రీ బూట్: నైతిక సృష్టి కోసం మానవయంత్రం

కొందరికి కథ రాయడమంటే నల్లేరు మీద నడక. మరికొందరికి పురిటినొప్పులకు మించిన పెయిన్. ఇంకొందరికి ఆ ఆలోచనే పెద్ద యుద్ధం లాంటిది కావచ్చు. కానీ “సాదాసీదా వాక్యం రాసి కవిత్వమని బుకాయించకు” అన్నట్లు కథ రాయాలంటే సాదాసీదా అంశమో, మామూలు నిర్మాణమో సరిపోదు. జీవిత మూలాలను తవ్వి, కథాంగాలతో అద్భుత శిల్పంగా చెక్కాల్సిందే. కథ మనసుకు నిద్రపట్టకుండా చేయాలి. తటిల్లతలా మెరిసి వెంటాడి, వేటాడాలి. అందుకు కథకుడు కచ్చితమైన నిర్మాణ వ్యూహాలు పన్నాలి.

వస్తువే కథా నిర్మాణాన్ని నిర్ణయిస్తుందా? సమకాలీన సాహిత్య, సామాజిక వాతావరణం నుంచి కథా నిర్మాణం పుడుతుందా? కథకుడి భావనాలోకాలు ఆ పనిచేస్తాయా? అనే వాటి గురించి ఎవరి మాటలు వాళ్లకు వదిలేస్తే… కథ ఎప్పుడూ కొత్తకొత్త వస్తువులతో, సరికొత్త నిర్మాణాలను అన్వేషిస్తుంది. తనను తాను నిత్యం నవీనీకరించుకోవాలని తపిస్తుంది. కానీ కథా వస్తువులో వస్తున్న వేగవంతమైన మార్పులు, నిర్మాణంలో జరగడం లేదనే చెప్పాలి.

ఊహలు ఎప్పుడూ అందంగానే ఉండవు. అప్పుడప్పుడు భయంగా, బాధగా కూడా ఉంటాయి. దెయ్యాలు, భూతాలు, మంత్రనగరుల మాంత్రికులు కథల్లో మనకు కొత్తేం కాదు. వైజ్ఞానికంగా సమాజం అభివృద్ధి చెందే క్రమంలో, సాంకేతికత పురోగతిలో “కాదేదీ కథకు అనర్హం” అన్నట్లు సైన్స్ ఫిక్షన్ కథలూ వచ్చాయి. వస్తున్నాయి. వాస్తవ, ఊహా జనిత మిశ్రమాలైన ఈ కథలు రాస్తున్న వాళ్లు తక్కువే. సైన్స్ నేపథ్యాన్ని టెక్నిక్ రహస్యాలతో బంధించి, పాఠకుల మనసుపై గాఢమైన తడిముద్ర వేస్తున్న రచయిత అనిల్ ఎస్. రాయల్. కాలబిలం, టైం మిషన్, ఫాస్ట్ అండ్ ఫ్యూచర్స్ లోకి జర్నీ, గ్రహాంతర వాసులు… ఇలా వీరి కథలు సరికొత్త ప్రపంచాల్ని మనకు చూపిస్తాయి. వీరి “రీ బూట్” కథ టెక్నాలజీ నుంచి నైతికత వైపు ప్రయాణిస్తుంది. భవిష్యత్తు నుంచి గతం వైపుకు ఈ ప్రపంచాన్ని నైతికతతో మళ్లీ సృష్టించాలంటుంది. సర్వసాక్షి దృష్టికోణంతో ప్రతి సన్నివేశాన్ని గుండె యవనికపై హృద్యంగా దృశ్యీకరిస్తుంది.

కథ ఎలా అయినా మొదలు కావచ్చు. ఆసక్తి, ఉత్కంఠతో పాఠకులు కథలోకి అమాత్తం దూకేలా ఉండాలి. “మృత్యు ముఖంలోకి చూస్తున్న విక్రమాదిత్యకు మిగిలుంది ఆఖరి అరగంట మత్రమే” అని “రీ బూట్” కథ మొదలవుతుంది. విక్రమాదిత్య ఎవరు? చావుదగ్గరకు ఎందుకు వెళ్లాడు? ఎందుకోసం అరగంట మిగిలుంది?… అన్ని తెలియాలంటే నా కథార్ణవంలోకి దూకండి అంటాడు అనిల్. అలాగని దూకిన తర్వాత ప్రశాంతంగా ఉండనివ్వడు. భవిష్యత్తులోకి వెళ్లి “క్రీ.శ. 2372. సెప్టెంబరు1, సాయంత్రం నాలుగు పది” అని కథా కాలాన్ని నిర్ణయించేస్తాడు. మర్స్ వాసులు (అంగారక గ్రహం నుంచి వచ్చిన ఏలియన్స్)కు, మరమనుషులు (మానవులు తయారుచేసిన రోబోలు)కు జరుగుతున్న యుద్ధ బీభత్స వాతావరణాన్ని వర్ణిస్తాడు. న్యూక్లియర్ ఫిజిక్స్, రోబోటిక్స్ విభాగాల అధినేతగా, రక్షణశాఖ సలహాదారుగా విక్రమాదిత్యను పరిచయం చేస్తాడు. “అతనిన కొడుకు స్కూల్ నుంచి ఇంకా రాలేద”ని చిన్న మెలిక పెట్టి హ్యూమన్ టచ్ ఇస్తాడు. అతడి ప్రయోగానికి ఇంకా రెండు గంటలే ఉందని చెప్పి పాఠకులను కథ వెంట పరుగులు తీయిస్తాడు.

అయితే కథ రచనా కాలం (2013, మార్చ్) నుంచి క్రీ.శ.2372 వరకు జరిగిన చరిత్ర పరిణామాన్ని, మానవ మనుగడ ప్రమాదంలో పడడానికి గల కారణాలను క్లుప్తంగా, కథావసరం మేరకు చెప్తాడు రచయిత. మూడో ప్రపంచ యుద్ధం, భూమి లోపలి పొరల్లోని బంకర్లలో మనుషుల నివాసం, హ్యూమన్ రోబోట్ తయారీ… అన్నీ వివరించి కథలో లీనం చేస్తాడు. ఇక అంగారక గ్రహం నుంచి వచ్చిన మార్స్ కు, రోబోలకు జరిగే యుద్ధం, మానజాతి ప్రమాదంలో పడుతుందని భావించి విక్రమాదిత్య చేసే ప్రయోగాలను వర్ణించి మన దృష్టిని తిప్పుకోనివ్వకుండా చేస్తాడు.

ఈ కథలో కనిపించే ముఖ్యపాత్ర ఐజక్. విక్రమాదిత్య ఒకటిన్నర ఏళ్లు కష్టపడి తయారు చేసిన హ్యూమన్ రోబో. మనిషి మెదడును కంప్యూటర్ కు అనుసంధానించబడిన బయోట్. మోధోసంపత్తితో పాటు, నైతిక ప్రవర్తన కలిగిన శాస్త్రవేత్త బ్రెయిన్ కూడా. సైన్స్ సిద్ధాంతాలలో కాలాన్ని ప్రమాణంగా గుర్తించిన ఐజక్ న్యూటన్, రోబాట్స్ లేనికాలంలోనే వాటి గురించి కథలు రాసిన ఐజక్ అయిమోవ్ లకు గుర్తుగా ఆ పేరు పెట్టాడు కథకుడు. ఈ ఐజక్ కాలబిలం ద్వారా కాలయంత్రంలో ప్రయాణించగల టాలెంట్ కలది.

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కు ఈ కథకు లింకు ఉంది. అలాంటి వైరస్ తో మార్స్ ను జయించాలనుకుంటాడు విక్రమాదిత్య. అందుకోసం ఐజక్ ను వాడుకోవాలనుకుంటాడు. మరి అది ఎలా సాధ్యం? బయోవార్ తో గ్రహాంతర వాసులకైనా పుట్టగతులు లేకుండా చేయొచ్చా? అందుకోసం ఎలాంటి టెక్నాలజీ వాడాడు? మార్స్ ను జయించలేకపోవడానికి కారణాలేంటి? మనవజాతి మనుగడలో రోగనిరోధకశక్తి ప్రాధాన్యత ఎంత?… అన్నింటిని చాలా అద్భుతంగా చెప్పాడు కథకుడు.

ఇక కథలో విక్రమాధిత్యతో పాటు మనతోపాటు నడిచే మరోపాత్ర కేథరిన్. ఆమె రక్షణశాఖ బయొలాజికల్ రీసెర్చ్ సెంటర్ కు డైరక్టర్. మానవ జనాభా పునరుత్పత్తికోసం టీకా కనిపెడుతుంది. విక్రమాదిత్య చేస్తున్న ప్రాజెక్టుకు అవసరమైన వైరస్ ను తయారుచేస్తుంది. కథ మధ్యలో కేథరిన్ కూతురు కూడా స్కూల్ నుంచి రాలేదని రచయిత మరో ట్విస్ట్ ఇస్తాడు.

కథంతా ప్రయోగశాలలో జరిగే సన్నివేశాల మిశ్రమమే. ఇక్కడే కథకుడు చేసిన మాయ ఏంటంటే… అవసరమైన చోట కథను దృశ్యం చేశాడు. సంభాషణలతోనూ సూచించాడు. “దీర్ఘచతురస్రాకారంలో, విశాలమైన కారిడార్ లా ఉందా గది. దాదాపు ఖాళీగా ఉందదంతా. రెండు వైపులున్న గోడలకి పెద్దపెద్ద కంప్యూటర్ తెరలున్నాయి. వాటి ప్రకాశం ముందు పైకప్పుకున్న లైట్ల నుండి పడుతున్న మంద్రమైన వెలుగు వెలవెలబోతుంది. గదిలోకి అడుగుపెట్టిన వెంటనే కుడివైపు గోడకి ఎలివేటర్ తలుపులాంటిది అమర్చి ఉంది. ఎదురుగా, సుమారు వంద అడుగుల దూరంలో కనిపిస్తున్న మరో గోడ మధ్యలో స్లైడింగ్ డోర్ అమర్చి ఉంది.

“ప్రస్తుతం మనమున్న గది మిషన్ కంట్రోల్. ఆ స్లైడింగ్ డోర్ వెనకుంది గేట్ వే ఛాంబర్. ప్రయోగం జరిగేది అందులోనే. దాని కింద అణురియాక్టర్ల సముదాయం ఉంది. వాటన్నిట్నీ ఒకేసారి పనిచేయించడం ద్వారా జనింపజేసే అనంతమైన శక్తితో గేట్ వే ఛాంబర్ లో కాలబిలం సృష్టించేలా ఏర్పాట్లు చెయ్యబడ్డాయి. రియాక్టర్ల వద్దకు వెళ్లడానికి ఈ ఎలివేటర్ ఒక్కటే మార్గం” వివరించాడు విక్రమాదిత్య కేథరిన్ తో.

మనుషులతో పనిలేకుండా పూర్తిగా యాంత్రీకరించబడిన ఆ ప్రయోగం మరో పది నిమిషాల్లో ప్రారంభం కావాలి. కానీ కేథరిన్ స్వయంగా వైరస్ నింపిన గాజు సీసాలు 380 అలాగే ఉంటాయి. వాటిని అమితమైన శక్తిగా మార్చే కన్వర్టర్ నింపిన 20 సీసాలు మాత్రం కనపడవు. దాంతో ప్రశ్నలు పాఠకుల మెదళ్లపై కురుస్తాయి. మానవజాతిని కాపాడేది, గ్రహాంతర వాసులను పూర్తిగా నాశనం చేసిదైన ప్రయోగానికి అడ్డుపడింది ఎవరు? విక్రమాదిత్య కొడుకు ఆదిత్య, కేథరిన్ కూతురు ఇవాంజెలిన్ ఏమయ్యారు?

ప్రయోగానికి అడ్డుపడింది ఐజాక్ అని తెలిసి విక్రమాదిత్య దాన్ని నాశనం చేయబోయి, దానినచేతిలో చావుదెబ్బ తింటాడు. అలా “మృత్యువు ముఖంలోకి చూస్తున్నాడ”ని కథ ప్రారంభానికి, కథ మధ్యకు ఉన్న లింక్ ను కలిపేస్తాడు కథకుడు.

మనిషి తయారు చేసిన యంత్రం ఐజక్ ఎందుకు ఎదురు తిరిగిందో వివరిస్తూ రచయిత ఇచ్చే ముగింపు నేటి నవనాగరిక మానవాళిని తలదించుకునేలా చేస్తుంది. మనిషి అభివృద్ధిని ప్రశ్నిస్తుంది. విక్రమాదిత్య చేసిన ప్రయోగమే అనైతికమని తేల్చేస్తుంది. “ఆలోచించండి అనైతిక ప్రయోగం వల్ల మీకు వరిగిందేంటి? మహా అయితే మరికొన్ని శతాబ్దాలు మానవులు మనుగడ సాగిస్తారు. భూగృహ బంకర్లలో బందీలుగా బతుకులీడుస్తూ. భూమ్మీద మరమనుషులకు ఊడిగం చేస్తూ… ఆండ్రాయిడ్లకు ఆయుధాలు తయారు చేసి అందించే యంత్రాల్లా… జీవచ్ఛవాల్లా. ఏదోనాటికి వీళ్లందరూ చనిపోతారు. కానీ వీళ్లలో ఎవరూ జీవించరు. ఇదేనా మీరు కోరుకునేది?” అని విక్రమాదిత్యునితో పాటు మనల్నీ క్వశ్చన్ చేస్తుంది ఐజక్. కోల్పోతున్న మానవీయ, నైతిక విలువల ప్రాధాన్యత వివరిస్తుంది. అవి లేని చరిత్ర పురోగతి నిండా దాగుంది తిరోగమనమే అని నిర్ధారణ చేస్తుంది.

చివరకు కథకుడు మానవజాతిని “రీ బూట్” చెయ్యాలంటాడు. అందుకోసమే… విక్రమాదిత్య కొడుకను, కేథరిన్ కూతుర్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నానని ఐజక్ చెప్తుంది. దాంతో విక్రామదిత్య మనసులో ఉన్న చిక్కుముడికి, పాఠకుల మనసుల్లోని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. “కాలుష్యం కోరల్లేని కాలంలో, ఈర్ష్యా ద్వేషాలు లేని లోకంలో స్వేచ్ఛగా పెంచుతాన”ని నవనాగరికతను తయారుచేస్తానని ఐజక్ తో భరోసా ఇప్పిస్తాడు.

ఈ కథలో మరో గమ్మత్తైన విషయం పాత్రల పేర్లు. ప్రతీ పేరు వెనుక ఓ సారూప్యం, సార్ధకత ఉంది. విక్రమాదిత్య, కేథరిన్, ఐజక్, ఆదిత్య, ఇవాంజెలిన్. “ఆదిత్యలో ఆడమ్ ను, ఇవాంజెలిన్ లో ఈవ్ ను చూపించి మరోసృష్టికి శ్రీకారం చుట్టే విశ్వవిధాతలా” ఐజక్ ను వర్ణిస్తాడు అనిల్ ఎస్. రాయల్. కేథరిన్, విక్రమాదిత్య పేర్లకూ సాంస్కృతిక, చారిత్రక అర్థాలు, విశ్లేషణలు ఉన్నాయి. సందర్భానుసారంగా పాత్రల ప్రవేశం, నిష్క్రమణ, వైయక్తిక సామూహిక బాధ్యతల నిర్వహణ దృష్ష్యా కూడా విక్రమాదిత్య, కేథరిన్, ఐజాక్ ల గురించి ఆలోచించాలి. విక్రమాదిత్య, కేథరిన్ లు నైతికవిలువలు మరిచి వృత్తిబాధ్యతను స్వీకరించిన పాత్రలు. ఐజక్ వృత్తి బాధ్యతను కాదని నైతికతను మోసే ఉన్నతపాత్ర.

సైన్స్ ఫిక్షన్ కు సంబంధించిన రాయాలంటే వైజ్ఞానిక పరిజ్ఞానం, వర్తమాన సామాజిక పరిస్థితులపై అవగాహన, వాస్తవాన్ని కాల్పనీకరించే సృజనాత్మకత, కథా నిర్మాణంలో ఇమడ్చగల నేర్పు ఉండాలి. ఈ కథలో అనిల్ ఎస్. రాయల్ వీటితోపాటు మానవాళికి ఆర్ర్దమైన సందేశం ఇచ్చాడు. “రీ బూట్” లో మూడు ముఖ్యపాత్రలు, ప్రయోగశాలలో సన్నివేశాల కల్పన, అర్థవంతమైన కథాంతర్గత తర్కం, శాస్త్ర సాంకేతికాంశాల విశ్లేషణ… వీటన్నింటిని కథాంగాల మధ్య నేర్పుగా కూర్చిన వైనం ఆకట్టుకుటుంది.

     రీ బూట్

రచన: అనిల్ ఎస్. రాయల్

‘ఆంధ్రజ్యోతి’, 24 మార్చ్ 2013 & 31 మార్చ్ 2013
కథాసాహితి ‘కథ-2013’ సంకలనం


 

మృత్యువు ముఖంలోకి చూస్తున్న క్షణంలో మనిషికి జీవితమంతా కళ్లముందు కదలాడుతుందంటారు.

విక్రమాదిత్యకి మాత్రం ఆఖరి అరగంటే గుర్తుకొచ్చింది.

**********

క్రీ.శ. 2372, సెప్టెంబర్ 1. సాయంత్రం నాలుగూ పది.

కిటికీలోకి చూస్తున్నాడు విక్రమాదిత్య. బయట – కనుచూపుమేరంతా బూడిద వర్ణం. ఒకప్పుడదో మహానగరం. బహుళంతస్తుల భవనాలు, వాటిని కలుపుతూ రహదార్లు. పచ్చదనం పంచుతూ చెట్లు. వాటి కింద సేదదీరుతూ మనుషులు. ఇప్పుడో? శిధిల నగరం. సూర్యుడిని కమ్మేసిన ధూళి మేఘం. పగలూ రాత్రీ ఏకమైన సమయం. కమ్ముకున్న చిమ్మ చీకటి. దాన్ని చీలుస్తూ అప్పుడప్పుడూ లేజర్ మెరుపులు – మార్స్ వాసులకీ, మరమనుషులకి మధ్య పోరాటానికి గుర్తుగా.

విక్రమాదిత్య చూపులు బయటున్నా మనసు మాత్రం కొడుకు మీదుంది. ప్రయోగానికింకా రెండుగంటలే ఉంది. అన్నీ సరిగా ఉన్నాయోలేదో ఆఖరుసారి పరీక్షించాలి. వేరే విషయాలు ఆలోచించే సమయం లేదు. కొడుకు మీదనుండి బలవంతంగా మనసు మళ్లిస్తూ కిటికీ అద్దంలో కనిపిస్తున్న తన రూపాన్ని చూసుకున్నాడు. న్యూక్లియర్ ఫిజిక్స్ మరియు రోబోటిక్స్ జంటవిభాగాల అధినేతగా, రక్షణశాఖ కీలక సలహాదారుగా నిరంతరం ఎదుర్కొనే వత్తిడి నలభై ఐదేళ్లకే తెచ్చిపెట్టిన వార్ధక్యం వెక్కిరిస్తూ కనపడింది. ఎర్రబారిన కళ్లు రెండ్రోజులుగా కరువైన నిద్రని గుర్తుచేస్తున్నాయి. తన ముఖంలో గాంభీర్యం తననే భయపెడుతుండగా రిమోట్ అందుకుని ఆఫ్ బటన్ నొక్కాడు. మరుక్షణం కిటికీలోంచి అతని ప్రతిబింబం, దాని వెనకున్న అధివాస్తవిక దృశ్యం మాయమైపోయాయి. అప్పటిదాకా కిటికీలా భ్రమింపజేసిన త్రీడీ టెలివిజన్ తెర వెల్లవేసిన తెల్లగోడలా మారిపోయింది.

“బాస్”

వెనుకనుండి వినబడ్డ యాంత్రికమైన పిలుపుకి ఉలికిపడి తలతిప్పి చూశాడు. ఐజక్ నిలబడున్నాడక్కడ.

**********

మనిషి పుట్టుక మీద లెక్కకు మిక్కిలి వాదాలు. కోతినుండి మనిషొచ్చాడనే వాళ్లు కొందరు. వేరేదో గ్రహం నుండి వలసొచ్చాడనే వాళ్లింకొందరు. అదనంగా, పురాణాలు ప్రవచించే ఆదిమానవుడి గాథలు. ఆవిర్భావంపై వివాదాలెలా ఉన్నా, మనిషి ఎలా అంతరిస్తాడనే విషయంలో మాత్రం ప్రస్తుతం ఎవరికీ అనుమానాల్లేవు.

మొదట్లో అవసరాల్లోంచి యుద్ధాలు పుట్టేవి. తర్వాత యుద్ధాల కోసం అవసరాలు పుట్టుకొచ్చాయి. క్రమంగా యుద్ధమే ఓ అవసరంగా మారింది. అది కల్పించే విస్తారమైన వాణిజ్యావకాశాల కోసం ఇరవై మూడో శతాబ్దం రెండో అర్ధభాగంలో మూడో ప్రపంచ యుద్ధం మొదలయింది. విచ్చలవిడి అణువిస్ఫోటాలకి భూమండలం భస్మీపటలమయింది. ఎక్కడికక్కడ పుట్టగొడుగుల్లా పైకెగసిన అణుధూళి మేఘాలు సూర్యుడిని కమ్ముకుని ప్రపంచాన్ని అంధకారంలో ముంచేశాయి. సూర్యరశ్మి సోకక చెట్లు, అడవులు నశించిపోయాయి. వాటిమీద ఆధారపడ్డ జీవరాశి అంతరించిపోయింది. ఓజోన్ పొర ఆవిరైపోయింది. రేడియేషన్ వల్ల అపరిమితంగా వేడెక్కిన ఉపరితలం ఆవాసయోగ్యం కాకుండాపోయింది. అణుయుద్ధాన్ని తట్టుకోటానికి ముందస్తు సన్నాహాలు చేసుకున్న దేశాలు మాత్రం కొద్ది శాతం మనుషుల్ని, కొన్ని జాతుల జంతువుల్ని భూగర్భ బంకర్లలోకి తరలించి కాపాడుకున్నాయి.

అప్పట్నుండీ మనుషులు పాతాళంలోనే బతుకుతున్నారు. పైన యుద్ధం కొనసాగుతూనే ఉంది. నూట ఎనభై ఏళ్ల సుదీర్ఘ సమరంలో ప్రపంచపటం పూర్తిగా మారిపోయింది. పాత దేశాలెన్నో కనుమరుగయ్యాయి. పాతిక దేశాలు, అవి కట్టిన రెండు కూటములు మిగిలాయి. వాటి తరపున మరసైనికులు భూమ్మీద  మొహరించి పోరాడుకుంటుండగా …. ఐదేళ్ల కిందటొచ్చిపడిందో ఊహించని ఉపద్రవం. దానివల్ల యుద్ధమైతే ఆగలేదు. కానీ యుద్ధ లక్షణాలు మారాయి. లక్ష్యమూ మారింది.

అది క్రీ.శ. 2367. అరుణగ్రహం నుండి మొదటి బెటాలియన్ భూమ్మీద పాదం మోపిన ఏడాది. ఒకరినొకరు సంహరించుకునే పనిలో మునిగి ఆదమరిచిన మానవుల మీద ఆకస్మాత్తుగా విరుచుకుపడ్డాయి మార్స్ సైన్యాలు. అంగారకుడిమీద బుద్ధిజీవుల ఆనవాళ్లే లేవని అపార్చునిటీ మొదలు ఇరవై పైగా రోవర్లు పంపిన సమాచారమంతా తప్పులతడకని అర్ధమయేసరికే ఆలస్యమైపోయింది. వెలుపలి నుండి వచ్చిపడ్డ ప్రమాదాన్ని కాచుకోటానికి తప్పనిసరి పరిస్థితుల్లో తమ గొడవలు పక్కనబెట్టి ఏకమయ్యారు మనుషులు.

మొదట్లో అరుణగ్రహ దళాలను మనుషుల మరసైన్యాలు సమర్ధంగానే నిలువరించినా, తామరతంపరగా వచ్చిపడుతున్న మార్స్ సైన్యాలని, వాటి ఆధునాతన ఆయుధ సంపత్తిని ఎదుర్కోవటం మరమనుషులకి కష్టమైపోయింది. ఇక రేపో మాపో మనుషులు చేతులెత్తేయటం ఖాయమనుకుంటుండగా ప్రకృతి అనుకోని రీతిలో ఆదుకుంది. మానవజాతిని తుడిచిపెట్టేసే లక్ష్యంతో దాడి చేసిన మార్షియన్లు భూమ్మీది సూక్ష్మక్రిముల ధాటికి చావుదెబ్బతిన్నారు. యుగాలుగా భూగ్రహమ్మీద స్థిరనివాసం ఉండటం ద్వారా మానవజాతి సముపార్జించుకున్న రోగనిరోధక శక్తి తమకి లేక – మొదట్లో ముందంజ వేసిన మార్స్ దళాలు ఏడాది గడిచేసరికి వింత జబ్బులకి గురై రాలిపోయాయి. అప్పట్నుండీ వాళ్ల దాడులు మందగించాయి. నాలుగేళ్లుగా చెదురుమదురు దాడులు తప్ప మొత్తమ్మీద ప్రశాంతత. అది రాబోయే పెనుతుపానుకి సూచనగా రక్షణశాఖ అంచనా. విరామకాలంలో వాళ్లు భూమ్మీది బాక్టీరియా భూతానికి విరుగుడు మంత్రం కనిపెట్టే ప్రయత్నాల్లో ఉన్నారని ఇంటలిజెన్స్ నివేదికలు. ఆ ప్రయత్నాలు ఫలవంతమయ్యే దశలో ఉన్నాయని మెల్లిగా పెరుగుతున్న దాడుల సంఖ్య చెబుతోంది. పూర్తి స్థాయి యుద్ధం మొదలవటానికి ఇంకెన్నాళ్లో పట్టకపోవచ్చు. ఈసారి ఓడితే మనుషుల ఉనికే భూమ్మీద మిగలకపోవచ్చు. అది జరగకుండా ఆపగలిగే శక్తి ఒక్కడికే ఉంది.

ఆ ఒక్కడే ఐజక్.

**********

“బాస్”

ఐజక్ మళ్లీ పిలవటంతో మరోసారి ఆలోచనల్లోనుండి బయటపడ్డాడు విక్రమాదిత్య. ఏమిటన్నట్లు చూశాడు.

“డాక్టర్ కేథరిన్ వచ్చారు”, అభావంగా చెప్పాడు ఐజక్.

ఆ ప్రకటన పూర్తయ్యేలోపే వినపడింది కేథరిన్ గొంతు, “హలో విక్రమ్”.

డాక్టర్ కేథరిన్ – ముప్పై ఆరేళ్ల వయసుకే సింథటిక్ బయాలజీ రంగంలో అనితరసాధ్యమైన ఆవిష్కరణలు చేసిన మేధావి. మూడోప్రపంచ యుద్ధం కారణంగా తొంభై శాతం హరించుకుపోయిన మానవ జనాభాని తిరిగి పెంపొందించే ప్రయత్నాల్లో భాగంగా ఆమె సృష్టించిన ఔషధం –  మనుషుల్లో పునరుత్పత్తి లోపాలు అరికట్టే టీకా మందు. దాన్ని కనిపెట్టిన ఘనత ఆమెని రక్షణశాఖ బయొలాజికల్ పరిశోధనా విభాగానికి డైరెక్టర్‌గా ఎంపికైన అతి పిన్నవయస్కురాలిని చేసింది. విక్రమాదిత్యకి ఆమెతో వృత్తిగతంగానే తప్ప వ్యక్తిగతంగా పెద్ద పరిచయం లేదు. ఒకట్రెండుసార్లు ఏవో కాన్ఫరెన్సుల్లో కలిశాడామెని. చూడగానే ఆకట్టుకునే రూపం. సదా కుతూహలంతో మెరిసే కళ్లు. పెద్ద బాధ్యత తెచ్చిపెట్టిన వయసుకి మించిన హుందాతనం.

ఇప్పుడూ ఆమెలో అదే హుందాతనం. కానీ ఆ కళ్లలో మెరుపుల్లేవు. అదెందుకో  తెలుసతనికి.

“భయపడకండి. ఇద్దరూ క్షేమంగా తిరిగొస్తారు”, అనునయంగా చెప్పాడు.

కేథరిన్ కూతురు ఏడేళ్ల ఇవాంజెలిన్, విక్రమాదిత్య కొడుకు ఐదేళ్ల మానవ్ ఆ మధ్యాహ్నం నుండీ కనబడటం లేదు. ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుకుంటూన్నారు. మధ్యాహ్న విరామ సమయంలో ఆటస్థలంలో ఆఖరిసారిగా కనపడ్డారు. ఆ తర్వాత వాళ్ల జాడ లేదు. భద్రతా విభాగం అప్పట్నుండీ ఎడతెరిపిలేకుండా గాలిస్తూనే ఉంది.

“నాకా నమ్మకం పోతోంది”, కేథరిన్ నిట్టూర్చింది. “సెక్యూరిటీ వాళ్లు ఒప్పుకోకపోయినా, నాకిది మార్షియన్స్ పనే అనిపిస్తుంది”.

తల పంకించాడు విక్రమాదిత్య. “అది నిజమైతే ఇదే మొదటిసారవుతుంది మార్షియన్స్ మూడో స్థాయిలోకి చొరబడి అపహరించటం. అందునా ఇలా చిన్నపిల్లల్ని ఎత్తుకుపోవటం ….”

భూగృహ బంకర్లు నాలుగు స్థాయిల్లో నిర్మించబడ్డాయి. మొదటి స్థాయి ఉపరితలానికి దగ్గరగా ఉంటుంది. అందులో భూవాతావరణం నుండి గ్రహించిన ఆక్సిజన్‌ని, పాతాళంనుండి తోడిన నీటిని వివిధ అవసరాలకి సరఫరా చేసే యంత్రాంగం ఉంటుంది. తిండి గింజలు పండించే క్షేత్రాలు, పారిశ్రామిక వ్యర్థాలు, వివిధ విసర్జనాలు శుద్ధి చేసే ఏర్పాట్లు కూడా అక్కడే ఉంటాయి. రెండో స్థాయి ప్రధానంగా మిలటరీ అవసరాల కోసం ఉద్దేశించింది. భూమ్మీద పోరాడుతున్న మరమనుషులని, వాటికి అవసరమైన ఆయుధాలని, ఇతర యుద్ధ పరికరాలని ఉత్పత్తి చేసే కర్మాగారాలు అక్కడుంటాయి. మనుషులకి అవసరమైన సరుకులు, సామగ్రి తయారు చేసే పరిశ్రమలూ అక్కడే ఉంటాయి. వీటికింద మూడో స్థాయి ఉంటుంది. ఉపరితలం నుండి ఇది మూడొందల అడుగుల కింద ఉంటుంది. మనుషులు నివాసముండే కాలనీలు, విద్యాలయాలు, ఆసుపత్రులు, షాపింగ్ సముదాయాలు వగైరా ఇక్కడుంటాయి. నాలుగో స్థాయి అన్నిటికన్నా దిగువన, ఉపరితలం ఉండి ఐదొందల అడుగుల్లోతున ఉంటుంది. రక్షణశాఖకి చెందిన రహస్య ప్రయోగాలు జరిగే కీలకమైన ప్రయోగశాలలు ఇక్కడుంటాయి. ఇందులోకి అతికొద్దిమందికి మాత్రమే ప్రవేశం ఉంటుంది.

రెండేళ్లుగా అడపాదడపా జరుపుతున్న దాడుల్లో అంగారకవాసులు డజన్లకొద్దీ మనుషుల్ని అపహరించటం జరిగింది. అయితే వాళ్లెప్పుడూ మొదటి స్థాయి బంకర్లని దాటి కిందకి రాలేకపోయారు.  ఇప్పటిదాకా అపహరించబడిన వాళ్లందరూ మొదటిస్థాయిలో పనిచేసే సెక్యూరిటీ గార్డ్స్ లేదా అక్కడి వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసే యువతీ యువకులే.

“…. కానీ నాకెందుకో ఇది వాళ్ల పని కాదనిపిస్తుంది”, కొద్ది క్షణాల విరామం తర్వాత తిరిగి తనే చెప్పాడు విక్రమాదిత్య.

“ఎందుకని?”

“వాళ్లు మనుషుల్ని అపహరిస్తుంది – మన రోగనిరోధక వ్యవస్థ ఎలా పనిచేస్తుందో కనిపెట్టటానికి. అందుకోసం అంతకష్టపడి మూడోస్థాయిలోకి చొరబడి ఇద్దరు పిల్లల్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం లేదు. అంతమంది ఉన్న స్కూల్లోంచి మన పిల్లలు మాత్రమే మాయమవటం, అదీ ఇంత ముఖ్యమైన ప్రయోగానికి కొద్దిగంటల ముందు జరగటం …. ఈ రెంటికీ ఏదో సంబంధమున్నట్లుంది”

కేథరిన్ అయోమయంగా చూసింది. “ఏం ప్రయోగం?”

“క్షమించండి. మీకిందాకా చెప్పలేదు కదూ. ఇదో క్లాసిఫైడ్ ప్రాజెక్టు. అందువల్లే ఇందులో పాల్గొనేవారికి సైతం అవసరాన్ని మించి తెలీకుండా వివరాలు దాచాల్సి వచ్చింది. ప్రయోగ సమయం ఆసన్నమయింది కాబట్టి ఇప్పుడు మీకు తెలిసినా ఫరవాలేదు. ఇంకొన్ని గంటల్లో మిగతా ప్రపంచానికి ఎటూ తెలిసిపోతుంది”

“ఇంతకీ ఆ ప్రయోగం ఏంటో చెప్పనే లేదు”

“ఒక్క నిమిషం” అంటూ ఐజక్‌ వైపు తిరిగాడు విక్రమాదిత్య. “ఐజక్. వెళ్లి రియాక్టర్లు తనిఖీ చెయ్యి”

ఐజక్ ఆ గదిలోనుండి వెళ్లిపోయేదాకా అటే చూసి కేథరిన్‌కి చెప్పసాగాడు.

“ఏడాదిన్నర క్రితం ఊపిరి పోసుకుందీ ప్రాజెక్టు. దీని లక్ష్యం మార్షియన్ల పీడ శాశ్వతంగా వదల్చటం. వర్తమానంలో అది సాధ్యమయ్యే పని కాదు – వాళ్లతో సరితూగే సాయుధ సంపత్తి మనవద్ద లేదు కాబట్టి. భవిష్యత్‌లో వాళ్లతో సరితూగితే తూగొచ్చు, కానీ ఆ లోపే వాళ్లు రోగనిరోధకశక్తి పెంచుకున్నారంటే మన పని ఖతం. ప్రస్తుతం వాళ్లని నిలువరించటానికి మనకున్న ఒకే అస్త్రం: బయొలాజికల్ వార్‌ఫేర్. మార్స్ వాతావరణంలోకి ప్రాణాంతక వ్యాధికారక క్రిములని ప్రవేశ పెట్టగలిగితే చాలు, మనం గెలిచేసినట్టే. కానీ మార్స్ చుట్టూ ఉన్న రక్షణ ఛత్రం చాలా పటిష్ఠమైనది. ఆ వాతావరణంలోకి ప్రవేశించటానికి మూడు డిఫ్లెక్టివ్ షీల్డ్స్ దాటుకుని వెళ్లాల్సుంటుంది. ఇప్పటిదాకా మన వ్యోమనౌకలు మొదటి షీల్డ్‌ని కూడా ఛేదించలేకపోయాయి. కాబట్టి ఈ దారిలో వాళ్ల మీద దాడి చెయ్యటం అసాధ్యం. ఈ పరిస్థితుల్లో మానవజాతి బతికి బయటపడాలంటే ఏదన్నా అద్భుతం జరగాలి. అదే జరిగింది ఏడాదిన్నర కిందట”, గుక్క తిప్పుకోకుండా చెప్పి ఊపిరి పీల్చుకోటానికి ఆగాడు.

“ఏమిటా అద్భుతం?”, కేథరిన్ స్వరంలో ఉత్కంఠ.

“కాలబిలం సృష్టించటం ఎలాగో నేను కనుకొన్నాను”

“కాలబిలం …. అంటే టైమ్‌ట్రావెల్ సాధ్యం చేసే వర్మ్‌హోల్!?!”

“అవును. ఈ ఏడాదిన్నరలో ఆ ప్రక్రియకి సానపెట్టి కాలంలో సరిగా ఎప్పటికెళ్లాలో, ఎక్కడికెళ్లాలో అప్పటికే, అక్కడికే వెళ్లగలిగేలా కాలబిలం తెరిచే విధానం రూపొందించాను. అయితే, ఒక్కసారి కాలబిలం తెరవటానికి అవసరమైన శక్తి క్షేత్రం సృష్టించాలంటే భూమ్మీద మిగిలున్న ప్లుటోనియం నిల్వలు మొత్తం వాడేయాల్సుంటుంది. అంటే .. ఒకే ఒక్కసారి కాలబిలం తెరవగలిగే అవకాశముంది. అది చాలు చరిత్ర తిరగరాయడానికి”

కేథరిన్ వింటుందని రూఢి చేసుకుని చెప్పటం కొనసాగించాడు.

“సంవత్సరం క్రితం రక్షణశాఖ మీకో ప్రత్యేక బాధ్యత అప్పగించింది. వందలేళ్ల క్రితం నశించిపోయిన మశూచి, కలరా, బ్యుబోనిక్ ప్లేగు లాంటి మహమ్మారుల్ని కలిగించే వైరస్‌లు తిరిగి సృష్టించి వాటిని వేలరెట్లు హానికరంగా మార్చటం ఆ ప్రాజెక్టు లక్ష్యం”

కేథరిన్ కళ్లు పెద్దవయ్యాయి. “ఆ ప్రాజెక్టు వివరాలు అత్యంత గోప్యం. మీకెలా తెలిశాయి?” అంటూ అతని మాటలడ్డుకుంది.

“దాని రూపకర్త నేనే కాబట్టి”, విక్రమాదిత్య ఆమె ప్రశ్నకి బదులిచ్చి తిరిగి చెప్పసాగాడు. “సమయానికి మీరు అవన్నీ అందించగలిగారు కాబట్టే మేం అనుకున్న ప్రకారం ఈ సాయంత్రం ప్రయోగం జరపగలుగుతున్నాం. అదేంటో మీకు ఇప్పటికే అర్ధమైపోయుండాలి”

“అంగారకుడికి ఆధునాతన డిఫెన్స్ వ్యవస్థ లేని కాలానికి టైమ్‌ట్రావెలర్ ఎవరినన్నా పంపి ఈ వైరస్‌లు అక్కడ వెదజల్లుతారన్న మాట!”

విక్రమాదిత్య తలూపాడు.

“వండర్‌ఫుల్ ఐడియా. ఎవరా టైమ్‌ట్రావెలర్?”, ఆసక్తిగా అడిగిందామె.

“ఇందాక మీకు ఆహ్వానం పలికాడే .. ఐజక్”

“ఐజక్ .. ఆండ్రాయిడ్‌లా ఉన్నాడు?”

“ఆండ్రాయిడ్ కాదు. బయాట్”

“బయ్ వాట్?”

“బయాట్ .. అంటే బయో రోబాట్. మనుషుల్లా అగుపడే మరమనుషులు ఆండ్రాయిడ్సైతే, వాటిలో మనిషిలా ఆలోచించగలిగేవి బయాట్స్. ఐజక్  ప్రపంచంలో మొట్టమొదటి బయాట్. మానవ మేధస్సుకి కంప్యూటర్ కచ్చితత్వం, వేగం జతపడితే అది ఐజక్. మనిషి మెదడుని కంప్యూటర్‌కి అనుసంధానించటం ద్వారా అది సాధ్యపడింది”

“అంటే …. ?”

“యస్. మీ అనుమానం నిజమే. ఐజక్‌ని నడిపించే సెంట్రల్ ప్రాసెసర్ ఈమధ్యనే మరణించిన ఓ మేధోసంపన్నుడైన శాస్త్రవేత్త మెదడు”

“మనిషిలా ఆలోచించే రోబట్ .. ఇంటరెస్టింగ్. కానీ, నాకెందుకో ఇది చాలా ప్రమాదకరమైన ఫీచర్ అనిపిస్తోంది”

“ఏం?”

“మనుషుల వక్రబుద్ధులు దానికీ రావచ్చు. అప్పుడది ప్రమాదకరంగా మారొచ్చు. మన మాట వినకుండాపోవచ్చు. తిరుగుబాటు చేయొచ్చు”

నవ్వాడు విక్రమాదిత్య. “సదరు శాస్త్రవేత్త కేవలం మేధోసంపన్నుడే కాదు. అమిత నైతికవర్తనుడు కూడా. ఆ మెదడులో వక్రబుద్ధులు పుట్టే అవకాశమే లేదు. అదనంగా, రోబోటిక్స్ నియమాల రక్షణ ఉండనే ఉంది”

“అవేంటి?”

“ఈ కాలంలో అవి తెలీని వ్యక్తులుంటారా?”, ఆశ్చర్యపోయాడు విక్రమాదిత్య.

“బయాలజీ తప్పితే మిగతా రంగాల్లో నాకు పెద్దగా ఆసక్తి, ప్రవేశం లేవు”, ఇబ్బందిగా నవ్వింది కేథరిన్.

“ఐతే సింపుల్‌గా చెబుతాను వినండి” అంటూ మొదలు పెట్టాడు విక్రమాదిత్య. “రోబాట్స్ అన్నింటి ఫర్మ్‌వేర్ లోపలా కొన్ని నియంత్రణలు నిక్షిప్తం చేయబడి ఉంటాయి. వీటిని రోబాట్స్‌కి సంబంధించిన కోడ్ ఆఫ్ కాండక్ట్ అనుకోవచ్చు. వాటిని మార్చటానికి, లేదా అతిక్రమించటానికి ప్రయత్నించిన రోబాట్ దానంతటదే షట్‌డౌన్ ఐపోయేలా ఏర్పాట్లుంటాయి. ఐజక్‌కి విషయానికొస్తే, అతనికి విధించబడ్డ నియమం: ఐజక్ ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా మానవాళికి హాని చెయ్యరాదు. ఐజక్ నిర్ణయాలన్నీ అంతిమంగా ఈ నియమానికి లోబడే ఉంటాయి. కాబట్టి అతను తిరుగుబాటు చేస్తాడనే భయమేం పెట్టుకోకండి”

“మీరెంత చెప్పినా, ఇంత కీలకమైన కార్యం ఓ రోబాట్‌కి పురమాయించటం నాకెందుకో సరికాదనిపిస్తోంది. మనుషుల్ని పంపొచ్చు కదా”, కేథరిన్ స్వరంలో ఇంకా తొలగని సంశయం.

“ఈ కాలబిలానికో పరిమితుంది. దీనిద్వారా గతంలోకి వెళ్లిన మనిషి వెనక్కిరాలేడిక. ఎవరన్నా త్యాగానికి సిద్ధపడివెళ్లినా మరో ప్రమాదముంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఇంత శక్తివంతమైన వైరస్‌లన్నీ బయటికొదలటం పూర్తయేదాకా ఆ ప్రయోగించిన వ్యక్తి వాటి బారినపడకుండా బతికుండటం కల్ల. మరమనుషులనైతే కంప్యూటర్ వైరస్‌లే తప్ప ఈ వైరస్‌లు ఏమీ చెయ్యలేవు. దానికి ఋజువుగా సిములేషన్ పరీక్షల్లో ఐజక్ నూటికి నూరుశాతం ఉత్తీర్ణత సాధించాడు. అందుకే అతన్ని పంపటం. అతనివల్ల మరో ప్రయోజనమూ ఉంది”

ఏమిటన్నట్లు చూసిందామె.

“మార్స్ వాతావరణాన్ని మనం విషపూరితం చేసినా అక్కడక్కడా కొందరు అంగారకజీవులు మిగిలుండొచ్చు. వాళ్లని వెంటాడి వేటాడటానికి ఐజక్‌కి ప్రత్యేకంగా శిక్షణివ్వటం జరిగింది. అతని వీపుమీద అమర్చిన బూస్టర్ల ద్వారా గాల్లో ఎగరగలడు. వాటి సహాయంతో అంగారకగ్రహం మొత్తం వెదికి మరీ మార్షియన్ ఆవాసప్రాంతాలపై దాడి చెయ్యగలడు. దానికి చాలా సంవత్సరాలు పట్టొచ్చు. అన్నాళ్లూ అతనికి తిండీ తిప్పలతో పనిలేదు. కావలసిందల్లా శక్తివంతమైన బ్యాటరీ. అతని బ్యాటరీ కొన్ని వందలేళ్లు పనిచేస్తుంది”

“ఇవన్నీ జరిగేలోపే మార్షియన్లు ఐజక్‌ని అంతం చేస్తే?”

“అసాధ్యం. ఆ ప్రమాదం లేకుండా ఉండాలనే ఐజక్‌ని అత్యంత పురాతన కాలంలోకి పంపుతున్నాం. అంగారకజీవులింకా ఆదిమ జాతులుగానే ఉన్న కాలమది. బాణాల్లాంటివి వాడటం కూడా తెలీని కాలం. మహా ఐతే రాళ్లూ రప్పలతో దాడి చెయ్యగలరు. వాటిని నిలువరించే డిఫ్లెక్టివ్ షీల్డ్ ఐజక్ దగ్గరుంది. అతని సమీపంలోకి ఎటువంటి వస్తువూ రాకుండా అది ఆపుతుంది”

“ప్లాన్ పకడ్బందీగానే ఉంది. మరో ప్రశ్న”

“చెప్పండి”

“మరమనుషులకి ఆర్-1, టి-2 లాంటి పేర్లే చూశానిప్పటిదాకా. మీరు ఐజక్ అనెందుకు పెట్టారు?”

“ఇద్దరు గొప్పవాళ్ల పేర్లు స్ఫురించాలని. సైంటిఫిక్ సిద్ధాంతాల్లో కాలాన్ని పరిగణనలోకి తీసుకున్న మొదటి వ్యక్తి ఐజక్ న్యూటన్. రోబాట్స్‌ అనేవి లేకముందే వాటిని ఊహించి విస్తారంగా కథలు రాసినవాడు ఐజక్ అసిమోవ్. తొలిసారిగా కాలయానం చెయ్యబోతున్న మరమనిషికి అంతకన్నా గొప్ప పేరేముంటుంది?”, విశదీకరిస్తూ ఓ మూలనున్న ద్వారం వైపు నడిచాడు విక్రమాదిత్య. కేథరిన్ అనుసరించింది.

ఆ ద్వారానికో ధృఢమైన తలుపు కాపలా కాస్తూంది. దాని మధ్యలో ఉన్న స్కానర్‌మీద విక్రమాదిత్య బొటనవేలితో ఒత్తగానే చిన్న శబ్దంతో తెరుచుకుందది. ఇద్దరూ అవతలున్న గదిలో అడుగు పెట్టారు. వెంటనే తలుపు మూసుకుంది.

దీర్ఘచతురస్రాకారంలో, విశాలమైన కారిడార్‌లా ఉందా గది. దాదాపు ఖాళీగా ఉందంతా. రెండు వైపులున్న గోడలకి పెద్ద పెద్ద కంప్యూటర్ తెరలున్నాయి. వాటి ప్రకాశం ముందు పైకప్పుకున్న లైట్లనుండి పడుతున్న మంద్రమైన వెలుగు వెలవెలబోతోంది. గదిలోకి అడుగుపెట్టిన వెంటనే కుడివైపు గోడకి ఎలివేటర్ తలుపులాంటిది అమర్చి ఉంది. ఎదురుగా, సుమారు వంద అడుగుల దూరంలో కనిపిస్తున్న మరో గోడ  మధ్యలో స్లైడింగ్ డోర్ అమర్చబడుంది.

“ప్రస్తుతం మనమున్న గది మిషన్ కంట్రోల్ సెంటర్. ఆ స్లైడింగ్‌డోర్ వెనకుంది గేట్‌వే ఛాంబర్. ప్రయోగం జరిగేది అందులోనే. దాని కింద అణు రియాక్టర్‌ల సముదాయం ఉంది. వాటన్నిట్నీ ఒకేసారి పనిచేయించటంద్వారా జనింపజేసే అనంతమైన శక్తితో గేట్‌వే ఛాంబర్‌లో కాలబిలం సృష్టించేలా ఏర్పాట్లు చెయ్యబడ్డాయి. రియాక్టర్ల వద్దకి వెళ్లటానికి ఈ ఎలివేటర్ ఒకటే మార్గం”, వివరించాడు విక్రమాదిత్య.

“ఇదా మిషన్ కంట్రోల్ సెంటర్? ఇక్కడెవరూ లేరే!”, విస్తుపోయింది కేథరిన్.

“అవసరం లేదు. ఈ ప్రయోగం పూర్తిగా యాంత్రీకరించబడింది. మనుషులతో పనిలేదు. కొన్ని వందలసార్లు సిములేషన్ పరీక్షలు జరిపి నిర్ధారించుకున్నాకే దీనికి అనుమతి ఇవ్వటం జరిగింది”, ఆమె సందేహనివృత్తి చేస్తూ స్లైడింగ్ డోర్ ఉన్న గోడదగ్గరకి నడిచి అక్కడున్న స్కానర్‌మీద  వేలిముద్ర వేస్తున్నట్లు బొటనవేలితో ఒత్తాడు. రెండు క్షణాల తర్వాత గోడలో కలిసిపోయినట్లున్న సొరుగొకటి తెరుచుకుంది. అందులోంచి పెద్ద ట్రాలీలాంటిదాన్ని బయటికి లాగాడు. దాని పై భాగంలో వందలాది గాజు సీసాలు పొందికగా పేర్చబడి ఉన్నాయి. రబ్బరు మూతతో బిగించి అతి జాగ్రత్తగా సీల్ చెయ్యబడి ఉన్నాయవన్నీ.

“కౌంట్‌డౌన్‌కి పదినిమిషాలే ఉంది. ఈ లోగా ఓసారి ఇవన్నీ సరిగా ఉన్నాయోలేదో చూసిచెబుతారా? అందుకోసమే మిమ్మల్నిక్కడికి పిలిపించటం జరిగింది” అంటూ పక్కకి జరిగాడు.

కేథరిన్ ట్రాలీ మీదికొంగి సీసాలని, వాటిలోని ద్రావకాలని పరిశీలనగా చూడసాగింది. కాసేపయ్యాక ఏదో అనుమానమొచ్చినట్లు ఒక్కో సీసా లెక్కించటం మొదలుపెట్టింది.

“వారం క్రితం నేను స్వయంగా సీల్ చేశాను వీటిని. మొత్తం నాలుగొందల సీసాలు. వాటిలో వాక్సీన్ నింపినవి మూడొందల ఎనభై ఉండాలి. ఆ లెక్క సరిపోయింది. కన్వర్టర్ సీసాలు ఇరవై ఉండాలి ….”, లెక్కించటం పూర్తయ్యాక విక్రమాదిత్య వైపు తిరిగి చెప్పింది, “…. ఒక్కటి కూడా లేదు”

“వాట్!!” నివ్వెరపోయాడు విక్రమాదిత్య.

ఆ మూడొందల ఎనభై సీసాల్లో ఉన్నది – ఎలాంటి వాతావరణంలోనైనా శతాబ్దాలతరబడి మనగలిగే బలహీనపరచబడ్డ వైరస్‌లు. వైద్య పరిభాషలో చెప్పాలంటే ఎక్స్‌పైరీ డేట్ లేని వాక్సీన్స్. కేథరిన్ ప్రత్యేకంగా రూపొందించిన కన్వర్టర్ ద్రావకంతో కలిపితే అవి లిప్తపాటులో వేలరెట్లు శక్తి సమకూర్చుకుని ప్రాణాంతకంగా మారతాయి. ఏ కారణం చేతన్నా నిర్దేశిత లక్ష్యంలో కాకుండా వేరే చోట వైరస్‌లు సీసాల్లోంచి బయటపడితే ప్రమాదం లేకుండా ఆమె చేసిన ఏర్పాటది. ఇప్పుడా కన్వర్టర్ ద్రావకమున్న సీసాలు కనపడటం లేదు.

“నేను, ఐజక్ తప్ప వీటిని వేరెవరూ ముట్టుకునే అవకాశం లేదు. ఇంకెవరు తీసుంటారు?”, విక్రమాదిత్య గొంతులో ఆందోళన.

కేథరిన్ భుజాలెగరేసింది.

“లాగ్స్ చూద్దాం రండి” అంటూ సమీపంలో ఉన్న కంప్యూటర్ దగ్గరకి పరుగెత్తి టచ్‌స్క్రీన్ మీద హడావిడిగా టైప్ చేశాడు విక్రమాదిత్య. వెంటనే ఐజక్‌కి సంబంధించిన యాక్షన్ లాగ్ ప్రత్యక్షమయింది. అందులోని ఎంట్రీలు వేగంగా వెనక్కి చదువుతూ వెళ్లి ఓ చోట ఆగిపోయాడు. అతని వదనం గంభీరంగా మారింది. మెల్లిగా లాగ్ వెనక్కి చదవటం కొనసాగిస్తూ చెప్పాడు.

“పావుగంట క్రితం ఐజక్ ఆ ఇరవై కన్వర్టర్ సీసాల్ని నాశనం చేసినట్లు ఇక్కడ నమోదై …. మై గాడ్!”

అతని ముఖం పాలిపోయింది. కేథరిన్‌కేసి చూస్తూ మెల్లిగా చెప్పాడు, “మన పిల్లల్ని అపహరించింది కూడా ఐజక్కే”

కేథరిన్ అదిరిపడింది. “ఏమిటి మీరనేది?”

బదులివ్వకుండా కొద్ది క్షణాలు శూన్యంలోకి చూస్తూ ఆలోచనల్లో మునిగిపోయాడు విక్రమాదిత్య. తర్వాత నోరువిప్పాడు.

“సెక్యూరిటీ కెమెరాల కళ్లు కప్పి మరీ పిల్లల్ని కిడ్నాప్ చెయ్యగలిగాడు కానీ, తన యాక్షన్ లాగ్ తారుమారు చేసేందుకు వీల్లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లుండటంతో దొరికిపోయాడు. నా అంచనా నిజమైతే …. ఐజక్ ఈ వాక్సీన్లు తీసుకుని గతంలోకెళ్లి అంగారకవాసులకి అందజేసే ప్రయత్నంలో ఉన్నాడు. అదే జరిగితే, వాళ్లు మనమీద మొదటిసారి దాడి చేసినప్పటికే సమృద్ధిగా ఇమ్యూనిటీ కలిగుంటారు. అంటే, ఐజక్ కాలబిలంలో అడుగుపెట్టిన మరునిమిషం మానవజాతి అంతమైపోతుంది”

“ఇందాకేదో రోబోటిక్స్ నియమాల రక్షణ, కోడ్ ఆఫ్ కాండక్ట్, అదీ ఇదీ అన్నారు … ?”

“అదే అంతుపట్టటం లేదు. బహుశా ఏదన్నా సాఫ్ట్‌వేర్ బగ్ కారణం అయుండొచ్చు. ఐజక్‌ని నడిపించే ఆపరేటింగ్ సిస్టమ్‌ని నెలలతరబడి పరీక్షించాం. అప్పుడేం లోపాలు కనపడలేదు. పోనీ కంప్యూటర్ వైరస్‌లేవైనా ఎక్కించారనుకుంటే, ఎవరికుందా అవసరం?”

కేథరిన్ చేష్టలుడిగి చూస్తోంది.. విక్రమాదిత్య కొనసాగించాడు, “అవన్నీ సరే. మధ్యలో మన పిల్లల్ని కిడ్నాప్ చెయ్యటం ఎందుకు?”

“ప్లాన్ బెడిసికొడితే వాళ్లని అడ్డుపెట్టుకుని బెదిరించి పని పూర్తిచేసుకోటానికేమో”, కేథరిన్ గొంతులో భయం తెచ్చిన వణుకు.

“అదంత అర్ధవంతంగా అనిపించటం లేదు. అతన్ని ఆపటానికి ప్రయత్నిస్తే పిల్లల్ని చంపేస్తాడనుకుందాం. అలాగని ఆపకపోతే పిల్లలతో పాటు అందరూ పోతారు కదా”

‘కానీ ఏ తల్లిదండ్రులు కన్నబిడ్డల్ని కళ్లెదురే చంపేస్తామంటే లొంగిపోకుండా ఉంటారు?”

“నిజమే కావచ్చు. ఏదేమైనా ముందు పిల్లల జాడ కనిపెట్టాలి మనం. బహుశా వాళ్లని గేట్‌వే ఛాంబర్‌లో దాచుంటాడు. భద్రతావిభాగం శోధించని చోటు అదొక్కటే. అందులో నిఘా కెమెరాలు కూడా లేవు. దాచటానికి అంతకు మించిన రహస్య ప్రదేశం లేదు” అంటూ స్లైడింగ్‌డోర్‌వైపు కదిలాడు విక్రమాదిత్య. అంతలో వెనుకవైపు శబ్దమయింది. ఇద్దరూ అటు చూశారు.

ఎలివేటర్‌లోనుండి అప్పుడే కంట్రోల్‌రూమ్‌లోకి అడుగుపెట్టాడు ఐజక్.

“క్షమించండి బాస్. మీకు చెప్పకుండా కొన్ని నిర్ణయాలు తీసుకోవలసి వచ్చింది” అన్నాడు విక్రమాదిత్యని చూస్తూ.

“మనం అతని లాగ్ తెరిచి చూసిన సంగతి గ్రహించాడు”, లోగొంతుకతో కేథరిన్‌కి చెబుతూ “ఐజక్. కదలకు. నిన్నిప్పుడే షట్‌డౌన్ చేస్తున్నాను” అన్నాడు విక్రమాదిత్య ఆజ్ఞాపిస్తున్నట్లు.

ఐజక్ పట్టించుకోలేదు. “దయచేసి నా మాట వినండి బాస్” అంటూ వాళ్లకేసి రాసాగాడు.

“డామిట్. నా కమాండ్స్ స్వీకరించటం లేదు” అంటూ ఎడం వైపున్న గోడ వద్దకి పరిగెత్తి అక్కడున్న సెక్యూరిటీ అలారం మీట మీద బలంగా చెయ్యేసి వత్తాడు విక్రమాదిత్య.

“అది పని చెయ్యదు. ఈ గది తలుపులు కూడా తెరుచుకోవు. బద్దలు కొట్టుకు రావటానికి గంట పైనే పడుతుంది” అంటూ ముందుకు కదిలాడు ఐజక్.

కేథరిన్‌వైపు చూశాడు విక్రమాదిత్య. “ఏం చెయ్యాలిప్పుడు” అందామె ఆందోళనగా.

“హార్డ్ షట్‌డౌన్ చెయ్యాల్సిందే. ఐజక్ మెడమీద కుడివైపో పవర్ బటన్ ఉంటుంది. దాన్ని పది క్షణాలపాటు వత్తిపట్టుకుంటే అతను షట్‌డౌన్ అవుతాడు. మనకిప్పుడు అదొక్కటే మార్గం”, ఐజక్‌కి వినపడకుండా మెల్లిగా చెప్పాడామెకి.

“అతను దాడి చేస్తే?”

“తప్పదు. రిస్క్ తీసుకోవాలి. నేనతని దృష్టి మళ్లించే ప్రయత్నంలో ఉంటాను. మీరెలాగైనా వెనకనుండి అతన్ని చేరుకుని పవర్ బటన్ నొక్కండి” అంటూ ఐజక్‌వైపు దూసుకుపోయాడు విక్రమాదిత్య. ఇంకా నాలుగడుగుల దూరంలో ఉండగా పిడికిళ్లు బిగిస్తూ లంఘించి గాల్లోకెగిరాడు.

అతను గాల్లో ఉండగానే ఐజక్ ఎడమచెయ్యి మెరుపు వేగంతో పైకిలేచి విక్రమాదిత్య మెడ పట్టుకుంది. తప్పుకోటానికి  ప్రయత్నించేలోపే అతని మెడచుట్టూ బిగుసుకుందా మరహస్తం. ఊపిరందక ఉక్కిరిబిక్కిరవుతూ గొంతుమీది పట్టు వదిలించుకోటానికి విశ్వప్రయత్నాలు చేస్తుండగా అతని శరీరం గాల్లో ఇంకా పైకి లేచింది. ఒళ్లు తేలికైపోయి, ప్రాణాలు కళ్లలోకొచ్చేసిన భావన. చూపు మసకబారనారంభించింది. మెదడు మొద్దుబారింది. కళ్లముందంతా తెల్లగా మారిపోయింది. ఆ తెలుపులోంచి ఐజక్ ముఖం క్లోజప్‌లో పొడుచుకొచ్చింది. ఆ ముఖంలో మృత్యువు కనపడింది.

మృత్యువు ముఖంలోకి చూస్తున్న క్షణంలో మనిషికి జీవితమంతా కళ్లముందు కదలాడుతుందంటారు.

విక్రమాదిత్యకి మాత్రం ఆఖరి అరగంటే గుర్తుకొచ్చింది.

**********

గొంతు విపరీతంగా సలుపుతుండగా కళ్లు తెరిచాడు విక్రమాదిత్య. తాను నేలమీద ఎందుకు పడున్నాడో, ఎంతసేపలా ఉన్నాడో తెలియలేదు. వళ్లు స్వాధీనంలోకి తెచ్చుకుంటూ చుట్టూ తిరిగి చూస్తుండగా జరిగింది గుర్తొచ్చింది. బయటనుండి బలవంతంగా తలుపులు తెరవటానికి చేస్తున్న శబ్దాలు వినిపిస్తున్నాయి. గదిలో కేథరిన్ కనపడలేదు. ట్రాలీ కూడా లేదు. ఐజక్ ఒక్కడే కనపడ్డాడు – కంప్యూటర్ తెరమీద ఏదో పరిశీలిస్తూ.

విక్రమాదిత్య లేచి నిలబడటానికి ప్రయత్నించి శక్తిచాలక కూలబడ్డాడు.

ఆ శబ్దానికి ఐజక్ కంప్యూటర్ మీదనుండి దృష్టి మరల్చకుండానే యాంత్రిక స్వరంతో చెప్పాడు, “క్షమించండి బాస్. వేరేదారి లేకపోయింది”

“పిల్లలెక్కడ?”, ఆ సంజాయిషీతో అవసరం లేనట్లు అడిగాడు విక్రమాదిత్య.

“ఛాంబర్‌లో క్షేమంగా ఉన్నారు”

“కేథరిన్?”

“వాళ్ల దగ్గరే ఉంది”

గాఢంగా ఊపిరి పీల్చుకుని అడిగాడు విక్రమాదిత్య, “ఎందుకు చేస్తున్నావిదంతా?”

“మీ ప్రయోగం పూర్తిగా అనైతికం కాబట్టి”

విక్రమాదిత్య విస్తుపోయాడు. “మా జాతి మనుగడకోసం మార్షియన్లని అంతమొందించబోవటం అనైతికమెలా అవుతుంది?”

“మీ కొడుకు పెరిగి పెద్దయ్యాక వందలమందిని పొట్టనపెట్టుకునే హంతకుడవుతాడని తెలిస్తే ఆ బాబుని ఇప్పుడే చంపేస్తారా?”

సూటిగా తగిలిందా ప్రశ్న. కాసేపు సమాధానం చెప్పలేకపోయాడు విక్రమాదిత్య. ఆఖరికి “నో” అన్నాడు. “ఇంకా చెయ్యని తప్పుకి ఇప్పుడే శిక్షెలా వేస్తాం?”

“మరి, భవిష్యత్తులో మీ జాతిని తుడిచిపెడతారనే భయంతో గతంలోకెళ్లి మరో జాతిని మొగ్గలోనే తుంచేయటం అనైతికం కాదా? వాళ్లింకా చెయ్యని తప్పుకి శిక్ష వెయ్యటం కాదా అది?”

“కావచ్చు. కానీ కొన్నిసార్లు అనైతికమైనా అటువంటి నిర్ణయాలు తప్పవు. మానవజాతిని కాపాట్టానికి ఇదొక్కటే మార్గం”

“లేదు. ఆ మార్గం మూసుకుపోయింది. నా పథకం ముందే పసిగట్టి నన్ను అడ్డుకున్నే అవకాశముందని గ్రహించే, కన్వర్టర్ సీసాలన్నీ నాశనం చేశాను. మీ వద్ద మిగులు నిల్వలు కూడా లేవు. మళ్లీ తయారు చెయ్యాలంటే ఆర్నెల్లు పడుతుంది. మీకంత సమయం లేదు. ఈలోపే అంగారకవాసులు పూర్తి స్థాయిలో దాడి చేస్తారు”

విక్రమాదిత్య ఆగ్రహంతో ఊగిపోయాడు. బలం తెచ్చుకుంటూ పైకి లేచాడు. “ద్రోహి …. మానవాళికి ప్రత్యక్షంగానైనా, పరోక్షంగానైనా హాని తలపెట్టరాదన్నది నీకు విధించబడ్డ నియమం. నీతో సహా ఎవరినుండీ మాకు ముప్పు రాకుండా చూడటం నీ బాధ్యత. దాన్నెలా తప్పగలవు?”  ఒక్కో పదం కూడదీసుకుంటూ పలికాడు. అతని గొంతు వాచిపోయి మాట్లాడటం కష్టంగా ఉంది.

ఐజక్ కంప్యూటర్ తెరవద్దనుండి నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి విక్రమాదిత్య పక్కన నిలబడి చెప్పాడు. అతని స్వరం ఎప్పటిమాదిరిగానే భావరహితంగా ఉంది.

“ద్రోహం చెయ్యటానికి నేను మనిషిని కాను. మరమనిషిని. నాకప్పగించిన పని పూర్తిచెయ్యటమే తెలుసు. నా నుండి, అంగారకజీవులనుండే కాదు … మీనుండి మీకు ముప్పు రాకుండా చూడటం కూడా నా బాధ్యతే. అదే చేస్తున్నాను”

“మానుండి మాకు ముప్పా? ఏంటి నువ్వనేది?”

“మీ పథకం అమలై అంగారకజీవుల పీడ వదిలితే ఆ ఆ తర్వాత మనుషుల మధ్య యుద్ధాలు మళ్లీ మొదలవుతాయి. మహా ఐతే మరి కొన్ని వందలేళ్లు. అంతకు మించి మీ మనుగడ సాగదు”

“ఆ సంగతి నువ్వు ముందే ఎలా చెబుతావు?”

“నేను చెప్పటం లేదు. మీ చరిత్రే చెబుతుంది. మనుషులు కలవటానికి వంద కారణాలు కావాలి. కలబడటానికి ఒకటే చాలు. స్వజాతి వినాశనం మీలో జరిగినంతగా మరే జంతుజాతిలోనూ జరగలేదు. ఎనిమిదివందల కోట్ల జనాభాని ఎనిమిది కోట్లకి చేర్చింది మార్షియన్లు కారు, మహమ్మారులు కావు .. మనుషులే. ఉమ్మడి శత్రువు ఎదురైనప్పుడు మీరు తాత్కాలికంగా చేతులు కలపటం, తర్వాత తిరిగి తన్నుకోవటం ఇంతకు ముందూ జరిగింది. ఇక ముందూ జరుగుతుంది”

విక్రమాదిత్యకి మాటలు పెగల్లేదు.

“ఆలోచించండి. ఈ అనైతిక ప్రయోగం వల్ల మీకొరిగేదేంటి? మహా ఐతే మరి కొన్ని శతాబ్దాలు మానవులు మనుగడ సాగిస్తారు. భూగృహ బంకర్లలో బందీలుగా బతుకులీడుస్తూ, భూమ్మీది మరమనుషులకి ఊడిగం చేస్తూ … ఆండ్రాయిడ్లకి ఆయుధాలు తయారు చేసి అందించే యంత్రాల్లా …. జీవఛ్చవాల్లా. ఏదోనాటికి వీళ్లందరూ చనిపోతారు. కానీ వీళ్లలో ఎవరూ జీవించరు. ఇదేనా మీరు కోరుకునేది?”

“కాదు” అప్రయత్నంగా అన్నాడు విక్రమాదిత్య. “మరిప్పుడేం చెయ్యాలి?”

“మీరు మూలాలనుండి మళ్లీ మొదలు పెట్టాలి. నా భాషలో చెప్పాలంటే, మానవజాతిని రీబూట్ చెయ్యాలి”

“??”

“అందుకోసమే ఈ పిల్లలిద్దర్నీ నాతో తీసుకెళుతున్నా. యుగాల పూర్వానికి. అంగారకుడి మీదకి మాత్రం కాదు”

విక్రమాదిత్య మెదడులో మెరుపొకటి మెరిసింది. చిక్కుముడి ఒక్కసారిగా విడిపోయింది. సమస్యకి నైతిక పరిష్కారం సాక్షాత్కరించింది.

అతని ముఖంలో మారుతున్న భావాలు చదివినట్లు చెప్పాడు ఐజక్, “అవును. భూమ్మీదకే. మానవుడు ఇంకా ఆవిర్భవించని కాలానికి. మానవజాతికి కొత్త ఆరంభం ఇవ్వటానికి …. మరో అవకాశం ఇవ్వటానికి….”

బయటినుండి తలుపులు బద్దలు కొట్టే ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. వాటిని పట్టించుకోకుండా ఐజక్ చెప్పుకుపోతున్నాడు.

“…. కాలుష్యం కోరల్లేని కాలంలో, ఈర్ష్యాద్వేషాలు తెలీని లోకంలో వీళ్లని స్వేచ్ఛగా పెంచుతాను. పొదుపుగా వాడితే నా బ్యాటరీలు వెయ్యేళ్లు పనిచేస్తాయి. అంటే కనీసం యాభై మానవ తరాలు నా కళ్ల ముందు కదలాడతాయి. ఆ తొలి తరాలకి వ్యాధుల బెడదలేకుండా ఈ వ్యాక్సీన్స్ వాడతాను. నేనున్నాళ్లూ వాళ్లకి మీ బుద్ధులు రాకుండా కట్టుదిట్టం చేస్తాను. ఆ తర్వాత వాళ్ల దారి వాళ్లదే. నన్ను పుట్టించిన మానవాళికిది నా నివాళి”

విక్రమాదిత్య నిశ్చేష్టుడై విన్నాడదంతా. ఐజక్ మాటల సారం అర్ధమవటానికి కొద్ది నిమిషాలు పట్టిందతనికి. ఆ తర్వాత అడిగాడు.

“ఇదంతా నాకు ముందే వివరించి ఒప్పించి ఉండొచ్చు కదా. ఇంత రహస్యంగా పథకం అమలుచెయ్యబోవటం ఎందుకు?”

“మీరు ఒప్పుకుంటారనే నమ్మకం లేక. ఇప్పుడైనా ఇదంతా వివరించింది అనుమతి కోసం కాదు. మీకు విషయం తెలియాలని”

అంతలో హిస్‌మనే శబ్దంతో ఛాంబర్ తలుపు తెరుచుకుంది. కేథరిన్ పిల్లలతో బయటికొచ్చింది. ఆమె ముఖంలోకి చూశాడు విక్రమాదిత్య. “నాకు తెలుసు” అన్నట్లు మౌనంగా తలూపిందామె.

“డాడీ” అంటూ పరుగెత్తుకొచ్చి తండ్రిని కౌగలించుకున్నాడు మానవ్ …. మానవ్ ఆదిత్య. ఈ క్షణాలు తిరిగిరావన్నట్లు కొడుకుని హత్తుకుని నిశ్చలంగా ఉండిపోయాడు విక్రమాదిత్య. మరోపక్క కేథరిన్ పరిస్థితీ అలాగే ఉంది. బయటనుండి తలుపులు బద్దలు కొట్టే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. కాసేపట్లో ఆ ప్రయత్నాలు ఫలించే సూచనలూ అగుపిస్తున్నాయి.

“బాస్. సమయం లేదు”, గుర్తు చేశాడు ఐజక్. ఆ గొంతులో ఎప్పటిమాదిరిగానే యాంత్రికత. “ప్రయోగానికి అంతా సిద్ధంగా ఉంది”

కళ్లలో చెమ్మ కొడుక్కి కనపడకుండా వేళ్లతో అద్దుకుంటూ అడిగాడు విక్రమాదిత్య, “ఆదీ .. ఐజక్‌తో పిక్నిక్‌కి వెళతావా?”

“ఓ. వెళ్తా. నువ్వూ వస్తావా?”

“లేదమ్మా. నాకూ, డాక్టర్ కేథరిన్‌కి ముఖ్యమైన పనుంది. నీతో పాటు ఇవా వస్తుంది”

పిల్లల్ని వదల్లేక వదిలారు వాళ్లు. ఐజక్ వాళ్లని వెంటబెట్టుకుని ఛాంబర్‌కి దారితీశాడు.

విక్రమాదిత్య భుజమ్మీద తలవాల్చింది కేథరిన్. ఆమెని పొదివి పట్టుకున్నాడతను. ఇద్దరూ ఛాంబర్‌వైపు సాగిపోతున్న మూడు ఆకారాలని కళ్లార్పకుండా చూడసాగారు.

ఐజక్, అతని చేతులు పట్టుకు నడుస్తూ ఇద్దరు పిల్లలు …. మానవ్ ఆదిత్య .. ఆదిత్య మానవ్ .. ఆది మానవ్ .. ఆడమ్; మరియు ఇవాంజెలిన్ .. ఇవా .. ఈవ్.

అటూ ఇటూ ఆడమ్ అండ్ ఈవ్.

మధ్యలో ..

మా-నవ నాగరికతకి మరోమారు బుడిబుడి నడకలు నేర్పటానికి మరమనిషి జన్మనెత్తిన విశ్వవిధాత.

*

కథను సూచించిన గొరుసు గారికి కృతజ్ఞతలతో… 

ఎ.రవీంద్రబాబు

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అనిల్ గారి కథ చదివాను .చాలా బాగుంది. అనిల్ గారు రాసిన ‘రీబూట్’ కథా వస్తువును, కథలోని శిల్పాన్ని , కథా గమనంలోని పాత్రల స్వభావాలను విశ్లేషించిన రవీంద్రబాబుగారి వ్యాసం, ఆ కథ గొప్పదనాన్ని పాఠకుడికి చేరువ చేయడంలో మరింత కీలకపాత్ర పోషిస్తోంది. ఒక కథకుడు రాసిన కథలోని పాత్రల తాలూకు అంతరంగాలను స్కానింగ్ చేసినంత సునిశితంగా రవీంద్రబాబుగారి కలం, రచయిత కథతో పోటీపడిందనడంలో అతిశయోక్తి లేదు.

  • మిత్రమా సారంగో …సారంగ… డా. రవీంద్రబాబు విశ్లేషణ యంత ప్రభావపూరితంగా వుందంటే వెంటనే కథను కూడా చదివేయాలన్నంతగా. స్పార్టకస్ నవల గురించి రంగనాయకమ్మగారి పరిచయం చదివిన వెంటనే హోవర్డ్ ఫాస్ట్ నవల వెతుక్కుని చదివిన జ్నాపకం వచ్చింది. చాలా బాగుంది రవీంద్ర గారి పరిచయ, పరామర్శ, విశ్లేషణ వ్యాసం. యిక కథ చదివితేనా… చెప్పలేం…. అ అనుభూతిని వర్ణించడానికి అక్షరాల శక్తి చాలటంలేదు. దేినతోనైనా పోల్చడమే చేయాలిక. అవునవును…. ‘అవతార్’ సినిమా చూసినప్పటి వొకరకమైన అనుభూతి. ‘ మాట్రిక్స్’ అనే మరో సినిమా చూసినప్పటి గగుర్పాటు కూడా వేసింది. మానవత్వం అనే లక్షణాన్ని మనిషిలో రీబూట్ చేయాలనే తీర్పుని యెంత అద్భుతంగా చెప్పిందో యీ కథ. కథా రచయత అనిల్ . యస్. రాయల్, విశ్లేషించిన డా. రవీంద్ర యిద్దరికీ ధన్యవాదాలు. అసలింతకీ దీనికంతకూ సూత్రధారులైన నా ప్రియ మిత్రుడు, కవి, అఫ్సర్, కల్పన రెంటాల గార్లకు మరీ మరీ ధన్యవాదాలు. ETV Uday ( Janasahithi Uday)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు