రెండు ముక్కలైన ‘ముక్కోటి బలగం’

తెలంగాణ నేలమాలిగలో మొలిచిన గొప్ప కథ ‘ముక్కోటి బలగమోయి..’

ముక్కోటి బలగం కథ

కాశవాణి న్యూస్ రీడర్, పాత్రికేయులు, పత్రికా సంపాదకులు, సోషలిస్టు, న్యాయవాది, తెలంగాణ తొలి తరం కథకులు గర్శకుర్తి సురమౌళి రాసినవి కొన్ని కథలే అయినా మట్టిలో మాణిక్యాల్లాంటి కథలు రాశారు. సురమౌళి రాసిన సుమారు 20 కథల్లో లభించిన 16 కథల్ని సంగిశెట్టి శ్రీనివాస్ 2015లో ‘సురమౌళి కథలు’ ప్రచురించారు. ఈ కథా సంపుటికి డా. ఎ. కె. ప్రభాకర్, సంగిశెట్టి శ్రీనివాస్ లు రాసిన ముందు మాటలు ఎంతో విలువైన సమాచారాన్ని, కథా చరిత్రను ప్రస్తావనకు తెచ్చి ఇప్పటి తరానికి ఎంతో ఎరుకను కలిగించాయి. పాతికేళ్ల లోపే కథలు రాసి ఆపేసిన సురమౌలికి కథా రచన పట్ల నిర్ధిష్టమైన అభిప్రాయాలున్నాయి. 1960లో గోల్కొండ పత్రికలో ‘నేను – నా కథలు’ శీర్షికన రాసిన వ్యాసంలో కథా రచన పట్ల విలువైన అభిప్రాయాలు రాశారు.

“కథానికకు టెక్నిక్ అలంకారప్రాయమైంది. మనిషికి దుస్తుల్లాగ. కానీ టెక్నిక్కే సర్వస్వమై, విరాట స్వరూపం దాల్చి దాని అంతరంగాన్ని, కథలో చెప్పిన విషయాన్ని, అది ప్రతిపాదించు నీతిని కబళించటం ప్రారంభించకూడదు. నాకు సాహిత్యం లక్ష్యం కాదు. సాధనం. లక్ష్యం వేరే ఉన్నది. మానవ జీవితం.”

“ఒక భావాన్ని చెప్పడానికి ఏ సాహిత్య ప్రక్రియ అనువుగా ఉంటే దాన్ని వాడుకుంటాను. కనుక భాష సాధనం. సాహిత్యం సాధనం. ఒక భావాన్ని వ్యాసంలో తేలిగ్గా చెప్పగలిగితే వ్యాసంలో, కథలో చెప్పగలిగితే కథలో చెపుతాను. కాని, కథలు రాయడం కోసమని భావన చెయ్యను. అంతే కాదు, విషయానికనువుగా కథ దానంతటదే రూపుదిద్దుకుంటుంది.”

“కవిత్వంలో జీవం సంగతే పట్టించుకోకుండా కొంత వరకు నెట్టుకు రావచ్చునేమో! కాని కథానికల్లో అది సాధ్యం కాదు. జీవితంలో నుంచి తీసుకున్న వస్తువు కావాలి. వారి ప్రవర్తన సర్వ సామాన్యంగా హేతుయుతంగా ఉండాలి. ఇంతా చేసి తుదకు మనం సాధించగలమన్న జీవితత్వాన్ని ప్రతిపాదించాలి. కవిత్వానికేం? మహారాజుగా ఏ వస్తువునన్నా తీసుకోవచ్చు. పాత్రల గొడవే ఉండదు. ఉన్నా వాస్తవం కానక్కర అంతకన్నా లేదు. అలా పైపైన కవులు తేలి పోవచ్చు. కానీ కథానికా రచయితలు భూమ్మీద కాలు మోపి మరీ నడవ వలసి ఉంటుంది.”

“రచయితేదో పాఠకుడికి చెప్పదల్చుకుంటాడు. ఆ చెప్పదలుచుకున్న దాన్ని కొంచెం అందంగా సంస్కారయుతంగా హృద్యంగా చెప్పడమే సాహిత్య సృష్టి.” ఇవి సురమౌళికి కథానిక రచన పట్ల, సాహిత్యం పట్ల ఉన్న నిశ్చితమైన అభిప్రాయాలు. వీరి కథలన్నీ నేల మీద నడిచేవే. అందులో తెలంగాణ నేలమాలిగలో మొలిచిన గొప్ప కథ ‘ముక్కోటి బలగమోయి..’ ఈ కథ మొదట 1956లో ‘తెలుగు స్వతంత్ర’ లో ప్రచురింపబడింది.

1953లో కర్నూలు రాజధానిగా ‘ఆంధ్ర రాష్ట్రం’ ఏర్పడ్డ తరువాత అక్కడ పరిపాలనకు సరైన వసతులు లేక సీమాంద్రులు ఒకే భాష, ఒకే రాష్ట్రం పేర భాష ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని ఉద్యమాలు చేసి, ఎన్నో కుట్రలు, బూటకపు ఒప్పందాలు చేసి మొత్తం మీద 1956లో భాషా ప్రాతిపదికన ‘ఆంధ్రప్రదేశ్’ ఏర్పాటయ్యేలా చేశారు. అట్లా రాజధాని కర్నూలు నుండి హైదరాబాద్ కు మారింది. ఇందులో భాగంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్ని కర్నూలు నుండి హైదరాబాద్ కు మార్చారు. కోటాయ్ (కోటయ్య) సెక్రటేరియట్ లో ఫ్యూను. ఆఫీసు హైదరాబాద్ కు మారడం తో తాను కూడా కర్నూలు నుండి రైలు బండిలో హైదరాబాద్ కు బయలుదేరుతాడు. ఆఫీసు, ఇతర ఉద్యోగులు ముందే పోయినా కోటాయ్ భార్యా బిడ్డలకు చెప్పి ఒక రోజు ఆలస్యంగా బయలుదేరుతాడు. రైలు క్రిక్కిరిసి ఉంటుంది.

రైలు పోతూ ఉంటే కోటాయ్ లో ఏవేవో ఆలోచనలు రాసాగాయి. “తెలంగాణవోళ్లు ఎన్ని అగచాట్లు పెడుతారోననే భయం గబుక్కున కోటాయికి తట్టింది. తానా మధ్య పేపర్లో చదివిన సంగతులు జ్ఞాపకానికి రాసాగినై. ముల్కీ – నాన్ముల్కి అని ఏదో అల్లరి జేసి, పొట్ట కూటికి తమ పుట్టినూరినీ, ఇంటిని వదిలి, ఆంధ్ర దేశం నుంచి వచ్చి హైదరాబాద్ లో కాపురం పెట్టుకున్న తన బోటి వాళ్ళని ఎక్కడ బడితే అక్కడ దొరికించుకుని తన్నారట. వాళ్ళకు ఆలోచనే లేదట. ఇక తన్నటం మొదలు పెడితే పెద్ద చిన్నా చూడకుండా బొక్కలిరిగేటట్టు తన్నడవేనట. అక్కడి తెలుగు వారు కూడా తురకం మాట్లాడుతారట.” అని తెలంగాణ వారి గురించి తనకున్న అభిప్రాయాలను తల్చుకుంటూ నిద్రలోకి జారుకుంటాడు.

ఏదో స్టేషన్ లో రామప్ప అనే డాక్టర్ కోటాయిని నిద్ర లేపి తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి ఏమైనా అవసరముంటే రా! అంటాడు. ఇంతలో కాచిగూడ స్టేషన్ రాగానే ఇద్దరూ దిగి కోటాయి సెక్రటేరియట్ పోతానంటే అతడిని దగ్గరుండి సిటీ బస్సు ఎక్కించి రామప్ప వెళ్ళిపోతాడు. సెక్రటేరియట్ దగ్గర మరో ఫ్యూను బలరామయ్య కలిసి తమ ఆఫీసు ఎక్కడ ఉండేది, బస ఎక్కడ?, అక్కడికి ఎలా పోయి రావాలి తదితర విషయాలన్నీ చెప్తాడు. ఆఫీసులోకి వెళ్ళగానే అక్కడి ఆఫీసర్ కోటాయికి ఒక కవర్ ఇచ్చి దాన్ని చీఫ్ సెక్రటరీకి ఇచ్చి రమ్మంటాడు. వచ్చి రావడంతోనే పని చెప్పినందుకు అతడ్ని తిట్టుకుంటూ కోటాయి బయలుదేరుతాడు. దారిలో కోటాయికి రైల్లో కనిపించిన రామప్ప డాక్టర్ కలుస్తాడు. కోటాయికి చీఫ్ సెక్రటరీ దగ్గరికి ఎలా వెళ్లాలో ఏ బస్సు ఎక్కాలో వివరించి వెళ్తాడు. కవరిచ్చి వచ్చిన తరువాత బలరామయ్యను పిలిచి అసలు ఈ ఊరు వాళ్ళు మంచి వాళ్లేనా? అని అడుగుతాడు. ఇక్కడి వాళ్ళు చెడ్డ వాళ్లని చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తూనే గవర్నమెంటుతో పని ఉన్న వాళ్ళు మనతో మంచిగా ప్రవర్తిస్తారని, ఆ మంచి తనం స్వార్థంతో కూడుకున్నదని చెప్తాడు. కానీ రామప్ప లాంటి మంచి వాళ్ళ సంగతేంటో కోటాయికు అర్థం కాదు. తెలుగు వాళ్లందరిది ఒక్క కుటుంబమనే మాట నిజమేననుకున్నాడు. “కోటాయిలో ఇప్పుడు ఎన్నడూ లేని గర్వం ప్రవేశించింది. ఆ గర్వంతో ఆనందం కలిగింది. ఆంధ్ర ప్రదేశ్ అవతరిస్తుందని విన్నప్పుడు కొందరికి ఈలాంటి ఆనందమే కలిగి ఉంటుంది. ఇక్కడి వాళ్లందరిని తానే ఏలుతున్నాననుకున్నాడు… నైజామును గద్దెదించింది తానేననుకున్నాడు. ఆ గద్దె తన కోసమే ఖాళీ అయిందనుకున్నాడు.”

తరువాత ఫతేమైదాన్ లో జరుగుతున్న నెహ్రూ గారి మీటింగ్ కు వెళ్తాడు కోటాయి. అక్కడొక వ్యక్తి కలిసి తాను చుట్ట తాగబోతూ కోటాయికి కూడా ఒకటిస్తాడు. ఆయన్ని “మీ పేరేమిటీ?” అని అడుగుతాడు కోటాయి. ఆ ఆసామి తన పేరు ‘కోటయ్య’ అంటాడు. ఇద్దరి పేర్లూ ఒకటే కావడంతో కోటాయి చాలా సంతోషపడుతాడు. ఇంతలో నెహ్రూ గారు మీటింగ్ కి వచ్చారు. ముందరున్న పిల్లలు కొంత మంది మోకాలి మీది దాకా నిక్కి చూస్తున్నారు. “ఏయే కూచొండి కూచొండి” అని అరిచాడు కోటాయి. “నైజాం వాళ్ళంతా వట్టి దద్దమ్మలనీ, తానేం చెపితే అది నమ్ముతారని, తనకిందాక కలిగిన అభిప్రాయం వాళ్ళు తన ఆజ్ఞను పాఠించడంతో ధృడపడ్డది. తమను చూసి నైజాం వాళ్ళు భయపడుతున్నారని, అందుకని వాళ్ళే తమకు లొంగి ఉంటారనే నిర్ణయానిక్కూడా వచ్చాడు కోటాయెప్పుడో” నెహ్రూ గారి ఉపన్యాసం ప్రారంభమైంది. పిల్లలు మళ్లీ తలలు పైకి లేపారు. కోటాయి మళ్ళీ కేకేశాడు. వాళ్ళు మళ్ళీ కూర్చున్నారు. ఇట్లా నాలుగైదు సార్లు అయ్యే సరికి పక్కనున్న ఆయనకు కోపం వచ్చింది. మాటా మాటా పెరిగింది. కోటాయి నైజాం వాళ్ళు తనకు భయపడుతున్నారనే విషయం మనసులో ఉంచుకొని  ఏ మాత్రం తగ్గకుండా ఎదురు తిరిగాడు. ఈ గొడవంతా చూసిన ఒక రూమీ టోపీ “మ్మారోస్సాలేకు” అని తప్పుకుంది. చుట్టూ జనం లేసి కోటాయిని విరగ తంతారు. తలకు బలమైన దెబ్బ తగులుతుంది. పోలీసులు గొడవను సద్దుమణిగేలా చేసి కోటాయిని ఫతేమైదాన్ బయట వదులుతారు. నొప్పికి తాళ లేక ఫుట్ పాత్ మీదనే వాలిపోతాడు కోటాయి.

చాలా సేపటికి కళ్ళు తెరిచే సరికి మంచంలో ఉంటాడు. పక్కన ఇందాక పరిచయమైన కోటయ్య కూచోని ఉంటాడు. కోటాయి ఆశ్చర్యంలో నుండి బయటకు రాకముందే తానే ఇక్కడికి తీసుకొచ్చానని కోటయ్య చెప్తాడు. ఇది డాక్టర్ రామప్ప గారి ఇళ్లనీ చెప్తాడు. గాయం ఏమంత పెద్దది కాదులే రెండు మూడు రోజుల్లో కోలుకుంటావని చెప్తాడు డాక్టర్ రామప్ప. ముగ్గురూ భోజనం చేస్తారు. అప్పుడే రేడియోలోంచి

“ముక్కోటి బలగమోయి ఒక్కటై మనముంటె

ఇరుగు పోరుగూలోన ఊరు పేరుంటాది

తల్లి ఒక్కటే నీకు తెలుగోడా..

సవతి బిడ్డల పోరు మనకేలా…?” అనే పాట వినిపిస్తుంది. ఆ పాటనే మనస్సులో మననం చేసుకుంటూ ఇద్దరు కోటయ్యలు అక్కడి నుంచి కదిలిపోతారు.

మొదటనే పేర్కొన్నట్లు సురమౌళికి కథానిక పట్ల ఉన్న నిశ్చితాభిప్రాయాలకు తార్కాణంగా నిలబడే కథ ఇది. సురమౌళి లక్ష్యం మానవ జీవితం. అందుకే వాస్తవాధీన రేఖ మీద నడిచే కథలు రాయగలిగారు. ‘ముక్కోటి బలగమోయి’ కథ సారాంశంలో సమైక్య వాద కథే అయినా పొట్ట చేత పట్టుకొని వలస వచ్చిన సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణ ప్రజల్ని ఎంత హీనంగా చూశారో రచయిత చాలా నేర్పుగా చెప్పారు. రెండు ప్రాంతాలు కలిసినప్పుడు ఆ ప్రాంతాల ప్రజలు ఒక  అవగాహన, ప్రేమ, ఆప్యాయతలు, మమకారం ప్రాతిపదికగా కలవాలిగాని ఒప్పందాల ప్రకారం, కాగితాల ప్రకారం కలిసిపోతే ఆ కలయిక ఎలా విచ్చిన్నమౌతుందో ఈ కథ ఒక ఉదాహరణ.

తెలంగాణ ప్రజల మంచితనాన్ని బలహీనతగా స్వీకరించి ఆధిపత్యం చలాయించాలని చూస్తే ఎంతటి వారినైనా తన్ని పంపిస్తారని రచయిత వ్యాచ్యంగానే చూపించారు  ఈ కథలో. అదే సమయంలో ఏ ప్రాంతం వారినైనా కడుపులో పెట్టుకొని చూస్తారని చెప్పడానికి డాక్టర్ రామప్ప పాత్ర ఒక ఉదాహరణ. అలాగే ఇక్కడి మర్యాదకు నిలువెత్తు నిదర్శనమైన పాత్ర తెలంగాణ కోటయ్య. ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగిన సందర్భంలో తెలంగాణ, సీమాంధ్ర ప్రజల మనోభావాలకు అద్దం పట్టిన కథ ఇది. మద్రాస్ ను కోల్పోయినా దాన్ని తలదన్నే రాజధానిని కైవశం చేసుకున్నామని మురిసిపోతూ భయం భయంగానే తెలంగాణకు తరలి వచ్చిన సీమాంధ్ర ఉద్యోగులకు ఇక్కడ ఎలాంటి రాచ మర్యాదలు దక్కాయని చెప్పడంలో రచయిత నూటికి నూరుపాళ్లు కృతకృత్యులయ్యారు. తెలంగాణ వాళ్ళు మంచి వాళ్ళేనా అని కోటాయి సందేహం. తెలంగాణ వాళ్ళు నమ్మితే ప్రాణమిస్తారు. లేదంటే పాతర పెడుతారని రచయిత చూపించిన తీరు అబ్బురపరుస్తుంది.

వలస వచ్చిన ఫ్యూను పేరు కోటయ్య, ఆ కోటయ్యకు పరిచయమైన స్థానికుని పేరు కూడా కోటయ్యే. ఇలా రెండు పాత్రల పేర్లు ఒక్క్తటే పెట్టడం వెనుక తనువులు వేరైనా, తెలుగు ప్రజలంతా ఒక్కటేననే సూచిక తొంగి చూస్తుంది. కల కాలం కలిసి ఉంటే తెలుగు వారి పేరు దేశంలో ఎప్పటికీ నిలిచి ఉంటుందని, లేదంటే ఆభాసు పాలవుతామని ఆనాడే హెచ్చరించాడు రచయిత. సురమౌళి ఊహించినట్టుగానే ఆధిపత్యం, తెలంగాణ సంస్కృతిని హీనీకరించడం, భాషను ఎద్దేవా చేసి నాజూకు భాష కాదని కేవలం ఆంధ్ర తెలుగునే రాష్ట్రమంతా రుద్దడం ఇత్యాది అనేక కారణాల వలన ఆంధ్రప్రదేశ్ విభజన అనివార్యం అయిపోయింది. ఇక నుంచైనా రెండు ప్రాంతాలను కలిపేటప్పుడు చూడాల్సింది భాష ఒక్కటని కాదు ఇంకా అనేక అంశాలు కలిస్తేనే సమైక్య రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఈ కథ చాలా బలంగా చెప్తుంది.

పైకి చాలా సాదా సీదాగా ఒక సంఘటనను, కొంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ నాటి వాతావరణాన్ని చిత్రించిన కథగా కనిపించినా ఈ కథ ఎంతో  రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక నేపథ్యాన్ని కడుపులో దాచుకున్న కథగా కనిపిస్తుంది. రెండు ప్రాంతాలను కలిపి కుట్టుతున్నప్పుడు జరిగే సంఘర్షణ, ఆధిపత్య పోరు ఎలా ఉంటాయో చాలా సరళంగా చెప్పడానికి ప్రయత్నించిన కథకుడి శిల్పం విస్మయం కలిగిస్తుంది. సురమౌళే ‘రచయిత’ అనే కథలో పేర్కొన్నట్లు “కథానికా సాహిత్యం ఉంది చూశారూ? ఇదే ముఖ్యంగా మనుషుల్లో మార్పు తెచ్చే సాహిత్యం. ఒక సమస్య మీద దానికి తగిన సంఘటనలూ, వాతావరణమూ, సృష్టించి దాని మంచి చెడ్డల్ని నిర్ణయిస్తుంది. తార్కికంగా మంచిని మంచీ, చెడును చెడూ అని ఏరి చూపిస్తూ  చెడు మీద ఏహ్య భావం, మంచి మీద ఆసక్తీ  కలిగించే శక్తి కథానికకున్నంత శక్తి మరే ఇతర సాహిత్య విభాగానికి లేదంటే అతిశయోక్తి కాదు…. నిజమైన కథల్ని ఎప్పుడూ రాయకూడదు. మనముంటున్న ప్రపంచాన్నిగాదు రచయిత చిత్రించాల్సింది. ఉండదల్చుకున్న ప్రపంచాన్ని చిత్రించాలి.” ఈ వాక్యాలకు సరైన నిదర్శనాలు సురమౌళి కథలు. ఈ కథ అందులో మణిపూస.

*

 

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు