మూసకట్టు వాక్యాలకు ఎడంగా…

మొల్ల పురస్కారగ్రహీత మాలతి ప్రసంగ వ్యాసం  

నివారం, మార్చి 11, 2023 తేదీనాడు జరిగిన మొల్లపురస్కారం సభ నాసాహిత్యప్రస్థానంలో అనేకవిధాల ఉత్కృష్టమయినది. నాకు గొప్ప ఆనందాన్నీ సంతృప్తినీ కలిగించినది. ఇది తలపెట్టి, సమర్థవంతంగా నడిపిన రెంటాల కల్పనకి కృతజ్ఞతలు తరవాత చెప్తాను.

వక్తలందరూ ప్రస్తావించిన అంశాలు నాకు ఎంతో ప్రోత్సాహాన్నీ ధైర్యాన్నీ ఇచ్చేయని అని గట్టిగా చెప్పగలను. నారచనలను సాకల్యంగా చదివి, ఒకొకరచనలో తమని ఆకట్టుకున్న అంశాలు, ఆ అంశాలలో విశిష్టత, వాటికి తమస్పందనలూ ఇంతస్పష్టంగా వివరంగా చెప్పగా వినడం నాకు ఇదే మొదలు. మాలతి కథలు రాస్తుంది, అనువాదాలు చేస్తుంది అని ఒక మూసకట్టు వాక్యాలే చూసేను ఇంతవరకూ. అంతేకానీ ఇలా ఒకొకరూ  ఒకఅంశం, ఒక సంభాషణ, ఒకొక వాక్యం తీసుకుని విశదం చేయలేదు ఎవరూ, ఎప్పుడూ, ఎక్కడా కూడా.

పోతే ఒకొకవక్తా ప్రసంగించిన అంశాలు ఇక్కడ చెప్పను కానీ అవి విన్నాక నాకు కలిగిన కొన్ని ఆలోచనలు పంచుకుంటాను, కృతజ్ఞతాపూర్వకంగానూ, వినయంగానూ.

 1. కాత్యాయినీ విద్మహే

కాత్యాయినీ విద్మహేగారు మాట్లాడతారనగానే నాకు చిన్న జంకు కలిగింది. ఈనాటి సాహితీలోకంలో పెద్దపేరు గల రచయిత్రీ, విమర్శకురాలూ, యూనివర్సిటీ ప్రొఫసరూ నారాతలగురించి ఏమంటారో అని. కానీ ఆవిడ ప్రసంగం మొదలుపెట్టడమే మాఇద్దరికీ పరిచయం ఉంది అది మాకు తెలియదు కానీ అనగానే నాకు మనసు తేలికయింది. ఓపిగ్గా నావ్యాసాలన్నీ  విపులంగా సునిశితపరిశీలనాదృష్టితో చదివి, ప్రసంగం చేస్తారని నేను అనుకోలేదు. అనేకవిషయాలలో నాకు తోచని అంశాలు అనేకం ఎత్తి చూపేరు. ఉదాహరణకి నావ్యాసాలలో నాఅనుభవం, అనుభూతి కనిపిస్తాయి, అవి పాఠకులని నడిపిస్తాయి అనడం నాకు కొత్తవిషయం. స్త్రీవాదం కాకపోతే స్త్రీ దృక్కోణం అనొచ్చు అనడంలో గొప్ప చమత్కారం. ఎప్పుడైనా కథ కానీ విమర్శ కానీ, దానిలో రచయితదృక్కోణమే కదా తెలిసేది.

స్త్రీవాదంగురించి ఆమెవ్యాఖ్యానం విన్నతరవాత నాకు కలిగిన మరో ఆలోచన – నాకథల్లో స్త్రీపాత్రలు ఆధారంగా స్త్రీవాది అంటున్నారు. మరి విషప్పురుగు, చిరుచక్రంలాటి కథల్లో శ్రామితవర్గం జీవితాలున్నాయి కదా దళితవాది అని ఎందుకు అనరు? అలాగే ముస్లిమ్ పాత్రలు చిన్నవే అయినా ఉన్నాయి నాకథల్లో. మరి ముస్లిమ్ వాది అన్నలేబుల్ లేదేమి? స్త్రీవాది అన్న లేబులు trendy అనా? ఆలేబులుకి ఉన్న ప్రాచుర్యం మిగతావాటికి లేకపోవడం చేతనా? తెలీదు.

నేను స్త్రీవాదిని కాను అనడానికి బహుశా ఒకకారణం నాకు తటస్థపడిన చిత్తశుధ్ది లేని మహా ఘనత వహించిన స్త్రీవాదులు కావచ్చు. నేను అంటున్నది ఈవాదాలన్నీ రాజకీయం. కథ ఒక సాహిత్యప్రక్రియ.స్త్రీవాదం అనగానే, ఇతర కథాంగాలను నిర్లక్ష్యం చేయడం జరుగుతోంది. కథని కథగా, ఒక సాహిత్యప్రక్రియగా ఆస్వాదించాలని నాఅభిప్రాయం. కాత్యాయనిగారే చెప్పినట్టు నేను కథని వివిధకోణాల్లో చూస్తాను. నిజానికి ఈమొల్ల పురస్కారం సభలో శ్రీనిధి అలా మాట్లాడేరు.

వ్యాసాలమీద కాత్యాయినిగారి అభిప్రాయాలు వారిమాటల్లోనే వినాలి. నేనిక్కడ చెప్పడం న్యాయం కాదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. ఆమెప్రసంగం వ్యాసకర్తలకు ఒక పాఠం. నాకు అయింది. ఆమె చెప్పిన అంశాలు నేను మనసులో పెట్టుకుని రాయలేదు కానీ, ఇకముందు రాస్తే, తప్పకుండా ఈఅంశాలు గుర్తు పెట్టుకుని, ఒళ్లు దగ్గర పెట్టుకుని రాస్తానని మాత్రం చెప్పగలను.

 1. శీలా సుభద్రాదేవి

సుభద్రాదేవి నాసాహిత్యం మొత్తం ఆసాంతం చదివి, ఏకంగా ఒక పుస్తకమే రాసేరు. 88పేజీలు. నాకంటే నాసాహిత్యంగురించి ఆవిడే ఎక్కువ చెప్పగలరు. ఆమె ప్రస్తావించిన ఒకవిషయం నేను కథ సంభాషణలలో నడపడంగురించి. ఈప్రక్రియ భండారు అచ్చమాంబ స్త్రీవిద్య అన్నకథలో ఉపయోగించుకున్నారు. సుభద్రాదేవి చెప్పినట్టు ప్రతివాక్యందగ్గర చెప్పేడు, చెప్పింది అంటూ రాయక్కర్లేదు. అది కూడా క్లుప్తతలో భాగమే. కథ సరిగా అనుసరించే పాఠకులకి మరో రెండుమాటలు చదవవలసిన అవుసరం తప్పిపోతుంది కనక. శివుడాజ్ఞ రెండు ముగింపులలో నేను ప్రత్యేకంగా ఎత్తి చూపదలుచుకున్నది – ముగింపు మారిస్తే, కథ కూడా మార్చవలసివస్తుంది అని.

సంద్రాలుగురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలన్న సుభద్రాదేవిమాటతో నేను ఏకీభవిస్తాను. ఆపాత్రని కొందరు నా alter ego అన్నారు. కావచ్చు. కానీ అంతకంటె ముఖ్యమైనకోణం చదువులేనివారు అని మనం అనేవారిలో ఉండే లౌకికజ్ఞానం.  స్కూలు, కాలేజీ చదువులులేని పామరస్త్రీల వివేకం. ఇది ఇతరకథలలో కూడా చూపించేను. పుస్తకాలు చదివి గ్రహించే లోకజ్ఞానం వేరు. చుట్టూ ఉన్న మనుషుల్నీ, వారి మాటలు, ప్రవర్తనలను చూసి గ్రహించుకునే లోకజ్ఞానం వేరు. ఈకోవకి చెందుతుంది సంద్రాలు. బతకనేర్చిన జాణ ఒక్కమాటలో. అది పాఠకులు కూడా గుర్తించేరనుకుంటాను. మాలతో, కథలో మరోపాత్రో అంటే వినని పాఠకులు సంద్రాలు చెప్తే వినడం కూడా అందుకే. సంద్రాలుకి దాపరీకాలు లేవు. మనసులో ఒకమాటా, నాలుకమీద ఒకమాటా లేదు.

 1. కల్యాణీ నీలారంభం.

తూలిక.నెట్ ధ్యేయం, ప్రస్థానం చక్కగా ఆవిష్కరించేరు. అనువాదాలవిషయంలో కష్టనష్టాలు, ఆ సైటుని కొనసాగించవలసినఅవుసరం స్పష్టం చేయడం నాకు సంతోషం. ఎందుకంటే నేను చెప్పడం వేరు, సాహిత్యంతో మంచి పరిచయం గల మరొక రచయిత్రి, అనువాదకురాలు చెప్పడం వేరు.  అలాగే, అనువాదసమస్యలు ప్రస్తావించడం నాకు సంతోషాన్ని కలిగించింది.

తూలిక సైటు నాతో ముగియకుండా భావితరాలకు కూడా ఆసరా కావాలి, లేదా భావితరాలు ఆసైటు ధ్యేయాన్ని నిలబెట్టాలి అన్ననాకోరికను మరొకసారి పాఠకులముందు ఉంచడం నాకు బలాన్నిచ్చింది. ధన్యవాదాలు కల్యాణిగారూ.

అలాగే ఆమె చెప్పిన మరొకమాట -భాషకి నాడి ఉంటుంది. అది పట్టుకోకపోతే అనువాదం చేయలేం అన్నది. నిజంగా శ్లాఘనీయం. నేను అంత స్పష్టంగా చెప్పలేకపోయేను. మొల్లకీ మాలతికీ తెలుగుఅంటేఅభిమానం అన్నారు. నిజమే. సాహితీలోకంలో మహాకవయిత్రి మొల్లస్థాయి పాండిత్యం నాకు లేదు కానీ ఆఆలోచన అర్థవంతమైనదే అనుకుంటాను. మరొక పెద్ద సామ్యం మొల్ల జానుతెనుగులో వ్రాస్తానంటూనే క్లిష్టతరమైన సుదీర్ఘ సంస్కృతసమాసాలు వాడేరు. నేను, తెలిసీ, తెలీకా కొన్ని సంస్కృతపదాలు వాడేను. -:)) మొదట్లో. తరవాత తగ్గించేసేనులెండి.

 1. వి.బి. సౌమ్య

తూలికకి తెలుగువారి ఆదరణ లేకపోయినా, విదేశీయులు ఆదరిస్తున్నారంటూ ఉదాహరణ ఇచ్చింది. అది నాక్కూడా అది అనుభవమే. ఇంతకుముందు కల్యాణిగారు అన్నమాటకి జోడింపుగా ఇక్కడ చెప్తాను. తూలిక.నెట్ సైటుకి లింకు ఇచ్చేరు యు.కె.లో ఒక యూనివర్సిటీ useful sourceగా. కాత్యాయినిగారు చెప్పినట్టు నేనిచ్చే రిఫెరెన్సెస్ కావచ్చు. అమెరికాలో ఒక ప్రొఫెసర్ మొల్ల వ్యాసం తమ బ్లాగులో పెట్టుకున్నారు. కెనడాలో ఒకరు నా What is a good story చూసి, నువ్వు ఒక్క తెలుగేనా, ఇంగ్లీషు కథలు కూడా విశ్లేషించగలవా అని అడిగి ఆయనకథ నాకు పంపించేరు. ఫ్రాన్సునించి ఒకాయన మనుచరిత్రలో ఒక పద్యానికి అర్థం చెప్పమని నన్ను అడిగేరు. (నవ్వకండి మరి.) ఇంతకీ చెప్పొచ్చేదిమిటంటే, మనతెలుగువాళ్లకి మాత్రమే చులకన తెలుగంటే. అదీ మళ్ళీ తమకథలు అనువాదం చెయ్యమన్నప్పుడు ఉండదు ఆ తేలికభావం.

మనవాళ్లు ఆదరించకపోవడానికి ఒక కారణం వాళ్లకి నాధ్యేయం అర్థం కాకపోవడం. వాళ్లదృష్టిలో గొప్పకథలు, వాళ్లు బహుమతులిచ్చిన కథలు అనువాదం చేస్తే, గంపలకొద్దీ మెప్పులు గుమ్మరిస్తారు. బహుశా నాకు ఒ శాలువా కూడా కప్పేవారేమో. నా networking skills లోపం కావచ్చు.

రెండోది తెలుగుకథలు చదవగలిగినవారందరూ తెలుగుభాషసొగసు అనువాదాల్లో లేదని. అనువాదాలధ్యేయం అది కాదని వాళ్లకి చెప్పినా అర్థం కాదు. అంచేత తమకి తెలుగుకథ చదివినప్పుడు కలిగిన ఆనందం అనువాదం (ఇండియనింగ్లిషులో లేదనేమో) చదివినప్పుడు లేదనుకుంటారేమో.

ఇది నేను కల్పనతో చేసిన ఇంటర్వ్యూలో విపులంగా చర్చించేను. లింక్, https://tethulika.wordpress.com/2013/05/08/3811/

మనవాళ్లు తూలికని ప్రోత్సాహించకపోవడంవిషయంలో – మరోమాట చెప్పాలి. అనువాదాలు చేయమని అడిగే రచయితలతోపాటు, వారి అభిమానులు కూడా వీరికథలు ఎందుకు అనువాదం చేయలేదు అని నన్ను కోప్పడతారు. కానీ ఇంతవరకూ చేసినఅనువాదాలగురించి సమావేశాల్లో ప్రస్తావించరు. వ్యాసాలలో వ్రాయరు.  నాసైటు ధ్యేయం ఏమిటి అన్నది ఒక్కరికీ తోచదు.

మునిపల్లె రాజుగారి కథాసంకలనం అస్తిత్వనదం ఆవలితీరాన అనువాదం చేసి 9 ఏళ్లయింది. ఆ విషయంలో సాహిత్య ఎకాడమీ అలసతగురించి నాఅనుభవం మొల్లపురస్కారం విడియోలో చూడండి. ఇక్కడ మళ్లీ పెట్టను ఆ కథంతా.

5.. సునీతా రత్నాకరం.

ఎంత ఓపిగ్గా రెండు నవలలూ చదివేరో అనిపించింది ఆమెవిశ్లేషణ వినగానే. ఇలా చదివేవారు ఉన్నారనీ, నావి చదువుతారనీ తెలియడమే నాకొక సంభావన. పాత్రలు, సంభాషణలు, ఉపకథలు, ప్రధానకథనంలోవాటిస్థానం బహుశా అంత చక్కగా నేనైతే చెప్పలేనేమో అనిపించింది. ఈవిశ్లేషణ తప్పకుండా కొందరినైనా చదవడానికి ప్రోత్సాహించవొచ్చు. స్త్రీవాదంగురించి నాఅభిప్రాయాలమీద మీఅభిప్రాయం నాకు చాలా నచ్చింది. అది తేలిగ్గా వివరించగల సబ్జెక్ట్ కాదు. అయినా ప్రయత్నించేను. నాకు తటస్థపడిన స్త్రీవాదులని చూసేక నాకు అనిపించింది వీళ్లకి స్త్రీవాదం అంటే సరైన అవగాహన లేదని.

 1. సిహెచ్. సుశీల

సుశీలగారు నాకు తనప్రసంగం పంపినప్పుడు నేను కొన్ని సూచనలు చేసేను. వాటిని సాదరంగా స్వీకరించి, తగుమార్పులు చేసి ఎంతో చక్కగా ప్రసంగించినందుకు, సుశీలగారికి ధన్యవాదాలు. నా అభిప్రాయాలతో సుశీలగారు ఏకీభవించడం సంతోషంగా అనిపించింది. నేను సుశీలగారికి ఇచ్చిన సలహాలు ఇంకొంచెం విపులంగా నాబ్లాగులో ప్రసంగాలు అన్నటపాలో పోస్ట్ చేసేను. గణాంకాలలో రోజూ కొందరు చూసినట్టు కనిపిస్తోంది.

 1. రాజేశ్వరి దివాకర్ల

రాజేశ్వరిగారికవితలు సిరికోన సాహితి వాక్ స్థలిలో చూస్తుంటాను. అక్కడ నేను రాసిన కవితలను ఇక్కడ సభలో ప్రస్తావించడం నాకు చాలా సంతోషమయింది. నావాక్యాలు ఉదహరించడం నాకెంతో ఉత్సాహాన్నిచ్చింది. రాజేశ్వరిగారు కొట్ చేసిన ఒక వాక్యం –

ఆడవాళ్లు మగవాళ్లని అలా అనుకోనిస్తారు – అన్నది మరొకసందర్భంలో వాడినది. బహుశా నేను వాక్ స్థలిలో సరిగా చెప్పలేదనుకుంటాను. ఒక బ్రిటిష్ రచయిత అన్నమాట – స్త్రీలు తమకి మగవారితో సమానస్థాయి కావాలంటారు కానీ, నిజానికి వారు మగవారికంటే పైస్థాయిలోనే ఉన్నారని వారికి తెలీదు – అని. దానికి ప్రతిగా నేను, స్త్రీలకి ఆసంగతి తెలుసు, కానీ తామే మగవారిని అలా అనుకోనిస్తారు అన్నాను.

 1. విజయ కర్రా

వాక్యాలతో చెడుగుడు ఆడిస్తారులాటి నుడికారాలతో నాకథలగురించి భలే చెప్పేరు. తెలుగుకథ రాయాలంటే ఇంగ్లీషుకథలు చదవాలి అన్నవాక్యం నాది కాదు. శ్రీశ్రీ రాచకొండ విశ్వనాథశాస్త్రిగారికి ఆ సలహా ఇచ్చేరని లోకశ్రుతి. 1940, 50 దశకాల్లో ఇలా ఆంగ్లసాహిత్యంతో ప్రభావితులైన మనరచయితలు తెలుగుభాషకి చేసిన అన్యాయం అని నాఅభిప్రాయం. అందుకే రావిశాస్త్రిగారి రెండోదశలో రాసినకథలు ముందుకథలంతగా పాఠకులని ఆకర్షించలేదు. అలాటిరచనలు అభ్యుదయవాదులపిడికిట్లో ఇరుక్కుని ఉండిపోయేయి. కాళీపట్నం రామారావుగారి రచనలలో కూడా ఈతీరు చూస్తాం.

సంభాషణలు విజయగారికి అనుభవమే అంటే సంతోషంగా అనిపించింది. ఏ రచయితకైనా కావలసింది అదే. పాఠకులు కథనంతో మమేకం కావడం. స్వానుభవాలతో పోల్చుకోడం బాగుంది. అలాగే రాద్ధాంతంపై సిద్ధాంతంనించి నాన్చక ముంచక అన్నవాక్యం ఉదహరించడం నాకు భలే సరదాగా అనిపించింది. ప్రచురణలలో రాద్ధాంతం నామొదటిరచన. రాద్ధాంతంపై సిద్ధాంతం రెండోది. బహుశా నాకథల్లో నేను పరిష్కారం చూపించకపోవడానికి ఇదే నాంది అయివచ్చు -:))

 1. శ్రీనిధి యెల్లల

శ్రీనిధి ప్రసంగంలో నాకు ఎంతో ఆనందం కలిగించినకోణం ఆమె చెప్పినతీరు. ఇంగ్లీషులో presentation అంటారు. ఈమాటలు శ్రీనిధిని ఉద్దేశిస్తూ చెప్పాలి.

శ్రీనిధి ప్రసంగం నన్ను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. అంటే మిగతా ప్రసంగాలు కాదు అనడం లేదు. పూర్తిగా చదివేక మీకే తెలుస్తుంది ఎందుకిలా అన్నానో. ఆమె మాట్లాడుతున్నంతసేపూ నాకు ఒక దృశ్యం మనసులో మెదిలింది. అది – చిన్నపిల్లలు తమకి ఇష్టమైనదేదో దొరికినప్పుడు కేరింతాలు కొడుతూ ఆనందపడిపోతున్నప్పటిలాటిది. “రాద్ధాంతాలూ, సిద్ధాంతాలూ లేవు. హంగులూ ఆడంబరాలూ లేవు” అంటుంటే తను నారచనలలో మూలతత్వాన్ని పట్టుకున్నారు అనిపించింది. ఎందుకంటే నాకు రాద్ధాంతాలూ, సిద్దాంతాలూ ఇష్టం లేదు. ఈవిషయం సుభద్రాదేవి కూడా అన్నారు.  జేబుకథ వివక్షకథే అని కల్యాణిగారూ ఇంకా కొందరూ అన్నారు. శ్రీనిధి వాదాలప్రసక్తి చేయకుండా ఆజేబు ఎవరికి ఎప్పుడు ఎందుకు అవుసరం వస్తుందంటూ మరొకకోణం చూపించేరు. అది వివక్షకథే అయిఉంటే పరిమళ జేబు పెట్టించుకోడం అయిపోయేక విజయం సాధించినట్టే కనక కథ ముగిసిపోవాలి. ముగియలేదు. ఇంకా కొనసాగించడంలో నాఉద్దేశం ఆఖరివాక్యంలో స్పష్టమవుతుంది. “డబ్బు దాచుకోడానికి జేబు, మనసు దాచుకోడానికి కలం”, అని. అంటే పరిమళ రచయిత్రిగా ఎదగడం. అది ఆ చిన్నప్పటి తెలుగుమాస్టారు గుర్తించేరు.

చిరుచక్రంలో పాత్రలను ఆరోహణ, అవరోహణక్రమంలో వివరించడం శిల్పానికి సంబంధించినది. ఎంత సూక్ష్మపరిశీలన అని ఆశ్చర్యపోయేను. చాలామంది పాఠకులు వెంకన్నవిషయంలో సానుభూతి వెలిబుచ్చేరు. ఇలా శిల్పంగురించిన చర్చ చేసింది నాకు తెలిసినంతవరకూ శ్రీనిధి ఒక్కరే.

అలాగే మాతోటలో పాత్రలు, ప్రాప్తంకథలో ఇంటివారమ్మాయి, పనిపిల్లలమధ్య స్నేహభావం వంటివి ప్రస్తావించడం వివాదాలూ నినాదాలజోలికి పోకుండా కథని కథగా స్వీకరిస్తేనే సాధ్యం. అలా కథలలో సాధారణంగా ఎవరూ ప్రస్తావించని కోణాలు స్పృశించడంచేతా, అవే నాకు కూడా ముఖ్యమైనవి కనకా నాకు శ్రీనిధిలో ఒక మంచి మేధావంతురాలయిన కథకురాలు కనిపించేరు. మొత్తం కథలను చదివి ఆనందించడంలో ఆస్వాదించడంలో తను చూపిన మక్కువ అట్టేమందిలో కనిపించడం లేదు ఈమధ్య. తనలో ఈదృష్టికోణం, విశ్లేషణానైపుణ్యం నేను 10, 12 ఏళ్లవయసులో కథలఅత్తయ్యగారి వంటింట్లో గోడవార పీటమీద కూర్చుని కథలు విన్నరోజులు గుర్తు చేసేయి. శ్రీనిధిలో నేను ఆనాటినన్ను చూసుకున్నాను. అందుచేత అన్నాను ఈఅమ్మాయివిశ్లేషణ నాకు ప్రత్యేకంగా అనిపించింది అని.

 1. వారణాసి నాగలక్ష్మి

వప్రక్రీడాగజప్రేక్షణీయం, సరీసృపం లాటి సంస్కృతపదాలు ఆరోజుల్లో ఎక్కువగానే వాడేను. నేను ఇంటర్మీడియట్ లో సంస్కృతం అభిమానభాషగా తీసుకున్నాను. కుమారసంభవం, మాళవికాగ్నిమిత్రం అనుకుంటాను మాపాఠ్యగ్రంథాలు. వప్రక్రీడాగజప్రేక్షణీయం అప్పట్లో ఎందుకు వాడేనో కానీ ఇప్పుడు మాత్రం అర్థం నాగలక్ష్మిగారు చెప్పేకే చక్కగా తెలిసింది. నాకు నచ్చిన సంస్కృతపదాలు వాడేస్తుండేదాన్ని. సరీసృపం పదానికి ఆవిడ ఇచ్చిన వివరణ నాకు అప్పట్లో తోచిందో లేదో కానీ ఇప్పుడు మాత్రం చక్కగా నప్పిందనే అనిపించింది. ధన్యవాదాలు నాగలక్ష్మిగారూ.

 1. సత్యవతి

సత్యవతిగారూ, మీరు ముచ్చటగా మూడు నిముషాల్లో నాసాహిత్యప్రస్థానం మొత్తం సూక్ష్మంగా చెప్పేసేరు. ప్రత్యక్షంగా కనిపిస్తే బాగుండేది. ఒకొకప్పుడు జరగవు. మాఅమ్మాయికి కూడా కుదరలేదు. మీఆప్తవాక్కులకు ధన్యవాదాలు.

ఈసభలో వక్తల ప్రసంగాలవల్ల నేను గ్రహించిన కొన్ని అంశాలు:

 1. సాహిత్యం సమాజానికి దర్పణం అంటారు. ఇప్పుడు పాఠకులకోణాలకి దర్పణాలు అయేయి. ఎవరి అభిప్రాయాలు వారికి కథల్లో ప్రతిఫలిస్తాయి. ఇందువల్ల కథలో మిగతా కోణాలు – శిల్పం, ప్రారంభం, ముగింపు, పాత్రపోషణ, ఆవరణం వంటివాటిని నిర్లక్ష్యం చేస్తున్నారేమో అని నాభయం. పాఠకులే చెప్పాలి.
 2. ఇంచుమించు అందరికీ నాకథల్లో భాష, నుడికారాలు, పదప్రయోగాలు నచ్చడం నాకు చాలా సంతృప్రి నిచ్చింది. నాకు కథల్లో ఇవి చాలా ముఖ్యమైన అంశాలు. నేను అందరికీ తెలుగుపదాలు వాడమని అందుకే చెప్తుంటాను. రచయితలు జానుతెలుగు పదాలు ఉపయోగించినంతకాలమే భాషకు మనికి కదా. నిత్యజీవితంలో ఇంగ్లీషుపదాలు అవుసరం, అలవాటు అయినా, కథల్లో కొంచెం శ్రమ తీసుకుని, తెలుగుపదాలు వాడితేనే, చదివేవారికి కూడా కొంత ఉత్సాహం వస్తుంది. తెలుగు నుడికారం నిలుస్తుంది. రచయితలకి దేశభక్తిలాగే భాషభక్తి కూడా అవుసరం.
 3. 3. మరొకవిషయం కొట్టొచ్చినట్టు కనిపించింది కథలలో వ్యాసాలలో అనువాదాలలో లోపాలను ప్రస్తావించకపోవడం. నామీద అభిమానంచేతే కావచ్చు, సభామర్యాద కాదని కావచ్చు వక్తలు నాకథలూ, వ్యాసాలూ, అనువాదాలలో లోపాలు, అసంగతాలు, అవకతవకలూ ప్రస్తావించలేదు. ఒక్క కాత్యాయినిగారు కొంచెం అలా అలా పైపైన తడిమేరు. రాజారాంగారికథలలో రచయిత్రులని అట్టేమందిని చేర్చలేదని నేను చేసినవ్యాఖ్య ఒకటి. అది ఆసందర్భంలో తప్పు అనుకోను కానీ కాత్యాయినిగారు అన్నమాట నిజం కాదని కూడా అనలేను. బుచ్చిబాబు చివరికి మిగిలేదిగురించి నేను negativeగా రాయడానికి కారణం నాకు అదే అభిప్రాయం కలిగింది కనక. అయితే, కాత్యాయినిగారి అభిప్రాయం నాకు సరిగా అర్థం కాలేదు. మరొకసారి విడియో చూస్తాను. కాత్యాయినిగారు అవి ప్రస్తావించినందుకు మాత్రం తప్పకుండా హర్షిస్తాను.

నాకథల్లో తప్పులు ఉంటాయి. అసలు నాకు తెలీనివి మిత్రులని అడిగి తెలుసుకుంటాను కూడా. మొల్లవ్యాసంలోపద్యాలకి భైరవభట్ల కామేశ్వరరావుగారు వివరణ ఇచ్చేరు. మునిపల్లె రాజుగారి కథలు అనువాదం చేస్తున్నప్పుడు ఏల్చూరి మురళీధరరావుగారిని అడిగి సంస్కృతశ్లోకాలకి అర్థాలు తెలుసుకున్నాను. నేను ఎంత జాగ్రత్తగా చేసినా, ఇంకా తప్పులు ఉండొచ్చు. అంచేత మీకు కనిపిస్తే, సభాముఖంగా కాకపోతే వైయక్తికంంగా నాకు మెయిలివ్వండి. పైన చెప్పిట్టు, నావ్యాసాలు నేను అనువదించి తూలిక.నెట్ సైటులో పెడుతున్నాను. అవి విదేశాలలో రిసెర్చి స్కాలర్సుకి ఉపయోగపడుతున్నాయి. మరి వారికి సరైన సమాచారం ఇవ్వడం నాబాధ్యత కదా. తెలిసి చేయను కానీ తెలియకా, నేను తీసుకున్న సోర్సులో తప్పులవల్లా పొరపాట్లు రావచ్చు. మీరు చెప్తే, నాకు సరి దిద్దుకోడానిక ఆస్కారం ఉంటుంది.

ఇంక సభచివరలో నేను ధన్యవాదాలు చెప్పుకోవలసినసందర్భంలో నేను సభల్లో మాట్లాడలేనని మరోసారి ఋజువైంది. ఎంత సిద్ధం అయేననుకున్నా, మనసులోనే ఎన్ని రిహార్సల్సు వేసుకున్నా, రాసి పెట్టుకున్నా తప్పులో కాలేయకుండా పూర్తి కాలేదు. నేను రాసింది చదువుతూనే కల్పన అన్నచోట సౌమ్య అని చదవడం ఎలా జరిగిందో చెప్పలేను.

కల్పన మొదట్లో మొల్లనుగురించి చెప్పిన విషయాలు, ఒకొకప్రసంగంతరవాత చెప్పిన వాక్యాలు తన సద్యఃస్ఫూర్తిని తెలియజేస్తాయి. మరొకసారి ఎప్పుడో కల్పన మరొక ప్రసంగం చేయాలి పూర్తిగా తన అభిప్రాయాలు చెప్తూ. ఈ సభను కల్పన ఒక్క చేత్తో  ఇంత అద్భుతంగా ఆహ్లాదకరంగా, నిర్వహించి, రాత్రి విందుఏర్పాటు కూడా చేసి ముగించడం నాకు బ్రహ్మానందం కలిగించింది. అంత ప్రతిభావంతంగా నిర్వహించినందుకు మనఃపూర్వకధన్యవాదాలు అంటే చాలదు. అంతకన్న చెప్పడానికి మాటలు లేవు కనక ధన్యవాదాలు అని ముగిస్తాను.

మొల్ల పురస్కారం సభలో పాల్గొనలేకపోయినవారు యూట్యూబులో చూడవచ్చు. ఆ లింకు ఇదుగో  –

https://www.youtube.com/watch?v=SPKR5VzQWQM

*

 

నిడదవోలు మాలతి

9 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • “మరొకవిషయం కొట్టొచ్చినట్టు కనిపించింది కథలలో వ్యాసాలలో అనువాదాలలో లోపాలను ప్రస్తావించకపోవడం.” – మంచి పాయింటు. గతంలో మీ అనువాదంలో కొన్ని నచ్చలేదంటూ నన్ను పరిచయం చేసుకున్నాను పదిహేనేళ్ళ క్రితం. ఇప్పుడు కూడా అలాంటివి చర్చించవచ్చు కావాలంటే, కానీ ఆ సభ దానికి సందర్భం కాదు అనుకుంటాను. అసలు ఇలాంటి సభల్లో ఎవరైనా ఎక్కడైనా మీరు కోరుకున్నట్లు విమర్శలు, లోపాలు ఎత్తి చూపడాలూ చేస్తారా? చేశారా? ఉదాహరణ చెప్పండి. ఈసారి లోపాలనెంచు సభ ఒకటి పెట్టుకుందాము. దానికి వేరే పురస్కారం పేరు ఏదన్నా పెట్టుకోవాలి 🙂

  • వేరే పురస్కారాలు అక్కర్లేదు సౌమ్యా, నలుగురం కూడి చర్చించుకుంటే చాలు.
   అక్షరదోషాలున్నాయి అని మరో మూసకట్టు వ్యాఖ్య వస్తుందేమో. -:))

   కల్పన రెంటాలకి ఈసభ ఏర్పాటు చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు.

 • చాలా బాగా వ్రాసారు. వీడియో చూసే సమయం ఇంకా చిక్కలేదు. చూస్తాను తీరిగ్గా.

 • సందర్భం సరి కాదనే నేను వాటిని ఎత్తి చూపలేదు .నేను అనువాదం చేసినవి కూడా కొంత సమయం తర్వాత చదివితే ఇంకా చేయాల్సిన మార్పులు కనిపిస్తాయి .దీనికి మినహాయింపు వుండే రచయితలు/అనువాదకులు ఉంటారనుకోను .మీరు మొదట్లో చేసినవి కొంచెం అసహజంగా వున్నాయి .మీ కథలు మీరు చేసుకున్నవి తడబాటు లేకుండా నడుస్తాయి. సౌమ్య అన్నట్లు దానికోసం ఓ సమావేశం పెట్టుకుందాం .

  • అవును కల్యాణిగారూ, ఇప్పుడు చూసుకుంటుంటే నాకు కూడా అదే అనిపించింది. అందుకే మిగతా వ్యాపకాలు, ఫేస్బుక్ లాటివి, తగ్గించేసి, మళ్లీ నాసైటులో (ఇది బ్లాగు కాదు, సైటే) సంస్కరించడానికి పూనుకున్నాను.
   ఇలాటి చర్చించుకోడానికి మరోసమావేశం పెట్టుకుందాం అన్నమాట బాగుంది. మీస్పందనకు ధన్యవాదాలు.

 • […] లింక్ ఇక్కడ ఇస్తున్నాను. చదివి మీఅభిప్రాయాలు సారంగలో గానీ, ఇక్కడ గానీ పంచుకోవచ్చు. ధన్యవాదాలు. https://magazine.saarangabooks.com/%e0%b0%ae%e0%b1%82%e0%b0%b8%e0%b0%95%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e… […]

 • 🌹🙏🌹 నమస్కారమండీ. అత్యుదాత్తములు, సంస్కారపూర్ణములు, ఔచిత్యశోభితములు, సత్యసుందరములు అయిన మీ రచనలలో E-Copy లు గా లభ్యమవుతున్న దాదాపు అన్నింటిని, ఆంధ్రాంగ్లాలలో మీ బ్లాగ్ లలో లభ్యమవుతున్న దాదాపు అన్నింటిని చదివే సదవకాశం నాకు కలిగింది. మీ వాక్కులోని స్పష్టత, నిర్భీకత, మెరమెచ్చులు లేని సూటిదనం, భారతీయ సంస్కారం, German thoroughness, ఆంధ్రత్వాభిమానం, కథేతివృత్తాలలోని ఆత్మీయత, వ్యాసరచనలోని సారళ్యం — అన్నింటికి అన్నీ మీ సహృదయతకు, మనస్వితకు నిదర్శకాలన్న విషయం స్పష్టమే. మిమ్మల్ని బహుముఖీనప్రజ్ఞాశీలిగా కవయిత్రి ‘మొల్ల’ పేరిటి పురస్కారానికి ఎన్నుకొని సన్మాన కార్యక్రమాన్ని మంచి ప్రసంగకర్తలతో, తన కూర్పునేర్పుతో ఎంతో సమగ్రతతో అర్థవంతంగా నిర్వహించిన కల్పన ఉచితజ్ఞతను, సామర్థ్యాన్ని ఎంత మెచ్చుకొన్నా తక్కువే అవుతుంది. వివిధ దృక్కోణాల నుంచి మీ రచనలను విశ్లేషించిన వక్తలకు అభినందనలు; మీకివే వినమ్ర వందనాలు. 🙏🙏

  • నమస్సులు మురళీధరరావుగారూ, మీవంటి పండితులఅభినందనలతో నాకృషి సాధికారికత సాధించినట్టు భావిస్తున్నాను. మనఃపూర్వక ధన్యవాదాలు.
   – మాలతి

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు