యుద్ధం శరణం గచ్చామి!

రెండుదేశాల ప్రజలూ సరిహద్దుల్ని చేరారు. యుద్ధం దేశభక్తి కాదని మూకుమ్మడిగా తీర్మానం చేశారు.

ఆజాదీ!

“కాశ్మీరు భారద్దేశంలో అంతర్భాగం”

“కాని… కాశ్మీరు ‘ఒకానొక దేశము’ అని…”

“ఎవరన్నారు?”

“వావిళ్ల వారూ- బహుజనపల్లి సీతారామాచార్యులూ- బ్రౌణూ- శంకరనారాయణా- జి.ఎన్. రెడ్డీ అంతా అలానే రాశారు”

“వేర్పాటువాదులూ కమ్యూనిష్టులూ చేసిన ద్రోహం దుష్ప్రచారం”

“కాదండీ… వీరంతా భాషా శాస్త్రవేత్తలు”

“కాశ్మీరు ‘ఒకానొక దేశము’ అని అన్నా- రాసినా- వారంతా వుగ్రవాదులే, వారందరినీ తొందరలోనే కేంద్ర నిఘా సంస్థలు అదుపులోకి తీసుకుంటాయి. వారికి వారు ‘ఒకానొక దేశము’ అని అనుకుంటే కోరుకుంటే కుదరదు…”

“నేను చెప్పిన వాళ్ళంతా యిప్పుడు లేరు…”

“అండర్ గ్రౌండుకు వెళ్ళిపోయారా- భయపడి?”

“కాదండీ చనిపోయారు…”

“ప్రభుత్వం ఎన్కౌంటర్ చేసిందంటారు… తప్పులేదు…”

“అయ్యో… అదికాదండీ…”

“మీరింకేం మాట్లాడొద్దు. దేన్నయినా భరిస్తాం కాని దేశభక్తి లేకపోవడాన్ని మాత్రం భరించలేం. మీలాంటివాళ్ళు యిక్కడ వుండడానికి మేం వొప్పుకోం. పాకిస్తాన్ పొండి”

“నన్ను కాస్త మాట్లాడనిస్తారా?”

“నో… కాశ్మీరీలు పాకిస్తాన్తో కలుస్తామంటే మేం వొప్పుకోం. స్వతంత్రంగా వుంటామంటే- మాకు మేము వొక దేశం అని అంటే- మనమే కాదు, పాకిస్తానూ వొప్పుకోదు. దట్సాల్”

“అంటే… కాశ్మీరీల విషయంలో పాకిస్తానూ ఇండియా వొకటేనన్నమాట…?”

“దేశద్రోహీ…”   

అ‘శాంతి గీతం!’

వాఘా బార్డర్ దగ్గర ఐయ్యేయఫ్ కమాండర్ అభినందన్ని పాకిస్తాన్ భారతదేశానికి అప్పగించింది!

సరిహద్దు రేఖ గీసిన ముళ్ళకంచె మీద అంతదాకా వాలివున్న తెల్లని పావురాలు వుత్సాహంగా శాంతిగీతం ఆలపిస్తూ ఆకాశంలోకి యెగిరాయి!

ఆ మరుక్షణమే రెండువైపులా పేలిన తుపాకీ తూటాలకు నెత్తురు కక్కుకుంటూ పావురాలు మాంసపు ముద్దలై నేలరాలాయి!

‘మ్యాడ్’యా!

“నిన్ను విచారించాల్సిన అవసరం లేదు” అన్నారు ఫాక్ ఆర్మీ అధికారులు!

అభినందన్ ఆశ్చర్యపోయాడు!

సహకరించిన భారత్ మీడియాకు మరోసారి లోలోపల కృతజ్ఞతలు తెలిపారు సంబధిత అధికారులు!

అభినందన్!

అభినందన్ని అందరూ అభినందిస్తున్నారని- దేశమంతా సంబరాలు జరుపుకుంటున్నారని- టీవీల్లో వొకటే లైవ్ చూపిస్తున్నారు!

“నాన్నా పాకిస్తాన్ ఆర్మీని అభినందన్ వోడిన్చాడా?” అడిగాడు కొడుకు!

“బాంబుల వర్షం కురిపించడానికి వెళ్ళినవాడూ- శత్రువు చేతికి చిక్కినవాడూ- తిరిగి స్వదేశానికి రావడం యుద్ధంలో గెలవడం కంటే యెక్కువ” చెప్పాడు తండ్రి!

వీరుడి వోటమి!

నమ్మకానికీ అపనమ్మకానికీ మధ్య అతడు నలిగిపోతున్నాడు!

శత్రు పక్షం వాళ్ళకి చిక్కినాకనూ స్వదేశానికి తిరిగి వచ్చానాకనూ రెండు దేశాలదీ వొకే పరీక్ష?!

నార్కో అనాలసిస్ నామమాత్రపు సాక్ష్యమయితే కాదు!

‘బెనిఫిట్’ ఆఫ్ డౌట్!

“పాకిస్తాన్ని ఇండియా కబడ్డీ ఆడేసింది చూశావా?”

“హే… అది వీడియో గేమ్… యెప్పుడో చూస్నా, వైరలయింది… ఆ సౌండ్ ఎఫెక్టు పర్ఫెక్టుగా వుంది కదా?”

“ఓ… అదా సంగతీ, అందుకేనా ఆన్ చేస్తే ఆనయి- ఆఫ్ చేస్తే క్లోజయింది వార్…!?”

సమరమూ సార్వజనీనమూ!

“పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మానవతావాది, అభినందన్ని అప్పగించి యుద్ధానికి పొలిస్టాప్ పెట్టాడు”

“అందులో అతని గొప్పతనం యేమీ లేదు, యిక్కడిలా అక్కడ కూడా దగ్గర్లో ఎలక్షన్లు వుంటే అప్పుడు అసలు రంగు తెలిసేది”

“నిజమే, మనకిప్పుడు యుద్ధం చాలా చాలా అవసరం అనివార్యం!”

విశ్వమూ విశ్వాసమూ!

ఎప్పుడూ వెతికినట్టే యిప్పుడూ అభినందన్ది యే కులమని గూగుల్లో తెగ వెతికారు!

“బ్రాహ్మణుడు” అని తేలింది!

“అదీ సంగతి.. ‘బ్రాహ్మణ హత్య మాహాపాతకం’ అని వదిలేసి వుంటారు” నమ్మకంగా అనుకున్నారు కొందరు!

యుద్ధోన్మాదం!

“పాకిస్తాన్ పీచమణచాల్సిన యీ సమయంలో యుద్ధం వద్దని మనదేశంలో కొందరు బయల్దేరారు, వీళ్ళంతా వుగ్రవాదుల మద్దతుదారులు, వీళ్ళని వెంటనే జైల్లో వేయాలి”

“పాకిస్తాన్లో కూడా మానవ హక్కుల సంఘాలు, ఆస్మా జహంగీర్ లీగల్ ఎయిడ్ సెల్, బాండెడ్ లేబర్ లిబరేషన్ ఫ్రంట్, సౌత్ ఆసియా పార్టనర్ షిప్ పాకిస్తాన్, విమెన్ యాక్షన్ ఫోరం, అవామీ వర్కర్స్ పార్టీ… అంతా యుద్ధం వద్దని శాంతి ర్యాలీలు చేశారు”

“అక్కడి ప్రభుత్వం వాళ్ళని వెంటనే అరెస్టు చేయకుండా ఏం చేస్తున్నట్టు? నిద్రపోతున్నట్టా?”

డు నాట్ ఎరైజ్!

“దేశాల మధ్య బోర్డర్ లైన్ వుంటుంది, అట్నుంచి యిటు దాటినా యిట్నుంచి అటు దాటినా మిలట్రీ ఫైర్ ఓపెన్ చేస్తుంది” చెప్పింది తల్లి!

“నేను ఎరైజరుతో బోర్డర్ లైన్ చెరిపేస్తాను” అంది పాప!

పాప మాటకు పెద్దలు నవ్వారు! పెద్దల చేష్టలకు పాప నవ్వింది!

ద్వంద యుద్ధం!

“యుద్ధం క్రూరమైంది… ఘోరమైంది…” అన్నారు శర్మ మాష్టారు. ఆయనో మానవతావాది!

“ఔను, యుద్ధం క్రూరమైంది… ఘోరమైంది…” అదేమాట అన్నారు మహమ్మద్ భాషా మాష్టారు. ఆయనో ఉగ్రవాది!

శర్మ మాష్టారు అన్నమాట మీదే నిలబడ్డారు. భాషా మాష్టారు మాత్రం మాట తప్పారు. ‘పాకిస్తాన్ అంతు చూడాల’ని అన్నారు. లేకపోతే యుద్ధం బోర్దర్లోనే కాదు, మా బళ్ళోనూ వస్తుంది- అని మాకందరికీ తెలుసు!!

‘బాద్’డు!

“నోట్ల రద్దుతో ఉగ్రవాదం అంతమవుతుందన్నారు?”

“మరి యిదేమిటి?”

“జవాన్ల మీద జియ్యస్టీ!”

చౌకదార్!

“నేనీ దేశపు కాపలాదారున్ని… కుట్ర చేస్తున్నారు… నన్నెవరో చంపాలనుకుంటున్నారు… నన్నెవరో అంతం చెయ్యాలనుకుంటున్నారు…”

“కాపదారుడు యింత పిరికి సన్నాసిలా వుంటే దేశ ప్రజలకి ధైర్యం యెలా వస్తుంది?, అభినందన్లా వుండాలి”

“మీ మాటలు పాక్ రక్షణ కవచంగా వాడుకుంటోంది, ఉగ్రవాదులకు ఊతమిస్తున్నారు మీరు…”

యడ్యూరప్ప సాక్షిగా!

“యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వారికన్నా అభినందనుకు యెక్కువ పేరొచ్చింది”

“అభినందన్ అంటే తెలియని వాళ్ళు లేరు”

“బీజేపీలో అభినందన్ని తక్షణమే చేర్చుకోవాలని దేశభక్తులుగా మేం డిమాండ్ చేస్తున్నాం!”

ఎగ్జిట్ పోల్ – ఎగ్జాక్ట్ పల్స్!

“పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ చేపట్టిన ముందస్తు నిస్సైనిక దాడులు ఒక అలను సృష్టించాయి. రాబోయే లోక్ సభ ఎన్నికలలో 28 సీట్లలో 22 గెలుచుకోవడానికి అవి విశేషంగా తోడ్పడతాయి” యడ్యూరప్ప అన్నాడు!

కమలదళం ఖండించలేదు?!

కర్నాటక సంగతి సరే, ఏయే రాష్ట్రాలలో యెన్నెన్ని సీట్లు వస్తాయో లెక్కేసుకున్నారు మిగతా రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు!

రెడ్ ఆర్మీ విత్ బ్లడ్ ఆర్మీ!

భారత ఆర్మీకి రెడ్ సెల్యూట్ చేసింది భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ!

“మీ కమ్యూనిస్టు జెండా వచ్చి మా కాషాయం జెండాతో కలిసింది” ముఖం కమలంలా విరబూసింది వొక కవాతు చేస్తున్న భక్తునికి!

రేపటి ఎలక్షన్ ఎజెండా ఏమిటో తెలీకుండా- పొత్తులు అవకాశం పోగొట్టుకోకూడదనిగాని పార్టీ ఎత్తుగడ వేసిందేమో అని సరిపెట్టుకున్నాడు వొక సాదారణ కమ్యూనిస్ట్ కార్యకర్త!

ఎనిమిదో వింతలు!

“ఇరుదేశాల మధ్య శాంతికోసం అభినందన్ని వదిలేస్తున్నాం” పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించాడు!

“భారత్ దౌత్యం వల్లనే అభినందన్ని విడిపించుకోగలిగాం” చెప్పుకున్నారు భారతదేశ పెద్దలు!

“జెనీవా ఒప్పందం వల్లనే అభినందన్ విడుదల…” ఐక్యరాజ్యసమితిలోనూ కొందరు అనుకున్నారు!

“మా ఒత్తిడి వల్లే అభినందన్ తిరిగి తన దేశానికి చేరుకోగలిగాడు” అంది రష్యా!

“లేదు, మా ఒత్తిడి వల్లే అభినందన్ తిరిగి తన దేశానికి చేరుకోగలిగాడు” అంది అమెరికా!

అంతవరకూ ఉగ్గపట్టుకున్న ఎఫ్-16 పకపకా నవ్వింది. నిజానికి తనని కూల్చిన తొలి ఫైటర్ పైలెట్ అభినందనే!

మిగ్- 21 కూడా కూడా నవ్వింది. పాకిస్తాన్ మీదికి అభినందన్ వెళ్ళింది తన మీదే!

రెండు యుద్ధవిమానాలూ నవ్వుకోవడం చూసి అంతా విస్తుపోయారు. “వింత” అన్నారు!

“నన్ను తయారు చేసి అమ్మిన అమెరికాయే అభినందన్ విడుదలకు ఒత్తిడి చేయడం వింత కాదా?” అని ఎఫ్-16 పకపకా నవ్వి యేడ్చింది!

“నన్ను తయారు చేసి అమ్మిన రష్యాయే అభినందన్ విడుదలకు ఒత్తిడి చేయడం వింత కాదా?” అని ఎఫ్-21 పకపకా నవ్వి యేడ్చింది!

పొలిటికల్ పోలీసింగ్!

“పాక్ పై నిందలా?, జాతిని తప్పు పడతారా?” అని నవజోత్ సింగ్ సిద్దూ ప్రభుత్వాన్నీ ప్రజల్నీ వేరు చేసి మాట్లాడాననుకున్నాడు. కాని సోనీ యాజమాన్యం కపిల్ శర్మ షో నుండి సిద్దూని తొలగించింది!

“యుద్ధం వద్దు… యుద్ధం వల్ల నష్టమే తప్ప లాభం లేదు” అని హీరోషిమ నాగసాకిలను గుర్తు చేస్తూ కనక్ టీవీ డిస్కషన్లో మధుమిత రే శాంతిని కోరుకుంది. అంతే ఆమె ఉద్యోగమూ పోయింది!

“పాక్ తెలివైన దేశం” అని అభినందన్ని భారత్ కు అప్పగించినందుకు సందర్భంలో ఎఫ్బీలో కామెంట్ పెట్టారు ప్రొఫెసర్ సందీప్ వాథర్. పోస్ట్ తీసేసినా సదరు ప్రొఫెసర్ని మోకాలిపై కూర్చోబెట్టి క్షమాపణలు చెప్పించారు ఏబీవీపీ విద్యార్థులు!

“యుద్ధం వద్దన్న వాళ్ళంతా పాకిస్తాన్ సమర్ధకులే కాదు, ఉగ్రవాదులే” ఎందరో నెట్టు జన్లు తిట్టిపోశారు! ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేసి నలభైమందిని పొట్టన పెట్టుకున్నారని గుర్తు చేశారు!

“ఒక ఉగ్రవాది చర్య అనేకమంది ప్రాణాల్ని తీయడమే కాదు, అధికారాన్ని నిలిపే అవకాశాన్నీ యివ్వడమూ దుర్మార్గమే” అని పోస్ట్ పెట్టినవాడి అమ్మనూ ఆలినీ చేసి బూతులు తిట్టారు!

అయితే అవి బూతులు కావని, దేశభక్తిని తెలిపే జాతీయ గీతాలని కూడా సామాజిక విశ్లేషకులు సెలవిచ్చారు! 

సెన్సార్ చెయ్యని సైనికుడి ఉత్తరం!

ప్రియమైన నా దేశ ప్రజలారా!

మీలాంటి ప్రజలకు ఇన్నాళ్ళూ సరిహద్దుల్లో వుండి కాపలా కాస్తున్నానని భ్రమపడుతూ బతికేసినందుకు సిగ్గుపడుతున్నాను. మీ దేశభక్తిని బయట పెట్టుకోవడానికి మీరు యుద్ధాన్ని ఆహ్వానించిన తీరూ కాలుదువ్వుతున్న తీరూ చూస్తుంటే శత్రువుని చూసినప్పటి కంటే ఎక్కువ ఆవేశం కలుగుతోంది. నాకు మీ అందరి తరుపున ఆవేశకావేశాలకు పోవడంకన్నా నా ఊరు వెళ్ళి నా భార్యా బిడ్డల్ని కళ్ళనిండా చూడాలని వుంది. మీరనుకున్నట్టు నా తలో శత్రువు తలో నేల రాలడంకన్నా ఎవరి నేలలో వాళ్ళం సుఖ సంతోషాలతో వుండాలని ఆశగా వుంది.

నేను దేశభక్తితో ఆర్మీలో చేరలేదు. ఉద్యోగమనే చేరాను. ఉపాధిగానే చూశాను. క్షమించండి… నేను చనిపోతూ నా పిల్లల్ని సైన్యంలో చేరమని చెప్పలేను. నాకోసం కళ్ళల్లో వొత్తులు వేసుకు చూస్తున్న నా ముసలి తలిదండ్రులకు శవంగా దర్శనమివ్వలేను. నాభార్యని విధవరాలిని చేసి నీ కోడల్లనీ విధవరాలిని చెయ్యమని చెప్పలేను. సైనికుల పిల్లల్ని అనాధలుగా అస్సలు చూడలేను.

యుద్ధాలు లేని సరిహద్దులు లేని ఇరుగుపొరుగు ఇల్లుల్లా దేశాలు వుంటే బాగుణ్ణని వూహిస్తాను. గీతకు ఆవల ఈవల యిద్దరమూ మనుషులమే. ఇద్దరికీ భయాలే. నేను మనిషి – వాడు మనిషి అని యెన్నడో మర్చిపోయాం. మేం మరలమైపోయాం. మరతుపాకులమైపోయాం. కీ యిచ్చిన కీలు బొమ్మలమైపోయాం. కావలసి వచ్చినప్పుడు కారణం లేకుండా రణంజేసి కాల్చుకు చస్తున్నాం. మనుషుల మధ్యనేనా శాంతీ సౌభ్రాతృత్వం? దేశం లోపలేనా? దేశం వెలుపల వద్దా? మేం మనుషులం కాదా?

ప్రజలందరూ వొకటి కానట్టే సైనికులందరూ వొకటి కాదు. ఇక్కడా చాలా తరగతులు వున్నాయి. నిచ్చెన మెట్లూ వున్నాయి. మాకు నాసిరకం ఆహారం పెట్టినా నోరెత్తడానికి లేదు. ఎత్తితే క్రమశిక్షణ తప్పిన వాళ్ళమవుతాము. ఉద్యోగానికి దూరమవుతాము. ఇంకా యిక్కడా ఆర్దర్లీ వ్యవస్థ వుంది. ఆఫీసర్ల ఇళ్ళల్లో పని చేయడం- దొరసానమ్మలతో తిట్లు తినడం- బానిస బతుకు బతకడం- అన్నీ వున్నాయి… ఊరూ వాడా వున్నట్టే. మా చేతుల్లో తుప్పు తుపాకులు పెట్టినప్పుడు మాట్లాడని మీరు యుద్ధం గురించి మాట్లాడడం చూస్తే మీ దేశభక్తి యేపాటిదో అర్థమవుతోంది. దేశ రక్షణ విషయాలు మాట్లాడకూడదని, పరువు తీయకూడదని అంటారా?, మరి యుద్ధం రహస్యమైందా?

సైన్యంలో పని చేయడం పేద్ద గొప్ప విషయం కాదు. మనిషిని మనిషి చంపడం అంత మానవీయమైన విషయమేం కాదు. మీ దృష్టిని మరల్చడానికి యుద్ధాలు వస్తాయి. ఎన్నికలప్పుడూ యుద్ధాలు వస్తాయి. ఏ విషయంలోనూ కలవని మీరు యుద్ధం విషయంలో కలవడం మేమంతా వొక్కటేననడం కలవరపరుస్తుంది. ఉగ్రవాదులు పంజా విసిరినప్పుడు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకంటే దేశ నాయకత్వం ప్లాన్ చేసినప్పుడు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల సంఖ్య తక్కువేం కాదు. ఎలా పోయినా ప్రాణం ప్రాణమే కదా?

తుపాకీకి మంచీ చెడూ తెలీనట్టే బుల్లెట్టుకు స్వపక్షం శత్రుపక్షం తేడాలేనట్టే మేమున్నూ. ట్రిగ్గర్ నొక్కితే దూసుకుపోయినట్టు ఆర్డరు వేస్తే యిదే తుపాకీనీ తూటాల్నీ మీమీదకి- ఎవరినుంచి వచ్చామో వాళ్ళమీదికి- గురిపెట్టి కాల్చిన ప్రభుత్వ భటులం. మిమ్మల్ని అదుపులో పెట్టే ఆయుధాలం. హింసించే రాజముద్రికలం. (ఆదిల్ అలా అంకురించినవాడే) ఉద్యోగ ధర్మం అని సమర్ధించుకోవడం మా అసమర్ధత. సరిపెట్టుకోవడం మీరూ అలవాటు చేసేసుకున్నారు.

మీలో కొందరి విరాళాలూ మరికొందరి వైద్యాలూ ఇంకొందరి ఉపాధి బాధ్యతా కార్పొరేట్ల చేయూతా విమాన ప్రయాణాల్లో రాయితీలూ పిల్లల చదువుల దత్తతా సినిమావాళ్ళ సాయమూ రాజకీయనాయకుల పారిశ్రామిక వేత్తల సంతాపమూ- యివేవీ మాకొద్దు. సైనికులకు పూర్తి స్వేఛ్చ అంటున్నారే- అవీ మాకొద్దు. దేశ భద్రత కోసం యుద్ధం చేస్తాం. అందులో ఏలుబడిని భద్రంగా కాపాడుకోవాలని చూసే వాళ్ళని దూరంగా వుంచండి. మాకు దగ్గరకండి.

దేశాన్ని సరిహద్దుల్లో వుండి మాత్రమే కాపాడలేము!

కృతజ్ఞతలు!

మీ

సైన్యంలో వొకడు.

లిపిలేని స్వప్నం!

రెండుదేశాల ప్రజలూ సరిహద్దుల్ని చేరారు. యుద్ధం దేశభక్తి కాదని మూకుమ్మడిగా తీర్మానం చేశారు.

ప్రజల్ని కలుపుతూ సరిహద్దు రేఖలతో చుక్కల ముగ్గులు పెట్టారు. ఆయుధాల్ని పాతిపెట్టి పువ్వుల తోట వేశారు. ఇనుప చువ్వల్ని పావురాలు ముక్కుతో పొడిచి తుత్తునియలు చేసి దూదిమబ్బుల్లా యెగరేశాయి. పిల్లలు తూనీగలయ్యారు. పెద్దలు సీతాకోక చిలుకలయ్యారు. అంతా కలిసి మువ్వన్నెల రంగుల్ని మువ్వల పట్టీలు చేసి కట్టుకు గంతులేశారు. నాలుగు సింహాలూ కలిసి పద్యాలు పాడాయి. అశోక చక్రం రంగుల రాట్నమై గిర్రున తిరిగింది. నెలవంక ఆకుపచ్చటి వెన్నెల తివాచీ పరచింది. నక్షత్రమొకటి నింగి నుండి నేలకు జారి బుగ్గన శాంతి చుక్కయ్యింది. చాన్నాళ్ళకు కుంకుమ పువ్వు రక్తమంటకుండా పూసింది. కాలచక్రం వెనక్కి తిరిగింది. 47 కన్నా ముందున్నామని అనుకుంది. అంతా వొకే కుటుంబమై తీయతేనియల్ని దోసిట పట్టి పంచుకు తాగారు.

ఉగ్రవాది ఉరిపోసుకున్నాడు. ఆయుధ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. యుద్ధంతో గద్దెనెక్కాలని గాండ్రించిన దేశభక్త పులి పిల్లై పోయింది. పిచ్చిదైపోయింది. శవపేటికల్లోంచి లేచి వచ్చిన సైనికులు మాత్రం ప్రజలకు చెయ్యిత్తి సెల్యూట్ చేశారు!

Avatar

బమ్మిడి జగదీశ్వరరావు

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • ఉన్మాద వీరంగం రంకెలు వేస్తుంటే
  ఒక sane voice
  పిల్లగాలిలా పలకరించింది
  కృతజ్ఞతలు బమ్మిడిగారూ

 • చివరి పేరా నిజమైతే బావుండు
  రెండు దేశాలు పచ్చగా ఉంటాయి
  వెచ్చగా నిద్రపోతాయి

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు