మెరవణి

డుసులైన మనకే కొలగోత్రాలు. అవి దేవుళ్ళకెందుకుంటాయి? అయితే ఇప్పుడు దాన్ని దేవుళ్ళకూ అంటగట్టి మీ దేవుడూ మా దేవుడని ఏరుజేస్తా ఉండారు.

ఈ మద్దెన మాదిగ పెద్దన్న దగ్గిర గెజ్జి మేక తోళ్ళు రొండుంటే ఇచ్చినాను ఊన గట్టమని. ఎందుకంటే గెజ్జి మేక తోళ్ళతో పలకలు మూయిస్తే కణకణామని పలకతాయని. ఊన గట్టుంటే పలకలు మూసియ్య మందామని మాదిగపల్లికి పొతిని. ఆయన సెప్పులు కుట్టుకుంటా కనబడినాడు.

“యట్టుండావు పెద్దన్నా!” అని అడిగినాను.

ఆయన “వొకప్పుడు బాగనే ఉండేవోణ్ణి సెంగల్రాయా! ఎప్పుడైతే మోట గట్టి నీళ్ళు తోలేది నిలిపేసి, ఆయిలు మిసన్లు పెట్టినారో, అప్పుడే తొండాలు కుట్టేది నిల్సిపొయ్యింది. ఇప్పుడు సెప్పులు కుట్టుకుంటా ఉండాను. ఈ గిరాకి ఎప్పుడో ఒకిటీ, అరా వొస్తాయి. దాంతో యట్ట బతకతాము? అందుకే మా బతుకులిప్పుడు యారక తినే కోడికి ముల్లిరిగినట్టయ్యింది” అన్నాడు.

“మీ బతుకులే గాదు పెద్దన్నా! మా బతుకులు గూడా అట్టనే తెల్లర్నాయి గానీ, ఇంతకూ నా పనేమి సేస్తివి” అని అడిగినాను.

“నీ తోళ్ళు ఇంగా రడీ కాలేదు సెంగల్రాయా! సున్నం, తంగేడు సెక్కేసి, గల్లా తొట్టిలో నానబెట్టుండాను. ఇంగా పది దినాలు పడతాది. ఈలోగా మాతమ్మ తిర్నాలు పెట్టుకున్నాము. నిన్ననే సద్దికూళ్ళపల్లికి పొయ్యి కత సెప్పేవోళ్ళకు అడ్మాసం ఇచ్చి, వొక్కాకు గూడా పెట్టొచ్చినాను రమ్మని. సాటింపు గూడా ఏసేసి బందుగుళ్ళకంతా గూడా సెప్పేసినాము. ఇంగ సుట్టు పక్కలోళ్ళకే సెప్పాల. నీకు గూడా ఇదే సెప్పటం, తప్పకుండా వొచ్చేయాల” అని సెప్పినాడు. నేనూ సరేనని యలబారేసినాను.

కత సెప్పేవోల్లంటే వాళ్ళూ గూడా మాదిగోళ్ళే! కాకపోతే వాళ్ళూ ఈళ్ళూ ఇచ్చీ తీసుకొనేది లేదు. వాళ్ళేమో మేము మాదిగలు కాదు, మాదిగ మాస్టీపులం, అంటే మాదిగోల్లకు గురువులు అంటారు. ఈళ్ళనడిగితే వాళ్ళు గురువులు గాదు గిరువులూ కాదు. డక్కలోల్లు గదా అంటారు. ఈళ్ళల్లో ఎవురు గొప్పో ఎవురు కీతో ఆ మాతమ్మకే తెలవాల.

బుదువారం నించి నాలుగు రోజులు కత జరిగి, ఐదో దినం ఆదివారం అగ్గి తొక్కేదంటే యట్టా పది దినాలై పోతాది. తరవాత వొద్దాంలే అని యలబారేసినాను వొచ్చేదానికి. కాని మాదిగపల్లికొచ్చి కొంసేపన్నా మునికిష్టడితో కుశాల పడకపోతే నాకు వొచ్చినట్టే ఉండదు. అందుకని మునికిష్టడింటికి పోతే, వాడూ సెప్పులు కుట్టుకుంటా ఉండాడు.

నన్ను సూసి, “కూసో బామార్ది” అని కూసోబెట్టి, వాడి పెండ్లాంతో “ఏవే! నీ అన్నదమ్ముడు తోటి సెంగల్రాయులొచ్చుండాడు. ఆ దొంతి కడవలో ఉండే ఎండుతునకలు రొండేసి పుల్సు పెట్టు, తినేసి పోతాడు” అన్నాడు.

ఆ మాటతో నాకు నవ్వొచ్చి పకపకా నవ్వేసినాను. ఎందుకంటే వాడెప్పుడూ ఇంతే! నాతోనేగాదు రెడ్లు, నాయుళ్ళు, బలిజోళ్ళు ఎవురొచ్చినా ఇట్టనే కుశాల పడతా ఉంటాడు. అయితే నాకు ఇదంతా  ఇచిత్రంగా తోస్తాది. వాల్లిండ్లల్లో మేమెప్పుడూ తినిందీ లేదు. మా ఇండ్లల్లో వాళ్ళు తినింది లేదు. మేం ఒకరింట్లో ఒకరు తినేదానికి మాత్రం వొప్పుకోం గాని, ఎగువ కులపోళ్ళ ఇండ్లకు పొయ్యి, మీ రగతం మా రగతం ఒకటే గదా అని అడగతాం. ఏం లాభం? ముందు వాళ్ళూ మేము ఒకటైతే, ఆ తరవాత వాళ్ళనడిగే అక్కు మాకుంటాది. అది తెల్సుకోకుండా మొత్తుకుంటే ఏం లాభం అనిపించింది.

ఇట్ట వాడు నేను కొంచేపు కుశాల పడినాక “ఇదే సెప్పటం బామార్దీ! రేపిట్నించి మాతమ్మ తిర్నాలు. అగ్గితొక్కే దాక ఇంటికి పోవాల్సిన పనిలేదు. ఈడనే ఉండాల” అన్నాడు. నేను గూడా “అట్టనే బామర్ది” అని వొస్తావుంటే, గంగక్క గూడా కనబడి “సెంగల్రాయా! నేనే మీ ఊరికి వొద్దామనుకుంటిని మాతమ్మ తిర్నల్లకు పిల్సే దానికని. నువ్వే వొచ్చినావు. వొచ్చేయి సెంగల్రాయా!” అని సెప్పింది. నేను ‘సరేలే గంగక్కా’ అని వొచ్చేసినాను.

మర్సనాడు తెల్లర్తో నేను మాతమ్మ గుడి కల్ల పోతే గుడికి సున్నం గొట్టేవోల్లు కొడతా ఉంటే ఎర్రమట్టి పట్టీలు తీసేవోల్లు తీస్తా ఉంటే, గుడికి సుట్టుపక్కలంతా సుబ్బరం జేసే వోల్లు సేస్తా ఉండారు. వొచ్చిన జనం నిలవాల గదాని. కొంతమంది గుడి ముందు కల్లాపు జల్లి ముగ్గులేస్తా ఉండారు. గుడి సుట్టూ యాపమండలు కట్టినారు. సుట్టాలంతా గూడా వొచ్చేసుండారు. యా ఇంటికాడ జూసినా సుట్టాలు గిసగొడతా ఉండారు. ఇంతకు ముందు తిర్నాలు జరిగినప్పుడు గూడా నేను సూసినాను. మాతమ్మ తిర్నాలంటే మామూలుగా ఉండదు. అయిదు రోజులు పచ్చాపలం బార్తన కంటే బాగ జరగతాది.

ఆ పొద్దు కత సెప్పేవోళ్ళు, మద్దేణంకంతా వొచ్చేసి ఊరి సుట్టూ కట్టు కట్టినారు. పుట్ట కాడ పూజ జేసి కత ఆరంబించినారు. కత సెప్పే బద్రిగాడు ముందు గెణనాదుణ్ణి తల్సుకొని, కత ఆరంబించి నాలుగు రోజులు మాతమ్మ గుడి ముందే సెప్పినారు. దీన్నె అంకమ్మ కత అని గూడా అంటారు. ఇనే దానికి సుట్టుపక్కల ఊర్లనించి అందురూ వొచ్చినారు. నాలుగు దినాలు కత వొక ఎత్తైతే అయిదో దినం కతే వొకెత్తు. ఆ పొద్దు వొనం కొరికేదని, యాపమండలు తెచ్చి వొక కయ్యంతా నాటినారు.

పంబలోళ్ళు, కొమ్ములోల్లు మాతమ్మను కోడించీ కోడించీ ఏడుకొంటే బద్రిగోడి మింద ఆయమ్మ వాలి ఉగ్రమొచ్చేసింది. మల్ల ఆ వొనానంతా నోటితో కొరికేసి జనం మిందకు తిరగబడే కొద్దికి జనం పారిపొయినారు. తరవాత వొక గొర్రెను తెచ్చి వొదిల్నారు. ఆ గొర్రెను గూడా గొంతు కొరికి రగతం తాగినాక మాతమ్మ శాంతించింది. వాడూ సోదీనంలోకి వొచ్చినాడు.

ఆదివోరం మద్దేనానికంతా మాతమ్మ గుడి ముందు పెద్ద పెద్ద కొయ్య తుండ్లు తెచ్చి అగ్నిగుండం రగలేసినారు. ఆరు గెంటలకంతా అన్నీ కాలిపొయ్యి అగ్నిగుండంలో నిప్పులు పల్సంగా నెరిపేసినారు. అందురూ పొయ్యి బావల్లో మునకలేసి వొచ్చి అగ్గి తొక్కే వోళ్ళంతా పసుపు గుడ్డలు కట్టుకున్నారు. వొళ్ళంతా అరికాళ్ళంతో గూడా సందు పోకుండా పసుపు పూసుకున్నారు. అట్ట పూస్తే కాళ్ళు కాలవని. మెడలో పూల మాలలేసుకున్నారు.  సేతిలో యాప మండలు పట్టుకొని వొర్సగా నిలబడినారు.

పంబలోళ్ళు పంబలు కొడతా ఉంటే కొమ్ములోళ్ళు కొమ్ములు ఊదతా ఉంటే మాతమ్మ సెలను తెచ్చి అగ్నిగుండం ముందు పెట్టినారు. పూజ జేసి ముందు పూలు అగ్గిని గుండంలో సల్లి సూసినారు. అయ్యి కళకళలాడతా ఉండేది సూసి మాతమ్మ సెలను ఒకరెత్తుకుని గోయిందులు పెట్టుకుంటా ముందు అగ్గి తొక్కినాక అందురూ తొక్కినారు. తిర్నాళ్ళకు జాతి బేదం లేకుండా అందురూ వొచ్చినా అగ్గి తొక్కింది మాత్రం మాదిగోళ్ళే. మల్ల వాళ్ళు మాతమ్మని ఊరు మెరివిణి సెయ్యాలనుకుంటా ఉంటే, నేను ఇంటికొచ్చి తినేసి పడుకునేసినాను.

జాము రేత్రికాడ ఎవురో తలుపు తట్టి “సెంగల్రా! సెంగల్రాయా!” అని పిలిస్తే మెలకవొచ్చింది. తలుపు తీసి సూస్తే, ఊల్లో బుడ్డ గురప్ప, ఆయన గ్రామున్సీపు మడిసి.

“సెంగల్రాయా! మాతమ్మ ఊరు మెరివిణికొచ్చింది. పలకలు కొమ్ములు ఎత్తక రమ్మన్నారు” అని సెప్పినాడు. నేను రొండు మూడు సార్లు అడిగినాను “వాళ్ళవే కొమ్ములూ పలకలు ఉండాయి గదా! మల్లీ మావెందుకు” అని. “అదంతా నాకు తెల్దు, పిల్సక రమ్మన్నారు, వొచ్చినాను. యలబారి రండని” ఆ మనిసి పూడ్సినాడు.

వాళ్ళ పలకలు కొమ్మల్తో గూడా మా కొమ్ములూ పలకలు సేరితే గమ్మితంగా ఉంటిందని తెమ్మన్నారేమోనని గబగబా పొయ్యి అందర్నీ లేపుకొని పలకలు, కొమ్ములెత్తుకొని పోతే, దోవలోనే మా కోసమని మాదిగ పెద్దన్న, గుడ్డోడు, కాటడు, కాసుకోనుండారు.

నన్ను సూసి పెద్దోడు “సెంగల్రాయా! మేము దేవుణ్ణెత్తుకొని పొయినాము. వాళ్ళు ‘దేవుణ్ణి మాకిచ్చేసి మీరు ఊరికెలిగా ఉండండి. మాలపల్లి నించి పలకలు కొమ్ములు తెమ్మన్నాము. ఊరి మెరవణ జేసి మీ దేవుణ్ణి మీకిచ్చేస్తాము ఎత్తకపోదురని’ సెప్పినారు. దానికి మేము కాదనేస్తిమి. మమ్మల్ని వొద్దంటా ఉండారు కాబట్టి మా దేవుడు గూడా మీకొద్దు. మేమిట్టనే తిరక్కపోతామని. కాని వాళ్ళ దౌవుర్దణెంగా దూరి దేవుణ్ణి పెరక్కపొయ్యి వాళ్ళూర్లో పెట్టుకొని ఇప్పుడు మిమ్మల్ని పిలవనంపినారు. మీరు మేము కొట్లాడుకొంటే ఏడిక సూడాలని. మీరు పోయేదానికి లేదని” నిలేసుకున్నారు.

అందుకు నేను “అది దేవుడి కార్నెం. నిల్సిపోయేది మంచిదిగాదు. సూద్దాంలే” అని పొయినాము. ఆడికి పొయినాక నేను వాళ్ళకేం జెప్పినానంటే “అయా! దేవుణ్ణి ఊరుమెరవణి జేసుకొనే దానికి ఎవురి పలకలు కొమ్మలైతే ఏముండాది. అంతా వొకటే గదా! వాళ్ళను గాదని మేమొచ్చేది బాగుండదు” అని సెప్పినాను.

వాళ్ళు “సెంగల్రాయా! మా ఆచారం మాది. ముందునించీ గూడా మాదిగోళ్ళు మావూర్లో గెజ్జకట్టి ఆడింది లేదు. ఇప్పుడు గూడా వొచ్చేదానికి కాదు. వాళ్ళు ఊరు బైటే ఉంటారు. మీరు మీ కొమ్ములు పలకలు తెచ్చి కొట్టండి ఊరిమెరవణ జేసి వాళ్ళ దేవుణ్ణి వాళ్ళకిచ్చి పంపేద్దాము” అన్నారు.

నేను కచ్చితంగా సెప్పినాను “ఇంతకుముందు వాళ్ళూ మేవు ఎప్పుడూ కల్సింది లేదు. ఈ మద్దెనే వొకటైనాము. దాన్నిప్పుడు మీరు సెడగొట్టాలని సూస్తా ఉండారు. వాళ్ళను గాదని మేము రాము, మాకు మాకు రంపులుబెట్టి ఏడిక సూడాలంటే కుదర్ని పని. కావాలంటే వాళ్ళు మేము కల్సి పలకలు కొడతాం మీకు సమ్మతమైతే సెప్పండి లేకపోతే లేదన్నాను.”

దానికి వాళ్ళు వొప్పుకోలేదు “వచ్చేటిగా ఉంటే మీరు మాత్రమే రండి లేదంటే వాళ్ళ దేవుణ్ణి వాళ్ళెత్తకపోనీ” అనేసినారు. దీన్నిబట్టి నాకు తెల్సిందేమంటే? వొకటి మేం కల్సిండేది వాళ్ళకు మింగుడు పడలేదు. రొండు మాతమ్మంటే మన దేవుడు కాదుగదా, మనూర్లో ఎందుకు తిప్పాలనేది వాళ్ళ ఆలోసెనగా ఉంది.

ఈ ముసుగులో గుద్దులాటెందుకు మీ దేవుడు మాకొద్దనేస్తే వొక్క మాటతో పోతింది గదా! సెప్పరు. ఎందుకంటే ఆ పళి గూడా మా మిందకు నెట్టేయాలని. ఆకిర్లో వాళ్ళు దేవుణెత్తుకొని మాదిగపల్లికి పోతే, మేము పలకలు కొమ్ములెత్తుకొని మాలపల్లికొచ్చేస్తిమి.

*

కంసాలి, యానాది వారి కథలు తేవాలని ఉంది!

* నమస్కారం గోవింద్ గారూ! మీ గురించి చెప్పండి.

నమస్తే. నేను పుట్టింది చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం. పిల్లల చదువుల కోసం కార్వేటి నగరానికి వచ్చాను. అక్కడే చిన్నదొరవారి కండ్రిగ అనే ఊళ్లో ఉంటున్నాను. వివిధ ప్రైవేటు ఉద్యోగాలు చేసి ప్రస్తుతం విశ్రాంత జీవితం గడుపుతున్నాను.

* కథలు రాయాలన్న ఆలోచన ఎలా వచ్చింది?

చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం అలవాటు. యద్దనపూడి సులోచనారాణి, కోడూరి కౌసల్యాదేవి నవలలు చదివేవాణ్ని. అందులోని భాష, మా ఊరి భాష వేరుగా ఉండేది. వాటిలో ఆ ఊరి పేర్లే  కనిపించేవి. ఉద్యోగ బాధ్యతల్లో మునిగినా చదవడం మాత్రం మానలేదు. ఆ తర్వాత మధురాంతకం రాజారాం, స.వెం.రమేశ్, నామిని సుబ్రహ్మణ్యం నాయుడు లాంటి రచయితల కథలు చదివాను. వారు పుట్టి పెరిగిన ప్రాంతాల యాసలో కథలు రాస్తుండటాన్ని గమనించాను. మనమూ మన ఊరి కథలు రాస్తే బాగుంటుందని అనిపించి 2016లో తొలిసారి ‘మాయ’ అన్న కథ రాశాను. ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిగే మోసాలే ఆ కథ ఇతివృత్తం. పిళ్లెపాలెం వాసుదేవరెడ్డి స్మారక కథల పోటీలో దానికి రెండో బహుమతి వచ్చింది.

* వృత్తి కథలు రాయాలన్న ఆలోచన ఎలా మొదలైంది?

పల్లెల్లో అనేక వృత్తులు ఉంటాయి. ముఖ్యంగా చాకలి వారికి గ్రామంలోని విషయాలన్నీ తెలుస్తాయి. వారి గురించి కథలు రాస్తే పల్లె స్వరూపం మొత్తం అర్థమవుతుంది. ఆ ఆలోచనతో ఆరునెలల్లో చాకలి వాళ్ల జీవితాలపై 20 దాకా కథలు రాశాను. వాటిని సొంతంగా ప్రచురించాలన్న ఆలోచనలతో డీటీపీ చేయించేందుకు ఇచ్చాను. అక్కడ రచయిత స.వెం.రమేశ్ గారు వాటిని చదివి ఫోన్ చేసి మాట్లాడారు. ఆయన, ఆర్.ఎం.ఉమామహేశ్వరరావుగారు పూనుకుని పూదోట శౌరీలు గారి ప్రచురణ సంస్థ ‘మల్లవరపు వెలువరింతలు’ నుంచి ఆ కథలన్నీ కలిపి ‘సాకిరేవు కతలు’ పుస్తకం వేశారు. అదే నా తొలి పుస్తకం.

* ఆ తర్వాత రాసిన ‘మా ఊరి మంగలి కతలు’, ‘కుమ్మరి కతలు’ వెనుక మీరు చేసిన కృషి ఎలాంటిది?

మా చిత్తూరుకు చెందిన సీనియర్ రచయిత వి.ఆర్.రాసాని గారిని కలిసినప్పుడు ‘సాకిరేవు కతలు తర్వాత వృత్తి కథల పరంపరను కొనసాగించు’ అన్నారు. ఆయన సూచన మేరకు మంగలి కతలు, కుమ్మరి కతలు రాశాను. వీటిని రాసే క్రమంలో కొంత పరిశోధన చేయాల్సి వచ్చింది. ఆ వృత్తికారుల అనుభవాలతోపాటు నా సొంత సృజన కలిపి కథలు రాశాను. ‘మా ఊరి మంగలి కతలు’ పుస్తకానికి పెద్దలు సింగమనేని నారాయణ గారు ముందుమాట రాశారు. ఆ తర్వాత ‘ప్రకృతి-వికృతి’ అనే పుస్తకం వెలువరించాను. ఈ ప్రకృతిలోని వివిధ జీవుల స్వగతాలు అందులో కథలుగా రాశాను. ‘కుమ్మరి కతలు’ పుస్తకం త్వరలో విడుదల కానుంది. ఆ తర్వాత ‘తోటి కతలు’ పేరిట పల్లెల్లోని మాల, మాదిగ వృత్తిదారుల కథలు రాస్తున్నాను. కథ రాశాక సాకం నాగరాజు గారికి చూపించి, వారి అభిప్రాయం తెలుసుకుంటాను. తప్పొప్పులు దిద్దుకుంటాను.

* వృత్తి కథలు రాశాక విమర్శలేమైనా ఎదుర్కొన్నారా?

పాఠకుల నుంచి మంచి స్పందనే వచ్చింది. నేను రాసింది చిత్తూరు మాండలికంలోనే అయినా ఈ కథల్లోని వృత్తిదారుల జీవితం అన్ని ప్రాంతాల్లో దాదాపు ఒకేలా ఉంటుంది. ఆ కథలు చదివి తెలంగాణ ప్రాంతం నుంచి కూడా పాఠకులు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. దస్తగిరి అనే ఒక వ్యక్తి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ‘సాకిరేవు కతలు’ మీద పీహెచ్డీ చేశారు.

* మీకు నచ్చిన రచయితలు?

నామిని, మధురాంతకం రాజారాం గార్ల కథలు చాలా ఇష్టం. కేశవరెడ్డి గారి నవలలన్నీ చదివాను. ‘అతడు అడవిని జయించాడు’ నాకు చాలా ఇష్టమైన నవల. స.వెం.రమేశ్ గారి ‘ప్రళయ కావేరి కతలు’ కూడా ఇష్టంగా చదివాను.

* ఇంకా ఎలాంటి రచనలు చేయాలని ఉంది?

వృత్తి కథల్లో భాగంగా కంసాలి, యానాది వారి కథలు తేవాలని ఉంది. ఇప్పటికే యానాదుల గురించి ‘బతుకు చేదు’, ‘సీకూర’, ‘పడగనీడ’ అనే కథలు రాశాను. దీంతోపాటు గాంధీజీ ప్రధాన పాత్రలో ఒక కాల్పనిక నవల రాస్తున్నాను.

*

మూరిశెట్టి గోవింద్

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మా గోవింద్ గారి పరిచయం ఇలా చేసుకోవటం సంతోషంగా ఉంది.
    మీ అన్వేషణల పరంపర ఇలాగే కోనసాగాలి గోవింద్ గారు అభినందనలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు