మొల‌తాడు

తెల్ల‌కోడి, న‌ల్ల‌మ‌చ్చ‌ల‌కోడి, ఎర్ర‌కోడి గుడ్లు  పెట్ట‌డానికి ‘కొకొకో..’ అని అరుచ్చానాయి.
పంచ‌గూడికాడ‌, గ‌డ్డిగూట్లో,  బియ్యం మూట‌ల‌కాడ‌.. ఇట్ల‌ యాడ తావుంటే ఆడ గుడ్లు పెట్ట‌డానికి ముడుక్కుని కాళ్ల‌తో గీరుకుంటా తావు చేసుకుంటానాయి.
బాగా ఎండ‌ల‌కాలం.. బయ‌ట‌ ఎండ దంచి కొడ్తాంది.
తెల్ల‌లో, మూక‌టి పెంకులో నీళ్లు పోచ్చానే రెండు పిల్ల‌ల‌కోళ్లు పిల్ల‌ల‌తో క‌ల్చి నీళ్లు తాగుతాండాయి.
మా ఇంటికాడ యాప‌చెట్టుమీద కాకులు ‘కావ్‌.. కావ్‌’ అంటానే అమ్మ‌కోళ్లు కొకొకొ మంటా.. రెక్క‌ల‌ను గుబురుగా ఇదిల్చి కుండ‌మాదిరి క‌ప్పెడ‌తానే. పిల్ల‌ల‌న్నీ రెక్క‌ల్లో ఎచ్చ‌గా దాక్కోని.. ముక్కు బ‌య‌టికి పెట్టి కోడిపిల్ల‌లు బెత్తురుచూపులు సూచ్చానాయి.

ఆ పొద్దు కూలిప‌నికి పోయి మాయ‌మ్మ బెరీన వ‌చ్చినాది. బువ్వాకిల‌యితాంది.. రొట్టె కాల్చుమా అన్యా. ‘కారెం నూర‌తా.. రోంత సేపుండు’ అనింది. బెరీన పాత గుడ్డ తీసుకుని వ‌సార్లో ఉండే రెండు అరుగుల‌మీద ఉండే కోడిపియ్య తుడ్చినాది. ఈగ‌లు వాల్తాయ‌ని రోన్ని సిల‌వ‌ర‌చెంబుతో నీళ్లు చిల‌క‌రిచ్చి.. ఏరే గుడ్డ‌తో తుడ్చినాది. ‘కోడినా చ‌వితిలు.. యాడంటే ఆడ ఏరిగినాయి. మ‌ట్టిపొయ్యిపోండి’ అన్యాది మాయ‌మ్మ‌. బ‌య‌టికి పోయి యాప‌మానుకాడ ఉండే మెత్త‌మ‌ట్టి చేత‌ల్లోకి తీసుకోని.. కొట్రీలో ఉండే బండ‌ల‌మింద‌, దొడ్లో, గాటిపాట ముందుండే త‌లంలో, బ‌య‌ట అర‌గ‌ల‌మింద‌… ఇట్ట యాడ కోడిపియ్య ఉంటే .. ఆడ మ‌ట్టి పోసినాం. మాయ‌మ్మ కూడా పోసినాది. బువ్వ‌తిన్యాక ఎత్తేచ్చాలే అన్యాది.

మాయ‌మ్మ రోట్లో బెరిక్క‌న పండుమిర‌ప‌కాయ కారం నూరినాది. నేను తిన్లేద‌ని.. ప‌ద్ద‌న శారుతో బువ్వ క‌లిప్పెట్నాది. పెరుగేసి క‌లిపిచ్చి తినిపిచ్చినాది.
గాట్లో ఎనుములు తొక్కులాడతానాయి.. వ‌ట్టి గ‌డ్డి మేయ‌లేక. ఎన‌మ‌ల గాటికాడికి పోయి ఒక్కెనుము ఒక్కోసారి త‌లుగు ఇర్చినాది. క‌డుగునీళ్ల తొట్టికాడికి పోయి నీళ్లు తాగింది పెద్దెనుము. దాన్ని క‌ట్టేసినాది. మిగ‌తా రెండు ఎన‌మ‌ల‌కు తొట్లో బిందెతో నీళ్లు పోసి తౌడు క‌లిపింది. అయ్యి నీళ్లు తాగినాయి. దూడ‌కి త‌పేలాలో నీళ్లు పెట్నా.
పైటాల రెండ‌య్యింది. క‌రెంటు పోతానే వ‌సార్లో ఫ్యాను స‌న్న‌గా తిరిగి మానేసినాది.

అప్పుడే మెల్ల‌గా ఒకాయిమ బ‌య‌ట‌నుంచి ‘ఇమాంబీ.. ఉండావా?’ అని పిల్చినాది. ‘రాక్కా.. చాన్నాళ్ల‌కు వ‌చ్చివే’ అన్యాది మాయ‌మ్మ లోప‌ల‌నుంచి కోడిపియ్య‌ను డ‌బ్బాచాట్లోకి ఎత్తుతా. ఆయ‌వ్వ మెల్ల‌గా కుంటుకుంటా వ‌చ్చినాది. ఆయ‌వ్వ సేమాల‌వ్వ‌. సేమాలు గంప‌లో ఎత్త‌క‌చ్చి ఊరంతా తిరిగి అమ్ముతాది. ఆయ‌వ్వ‌ది సిమాప‌ల్లె(సింహాద్రిపురం). ఇంట్లోకి వ‌చ్చిరాంగానే.. మాయ‌మ్మ ఎదురూగా పొయ్యి గంపెత్తుకుండాది.  ఆయ‌వ్వ గ‌స్స‌పెట్టుకుంటా వ‌చ్చి వ‌సార్లో కుచ్చుండాది.  ‘ఆరోగ్యం బాగ‌లేదు ఇమాంబీ.. ఉంటానో బ‌తుకుతానో’ అన్యాది. ‘అట్ల‌నాకు చిన్న‌మా’ అన్యాది మాయ‌మ్మ‌.  ఆయ‌వ్వ‌కు ఇంచుమించు  అర‌వై ఏండ్లకు పైన ఉంటాయి. తెల్లగా ఉంటాది. ఆయ‌వ్వ తురుకోల్లాయిమ‌. మాయమ్మ‌తో బాగా నేచ్చం.  ‘కైసా అక్క‌య్య‌..* అంటూ తుర‌కంలో ప‌ల‌క‌రించి మాట్లాడేది. ‘అచ్ఛా..’ అంటూ మాయ‌మ్మ తుర‌కంలోకి దిగేది. నాకేమో తిక్క‌బ‌ట్టి న‌ట్లయినాది ఆ బాష ఇంటాంటే. ఏందిబ్బా ఇట్ల మాట్లాడుకుంటానార‌ని నెత్తిగీరుకున్యా.

మాట‌ల్లోనే నీళ్లు తాపో అన్యాది మాయ‌మ్మ‌. సంచిప‌ట్ట‌క‌ప్పిన కాగులోంచి బుడ్డ‌చెంబుతో నీళ్లు తెచ్చినా. ఆయ‌వ్వ నీళ్లు తాగినాక‌.. అబ్బ చ‌ల్ల‌గుండాయి పాపోడా అన్యాది.  ‘రోంత బువ్వ తిను చిన్న‌మా’ అన్యాది మాయ‌మ్మ‌. ‘తిన్యా’ అనింది.
ఊ.. అంటా త‌ల‌కాయ అడ్డం తిప్పి, రెండు సెక‌న్లాగి.. ‘ఆ.. రోంత‌పెట్టుమ్మా  ఇమాంబీ’ అన్యాది ఆయ‌వ్వ‌. స్టూలుమింద‌నో, అరుగుమింద‌నో కూర్చోమ‌ని  మాయ‌మ్మ బంగ‌పొయ్యేది. ఆయ‌వ్వ ఏమో.. ‘ఉంటేలే.. ఇమాంబీ.. ఎక్క‌డ‌ కుర్సుంటే ఏముందిలే’ అనేది తుర‌కం క‌లిసిన తెలుగు యాస‌తో.. రోంత నైసుగా.  ‘ఏముంది చిన్న‌మ్మా.. మ‌నం అంతా ఒక‌టే ‘  అన్యాది మాయ‌మ్మ‌.
‘సేమాలు తీసుకో ఇమాంబీ’ అని అడిగినాది ఆయ‌వ్వ‌.
‘ఉండాయిలే.. ‘ అన్యాది మాయ‌మ్మ‌. మ‌ల్ల ‘కాలుకేజీ పెట్టు’ అన్యాది.
కాలుకేజీ రాయి త‌క్కెడ‌లో పెట్టి.. సేమాలు తూచ్చాంటే.. ‘అయిపోవు చిన్న‌మా. వాడ‌కం త‌క్క‌వ‌’ అన్యాది.  ఉంటేంలే ఇమాంబీ పిల్లోళ్లు తింటానార‌ని కాలుకేజీ తూంచినాక‌.. ఇంకా గంప‌లోంచి పిరికెడుతో  సేమాలు ఏసినాది. ‘వొద్దులే చిన్న‌మ్మా.. ‘ అంటానే మాయ‌మ్మ  టోపీగిన్నెలోకి ఏపిచ్చుకున్యాది. ‘నా దగ్గ‌ర  లెక్క‌లేదు’ అన్యా స‌రే.. ‘మ‌ళ్లిచ్చువులే మ్మా..  ఎక్క‌డికి పోతావు?’ అనేది. ఆయ‌వ్వ క‌ష్టాల‌ను మాయ‌మ్మ‌కి చెప్పేది.. మాయ‌మ్మ క‌ష్టాలు ఆయ‌వ్వ‌కి చెప్పేది. వాళ్లు మాట్లాడ‌తాంటే పొద్దు వ‌చ్చాందా, పోతాందా.. అస‌లు ఎట్టొచ్చాందో తెల్దు.
నేను సుజికి టైరు దొబ్బుకోటానికి పోయినా బ‌య‌టికి.
బ‌డితిక్కు ఆటాడుకోని అర్ధ‌గంట దాట్నాక ఇంటికొచ్చినా. ఇంకా సేమాల‌వ్వ‌, మాయ‌మ్మ మాట్లాడుకుంటానారు.
ఇంట్లోకి వ‌చ్చి గ‌బ‌గ‌బా జాలాట్లోకి పోయి సిల‌వ‌ర‌చెంబుతో పంత‌లో నీళ్లు ముంచుకోని మ‌గంమీద పోసుకోని బ‌య‌టికొచ్చినా.
‘స‌బ్బురుద్దుకోపో మ‌గం న‌గురొచ్చాది’ అన్యాది మాయ‌మ్మ‌.
‘ప‌ద్దాంకులు చెప్తావు..  ఏందిమా. రుద్దుకున్యాలే’ అని అబ‌ద్ధం చెప్పినా.
కాళ్లు చేతులు బొచ్చు ట‌వాల‌తో తుర్సుకున్యా. దువ్వాన‌తో నెత్తిలో పాపిటి తీసి.. మెత్త ట‌వాల తీసుకోని రోంత మ‌డిచి.. దానిమీద రోంత పోడ‌రేసి.. మ‌గానికి  పోడ‌రు కొట్టింది మాయ‌మ్మ‌. ‘పెద్ద‌పిల్లోల్ల‌యినా పోడ‌రు కొడ్తాన‌వే* అన్యాది ఆయ‌వ్వ‌. ‘ఈయ‌ప్ప‌కు.. పోడ‌రు ప‌డ‌దు.. పెద్ద‌బ‌డికి పోతాన్యా.. నెత్తి స‌రిగా దూక్కోలేడు’ అన్యాది మాయ‌మ్మ‌. నిక్క‌ర లూజుగా ఉండాద‌ని.. నిక్క‌ర రోంత  పైకి అనుకోని, న‌డుంకింద ఉండే మొల‌తాడును పైకి అని.. నిక్క‌ర‌మింద‌కి అన్యా.  నిక్క‌ర పైన రోంత మడ్చుకున్యా. ఊడిపోకుండా గ‌ట్టిగా మొల్తాడేసినా.
సేమాలాయిమ్మ న‌న్ను సూచ్చానే..  ‘ఓయ‌మ్మా..’ అన్యాది త‌న చేత్తో నోటికి కొట్టి.

‘ఏమైంది చిన్న‌మ్మా?’ అన్యాది మాయ‌మ్మ‌.
‘ఏందిమ్మా.. పిల్లోడికి  మొల‌తాడు వేసినావు. మ‌న ఇళ్ల‌ల్లో ఇలాంటి ప‌ని చూడ‌లా. ఇది బాగ‌లేదు.. నువ్వేమ‌యినా అనుకో. మ‌న‌మేమ‌న్నా సుద్ద‌రోళ్ల‌మా.. ఇమాంబీ’ అని ఆయ‌వ్వ సింగ‌రిచ్చుకున్య‌ట్లు(కోప్ప‌డిన‌ట్లు) మాట్లాడింది.
‘నిక్క‌ర ఊడిపోతాద‌ని పిల్లోడు మొల‌తాడు ఏసుకున్యాడులే’ అన్యాది మాయ‌మ్మ‌.
‘మ‌ల్ల‌.. ఏందిమా.. అట్ల మాట్లాడ‌తావు. నువ్వు పెద్ద‌యినావు. ఇద్ద‌రు పిల్లోల్లు. లోక జ్ఞానం తెలియ‌కుంటే ఎట్ల‌మ‌రి’ అని దండిచ్చిన‌ట్లు మాట్లాడినాది. ‘నువ్వేమ‌యినా చెప్పు.. మ‌న ముస్లింలు ఇట్ల చేయ‌రు. అవ‌మానం ఇది. కుల పెద్దోళ్లు చూస్తే తిడ‌తారుమా.  ముందు ఆ మొల‌తాడు తెంపేయి. నీకు తెలిసి.. ఎప్పుడు అలా చెయ్య‌కు.. స‌రేనా’ అంటానే.. డౌటుగా ‘ మీ ఆయ‌ప్ప‌ కూడా మొల‌తాడు క‌డ‌తాడా?’ అన్యాది ఆయ‌వ్వ‌.
‘ఆయ‌ప్ప‌కి ఇష్టం ఉండ‌దు.. క‌ట్టుకోడు’ అన్యాది మాయ‌మ్మ‌.

‘లేటు చేయ‌కుండా.. మొల‌తాడు తెంపు’ అన్యాది ఆయ‌వ్వ‌.  ‘క్యా ? బేటా ఇలా’ అన్యాది.  ‘ఇట్ల‌రా’ అన్యాది మాయ‌మ్మ‌. రోంత‌సేపు ఉండు అన్యాది.  గూట్లో ఉండే తునిగిపోయిన బ్లేడు కోస‌రం పోతాంద‌ని నాకు అర్థ‌మైతాండాది. ప‌రిగెత్తుదామ‌నుకున్యా. కొడ్తాద‌ని అట్ల‌నే ఉండా. బ్లేడు తెచ్చినాది. *మొల‌తాడు క‌ట్ సేచ్చాం* అన్యాది. ‘ఏంటికి మా.. నిక్క‌ర జారిపోతాదేమో. వ‌ద్దుమా* అన్యా. ఏడుపుమ‌గం ఏసుకున్యా. *అవ్వ చెప్తాంది క‌దా.. మ‌నం సుద్ద‌రోళ్ల‌మా.. ఏమ‌న్నా.. ‘ అన్యాది మాయ‌మ్మ‌. నేను ఎన‌క్కి జ‌రిగినా. ‘నిక్క‌ర బిర్రుగా కుట్టిచ్చమ‌ని చెప్తాలే మీ నాయిన‌కు. ఆల్తి తీసుకుండేప్పుడు మిస‌ను కుట్టే ఆయ‌ప్ప‌కు మీ నాయిన చెప్తాడు’ అంటూ మాయ‌మ్మ గుడ్లురిమినాది. మామ‌య్మ కోపం చూసినాక భ‌య‌ప‌డినా. మాట ఇన‌కోకుంటే..  క‌ట్టెతీసుకోని వాంచుతాది అని భ‌య‌మైనాది. ‘స‌రేలే’ అన్యా. రెండు పొర్ల మొల‌తాడును బ్లేడ్‌తో కోసినాది మాయ‌మ్మ‌. మొల్తాడుకుండే నాలుగు పించూదుల‌ను తీసి.. త‌న మెడ‌లోని క‌ల్లికి క‌రిపిచ్చినాది మాయ‌మ్మ‌. తెంపిన  మొల‌తాడు చేతికిచ్చి.. ‘కింద‌వెయ్యాకు తొక్క‌గూడ‌దు. చెత్త‌గూట్లోని డ‌బ్బారేకు చాట‌లో వెయ్యి’ అన్యాది మాయ‌మ్మ‌. నేను చాట్లో వేసినా  మొల‌తాడును.  ‘మంచి ప‌ని చేసినావు ఇమాంబీ.. మ‌న పిల్లోళ్లు మొల‌తాడు క‌ట్టుకోరు. ఎవ‌ర‌న్న మీ వోళ్ల‌ల్లో ఉంటే చెప్పు… మొల‌తాడు వాడ‌టం మంచిది కాద‌ని’ అన్యాది ఆయ‌వ్వ.. ఎలిగిపోతున్న న‌గుమ‌గంతో.
‘స‌రే’ అన్య‌ట్లు మాయ‌మ్మ త‌ల ఊపినాది.

ప‌దినిమిషాలుండు చిన్మ‌మ్మా.. అంటూనే దూడ‌ని ఇప్పింది. అది పాలు తాగ‌టానికి వాళ్ల‌మ్మ ద‌గ్గ‌రికి ప‌రిగిత్త‌పోయినాది.  ఐదునిమిషాలు అయినాక మాయ‌మ్మ దూడ‌ను ప‌ట్ట‌క‌రాపో అన్యాది. పాల త‌పేలాలో చిన్న గ్లాసు నీళ్లు పోసుకోని రెడీగా నిల‌బ‌డినాది . ఎనుము కాడి దూడను గ‌ట్టిగా లాగినా. క‌ద‌ల్యా. బ‌లంతంగా లాగినా.  ఎన‌క్కి వ‌చ్చినాది. గ‌ట్టిగా ప‌ట్ట‌క‌చ్చి దూరంగా గుంజ‌కి క‌ట్టేసినా.  ఎనుముకి పాలు పిండి.. గ‌బ‌గ‌బా కాఫీ సేసింది. సేమాలాయివ్వ కాఫీ తాగినాది. *ఎప్పుడు చేసినా.. కాఫీ బ‌లే ఉంటాది* అన్యాది ఆయ‌వ్వ‌. ‘పాలు ఎక్కువ పోచ్చే.. రుచొచ్చాది చిన్న‌మా’ అన్యాది మాయ‌మ్మ గ‌ర్వంతో.  ఆయ‌వ్వ లేచినాది.  ‘ఇక పొయ్యొచ్చామ్మా.. ఇమాంబీ’ అన్యాది. వ‌సార్లో కూర్చోని.. నేనేమో చిన్న‌చెంబులో కాఫీ తాగుతానా. చీమిడికార్చుకుంటానే.. కాఫీ తాగుతానా. మ‌ధ్య‌మ‌ధ్య‌లో మోచేత్తో చీమిడి తుడ్చుకుంటా కాఫీ తాగుతానా. సేమాల గంప ఆయ‌వ్వ బుజం మీదికి ఎత్తుతా..  ‘మ‌ళ్లెప్పుడొస్తావో’ అన్యాది మాయ‌మ్మ‌.  ‘బాగుంటే.. రేపు నెల వ‌చ్చామ్మా’ అన్యాది ఆయ‌వ్వ‌. మెల్ల‌గా కుంటుతా వాకిలి దాట్నాది. మ‌ళ్లా ఎన‌క్కి వ‌చ్చినాది.
‘ఏంలేదు.. ఇమాంబీ. మాబూను కాయంగ సిమాప‌ల్లె మ‌సీదుకు ర‌మ్మ‌ను. మ‌నోళ్లను సూచ్చే అన్నీ అర్థ‌మైతాయి. ఈ పిల్లోడికి క‌ల్మాలు నేర్పియ్యి’ అన్యాది. ‘ఉంటామా..’ అంటా ఎల్లిపోయినాది.

‘ఏందిమా..? నా మొల్తాడు తెంపినావు.. ఆ ముసిల్ది చెప్తే’ అన్యా.
‘పెద్దాయ‌మ.. అట్లనాకు. సొయం నాకొడుకు అంటారు. తెంపినావ‌ని.. ఆయ‌మ్మ‌ సంతోష‌డినాది. ఆమె బ్ర‌మ పోయినాది. కొత్త‌ది కొనిచ్చాలే’ అన్యాది. నేను  డ‌బ్బారేకు చాట‌కాడికి పోయినా. ఒక‌పారి ముడులు ముడులుండి తెగిపోయిన మొల‌తాడు సూసినా. చేత్తో ప‌ట్టుకున్యా.  *ఆడ‌వెయ్యి .. ముట్టుకోవాకు తీసేసిన మొల‌తాడు. రెండురూపాయ‌లు ఇచ్చాను రేప్పొద్ద‌న‌.. సుబ్బాడ్డి అంగ‌డికి పోయి కొనక్క‌చ్చుకో మూడు మూర్లు* అన్యాది మాయ‌మ్మ‌.
‘ఈ తురుకోళ్లు అంతే. గ‌ట్టి ప‌ట్టు ప‌డ‌తారు. మ‌న‌ల్ని తక్క‌వ చూపు చూచ్చారు. అందురూ స‌మానం అంటారు. అల్లాను పూజిచ్చారు. ధాన‌ధ‌ర్మాలు సేచ్చారు రంజాన్ పండ‌గ‌ప్పుడు. మ‌న‌ల్ని మాత్రం పంకియ్య‌రు. వాళ్ల‌మాద్దిరి మ‌నం ఉండాలంటారు. ఉండ‌మ‌ని బాధ‌ప‌డ్తారు. తిడ‌తారు’ అన్యాది మాయ‌మ్మ‌.
‘ఏంటికిమా.. మ‌నం మంచ‌లం కాదా?’ అన్యా.

”మంచ‌ల‌మే. కానీ మొర‌ట‌నాకొడుకులం. మీనాయినకు, మీ పెద్ద‌నాయినోళ్ల‌కు ఏమీ కాబ‌ట్ట‌దు. మూర్కం మంచులు. మీ జేజీ, అబ్బ ప‌ట్టిచ్చుకోరు. అస‌లు.. మ‌న దూదేక‌లోళ్ల‌కు  క‌ల్మాలు రావు. తుర‌కం రాదు. ఎవురికీ లోక‌జ్ఞానం లేదు. క‌ష్ట‌ప‌డి ప‌నులు సేచ్చారు.. ఎండ‌న‌క వాన‌న‌క‌.  కాపోళ్ల(రెడ్లు) ద‌గ్గ‌ర ప‌నిచేసి బ‌తుకుదామ‌నుకుంటారు. వీళ్ల‌కు సిటీలు తెల్దు. జ‌మ్మంగా బ‌తుక్కునేది తెల్దు. వాళ్ల‌న‌ని ఏం లాభం..   పాపం..  తిక్కోళ్లు. మీ నాయినా హ‌లాలు చేసేది, స‌దింపులు నేర్చుకున్యాడు అది ప‌ర‌వాల‌. అది లాకుంటే ఇంగా హీనంగా ఉంటాండ‌.  చ‌దింపులు చేయ‌మ‌ని, కోడి కొయ్య‌మ‌ని వేరే ఊర్ల‌కు పోయి అంద‌రినీ బంగ‌పోయి పిల్చ‌క‌చ్చుకోవాల్చి వ‌చ్చేది” అన్యాది మాయ‌మ్మ‌.
‘మ‌న‌మేంటికి హీనంగా ఉంటాముమా?’ అన్యా.
“బువ్వ‌కు ల్యాక , పియ్య-పిడ‌కా  తిని.. రోంత లెక్క సంపాయిచ్చుకుంటారు మ‌న దూదేక‌లోళ్లు. ఉండేవాళ్లు ద‌ర్బారుగా ఉంటారు. ఎవుర‌న్నా మాటంటే ప‌డ‌రు. ఎవ‌రి ద‌గ్గ‌ర అడ‌క్క తిన‌రు. తాగే,గీగే య‌వారాల్లేవు. బాగా బ‌తుక్కుంటారు. ఇంత ఉన్యా.. ఈ  తురుకోళ్లు..  దూది ఏకే వాళ్లంటారు. త‌క్క‌వగా, హీనంగా సూచ్చారు. కాపోళ్లు(రెడ్లు) మ‌న కులాన్ని ప‌ట్టించుకోరు. మిగ‌తా కులాలోళ్లు మ‌న‌ల్ని త‌రంగానోళ్ల‌మాద్దిరి సూచ్చారు.  అట్టాకాకుండా.. ఇట్టా కాకుండా పుట్ట‌డమంటే.. మ‌నం  పూర్వ‌జ‌న్మంలో సేసుకున్య పాపం” అన్యాది మాయ‌మ్మ బాధ‌తో.

‘మ‌నం కూడా రంజాన్ పండ‌గ‌, బ‌క్రీదు సేచ్చాం. కోళ్లు, పొట్టేళ్లు, మేక‌ల‌ను నాయిన హ‌లాలు సేచ్చాడు క‌దా. మ‌నం తురుకోళ్ల‌కంటే ఏం త‌క్కువ‌మా. వాళ్లేమ‌న్నా దేవుళ్లా?’ అన్యా.
“ఊరుకో.. నీకు తెల్దు. తెలియ‌నిమాట‌లు మాట్లాడాకు. న‌రులు ఎవ‌రూ దేవుళ్లు కారు. సిద్ద‌య్య లాంటోళ్లు నానా క‌ష్టాలు ప‌డినారు. మ‌న జాతి ఏందోలే” అని దిగులు ప‌డినాది. ”అయినా మ‌నం బుర‌ఖాలు ఎయ్య‌లేం. తురకం బాష నాకొచ్చాది. ఎవురికీ రాదు ఈ ఊర్లో. పెండ్లిళ్లు, కార్యాల‌న్నీ మ‌న‌యి తురుకోళ్ల‌మాద్దిరే. మ‌నం హిందువుల పండ‌గ‌లు సేసుకుంటాం. యా ఊర్లో చూసినా మ‌న బ‌లం త‌క్క‌వ‌. ఎవురూ చ‌దువుకోల‌. రాజ‌కీయం మంచులు లేరు.  అందుకే తురుకోళ్లు మ‌న‌ల్ని ప‌ట్టిచ్చుకోలేరు. ఏంటికిలే అని పాదెంగి పోతారు” అన్యాది మాయ‌మ్మ‌. మాట‌ల్లోనే మా నాయిన ఇంటికి వ‌చ్చినాడు.
‘మాడీకాడ సేద్యం సేచ్చాంటి. లేట‌య్యింది. టాక్ట‌రు ఇడిచి.. గుంట‌క త‌ప్పిచ్చి వ‌చ్చేత‌లికి లేట‌యినాది’ అన్యాడు మానాయిన‌. జాలాట్లోకి పోయి కాళ్లు క‌డ‌క్క‌చ్చుకున్యాడు.
‘ఉండు రోంత సేపు..  రొట్టెలు కాలుచ్చా’ అని..  జొన్న‌పిండి త‌డిప్పెట్టింది మాయ‌మ్మ‌.

క‌ట్టెల‌పొయ్యి అంటిచ్చింది.. పెనంపెట్టింది. చెక్క తీసుకోని దానిమింద త‌డిపిన బ‌నియ‌ను గుడ్డ ఏసుకోని.. దానిమింద  పిండిని బేసి..  గుండ్రంగా రొట్టెను త‌ట్టొడ్చింది. పెనంమీద వేసినాది. మెల్ల‌గా మ‌ధ్య‌లో ఉప్పునీళ్ల చెంబులోని నీళ్ల‌ను త‌డిగుడ్డ‌తో తీసుకోని రొట్టెపై అట్ల త‌గిలిచ్చినాది. బెర‌బెరా నాలుగు రొట్టెలు కాల్చినాది. ఇంగో పొయ్యిమింద ఉర్ల‌గ‌డ్డ‌ల కురాకు చేసినాది. మానాయినతో పాటు నేనూ, మా చెల్లెలూ రొట్టెలు తిన్యాం. ఉర్ల‌గ‌డ్డ కురాకుతో రొట్టెలు ఇంగా రుచి అనిపిచ్చినాయి.  చివ‌ర్లో..  నాకోసం మాయ‌మ్మ ప‌ల‌ప‌ల‌లాడేట్లు ఓ రొట్టె కాల్చి పొయ్యి గ‌డ్డ‌మీద పెట్నాది.  మైటాల ఆటాడుకోను పోయేప్పుడు ప‌ల‌ప‌ల‌లాడే రొట్టెను తుంచుకోని.. ఆ రొట్టెముక్క‌ల్ని నిక్క‌ర జోబీలోకి వేసుకోని బైటికి బ‌డితిక్కు ప‌రిగిత్తినా.

రాత్రి బువ్వ తిన్యాక‌.. మానాయిన బ‌య‌ట అరుగుమింద కూర్చున్యాడు. ఎల్ల‌నూరు మామిడికాయ బీడీ క‌ట్ట‌లోంచి ఒక బీడి తీసినాడు. అగ్గిపెట్టెతో బీడీ అంటిచ్చినాడు. పొగ ఇర్సుకుంటా ఎచ్చ‌లుగా తాగుతానాడు.
అరుగుమీద నేనూ ప‌క్క‌న కూర్చున్యా. మాయ‌మ్మ కుర్చున్యాది. మా పాప కూడా.
‘ఔ.. మ‌సీదుకు పోతాండు ఎప్పుడ‌న్నా.. శుక్కురారం అప్పుడు’ అన్యాది మాయ‌మ్మ‌.
‘ఏంటికిబ్బా.. ప‌నులుండాయి. ఇయ్యి ఇడ్చిబెట్టుకోని యాడ‌పోతాం. పోయినా ఆ తురుకోళ్లు మ‌న‌ల్ని ప‌ట్టించుకోరు. అయినా మ‌నం ఏమ‌న్నా సిటీవాళ్ల‌మా.. ప‌నిలాక మ‌సీదుకు పోవ‌టానికి’ అన్యాడు మా నాయిన‌.
ఎందుకో మాయ‌మ్మ ఏమీ అన‌లేదు. రాత్రయ్యింది. నిద్ర‌పోయినాం.
ప‌ద్ద‌న్నే నిద్ద‌ర లేచ్చానే.. నాప‌క్క‌న ప‌డుకోని ‘గుర్‌ర్‌ర్‌’ మంటాంది తెల్ల‌పిల్లి పిల్ల‌.
మెల్ల‌గా నిద్ద‌ర‌లేచి బొగ్గుతో మ‌గం క‌డుక్కోని డికాష‌న్‌లో బొరుగులు క‌లిపి తాగినా. అది అయిపోయినాక పాలకాఫీ తాగినా. మాయ‌మ్మ వ‌చ్చి రెండురూపాయ‌ల బిళ్ల చేతికిచ్చింది. ‘మూర ముప్ప‌యి పైసాలు ఉంటాది.. మూడు మూర్లు కొన‌క్క‌చ్చుకో మొల‌తాడు. మిగ‌తాది నిమ్మోప్పుళు కొన‌క్క‌చ్చుకో’ అన్యాది.
నేను చెంగుచెంగుమ‌ని ఎగురుకుంటా అంగ‌డింటికి పోయినా.

మొల‌తాడు కొన్యాక‌. ఆశా చాక్లెట్లు రెండు కొనుక్కున్యా. ఇంకా అద్దురూపాయి మిగిల్తే.. ఏం చేయాలో అర్థంకాక జోబీలో ఏసుకున్యా. జోబీలో లెక్కుంద‌ని గ‌ర్వంగా ఎగుర్తా ఇంటికి వ‌చ్చినా. ఇంటికొచ్చినాక నాకు నీళ్లు పోసింది మాయ‌మ్మ‌. స‌క్కా, నిక్కర ఏసుకున్యా. మొల‌తాడులేని నిక్క‌ర ఏసుకోంటే తిక్క‌లు తిక్క‌లు అనిపిచ్చింది.
‘ఉండు ఉండు..’ అంటా మాయ‌మ్మ కొట్రీలోంచి వ‌చ్చినాది. నా నండుకు స‌రిపోయినంత రెండు మ‌ర్తలేసింది. ఏలుమందం లూజు ఇర్చి నాలుగైదు ముడులు ఏసినాది. రోంత మిగిలితే బ్లేడుతో క‌ట్ చేసినాది.  మొల‌తాడు గ‌ట్టిగా క‌ట్నాది.
‘నీకు పాత మొల‌తాడు గ‌ట్టిగా ఉన్యాది.  బాగా వాత‌లు ప‌డినాయి న‌డుముకు’ అన్యాది.
ముడి మింద  నీలుక్కోని ఉండే మొల‌తాడు దారాన్ని బ్లేడుతో కోసినాది.
ఇంగ‌..  నేను నిక్కర మింద మొల‌తాడు ఏసుకోని.. జ‌మ్మంగా బ‌య‌టికి  పోయినా. ‘ఈసారికి సేమాలాయివ్వ‌నే కాదు.. తురుకోళ్లు ఎవ‌రు వ‌చ్చినా.. నిక్క‌రుమీద మొల‌తాడు క‌న‌ప‌డ‌కోండా చొక్కా ఏసుకో రాజావ‌లి’ అన్యాది మాయ‌మ్మ‌.
‘స‌రేలేమా.. తెల్చులే’ అంటూ సుజికి టైరు, క‌డిమాను క‌ట్టె ప‌క్కన ఉండే గ‌ట్టి ముల్ల‌బ‌ర్ర తుంట‌ను తీసుకోని గాను దొబ్బుకుంటా.. బ‌య‌టికి ప‌రిగెత్తినా.
..
రెండునెల్ల‌యింది. తురుకోళ్లాయివ్వ రాల‌.
‘అవ్‌. ఆయ‌మ్మ ఎట్లుందో క‌నుక్కో’ అంటాండె మానాయిన‌.
‘ఆ ఊర్లో ఎవుర‌ని.. నాకు తెల్చు. నేనేందో టాక్ట‌రు ప‌ని మింద పోతాంట‌..’ అంటాండె మా నాయిన‌.
ఆర్నెళ్ల‌యినా రాలేదు ఆయ‌వ్వ‌.
ఆ సేమాల‌వ్వ ఇంగ రాద‌ని.. బ‌తికి ఉండాదో లేదో న‌ని.. ఓ పైటాల పూట మాయ‌మ్మ.. ఆయ‌వ్వ‌ను త‌ల్చుకోని బాధ‌ప‌డింది. బ‌తుకుందో లేదో అనింది.  మాయ‌మ్మ కండ్ల‌ల్లో నీళ్లు వ‌చ్చినాయి. అదీ మాయ‌మ్మ‌కు ఆయ‌వ్వ మీదుండే నెర్లు. మాయ‌మ్మ ఏడుపు మ‌గం చూసినాక‌.. నా కండ్ల‌ల్లోంచి నీళ్లు దిగినాయి.

*

రాళ్ల‌ప‌ల్లి రాజావ‌లి

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు