రోబో – న్యూ వెర్షన్

15 ఫిబ్రవరి, 2090..

హాల్లో కూర్చుని టీవీలో ‘రోబో – 33.0’ వెబ్ సిరీస్ చూస్తున్నారు సుష్మ, మదన్.

“ఏమండీ! ఎదురింట్లో డయానా వాళ్ళు కొత్త వెర్షన్ రోబోలను కొన్నారట. అవి మన రోబోలకన్నా చాలా తొందరగా పనులన్నీ చేసేస్తాయట” కళ్ళను స్పై కెమెరాల్లా పెద్దవి చేస్తూ చెప్పింది సుష్మ.

“మూడు నెలల క్రితమే కదా.. మనం కొత్త రోబోలను కొన్నది! మళ్ళీ ఇప్పటికిప్పుడు కొత్తవి కావాలంటే ఎలా? అయినా మన రోబోలు చక్కగా పనిచేస్తున్నాయి కదా!” అడిగాడు మదన్.

“వాటికి పనులు చెప్పలేక చస్తున్నానండీ! ఇంటిపని చేసే రోబోకు, వంటపని చేసే రోబోకు సమన్వయం కుదరడం లేదు. రెండూ వేటికవే అన్నట్టు ఉంటున్నాయి. గేటు దగ్గర సెక్యూరిటీగా ఉన్న రోబో ఎప్పుడూ పరధ్యానంగా ఉన్నట్టే ఉంటుంది. వీటన్నింటినీ సూపర్వైజ్ చేయడం నావల్ల కావడం లేదు. ఆ కొత్త వెర్షన్ రోబో ఒకదాన్ని తెచ్చి, వీటిని సూపర్వైజర్ చేసే బాధ్యతలు అప్పగిద్దాం” గోముగా అడిగింది సుష్మ.

“సూపర్వైజేషన్ కూడా నువ్వు చేయలేవా? ఇప్పుడైతే అన్ని పనులూ రోబోలు చేస్తున్నాయి కానీ, కొన్ని దశాబ్దాల క్రితం రోబోటిక్ టెక్నాలజీ  అందుబాటులో లేనప్పుడు ప్రతి పనికీ ఒక మిషన్ ఉండేదట. మనుషులు ఎంతో  కష్టపడి ఆ మిషన్ల చేత పనులు చేయించుకునేవారు తెలుసా!” అన్నాడు మదన్.

“ఏంటి మీరు చెప్పేది?” ఆశ్చర్యంగా అడిగింది సుష్మ.

“అవును సుష్మా! బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్ అని, ఇల్లు ఊడవడానికి వాక్యూమ్ క్లీనర్ అని, పిండి పట్టడానికి మిక్సీ అని ఉండేవట. అవి వాటి స్థానంలో ఉలుకుపలుకూ లేకుండా రాయిలా ఉంటే మనుషులే వాటి దగ్గరకు వెళ్ళి వాటి చేత రకరకాల పనులు చేయించుకొనేవారట. మిక్సీలో మనుషులే పప్పులు వేసి, మనుషులే స్విచ్ వేస్తే అది గిర్రున తిరిగి పొడి చేసి ఊరుకునేదట. మళ్ళీ మనుషులే ఆ పిండిని గిన్నెలోకి తీసుకునేవారు” చెప్పాడు మదన్.

“మీరు చెప్పేది నిజమా?” నమ్మలేనట్టు అడిగింది సుష్మ.

“ఇక వాషింగ్ మిషన్ గురించి చెబితే నువ్వు అస్సలు నమ్మవు. మిషన్లో మనుషులే బట్టలు వేసి, శుభ్రపడిన తర్వాత తీసి, వాటిని ఎండలో ఆరబెట్టేవారు” చెప్పాడు మదన్.

“అయ్యో! ఆ రోజుల్లో మనుషులు అంత కష్టపడేవారా?” ముక్కున వేలేసుకుంటూ అడిగింది సుష్మ.

వాళ్ళు మాటల్లో ఉండగానే సూటు, బూటు, టక్కు, టై తొడుక్కుని హాల్లోకి వచ్చాడు అశ్విక్.

“ఏంట్రా అశ్విక్! ఎక్కడకు బయలుదేరావు?” టీవీని మ్యూట్ చేస్తూ అడిగాడు మదన్.

“ఆఫీసుకు డాడ్!” పొడిపొడిగా చెప్పాడు అశ్విక్.

“పోయిన నెలలోనే వెళ్లొచ్చావు గదరా! మళ్ళీ వెళ్ళడమెందుకు?” అడిగింది సుష్మ.

“ఇంపార్టెంట్ అసైన్‌మెంట్ ఉంది మామ్! వెళ్ళి తీరాలి” చెప్పాడు అశ్విక్.

“పర్యావరణ కాలుష్యం కారణంగా పదేళ్ళ క్రితమే ప్రభుత్వం ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ పాలసీ తీసుకొచ్చింది కదా!” ఆశ్చర్యంగా అడిగింది సుష్మ.

“నిజమే! కానీ కంపెనీ వాళ్ళు అత్యవసరమని నోటీసు పంపితే ఆఫీసుకు వెళ్ళి పనులు చక్కబెట్టాలని కూడా ఆ చట్టం చివరి క్లాజ్‌లో పెట్టారు” చెప్పాడు అశ్విక్.

“ఆ చివరి క్లాజ్‌ను అడ్డుపెట్టుకొని మీ కంపెనీ వాళ్ళు మిమ్మల్ని అప్పుడప్పుడూ ఆఫీసుకు పిలిచి మీ చేత రోబోలకన్నా హీనంగా పని చేయించుకుంటున్నారు” అంటూ కొడుకు పనిచేసే కంపెనీ యాజమాన్యాన్ని తిట్టింది సుష్మ.

“మళ్ళీ ఇంటికి ఎప్పుడొస్తావు?” అడిగాడు మదన్.

“నెల రోజుల్లో వచ్చేస్తాను డాడ్!”

“ఆ బెంగుళూరు భానుమతి నిన్న వర్చువల్ కాల్‌లో కలిసి, తన కొడుక్కి పెళ్లి కుదిరిందని తెగ బడాయి పోయింది తెలుసా?” అసూయతో ముక్కులెగిరేలా చెప్పింది సుష్మ.

“మామ్! వాళ్ళ కొడుకు చేసుకోబోయేది ఎవర్నో కాదు! నా కొలీగ్ రీటానే! ఆ అమ్మాయి తల్లిదండ్రులు అంత ఈజీగా ఈ పెళ్ళికి ఒప్పుకోలేదు. కన్యాశుల్కం క్రింద 15 క్రోర్స్ విలువచేసే షేర్స్ తీసుకుని తమ కూతుర్ని ఆ భానుమతి కొడుక్కి కట్టబెట్టడానికి ఒప్పుకున్నారు” చెప్పాడు అశ్విక్.

“ఏంటి? అంత మొత్తమా? రాను రాను కాలం మరీ అన్యాయంగా మారిపోతోంది. మా తాతల కాలంలో అమ్మాయి తల్లిదండ్రులే వరకట్నం పేరుతో అబ్బాయిల తల్లిదండ్రులకు ఎదురు కట్నం ఇచ్చి అబ్బాయిల్ని కొనుక్కునేవారని మా బామ్మ చెప్పింది” తన బామ్మను గుర్తు చేసుకుంటూ చెప్పింది సుష్మ.

“ఏంటి మమ్మీ! నువ్వు చెప్పేది నిజమా?” ఆశ్చర్యంగా అడిగాడు అశ్విక్.

“మీ అమ్మ చెప్పింది నిజమే అశ్విక్. ఇప్పుడయితే స్త్రీ పురుషుల నిష్పత్తి 40:100 ఉంది గానీ, అప్పట్లో మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరూ ఇంచుమించు సమానంగా ఉండేవారు!” చెప్పాడు మదన్.

“నువ్వు కూడా ‘ఊ’ అనరా. మా ప్రాపర్టీ అంతా అమ్మేసైనా నీకు పెళ్లి చేసేస్తాం” బతిమాలింది సుష్మ.

“కాస్త ఓపిక పట్టు మమ్మీ! నువ్వు చెప్పినట్టే పెళ్లి చేసుకుంటాను” చెప్పాడు అశ్విక్.

“పదేళ్లుగా ఇదే మాట చెబుతున్నావు. సంవత్సరాలు గడిచే కొద్దీ అమ్మాయిల పాపులేషన్ తగ్గిపోయి, డిమాండ్ పెరిగిపోతోంది!” లాజిక్ బయటపెట్టింది సుష్మ.

“అమ్మా! వీలైనంత దగ్గర్లోనే పెళ్లి చేసుకుంటానులే!” అభయం ఇచ్చాడు అశ్విక్.

“నిజంగానా! మరైతే మంచి అమ్మాయిని చూడనా?” అడిగాడు మదన్.

“పెళ్లి చేసుకుంటానని చెప్పాను గానీ, అమ్మాయిని చేసుకుంటానని చెప్పానా?” విసుక్కుంటూ అడిగాడు అశ్విక్. ఆ మాట వినగానే మదన్ గుండెల్లో అణుబాంబు పేలింది.

“ఏంట్రా! నువ్వు మాట్లాడేది? ఆ సికింద్రాబాదు సుశాంత్‌లాగా అమ్మాయిని కాక అబ్బాయిని చేసుకుంటావా ఏంటి?” ఆశ్చర్యంగా అడిగింది సుష్మ.

“ఆ సుశాంత్ అమ్మాయిని కాకుండా అబ్బాయిని పెళ్లిచేసుకున్నాడన్న బాధతో ఆ సుశాంత్ తండ్రి తన ముఖాన్ని సోషల్ మీడియాలో చూపలేక ఫేస్‌బుక్, ట్విటర్ అకౌంట్లన్నీ డెస్ట్రాయ్ చేసుకున్నాడు తెలుసా!” చెప్పాడు మదన్.

“డాడ్! ఆ సుశాంత్ లాగా నేను మగాడ్ని పెళ్లి చేసుకుని నీ పరువు తీయనులే!” నింపాదిగా చెప్పాడు అశ్విక్.

“అంటే ఏంట్రా నువ్వు చెప్పేది? ఆడదాన్ని చేసుకోక, మగాడ్ని చేసుకోక…..” ఆ తరువాత అడగలేకపోయింది సుష్మ.

“మామ్! అసలు నేను మనుషులనే పెళ్లి చేసుకోను. రోబోను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను.” దృఢంగా చెప్పాడు అశ్విక్.

“ఒరేయ్! మతి కానీ పోయిందా నీకు? రోబోలను ఇంట్లో వంట మనిషిగానో, పని మనిషిగానో పెట్టుకుంటాము కానీ, ఏకంగా పెళ్లి చేసుకుంటారా?”

“అందులో తప్పేముంది మమ్మీ? అయినా ఇవ్వాళ మనుషులకు, రోబోలకు తేడా అంటూ ఏముంది చెప్పు? రోబోలు కూడా మనుషుల్లాగే అన్ని పనులూ చేస్తున్నాయి కదా!” అడిగాడు అశ్విక్.

“అయినా సరే! రోబోను కోడలిగా తెచ్చుకోవడానికి నేను ఒప్పుకోను” మంకుపట్టు పట్టింది సుష్మ.

“అమ్మా! రోబోను కోడలిగా తెచ్చుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కన్యాశుల్కం కింద అందమైన అమ్మాయిని కోడలిగా తెచ్చుకోవాలంటే 10 నుండి 20 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. అదే రోబో అయితే కేవలం రెండు కోట్లతో కొనుక్కోవచ్చు. అంతే కాదు! రోబోలు మనల్ని ఎప్పటికీ ఎదిరించవు. గృహహింస కేసులు గట్రా పెట్టవు. మనం ఎలా చెబితే అలా వింటాయి. మనం ప్రోగ్రామ్ ఎలా సెట్ చేస్తే అలా నడుచుకుంటాయి” వివరంగా చెప్పాడు అశ్విక్.

“అది కాదు అశ్విక్! రోబోను పెళ్లి చేసుకుని నువ్వెలా సుఖపడగలవు చెప్పు? రోబో అనేది కేవలం ఒక మిషన్. దానికి ఏ ఫీలింగ్స్ ఉండవు కదా! ఏ ఫీలింగ్స్ లేని దానితో నీ ఫీలింగ్స్‌ని ఎలా సంతృప్తి పరుచుకుంటావు?” అడగలేక అడిగాడు మదన్.

“డాడ్! మీ సందేహం నాకు అర్థమైంది. నాసా వాళ్ళు ఎన్నో దశాబ్ధాలుగా ప్రేమ, ఆప్యాయత, సంతోషం, బాధ మొదలైన భావోద్వేగాలు కలిగి ఉండే రోబోలను తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ పరిశోధనలు ఇప్పుడిప్పుడే మంచి ఫలితాలు ఇస్తున్నాయి. నేడో, రేపో ఆ రోబోలు అందుబాటులోకి వస్తాయి.” చెప్పాడు అశ్విక్.

“మరి ఆ రోబోలకు కోపం వస్తే?” సుష్మ వంక ఓరకంటితో చూస్తూ అశ్విక్‌ను అడిగాడు మదన్.

“కోపం అనే ఫీచర్‌ను డెలీట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది డాడ్!” చెప్పాడు అశ్విక్.

“నువ్వు ఎన్నయినా చెప్పు, రోబోను కోడలుగా తెచ్చుకోవడానికి నేను ససేమిరా ఒప్పుకోను. ఎలాగూ ఆఫీసులో నెల రోజులు ఉంటావు కదా! ఈ నెల రోజుల్లో మీ కొలీగ్స్‌లో ఎవరో ఒక అమ్మాయిని సెలక్ట్ చేసుకుని, ఆ అమ్మాయిని లవ్‌లోకి దింపి, వీలైతే పెళ్లి కూడా చేసుకుని ఇంటికి తీసుకుని వచ్చేయ్” ఖరాఖండీగా చెప్పింది సుష్మ.

“అలాగే మమ్మీ! ప్రయత్నిస్తాను” అంటూ తల్లిదండ్రులకు టాటా చెప్పి, ఓలా కాప్టర్ యాప్లో బుక్ చేసిన హెలికాప్టర్ రాగానే అందులో ఆఫీసుకు బయలుదేరాడు అశ్విక్.

నెల రోజుల తర్వాత..

15 మార్చ్, 2090

కాలింగ్ బెల్ చప్పుడు వినగానే కొడుకు అశ్విక్ వచ్చి ఉంటాడన్న ఆతృతతో తలుపు తీసింది సుష్మ. కేవలం అశ్విక్ మాత్రమే కాదు, పక్కనే ఒక  అందమైన అమ్మాయి కూడా ఉంది. ఇద్దరి మెడలోనూ పూల దండలు వేలాడుతున్నాయి.

“ఎవర్రా? ఈ అమ్మాయి?” అడిగింది సుష్మ.

“నీ కోడలమ్మా!” చెప్పాడు అశ్విక్.

కుందనపు బొమ్మ లాంటి కోడల్ని చూసి సుష్మ ఉబ్బితబ్బిబైపోయింది.

“కంగ్రాచులేషన్స్ అశ్విక్. మీ అమ్మ మాట విని ఇంత తొందరగా పెళ్లి చేసుకుంటావని నేను అస్సలు ఊహించలేదు” ఆశ్చర్యంగా గడప దగ్గరకు వస్తూ అన్నాడు మదన్.

“అత్తయ్యా! మామయ్యా! మీరిద్దరూ నన్ను ఆశీర్వదించండి” అంటూ సుష్మ, మదన్‌ల కాళ్లపై పడింది కొత్త కోడలు. కోడలు కాళ్లపై పడి ఆశీర్వాదం అడిగేసరికి ఇద్దరూ పొంగిపోయారు.

“ఎంత సంస్కారం! ఎంత వినయం! నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అందం, అణకువ రెండూ ఉన్న కోడలు దొరకడం నా అదృష్టం“ అంటూ కొత్త కొడలికి దిష్టి తీసింది సుష్మ.

“తల్లిదండ్రుల లాంటి అత్తా, మామల కాళ్లమీద పడటం కూడా గొప్పేనా? నేను ప్రతి రోజూ మీ ఆశీర్వాదం తీసుకుంటాను అత్తయ్యా” చెప్పింది కొత్త కోడలు. ఆ మాట వినగానే సుష్మ మరింత సంబరపడిపోయింది.

“ఇద్దరూ ఇలా కూర్చోండి. నేను వెళ్ళి కాఫీ కలుపుకొస్తాను” అంటూ కొడుకు, కోడలికి సోఫా చూపించింది సుష్మ.

“అయ్యో! మీరు పెద్దవారు. మీరు కాఫీ కలపడమేమిటి? మీరే ఇలా కూర్చోండి. నేనే వెళ్ళి కాఫీ కలుపుకుని తెస్తాను” అంటూ చొరవగా వంటగది వైపు వెళ్లింది కొత్త కోడలు.

“ఒరేయ్ అశ్విక్! నాకు కోడలు పిల్ల భలే నచ్చింది. ఆ పక్కింటి పంకజం కోడలు అత్తను అస్సలు గౌరవించదు. పంకజం కొడుక్కి పెళ్ళయి నాలుగేళ్లయినా, తను ఒక్కసారి కూడా పంకజం కాళ్ళకు దణ్ణం పెట్టలేదట. అభిమానంగా మాట్లాడనూ లేదట. నేనెంత అదృష్టవంతురాలినో! నాకు బంగారం లాంటి కోడలు వచ్చింది” అంటూ కొడుకును, భర్తను చూసి మురిసిపోయింది సుష్మ.

“అత్తయ్య గారూ! కాఫీ.. మామయ్య గారూ! మీరూ తీసుకోండి” అంటూ సుష్మ, మదన్‌లకు చెరో కప్పు కాఫీ ఇచ్చింది కొత్త కోడలు.

కాఫీను సిప్ చేసి,“అబ్బా! కాఫీ ఎంత బాగుందో” అన్నాడు మదన్.

“అవునమ్మాయ్! ఇంతకీ నీ పేరేమిటి?” కాఫీ కప్పు కింద పెడుతూ అడిగింది సుష్మ. కోడలు అశ్విక్ వంక చూసింది.

“ఇంకా పేరేమీ పెట్టలేదమ్మా! నీకు నచ్చిన పేరు చెప్పు. అదే ఖాయం చేసేద్దాం!” అన్నాడు అశ్విక్.

“పేరు పెట్టకపోవడం ఏమిటిరా? వాళ్ల అమ్మానాన్న తనకి ఏదో ఒక పేరు పెట్టుంటారు కదా!”

“అమ్మా! తను అమ్మాయి కాదు. అమ్మాయి లాగా ఉండే రోబో. రెండేళ్ల క్రితమే నాకు నచ్చిన స్కిన్ టోన్, హైట్, వెయిట్, ఫీచర్స్, క్వాలిటీస్, స్పెసిఫికేషన్స్ చెప్పి ఆర్డర్ చేస్తే, నాసా వాళ్ళు ఇప్పుడు పంపారు” నవ్వుతూ చెప్పాడు అశ్విక్.

“అదేంట్రా? అమ్మాయి కాదా? రోబోనా? కళ్ళు, పళ్ళు అన్నీ చక్కగా ఉన్నాయి కదరా? అచ్చం అమ్మాయిలాగే?” అడిగాడు మదన్.

“అత్తయ్య గారు కింద పడిపోయారు” షాక్‌తో కింద పడిపోయిన సుష్మను చూసి గట్టిగా అరిచింది కొత్త కోడలు ఉరఫ్ అమ్మాయి రూపంలో ఉన్న రోబో.

*

భ్రూణ హత్యల నేపథ్యంలో ఒక నవల రాసే ప్రయత్నం

* రచనలు చేయాలన్న ఆలోచన ఎలా మొదలైంది?

మాది చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం. చిన్నప్పటి నుంచి కథలు చదవడం అలవాటు. నేను ఎనిమిదో తరగతిలో ఉండగా మా ఊళ్లో లైబ్రరీ ప్రారంభించారు. మా అక్క, అన్నలు అక్కడ పుస్తకాలు తెచ్చుకుని చదివేవారు. వారితోపాటు నేనూ చదివేవాణ్ని. కొమ్మనాపల్లి గణపతిరావు గారు రాసిన ‘నాని’ అనే నవల బాగా గుర్తుండిపోయింది. ఇలాంటిది నేనూ రాస్తే బాగుంటుందని అనిపించింది.

* మొదటి కథ ఎప్పుడు రాశారు?

2002లో ఇంటర్మీడియెట్ సెలవుల్లో ‘ప్రేమతో’ అనే నవల కొంత భాగం రాశాను. నాకు తోచినట్టు రాసి దాన్ని దాచిపెట్టుకున్నాను. ఆ తర్వాత చాలా రోజుల దాకా ఏమీ రాయలేదు. పత్రికల్లో వచ్చే కథలు మాత్రం చదివేవాణ్ని. అలాంటివి రాయాలంటే రచయితలకు చాలా అనుభవం ఉండాలని, వాళ్లు రాస్తేనే ప్రచురిస్తానని అనుకునేవాణ్ని. 2017 జనవరిలో కహానియా.కామ్‌లో మొదటిసారి ‘ద్రౌపదీ స్వయవరం’ అనే కథ రాసి సొంతంగా ప్రచురించాను. ఆ తర్వాత నెలలో గోతెలుగు.కామ్ వెబ్ పత్రికలో ‘రూమ్మేట్’ అనే కథ రాశాను.

* పిల్లల కోసం కథలు రాశారు కదా! బాలసాహిత్యం వైపు అడుగులెలా పడ్డాయి?

పత్రికల్లో వచ్చే పెద్ద కథలు చూసి అలాంటివి రాయాలన్న ఆలోచన ఉండేది. ఒకటి, రెండు పత్రికలకు అలా పెద్ద కథలు రాసి పంపాను. అవి రిజెక్ట్ అయ్యాయి. ఆ తర్వాత 2018లో విశాలాంధ్ర పత్రికకు ‘పాపభీతి’ అనే పిల్లల కథ రాసి పంపితే వేశారు. ఆ తర్వాత వారమే నేను రాసిన మరో కథ ‘ఆస్తి పంపకాలు’ ప్రచురించారు. దాంతో నేను బాలసాహిత్యం రాయగలనన్న నమ్మకం కలిగింది. ఇప్పటిదాకా దాదాపు 30 బాలల కథలు రాశాను. అన్ని దినపత్రికల్లోనూ అవి ప్రచురితమయ్యాయి. ఇతర కథలు మరో 30 దాకా రాశాను.

* కథా రచనలో మిమ్మల్ని ప్రోత్సహించినవారు?

కథారచనలోకి వచ్చాకే రచయితల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాను. పత్రికలో నా కథలు చదివి మా జిల్లాకు చెందిన రచయిత ఆర్.సి‌.కృష్ణస్వామిరాజు గారు ఫోన్ చేసి మాట్లాడారు. కథారచన, ఇతర అంశాల్లో అప్పుడప్పుడూ సూచనలు ఇస్తూ ఉంటారు.

* మీకు నచ్చిన కథలు, కథకులు?

కథలు చదవడం తప్ప నేను వాటిని విశ్లేషించలేను. చాలా కథలు నచ్చుతాయి. కొన్ని అర్థం కావు. మూరిశెట్టి గోవిందు గారు రాసిన ‘సాకిరేవు కతలు’, ‘మా ఊరి మంగళి కతలు’ చాలా బాగున్నాయి. జాడా సుబ్బారావు గారు రాసిన ‘ఆకుపచ్చని కన్నీరు’ కథ నచ్చి ఆయనకు ఫోన్ చేసి మాట్లాడాను. ఇండ్ల చంద్రశేఖర్ రాసిన ‘నాటకాలాయనింట్లో పాము’, చరణ్ పరిమి రాసిన ‘సినీడెజావు’, ఆర్.సి‌.కృష్ణస్వామిరాజు గారు రాసిన ‘అమ్మ సినిమాకెళ్లాలంటోంది’ కథలు నచ్చాయి. అవి చదివినప్పుడు ఇలాంటి కథలు నేను రాయలేనేమో అనిపిస్తుంది.

* మీ కథల్లో మీకు పేరు తెచ్చిన కథ?

ప్రజాశక్తి దినపత్రిక 2020 సంక్రాంతి ప్రత్యేక సంచికలో రాసిన ‘జల్లికట్టు ప్రేమకథ’ బాగుందని చాలా మంది మెచ్చుకున్నారు. సంక్రాంతి సంచికకు జల్లికట్టు నేపథ్యంలో కథ రాయాలనిపించి రాశాను. కథలకు పాఠకులు తగ్గుతున్న కాలంలో నా కథలు చదివి ఒకరిద్దరు ఫోన్ చేసినా గొప్పగా భావిస్తాను.

* ఎలాంటి అంశాలపై కథలు రాయాలని అనుకుంటారు?

నాకు మా అన్నాదమ్ముళ్లతో కంటే అక్కాచెల్లెళ్లతో అనుబంధం ఎక్కువ. స్త్రీల సమస్యలపై మరిన్ని కథలు రాయాలని ఉంది. వారి ఇబ్బందుల గురించి ‘అత్యాచారం’ అనే నవల రాసి  కహానియా.కామ్‌లో ప్రచురించాను. ప్రస్తుతం భ్రూణ హత్యల నేపథ్యంలో ఒక నవల రాసే ప్రయత్నంలో ఉన్నాను.

*

పేట యుగంధర్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)
‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు