మెహెర్ కథ…ఓ కొత్త సందర్భం!

మెజీషియన్ లా abracadabra అని గాల్లోంచి తీసుకొచ్చి పాత్రని కథలో ప్రతిష్టించలేం.

వారానికి కనీసం రెండు సినిమాలైనా చూస్తాను. వరుసగా నెలరోజులూ రోజుకో సినిమా కూడా చూసిన సందర్భాలున్నాయి. ఎలా చూసినా ఏడాదికి కనీసం వంద సినిమాలు. ఈ వందలో ఎన్ని గుర్తుండిపోతాయని ఆలోచిస్తే, ఓ పదిపదిహేను కూడా గుర్తుకురావు. అంటే నన్ను కథలోకి లాగి కూర్చోబెట్టుకున్నవి పది శాతం మాత్రమే అన్నమాట. అలా గుర్తుండి పోవాలంటే నా మటుకు నాకు అందులో ఉండే పాత్రలు కళ్ళముందు మెదలాలి, సబ్జెక్ట్ ఏదైనా పాత్రలు మరిచిపోలేనంత influence చేయాలి, సీన్స్ ఎప్పటికీ వెంటాడాలి. ఇక కథల విషయానికొస్తే కూడా అంతే.

కథలు చదివే విషయంలో నేను చాలా సెలక్టివ్ గా, పికీగా ఉంటాను. మొదటి రెండు మూడు పేరాల్లో కథ నన్ను తగినంత ఇంప్రెస్ చేయలేకపోతే, అది నా కథ కాదు అని చదవడం ఆపేస్తా. అది న్యూయార్కర్ అయినా సరే, ఆంధ్రజ్యోతి అయినా సరే. ఆ రెండు మూడు పేరాల్లో నేను చూసేదీ-

  • ఆసక్తి కలిగించే విషయం ఏదైనా ఉందా?
  • రచయిత నాకంటే తెలివైనవాడే అనిపించే ప్రత్యేకత, విరుపు ఏదైనా ఉందా? (తెలిసింది తెలియనట్టు, తెలియంది తెలిసినట్టు రాసే నేర్పు)
  • ముఖ్యంగా, చదువుతుంటే ఒక దృశ్యం చూస్తున్న అనుభూతి కలిగించిందా?
  • భాష, డిక్షన్ ఎలా ఉంది? వాక్యాలు అనుభూతిని కలిగించేటట్టు ఉన్నాయా?

మూడే పేరాలు చదివి నిర్ణయించడంలో ఉన్న రిస్క్ నాకు తెలుసు. కొన్ని కథలు అద్బుతంగా మొదలై పేలవంగా ముగియవచ్చు. కొన్ని కథలు రసహీనంగా మొదలై చివరికి మనసుకు హత్తుకొవొచ్చు.

నా అభిరుచికి సరిపోయే కథలు దొరకడం తక్కువే, అలా రాసేవాళ్ళు కూడా తక్కువమందే ఉంటారు. పాత తరం రచయితలని కాసేపు పక్కన పెడితే, కాంటెంపరరీ రచయితల్లో నాకు నచ్చిన వాళ్ళలో మెహెర్ ముందువరసలో ఉంటారు.

మెహెర్ కథలు నాకు నచ్చడానికి కారణాలు (కథలకి విశ్లేషణలా కాకుండా ఒక పాఠకుని దృష్టికోణంలో)-

  • ఎక్కడా రచయితగా అనవసరంగా కల్పించుకోడు. కథను అడ్డం పెట్టుకుని స్వంత అభిప్రాయాలని మనమీద రుద్దడానికి ప్రయత్నంచేయడు.
  • చెప్పాలనుకునే విషయాన్ని స్పష్టంగా మన కళ్ళకు చూపించగలిగే లోతైన వాక్యాలను ఎన్నుకుంటాడు. (ఉదా: నడవాలో ఇదివరకూ లేని బల్బు ఒకటి పసుపుగా వెలుగుతూ ఆ చోటుకి కొత్తగా రాత్రి వ్యక్తిత్వాన్నిస్తోంది.)
  • వింటే విను లేకపోతే చావు అన్నట్టు కాకుండా కథ చెప్పటాన్ని ఒక వ్రతంలా ఇష్టంగా, శ్రద్దగా ఆచరిస్తాడు.
  • Cliché కి దూరంగా ఉంటాడు. (ఉదా: ఒరాంగుటాన్)
  • కథని నిజాయితీగా చెప్తాడు. (ఉదా: చేదుపూలు)

ఈ పేరా చదివి చూడండి:

“శ్రీపాదపట్నాన్ని పావురాళ్ల పట్నమని కూడా అంటారు. ఆ వూరిని నిర్మానుష్యంగానైనా వూహించవచ్చు గానీ, పావురాళ్ళు లేకుండా ఊహించలేం. ఇళ్ళ వాకిళ్ళలోనూ, అంగళ్ళ ముంగిటా, బడి పెంకులపైనా, గుడి గోపురం గూళ్ళలోనూ… ఎటు చూసినా పావురాలే! ఒక్కోసారి వాటి చొరవ చూస్తే, అసలిదంతా అవి నిర్మించుకున్న వూరేనేమో, ప్రజలే పాపం కాందిశీకులై వలస వచ్చారేమో అనిపిస్తుంది. ఊరి వాళ్ళకి వీటితో మసలుకోవడం అలవాటైపోయింది. ఎండిన రెట్టల్తో తమ అరుగులన్నీ గరుకుబారినా గోకిగోకి కడుక్కుంటారేగానీ ఏ హానీ తలపెట్టరు. యిక్కడి ఊరకుక్కలు సైతం, పెంటకుప్పల మీద పులిస్తరాకులేరుకుంటున్న తొందరలో కూడా, వెన్నుపై వాలి అల్లరి చేసే తుంటరిపావురాళ్ళని పెద్దన్నల్లా ఓపిగ్గా భరిస్తాయేగానీ కసురుకోవు. వీటి పరపతికి జడిసి కాకులైతే శ్రీపాదపట్నంవైపు రానేరావు.”

“రంగు వెలిసిన రాజుగారి మేడ కథ” మొదటి పేరా ఇది. నా requirements అన్నీటిని satisfy చేసే పేరా ఇది.

ఒక ముఖ్యమైన పాత్రని సృష్టించాలంటే ఆ పాత్రతో మనం కనీసం కొన్ని నెలలైనా స్నేహం చేయాలి. దగ్గరగా చూడాలి. మెజీషియన్ లా abracadabra అని గాల్లోంచి తీసుకొచ్చి పాత్రని కథలో ప్రతిష్టించలేం.

మెహెర్ శృష్టించే పాత్రల విషయానికి వస్తే- ఏదీ వొలిచి చెప్పకుండానే పాత్ర స్వభావాన్ని బిట్వీన్ ద సెంటెన్స్ పేయింట్ చేస్తాడు. ఆ పాత్ర personal, physical, mental, emotional, spiritual characteristics కథతో పాటు రివీల్ అవుతూ, నిజజీవితంలో వాళ్ళతో మనం నడిచినట్టే ఉంటుంది.

“చిట్టచివరి స్నేహితుడు” కథలోని “పెద్దాయన” పాత్ర నేను చెప్తున్న దానికి సరైన ఉదాహరణ. ఈ పేరాలు చూడండి:

“యుగాలనిపించిన కొన్ని క్షణాల పర్యంతం వంటగదిని దాటి, డైనింగ్ టేబిల్ దగ్గరకు చేరుకున్నాడు. కుర్చీ వీపుకు తగిలించి వున్న హాండ్‌బాగ్‌ని తీసి, “ఎక్కడ పడితే అక్కడే పడేస్తుంది,” అని గొణుక్కుంటూ పక్కన గోడకున్న హాంగర్‌కి తగిలించాడు. ఫేన్ స్విచ్ నొక్కాడు. కరెంట్ లేదు. నిట్టూర్చి కుర్చీ లాక్కుని నింపాదిగా కూర్చున్నాడు. డైనింగ్ టేబిల్ మీద రెండు చేతులూ వూతంగా నిలబెట్టి మధ్యలో ముఖం ఆన్చి ఆలోచనలో నిమగ్నమయ్యాడు. చీకట్లో ఫ్లాట్‌ఫాం అంచు దగ్గర నిలుచున్నపుడు ఎదుట వెళ్తూన్న రైలు కిటికీల్లోంచి క్షణానికొకటిగా మారుతూ కనిపించే దృశ్యాల్లా, ఆయన మనోనేత్రం ముందు యిటీవలి గతానికి చెందిన కొన్ని దృశ్యాలు చకచకా కదలసాగాయి.”

“ముసలాయన తలపంకిస్తూ కిందికి చూసాడు. వాళ్ళిద్దరూ నిద్రగన్నేరు చెట్టు కింద వున్న ఓ సిమెంటు బెంచీ మీద కూర్చున్నారు. గాలి కదిలినపుడల్లా కాసిని ఎండుటాకులు గింగిరాలు తిరుగుతూ రాలిపడుతున్నాయి. నేల మీద పడ్డ ఆకుల్ని ముసలాయన వూతకర్రతో సర్దుతున్నాడు.”

పదాలతో పెయింటింగ్ వేయడం కవిత్వంలో సాధారణం. కానీ మెహెర్ వాక్యాలు మోషన్ పిక్చర్ ని తలపిస్తాయి. మెహర్ కథల్లో visualization 3D స్థాయిలో ఉంటుంది. మన పంచేంద్రియాలకి ఒకేసారి పని కల్పించే శైలి అతనిది. ఈ పేరాలు చూడండి-

“నడవాలో ఇదివరకూ లేని బల్బు ఒకటి పసుపుగా వెలుగుతూ ఆ చోటుకి కొత్తగా రాత్రి వ్యక్తిత్వాన్నిస్తోంది. ఎదురింటావిడ గడప మీద నైటీలో, జడలో దువ్వెనతో కూర్చుంది, అతడ్ని చూసి కదలబోయిన కూతురి భుజం మీద చేత్తో నొక్కింది. ఆ పిల్ల పెద్దాళ్ళ కోసమన్నట్టు లేని కలవరాన్ని నటించబోయింది కానీ, బాల్యపు దిలాసా వల్ల అది అణిచిపెట్టిన చిరునవ్వుగా మాత్రమే వ్యక్తమైంది. పక్కింటి ముసలావిడ కర్టెన్ పట్టుకుని ఏదో మాట్లాడుతున్నదల్లా పొయ్యి మీద పాలు గుర్తు చేసుకుని వెనుదిరిగి వెళ్ళిపోయింది. వెన్ను మీద దృష్టి బరువు మోస్తూ ప్రసాదు తాళం ఎలాగో తీసి లోపలికి చేరి తలుపు వేశాడు. లైటు వేసి, కూరలు బల్ల మీద పెట్టాడు. రాగానే బట్టలు మార్చుకునే అలవాటు మర్చిపోయి, ఇంకా నడవాలోనే తచ్చాడుతున్న మనసుని మోసుకుంటూ, అలికిడి కాకుండా పచార్లు చేస్తున్నాడు.”

“….. వ్యక్తిత్వ మొక్కటే కాదు. అందం కూడా. ముఖ్యంగా ఆమె ముఖం. పక్క మీద ఆత్రం తీరిన తర్వాత ఇద్దరూ ఎదురుబొదురు ఒత్తిగిలి పడుకుని కాసేపు కబుర్లు చెప్పుకునేవారు. ఆ భంగిమలో దేహంపై భూమ్యాకర్షణ ఎప్పటిలా కింద నుంచి కాక పక్కల నుంచి పనిచేయటం వల్ల, ఆమె చెంపలకీ, వాటి మధ్య పొదిగున్న చెమ్మ కళ్ళకీ అపూర్వమైన పసి మెరుగు వచ్చి చేరేది. నవ్వు సాంద్రతరమయ్యేది. వయసు మాయమైపోయేది. ఆమెతో పాటు ఒత్తిగిలి పడుకున్నవాళ్ళకి తప్పితే ఇంకెవరికీ కనిపించని అందమది. ఈ బహుమతి విషయంలో జీవితం అతనితో ఉదారంగానే వ్యవహరించింది. పంపకాలు సమంగా జరగని స్తనాలతో, పొట్టతో, పీలకాళ్ళతో కాక, ఆమె స్వభావానికి అమిరే పసితనంతోనే ఆమెను జ్ఞాపకంలో దాచుకోగలిగాడు.”

ఒక్కోసారి మెహెర్ కథల్లోని పాత్రలు మనకు చాలా దగ్గరగా వచ్చి intimate విషయాలు పంచుకున్నట్టు అనిపిస్తుంది. అంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పను అన్నట్టు- మనతో మనం ఒప్పుకోలేని, మనకు నచ్చని విషయాల్ని కూడా పాత్రలు మనకు చెప్పుకుంటాయి. చేదుపూలు కథలో ఈ ఎలిమెంట్ ప్రస్పుటంగా కనిపిస్తుంది. కథకుడు ఏమీ దాచకుండా నిజాయితీగా కథ చెప్తున్నట్టు అనిపిస్తుంది.

సందర్భానికి తగ్గట్టు రాయగలగడం, బిగువుని చివరికంటా తీసుకురాగలగడం, నరేటివ్ వాయిస్ ని రైటర్ వాయిస్ కి దూరం పెట్టగలగడం, కథకి తగ్గట్టు గొంతుని సెట్ చేసుకోగలగడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన టోన్ ని ఏర్పరచుకోగలడం, తను చెప్పాలనుకున్న మెయిన్ ఐడియాని, అంతర్నిహిత గూఢార్థాన్ని చదివేవాళ్ళు తవ్వుకుని అనుభూతి పొందేట్లు చేయగలగడం, ఏ సంకోచం లేకుండా దృశ్యాన్ని నిస్సిగ్గుగా ఉన్నది ఉన్నట్టు చూపించగలగటం, ఒరాంగుటాన్ వంటి కథల్లో పాత్రల ద్వారా చేసే మనో విశ్లేషణా-మెహెర్ కథల్లో నేనెక్కువగా అభిమానించే అంశాలు.

***

Avatar

రవి వీరెల్లి

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు