రంగులు 

నే పుట్టి పెరిగిన గడ్డలో
మూడే రంగులున్నాయట నిజమా!?
నడుస్తున్న పాదాలన్నీ
ఎర్ర రంగు అద్దుకుంటుంటే
ప్రేమకు చితికిన గుండెలు
గాయాలపాలై మట్టి రంగులో
కలిసిపోతూ నల్లగా మెరుస్తున్నాయి!
నేల నెర్రలు బారి జీర బోతున్న గొంతుకలను
గుమ్మాలకి గుమ్మడి కాయలుగా వ్రేలాడదీసి
స్టేటస్ సింబల్ నవ్వులు పులుముకుంటున్నాయి!
ప్రేమకి రంగు లేదని
కలిసిన మనసులకు విలువలేదని
పుట్టుకతో వచ్చిన రంగులకి
పరువు రంగులు వేసుకుని,
నీ ఇంటి గేటు రంగే
నీ రంగైతే చాలంటూ
నీవు అద్దేటి రంగుల్లో
నిజం మరుగైపోతుందని భ్రమ పడతావు!
నిజం చాపకింద నీరులా
నిన్ను వెంటాడుతూనే ఉంటుంది
నీ బిడ్డల కన్నుల్లో కన్నీటి ధారలై వర్షిస్తూ
దారులన్నీ రక్తసిక్తమై
ఎల్లలు లేని ప్రయాణాలు చేస్తున్నా
ఇంకా పుట్టుకలోని రంగుల్ని పులిమి చూసుకుంటున్న
నీ అహం
వెన్నంటి చెదపురుగై తొలిచేస్తూ
ఆటవిక సమాజాన్ని తలపిస్తుంటే
నిర్మలమైన మనసులు చీకటి రంగులో కలిసిపోతున్నాయి!
*

రూప రుక్మిణి

14 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • ‘నేల నెర్రెలు బారి జీరబోతున్న గొంతుకలను
  గుమ్మాలకు గుమ్మడి కాయలుగా వేలాడదీసి
  స్టేటస్ సింబల్ నవ్వులను పులుముకుంటున్నాయి’ powerful rendition rupa.
  ‘పుట్టుకతో వచ్చిన రంగులకు పరువు రంగులు వేసుకుని..’ ఒక శక్తివంతమైన కాన్సెప్ట్ ను ఎగ్జాక్ట్ గా డీల్ చేసింది ఈ కవిత. నిర్మలమైన మనసులు చీకటి రంగులో కలిసిపోకుండా ఉండాలంటే రంగులు వివర్ణమై అవర్ణ సమాజం రావల్సిందే. Happy to see your poetry in saranga. 💐 Keep rocking..

 • చాలా మంచి కవిత రాసిన “రూప రుక్మిణి గారికి అభినందనలు”, మీ కలం నుంచి వచ్చే ప్రతి అక్షరం ఆణిముత్యమే….

  మీరు మరిన్ని మంచి భావాత్మకమైన కవితల్ని పాఠకులకు అందించాలని ఆకాంక్షిస్తూ….

  ……. శ్రీనివాస్ బీర.

 • Superb. పుట్టుకతో వచ్చిన రంగులకి పరువు రంగులు

 • చాలాబావుందండీ .
  పుట్టుకలోని రంగుల్ని పులిమి చూసుకుంటున్న అహం ఉన్నంతకాలం ఏ సమాజమూ మారదు ..
  ఆలోచించేలా చేసింది కవిత

 • రంగుల గురించి అద్భుతంగా రాసారు రూప గారూ.. గుమ్మడి కాయల పద ప్రయోగం బావుంది
  అవును ఇంకా రంగుల్ని చూసుకుంటున్న అహం అలాగే ఉంది. చక్కటి కవిత.

 • మీ కవిత పొరలు పొరలుగా అనేక భావాల్ని పలికింది. అభినందనలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు