటున్నాయి…రచయిత కార్టూనిస్ట్ అవడం వల్ల కథనంలో మలుపులు మెరుపులు రమణీయంగా ఉన్నాయి..శుభాభినందనలు రచయిత హరి గారికి…ఒక్క మాటలో చెప్పాలంటే నేను…మీ హరి కథలు బాగున్నాయి

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు