మూడు కథలు- మూడు యుద్ధ చరిత్రలు!

ఈమధ్య చదివిన మంచి కథల గురించి చిన్న పరిచయ వ్యాసాలకు ఆహ్వానం

యుద్ధం. రక్తపాతం. ఇవి రెండూ ఏ కాలంలో జరిగినా, ఏ వర్గాల మధ్య, ఏ దేశాల మధ్య, ఏ కారణాల వల్ల జరిగినా నష్టం మాత్రం రెండు పక్షాలకీ సమానంగా జరుగుతుందన్నది వాస్తవం. యుద్ధపు వాతావరణాన్ని, ఆ పరిస్థితులనూ వస్తువుగా చేసుకొని ప్రపంచభాషాల్లో ఎన్నో రచనలు, చలనచిత్రాలూ వెలువడ్డాయి. ఒక పక్కన యుద్ధం జరుగుతుండగా ఇద్దరి మధ్య ప్రేమ అంకురించడం, లేదా అప్పటికే కొనసాగుతున్న ప్రేమ యాత్రకు యుద్ధం ఆటంకాలు కల్పించడంవంటి గాథలెన్నో మనం చూశాం.

అయితే యుద్ధం/బలప్రయోగం వలన జరిగే అనర్థాల వర్ణనని వేర్వేరు కోణాల్లో స్పృశించిన మూడు రచనలని సింహావలోకనం చేసే ప్రయత్నం, ఈ వ్యాసం.

మొదటి రచన – “విరామం” నవల. రచయిత అంగర వేంకట కృష్ణారావు. ప్రచురణ – జ్యేష్ట లిటరరీ ట్రస్టు, విశాఖపట్నం. 

రెండవ ప్రపంచ యుద్ధాన్ని కథావస్తువుగానూ, తూర్పు బెంగాల్ ను కథాస్థలంగానూ ఎంచుకొని వ్రాసిన నవల, “విరామం”. బహుశా యుద్ధపు భీభత్స వాతావరణాన్ని – అంటే  యుద్ధ రంగపు ఉత్కంఠభరితమైన సన్నివేశాలని కాకుండా, యుద్ధం సృష్టించే అరాజకాలని ఇంత విపులంగా, సాధికారికంగా వర్ణించిన రచన తెలుగులో ఇదొక్కటేనేమో.   ఎప్పుడూ నిరంతరంగా జరుగుతుండేది యుద్ధమే అని, శాంతి ఒక విరామం మాత్రమేనని, రచయిత స్వయంగా తన ముందుమాటలో పేర్కొన్నారు. ఆయన స్వయంగా అప్పటి సైన్యంలో ఉద్యోగి కావడంతో, నవలలో చేర్చిన సంఘటనలలోనూ, సన్నివేశాలలోనూ అప్పటి యుద్ధవాతావరణాన్ని పృష్టభూమిగా కూర్చడంలో విశేషమైన ప్రతిభ కనబరచారు.

ప్రముఖ రచయిత ఘండికోట బ్రహ్మాజీరావుగారు ఈ నవలకు వ్రాసిన ముందుమాటలోనుంచి, ఈ క్రింది వాక్యాలు ఇక్కడ చేర్చుతున్నాను.

“ఆర్మీలో పనిచేసే వాళ్ళకు కడుపునిండా, ఆ మాటకొస్తే కడుపెక్కా తిండి దొరుకుతుంది. సృష్టిలో కడుపాకలి తరువాత ప్రముఖంగా వచ్చేది శరీరపు ఆకలి. దీని ప్రభావం వల్ల ఆర్మీ సెంటర్స్ లో ఉండే జవానులు, చిన్న స్థాయి అధికారులు తమ శరీరపుటాకలి తీర్చుకోవడానికి సమీపంలో ఉండే గ్రామాల మీద పడతారు. వాళ్ళకు పశువాంఛతోబాటు పశుబలం కూడా ఉంటుంది…”

“యుద్ధం కారణంగా సామాన్య జనజీవనం స్వభావం పూర్తిగా మారిపోయింది. ముష్టివాళ్ళు, జబ్బువాళ్ళు, అస్తి పంజారాల్లా ఉన్నవాళ్ళు ఎక్కువయ్యేరు. కానీ వాళ్ళను చూసేవాళ్లే లేరు.   

“మన దేశాన్ని వ్యాపారస్థులు, అధికార మదం కలవాళ్ళు, స్వాతంత్ర్యానికి ముందే, అంటే ఈ యుద్ధ సమయంలోనే హస్తగతం చేసుకున్నారు.

విషాదఘట్టాలకు కొదవలేదు ఈ నవలలో. సిపాయిలని సిగరెట్ అడిగి, బదులుగా వాళ్ళకోసం పాట పాడతాడో పశువుల కాపరి కుర్రాడు. పాట ముగిసి పశువులని మేపడానికి వెళ్ళిన కొద్దిసేపటికే అక్కడ మాటు వేసిన ఒక క్రూర మృగమేదో వాణ్ని మెడ పట్టుకు లాక్కుపోతుంది. ఆ కుర్రాడి తల్లి ఎంత బెంగటిల్లిపోతుందో అనీ, తమ ఆజ్ఞ మేరకు ఆ కుర్రాడు పాడిన పాటే ఆ క్రూరమృగాన్ని ఆకర్షించిందేమోననీ చాలా రోజులపాటు కించపడతాడు కథానాయకుడు.

అలా అనుకోకుండా పులికి బలై పోయింది ఓ కుర్రాడు కాగా, రోజుల తరబడి తమను నమిలేసే ఆకలిపులికి బలైపోయే ఆడకూతుళ్లెందరో. అలాంటి ఒక యువతి సల్మా. ఆమె స్థితిని వర్ణిస్తూ ‘కుళ్ళి కంపుగొడుతూన్న శవం తనమీద ఒకేసారి పది పన్నెండు రాబందులు పడి నాలుగు పక్కల్నించీ పీక్కు తింటుంటే యేం ఖాతరు చేస్తుంది!’ అంటాడు రచయిత.

మరో చోట, ‘చచ్చిపోయిన తల్లి స్తనం చీకుతున్న బిడ్డ దృశ్యం నన్నిప్పటికీ, ఇరవై నాలుగేళ్లయినా విడవలేదు’ అని చదువరి గుండెని పిండేస్తాడు. ఇటువంటివి ఎన్నెన్నో ఈ నవలలో వివరించడం జరిగింది. యుద్ధం చేసే సైనికుల పేరిట దేశం నలుమూలలనుంచీ నిర్దాక్షిణ్యంగా ఆహారపదార్థాలని సేకరించడం, వాటిలో అధికశాతం తిరిగి నల్లబజారుకి చేరడంవంటి అవినీతి చిత్రాలనుంచీ, సైనిక ఆస్పత్రులలోని వాస్తవిక పరిస్థితులవరకూ రచయిత నిశితపరిశీలనవలన ఈ నవలలో వెలుగులోకి వస్తాయి.  ఎందరో బడుగుజీవులు యుద్ధపుమేఘాల క్రింద నలిగి నాశనమైపోయే వైనాలే కాక, అనేక దేశాల సైనికులు ఒకే చోట కలిసి యుద్ధంలో పాల్గొంటున్నప్పటి సన్నివేశాలూ ఇందులో కనపడతాయి.

యుద్ధపు వినాశనాల వర్ణనే కాక, ఒక సున్నితమైన ప్రేమగాథ కూడా సమాంతరంగా సాగుతుందీ నవలలో. ఆ రెండింటినీ పేనిన రచయిత నైపుణ్యం బహుథా శ్లాఘనీయం.

* * *

రెండో రచన –  ఆహవి. రచయిత –  ఎ ముత్తులింగం.

తమిళ మూల కథ “వెళ్ళిక్కిళమై ఇరవుగళ్”. తెలుగుసేత – అవినేని భాస్కర్. ‘ఈమాట’ జూన్ 2018 సంచికలో ప్రచురితం.

రాజ్యం మద్దతుగల సైన్యం విర్రవీగుతూ, లెక్కలేకుండా జరిపిన అత్యాచారాల్లో ఒక దానికి ఒక మహిళ గురైంది. ఆమె  జీవితం అప్పుడొక మలుపు తిరిగింది. ఆ మహిళ, తమాయించుకుని, నాలుగు నెలల గర్భవతిగా మరో దేశానికి, కెనడాకి పారిపోతుంది ఆమె. అక్కడ ఆహవిని ప్రసవిస్తుంది. కొత్త జీవితాన్ని మొదలుపెడుతుంది. పెరిగి పెద్దవుతున్న ఆహవికి తన తండ్రి గురించి సహజమైన సందేహాలు. తీర్చలేక సతమతమయే తల్లి. అది అంతవరకూ సజావుగా సాగే కథ.

(ఇంతకు మించి కథను చెప్పాలని లేదు నాకు. మీరు చదివే ఉంటారు. లేకపోతే ఇప్పుడు చదవండి.)

తను ఆ కొత్త దేశానికి పారిపోవడానికి సాయపడిన జర్నలిస్టు స్నేహితురాలు, ఆనాడు జరిగిన అత్యాచారాన్ని గురించి కొన్నేళ్ళపాటు ఆచూకీ తీసి, వివరాలని ఈ బాధితురాలికి చేరవేస్తుంది. ఆ వివరాల సాయంతో ఆ తల్లి మళ్ళీ తన దేశానికి, శ్రీలంకకు వెళ్ళి, తన కూతురికి, సరిగ్గా ఆహవిలాంటి పోలికలతోనే, ఆమె వయసే ఉన్న ఒక చెల్లిని, ఆ వెనకే అక్కడికి వచ్చిన, ఆమెకి తండ్రి కాని తండ్రిని చూపిస్తుంది.

మొదటిసారి. చివరిసారి.

తర్వాత ఆ సైనికుడి జీవితం ఏ మలుపు తిరిగిందీ? ఆహవికి తన తండ్రి గురించి ఇంకే సందేహాలూ రాలేదా? బాధిత మహిళలు ఎందరికి సాయపడే జర్నలిస్టు స్నేహితులుంటారు? అసలు అంత క్రూరంగా, బలవంతంగా ఆత్మలు సైతం  నలిపివేయబడ్డ ఎందరు మహిళలు తమను తాము సంబాళించుకోగలుగుతారు? అసలు ఎందరు చంపబడకుండా బతికి బట్టగడతారు?  ఇటువంటివీ, ఇంకొన్ని పదుల ప్రశ్నలను చదువరి మనసులో రేకెత్తించక మానదు ఈ కథ.

“ఇది నువ్వు ఎప్పటికీ మరచిపోలేని రోజుగా మారబోతోంది. గొంగళిపురుగు సీతాకోకచిలుకగా మారే రోజు. సీతాకోకచిలుక మళ్ళీ గొంగళిపురుగుగా మారగలదా?” తండ్రిని చూపడానికి ఆహవిని తీసుకెళుతూ తల్లి వేసిన ప్రశ్న. ఇందులో ఎంత గూఢార్థం ఇమిడి వుందో ఎవరికి వారు వెతికి పట్టుకుంటేనే సబబు. రెండోసారీ మూడోసారీ కథని చదివే జిజ్ఞాస ఉన్న పాఠకులకి తప్పకుండా రససిధ్ధిని కలిగించగల ప్రశ్న అది.

కథ ఎత్తుగడ, నడిపించిన తీరు ఒక అద్భుతమైతే, యుద్ధపు వికృతముఖాన్ని అన్యాపదేశంగా చిత్రించిన మరో అద్భుతమైన గాథ ఇది. అనూహ్యమైన ఇటువంటి బాధామయగాథలకు యుద్ధం ఏ విధంగా కారణమవుతుందోనన్న స్పృహని కలిగించే కథ.

* * *

మూడో రచన – క్షమార్పణ. రచయిత – గోపరాజు నారాయణరావు. ప్రజాసాహితి మాసపత్రిక, జూన్ 1998

అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ శక్తులతో జరిపిన పోరాటం నేపథ్యంగా అల్లిన కథ ఇది. “పోరాటాల్లోనూ యుద్ధాల్లోనూ నిష్కారణంగా ప్రాణాలు పొగొట్టుకున్న వాళ్ళకి; వివక్ష వల్ల చితికిపోయిన జాతులకి నివాళులర్పించడం; వాళ్ళ వారసులకి క్షమాపణలు చెప్పడం నిజాయితీగా జరిగితే ఒక మంచి సంప్రదాయమేననిపిస్తుంది.” కథకు మూలసూత్రంగా ఈ వాక్యాన్ని ఉటంకించుకోవచ్చు.

స్థూలంగా కథ ఇది:

ఎక్కడో అస్సాం రాష్ట్రానికి చెందిన ఒక ప్రొఫెసర్ గారు, విద్యారంగానికి చెందిన ఒక సందర్భాన ఆంధ్రదేశానికి వచ్చినప్పుడు, కాకతాళీయంగా అల్లూరి సీతారామరాజు సంచరిస్తున్నాడన్న అనుమానంతో బ్రిటిష్ పోలీసు బృందాలు దాడులు చేసిన ఒకానొక గ్రామానికి తాను దగ్గరలోనే ఉన్నానని తెలుసుకుంటాడు. పట్టుబట్టి ఆ గ్రామానికి వెళతాడు కూడానూ. అక్కడి “పిల్లల్లో” కొందరి పోలికలు విలక్షణంగా ఉన్నాయన్న ప్రస్తావన వస్తుంది కథలో.   వాళ్ళలో ఒక పిల్లకి తన వెంట తెచ్చిన బొకే ఇచ్చి, క్షమార్పణని కళ్ళతోనే అర్పిస్తాడు ఆ ప్రొఫెసర్.

ఎందుకు?

కథలో ఒక డైరీ ప్రస్తావన వస్తుంది. అది ఈ ప్రొఫెసర్ గారి తండ్రి రాసుకున్నది. ప్రొఫెసర్ గారు పుట్టకముందే తండ్రి మరణిస్తాడు. బ్రిటిష్ హయాంలోని అస్సాం రైఫిల్స్ లో అధికారి అయిన ఆ తండ్రి, సీతారామరాజుని వెతుకుతూ ఇందాక చెప్పుకున్న గ్రామానికి బృందంతో సహా వచ్చిపడతాడు. ఆ వూరి ఆడవారి మీద తమ బృందం చేసిన అత్యాచారాలని ఎంతో వివరంగా తన డైరీలో రాసుకుంటాడు.

ప్రొఫెసర్ గారు ఒక దశలో ఆ డైరీని చదువుతారు. తన తండ్రి ద్వారా అత్యాచారానికి గురయిన వారి సంతానానికి క్షమార్పణ చెప్పుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నా, చాలా యేళ్ళ తర్వాత, అంటే కథాకాలంనాటికిగానీ ఆ అవకాశం రాదు. వచ్చిన వెంటనే ఆ గ్రామాన్ని సందర్శించి బాధితులకి నివాళులర్పిస్తారు.  కథ ముగుస్తుంది.

కథలో, అల్లూరి సీతారామరాజుకీ, బ్రిటిష్ శక్తులకీ మధ్య జరిగిన పోరాటాన్ని ఎంతో వివరంగా వర్ణిస్తారు రచయిత. ఆయా గ్రామాల పేర్లు, ఆ యోధుల పేర్లు, పోరు సంఘటనల వర్ణన అంతా సవివరంగా చేశారు.  ఆ వృత్తాంతాలన్నీ అక్షరబద్ధం చేయడానికి ఆయన పడిన శ్రమ, చేసిన పరిశోధన ఎంతో శ్లాఘనీయం. ఆ పరంగా ఈ కథ ఎన్నో చర్చల్లో భాగమైంది, ఎన్నో అభినందనలని అందుకుంది.

మూలసూత్రానికి తగినట్లు కథను నడిపించాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిన డైరీ విషయమే కొద్దిగా ఆశ్చర్యకరమనిపించింది. డైరీ రాసుకోవడానికి అమితమైన నిజాయితీ, తనను తాను నిష్పాక్షికంగా విశ్లేషించుకోగల / విమర్శించుకోగల / ఆత్మదర్శనం చేసుకోగల ధైర్యమూ అవసరమని నా నమ్మకం. ఆ అస్సాం రైఫిల్స్ అధికారి అంత  నిజాయితీగానూ ‘తాము చేసినవి అత్యాచారాలూ’ అని డైరీ పేజీలలో ఒప్పుకోగలిగిన మనిషైనప్పుడు, పదే పదే అదే తప్పు చేయడానికి ఎలా పూనుకోగలడు? “రెండుమూడు రోజులకోకసారాయినా పెట్రోలింగ్ జరిగిపోతూనే ఉంది.   ఇప్పటికి రెండు మాసాలనుంచి భలే మజా!” ఇవీ ఆ డైరీలో చివరి వాక్యాలు.  అంటే అతను ఈ క్రౌర్యాన్ని చేస్తూ ఆనందిస్తున్నాడన్నమాట.

ఇది – ఆ అధికారి పాత్ర చిత్రణలో నాకు ఎదురైన వైరుధ్యం, అసంబద్ధత. అదలా ఉంచితే, ఒక ఉదాత్తమైన మూలసూత్రాన్ని ఎంచుకుని, దాన్ని కథాపరంగా ఎంతో నైపుణ్యంతో ప్రస్తావించిన రచయిత గోపరాజు నారాయణరావు గారు అభినందనీయులు.

(కథ ‘కథానిలయం’లో లభ్యం)

* * *

(సాహితీ వేదిక, ఢిల్లీ వారి నెలవారీ సమావేశాల్లో ఈ రచనల మీద జరిగిన చర్చల ప్రోద్బలంతో)

శ్రీనివాస్ బందా

పుట్టిందీ పెరిగిందీ విజయవాడలో. ఆకాశవాణిలో లలితసంగీతగీతాలకి వాయిద్యకారుడిగా పాల్గొంటున్నప్పుడే, సైన్యంలో చేరవలసివచ్చింది. ఆ యూనిఫారాన్ని రెండు దశాబ్దాల పైచిలుకు ధరించి, బయటికి వచ్చి మరో పదకొండేళ్లు కోటూబూటూ ధరిస్తూ కార్పొరేట్‌లో కదం తొక్కాను. రెండేళ్లక్రితం దానికి కూడా గుడ్ బై చెప్పి, గాత్రధారణలు చేస్తూ, కవితలు రాసుకుంటూ, అమితంగా ఆరాధించే సాహిత్యాన్ని అలింగనం చేసుకుంటూ ఢిల్లీలో నివసిస్తున్నాను.

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • యుధ్ధం నిరంతరం జరుగుతూ వుంటుంది, విరామం అప్పుడప్పుడు
    వస్తుంది ..అన్న మాట ఎంత నిజం.రష్యా ఉక్రైన్, పలస్తినా ,
    ఇస్రయిల్ ..ఇలా యుధ్ధాలు…చూస్తుంటె తెలుస్తోంది. మూడు
    అద్భుతం అయిన రచనలని పరిచయం చేసినందుకు అభినందనలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు