యెల్లకోడె ప్రేమాయణం … సెంద్రెయ్య మాష్కెం

కత యెట్లా చెప్పాలి మీకు? అనగనగా ఒక సెంద్రెయ్య అని మొదలుపెట్టనా? ఆ వాక్యం వినీవినీ అరిగిపోయింది కదా. అనగనగా నలుగురు అన్నదమ్ములు ఒక వూళ్లో అని షురూ చెయ్యనా? అబ్బే అదీ మొరటుగా వుంది. సరే, ఆ పూట యేం జరిగిందంటే వొక మోహ విస్ఫోటనం భూమ్మీద కొత్తగా బద్దలయ్యింది. అది మనిషికి కలిగిన వికారం అయితే బాగుండు. గొడ్లకు మనసుండదా ? అవి ప్రేమించుకోకూడదా ?  అవును, అదిగో ఆ పొలాలలో గుంపుగా తిరుగుతున్న ఆలమందను చూడు.

నల్లనీ మబ్బులు కొన్ని. ఊదారంగు మొగులు కొన్ని నెమ్మదిగా కమ్ముకొస్తున్నయి. యెండాకాలం ముగిసి పదిహేను దినాలవుతంది. రెండుమూడు వానలు పడి పొలాల్లో పచ్చటి గడ్డి కొత్తగా మొలిచింది.

యెండాకాలం వొచ్చిందంటే సాలు. గొడ్లు బర్లు మేకలూ యెట్లో ఒకట్లా ఒకకాడికి చేరుకుంటయి. కలిసి మేస్తయి. కలిసి ఆనందంతో పోట్లాడుకుంటయి. యెదకొచ్చిన ఆవునో లేకపోతే యెదకొచ్చిన కోడెనో తనకు నచ్చిన వాటితో జత కడుతయి. అయితే, కొన్ని కోడెలు చాలా యెదకొచ్చిన ఆవును జతగా ఎంచుకున్నాయంటే చూడాలి. వాటి పౌరుషం ముందట యెవలూ నిలబడలేరు. ఆ ఆవుతో జతగట్టడానికి పోటీ పడుతాయి. యెండిన దుక్కుల్లో అవి కాలుదువ్వి కొమ్ములతో నేలను తవ్వి దుమ్ము నెత్తిమీద పోసుకుంటయి. సివాలెత్తిన సింహాలా గర్జిస్తయి. వాటి అరుపులు, పులి అరుపుల్లా చూసే వాళ్లను బెదరుగొడుతాయి.

యెలకోడెకు వయసొచ్చింది. అది దానికి మంచి పచ్చగడ్డియేసి పెంచిండ్లు. బలంగా వున్నది. తన కోర్కే తీర్చుకోవాలని యెదకొచ్చిన ఆవు కోసం చాలా రోజుల నుంచీ ఎదురు చూస్తుంది.

అదిగో అట్లాంటి రువ్వడి సమయంలో వన్నెలాడి చెవులు వూపుకుంటా వొచ్చింది ఒక ఆవుదూడ. అది పెళ్లీడు వొచ్చిన కన్నెపిల్లలా వుంది. దాని చూపులు తనకు సాటి రాగల కోడెగిత్త కోసం వెతుకుతున్నాయి. ఆ కళ్లు చంచలమై ఆశగా గొడ్ల మందలో వెతుక్కుంటున్నయి. పొడవాటి తెల్లని తోకను వొయ్యారంగా వూపుకుంటా పాత సినిమాలో జయమాలినిలా నడము తిప్పుకుంటా వొచ్చింది. సుతారంగా ఏవో నాలుగు గరిక పోసలు కనిపిస్తే దాని పెదాలతో వాటిని తాకీతాకనట్టు మురక చూసింది. ఆ సుందరాంగిని చూసిన యెల్లకోడెకు ఆశబుసలు కొట్టింది. నెమ్మదిగా వొచ్చి దాని పక్కనే నిలబడ్డది. ఆ లేత కోమలాంగిని చూసి ఇదే నాకు తగిన ఆవుదూడని యెల్లకోడె నిర్ణయించుకున్నది. నెమ్మదిగా తన నీలికళ్లను ఆ ఆవుదూడ కళ్లతో కలిపింది. బలిష్టంగా వుండి, యవ్వనతేజంతో ఉరుకలేస్తున్న ఆ సొగసుకాణ్ణి చూడగానే ఆ గోకన్య మెలికలు తిరిగింది. తనూ మనసు పడ్డది. యెల్లకోడెకు సంబురమైంది. మోర యెత్తి సకలించింది. ఆ గోకన్య దగ్గరికి పోయి తన కొమ్ములతో గోకింది. ఆ ఆవుదూడ నవ్వుతూ పక్కకు పోయింది.

నువ్వొక్కడివే పెద్ద మొనగాడివా అన్నట్టు చూసి కిసుక్కున నవ్వింది. ఆ చూపుకు యెల్లకోడె అహం దెబ్బతిన్నది. ఈ గోకన్యను నేను యిష్టపడుతున్నాను. యెవరైనా యిక్కడ ఆ యవ్వనవతిని ప్రేమించి రమించాలనుకుంటే నాతో తలపడి గెలవమని కాలుదువ్వింది యెల్లకోడే. బుసలు కొడుతూ కొమ్ములతో నేలను పొక్కిలి చేసింది. పొలం ఒరాలను కొమ్ములతో పొడిచి ఆ మట్టిని పైకి చిమ్మింది. యేవేవో శబ్దాలు చేస్తా అక్కడున్న మగజాతికి సవాలు విసిరింది అది.

మనుషుల్లోనే కాదు, పశువుల్లో సయితం విలన్లు వుంటాయి. అవి పోకిరీల మాదిరి పిచ్చిపనులు చేస్తాయి. తనకు నచ్చిన వాటి వెంటపడి వేధిస్తాయి. అలాంటివి ఒక గుంపుగా వుండి సాధువుల్లాంటి యెడ్లమీద దాడి చేస్తాయి. ఆవుల మీద యెక్కి అత్యాచారం చేయాలని చూస్తాయి. అయితే, అవి చెరిస్తే చెరచబడటానికి సిద్ధంగా వుండే ఆడమనుషులు కావు కదా. వాటికి నచ్చకుంటే యెంత గొప్ప బలమైన యెద్దయినా లేదా కోడయినా ముడ్డిని మురక చూడనిస్తాయిగాని మీదికి యెక్కనియ్యవు. ఆత్మగౌరవం పశువులకే యెక్కువ వుంటది.

రెండు పోకిరీ కోడెలు ఆ సవాలును స్వీకరించినయి. ఒకటి ఎర్ర మచ్చల కోడె. యింకోటి గంగడోలు దండిగా వున్న కోడె. రెండూ పక్కూరియే. ఈ అపురూప గోగత్తె కూడా పక్కూరిదే.

యెల్లకోడె మీదికి ఆ రెండు పోకిరీ కోడెలు లంఘించినయి. వాడి కొమ్ములతో యెల్లకోడెను కుమ్మాలని చూసినయి. కానీ అలా పొడిచిన ప్రతిసారీ తన వాడి కొమ్ములతో గట్టిగా ప్రతిఘటించింది. ఎర్ర మచ్చల కోడె తన కొమ్ములతో వొరాన్ని చీల్చింది. కాలుదువ్వి కయ్యానికి ఎగపడ్డది. నాలుగు అడుగులు వెనక్కి వేసి వురుకొచ్చి యెల్లాకోడె తలమీద కుమ్మింది. ఆ దెబ్బను వూహించింది కాబట్టి చాలా దురుసుగా తన తలతో తిప్పికొట్టింది. అంత గట్టిగా యెల్లకోడె కొమ్ములు తాకుతయని అది వూహించలేదు. ఆ దెబ్బకు అది విలవిల్లాడింది. అదే అదునుగా తీసుకున్న యెల్లకోడె తన కొమ్ములతో ఎర్ర మచ్చల కోడె అన్కల కుమ్మింది. ఆ కుమ్ముడుకు దాని గుండెలదిరినయి. అంతే వేగంగా కొమ్ములతో యెత్తిపడేసింది. అలా పడిపోయిన కిందపడి లేవలేని స్థితిలో వున్న ఎర్ర మచ్చల కోడెను చూసి ఆ యవ్వనాంగి మురిసిపోయింది.

తన పోకిరీ దోస్తు కిందపడి వోడిపోవడాన్ని చూసి నవ్వుతున్న ఆ గోకన్యను చూసి గంగడోలు కోడెకు కోపమొచ్చింది. యిదంతా నీవల్లనే కదా, నీ సంగతి చెప్తా అనుకుంటూ ఆ సౌశీల్యవతి మీదికి వురికింది. తనను తాను రక్షించుకోవడానికి ఆ గోఆంగణ పరిగెత్తింది. తన ప్రియురాలిని తరుముతున్న పోకిరీ కోడె ఎన్క దౌడు తీసింది యెల్లకోడె. అలా ఆ మూడూ ఆ పెద్ద మంద నుండి వేరుపడి యెటు వురుకుతున్నయో చూసుకోలే. చెలుకలు, చేమలు దాటి వురికినయి. పొలిమేరలు దాటినయి. యెంత దూరం పోయినయో వాటికి తెల్వదు. అలిసి ఆగిపోయిన ఆ సోగకండ్ల ఆవుదూడ మీద ముందటి కాలెత్తి యెక్కి అత్యాచారం చేయబోయింది గంగడోలు కోడె. కళ్లు మూసి తెరిసే లోపట యెల్లకోడె తన బలమైన శరీరంతో కుమ్మింది. అది ఎగిరి అంత దూరంలో పడ్డది. అట్లా కిందపడ్డ దాని కార్జానికి తాకేటట్టు మల్లోసారి కుమ్మింది. ఆ దెబ్బకు అది సచ్చినరా అయ్యా అని మొత్తుకున్నది.

తనను వొదిలేయమని దీనమైన చూపులతో వేడుకున్నది. బుసలు కొడుతూ దాని చుట్టూ నాలుగు సార్లు తిరిగింది. కానీ ఆ గంగడోలు కోడె లేచి నిలబడలే. పిరికితనంతో వొణికిపోయింది.

ఏంచేయమంటావు చెప్పు అన్నట్టు ఆ ఆవుదూడ కేసి చూసింది. మెరిసే కళ్లతో ఆమె దగ్గరికొచ్చింది. మురిసిపోతూ తన పెదాలతో తీయటి ముద్దిచ్చింది. అంతే, యిక ఆ రెండూ రమణీయంగా రమించుకున్నాయి. చెట్లూ చేమల్లో తిరుగుతూ యిష్టంగా గడిపాయి. మౌనభాషలో యెన్నో మధుర గీతాలు పాడుకున్నాయి.

సూర్యునికి అసూయ యెక్కువ. ఆ యిద్దరి ప్రేమకలాపం చూసి తట్టుకోలేక అలిసి పోయాడు. చీకటి దుప్పటి పరుచుకొని కాళ్లు ముడుచుకుంటున్నడు.

అప్పుడు గానీ ఈ యిద్దరికీ తామెక్కడున్నామో చూసుకోక తప్పలేదు. చాలా దూరం వొచ్చేసినయి అవి.

యిక వెళ్తా మా యింటికి అన్నట్టు చూసింది గోమతి. తనివి తీరని యెల్లకోడె నువ్వెటు పోతే నేనూ అటే అన్నది. సరే పా అని రెండూ జతగా బయల్దేరినయి. గోమతి తన యజమాని గొడ్ల కొట్టానికి చేరుకున్నది. ఆ వెన్కే యెల్లకోడె. ఆ యజమాని గోమతి యెదకొచ్చిందని అర్థం చేసుకున్నడు. యెల్లకోడె తగిన జతగాడె అని నవ్వుకున్నడు. గోమతినీ, యెల్లకోడెనూ వాటి యిష్టానికి వొదిలేసి తను యింటికి పోయిండు. అలా యెల్లకోడె తన వూరు మరిచిపోయింది. తను నిద్రించే గొడ్ల కొట్టం మరిచింది. తనకు యిష్టంగా ప్రేమతో చిలుకపిండి, తౌడు కలిపి కుడితి పెట్టి  ఒళ్లంతా నిమిరే తన యజమాని గుర్తుకు రాలే. చాలా రోజులయితంది తను దూరంగా వొచ్చేసి.

2

తమ్మడపల్లిలో పెళ్లికి పోయిండు యెంకటయ్య. ఎల్మకంటి అబ్బయ్య బిడ్డను రామారం జిలుకర రాఘవులుకిత్తండ్లు. తమ్మడపల్లి శాంతమ్మ పుట్టినూరు. శాంతమ్మను నర్సయ్య పెండ్లి చేసుకున్నడు. శాంతమ్మ కొడుకులే యెల్లయ్య, సెంద్రెయ్య,  యెంకటయ్య, సోమయ్యలు. అబ్బయ్య వరుసకు బామ్మర్ది అయితడు. పెళ్లి బాగా జరిగింది. పొద్దుగూకంగా మల్లంపల్లికి బయల్దేరుతంటే అబ్బయ్య అడిగిండు. సెంద్రెయ్య బావ యాడికి పోయిండో తెల్వక పాయె. మీ అన్నదమ్ములు పట్టించుకుంట లేరు. యిదేమన్నా మంచిగున్నదా బావా అని అడిగిండు అబ్బయ్య. ఆ మాటకు యెంకటయ్యకు కోపమొచ్చింది.

మంచిచెడ్డలు నువ్వు చెప్తనే తప్పా తెల్వదాయె మాకు మరి. మా అన్నకు మేము యేం అన్యాయం చేసినం. యాడికి పోతండో చెప్పకపాయె. సిన్న పోరగాణ్ణి వొదిలేసి పోయిండు. వాని మొఖం చూసినప్పుడల్లా మా అన్న యాడున్నడో నని గాబరా అయితది. నేను ఆయణ్ణి యెతుక్కుంటా తిరగని వూరు లేదు. వరంగల్లు జిల్లాలో వున్న అన్ని వూళ్లు తిరిగితిని. నల్లగొండ, కరీంనగర్‌, హైదరాబాదు అన్నీ తిరిగితిని. జాడ తెల్వకపాయె. యెం చెయ్యమంటవు మమ్ముల? నీకున్న సోయి మాకు లేదనుకుంటన్నవా? బాధ్యతలేని మనుషులమా మేము? అని కోపం చేసిండు. ఆ మాటలకు అబ్బయ్య అటిటయ్యిండు.

కోపం చెయ్యకు బావా నీ బాంచెను. యేదో ఆపతితో అడిగిన. సుట్టూ పదివూళ్లకు పెద్ద మనిషివి. నీకు నేను మంచి చెడ్డలు నేర్పాల్నా అని దండం పెట్టిండు అబ్బయ్య.

రాత్రి ఎనిమిది గొట్టంగా యింటికి చేరుకున్నడు యెంకటయ్య. రాంగనే యెల్లకోడె కనుపడుతలేదని చెప్పిండు సోమయ్య.

గొడ్లను దొడ్డి నుంచి యిడిసి వొదిలిపెట్టి తాటి కల్లు తాకుంటా కూసునుడు కాదు. అవి వున్నయా యాడికన్న పోయినయా అని సూసుకోవా అని తిట్టిండు. పొద్దున్నే పోయి యాడపోయిందో జాడపట్టు అన్నడు యెంకటయ్య.

జాము పొద్దున్నే లేచి యెల్లకోడె జాడ కోసం పోయిండు సోమయ్య.

మర్రిచెట్టు కింద గౌండ్లోళ్ల పంచాతీకి పెద్ద మనిషిగా పోయిండు యెంకటయ్య. అన్నదమ్ముల పంచాతీ అది. ఆస్తి కోసం అన్నదమ్ములు పెద్ద మనుషుల ముందే తన్నుకున్నరు. పంచాతీ పెద్దలంతా ఆ యిద్దరినీ మందలించిండ్లు. అన్నదమ్ములంటే జిలుకరోళ్ల లెక్క వుండాలె. ఏనాడన్నా వాళ్లు పంచాతీ పెట్టుకున్నరా? అంతపెద్ద కుటుంబం. ఉమ్మడి కుటుంబం. ఇప్పటికీ వాళ్లు ఆస్తులు పంచుకోలే. మీకున్న బోడి రెండు ఎకరాల కోసం ఒక్క కడుపున పుట్టినోళ్లు ఒకని గల్ల యింకోడు పట్టుకొని అమ్మనా బూతులు తిట్టుకుంటరా? మీదొక బతుకేనా? బైండ్లోళ్లను చూసి నేర్చుకోండిరా అని పంచాతీ పెద్దలంతా తిట్టిండ్లు.

వాళ్లన్నదీ నిజమే. జిలుకర యెంకటయ్య కుటుంబం ఆస్తుల కోసమే, మరోదాని కోసమో అన్నదమ్ములు తిట్టుకున్నదీ లేదు. తన్నుకున్నదీ లేదు. ఆ మాట కొస్తే బైండ్ల కులంలో వాళ్ల గురించి తెలసిన వాళ్లెవరైనా సరే ఆ అన్నదమ్ముల బంధం గురించి చెప్పుకుంటూ మురిసి పోతరు. ఒకరి మీద ఒకరికి గౌరవం, ఒకరి కష్టాలలో మరొకరు పాలు నీళ్లలా కలిసి మెలిసి బతుకుతరు వాళ్లు. అందరి మీద కయ్యానికి కాలుదువ్వే సెంద్రెయ్య ఏనాడూ తమ్ముళ్ల మీద చెయ్యెత్తింది లేదు. పైగా వాళ్ల మీద ఎవడైనా నోరెత్తితే వాళ్ల దుంపతెగేదాకా వొదిలిపెట్టే రకం కాదు సెంద్రెయ్య.

నర్సయ్య తమ్ముడు ముత్తయ్య. ఆయనకు ఒక కొడుకు ఒక బిడ్డ. ఆ కొడుకును నడిపోళ్ల యెంకటయ్య అని, పెద్ద యెంకటయ్య అనీ పిలుస్తరు. బిడ్డ పేరు రాములమ్మ. నడిపోల్ల యెంకటయ్య వయసులో చాలా పెద్దోడు. నర్సయ్యకు పిల్లలు లేరని ముత్తయ్య చాలా యేండ్లు చిన్న చూపు చూసిండు. తన కొడుకు, బిడ్డలను చూసి మురిసి పోయిండు.  సెంద్రెయ్య, యెంకటయ్య పుట్టినంక ముత్తయ్య సొంత అన్నను సూటిపోటి మాటలనుడు మానేసిండు. కానీ ఆ పనిని బిడ్డ రాములమ్మ నెత్తి మీదికి ఎత్తుకున్నది. సీటికి మాటికి నోరు నెత్తిమీన పెట్టుకునేది.

సెంద్రెయ్య కనపడితే నోటికొచ్చినట్టు తిట్టేది. గొడ్లను కంచెల మేపేటప్పుడు ఏదో వొక వొంకతో బూతులు తిట్టేది సెంద్రెయ్యను. తనకు బాగా కోపం వొచ్చేది. కానీ ఆడపిల్లను యేమీ అనొద్దని నోర్మూసుకునేటోడు. అట్లా చాలా యేండ్లు భరించిండు. యెంకటయ్య చేతికొచ్చినంక కూడా ఆమె మారలేదు. యింకా రాములమ్మ వొయసు మీదికి వొచ్చింది. యిష్టమొచ్చినట్టు తిరుగుడు మొదలు పెట్టింది. సుట్టతాగుడు, కల్లు తాగుడు, మొగపోరగాండ్లతోటి మగరాయుడిలా తిరుగుడు చూసి సెంద్రెయ్యకు, యెంకటయ్యకు మనసుకు నొప్పి కలిగేది. అట్లా చేయొద్దని చెప్పినందుకు నోటికొచ్చినట్టు తిట్టింది ఒక రోజు.

యెంకటయ్య కంచెలో గొడ్లను మేపుతున్నడు ఒకరోజు. తన గురించి నాయినకు ఏదో చెప్పిండ్లని అనుమానం వొచ్చింది రాములమ్మకు. కంచెలో గొడ్లను మేపుత్ను యెంకటయ్య దగ్గరికొచ్చి సాడు కండలు అని తిట్ల దండకం అందుకుంది. మోటకొడుతున్నడు సెంద్రెయ్య. రాములమ్మ కంచెల నిలబడి చేతిలో వాయిలి కట్టె పట్టుకొని యెంకటయ్య మీద అరుస్తూంది. అలా తన తమ్ముడి మీద రేసుకుక్కలా రెచ్చి పోతున్న రాములమ్మను చూసి సెంద్రెయ్య గుండె మండిపోయింది. మోటగొట్టుడు ఆపి కంచెలకు పోయిండు.

నువ్వెవనివిరా నాకు చెప్పడానికి? నాకు నచ్చినట్టు చేస్తా. తాగుతా. తిరుగుతా. నా యిష్టం. నీకెందుకురా బాడ్కావ్‌ అని యెంకటయ్యను తిట్టుకుంటా మీది మీదికి పోతంది రాములమ్మ. సెంద్రెయ్య ఆడికి వొచ్చుడు వొచ్చుడే ఆమె చెవుల మీద వొక్కటేసిండు. నేల మీద సర్సుకపడ్డది. నెత్తికి చుట్టుకున్న తువాల దీసి ఆమె నోటికి అడ్డంగా బిర్రుగా కట్టిండు. యెంకటయ్య దీని కాళ్ల మీద కూసో అన్నడు. యెంకటయ్య ఆమె కాళ్లు బిర్రుగా కదలకుండా పట్టుకొని కూసున్నడు. సెంద్రెయ్య ఆమె చేతులు పైకి లేపి సంకల్లో పిడిగుద్దులు వరుసగా అటోపది యిటో పది గుద్దిండు. ఆ దెబ్బలకు ఆమె జబ్బలు వూడిపోయినంత పనయింది. నొప్పి భరించలేక విలవిల్లాడిపోయింది. కుండలకొద్ది కన్నీళ్లు కారిపోతన్నయి. లేపి కూసుండబెట్టిండు.

సూడు పోరీ, ఒక్క గుద్దు యీపు మీద గుద్దిననుకో ముసలిగొడ్డు సచ్చినట్టు బేర్మని పెండపెట్టి సస్తవు. యింకోసారి నీ నోట్లోంచి ఒక్క సెడ్డ మాటొచ్చినా, నా యిష్టమొచ్చినట్టు సేత్త అన్నా సిన్నాయినకు కూడా నీ పీనుగ దొరుకనియ్య. అరే యెంకటి, ఈ పోరి రేపటి నుంచి వూళ్లే యే వాడల్నన్నా కనపడ్డదంటే సంపి జైలుకు పోదామురా. బైండ్లోళ్ల యిండ్లల్ల సెడపుట్టింది ఇది. లేకపోతే యియ్యాల్నే సంపేద్దామా అని తాడుతెత్తాగు అని రెండు అడుగులు పక్కకేసిండు. అంతే, పిరికి జెర్రిగొడ్డులా ఆనించి పారిపోయింది.

నాబిడ్డను కొడుతరా మీరని ముత్తయ్య పంచాతీకి వొచ్చిండు. ఎక్కువ మాట్లాడితే నిన్నూ, దాన్నీ సంపిపార నూకుతా అని బెదిరిచ్చిండు సెంద్రెయ్య. నర్సయ్య అడ్డుపడ్డడు. నీకన్న పెద్దోళ్లతోటి అట్లనేనా మాట్లాడేది? వాడు నా తమ్ముడురా. నీకెంత బల్పురా అని సెంద్రెయ్యనే తిట్టిండు నర్సయ్య.

నీ తమ్ముడు నిన్ను యెన్ని మాటలన్నా నువ్వు పడుతావేమో గానీ, నేను పడను. నిన్నూగానీ, నా తమ్ముణ్ని గానీ యింకో మాట అన్నడంటే నాయాల్ది నేనేం సేత్తనో నాకే తెల్వదు. అది నీకు బిడ్డయితే, నాకు సెల్లే. మన వంశపరువును సంకనాకిత్తంది నీ బిడ్డ. సుట్టు పది వూళ్లలో మనకింత పరువు వుంది. నీ బిడ్డ మూలంగా అది మట్లగలుత్తంది అన్నడు ముత్తయ్యను చూస్తా. సెంద్రెయ్య కోపాన్ని చూసి ముత్తయ్య ముడుసుకు పోయిండు.

ఆ తర్వాత వారానికి రాములమ్మ యెటో పోయింది. యెవరినో పెళ్లి చేసుకొని ఆంధ్రకు యెళ్లిపోయిందని అందరూ అంటుంటే విని సెంద్రెయ్య, యెంకటయ్య చెవులు మూసుకున్నరు.

గౌండ్లోళ్ల పంచాతీ కాడ పెద్దమనుషులు సెంద్రెయ్యను యాది చెయ్యంగనే యెంకటయ్య మనుసు బాధపడ్డది. అంతా లేచిపోతండ్లు. అప్పుడు అబ్రహం అన్నడు. అయ్యా, మీ అన్నదమ్ముల గురించి అందరూ చెప్పుకుంటరు. కానీ యేం లాభం. సెంద్రెయ్య యాడున్నడో దెల్వకపాయె. సచ్చిపోయిండా? మణితోనే వున్నడా? చూసినోడు లేకపాయె. యిన్నోడు లేకపాయె. నాకైతే అనుమానమే బిడ్డా. యిల్లొదిలి అయిదేండ్లు అయితంది. మణితో వుంటే రాకపోవునా చెప్పు. కనీసం దినాలన్నా చెయ్యరాదు అన్నడు.

నీయవ్వకునా పారేద్దు. తప్పుడు మాటలు మాట్లాడినవంటే చెప్పు తెగుద్ది. మా అన్నకేంగాదు. నీలాంటోళ్లను పదిమందిని సంపి గానీ సావడు. దినాలు పెట్టాల్నట. బుద్ధిలేని మాటలు మాట్లాడుతవు లంజకొడుకా అని తిట్టుకుంటా యింటికు యెళ్లిపోయిండు.

అబ్రహం మాటలు యింకా వెంటాడుతున్నయి. నిజంగానే సెంద్రెన్న సచ్చిపోయిండా? బతికుంటే అయిదేండ్లలో ఒక్కసారన్నా యింటికి రాలేదేమి? నేను యెన్నడూ ఒక్క మాటన్నది లేదే? అసలు యిల్లోది యెందుకు పోయిండు? యాడికి పోయిండు? కనీసం సిన్నపిలగాడు యెంకటేషు. వాణ్ని సూడాలని ఒక్కసారి కూడా అనిపియ్యలేదా? నిజంగానే మా అన్న సచ్చిపోయిండా? యెవరు సంపివుంటరు? యెట్లా సచ్చిపోయి వుంటడు? అని ఆలోచించిండు. ఆ ఆలోచనే పచ్చి చేదులా అనిపించినయి. నలుగురి కోసం యామైనా చేసే మాయన్నకు అపాయం యెప్పుడైనా రావొచ్చు. అపాయాలను నెత్తిమీదికి తెచ్చుకునుడే తన నైజం. యెవ్వనితోనైనా కలెబడుడు. తప్పనీ వొప్పనీ పంచాతీ పెట్టుకునుడు ఆయన గుణం. మంచోనికి బూమ్మీన నూకలు తక్కువంటరు. యెట్లా యేమీ సెయ్యాలే. అన్ని సోట్లా జాడకనిపెడుదామని తిరిగితిని. కానీ దొరక్కపాయె యేం చెయ్యాలే అని ఆలోచిస్తూ, అన్నతో కలిసి బతికిన మంచి రోజులు యాదికి దెచ్చుకొని కంటనీరు పెట్టుకున్నడు యెంకటయ్య.

3

గోమతి మీది వ్యామోహంతో యెల్లకోడె వొచ్చింది. ఆ రైతు యెల్లకోడెను కూడా తన దొడ్లో కట్టేసుకున్నడు. నాలుగు రోజులు గోమతితో కలిసి తిరిగినంక తనకు తన వూరు యాదికొచ్చింది. తన తల్లీ, తనతో ఆడుకొనే అన్నాదమ్ములు యాదికొచ్చిండ్లు. ముఖ్యంగా తననెంతో బాగా చూసుకొనే సోమయ్య యాదికొచ్చిండు. గోమతి కోసం వాళ్లందరినీ వొదిలేసి వొచ్చి తప్పు చేసిన్నే అని యెల్లకోడె లోలోపల కుమిలిపోయింది.

గోమతి అర్థం చేసుకున్నది. నాకోసం నువ్వు నీ వాళ్లను వొదిలి వొచ్చినవు. నీ వల్ల నేనొక తల్లిని కాబోతున్నా. యిక నువ్వు నీ యింటికి యెళ్లిపో. లేకపోతే నా యజమాని నిన్ను యే అంగట్లోనో అమ్మేస్తాడు. యిక ఆ తర్వాత నువ్వు యెన్నటికీ నీ జన్మస్థలానికి చేరుకోలేవు అంది. ఆ మాటలకు యెల్లకోడెకు దిగులు పట్టుకున్నది. తనను గుంజకు కట్టేసిన తాడును ఒక్కసారిగా తెంపుకున్నది. ఆ దొడ్డి యజమాని ఎక్కడో దూరంగా పొలంలో పని చేసుకుంటున్నడు. యెల్లకోడె తాడు తెంపుకున్నది తను గమనించలే.

గోమతిని సమీపించిన యెల్లకోడె తన నోటితో ఆమె గర్భాన్ని నాకింది. మోరయెత్తి ఆమె వీపు మీద కాసేపు వుంచింది. తన తొలి ప్రేమ గోమతితోనే జరిగినందుకు యెల్లకోడె సంతోషపడ్డది. గోమతి మూతిని మురకచూసి ముద్దు పెట్టుకున్నది. ఆమె పెదాలను నాకింది. ‘‘నా ప్రియాతి ప్రియమైన గోమతీ, గోరాణీ. నీలాంటి సుందరాంగిని పొందినందుకు నాకు చాలా గర్వంగా వుంది. నీతో యిన్ని రోజులు గడిపే అవకాశం నాకు దొరికనందుకు నేనెంతో అదృష్టం చేసుకున్నాను. నా భీజం నువ్వు మోస్తున్నందుకు కృతజ్ఞతలు. మన బిడ్డను జాగ్రత్తగా చూసుకో. మళ్లీ మనం కలుసుకునే అవకాశం వుంటే తప్పకుండా మన బిడ్డను చూసి ఆనందిస్తాను. దాన్ని మంచి గుణగణాలతో పౌరుషాగ్ని తగ్గకుండా పెంచు. మీ తండ్రి మహావీరుడని చెప్పు. ప్రేమకోసం యెంత సాహసమైనా చేస్తాడనీ, యిచ్చిన మాట తప్పని సత్యసంధుడని చెప్పు. నీకు అంతా మంచే జరుగుతుందని గోమతిని యెల్లకోడె ఆశీర్వదించింది. ఆ మాటలకు గోమతి హృదయం పులకరించింది. టపటపా కన్నీరు కార్చింది. ప్రేమతో ఆలింగనం చేసుకున్నది. కడసారి వీడ్కోలు పలికింది.

4

సోమయ్య యెల్లకోడె జాడకోసం వూళ్లు పట్టుకొని తిరుగుతున్నడు. దాని రూపురేఖలు చెప్పి యెల్లకోడె యిటుదిక్కు వొచ్చిందా అని రైతులను చాలా మందిని అడిగిండు. దర్దేపల్లి, వాయిలాల, కొండాపూర్‌, కొలన్‌పల్లి, ముత్తారం వూళ్లు తిరిగిండు. యెవర్ని అడిగినా మాకు తెల్వదు. మేము చూడలే అన్నరు. యెండా వానలు లెక్క చేయకుండా జాడ కోసం తిరుగుతనే వున్నడు.

అయిదు రోజులు యెతికినా యాడా యెల్లకోడె దొరుకలే. ఒకరోజు పాలకుర్తి అంగడి అంతా వెతికిండు. బ్యారగాళ్లను కూడా అడిగిండు. కానీ జాడ లే.

సెంద్రెయ్యను యెతుకుతా యెంకటయ్య హన్మకొండకు పోయిండు. హైదరాబాదులోని అన్ని గల్లీలు తిరిగిండు. కానీ జాడ దొరుకలే.

యెల్లకోడె యిక దొరకదని దిగులుతో కన్నీళ్లు పెట్టుకున్నడు సోమయ్య. సెంద్రెయ్య జాడ దొరక్క యిక తప్పకుండా సచ్చిపోయి వుంటడని అనుకొన్నడు యెంకటయ్య. ఆ ఆలోచన రావడంతోటే కన్నీరు మున్నీరుగా విలపించిండు హుస్సేను సాగర్‌ కట్టమీద కూసోని. యెంకటయ్య కన్నీటి చుక్కలు పడి హుస్సేను సాగర్‌ నీళ్లు నీలి వర్ణంలోకి మారిపోయినయి.

5

గోమతి నుంచి కడసారి వీడ్కోలు తీసుకొని యెల్లకోడె బయల్దేరింది. కానీ యెటుపోవాలో దారి తెల్వదు. కాసేపు ఉత్తరం దిక్కుకు నడిచింది. ఎండిన పొలాలు, కందికొయ్యల చెల్కలు, జొన్న వాములను దాటుకుంటూ ముందుకు నడిచింది. కానీ, జిలుకరోళ్ల పొలాలు గానీ ఆ అందమైన దొడ్డిగానీ కనిపించలే.

ఆ పొద్దంతా అది తిరుగుతూనే వున్నది. ఆకలేస్తే పొలాల ఒరాల మీది పచ్చగడ్డిని తిన్నది. అక్కడక్కడా కనిపించిన వాగుల్లో నీళ్లు తాగింది. కానీ తను యిప్పుడు యెక్కడుందో తనకే తెలియదు. చీకటి పడేదాకా అది నడుస్తూనే వుంది. తిరిగిన చోటునే చుట్టూ తిరిగినట్టు అర్థమైంది తనకు. గోమతి మీద మోహంతో, ఆ పోకిరీ కోడె మీద కోపంతో ఏ దారిలో వురుకొస్తున్ననో సూసుకోలేదు. యిప్పుడు చూడు నా బతుకు? నా పుట్టిల్లు ఎక్కడుందో తెల్వట్లే. నా తల్లీ, నాతోపాటు పెరిగిన నా బంధువులు ఎక్కడున్నారో, యెట్లా వున్నారో తెల్వకపాయె? కామంతో వున్నోళ్లకు సిగ్గూఎగ్గూ వుండదన్నారు గానీ, దారీ తెన్నూ తెలువదని యెందుకు చెప్పలేదో అని చింతించింది యెల్లకోడె. ఎటూ పోలేక, ఆ రాత్రి యిక ఆగిన చోటే కునుకు తీయాలని ఒక సెలుకలో కూలబడ్డది. నిద్దురలోకి జారిపోయింది.

6

రాత్రంతా ఆలోచించిండు యెంకటయ్య. నిద్దురే పోలేదు తను. కళ్లన్నీ నిప్పుల కట్టెను పట్టుకుంటే కాలిపోయిన అరచేతుల్లా వున్నయి రెండు కండ్లు.

వూళ్లోని కోళ్లు ఎగిలివారబోతుందని కూసుడు అప్పుడే మొదలుపెట్టినయి. అప్పుడు పక్కలోంచి లేచి బయటికి వొచ్చిండు యెంకటయ్య.    వారీ సోమా, లేచినవా అని పిలిచిండు. అట్లా యెవరూ లేవకముందే అన్న లేచి పలిచిండంటే,   యేదో ముఖ్యమైన విషయమే వుంటదని సోమయ్యకు తెలుసు. ఆ యింట్లో ఆడోళ్లకూ తెలుసు.

ఆ యేమయ్యిందే అనుకుంట బయిటికొచ్చిండు సోమయ్య. యెల్లకోడె దొరికిందా అని అడిగిండు. లేదని తల అడ్డంగా వూపిండు సోమయ్య. బుచ్చిగాణ్ని పిలువు. వాడింకా  లేవలేదా? వోరి బుచ్చయ్య. లేచి బయిటికిరారా అనంగనే తన యింట్లోంచి బయిటికొచ్చిండు బుచ్చయ్య. యేందన్నట్టు కండ్లు తుడుసుకుంటా నిలబడ్డడు.

సెంద్రెన్న యిల్లొదిలి అయిదేండ్లు దాటినయి. బవుషా సచ్చిపోయి వుంటడు అన్నడు యెంకటయ్య. ఆ మాట వినంగనే యింట్లో పక్క మీది నుంచి బోర్మని యేడుస్తా బయిటికి వురుకొచ్చిండ్లు  ఆడోళ్లు.

సరోజన, చిలుకమ్మ లిద్దరూ ఓ బావో నా బావో. నీ కేమైంది బావో అని పెడబొబ్బలు పెట్టిండ్లు. వాళ్ళ యేడ్పుకు పిల్లలు జడుసుకున్నరు. వాళ్లు కూడా పెద్దగా ఏడ్పు అందుకున్నరు. బుచ్చయ్య కన్నీరు మున్నీరయ్యిండు. అతని భార్య వో మావో నా మావా అని ఏడ్పందుకున్నది.

ఆ యేడ్పులు అప్పుడే ప్రశాంతంగా నిద్రలేస్తున్న మల్లంపల్లి జనాలను ఉలిక్కిపడేలా చేసినయి. యేమైందుల్లో అనుకుంటా యెంకటయ్య యింటికి వరదలా వురుకొచ్చిండ్లు వాళ్లు. సెంద్రెయ్య సచ్చిపోయిండట అని యెవరో అన్నరు. అయ్యో పాపం. అట్టెట్టా జరిగింది అన్నరు యింకొకరు. పీనుగె యాడుందని ఒకడు. యే దేశంల్నో యెవరో సంపి వుంటరని ఒకరు గుసగుసలాడుతండ్లు. యే, ఆడు మామూలోడు కాదు. వాడు ఒక్కడే పుట్టెడు వొడ్ల బండిని యీపుమీద రెండు అడుగల యెత్తు లేపినోడు. అట్లాంటి సెంద్రెయ్యను యెవ్వడు సంపుతడు వూకోండెహే అన్నడు యింకొకడు.

బతికుంటే రాకపోవునా? ఆరేడేండ్లు అయితందాయె. యెంతకాలం ఆగుతరు. దినాలో మాష్కమో చెయ్యక పోతే యెట్లా అన్నరు వొకరు.

ఇయ్యాల బుధవారం.  ఆదివారం మాష్కం చేద్దాం. యేదో ఒకటి చెయ్యాల గదా అన్నడు యెంకటయ్య. ఆడోళ్లింకా పెద్దగా యేడుస్తండ్లు ఆ మాటకు.

యిప్పుడు వూరంతా ఒకటే ముచ్చట. సెంద్రెయ్య చుట్టూ తిరుగుతంది. సెల్కల్లో పని చేసేటోళ్లు, గొడ్ల కాసేటోళ్లు, వూళ్ల పయానం మీద పోయేటోళ్లు సెంద్రెయ్య గురించే మాట్లాడుకుంటండ్లు. వాళ్ల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటండ్లు.

 

7

ఉత్తరం దిక్కు నడిచీ నడిచీ యెల్లకోడె చాలా దూరం వొచ్చేసింది. అది దారి తప్పింది. తప్పు చేశానని అర్థమైంది తనకు. వొచ్చిన బాటల్నే యెనక్కి పోవాలని అది నిర్ణయించుకున్నది. అందుకే అది దక్షిణానికి తన నడక మొదలు పెట్టింది. పొద్దంతా నడుత్తనే వున్నది. ఒక గంట ఒక చోట సేదతీరింది. మళ్లా నడిచింది. అట్లా రాత్రంతా నడుస్తనే వున్నది. దీపంలా వెలుగుతున్న తన కండ్లను చూసి పాములు పక్కకు తప్పుకున్నయి. అట్లా నాలుగు రోజులు దక్షిణం దిక్కు నడుస్తనే వున్నది. అట్లా నడిచీ నడిచీ అలిసిపోయింది. ఒక రావి చెట్టుకింద కూసున్నది. తనను తానే తిట్టుకున్నది.

తను చిన్నప్పటి నుంచి తిరిగిన ప్రాంతాలను అది నెమ్మదిగా గుర్తు చేసుకొనే ప్రయత్నం చేసింది. పైనించి కిందికి పారే వాగు. ఆ వాగుకు అటూయిటూ పచ్చని పొలాలు. ఆ వాగు నేరుగా పోయి మల్లంపల్లి చెరువులో కలుస్తది. దాంట్లనే తను సానాసార్లు తానం చేసింది యాదికొచ్చింది. ఆ చెరువుకు పడమట యెంకటయ్య సెలుకలు. పాతబాయికాడి గొడ్ల కొట్టంలో తను పుట్టింది కళ్ల ముందు కనిపించింది యెల్లకోడెకు.

ఆ రోజు గోమతితో ప్రేమలో పడి, పోకిరీ గంగడోలు కోడె యెన్క వురికింది యాది చేసుకున్నది. గోమతి కాసేపు పడమటికేలి వురికింది. అంటే దర్దేపల్లికేలి. ఆ తర్వాత ఉత్తరం దిక్కు తిరిగి వురికింది. ఒక తండా దాటినంక ఆగింది. పెద్దపెద్ద గుట్టలు అంత దూరాన కనపడుతన్నయి. యిప్పుడు యెక్కడున్నా అని చూసుకున్నది. చీకట్లో యేమీ కనపడలే. యేదో గుడ్డెలుగు దూరంగా దక్షిణం దిక్కు వురుకుతంది. జఫరగడ్డ గుట్టల మీద గుడ్డేలుగులు వుంటయని వొకసారి సోమయ్య యెలతోటో చెప్తంటే యిన్నది. అంటే నేను జఫర్‌గడ్డ దాకా వొచ్చిన. అంటే నేను దక్షిణదిక్కు పోతే నా యిల్లు దొరుకుతది అని సంతోష పడ్డది.

అంతే తెల్లారక ముందే లేచి నడక మొదలుపెట్టింది. ఇప్పుడు కొత్త ఉత్సాహం వొచ్చింది యెల్లకోడెలో.

 

8

పాతబాయికాడ మామిడి చెట్ల కింద మాష్కం చెయ్యడానికి కూసున్నరు. యెంకటయ్య నిండా దుఖ్కం వుంది. ఈ బాయిని తవ్వినప్పుడు సెంద్రెన్న కష్టం గుర్తొచ్చింది తనకు.

నువ్వొక్కనివే బాయంతా తొవ్వినవు బావో. నీ బాయి నీకు గుర్తొస్తలేదా బావో అని పొయ్యిమీద బువ్వ వొండుతా ఏడుత్తంది సిలుకమ్మ.

నువ్వు చేసిన మడికట్లు బావో యివి. నీ రెక్కల కష్టంతోటే పంటలు పండినయి బావో అని సరోజ యేడుత్తంది.

యాట సెంద్రెమ్మ కాడ కోణ్ణి కోసి తెచ్చిండ్లు యెంకటయ్య, సోమయ్యలు. సెంద్రెయ్య పేరుమీద కోసిన కోడి అది. కోడిని సాఫు చేసి వొండమని చెప్పిండు సిలుకమ్మకు. చిన్నపిల్లలు యేం జరుగుతందో అర్థం గాక మామిడి చెట్టు మీంచి రాలిపడిన పండ్లను యేరుకుంటండ్లు. మాష్కం చేత్తండ్లని తెలిసి పక్కూరి నుండి సుట్టాలు కూడా వొచ్చిండ్లు. సెంద్రెయ్య కొడుకు బుచ్చపతి, అతని భార్య మాష్కం కాడ అన్ని పనులు చేస్తండ్లు. పన్నెండు గంటలకు వొంటలన్నీ సిద్ధమయినయి. అప్పటి దాకా అక్కడునోళ్లు పచ్చినీళ్లు కూడా ముట్టలేదు.

ఆకలి అయితందని పిలగాండ్లు యేడుత్తండ్లు. యేడ్చీయేడ్చీ అందరి నోళ్లు యెండుకపోయినయి.

సరే, యిగ మోద్గాకు విస్తర్లో సెంద్రెన్నకు ముందు అన్నం, కూర పెట్టాలె. యింత కాల్లుసాగ ఆరబొయ్యాలే. యాట సెంద్రెమ్మకు కూడా యింత కూర, బువ్వ ఆ యిస్తర్లో పెట్టాలే అని పురమాయించిండు యెంకటయ్య.

సోమయ్య యిస్తార్లు తీసిండు. నేలమీద నీళ్లు పోసి, ఆ తడివున్న చోట వాటిని పెట్టిండు.

సిలుకమ్మ కూరగిన్నె, బువ్వగంజు తీసుకొచ్చి దాని ముందు పెట్టింది.

అందరూ వొచ్చి తలా పిడికెడు ఆ యిస్తార్లలో పెడుదామని చుట్టూ నిలబడ్డరు. యింటికి పెద్దోడు యెంకటయ్య కాబట్టి తనే తొలిముద్ద పెట్టాలే.

వొంగి బువ్వగిన్నెలోని ముద్ద చేతిలోకి తీసుకున్నడు యెంకటయ్య. యెందుకో వొంగోనే తలెత్తి దూరంగా చూసిండు. మసకమసకగా ఒక వ్యక్తి నడుచుకుంటా వొత్తండు. భుజం మీద తువ్వాల, నెత్తిమీద యేదో మూట పెట్టుకొని వొడివొడిగా నడుత్తా వొత్తండు.

అతడే సెంద్రెయ్య. అదిగో సెంద్రెన్న వొత్తండు. అని ఆశ్చర్యంతో ఆనందంతో అటుదిక్కుకేలి చెయ్యిబెట్టి చూపిత్తా బోర్మని విలపించిండు యెంకటయ్య.

కాలుతోటి ఆ బువ్వగిన్నెను, కూరగిన్నెను తన్ని నేలపాలు చేసిండు యెంకటయ్య.

అటుకేలి చూసిండు నీళ్లు నిండిన కండ్లతో సోమయ్య.

సెంద్రెయ్య యెన్కనే యెల్లకోడె కూడా అంబా అని అరుచుకుంటా దబాదబా నడుత్తంది. యిన్ని రోజులుగా తప్పిపోjయిన యెల్లకోడెను దూరం నుంచి చూసిన గొడ్లు దానికి యెదురు బోయినయి.

సెంద్రెయ్యను అమురుకోను పిల్లగాండ్లు ఎదురు వురికిండ్లు.

యెంకటయ్య, సోమయ్యలిద్దరూ సెంద్రెయ్య రాంగనే మీదపడి బోర్మని యేడ్చిండ్లు. నీయవ్వ, నువ్వు సచ్చిపోయి వుంటవని యియ్యాల్నే మాష్కం పెడుతున్నమే అన్నడు కండ్లు తుడచుకుంటా యెంకటయ్య.

తమ్ములను పట్టుకొని పసిపిల్లగానిలా ఏడ్చిండు సెంద్రేయ్య. నేనెందుకు సత్తరా. మీరందరున్నంక నాకేమైతదిరా అన్నడు. కొడుకు ఎంకటేష్ ను ఎత్తుకొని ముద్దులు పెట్టిండు. చాలారోజులకు తండ్రిని చూసిన ఏడేళ్ల ఎంకటేషు నవ్వుతూ అల్లుకున్నాడు.

మా బావ బతికొచ్చిండు. యాట సెంద్రెమ్మా, నువ్వు వున్నవు తల్లీ. నీకు పెద్ద యాటపోతును కోత్తం అని చేతులెత్తి మొక్కిండ్లు ఆడోళ్లు.

*

జిలుకర శ్రీనివాస్

10 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • కథ సన్నివేశం బాగుంది. ఆత్మ కథ లా సాగుతోంది. .. ఇంకా కొంచెం పెంచితే నవల లక్షణం ఉంది. అటు ఎల్లకొడే ఇటు సెంద్రయ్య ను కాంపర్ చేస్తు కథ నడిపిన తీరు బాగుంది. అనుభవం తో సాగిన కథా కథనం శైలి శిల్పం బాగుంది. డ్రామా టిక్ రచన. ఇంతకు మునుపు నేను చదివిన సభా గారి రైతు – సైనికుడు సీమ కథ స్ఫురణకు తెస్తుంది. కాని అదివెరే కథా. ఇక్కడ ఎలకొడే ను సెంద్రయ్యను ఇద్దరిని కాంపెర్ చేయడం ముగింపులో ఇరువురు రావడం అద్భుతంగా అనిపించింది. మాంచి నాటు కోడి కూర వండి పెట్టిన జిలుకరకు జై భీమ్ లు…
  నాకైతే బైండ్ల సెంద్రయ్యా కథలు సంకటి తిన్న రుషి కొడుతుంది … జయహో ….

 • ఎల్లకోడె అసొంటి సెంద్రయ్య, సెంద్రయ్య అసోంటి ఎల్లకోడె ఒక్కసారే మల్లంపెల్లి చేరుడు కథ సుఖాంతం అయ్యింది. ఇద్దరూ పౌరుషమంతులు!

 • జనారణ్యంలో ఒకరికొకరు తోడుగా బతికే మనుషులకి జంతువులకి వుండే బంధాలు, అనుబంధాలని బహుశా అవి అనుభవించిన వాళ్ళకే తెలుస్తాయి. ఆనాటి ప్రేoచంద్, సభాల నుంచి .. నేటి రాజయ్య,జిలుకరల దాకా ఆ పేగుబంధం గురించే రాసారు, రాస్తున్నారు. ఈమధ్య కేశవరెడ్డి ‘మునెమ్మ’, పెద్దింటి అశోక్ ‘మాయిముంత’ దాకా ఈ అనుబంధమే కథలు రాయించింది.
  మోహం, జ్ఞ్యానం అంటే ఏమిటీ అనేవి శేషప్రశ్నలే. వీటిని స్పృశించే ఈ కథ బుధ్ధ పూర్ణిమ నాడు రావడమే విశేషం. బుద్ధుడు( బీసీ623) మార్క్స్ (AD 1818) ల మధ్య 2300 ఏళ్లకు పైబడి కాలవ్యవధి వున్నా , ఈ ఇద్దరూ ఈ అనంత అన్వేషణ కొనసాగించార . ఫ్రాయిడ్, మార్క్స్ , అంబేడ్కర్ లని చదివినందువల్లే ఈ కథలోని ఘటనల (యెల్లకోడె, సెంద్రెయ్యలు ఊరిడిచి తిరిగొచ్చిన సందర్భాలు) గతితర్కాన్ని ఇంత బాగా రాశాడనిపిస్తోంది.
  8 భాగాల ఈకథ చదువుతున్నంతసేపు పాఠకులు ఎంతో ఉత్కంఠకు లోనవుతారు. సెంద్రయ్య ఇప్పుడు నేలతల్లి కథలు చదివే పాఠకుల ఇంటిమనిషి అయ్యాడు. వస్తు శిల్పాల అద్భుత మేళవింపే జిలుకర శ్రీనివాస్ రాసిన ఈ కథ. అభినందనలు

 • ఇల్లు వదలి వెళ్లిన మనిషిని , పౌరుష మోహంతో దారితప్పిన కోడెనూ సమాంతరంగా కథ చెప్పడం మంచి టెక్నిక్ . చాలా ఖాళీని రసరమ్యంగా అల్లడం .జిలుకర శ్రీనివాస్ పరిణితి , కథనంలో స్పష్టంగా కనిపిస్తుంది . అసలు లెక్కలోకే రాని సమూహాల వీరగాధలు అక్షరాలలోకి ఎక్కిస్తున్న యీ కథలు పురా ధిక్కారగాధలు . అభినందనలు.
  మొదట అఫ్సర్ కు చెప్పాలి .. అభినందనలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు