రెక్కలకు బలమొచ్చింది -2

1973 ఆగస్టు నుంచి కాలం ఒక మలుపు తిరిగింది.  ప్రపంచవ్యాప్తంగా వచ్చిన రాజకీయ, ఆర్థిక మార్పుల మూలంగా ప్రజల్లో ప్రభుత్వాల విశ్వసనీయత క్రమంగా క్షీణించడం మొదలుపెట్టింది. ఆ సమయంలో అమెరికా డాలర్ ను బంగారం నుంచి విడగొట్టింది. ఔన్సు బంగారానికి 35 డాలర్లు చెల్లిస్తానన్న వాగ్దానాన్ని తోసిపారేసింది. దాంతో ఐ.ఎమ్.ఎఫ్. వంటి సంస్థలకు ఫ్లోటింగ్ ఎక్స్ ఛేంజ్ రేటుతో పని చెయ్యవలసి వచ్చింది. దాంతో ఫ్లోటింగ్ రేటు పరిణామాలేమిటో అది అధ్యయనం చెయ్యవలసి వచ్చింది.

అక్టోబరుకల్లా OPEC (Organization of the Petroleum Exporting Countries) చమురు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ఆర్థిక స్థితికి పెద్ద అఘాతం తగిలింది. అప్పటివరకూ ఎవరూ అంతగా పట్టించుకోని ఆ వ్యాపార సంస్థల బృందం (ఒ.పి.ఇ.సి) అకస్మాత్తుగా బలపడింది. చమురు దిగుమతి చేసుకునే దేశాలు భారీ సర్దుబాట్లు చేసుకోవలసి వచ్చింది.  ఆ సర్దుబాట్లు సరైన చట్టాల రూపంలోకి రావడానికి కొంత సమయం పట్టింది. ఆ సమయంలో కమర్షియల్ బ్యాంకర్లు కాకుండా, సంతోషంగా ఉన్నదెవరంటే చమురు ఉత్పత్తి చేసే దేశాలే. హఠాత్తుగా పెరిగిన ఆదాయం, సంపద వాళ్లకు కొన్ని కొత్త సమస్యలను తెచ్చింది.

ఫండ్ నాయకత్వంలో కూడా మార్పు వచ్చింది. అప్పటికి పదేళ్ల నుంచి ఐ.ఎమ్.ఎఫ్. మేనేజింగ్ డైరెక్టర్ గా ఉంటున్న ఫ్రెంచి పెద్దమనిషి  Pierre-Paul Schweitzer కి తాను మద్దతివ్వబోనని మెజారిటీ షేర్ హోల్డరయిన అమెరికా తెగేసి చెప్పేసింది. ఆయన చేసిన నేరం ఏమిటి? కరెన్సీ విలువను తగ్గించమని ధైర్యంగా అమెరికా ప్రభుత్వానికి చెప్పడమే. అది యూఎస్ సెక్రటరీకి నచ్చలేదు. అతని దగ్గర మంచి కళాఖండాలుండేవిగాని మంచి సభ్యత ఉండేది కాదని అందరూ అనుకునేవారు.

దాంతో ఫండుకు కొత్త ఎమ్.డి. వచ్చారు. ఈ మార్పు కష్టమైనదేగాని కాని జాగ్రత్తగా పూర్తయింది. ఫండ్ వనరుల ఉపయోగం విషయంలో కొంత రివిజన్ జరిగింది. మారుతున్న అవసరాలకు వార్షిక ప్రణాళికలు సరిపోవన్న సత్యం తెలిసొచ్చింది. ఫండ్ ప్రోగ్రాములు విజయవంతం కావాలంటే ఇంకాస్త లోతుకు వెళ్లి క్షేత్రస్థాయి సమస్యల మీద దృష్టి పెట్టాలని అర్థమైంది. వీటి ఫలితంగా ఎక్స్ టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ (ఇ.ఎఫ్.ఎఫ్.) ఏర్పాటయింది. దేశాలకు అందుబాటులోకి వచ్చింది. అన్నిటిలాగే దీన్నీ ఎకానమిస్టులు ముందు విమర్శించారు. రావలసిన మార్పులను ఇది ఆలస్యం చేస్తుందని వారు అనుకున్నారు.

చమురును ఉత్పత్తి చేసే దేశాల్లో సంపద ఒక్కసారిగా పెరగడం కొన్ని కొత్త సమస్యలకు దారి తీసింది. వాళ్లకు డబ్బుంది, తెలివిగా ఎలా ఖర్చు చెయ్యాలో తెలియదు. ప్రజలకేది మేలు చేస్తుందో తెలియదు. కొన్ని అరబ్ దేశాలు భారీ అభివృద్ధి ప్రణాళికలు వేశాయి. భారీ పెట్టుబడులతో తక్కువ వ్యవధిలో తమ ఆర్థిక వ్యవస్థల రూపు మార్చాలని అవి యోచించాయి. ఫలితం ఏమిటంటే  కొత్త సరుకులు దింపడానికి వచ్చిన నౌకలతో రేవులన్నీ కిటకిటలాడిపోయాయి. కొన్ని దేశాల్లో సివిల్ సర్వెంట్లకు జీతాలు మూడింతలు పెరిగాయి. కొన్నిచోట్ల దేశాలు సొంత వ్యాపారాలను నెలకొల్పాయి. కొత్త వస్తువుల్ని ఆర్డర్ చెయ్యడం వల్ల పారిశ్రామిక దేశాలు బాగుపడ్డాయి. ఎక్కువ పనులు చెయ్యడానికి బోలెడుమంది మనుషులు అవసరమయ్యారు. ఆ అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఆసియా దేశాల నుంచి మిడిల్ ఈస్ట్ కు వలసలు ఎక్కువయ్యాయి. అక్కడ సంపాదించి, వాళ్లు పంపే డబ్బుతో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ చెల్లింపుల సంక్షోభాల నుంచి గట్టెక్కగలిగాయి కొన్ని దేశాలు.

చమురు దేశాల సంపన్నత త్వరలోనే యూరో డాలర్లు, పెట్రో డాలర్లు రూపొందడానికి దారి తీసింది. వాటిని పాశ్చాత్య దేశాల రాజధానుల్లో ఉండే పెద్దపెద్ద కమర్షియల్ బ్యాంకులు నిర్వహించేవి. దాంతో వాటి దగ్గర బోలెడంత డబ్బు పోగయ్యింది. అవి అభివృద్ధి చెందుతున్న దేశాలకు వచ్చి అప్పులిస్తామని చెప్పేవి.  వాటి షరతులు ఎక్కువ ఉండేవి కాదు.  ఆ సమయంలో లాటిన్ అమెరికన్ దేశాల్లో కొన్ని ఎగబడి తీసుకున్నాయి. ఆఫ్రికా దేశాలు కూడా ఉత్సాహం చూపాయి. అదే ఫండ్ నుంచి అప్పు రావాలంటే ఎన్నో షరతులు. అవి రాజకీయ నాయకులకు నచ్చేది కాదు. కాని కాలక్రమంలో ఎగబడి తెచ్చుకున్న అప్పులు దేశాల్లో సంక్షోభాలకు దారి తీశాయి. వాటిని తీర్చేందుకు నానా పాట్లూ పడవలసి వచ్చింది. దేశాలు, ప్రభుత్వాలకు ఏ గ్యారెంటీ లేదని, అవి దివాలా తీస్తే ఏ దిక్కూ లేదని అప్పటికి అందరికీ అర్థమైంది. అప్పుడు తమకో ప్రోగ్రామ్ చెయ్యమని కమర్షియల్ బ్యాంకులు ఫండును అడిగాయి. ఫండ్ అడుగుజాడల్లో నడవడానికి సిద్ధమయ్యాయి.

ఆర్థిక రాజకీయ విధానాల రూపకల్పనలో ప్రభుత్వాలు, అధికారులు అందరూ తడబడుతూ ఉన్న సమయమది. పబ్లిక్ పాలసీ రూపకల్పనలో ఆలస్యం అవడం కొంత, వాటి అమల్లో అయిన జాప్యం కొంత – కలిసి ప్రభుత్వాల సామర్థ్యం పట్ల అనుమానాలు రేకెత్తే వరకూ వచ్చింది పరిస్థితి.

నేను వృత్తిజీవితానికి వేదికగా ఎంచుకున్న అమెరికాలో – అభిశంసన అవసరం రానివ్వకుండా అధ్యక్షుడు నిక్సన్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామా ప్రభుత్వాల విశ్వసనీయత పట్ల అనేక ప్రశ్నలు లేవనెత్తింది. తాము చేసిన నేరాలను కప్పిపెట్టుకోవడానికి సత్యాన్ని బలిపశువుగా చేశాయి ప్రభుత్వాలు. అధికార దాహం, విలువల పతనం అనేవి కలిసికట్టుగా ఆనాటినుంచి సాగుతున్నాయి. అది 1990ల నుంచి మరింత వేగంగా జరుగుతోంది. క్లింటన్ అభిశంసన వ్యవహారం దానికో ఉదాహరణ. తర్వాత దినపత్రికలు, టీవీలు పతనం బాట పట్టాయి. అప్పటివరకు సభ్య సంభాషణల్లో ఉపయోగించడానికి జంకే పదాలు, భావనలు అటుపైన సర్వసాధారణం అయిపోయాయి! తర్వాత రాజ్యాంగబద్ధంగా, ప్రజల అభీష్టం మేరకు మార్పులు జరిగాయిగాని చాలా ఆలస్యంగా జరిగాయి. వ్యవస్థ పనిచేస్తోందనే నమ్మకం కలిగిందిగాని దానిలోనూ జాప్యం జరిగింది.

తర్వాత ఏడాది లోపలే ఉత్తర వియత్నాంతో చేసిన సంధి ఒప్పందం వీగిపోయింది. అది దక్షిణ వియత్నాం మీదికి దండెత్తింది. అమెరికన్ దౌత్య కార్యాలయం పైన ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ నుంచి హెలికాప్టర్లలో ఎక్కి అమెరికన్ సైనికులు తిరిగి వచ్చేస్తున్న దృశ్యాలను టీవీ ప్రసారం చేసేది. సగటు అమెరికన్ కు ఆ దృశ్యాలను మరిచిపోవడం కష్టమే. అక్కడితో అమెరికా దౌత్య విధానంలో ఒక చాప్టర్ అంతమైంది.

కొన్నేళ్ల తర్వాత నేను సైగాన్ సిటీలో (దాని పేరు తర్వాత హోచిమిన్ సిటీగా మారింది) ఆ కార్యాలయాన్ని చూసేప్పటికి దాన్ని వియత్నామ్ ఆయిల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంగా ఉపయోగిస్తోంది. అమెరికా యుద్ధానికి ఆనవాళ్లుగా మిగిలి ఉన్నవి రెండు విషయాలు. మొదటిది – అక్కడి అనాధలు. యుద్ధ సమయంలో అమెరికన్ సైనికులకు పుట్టినవారు. వారిలో అమెరికన్ పోలికలు స్పష్టంగా కనిపిస్తాయి, అవి వారిని అక్కడి స్థానిక సమాజంలో కలవనివ్వవు. ఇంకొకటి హనోయ్ సిటీలో ఉన్న యుద్ధ మ్యూజియమ్.  అక్కడ కొన్ని జ్ఞాపకాలను భద్రం చేశారు.

చమురు ధరలు పెరగడం, లభ్యత క్షీణించడంతో జనాల్లో ఒక అసంతృప్తి మొదలైంది. ఇంధనం రేషన్ పద్ధతిలో ఇవ్వాలన్న ఆలోచనతో కూపన్లు ముద్రించారు. ఆ ముద్రణ ఖర్చు ఖజానాదే. కాని ఈలోపలే ప్రజలు స్వచ్ఛందంగా స్పందించారు. తమ జీవన విధానాలను కొద్దిగా మార్చుకున్నారు. డ్రైవింగ్ స్పీడు తగ్గించుకోవడం, ఆఫీసులకు స్కూళ్లకు కలిసి పూల్లో వెళ్లి రావడం వంటివి అలవాటు చేసుకున్నారు. దాంతో ఇంధనం వాడకం తగ్గింది. అది వాళ్లకు పెద్ద కష్టంగానే ఉండి ఉంటుంది.

రెండో ప్రపంచ యుద్ధ సమయం మొదలుకొని అధ్యక్షుడు ఐసెన్ హోవర్ ఉన్నప్పుడు అమెరికాలో హైవేల విస్తరణ యుద్ధప్రాతిపదికన జరిగింది. అలాగే ఆటోమొబైల్ రంగం విస్తరించింది. ఒక పాట అప్పట్లో జనాదరణ పొందింది –  షెవర్లే, బేస్ బాల్, అమెరికన్ పై అనేవి అమెరికన్ జీవితంలో విడదియ్యరాని అంతర్భాగాలని చెబుతుందా పాట. అటువంటి సమాజానికి ఇదొక కుదుపు.

ఫోర్డ్ అధ్యక్షుడైన తొలి దినాల్లో ద్రవ్యోల్బణం సమస్య ఎదురైంది. ప్రభుత్వం కొంత రక్షణ ఇవ్వాలనుకున్నా అది కుదరలేదు. ఉద్యోగాలు తగ్గిపోవడంతో సమాజంలో ఒత్తిడి పెరిగింది. వియత్నాం నుంచి వచ్చిన శరణార్థులను పూర్వం స్వాగతించేవారుగాని ఇప్పుడు వారిని తమ ఉద్యోగాలను లాక్కునేవారిగా చూస్తున్నారు. వారు కోస్తా ప్రాంతాల్లో స్థిరపడటం మానేసి పశ్చిమ, మధ్య ప్రాంతాలకు, ఇంకా లోపలికి వలస ప్రారంభించారు. వారికి కూలి, వేతనాలు ఇంకా తక్కువ లభించేవి.

ఇటువంటి సంక్లిష్ట ఆర్థిక పరిస్థితి కొన్నేళ్లపాటు కొనసాగింది. ఇంకా పెరుగుతూ వచ్చింది. జిమ్మీకార్టర్ అధ్యక్షతన ప్రతి ఏడూ చమురు కొరత ఎక్కువవుతూ వచ్చింది. ఇళ్లలో ఏసీల వాడకం మీద కూడా షరతులు పెట్టాల్సి వచ్చింది. ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరింది. వడ్డీ రేట్లు రెండంకెల్లోకి వచ్చేశాయి.

రాజకీయంగా చూసినప్పుడు – ఇరాన్ లో కొత్తగా విప్లవ ప్రభుత్వం ఏర్పడింది. అమెరికన్ దౌత్యాధికారులను అది టెహ్రాన్ లో బంధించింది. దాంతో అమెరికా ప్రతిష్ట మసకబారింది. ఈ కారణాలతో జిమ్మీ కార్టర్ రెండోసారి పదవిలోకి రాలేకపోయారు. 1980లో రిపబ్లికన్స్ తిరిగి అధికారంలోకి వచ్చారు, రోనాల్డ్ రీగన్ అధ్యక్షులయ్యారు. అప్పుడు క్రియాశీలక చట్టాల కల్పనకు, భారీ అభివృద్ధికి బీజం పడింది.

* * * * * *

ఇండియాలో కూడా ఆర్థికాభివృద్ధి మందగించింది. ధరలు పెరగడం మొదలైంది. చమురు ధరలు పెరుగుతున్నప్పుడు అన్నిటి ధరలూ పెరుగుతాయి. కాని దురదృష్టవశాత్తూ దాన్ని ఎవరూ అలాగ చూడలేదు. రాజకీయ అస్థిరత, శాంతిభద్రతల సమస్యగా చూశారు.

అప్పటికి ప్రజల అభిమానం వల్ల ఇందిరాగాంధీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. 1966లో డీవాల్యుయేషన్ తో ఆమె ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు. అది కొంచెం అసందర్భమైన నిర్ణయం. ప్రజల్లో విశ్వాసం దెబ్బతింది. దాతలిస్తామన్న సాయం దానిముందు ఎందుకూ కొరగానిది. తొలినాళ్ల వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరలించడానికి ఆమె గరీబీ హఠావో, బ్యాంకుల జాతీయీకరణ వంటి అంశాలను తెరమీదకు తెచ్చారు. 1971లో బంగ్లాదేశ్ తో యుద్ధం తర్వాత దేశం లోపలా, వెలుపలా కూడా ఆమెకు బలం పెరుగుతూ వచ్చింది. ఆమె అజేయశక్తి అనుకున్నారు. నిజంగానే ఆమె కార్యసాధకురాలు కాగలిగేవారు. కాని ఆమె లోపలి భయాలు ఆమెను అధికారం మీద దృష్టి పెట్టేలా చేశాయి.

ఆ తర్వాత ఏళ్లలో ఆమెకూ దేశానికీ మధ్య అంతరం పెరిగింది.  దాన్ని పూరించడానికి ఆమె  భజన బృందం ‘ఇండియా అంటే ఇందిరానే’ అన్న నినాదం తీసుకొచ్చారు. ఆమెను శక్తి అవతారంగా కీర్తిస్తూ, ఆమె సమర్థ నాయకత్వం లేకుంటే దేశం కూలిపోతుందన్నంతగా ప్రచారం చేశారు. నాయకత్వం తమదికాని తప్పుడు గుర్తింపును పొందితే, అది నిజమనుకుని భ్రమిస్తే వారి దార్శనికత దెబ్బ తింటుంది. దీర్ఘకాలిక ప్రయోజనాలను చూడలేరు. పాలన యంత్రాంగం దెబ్బతింటుంది. కొత్త అరాచక శక్తులు పుట్టుకొస్తాయి. ఇది నిజమని ఎమర్జన్సీతో ఋజువయ్యింది. రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం స్తంభించిపోయింది.

వాషింగ్టన్ లో కూర్చున్న మాకు నిజాలు, అబద్ధాలు కలగలసి వార్తలుగా వచ్చేవి. వార్తాపత్రికలు చెప్పే విషయాలు  సరిపోయేవి  కాదు. అందువల్ల మేం భారత్ లో ఉంటున్న స్నేహితుల సాయం అడిగేవాళ్లం. రామ్ నారాయణ్ మల్హోత్రా అనే నా స్నేహితుడికి అక్కడ దిగజారుతున్న పరిస్థితుల గురించి సుదీర్ఘ లేఖలు వచ్చేవి. (ఆయన తర్వాత రిజర్వ్ బ్యాంక్ గవర్నరయ్యారు)  మేం లంచ్ బ్రేక్ లో వాటి గురించి చర్చించుకునేవాళ్లం.

​అప్పుడే వాషింగ్టన్లోని భారతీయ దౌత్య కార్యాలయానికి కొన్ని ఉత్తర్వులు అందాయి. అవి ఏమంటే భారత ప్రభుత్వంలో పని చేస్తున్న అధికారులు వాషింగ్టన్ లో ఎంత మంది ఉన్నారు,  వారు ఏయే రకాలుగా ఉపయోగపడతారు అనేది ఒక జాబితా తయారు చేయమని. నేను ఆ జాబితాలో చేరేంత ప్రముఖుడిని కాదు. కాని నా సహోద్యోగి దీనా ఖట్కటే మాత్రం ఆ జాబితాలోకి ఎక్కాడు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఫండ్)లోనో, ప్రపంచబ్యాంకులోనో పనిచేస్తూ అమెరికాలో భారతీయ దౌత్య కార్యాలయం ఉద్యోగులతో సత్సంబంధాలు ఉన్నవారు అతి తక్కువ మంది.  వారిలో దీనా ఒకరు. అందరూ అతని స్నేహాలను చూసి కుళ్లుకొనేవారు. అసలైన అత్యవసర పరిస్థితి వచ్చేసరికి నమ్మకద్రోహం అతనికే జరిగింది. స్నేహితులు అనుకున్న వారే మోసం చేశారు.

ఎమర్జెన్సీ సమయంలో ఇండియా కు వెళ్లి కొంత కాలం గడిపి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం నాకు వచ్చింది. నేను గమనించినంత మేరకు పబ్లిక్ సర్వీస్ పేరు మీద నాలుగు రకాల మార్పులు వచ్చాయి – ప్రజాజీవితంలో అలాగే ఆర్థిక వ్యవస్థలో కూడా.

మొదటిది – జనాకర్షక పధకాలు, ఆదాయంలో అంతరాలు తగ్గించాలన్న పేరిట వాస్తవాలను పరీక్షించకుండా, ప్రభావాలను అంచనా వేయకుండా కొన్ని చర్యలు తీసుకున్నారు. భూసంస్కరణలు వాటిలో ఒకటి. సీలింగ్ తక్కువగా ఉంటే ప్రధానికి ఇష్టం అనుకుని రాష్ట్ర ప్రభుత్వాలు పోటీలు పడి మరీ గరిష్ట భూపరిమితులను తగ్గించాయి. కాని ఆమె అలా పబ్లిక్ లో ఎక్కడా చెప్పలేదు. ఆంధ్రప్రదేశ్ లో అభద్రతాభావం మెండుగా ఉన్న ముఖ్యమంత్రి ( పి.వి. నరసింహారావు – తర్వాత 1992లో ప్రధానమంత్రి కూడా అయ్యారు) ఆ పరిమితిని 18 ఎకరాలకు కుదించారు.

కోస్తా ప్రాంతాలకు, ఇతర ప్రాంతాలకు భూమిలో ఉన్న తేడాలు ప్రభుత్వాలకు పట్టలేదు. కోస్తాలో 20 ఎకరాలున్నవారు తక్కువమంది. మిగిలిన ప్రాంతాల్లో ఎక్కువమంది. భూపరిమితి వల్ల కోస్తా గ్రామీణ ప్రాంతాల్లో కొత్త పేదరికం వచ్చి పడింది. అడ్మినిస్ట్రేషన్ మొదలు న్యాయవ్యవస్థ వరకు ఒక కొత్త తరహా అవినీతికి బీజం పడింది. బినామీ వ్యవహారాలు, పాత తేదీలతో పత్రాలు తయారుచెయ్యడం వంటివి పెరిగాయి. అవినీతి సర్వసాధారణం అవుతూ వచ్చింది.

నేనూ ఈ చట్టం బారిన పడినవాణ్నే. ఏడున్నర ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించి, అటువంటి పని చేసిన తొలివ్యక్తిగా మా తాలూకాలో పేరు తెచ్చుకున్నాను. వ్యక్తిగతంగా నష్టపోయినా నా అభిప్రాయం మారలేదు. కాని అది మా కుటుంబ సెంటిమెంట్లను బాధపెట్టింది. ఆ భూమిని నా భార్య రమకు ఆమె తల్లిదండ్రులిచ్చారు. అది వారింట తరతరాలుగా స్త్రీ ధనంగా వస్తున్నది. దానిలో కొంత భాగాన్ని పోగొట్టుకోవడం మా అత్తమామలనూ, ఆమెనూ మానసికంగా క్షోభపెట్టింది.

రెండోది – మొత్తం అధికారమంతా ప్రధానమంత్రికే దఖలుపడిపోవడం. అది ఆమెకు ఇష్టమని కాదు, ఆమె మెప్పుకోసం మంత్రులే తమ అధికారాలను ఆమె పరం చేశారు. దానివల్ల అత్యవసర విషయాల్లో సైతం జాప్యం జరిగేది. ప్రతి చిన్న నియామకానికీ ఆమె ఆమోదం కోసం ఆగాల్సి వచ్చేది. పనుల్లో ఆలస్యమయ్యేది.

మూడోది – 1970 మొదలు సివిల్ సర్వీస్ రెండుగా చీలిపోయింది. ఒకటి ప్రధాని అడుగులకు మడుగులొత్తే వర్గం. రెండోది ఏవైపూ మొగ్గకుండా, ప్రజల మేలు కోసం ఉపయుక్తమైన పనులు చేసే వర్గం. ఈ రెండో తరహావారు తమ కెరీర్లో ఇబ్బందులు పడ్డారు. మొదటి వర్గం వారికి ప్రమోషన్లు వచ్చాయి, మంచి అసైన్ మెంట్లు లభించాయి. ఆ తర్వాత ఎన్ని రాజకీయ పార్టీలు గద్దెనెక్కినా ఈ దుష్టసంప్రదాయం లోపల్లోపల కొనసాగుతూనే ఉంది. ఒకరకంగాచూస్తే,  పూర్వం ఢిల్లీలో ఉండే దర్బారీ పద్ధతికి మరో రూపమే అది. ఎంతోమంది పాలకులు వచ్చారు, తమవైన కోటలు, పాదముద్రలు వదిలి వెళ్లిపోయారు కాని ఏ రాజ్యంలోనైనా సివిల్ సర్వెంట్ల ప్రాధాన్యత ఎనలేనిదిగానే ఉంది.

నాలుగోది – మొదటి మూడు అంశాలూ కలిసి ఒక అధికార పాలనకు దారితీశాయి. ప్రభుత్వాలకు అంతులేని అధికారం దఖలు పడింది. అప్పటివరకు ఉన్న సివిల్, క్రిమినల్ అంశాలేగాక ఆర్థిక నేరాలను కూడా విచారణ చేసే పని మొదలుపెట్టింది ప్రభుత్వం. దాంతో పౌర జీవనంలో అవి ఎక్కువ కల్పించుకోవడం మొదలుపెట్టాయి. పోలీస్, ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ముందెన్నడూ లేనంతగా బలం పుంజుకున్నాయి. అడ్డూఆపూ లేకుండా చెలరేగాయి. పౌరజీవనాన్ని భయభ్రాంతం చేశాయి.

ఎమర్జెన్సీ ప్రజలకేమైనా మంచి చేసిందా అన్నది ఎప్పటికీ సమాధానం తెలియని ప్రశ్న. ‘ప్రజలకు సేవ చెయ్యడం’ ప్రభుత్వాల లక్ష్యం. కాని ఎమర్జెన్సీ తర్వాత అది పూర్తిగా మారిపోయింది. ఆ ప్రభావం ఇప్పటికీ వాటి పనితీరు మీద కనిపిస్తూనే ఉంది.

* * * * * *

సభ్య దేశాలను నిరంతరం పట్టి కుదిపేస్తున్న ఆర్థిక సమస్యల పరిష్కారానికి ఫండ్ కొత్త ప్యాకేజీలను రూపొందించాల్సి వచ్చింది. ఈ దిశలో మొదటిది ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ (ఇ.ఎఫ్.ఎఫ్).

1975లో తొలిసారి దీన్ని ఉపయోగించుకున్నది కెన్యా. ఆ దేశంతో ఫండ్ చర్చలు మొదలైనప్పుడు నేను వేరే పనిలో ఉండేవాణ్ని. కెన్యాతో ఒప్పందం జరిపిన మిషన్ లో నేను లేను. ఆరు నెలల తర్వాత స్టాఫ్ అప్రైజల్ చెయ్యాల్సి వచ్చినప్పుడు నన్ను ఆ మిషన్ లో పెట్టారు. ఇ.ఎఫ్.ఎఫ్ అగ్రిమెంటు అనేది మూడు విడివిడి ఒప్పందాల సమాహారం. అవి కూడా వ్యవసాయం, గ్రామీణ రవాణా వంటి ఒకొక్క రంగానికి ప్రత్యేకించినవి. మాక్రో ఎకనామిక్ స్టెబిలిటీని కాపాడటం, అభివృద్ధిని సాధించడం అనేవి వాటి లక్ష్యాలు. ఆయా అంశాలను అడ్డుకుంటున్నవేమిటో కనిపెట్టడం, వాటిని సాధించడానికి వ్యూహాలు రచించడం అనేది అవసరంగా మారింది.

కాని ఈ రెండో పని ఫండ్ స్టాఫ్ చేసేవారు కాదు. మానెటరీ సర్వే, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, ఫిస్కల్ అఫైర్స్ వంటి స్థూల అంశాల్లో వారికి అనుభవం ఉంటుందిగాని, ఆర్థిక ప్రణాళికలు, అభివృద్ధి అంశాల్లో వారికి అనుభవం లేదు. ఇవి ప్రపంచ బ్యాంకుకు పట్టున్న వ్యవహారాలు.

ఈ నేపథ్యంలో కెన్యా ప్రభుత్వం ఆ పనంతా చేసేసి ఒక శ్వేతపత్రం విడుదల చేసింది. అప్పుడే ఆ దేశం ఒక దీర్ఘకాలిక కరువు నుంచి బయటపడుతోంది. ఇంకా కొద్దిగా ఆ ఛాయలు కనిపిస్తూనే ఉండేవి. అధ్యక్షుడు కెన్యాట్టాకూ ఆర్థిక అంశాల్లో పెద్ద ఆసక్తి లేదని చెప్పుకునేవారు. అధ్యక్షుడికి పట్టు లేకపోవడంతో వివిధ శాఖలు విచ్చలవిడి ఖర్చుకు తెగబడ్డాయి. డబ్బు అయిపోతే పేమెట్ ఎరియర్స్ ను ఆశ్రయించాయి. అధ్యక్షుడి కుమార్తె నేతృత్వం వహిస్తున్న కార్పొరేషన్ ఆఫ్ నైరోబీకీ అదే పని. ఆమె ప్రతిష్ట నుంచి కూడా అప్పు పుట్టక, మున్సిపల్ సేవలు ఆగిపోయే పరిస్థితి వచ్చింది.

ఈ నేపథ్యంలో ఆర్థికశాఖే తొలి అడుగు వేసింది. ఆర్థికమంత్రి పేరు కిబాకీ. ఆయన అర్థశాస్త్ర ప్రొఫెసరు. తర్వాత కాలంలో ఆయన ప్రతిపక్ష నాయకుడు, ఉపాధ్యక్షుడు, 2002లో కెన్యా అధ్యక్షుడు కూడా అయ్యారు. మా పరిశీలనల ఆధారంగా ఆ శాఖ ఒక కేబినెట్ పేపర్ తయారుచేసింది. అది అధ్యక్షుడికి చురుకు పుట్టించింది. వృధా ఖర్చులు ఎవరు పెట్టినా, ఉద్యోగం పోయే ప్రమాదముందని హెచ్చరించారాయన. దెబ్బకు దెయ్యం దిగిపోయింది. అనవసర ఖర్చులు తగ్గాయి. ఆర్థిక క్రమశిక్షణ అలవడింది.

కెన్యా అప్రైజల్ మిషన్ లో భాగం కావడం చాలా ఛాలెంజింగ్గా ఉండేది. ఒకో అంశాన్ని పరిశీలిస్తున్నకొద్దీ ఏదోక లోపం బయటపడేది. అటువంటప్పుడు మా అనుభవమే మమ్మల్ని ఆదుకునేది.  మిషన్ లీడర్ రతన్ భాటియా. భారతీయుడు. భారత ఆర్థికశాఖ, ప్లానింగ్ విభాగాల్లోను,  ఇటు ఆఫ్రికా డిపార్ట్ మెంటులో అనుభవం ఉన్నవాడు. ఆయన నేనుగాక Burk Dillon, Dick Stillson, Saul Rothman వంటి నిపుణులు తమ అనుభవాన్ని రంగరించి ఆ సవాలును పూర్తిచేశారు.

తర్వాత ఆ ప్రోగ్రామ్ మరిన్ని దేశాలకు విస్తరించింది. నేను తర్వాత మరికొన్ని మిషన్లలో భాగస్వామినయ్యాను.కాని కెన్యాతో వచ్చిన తొలి అనుభవం  పెద్ద పాఠాన్ని నేర్పింది.

అనవసరమైన  ఖర్చుల్ని తగ్గించడానికి, పాత ఎరియర్లు పేరుకుపోకుండా చూడటానికి గట్టి క్రమశిక్షణ, రాజకీయ నిబద్ధత అవసరం అనేదే ఆ పాఠం.

 

* * * * * *

1977 మొదట్లో వృత్తిపరంగా, వ్యక్తిగతంగానూ కొన్ని మార్పులు వచ్చాయి. డైరెక్టర్ రిచర్డ్ గూడే నాకు అడ్వైజరుగా పదోన్నతినిచ్చారు. బాధ్యతలూ పెరిగాయి. ఫండ్ తో నా అనుబంధం సుదీర్ఘకాలం కొనసాగేట్టు అనిపించింది. 1970లో ఫోర్డ్ ఫౌండేషన్ ను వదిలి వచ్చేటప్పుడు Doug Ensminger  ‘మీరు ఫండ్ తో ఎన్నాళ్లు పనిచేస్తారని ఊహిస్తున్నారు’ అని అడిగారు.

‘బహుశా మూడు నాలుగేళ్లు అనుకుంటా’ అని సమాధానమిచ్చాను.

ఆయన నవ్వారు.

‘నన్ను నమ్మండి, మీరు ఇక మిగిలిన జీవితమంతా అక్కడే పనిచేస్తారు’ అన్నారు.

నా గురించి నేను వేసుకున్న అంచనా కన్నా ఆయన చెప్పినదే నిజమైంది. మొదట్లో కొన్ని ఇబ్బందులు లేకపోలేదు. మా ఆవిడ ఇంగ్లిష్ నేర్చుకోవడం కోసం జార్జిటౌన్ లోని ప్రాస్పెక్ట్ స్ట్రీట్ లో స్కూల్లో చేరింది. తర్వాత కారు డ్రైవింగ్ నేర్చుకోవలసి వచ్చింది. మా అమ్మాయిలు మొదట పబ్లిక్ స్కూళ్లలో చేరారు, తర్వాత ప్రైవేటు, గర్ల్స్ స్కూళ్లకు మారారు. మేమక్కడ సర్దుకోవడానికి కొంత సమయం పట్టింది. ఆఫీసు పనుల మీద వాషింగ్టన్ నుంచి నేను తరచూ బయట దేశాలకు వెళ్లిపోయేవాణ్ని. అందువల్ల కొంతకాలం అపార్టుమెంటులోనే ఉండి అందరికీ ఆత్మవిశ్వాసం పెరిగాక వేరే ఇంటికి మారదామనుకున్నాం.

ప్రమోషన్ వచ్చాక మేం ఇల్లు కొనుక్కున్నాం. అప్పణ్నుంచి మా జీవితాన్నంతటినీ ఆ ఇల్లు చూసిందంటే అతిశయోక్తి కాదు. మా పిల్లల చదువులు, వారి పెళ్లిళ్లు, ముగ్గురు మనవల పుట్టుకలు – ఇవన్నీ అక్కడ ఉండగా జరిగినవే. 1998లో నేను రిటైరయ్యాక ఆ ఇంటిని అమ్మేసి, మా రెండో అమ్మాయికి దగ్గరగా ఉందామని సౌత్ కాలిఫోర్నియాకు మారిపోయాం.

* * * * * *

1970ల్లో చాలా దేశాల్లో పబ్లిక్ ఎక్స్ పెండిచర్ పెరుగుతూ ఉండేది. చమురు ధరలు పెరగడమే దీనికి కారణం అనుకునేవారుగాని ఆ పెరుగుదలకు ఇంకొన్ని కారణాలుండేవి, అవి విస్మరించలేనివి.

పారిశ్రామిక దేశాల్లో అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు భారీ మేళ్లు చేకూర్చాయి. ముఖ్యంగా ఆరోగ్య పథకాలు. అవి ప్రభుత్వ ఖర్చులో సింహభాగాన్ని ఆక్రమించాయి. చాలా దేశాల్లో ఇవి ద్రవ్యోల్బణాన్ని మించి పెరిగిపోయాయి. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సంక్షేమ కార్యక్రమాల ఖర్చును విపరీతంగా పెంచాయి. పెరిగిన జీతాలు, పెన్షన్లు కూడా ఖర్చు పెరగడానికి కారణమవుతూ వచ్చాయి.

దాంతో ఎక్స్ పెండిచర్ మేనేజ్ మెంట్ యంత్రాగం విఫలమైందనే భావన కలిగేది. దీనికి ప్రతిశాఖా మరొకరిని నిందించుకుంటూ ఉండేవి. శాసనకర్తలు దాన్ని ప్రభుత్వ ఉద్యోగుల వైఫల్యమని, వీళ్లు వాళ్లని అనుకునేవారు. సామాన్య ప్రజలేమో అది ప్రభుత్వోద్యోగులు, రాజకీయ నాయకులు చేసే కుట్రల ఫలితం అని అనుకునేవారు.

ఈ నేపథ్యంలో ఫండ్ లోని ఎగ్జిక్యూటివ్ బోర్డు దీనిమీద ప్రత్యేక దృష్టి సారించింది. అనుకోకుండా పెరిగే ఖర్చులు ప్రోగ్రాముల వైఫల్యానికి దారితీస్తున్నాయని అది త్వరగానే గ్రహించింది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వస్తువుల ధరలు పెరిగినప్పుడు పూర్తిగా భారం వినియోగదారుడి మీద పడకుండా ప్రభుత్వాలు భరిస్తున్నాయి. అందువల్ల ధరలనేవి మార్కెట్ వాస్తవాలను ప్రతిబింబించవు. ఈ అంశాలన్నిటి మీదా ఫండ్ మేనేజ్ మెంట్ దృష్టి పెట్టాలనుకుంది. ఫలితంగా రెండేళ్ల పాటు రెండంచెల కార్యక్రమం ఒకదాన్ని నడిపింది. వివిధ దేశాల్లో ఎక్స్ పెండిచర్ మేనేజ్ మెంట్ అధ్యయనం చేసింది.

పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్, బడ్జెట్ లోటుపై వాటి ప్రభావం ఎంతో తెలుసుకునే అధ్యయనాలేమీ జరగడం లేదనే ఆందోళన ఫిస్కల్ అఫైర్స్ డిపార్ట్ మెంటులో ఉండేది.  ఆ సమయంలో పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ విస్తరిస్తూ ఉండేవి. భారీ బ్యాంకింగ్, ట్రేడింగ్,  గనులు, చమురుశుద్ధి, ఆయిల్ పంపిణీ, హౌసింగ్, హోటల్ సర్వీసులు, చేపల పెంపకం, కొన్ని దేశాల్లో లాండ్రీ సర్వీసులు కూడా ప్రభుత్వ సంస్థలుగానే ఉండేవి. ఫండ్ సభ్య దేశాల్లో ఇవి ఎలాగ సాగుతున్నాయో, వాటి భవిష్యత్తు ఏమిటో –  ఎవరూ విశ్లేషించలేదు.

మా డైరెక్టర్ రిచర్డ్ గూడే తన సంప్రదాయ ధోరణితో వీటిపట్ల ఏ ప్రయత్నాలకూ ముందుకు రాలేదు. కాని మారుతున్న ధోరణులు, అవసరాలు తెలుసుకుని ఏదో ఒకటి చెయ్యాలని కూడా అనుకునేవారు. అందువల్ల ఆయన నలుగురు సభ్యులతో ఒక ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేశారు. నేను దానికి ఛైర్మన్. మా పనులు చేసుకుంటేనే ఈ పని చక్కబెట్టాలి తప్ప, వాటిని పక్కకు పెట్టి కాదు. దాంతో నలుగురిలో ఒకరో ఇద్దరో ఎప్పుడూ తమ మిషన్లతో బిజీగా ఉండేవారు.

ఎప్పుడూ ఉండే ఈ తరహా సమస్యలను పక్కకు పెట్టి, మేం ఎలాగోలా కలుసుకున్నాం. మొదట నాన్ ఫైనాన్షియల్ పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ తో పని మొదలుపెట్టాం. వాటి పనితీరు, ప్రభుత్వ బడ్జెట్లపై వాటి ప్రభావం అంచనా వెయ్యడం తొలి మెట్టు. మమ్మల్ని చూసి ప్రపంచ బ్యాంకు కూడా ఇలాంటి పని ప్రారంభించింది. అయితే ఫండ్ ఆర్థిక విషయాలకే పరిమితం అయితే, ప్రపంచ బ్యాంక్ వాటి నిర్వహణ విధానాలు, శైలి తదితర అంశాల మీద దృష్టి పెట్టింది. మా విశ్లేషణ అనంతరం ఒక పెద్ద నివేదికను మేం గూడేకి అందజేశాం. నాన్ ఫైనాన్షియల్ పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ విశ్లేషణ చెయ్యవలసి వస్తే ఫండ్ స్టాఫ్ పాటించాల్సిన విధివిధానాలేమిటనేది అందులో స్పష్టంగా రాశాం. అది తప్ప ఫిస్కల్ అఫైర్స్ డిపార్ట్ మెంట్ ఎలాంటి ప్రయత్నమూ మొదలుపెట్టలేదు. రాజకీయ అంశాలపై ఆధారపడినవాటికి సంస్థ స్థాయిలో ఏమీ చెయ్యలేమన్న గూడే అభిప్రాయం దానికి కారణం కావచ్చు.

ఎక్స్ పెండిచర్ మేనేజ్ మెంట్ సమస్యలు ఫండ్ మేనేజ్ మెంటునూ ఎగ్జిక్యూటివ్ బోర్డునూ కలవరపెడుతూనే ఉండేవి. ఫండ్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్ ఫ్రెంచి దేశస్థుడు. ఆ దేశానికి ఫైనాన్స్ ఇన్స్ పెక్టర్ జనరల్ గా అనుభవమున్న పెద్దమనిషి. అతనికి సమస్యలపైన అవగాహన ఎక్కువ.

ఫీల్డులో నాకున్న అనుభవం ప్రకారం నా అభిప్రాయం ఏమంటే – ఖర్చులు పెరగడానికి రాజకీయాలు కారణం అయ్యుండవచ్చు. కాని అది కొంతవరకే. కాలం చెల్లిన వ్యవస్థలు, కొత్త తరహా టెక్నిక్ లను వాడకపోవడం వంటివి కారణాలని. నా ధైర్యాన్నంతా కూడదీసుకుని గూడేకు ఒక విజ్ఞాపన పత్రం రాశాను. అభివృద్ధి చెందుతున్న, చెందిన దేశాలన్నిటికీ ఈ సమస్య సమానంగా ఉందిగనక, ఒక అత్యున్నత స్థాయి పాలసీ సెమినార్ ను రెండు వారాల పాటు ఫండ్ నిర్వహిస్తే బాగుంటుందని, అన్ని దేశాల వారు వచ్చి చర్చించుకుంటారని అందులో తెలియజేశాను. ఫండ్ ఏ పరిష్కారాలూ సూచించనవసరం  లేదు, కేవలం మధ్యలో ఉండి చర్చను నడిపిస్తే చాలు, అందులో మంచి నిర్ణయాలు వస్తే అందరూ వాటినే అనుసరిస్తారు.

నా విన్నపం ఆయనకు నచ్చలేదు. నేనేదో ఒత్తిడి చేస్తున్నట్టు అనిపించింది ఆయనకు.

అదేసమయంలో అనుకోకుండా ఎమ్.డి. ఆయనను పిలిచారు. ఈ సమస్య మీద ఫండ్ రెస్పాన్స్ ఏమిటని అడిగారు. టెక్నికల్ అసిస్టెన్స్ ఇవ్వడం తప్ప మరే ఆలోచనా లేదని గూడే చెప్పారు. అది ఎమ్.డి.కి సంతృప్తి కలిగించలేదు. కొద్దిగా ఆలోచించి ఒక అంతర్జాతీయ సదస్సు ఏర్పాటు చెయ్యమని చెప్పారు! గూడే తనవద్ద చాలినంత బడ్జెట్ లేదని గునిశారు. ఆయన అది కూడా ఏర్పాటు చేస్తానని చెప్పి వెంటనే ఏర్పాట్లు మొదలుపెట్టమన్నారు.

గూడే ఎంత సంస్కారవంతుడంటే, రాగానే నన్ను పిలిపించి జరిగిందంతా చెప్పారు. మేనేజ్ మెంటు ఆలోచనను నాకన్నా నేను బాగా ఊహించినందుకు అభినందించారు. సెమినార్ నిర్వహణ బాధ్యత అంతా నన్నే చూసుకోమన్నారు. ఎవరెవర్ని ఆహ్వానించాలి, ప్రణాళిక, కావలసిన పత్రాలేమిటి – ఇవన్నీ. కాని నాకు సాయంగా మరెవ్వర్నీ ఇవ్వనని చెప్పేశారు. నిర్వహణకు అనుమతి లభించింది, అది ముఖ్యం అనిపించింది నాకు. సాయం ఎవరూ లేరన్నది పెద్ద నిరాశ కలిగించలేదు. ఒక్కణ్నే అయినా పూనుకున్నాను. 1000 పేజీల డాక్యుమెంటేషన్ ఒక్కణ్నే సిద్ధం చేసుకున్నానంటే ఎంత పూనికతో ఉన్నానో అర్థమవుతుంది. ఉన్నత స్థాయి అధికారులకు రెండు వారాల పాటు తమ రాజధానిలో కార్యాలయాల్లో లేకుండా ఉండటం కష్టం. అలాంటివారికి డైరెక్టర్, ఈడీల సాయంతో ఆహ్వానాలు పంపాం.

1980ల మొదట్లో ఈ సెమినార్ జరిగింది. అనుకున్నట్టుగానే నడిచింది, అనేక సమస్యల మీద కూలంకషంగా చర్చించేందుకు వేదికయింది. పాల్గొన్నవాళ్లంతా ఫండ్ సాయాన్ని కోరుకున్నారు. కాని గూడేకి ఇష్టం లేకపోవడం వల్ల ఆచరణలోకి ఏమీ రాలేదు. ఏడాది తర్వాత ఆయన రిటైరయ్యారు. ఆయన స్థానంలో వచ్చినాయన మాక్రో ఎకానమిస్టు. ట్యాక్స్ విషయాల్లో అనుభవజ్ఞుడు. కాని ఆయనకూ ఇందులో ఆసక్తి లేదు.

కాని ఒ.ఇ.సి.డి, ప్రపంచబ్యాంకు వంటి సంస్థల చొరవతో ఎక్స్ పెండిచర్ మేనేజ్ మెంట్ తర్వాత చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. 1980ల చివర, 1990ల మొదటినాటికి సంస్థాగతమైన అభివృద్ధిలో అదొక ముఖ్య అంశమైంది. జనబాహుళ్యంలో కొత్త పదం వచ్చి చేరింది.

అక్కణ్నుంచి కొన్నేళ్ల తర్వాత చర్చ దిశ మారిపోయింది. అప్పటికి ప్రభుత్వ సంస్థల అభివృద్ధి కాదు, వాటిని తెగనమ్మడం ఎట్లా అని చర్చ. మారిన వాతావరణంలో ఫండ్ సలహాల అవసరం పెద్దగా లేకపోయింది. చాలా దేశాలు ప్రైవేటీకరణను తమంతతాముగా చేసేసుకున్నాయి. ప్రపంచ బ్యాంకు ప్రముఖ పాత్ర పోషించడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఎన్నో పొరపాట్లు జరిగాయి. ముఖ్యంగా సోవియెట్ దేశాల్లో. చివరికి లాభపడినవి కొన్ని ప్రైవేటు కన్సల్టింగ్ సంస్థలు. బడ్జెట్లకు దొరికిన రిలీఫ్ కొద్ది కాలమే. 1980, 90ల్లో ఎక్స్ పెండిచర్ విషయాల్లో భారీ సంస్కరణలు నడిచినవి కూడా తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. కౌంటర్ సైక్లికల్ పాలసీలు కొంత కారణమైతే, సంస్థల పునర్నిర్మాణం, సంస్కరణల ప్రభావం తగ్గిపోవడం వంటివి మరికొన్ని కారణాలు.

* * * * * *

అరిగపూడి ప్రేమ్ చంద్

అరిగపూడి ప్రేమ్ చంద్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు