మహాభారత యుద్ధం ముగిసింది. యుద్ధమంటే విధ్వంసమూ, జనక్షయమూ. ‘పదునెనిమిదియక్షౌహిణులు సమసెఁ బితామహపితృ భ్రాతృపుత్రపౌత్రసఖి సుహృత్సహాయులుందెగిరందు‘ – పద్దెనిమిది అక్షోహిణుల సైన్యమూ, తాతలు, తండ్రులు, కొడుకులు, మనుమలు, అన్నదమ్ములు, స్నేహితులు, సహచరులు అందరూ అందులో చనిపోయారు. ‘పిన్నలు పెద్దలనక సకల పౌర లోకంబులకు శోకంబావహిల్లినం బెల్లైన రోదన ప్రణాదంబుల దిక్కులు పిక్కటిల్లెఁ బ్రళయకాల జ్వలనజ్వాలలం బొదువంబడు జంతువులాక్రోశించు చందంబు దోచె’ – పిల్లలు, పెద్దలు అనే తేడాలేకుండా పురజనులు అందరూ శోకంతో రోదిస్తుంటే, దిక్కులు పిక్కటిల్లాయి, ప్రళయకాల జ్వాలలలో దహించుకుపోతూవున్న జంతువులు ఆక్రోశిస్తున్న రీతిలో దుఃఖం ఆవహించింది.
మహాభారతంలో స్త్రీ పర్వాన్ని కరుణరస ప్రధానమైనదిగా చెబుతారు. ఒకవిధంగా దానిని యుద్ధ వ్యతిరేక ప్రకటనగానూ చదువుకోవచ్చు. యుద్ధ బీభత్సం, విషాదం, శోకం, వైరాగ్యం, యుద్ధనీతిని ఉల్లంఘించడం పట్ల ఆగ్రహపూరితమైన ప్రశ్నలు అన్నీ అందులో మనకు కనిపిస్తాయి. ధృతరాష్ట్రుడు, గాంధారి, దుర్యోధనుడు, ధర్మరాజు, కృష్ణుడు అందరూ ఈ యుద్దానికి, వినాశనానికి బాధ్యులేనన్న చర్చలు వినిపిస్తాయి. స్త్రీ పర్వం ద్వితీయాశ్వాసంలో యుద్ధానంతర దృశ్యం హృదయ విదారకమైనది.
కుత్తుకలబంటి యగునెత్తురులు దోయిళుల
నెత్తి చవి గ్రోలుచును జిత్తములు దృప్తిన్
జొత్తిలి నితాంత మదమత్తములుగాఁ జటుల
నృత్తములు సేయుచు జలత్తనువికారో
ద్వృత్త పటుహాసముల రిత్త లగు దుర్వచన
వృత్తులను నొండొరుల నెత్తికొని మాంసం
బత్తి తినుటన్ వికట వృత్తులగు రాక్షసుల
మొత్తము పరిక్షుభిత చిత్తత యొనర్పన్
ప్రేవులు గండలు పెఱికి పేటాడి యంగదఁ గొని మెదళు లగల్చికొనుచు
రాగిలి రక్తంబు ద్రావుచు లోచన గుళికలనొలిచి మ్రింగుచును గుండె
కాయ లాదట మెయి గబళించుచును గ్రొవ్వు తెమలిచినమలుచు నెముక యూట
చవి గొనుచుఁ జావక యున్న రూపులు సచ్చుటకుఁ గాఁగ బెలుచఁ దన్ని
కొనిన వెఱఁ బాయబాఱుచుఁ జెనకి తొడరి
కాటులాడుచు నున్న సృగాలములును
గాకములు రాపులుఁగులును గ్రద్దలును వృ
కంబులును మానసము వికలంబు సేయ
తనివితీరా తృప్తిగా దోసిళ్ళతో పీకలదాకా నెత్తురు తాగుతూ, ఎడతెగకుండా గంతులు వేస్తూ, వికారమైన, అతిశయపు ప్రేలాపనలతో, బూతులతో, మాంస భక్షణతో వెర్రెత్తిన రాక్షస సమూహం భయం గొల్పుతూ ఉంది. ప్రేగులు, కండలు పీక్కొని తింటూ, మెదళ్ళని పెకలించి, ఆబగా రక్తం తాగుతూ, కనుగుడ్లని ఒలుచుకొని, శరీరాలనుండి గుండెలని కబళిస్తూ, కొవ్వు నములుతూ, ఎముకలలో మూలుగని జుర్రుకుంటూ, చనిపోకుండా ఇంకా ప్రాణాలతో తన్నుకొంటున్న వారి దేహాల కోసం కాట్లాడుకుంటున్న నక్కలు, తోడేళ్ళు, ఎగురుతూ ఉన్న కాకులు, రాబందులు, గద్దలు వికలం చేస్తున్నాయని తిక్కన వర్ణిస్తాడు.
స్త్రీ పర్వంలో పొగిలిపోయే దుఃఖం మనచేత కన్నీళ్ళు పెట్టిస్తుంది. ఒక్క గాంధారి శోకమే కాదు, ఇతర స్త్రీలు కూడా ధర్మరాజును నిలదీస్తారు. ‘ఈ ధర్మరాజుకు ధర్మం, దయ అసలు ఉన్నాయా? తండ్రులను, మామలను, తాతలను, కొడుకులను పొట్టనబెట్టుకున్నాడు. విద్యనేర్పిన గురువులను క్రూరంగా చంపివేశాడు. స్నేహితులను, బంధువులను చంపాడు, దయలేని వాడు అని కొందరు నిందించారు. అర్జునుడు ముఖం దించుకుని పోతుండగా, భీష్ముణ్ణీ, ద్రోణాచార్యుడినీ చంపడానికి ఎట్లా సాహసించావు? గాంధారి కుమార్తె, నీ చెల్లెలు దుస్సల భర్త సైంధవుడినీ చంపావు, ఏమిటీ మీరు సంపాదించిన రాజ్యం అని ఈసడించారు. ఇంకా ధర్మరాజుని చూసి, ‘ఇంతమందిని చంపానని గర్విస్తున్నావా, నీ భార్య ద్రౌపది కొడుకులనీ, అభిమన్యుడినీ పొట్టనబెట్టుకున్నావు? ఇంకా నీకు వైభవం ఏముంది?‘ అని ప్రశ్నిస్తారు.
మహాభారతంలో యుద్ధ పంచకానికి – భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక పర్వాలకి- తదనంతర పర్వమైన స్త్రీ పర్వంలోని విలాపం సహజమైన, తార్కికమైన ముగింపు. ఎడతెగని దుఃఖం లో కౌరవ పక్షం, గెలిచినా అనుభవించే వారసులు లేరన్న చింతలో, బంధు, మిత్ర వినాశనంతో గెలిచిన సంతోషం దక్కని పాండవ పక్షం. యుద్ధంలో అందరూ హతులయ్యాక మిగిలింది స్త్రీలు. ఆ స్త్రీల విలాపమే స్త్రీ పర్వం. ఆ విలాప, శాప సన్నివేశమొక యుద్ధ వ్యతిరేక ప్రకటన.
ఆధునిక చైతన్యంతో మహాభారత కథనీ, పాత్రలనీ పరిశీలించిన అనేక వ్యాఖ్యానాలు, కథనాలూ వచ్చాయి. యుద్ధాల అనుభవంతో ఆధునిక యుగపు ఆలోచనలతో ఒకరు, దానిని పొడిగించి, అణగారిన వర్గాల విమర్శనాత్మక కోణం నుంచి మహాభారత యుద్ధానంతర సన్నివేశాలనీ, ఘటనలనీ అద్భుతంగా దృశ్యీకరించిన మరొకరు – ఇద్దరు రచయితల సృజన గురించి ఇక్కడ ప్రత్యేకించి ప్రస్తావించుకోవాలి.
ఒకరు, కువెంపు పేరుతో సుప్రసిద్ధుడైన కన్నడ కవీ, రచయితా, నాటకకర్తా, విమర్శకుడూ అయిన కుప్పల్లి వెంకటప్ప పుట్టప్ప 1931లో స్మశాన కురుక్షేత్రం నాటకాన్ని రాశారు. మొదటి ప్రపంచ యుద్ధానంతరం 1931లో రాసిన నాటకం ఇది. ఇక రెండవ వారు, తెలుగు పాఠకులకి పరిచయం అవసరం లేని బెంగాలీ రచయిత మహాశ్వేతా దేవి 1999-2000 సంవత్సరాల మధ్య – కుంతీ ఓ నిషాది (కుంతి ఒక నిషాద మహిళ), పంచకన్య, సౌవలి అనే మూడు కథలు రాశారు. ఇవి కూడా మహాభారత యుద్ధానంతర సంఘటనలు, సన్నివేశాలనుంచి సృజించిన కథలు. మహాభారత యుద్ధ నేపథ్యాన్ని వస్తువుగా తీసుకుని ఇద్దరు గొప్ప రచయితలు, ఆధునిక దృక్పధంతో, నూతన చైతన్యంతో లేవనెత్తిన ప్రశ్నలు మనల్ని యుద్ధాల గురించి, యుద్ధానంతర దృశ్యాల గురించీ పునరాలోచింపజేస్తాయి.
II
‘స్మశాన కురుక్షేత్రం ‘ కువెంపు నాటకం
కువెంపు స్మశాన కురుక్షేత్రం నాటకాన్ని ప్రారంభించడమే ఈ మాటలతో ప్రారంభిస్తారు. ‘ఇదొక రూప సృష్టి. యుద్ధంలోని విషాదం, అన్యాయం, క్రూరత్వం, విధ్వంసం, మూర్ఖత్వం, క్రూరమైన విధి, సార్వత్రిక వైఫల్యం, సంస్కృతి మరణం – ఇవన్నీ దాని రూపాలు. ఏ యుద్ధమైనా ప్రారంభమైనప్పుడు, అది ప్రపంచంలో యుద్ధాన్ని అంతం చేసే అనివార్యమైన ఉపశమనమని విశ్వసిస్తాము. అన్ని అన్యాయాలు అన్నీ తొలగిపోతాయనీ, న్యాయ స్థాపన జరుగుతుందనీ భావిస్తాము. కలియుగం ముగిసి కృతయుగం ప్రారంభమౌతుందని అనుకుంటాం. కానీ? మళ్ళీ! గొప్పదనం, ప్రత్యేకత కోసం కోసం సామాన్యులు ఆహుతి అవుతారు. సంస్కృతి, నాగరికత, ప్రగతి, సర్వమూ స్మశానంలో రుద్రునికి లేపనమైన బూడిద కుప్పలౌతాయి. సరే,పునఃసృష్టి ప్రారంభమౌతుంది. తిరిగి నాటకం మొదలౌతుంది. విశ్వలీల కొనసాగుతుంది.’
నాటకంలో మొత్తం పది సన్నివేశాలు (సీన్స్) ఉన్నాయి. మొదటి సన్నివేశంలో ద్వాపర దేవుడు, కలిపురుషుడు కలుసుకుంటారు. (కురుక్షేత్ర యుద్ధాన్ని ద్వాపర యుగం ముగిసి కలియుగారంభానికి నాందిగా చూస్తారు). ఇద్దరి మధ్యా సంభాషణ. చివరగా, ద్వాపరదేవుడు నిట్టురుస్తాడు, ‘ఇది పరాక్రమశాలుల రణోత్సాహానికి ప్రతిఫలం. మహావీరుల రణోన్మత్తతతో వెలిసిన స్మశానం. మహాభారత యుద్ధభూమే ఈ కురుక్షేత్ర స్మశానం. మహా యోధుల యుద్ధం నుంచి, విజయం నుంచి ఉద్భవించినదీ స్మశానం. శవాల గుట్టలమీద నిశాచరులు సంచరించే స్మశానమీ కురుక్షేత్రం.’
రెండవ సన్నివేశంలో ఒకవైపు కురుక్షేత్ర స్మశానంలో ముగ్గురు సేవకులు, గీర్వాణుడు, నీలాక్షుడు, చాణూరుడు తమ యజమానులు శవాలకోసం వెదుకుతూ ఉంటారు. యుద్ధంలో మరణించిన శవాల మధ్య బాణాలు అడుగడుగునా కాళ్లకు గుచ్చుకుంటున్నాయి. ఇది నరసంహార స్థలమా, రణరంగమా? అని తలపోస్తూ ఉంటారు. భయంకర వినాశనానికి నెలవైన ఈ సమరరంగం, యుద్ధం జరిగినప్పటికంటే, స్మశానంగా మారిన తర్వాత మరింత భయం గొల్పుతుందని అనుకుంటారు. మరొకపక్క, కురుక్షేత్ర యుద్ధరంగంలో పాండవుల పక్షాన నేలకొరిగిన తన భర్త శవం కోసం, బిడ్డతో కలిసి వెదుకుతున్నదొక మనిషి. బిడ్డ ఒక శవాన్ని చూసి అది ఎవరని తల్లిని అడుగుతుంది. ‘అతనిక ఎవరికీ తండ్రి కాడు, ఎవరికీ భర్త కాడు, ఎవరికీ ఇక బంధువు కాడు, ఎవరికీ మిత్రుడు కాడు, శత్రువూ కాదు. ఎవరికీ ఇక అన్న కాడు, తమ్ముడూ కాదు.. అతనొక పార్థివ దేహం, స్మశానంలో కుళ్లిపోయే శవం.’ అని తల్లి సమాధానం చెబుతుంది.
మూడవ సన్నివేశంలో ఒక పక్క రెండు భూతాలు కురుక్షేత్ర స్మశానంలో సంచరిస్తూ సంభాషించుకుంటాయి. మరొకవైపు ఒక ముసలి తల్లి, కృష్ణుడు, విదురుడు ఉంటారు. దుర్యోధనుడిది ఓటమీ కాదు, భీమసేనుడిది గెలుపూ కాదని, ఇది మనుషుల మధ్య యుద్ధమనీ, ఇందులో తమకు స్థానం లేదనీ, కురుక్షేత్ర యుద్ధం భూతాలకే భీతిగొల్పే భయానక యుద్ధమనీ భూతాలు చర్చించుకుంటాయి. మనుషులని ఈసడించుకుంటాయి. మరొకవైపు, ఇంటికి తిరిగిరాని తన కొడుకు నారాయణ కోసం వెదుక్కొంటూ కురుక్షేత్రానికి వచ్చిన ముసలి తల్లి, యుద్ధరంగం స్మశానంగా మారిన విషయాన్ని గుర్తిస్తుంది. కృష్ణుడూ, విదురుడూ ఆమెకు తారస పడతారు. కృష్ణుడు ఆ ముసలి తల్లికి నారాయణ కోసం ఆ దిశలో చూడమని చెబుతాడు. ఆ తర్వాత, కృష్ణుడు, విదురుల మధ్య నీతి, పాపం, సన్మార్గం మొదలైనవాటిపై చర్చ జరుగుతుంది.
నాలుగవ సన్నివేశంలో, ధృతరాష్ట్రుడు, గాంధారి సంజయునితో కలిసి, చావుకు సిద్ధంగా ఉన్న దుర్యోధనుడిని చూడాలని కురుక్షేత్రానికి బయలుదేరుతారు. ఆ నిశ్శబ్ద రాత్రి మృత కళేబరంలా, కురుక్షేత్ర స్మశానం భయపెట్టేలా ఉండడాన్ని సంజయుడు గుర్తిస్తాడు. దుర్యోధనుడి భార్య భానుమతి, తన చెలులతో వారినే గమనిస్తూ ఉంటుంది.
ఐదవ సన్నివేశం విలక్షణమైనది. ఇందులో ధర్మరాజు, భీముడు, అర్జునుడు, ద్రౌపది, ఒక సైనికుడు కనిపిస్తారు. అన్నదమ్ముల మధ్య చర్చ జరుగుతుంది. హింస, వినాశనం లేకుండా ధర్మాన్ని నెలకొల్పలేమా అని అర్జునుడు అడుగుతాడు. భీమసేనుడు మంచి, చెడుల గురించి వివరిస్తాడు. అంతలో ఎవరిదో దాహంతో నీటికోసం అలమటిస్తున్న గొంతు ఎవరిదో వినిపిస్తుంది. అర్జునుణ్ణి నీరు తీసుకురమ్మని ధర్మరాజు ఆదేశిస్తాడు. ముందు ఆ మనిషి పాండవుల పక్షమా, కౌరవుల పక్షమా తెలుసుకోవాలని భీముడు పట్టుబడతాడు. స్మశానంలో మృత్యు సన్నిధిలో అటువంటి వైఖరి క్రూరత్వమని ధర్మరాజు అంటాడు. అలాంటప్పుడు, నీతి బాహ్యంగా గదా యుద్ధంలో దుర్యోధనుని తొడలపై కొట్టిన చర్య క్రూరత్వం కాదా అని భీముడు ప్రశ్నిస్తాడు. అంతలో, అర్జునుడు తెచ్చిన నీళ్లను తాగిన సైనికుడు ఆ నీళ్ళు పాండవుల చేతినుంచి తాగినవని గుర్తించి, అలా తాగడంద్వారా కౌరవ చక్రవర్తికి ద్రోహం చేసిన వాడినయ్యానే అని చింతిస్తాడు. ఈ సన్నివేశం ధర్మాధర్మాలు, క్రూరత్వం గురించి అనేక ప్రశ్నలని లేవనెత్తుతుంది.
ఆరవ సన్నివేశంలో దుర్యోధన, శ్రీకృష్ణుల మధ్య సంవాదం. ఈ చర్చని మనం మహాభారత శల్యపర్వంలో చూడవచ్చు. వైశంపాయన సరోవర తీరాన, భీముని గదాఘాతంతో తొడలు విరిగిన దుర్యోధనుడు. చనిపోబోతున్న దుర్యోధనుడిని అశ్వత్థామ కలుసుకుంటాడు. మిత్రుడు కర్ణునితో పాటు తనని దహనం చేయమని దుర్యోధనుడు కోరతాడు. సాగనంపడానికి ద్వాపరదేవుడు తోడు వస్తాడు. భారత యుద్ధానికి కారణం కృష్ణుడనీ, అధర్మ యుద్ధమే కౌరవుల ఓటమికి కారణమనీ దుర్యోధనుడు అంటాడు. భీష్మ, ద్రోణ, కర్ణుల హత్య, గదా యుద్ధంలో తనపై దెబ్బ తీసిన విధానం అన్నీ అధర్మమని అంటాడు. ధర్మాన్ని ఉల్లంఘించింది పాండవులు కాగా, దుర్యోధనుడిదే అధర్మమని నిందిస్తున్నారని బాధపడతాడు. అప్పుడు అక్కడ కృష్ణుడు ప్రత్యక్షమౌతాడు. పాండవులకు దక్కాల్సిన వాటాని దక్కకుండా నిరాకరించి, అధర్మానికి పాల్పడడం వల్లనే యుద్ధం జరిగిందని కృష్ణుడు సమాధానం చెబుతాడు. ఈ లోగా సంజయుడు, ధృతరాష్ట్ర, గాంధారులను వెంటబెట్టుకుని దుర్యోధనుడి దగ్గరకు చేరుకుంటాడు. వారందరూ దుర్యోధనునిపైబడి విలపిస్తారు.
ఏడవ సన్నివేశంలో కుంతి కర్ణుడికై విలపిస్తుంది. ఈ ఘట్టం స్త్రీ పర్వంలో కనిపిస్తుంది. కురుక్షేత్రంలో విదురునితో కృష్ణుడు, కౌరవేంద్రుని గురించి మాట్లాడుతున్న సమయంలో కుంతి సహదేవునితో కలిసి అక్కడకు వస్తుంది. కుంతి యుద్ధరంగంలో ఒరిగిన కర్ణుణ్ణి వెదుక్కుంటూ కురుక్షేత్రానికి వస్తుంది. కర్ణుడి చావుకు తానే కారణమైన వైనాన్ని తలచుకుంటూ సుదీర్ఘంగా విలపిస్తుంది.
ఇక ఎనిమిదవ సన్నివేశం, అంతకుముందు రెండవ సన్నివేశంలో భర్తకై వెదుకుతున్న స్త్రీ మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది. అక్కడ ఒక వృద్ధురాలు కూడా తన కొడుకు కోసం వెదుకుతున్నది. మొదటి స్త్రీ భర్త పాండవుల పక్షాన యుద్ధంలో చనిపోగా, వృద్ధురాలి కొడుకు కౌరవుల పక్షాన పోరాడి చనిపోయాడని తెలుస్తుంది. ఇద్దరికీ ఒకరినొకరు చంపుకోవాల్సిన అవసరం గానీ, కారణం గానీ లేవు. తమ రాజుల కోసం యుద్ధంలో చనిపోయారు ఇద్దరూ. నీ కొడుకు నాభర్తకి శత్రువా అని మొదటి స్త్రీ అడుగుతుంది. ఇద్దరి మధ్య శత్రుత్వమేమున్నది? మనలాంటి పేదవాళ్ళు వట్టి మూర్ఖులు. కౌరవులు, పాండవులు భూమి కోసం కొట్లాడుకుంటే, మనవాళ్ళు ఇద్దరూ చెరొక పక్షాన చేరి యుద్ధంలో చనిపోయారు. మన ఇద్దరిదీ ఒకే దుఃఖం అని ముసలి తల్లి సమాధానం ఇస్తుంది.
తొమ్మిదవ సన్నివేశం, ధర్మరాజు, భీముడు, అర్జునుడు పాండవ సైన్యానికి అంత్యక్రియలు జరిపే సన్నివేశం. అంతలో కుంతి సహదేవుడు తోడుగా కర్ణుని శవాన్ని తీసుకుని అక్కడకు వస్తుంది. పాండవ పక్షంలో చనిపోయినవారిలో పాటు కర్ణుని అంత్యక్రియలు జరిపించమని కుంతి ప్రాధేయపడుతుంది. కర్ణుడు వైరిపక్షానికి చెందినవాడని పాండవులందరూ నిరాకరిస్తారు. కర్ణుడు, కుంతి కొడుకేనని, పాండవాగ్రజుడౌతాడనీ సహదేవుడు వివరిస్తాడు. కృష్ణా, నువ్వు అబద్ధమాడి కర్ణుని నాతోనే చంపించావు కదా అని అర్జునుడు అడుగుతాడు.
ఆఖరు, పదవ సన్నివేశంలో రుద్రుడు, కృష్ణుడు పాత్రధారులుగా, సూత్రధారులుగా ప్రత్యక్షమౌతారు. ప్రతీదీ స్మశానంతోనే ముగిసిపోతుందనీ, చనిపోయాక అందరినీ స్మశానానికి తీసుకురావడంతో, తేడాలు అన్నీ తొలగిపోతాయనీ రుద్రుడు అంటాడు. మళ్ళీ ఇంకొక నాటకం ఎప్పుడని రుద్రుడు అడిగితే, కలియుగంలోనని కృష్ణుడు సమాధానం చెబుతాడు.
ధర్మాధర్మాల పట్ల రెండు పక్షాల వాదనలనీ, యుద్ధంలో వినాశనాన్నీ కురుక్షేత్ర స్మశాన వేదిక ముందుకుతెస్తుంది. తండ్రులు, కొడుకులు, అన్నదమ్ములు, బంధువులు, స్నేహితులు, అమాయకులు అందరూ యుద్ధంలో చనిపోతారు. ధర్మం పేరిట జరిగిన యుద్ధం ఎడతెగని శోకాన్ని మిగిలిచింది. స్మశాన కురుక్షేత్రం నాటకంలో, అత్యధిక (పదింట ఏడు) సన్నివేశాలలో స్త్రీలు బాధితులుగా, ప్రశ్నించే పాత్రలుగా ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఇది యాదృచ్ఛికమని అనుకోలేము. ఏ యుద్ధంలోనైనా బాధితులు ముఖ్యంగా స్త్రీలేనన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటే, ఆ నాటకంలో స్త్రీల గొంతుకు ఉన్న విశిష్టత అర్ధమౌతుంది. దాదాపు తొంభైఐదు సంవత్సరాల క్రితం రాసిన ఈ నాటక ప్రదర్శనలు యూట్యూబ్ లో చాలా కనిపిస్తాయి. ఇది తప్పకుండా చూడాల్సిన నాటకం.
వచ్చే సంచికలో:
కురుక్షేత్ర యుద్ధం తర్వాత – మహాశ్వేతా దేవి కథలు మూడు
Add comment