రెంటాల జయపతాక!

–     కె.వి. రమణారెడ్డి, ప్రముఖ కవి – విమర్శకుడు

(మొదట అభ్యుదయ రచయితల సంఘంలో వినిపించి, ఆ తరువాత విప్లవ రచయితల సంఘంతో పెనవేసుకుపోయిన పేరు – కె.వి.ఆర్. అధ్యాపకుడిగానే కాక, మంచి కవిగా, అంతకు మించి విమర్శకుడిగా కె.వి. రమణారెడ్డి తెలుగు సాహితీ లోకానికి సుపరిచితులు. రెంటాల గోపాలకృష్ణకు ఆత్మీయులలో ఒకరూ, విజయవాడలో రెంటాల నివాసానికి పలుమార్లు వచ్చిన సన్నిహితుడూ ఆయన. రెంటాల గోపాలకృష్ణ కీర్తిశేషులైన తరువాత ఆయన తొలి అభ్యుదయ కావ్యం ‘సంఘర్షణ’ను రెంటాల స్మరణోత్సవ సంఘం పునర్ముద్రిస్తున్నప్పుడు, పుస్తకానికి ముందుమాటగా కె.వి.ఆర్. కలమెత్తిన జయపతాక ఇది).

‘‘నలభై అయిదేళ్ళ కింది మాట (1996 నవంబర్‌లో కె.వి.ఆర్. రాసేనాటికి). అప్పటికి ఏడెనిమిదేళ్ళుగా స్తంభించి వుండిన ‘అభ్యుదయ రచయితల సంఘా’నికి పునరుజ్జీవం కల్పిద్దామని సంకల్పించుకుని తుమ్మల వెంకట్రామయ్య వంటి వయోధికులూ, నా లాంటి యువకులూ పనిచేస్తూ వచ్చాం. ఆ క్రమంలో నేను బెజవాడకు (ఇప్పటి విజయవాడకు) వచ్చి, సహరచయితలను కూడగడుతున్నాను. బిసెంట్ రోడ్‌లోని మోడరన్ కెఫేలో రెంటాల గోపాలకృష్ణ తారసిల్లాడు. అప్పటికి అయిదేళ్ళ క్రితం తాను ‘సంఘర్షణ’ కావ్యం ప్రకటించి ఉన్నాడు. వచ్చిన సంగతి చెప్పాను. నవ్వి, రచయితలకు సంఘాలెందుకన్నాడు. నాకు ఆశ్చర్యం కలిగింది. తాను అభ్యుదయ కవియై వుండి కూడా ఈ ప్రశ్న ఎలా వెలువడిందనుకున్నాను. మరుమాట లేకుండా ఊరకుండిపోయాను.

ఇప్పుడు ఈ ఉదంతం ఎందుకు గుర్తు చేసుకుంటున్నానంటే సంఘర్షణలోని ప్రతి ఖండికా అభ్యుదయ సాహిత్య దృక్పథాన్ని ప్రకటిస్తున్నది. కాబట్టే, అ.ర.సం. రథసారథుల్లో ముఖ్యుడైన అనిసెట్టి సుబ్బారావుకు రెంటాల దీన్ని అంకితమిస్తూ, అనిసెట్టిని తన ‘‘సహపాఠి’’గా, ‘‘మిత్రుడు’’గా పేర్కొనబట్టి కూడా వాళ్ళిద్దరూ సమవయస్కులే కాకుండా, సహభావులు కూడా అనుకోవడంలో ఎలాంటి వింతా లేదనిపిస్తుంది కూడాను.

ఇరవయ్యేళ్ళ ప్రాయం నుంచీ రచనా వ్యాసంగం మొదలుపెట్టిన రెంటాల కాలికప్రభావం కొద్దీ త్వరలోనే అభ్యుదయ సాహిత్యోద్యమ ప్రభావానికి లోనైనట్లుంది. నరసరావుపేట స్కూల్లో నాయని సుబ్బారావు గురుత్వం తనను ‘భావ’ కవిత్వధోరణికి ఆకర్షించిన దాఖలాలు లేవు. 1939లోనే రచించిన చరిత్రాత్మక నవల ‘రాజ్యశ్రీ’లో కాల్పనికోద్యమ వాసనలేమైనా ఉన్నాయో లేదో తెలియదు గాని, బెల్లంకొండ రామదాసు, అనిసెట్టి సుబ్బారావుల సాంగత్యం వల్ల మరో పుంత తొక్కాడనుకోవచ్చు.

‘‘మంచి చెడ్డల మధ్య, సత్యాసత్యాల మధ్య నేడు జరుగుతున్న… సంఘర్షణ ఈ కావ్యానికి ఆత్మ!’’ అంటూ ‘ప్రస్తావన’లో పేర్కొన్నాడు స్వయంగా కవి. ‘‘వర్గపోరాటం’’ అని సంకుచితార్థం చెప్పే రాజకీయవేత్తలతో తన అనంగీకారాన్ని సూచించాడు. విశ్వమానవ శాంతి సాధనకై బుద్ధుడు, జీససు, గాంధీజీ సంఘర్షణ నడిపారన్నాడు. కావచ్చు గాని, ‘వర్గపోరాటం’ తన మనస్సు నుంచి వెలిబడి, నికిటా కృశ్చేవ్ లాంటి కుహనా కమ్యూనిస్టులు ప్రవచించిన ‘వర్గసామరస్య’ వైఖరిని చేబట్టలేదు, నయం! అలా జరిగే ఉంటే, ఈ కావ్యం తీరుతెన్నులు పూర్తిగా మరోలాగుండేవి.

అభ్యుదయ సాహిత్యానికి లోకం దృష్టిలో రూఢమైన సామగ్రిలో ఆకలిబాధలు, పేదసాదల ఆక్రందనలు, భగ్నజీవుల నిరాశా నిస్పృహలు మాత్రమే ఈ కావ్య ఖండికలలో ప్రత్యక్షం కావు. అభ్యుదయ సాహిత్యం అంతకంటే విస్తృతమైన పరిధి కలిగింది. మానవుడే మహనీయుడన్న దృక్పథం నుంచి చారిత్రక ఆశావాదం ఏర్పడుతుంది. బహిరంతర పరాధీనత నుంచి తప్పుకుని సర్వవిధాల స్వతంత్రమయ్యే సార్థకత్వం ఈ మానవతావాదానికి జీవగర్ర. ఈ విప్లవ మానవీయతా వైఖరి ప్రాణమూలంగా మార్క్సిజం మహితమైన సిద్ధాంతమూ, చైతన్యవంతమైన ఆచరణా కాగలిగింది. నికార్సయిన అభ్యుదయ సాహిత్యోద్యమానికి ఇదే ప్రాణమూలం. అభ్యుదయ సాహితీపరులందరికీ ఇది అలవడిందనడం నిజం కాదు. ‘‘ప్రపంచ విజయం’’ తన ఆకాంక్షగా, విశ్వశాంతి తన ఆదర్శంగా,

‘‘క్రమబద్ధంగా సమధర్మంగా

సంఘర్షణ సఫలంగా

భాగవిభాగం జరిగింది!

ధరిత్రి శాంతిని పొందింది’’

అని ‘సముద్ర మథనం’ గురించి భవిష్యద్దర్శనంతో కవి చరిత్ర పర్యవసానాన్ని ఊహించినప్పుడు ఈ మానవీయతా దృక్పథ స్పర్శే తగులుతుంది.

ప్రజాభిమాని కాని వాడెవడూ సిసలైన దేశాభిమాని కాలేడు. రెంటాలలో ఈ రెండూ పుష్కలంగా కనిపిస్తాయి. స్వగ్రామమైన రెంటాల గురించి రాశాడో, లేదో గాని, పుట్టిపెరిగిన పలనాడు ప్రాంతమూ, ‘‘జననాయకం సుఖదాయకం’’ అయిన ‘నవభారతం’, శాంతిసౌఖ్యాలతో విలసిల్లే మానవ ప్రపంచం – వీటిని కవి కీర్తించడం అసహజమేమీ కాదు.

‘‘నరుడొక్కడు దాస్యంలో

నవసినంతకాలం ఈ

లోకానికి ముక్తి లేదు!’’

‘ఉద్ఘాటన’ మాత్రమే అనిపించే ఈ కావ్యచరణాలలో ఒక మొత్తం తత్వం నిక్షిప్తమై ఉంది.

‘‘ఈ క్రతువే ఫలిస్తుంది

జయపతాక నిలుస్తుంది!’’

తథాస్తు!

–         విజయవాడ, 1 నవంబర్ 1996

Avatar

రెంటాల

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు