మెలకువనిచ్చే అనుభవమే ఈ కథ!

క్కసారి టాల్ స్టాయ్ దగ్గరికి వెళ్ళాక మళ్ళీ వెనక్కి రావడం కష్టం. ఆ కథల్లో ఏదో మహత్తు ఉంటుంది. మనసుకి కాదు ఆత్మకి పట్టిన దుమ్మును ఊడ్చిపారేసే మహత్తు అది.
ఆత్మ మీద కూడా దుమ్ము పడుతుందా అంటే నేను చెప్పలేను గానీ అంత లోలోతుల్లోకీ కాలుష్యం చేరిపోయి ఉంటుందని మనకి తెలియదు. ఎలా చేరుతుందో ఎందుకు చేరుతుందో ఈ మహారచయిత తన పాత్రల ద్వరా వారి జీవితపు లోయల, శిఖరాల ద్వారా విప్పిచెపుతాడు. అలాంటి కథ ‘స్వామి సేర్గెయ్’
చాలా రోజులు ఈ “విషాద సంగీతం” పేరుతో ఉన్న కథల పుస్తకంలో మిగతా అన్ని కథలూ నాసికాదఘ్నంగా చదువుతూ ఉన్నా, ఈ కథ ఎందుకో తిప్పేసేదాన్ని. నా దురదృష్టం. చివరికి ఎందుకో ఒకసారి పుస్తకం తీసినప్పుడు ఇదెందుకు వదిలెయ్యాలి ఇదీ చదువుదాం అని మొదలుపెట్టాను. ఆ కథ పూర్తయ్యాక అది ఒక దివ్యానుభవం అనిపించింది. కథ హృదయదఘ్నంగా లోతుల్లోకి దిగబడిపోయింది. ఇప్పటికీ అదొక గాఢమైన మెలకువనిచ్చే అనుభవమే.
మిగతా రాష్ట్రాల సంగతి నాకు తెలీదుగానీ తెలుగు నేల అంతటా, తెలుగు గాలి అంతటా ప్రవచన కాలుష్యమే. కొద్ది మినహాయింపులున్నా సరే. అరిషడ్వర్గాలను నాశనం చేసుకోవాలని ఊకదంపుడు గా చెప్పే ప్రవచనాధిపతులకు అసలు అవేమిటో తెలియదు. అవి ఎలా అంతరంగాలను శిథిలాంధకారంలో నింపుతాయో తెలీదు.
 ఎందుకంటే ప్రభుత్వోద్యోగి అయిన ఒక ప్రవాచకుడి మాటలు చెవులారా విన్నాను. ఆయన ఆఫీసులో ఉన్నప్పుడు తన పై అధికారికి నమస్కారం చేస్తాడట. కానీ ఆ పై అధికారి తన ప్రవచనం వినడానికి వచ్చినప్పుడు ఆయన తనకి నమస్కరించాలట. విన్నారా!
ఆయనకి ప్రపంచం నలుమూలలా వీరభక్తశ్రేణి ఉంది.
స్వామి సేర్గెయ్ కథ చదివితే మనను చుట్టుముట్టి ఉన్న ఇలాంటి కాలుష్యాల నుంచి ఊరడింపే కాక మన లోపల దాగిన భూతాలు కూడా పకపకా నవ్వుతూ మన కళ్ళముందుకొస్తాయి. ఆ కొంచెం సేపైనా కాస్త శుభ్రపడతాం. సుఖపడతాం కూడా.
స్థూలంగా కథ చెప్తాను. 75 పేజీల కథ. 1898 లో రాసేడు. ఇది సన్యాసిగా మారిన స్తెఫాన్ కసాత్ స్కీ రాకుమారుడి కథ. ఆ తర్వాత జీవితంలో సాధారణత, అట్నుంచి అతిసాధారణతకు అతడు ఎలా ప్రయాణించాడో ఆ దారిని ఇతరులెవ్వరికీ సాధ్యం కాని రీతిలో – కేవలం ఋషిప్రోక్తమా అన్నట్టు చెప్పాడు టాల్ స్టాయ్.
కసాత్ స్కీ మరణించిన తండ్రి కోరిక ప్రకారం కేడెటోకోర్ లో చేరి సర్వప్రధముడయ్యాడు. అతనికి అంతటా అన్నిటా సర్వోత్కృష్టుడు కావాలన్న కోరికా, అహమూ దానికి కావలసిన పట్టుదలా, దీక్షా ఉన్నాయి. అవుతూ వచ్చాడు.
కానీ రాజమహల్ లో జన్మరీత్యా జారు ప్రభువు బంధువర్గానికే మొదటిస్థానం. అతడు రెండవతరగతి రాజవంశం వాడు. కాబట్టి ఆ స్థానం కోసం కసాత్ స్కీ రాజకుమార్తెను ప్రేమించాడు. ఆమె, ఆమె తల్లీ కూడా అంగీకరించారు. తర్వాత అతడు నిజంగానే ఆమెను ప్రేమించాడు. కానీ ఆమెకు అదివరకే యువరాజుతో సంబంధం ఉందన్నవిషయం ఆమె అతని దగ్గర దాచలేకపోయింది.
కసాత్ స్కీ అహం ఊహించలేనంతగా గాయపడింది. ఇక తనకు అసూయ కలిగించినవాడిని మించడానికి దారి లేదు.  అంతకన్న అధికుడు కావడం తప్ప.
 దానికి మార్గంగా అతను అన్నీ వదులుకుని సన్యాసం తీసుకున్నాడు. ఆస్తి. రాజోద్యోగం, ప్రేమించిన యువతి ఇవన్నీ నూ. ఇప్పుడు ఈ స్థానంలో ఉండి అంతకుముందు తనకన్న అధికులైనవాళ్ళందరినీ ఏవగింపుతో చూడగలిగాడు.
కేవలం ఇందుకోసమే అతను సన్యాసి కాలేదు. అతని అహంతోపాటే అతనిలో ఉన్న మరో ప్రేరణ భక్తిభావం. అతని నిరాశ అతన్ని దేవుడి దగ్గరికి తోసింది. ఆ విశ్వాసం బాల్యానిది. ఆ పట్టు పోలేదు.
సన్యాసి జీవితంలో కసాత్ స్కీ మూడు మఠాలు మారాడు. దాదాపు మూడు మఠాలలోనూ కలిపి ముప్పయి ఏళ్ళు ఉన్నాడు. ఈ ముప్పయి ఏళ్ళలోనూ మూడు మఠాలూ అతన్ని మూడు రకాల కఠిన పరీక్షలకు గురిచేశాయి.
 ఆ పరీక్షలు అతని లోపలి దెయ్యాలను అతనికి స్పష్టంగా చూపించినవి. వాటి పట్టు నుంచి బయట పడడానికి అతను ఎలా పెనుగులాడాడో రచయిత కత్తివాదర మీద నడకలాంటి శైలిలో రాస్తాడు.
మఠాలన్నిటా ఆనాడు కూడా రాజకీయాలు,అవి అధికారాల పట్లా, ప్రభుత్వాల పట్లా ఆసక్తితో సంబంధాలు కలిగి ఉండడాలూ, మార్పూ, వివేచనా లేని రొటీన్ దినచర్యా ఉన్నాయి. వీటన్నిటినీ కసాత్ స్కీ తమాయించుకున్నాడు. అది కేవలం విధేయత అనే ఒకే ఒక్క కడపటి గుణం లేదా సుగుణం దానివల్ల మాత్రమే.
”సన్యాసిగా కూడా అతడు పరిపూర్ణత కాంక్షించాడు. అక్కరగా పాటుపడుతూ, మితాహారిగా ఉంటూ, సౌమ్యంగా, మృదువుగా, స్వచ్ఛంగా చేతలలోనే కాదు, ఆలోచనలలో కూడా విధేయంగా ఉంటూ అతను ఆ గమ్యం కోసం పాటుపడ్డాడు” – అని టాల్ స్టాయ్ రాస్తాడు.
 విధేయతే లేకపోతే అక్కడి మఠసోదరత్వపు అవలక్షణాల వల్ల పిప్పి అయిపోయి ఉండేవాడు కూడా అని రాస్తాడు. ఎందుకంటే అప్పటికే అతడు మానసికంగా వాటన్నిటికీ పై స్థాయిలో ఉన్నాడు. కానీ గురువుల ఎడల విధేయంగా ఉండాలనే లక్ష్యం అతడిని సంతోషంగా ఉంచింది.
కానీ ఈ విధేయతకు కూడా పరీక్ష ఎదురయ్యింది. మొదటి మఠంలో ఏడేళ్ళున్నతర్వాత అతను సేర్గెయ్ (గురుసన్యాసి)గా మార్చబడి మరో మఠానికి వెళ్ళిన తర్వాత జరిగిందది. రెండవ మఠంలో స్త్రీ మోహం, మఠాధిపతి కుత్సితం పట్ల కలిగిన అసహ్యం రెండూ అతన్ని ఒకలాగే బాధించాయి. అసహ్యం కూడా ప్రలోభమే అంటాడు టాల్ స్టాయ్.
రెండిటి నుంచీ బయటకు త్వరగానే వచ్చాడు.
అప్పుడు జరిగిందది. ఒక ప్రభుత్వాధికారి తనను చూడాలన్నాడని అతను ఆశ్రమానికి వచ్చాడని తనని రమ్మని గురువు కబురు చేశాడు.
కేవలం రమ్మన్నాడు తప్ప పై విషయాలు చెప్పలేదు.
 సేర్గెయ్ వెళ్ళి స్వామికి నమస్కరించి ఎందుకు రమ్మన్నారని అడిగినప్పుడు ఆ జనరల్ గారిని చూపించాడు. అతడు తన పాత సహోద్యోగి. అతని కోసం తనకు కబురంపడం వెనక స్వామి తెలీకుండానే ప్రభుత్వాధికారానికి ఇస్తున్న విలువకి సేర్గెయ్ కి అసహ్యం కలిగింది.
ఆ అధికారి వేపు తల కూడా తిప్పకుండా స్వామితోనే – ”ప్రలోభాలను జయించడానికి లౌకికప్రపంచాన్ని వదిలివచ్చిన నన్ను తిరిగి ప్రలోభాలకెందుకు గురిచేస్తారు” అని చెప్పి వెనక్కి వచ్చేసాడు.
కానీ ఇది అహంకారపూరిత చర్య అని అతనికే అర్ధమయింది.
ఉదాసీనతతో తల ఊపి పలకరించి వచ్చెయ్యవచ్చు కదా. అలా రాలేకపోవడం వెనక ఇంకా అతనిలో పేరుకుని ఉన్న అతని అహంకారం అతనికి అర్థమయింది.
మర్నాడు మఠాధిపతిని క్షమాపణ అడిగి తిరిగి వెనకటి మఠానికే వచ్చేస్తానని తనకి ఇంకా అక్కడే శిక్షణ అవసరమనీ కోరాడు.
కానీ గురువు అతన్ని మరొక ఏకాంతవాస మందిరానికి పంపేడు. ఆ మందిరం కొండలో దొలిచిన గుహ. దానికి ఒక బాహ్య మందిరమూ, అభ్యంతర మందిరమూ ఉన్నాయి. అక్కడ సేర్గెయ్ ముని అయ్యాడు.
ఆరేళ్ళు ఏకాంతంలో మౌనంలో గడిచాయి. కానీ అతనిలో కలుగుతున్న అంతర్మధనం  అతనికి కష్టంగా ఉంది. ఇలాంటిది పూర్వం లేదు. మధనానికి కారణం అవిశ్వాసమూ, విషయవాంఛ. అవిశ్వాసం పోతే విషయవాంఛ కూడా పోయేది. కానీ మళ్ళీ అనుమానం ప్రవేశించేది.
అలాంటి సమయంలో స్వేచ్ఛాపరురాలయిన ఒక స్త్రీ అతన్ని ప్రలోభపెట్టబోయింది. ఒక నడిరాత్రి అతని మందిరంలోకి బలవంతంగా ప్రవేశించి, అతన్ని పలువిధాల ప్రలోభానికి గురిచెయ్యాలని చూసింది
 అతనూ నిలదొక్కుకోలేకపోయాడు. చివరకు సేర్గెయ్ బయటకు వెళ్ళి కట్టెలు కొట్టే గొడ్డలితో తన చిటికెనవేలు నరుక్కొని ఆ విధంగా ఆ ప్రలోభాన్ని జయించాడు.
తెగిన వేలు నుంచి బొటబొటా కారుతున్న రక్తం చూసి విషయవాంఛను అతను జయించిన విధం చూసి ఆమెలో పరివర్తన వచ్చింది. ఏడాదిలో ఆమె సన్యాసం తీసుకుని కఠోరమైన భక్తురాలిగా మరో ఆశ్రమంలో చేరిపోయింది.
ఇది రెండవ పరీక్ష.
ఈ ఉదంతమంతా ప్రజల్లో పాకింది. అతన్ని మహాత్ముడిగా భావించి ప్రజలు అతని చేత బలవంతంగా రోగులను తాకి స్వస్తత పరిచే మార్గంలోకి లాగేరు. మహత్యాలు మొదలయ్యాయి. ప్రజల్లో అతనిపేరు మరింత గా అంతటా పాకింది.
 మఠంలో పదమూడేళ్ళు గడిచాయి. ఈ కాలంలో మఠం అధికారులు అతని మహత్తు ద్వారా విరాళాలు రాబట్టుకునే విధంగా అతని జీవిత సరళి మార్చారు.
ఆహార విహార విషయాలలో మార్పులు వచ్చాయి. ప్రజలకి అతను దేవుడయ్యాడు.
మఠాధిపతులు దాన్ని ఉపయోగించుకోవడం అతనికి నచ్చకపోయినా ఎక్కడో ఈ ప్రచారం అతనికి ఆనందం కలిగిస్తూ ఉంది.
కానీ హృదయపు లోతుల్లో దేవునిపని బదులు సైతాను  తనకు మానవుడిపని పెట్టాడని అర్ధమవుతూనే ఉంది.
అక్కడనుంచి పారిపోదామనీ, విడిచిపెట్టి వెళ్ళిపోదామని అనుకున్న దశ కూడా ఉంది కానీ పోలేకపోయాడు.
”ప్రజల అనురాగం ఆనందదాయకంగా ఉంది. అది తనకు అవసరం. కానీ దానికి బదులుగా తనలో వాళ్ళపట్ల ప్రేమ కలగడం లేదు. తనకి ఇప్పుడు హృదయంలో ప్రేమ లేదు. వినయం లేదు. పరిశుధ్ధత లేదు.”
అటువంటి మనస్థితిలో ఆ మఠంలోనే ఒక యువతి బలవంతానికి లొంగిపోయాడు. ఆ రాత్రి తెల్లవారేలోపు అతనికి అర్థమయింది. కీర్తి లేదా గుర్తింపు తనని ఎలాంటి అధోగతిలోకి దిగజార్చిందీ అన్నది.
వెంటనే సన్యాసివేషం మార్చుకుని ఎప్పటినుంచో దాచుకున్న రైతు దుస్తులు ధరించి, జుట్టు పొట్టి గా కత్తిరించుకుని మఠం వదిలిపెట్టి నడుచుకుంటూ సాగిపోయాడు.
వేసట లేని నడక. బాల్యస్మృతులు. అందులోంచి జీవితంలో లోకపరత్వం తెలియని చిన్ననాటి స్నేహితురాలు గుర్తొస్తుంది. ఆమె జీవితమంతా అనేక కష్టాలు పడి ముసలివయసులో ఆ దగ్గరలోనే ఉందని అతనికి తెలుసు.
ఆ తిరుగుడులో ఓ రాత్రి నిద్రలో కలలో ఆమెను కలవమని దైవసందేశం లాంటి ఆదేశం వస్తుంది.
వెతుక్కుంటూ వెళతాడు. తాగుబోతు భర్తను కోల్పోయి, ఉన్న ఇద్దరు పిల్లల్లో కొడుకును పోగొట్టుకుని, సోమరి, తాగుబోతూ అయిన అల్లుడు, కూతురూ వారి అయిదుగురు పిల్లల కోసం బతుకుతూ అతి పేదరికంలో ఉంటుంది ఆమె. ఆ కుటుంబం కోసం బయట నౌకరీ చేసి కాసిని డబ్బులు సంపాదించి ఇంట్లో కూడా సేవ చేస్తూ ఉంటుంది.
ఆమె గురించి టల్ స్టాయ్ ఇలా రాస్తాడు. ”దాదాపు శారీరక బాధ ఉండేటంత తీక్షణతతోటి, మానవ సంబంధాలలో ఉండే నిర్ధయ ఆమెను బాధించింది” అని. అంతటి కరుణామూర్తి అన్నమాట.
సేర్గెయ్ ని గుమ్మంలో చూసి ఆమె గుర్తుపట్టలేదు. ఎవరో బిచ్చగాడనుకుని తన కోటు జేబులోంచి 5 రూబుళ్ళు ఇద్దామనుకుని పది రూబుళ్ళకి తక్కువ నాణెం లేదని గుర్తొచ్చి పోనీ తను చేస్తున్న రొట్టె పెడదామనుకుని – తన లోభానికి సిగ్గు పడుతుంది.
 పది రూబుళ్ళూ రొట్టే కూడా ఇవ్వడానికి నిర్ణయించుకుని వెళ్ళి కాసేపటికి అతడిని గుర్తుపడుతుంది.
 ఆమె స్వభావం గురించి ఇలా చెప్పి రచయిత ఇంకో మాట అంటాడు. ”ఒక దుర్వాసన, కటువైన మాట, లేకపోతే దెబ్బ వల్ల బాధ పడినట్టుగా ఆమె కార్పణ్యం కనిపిస్తే బాధపడిపోయేది.”
ఆ చిన్న పేద ఇంట్లో అతిధి గా ఉండి ఒక రోజంతా అతను ఆమె జీవిత విధానాన్ని చూశాడు.
అప్పటికి అతనికి పూర్తి జ్ఞానబోధ అయింది.  రొట్టె, నాణెం ఇస్తూ గర్వపడకుండా ఆమె అతడిని క్షమించమని అడగడం అతనికి ఆమెను తెలుసుకునేలా చేసింది. ఆమె ముందు తన తప్పులు నివేదించుకుని పశ్చాత్తాపపడ్డాడు. నేను మీ దగ్గర నేర్చుకుందామని వచ్చానన్నాడు.
ఆమె తన జీవితకథనంతా ఎవరు మీదా ఒక్క నింద మోపకుండా అతనితో చెప్పింది. చర్చికి, ప్రార్థనలకీ సమయం ఉండదనీ మొక్కుబడిగా చేస్తాననీ వినయంగా చెప్పింది. చెప్తున్నంతసేపూ ఇంటిలో అందరి అవసరాలకూ లేస్తూనే ఉంది. అయినా ఆమె అతనికి ఆతిధ్యం ఇచ్చి సాగనంపింది.
అతనికి తన కల అర్ధమయింది. ”సరిగ్గా నేను ఉండవలసినట్టుగా ఆమె ఉంది. నేను దేవుని కోసం జీవిస్తున్నట్టుగా నటిస్తూ మనుషుల కోసం జీవించాను. కానీ ఆమె తను మనుషుల కోసం జీవిస్తున్నానని భావించుకుంటూ దేవుని కోసం బతుకుతోంది.”
 అతనికి అంతా స్పష్టంగా విడిపోయింది.
సాధారణమైన అనామకమైన మనిషిగా మారగలిగాడు. ఎవరో  భిక్ష వేస్తే నిర్వికారంగా తీసుకున్నాడు. అంతే నిర్విచారంగా మరో అంధ భిక్షువు కు ఇచ్చేశాడు.
ఎక్కడో సత్రంలో బస చేస్తే పోలీసులు పట్టుకుని కోర్టులో హాజరు పెట్టారు. కోర్టువారు  పాస్ పోర్ట్ అడిగితే లేదని తాను దేవుడి బిడ్డనని చెప్పాడు.
కోర్టువారు  అతనికి శిక్ష విధించి సైబీరియాకు ప్రవాసం పంపారు
చివరగా అతను ఒక రైతు తోటలో పనిచేస్తూ, వూళ్ళో పిల్లలకి చదువు చెప్తూ, రోగులకి సేవ చేస్తూ సైబీరియాలో శిక్ష అనుభవిస్తూ ప్రశాంతంగా ఉన్నాడని ముగిస్తాడు.
టాల్ స్టాయ్ అతని గురించి ఇలా అంటాడు. ”మనుషులు అనుకున్నవాటిని గురించి ఎంత తక్కువ పట్టించుకుంటే అంతగా అతను భగవంతుని సాన్నిధ్యం అనుభవించాడు” అని.
చలంగారు జీవితమంతా పోరాడింది ఈ లోకపరత్వం గురించే.
అహంకారం కన్న, విషయ వాంఛల కన్న, పెద్ద ఆపద లోకం నుంచి గుర్తింపు కోసం బతకడం అన్నది. అందుకే సేర్గెయ్ వాటిని ఎలా దాటుకుంటూ వచ్చాడో ఆ వరుసలో చెప్పాడు టాల్ స్టాయ్.
కథ సంక్షిప్తంగా చెప్పాను.
అసలుకథ చదవాలి. అది చదవకముందున్న మనకీ చదివిన తర్వాత మనకీ చాలా తేడా ఉంటుంది కొంతసేపయినా సరే.
*

వాడ్రేవు వీరలక్ష్మీ దేవి

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అహంకారం కన్న, విషయ వాంఛల కన్న, పెద్ద ఆపద లోకం నుంచి గుర్తింపు కోసం బతకడం …నిజంగా ఈ ప్రపంచంలో చాలామంది బ్రతుకులు కీర్తి కండూతి ల కోసమే!.. బాహ్య ప్రపంచంలో జీవిస్తున్నా మానసిక సన్యాసమే(బాహ్యప్రపంచo పట్ల ధృడమైన విరక్తి) ఆధ్యాత్మిక చింతనకు మార్గం! చాలామంచి కథను విశ్లేషించి అందించారు. ధన్యవాదాలు.👌💐💐

  • Reminded me of Stefan Zweig’s Virata, or The Eyes of the Undying Brother, translated into Telugu by Ponugoti Krishna Reddy as Virat. Let’s not judge the pravaachakas. Even such judging is hubris. This is Tolstoy’s message. Thanks a lot for introducing this great story!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు