మెరుపులు, మలుపుల్లేని ఓ తాత్విక కథ

ఆ మాటకొస్తే కథలో పెద్దగా మెరుపులు, మలుపులు లేవు. సత్యజిత్ రే సినిమాలలోలా ఓ చెట్టు, కుండ, తాటాకు గొడుగు, నది, బర్రెలు కడిగే వాడు, ముసలిది అంతే! అయితేనేం చిన్న చిన్న మాటలలో పెద్ద పెద్ద  జీవిత సత్యాలు కనిపిస్తాయి.  నా దృష్టిలో ఇది  చాల గొప్ప తాత్వికమైన కథ. వందేళ్ళయినా చెక్కు చెదరని కథ.

​​కొన్ని రోజుల క్రితం చిత్రంగా నా దగ్గరకు వాచవి అనే ఓ పుస్తకం వచ్చి చేరింది. కొంతమంది రచయతలు, సహృదయులు, నటకులు కలిసి అరవయి ఐదేళ్ల క్రితం ఢిల్లీలో ఏర్పరచుకున్న ‘రసన’ సంస్థ నుంచి వెలువడ్డ పుస్తకమే వాచవి. తీరా పుస్తకం ముట్టుకుంటే  పొడిపొడిగా రాలిపోతోంది. దిగులు వేసింది. పదకొండు మంది రచయతల హృదయమధన ఫలితం ఈ అక్షర సంపద. అతి జాగ్రత్తగా మొదటికధ ‘మేలు మరువని కన్నీరు‘ను ఒక్కొక్క పేజీ స్కాన్ చేసి పీ.డీ.ఎఫ్ ఫైల్ గా భద్రం చేశాను.

రచయత పేరు కవి కొండల వేంకట రావు అని ఉంది. వెంటనే ముద్దుకృష్ణ వైతాళికులు గుర్తొచ్చింది. నిజానికి, ఈ రచయిత గురించిన వివరాలు అంతగా తెలియవు.

ఎప్పటిదో పాత పుస్తకం. మొదటి కధే పెద్దగా పరిచయంలేని పేరు, ఎలా ఉంటుందో అనే నిరాసక్తత తో చదవడం మొదలు పెట్టాను.

కథ  పూర్తి అయ్యేసరికి మనసు లో ఒక శూన్యం, అంటే  విషాదం కాదు, అంతకు మించిన దేదో!  భౌతికపు స్థితి అంచులు దాటిన అచేతనావస్థ.  కథ  ఇలా కూడా రాయగలరా? ఈ రకమైన వస్తువు తో చదువరి గుండె లోపలి పొరల్లోకి తీసుకు పోయే కధనంతో రాయడం అంటే మనలని మనం చూసుకోవడమే!!

ఈ కథను తప్పకుండా పరిచయం చేయాలని అప్పుడు అనిపించింది. నిజానికి పరిచయం కన్నా కూడా కథ చదివితే చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే కథ లింక్ ని కింద పొందుపరిచాను. ఇప్పుడు వాస్తవికత అంటున్నామే , ఈ కథ అంతా అదే. ఇందులో పెద్ద పెద్ద ఆర్భాటాలు ఉండవు, మూడే ముఖ్య పాత్రలు. కథ మొదలవడం గోదావరి నది దగ్గర ఓ రేవులో సూర్యాస్తమయంతో మొదలవుతుంది, కథ ముగియడం కూడా సూర్యాస్తమయంతోనే ముగుస్తుంది. ఈ కథని రచయిత అనుభవించే ఉంటారు, అందుకే హృదయం ద్రవించేలా రాయగలిగారు.

 

“కేవలం రచయత, తన చుట్టూ ఉన్న  జీవితాన్ని సాంతంగా పరిశీలించడం. అందులోను కదిలించినదీ, కరిగించినదీ ఏదైనా ఉంటే అది రాయడం వరకే అతని విధి. పాఠకుల తెలివితేటల మీద నమ్మకమున్న రచయితలెవరూ అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లు పరిష్కార మార్గాలకోసం అన్నీ వ్రాయరు. రచయత తెలివైన పాఠకులు సరిగ్గా ఆలోచించేటట్లు చేయగలడంతే” అన్న పెద్దిభొట్ల సుబ్బరామయ్యగారి మాటలు గుర్తొచ్చాయి.

ఇక టూకీగా కథలోకి వెళితే ……….

అక్కడ ముగురే వ్యక్తులు ఉంటారు. ఒకడు గేదెలు కడిగే నల్లటి గొల్లవాడు, రెండవది అరవై ఐదేళ్ళ  నల్లటి ముసలమ్మ,  ఆమె ముంచుతున్న కుండ కూడా నల్లటిదే. మూడో వ్యక్తి పచ్చని శరీరం, తెల్లని జన్నిదాలు(జంద్యము) మెరసేటట్టు సర్దుకొని మోకాటి నీటిలో సూర్యుని కెదురుగా నిలుచొని సంధ్యావందనం చేస్తూన్నాడు (ఈ వర్ణన లేకుండా కూడా రాయవచ్చు ఎందుకంటె అస్తమయ కాంతి లో సవర్ణులు, అవర్ణులు అందరు ఒకటే, యధాతధంగా తెలియజేయడం కోసమే పైవర్ణన అంటారు రచయిత)

‘ముంచిన కుండను  పైకి లేప లేక, నా నెత్తి మీదకి  లేవనెత్తకుండా  కుంగిపోతావా,  ఓ సూర్యభగవానుడా’ అని జాలి చూపులు చూసే ముసలమ్మ, సాయం చేసే ప్రయత్నం చేయకుండా ఆమెనే చూస్తున్న గొల్లవాడు, ఆ బలహీనురాలి దైన్యావస్థను తెలుసుకొని ‘దయ అన్నదే మతం, పరోపకారమన్నదే సంధ్యావందనం’ అని అనుకొని ఆ ముసలమ్మ నెత్తిమీదకి కుండ పెట్టి  ‘జాగ్రత్త’ అని చెప్పే బ్రాహ్మణుడు.

ఒక దశ దాటే వరకు, ఆ ముగ్గురు ఒకరి నొకరు మళ్లీ కలుసుకోలేదు. ఇక్కడ దశ అంటే పదేళ్లు. రచయత కల్పించుకుని ఆ ముసలమ్మ జీవితం గురుంచి చెబుతాడు. అంటే చదువరులకు ముసలమ్మ గురుంచే తెలిసే సమయానికి మూడు దశలు గడచి పోతాయి. తెలిసాక ఇంకో దశ గడచింది. పై ముగ్గురుని అందరూ ఈపాటికి మరచిపోయామంటే అతిశయోక్తి కానేరదు అంటారు రచయత. రోజువారీ జీవితం లో ఇలా ఏంతో మంది కనిపిస్తూ ఉంటారు. అయితే మటుకు అందరిని గుర్తుంచుకుంటామా? వీళ్ళు అంతేగా ? అలా కాదని ఈ మరపు ఎప్పటికో స్మృతికి వస్తుందని తెలిసినప్పుడు ఆ అనుభూతి విలువ కట్టలేనిదని అర్థ మవుతుంది.

కొంతకాలానికి  ఓ రోజున మధ్యాహ్నం ఓ ఇంట బ్రాహ్మణుడు కాలం చేసాడు. అతనిది అకాల మరణం. ఎంత దుఖించినా అంత్యక్రియ అనేది తప్పదు కదా ! బంధుగణం అతన్ని  మోసుకుంటూ స్మశానానికి తీసుకొని వెళుతుండగా చల్లటి గాలి మొహాన కొడుతూ  వానవచ్చే సూచన కనబడుతుంది దాని తో అందరూ ఆ పక్కనే శవదహనం కానిచ్చేద్దాం అని చెప్పి ఒక నలుగురు ని మాత్రమె ఉంచి మిగతావాళ్ళు వెళ్ళిపోతారు. అప్పటికే జోరున కురిసే వానలో తడిసి పోతున్న వాళ్ళు,  నలుగురం ఎందుకు, ఇద్దరు చాలని మరో ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. శవం కాల్చటానికి తెచ్చిన సామాగ్రి అంతా తడిసిపోయింది. ఎలా అనుకునే తరుణం లో గేదెలు కడిగే గొల్లవాడు , అదే కధ మొదట్లో కనిపించిన వాడు దగ్గరగా వస్తాడు.

వాడికి ఈ తతంగం అంతా అర్థమవుతుంది. ఆ శవం కాలాలంటే ఎండిన పిడకలు కావాలి ఎలా?  వాడికి అక్కడ దగ్గర్లో చెట్టు కింద కూర్చునే ముసలమ్మ గుర్తుకొస్తుంది. ఆమె దగ్గరకు వెళ్లి నీకు పదేళ్ళ క్రితం  సాయం చేసిన బాపనయ్య ఈ రోజు కాలం చేసాడు,  అనగానే ముసలమ్మ ‘అయ్యో నాతండ్రి ‘ అని ఏడుస్తుంది. ఇప్పుడు నీ సాయం కావాలి వర్షానికి శవం సరిగా కాలటం లేదు, నీ దగ్గరున్న ఎండు పిడకలు ఇస్తావా అనంగానే , ఆ ముసలమ్మ వెంటనే పిడకలతో పాటు  గొడుగును ఇస్తూ ‘ఇది తలకు దాపెట్టి పిడకలు పేర్చి అంటించమను, మంచి నడికాలపు మనిషి, ఒంటినిండా చమురే ఉంటుంది’ అని  పెద్దపెట్టున ఏడుస్తుంది. అది చూసి గొల్ల వాడు విస్తుపోతాడు. చితిమంటలు చూస్తూ  ‘ఆ సూర్యనారాయణ మూర్తి కంటే తేజశాలి నా తండ్రి’ అనుకుంటుంది. తక్కిన వాళ్ళు వెళ్ళిపోయినా చివరి వరకు ఉండి ‘నా తండ్రి నేను అడగనే లేదు, నా కష్టం కనిపెట్టి అలా తన చెయ్యి నా కడవ ను నెత్తి మీద పెట్టాడు. ఇప్పుడెవరెత్తుతారు? అనుకుంటూ ఆ కుండను అక్కడే విడిచి పెట్టి మళ్ళీ వస్తానంటూ సెలవు పుచ్చుకుంది ముసలమ్మ.

ఇక్కడితో కథ ముగుస్తుంది.

ఆ ముగ్గురు మనుష్యుల మధ్య బంధం ఏర్పడటానికి ఈ చిన్న సంఘటన చాలదూ! కథ మొదలులో కలిసిన పాత్రలు, మళ్ళీ కథ ముగిసి పోయేటప్పుడు కలుస్తాయి. అయినా ఆ బంధం  సాంద్రత ను  ఏ కొలమానంతో కొలవగలము? నిజంగా ఇది గొప్ప కథ!

ఆ మాటకొస్తే కథలో పెద్దగా మెరుపులు, మలుపులు లేవు. సత్యజిత్ రే సినిమాలలోలా ఓ చెట్టు, కుండ, తాటాకు గొడుగు, నది, బర్రెలు కడిగే వాడు, ముసలిది అంతే! అయితేనేం చిన్న చిన్న మాటలలో పెద్ద పెద్ద  జీవిత సత్యాలు కనిపిస్తాయి.  నా దృష్టిలో ఇది  చాల గొప్ప తాత్వికమైన కథ. వందేళ్ళయినా చెక్కు చెదరని కథ.

           

మణి వడ్లమాని

10 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • మంచి కధ పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. కధ బావుంది. //ఎందుకంటె అస్తమయ కాంతి లో సవర్ణులు, అవర్ణులు అందరు ఒకటే// ఈ వాక్యం మరీ బావుంది.

 • చాలా మంచికథని చాలాబాగా పరిచయం చేసేరు.

  శ్యామ్

 • గొప్ప కథని గొప్పగా పరిచయం చేసి గొప్ప పని చేసారు… కళ్ళు తెరిపించే
  కన్నీళ్లు తెప్పించే
  మనవత్వంని మొలిపించే
  మంచి కథ

 • కథ ,కథా పరిచయం అద్భుతంగా ఉన్నాయి .
  కవికొండల వెంకట రావు గారి కథలన్నీ చదవాలని ఉంది .
  ” సారంగ ” సారధులని, ఇలాంటి మరుగున పడ్డ రచనలని వెలుగులోకి తెప్పించినందుకు ప్రశంసించాలి .
  మణి వడ్లమాని గారికి ,పరిచయం చేసినందుకు, రుణపడి ఉంటాము.
  మిగతా కథలని కూడా అందించగలిగితే బాగుంటుంది .

  • సత్యనారయణ గారు ఆలస్యంగా చూసినందుకు మన్నించాలి. మీకు నచ్చినందుకు ధన్యవాదాలు

 • కవికొండల వెంకట రావు గారి ‘మేలు మరువని కన్నీరు’ కధను పరిచయం చేసిన మణి వడ్లమాని గారికి ధన్యవాదాలు.

  ప్రియమైన శ్రీ పి. సత్యనారాయణ గారు! కవికొండల వెంకట రావు గారి కథల పుస్తకాలు విశాలాంధ్ర బుక్ హౌస్ వారి వద్ద కానీ, అమెజాన్ వారి వద్ద కాని దొరుకుతాయనుకుంటా

  https://www.amazon.in/Books-Kavikondala-Venkata-Rao/s?ie=UTF8&page=1&rh=n%3A976389031%2Cp_27%3AKavikondala%20Venkata%20Rao

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు