మలయాళీ కవి అక్బర్ కేరళలోని ఎర్నాకులంలో పుట్టి పెరిగారు. ఇప్పటి వరకు వీరి కవితా సంపుటులు మూడు ప్రచురితమయ్యాయి. వీరి కవితలు వివిధ మలయాళీ పత్రికల్లో, అనువాద కవిత(లు) ఇండియన్ లిటరేచర్ పత్రికలో అచ్చు అవడం విశేషం. వీరి కవితలు ఇంగ్లిష్, హిందీ, తమిళం, తెలుగు భాషలలోకి తర్జుమా అయ్యాయి.
*
ప్రపంచంలోని పిల్లలందరూ చనిపోయినట్టు
ఈ ఉదయం పూట కలగన్నాను
నా పెరడులోని మల్లెలన్నీ
పరిమళం లేకుండా పూశాయి
అలసిన నా కన్నులను
నులుముకుని చూద్దు కదా,
మా పిల్లల గదిలో చిన్నారులు లేరు!
పొద్దున వచ్చిన కలను నెమరు వేసుకున్నాను
యుద్ధాల మధ్య ఆడుకుంటున్న
పిల్లలు జ్ఞాపకానికి వచ్చారు
వాళ్లమీద పడుతున్న అగ్నిగోళాలు
ఇంకా నన్ను దుఃఖానికి గురి చేస్తున్నాయి
పూర్వం కేకలతో పరుగెత్తిన నా పదాలు
ఇప్పుడు బలహీనమై మసకబారుతున్నాయి
నేను యూక్రేన్, పాలెస్తీనా,
యాజిది, ఇజ్రాయెల్, సోమాలియా
దేశాల పిల్లల్ని తల్చుకున్నాను
వాళ్లందరూ నా కళ్ల ముందే మరణించారు
భయం నాలో తలెత్తుతుంటే
నా పిల్లలకోసం అన్ని గదుల్లో,
ప్రాంగణాల్లో వెతికాను
వారి చిరునవ్వు ముఖాలు ఎకాయెకిన
రక్తం అంటిన జ్ఞాపకాలుగా మారిపోయాయి
నా ఫోన్ మోగింది
తీవ్రమైన భయంతో సమాధానమిస్తూ సంభాషించాను
అబ్బా జాన్!
మేమిక్కడ యుద్ధం ఆడుకుంటున్నాం, అన్నారు వాళ్లు
ఎక్కడ, అని అడిగాను
పిల్లల ప్రపంచంలో, అని ఫోన్ పెట్టేశారు
ఔను,
పిల్లల ప్రపంచంలో బాధలుండవు కదా!
ఒక మరతుపాకీని చేత్తో పట్టుకుని
పొరుగు ప్రాంగణంలోకి గురి చూసి
ట్రిగ్గర్ నొక్కాను
మల్లెపూలు నేలకొరిగాయి
మలయాళీ మూలం: అక్బర్
ఆంగ్లానువాదం: అరుణ్ టి. విజయన్
***
thanks
చాలా చక్కగా వ్రాసారు.నేను చదువు వున్నప్పుడు అంతా నాకాళ్ళు ముందు జరిగినట్టు అనిపించింది.