ఆ చలికాలపు ఉదయాన్న, నులివెచ్చని చిరియెండలో అడుగులో అడుగువేసుంటూ, దారిలో స్నేహితుల్ని పోగుచేసుకుంటూ, ఇద్దులాడుకుంటూ స్కూలు చేరుకొనేసరికి – చాలామంది ప్రక్కనే ఉన్న ప్రభుత్వాసుపత్రి వైపుగా వెళుతున్నారని గమనించాను. అక్కడ అప్పటికే ఊరి జనం పోగయి వున్నారు.
“ఏమైందిరా?” అని మాకన్నా ముందుగా చేరుకున్న క్లాస్మేటుని అడిగాను.
“రాత్రి ముగ్గుర్ని చంపారు. శవాలు ఆస్పత్రిలో ఉన్నాయి”.
“చూడనిస్తారా?”
“పోలీసులు రానివ్వరు”. అయినా అటువైపు నడిచాం, అందరితోబాటుగా.
మార్చురీ చుట్టూ జనం. తొంగి చూస్తే మూడు జతల పాదాలు మాక్కనిపించాయి..
ఇంతలో మా మాస్టారొకాయన అక్కడికి వచ్చి, “ఇక్కడేంచేస్తున్నార్రా వెధవల్లారా? పదండి, గంట వినబడలేదా?” అంటూ బెత్తం ఝళిపించాడు.
పన్నెండవ తరగతిలో ఉన్న మావంటి సీనియర్స్‌ని కూడా చిన్నగుంటల్ని తోలినట్టుగా అదిలించడం మాకు చిరాకు తెప్పించింది; అయినా తప్పలేదు. క్లాస్‌రూంకి పరుగెత్తాం. పాఠం మొదలైపోయినప్పటికీ మా దృష్టి ఆస్పత్రి మీదనే. జనం ఎక్కువయ్యారు. పోలీసుల ఈలలు వినిపించాయి. మూగిన వాళ్లని దూరంగా తోలేశారు. బాగా ఎండెక్కింది. మంది పల్చబడ్డారు. ఆ తరవాత ఏమైందో మాకు తెలియలేదు.
ఆరోజు సాయంత్రం, ఎప్పటిలాగానే నలుగురం స్నేహితులం స్కూలు ప్రక్కనే ఉన్న గాంధీ పార్కులో కలుసుకున్నాం. వెండి రంగు దట్టంగా పులిమిన గాంధీ విగ్రహానికి ఎదురుగా మేమంతా ఎప్పుడూ కూర్చొనే సిమెంటు బెంచీని ఒకతను ఆక్రమించాడు. అతడ్ని గుర్తుపట్టాను. ఆస్పత్రిలో తోటీ పనిచేసేవాడు. ఆనాటి ఉదయాన్న మార్చురీవద్ద హడావుడిగా తిరుగుతూ కనిపించాడు. నల్లటివాడు, దృఢకాయుడు, నెరుస్తున్న జుత్తువాడు. ఖాకీ నిక్కరూ, బనీను ధరించిన మాసిన గెడ్డంవాడు. తనలోతనే ఏదో గొణుక్కుంటున్నాడు. మాట ముద్దగా వస్తున్నది. ఎందుకైనా మంచిదని దూరంగా నిలిచిపోయాం.
“మన బెంచీ మీద కూచున్నాడు,” అన్నాను – నెమ్మదిగానే.
“ఆడినేటనకండ్రా బాబు! ఫుల్లుగ తాగీసున్నాడు” అన్నాడొక ఫ్రెండు.
“ఎప్పుడూ రానోడు ఇవాలేట్రా ఇలగొచ్చీసి కూకుండిపోండు, మన జాగాల?” – మరోడు.
మా అందరిలోకీ లోకఙ్ఞానం బాగా ఉన్న ఫ్రెండు వివరించాడు – “ఈరోజు మూడు శవాలు తగిలాయికదా! డబ్బులు బాగా దొరికుంటాయి. ఆ వచ్చిందంతా తాగీశాడు, __లమిడీ కొడుకు,” అని కులం పేరు చేర్చి మరీ తిట్టాడు.
అతను తలెత్తి మమ్మల్ని చూశాడు. రమ్మని సైగ చేశాడు. మా మాటలు వినబడ్డాయా? భయపడుతూనే దగ్గరకు వెళ్లాం. నిక్కరు జేబులో చెయ్యిపెట్టి, మడతపెట్టిన పది రూపాయిల నోట్ల కట్ట తీశాడు.
“మూడు సెవాలికి నూటేబై ఇచ్చారు”.
“అంటే ఒక్కోదానికీ ఏభై,” అని లెక్క చెప్పాడు మా ఙ్ఞాని.
అతను మాకేసి తేరిపార చూశాడు. బాగా తాగి ఉండడంవల్ల కాబోలు, మైకంతో కళ్లు సరిగ్గా ఆనడం లేదు. కూర్చొనే ఊగుతున్నాడు.
సిగ్గుపడుతున్నట్లుగా నవ్వి, “సారాకొట్టోడికి ఇరవై రూపాయిలిచ్చీసినాను,” అన్నాడు.
“అంటే ఇంకా నూటాముప్ఫై ఉండాలి”.
“అదికాదెహే…!” మామీద చిరాకుపడ్డాడు. నోట్ల కట్టని జేబులో పెట్టుకున్నాడు.
“నాకు పాతికేల్లు సార్వీసైపోయింది. ఒక్కపాలి మూడు సెవాలెప్పుడూ తగల్నేదు. ఇదే తొలి సుట్టు”.
ఎంచేతోగాని, ఒకే రోజున మూడు శవాలు దొరికిన సంబరం అతనిలో కనిపించలేదు.
పక్కకి తిరిగి ఖాండ్రించి ఉమ్మి, బీడీ తీసి వెలిగించాడు. ఒక దమ్ములాగి, “ఆల్లుగాని బతికుంటే మాలాటోల్లకి ఎంతొచ్చీదో?” అన్నాడు.
“అంటే?” మాకు అర్థం కాలేదు.
“ఆల్ల సంగతి మీకు తెల్దా? __బలిసినోల్ల కాడ లాక్కోనొచ్చి, ఏటీలేనోల్లకి పంచుతారు కాదేటి?”
ఆరిపోయిన బీడీని విసిరేసి, బెంచి మీదనుండి లేచి, మొక్కల్లో వాంతి చేసుకొని, మళ్లీ వచ్చి కూర్చున్నాడు. కాసేపు మౌనంగా ఉండిపోయాడు. ఉన్నట్టుండి ఏడవడం మొదలుపెట్టాడు. ఏడుపు ఆపాక, లేచి నిలబడ్డాడు. ఊగుతున్నాడు.
“పోదాం, పదండ్రా,” అన్నాను నేను.
“సెప్పీదాలకించండి,” అని గద్దించి, మళ్లీ మొదలుపెట్టాడు.
“ఆ గుంటడు…మీయ్యంతుంటాడు.…పోనీ ఆడినయినా ఒగ్గీసారు కాదు”.
కోపంతో ఊగిపోతూ, బూతులు తిట్టడం మొదలుపెట్టాడు. మాకు భయంవేసింది. ఒకరి చేతులొకరు పట్టుకున్నాం. అప్పటికే బాగా చీకటి పడింది. చలి ఎక్కువైంది. అక్కడినుండి చల్లగా జారుకున్నాం.
ఆ రోజున – ఈ ప్రపంచంలో నులివెచ్చని శీతాకాలపు శుభోదయాలే కాకుండా – వణికించే చలి రాత్రులూ, అంతుపట్టని చీకట్లూ, మండించే ఎండలూ, కమ్ముకొచ్చే ముసుర్లూ, చుట్టుముట్టే తుఫానులూ ఉంటాయని తెలిసింది, బలిదానాలూ, చావులూ, శవాలూ, ఆ శవాల కోసమని కాసుక్కూర్చొనే అభాగ్యులలో కూడా మానవత్వం, సున్నితత్వం – ఇవన్నీ ఉంటాయని బోధపడింది. అందర్నీ, అన్నింటినీ నడిపించే అదృశ్యశక్తులు కొన్ని ఉంటాయని ఆరోజునుంచే కొంచెం కొంచెంగా తెలుసుకోవడం మొదలైంది. అలా తెలుసుకున్నాక ప్రపంచం ఇంకోలా కనబడింది.
అప్పుడు తెలియలేదుగానీ, ఆరోజుతోనే నా బాల్యం ముగిసిపోయింది.
***
మర్నాడో, ఆ మరుసటినాడో – ‘ఆంధ్ర పత్రిక’లో చనిపోయినవాళ్ల పేర్లు రెండు వేశారు. డాక్టర్ చాగంటి భాస్కరరావు, తామాడ గణపతి. అప్పటికి మేమెవ్వరం ఆ పేర్లు వినలేదు. మూడవది గుర్తు తెలియని కొరియర్.
[ఏభై ఏళ్లనాటి యథార్థ సంఘటన ఈ కథకు ఆధారం].*
త్యాగ వీరులు.
బాగరాశారు. అతని ఏడుపులో పేదవాళ్లకు సహకరించే వాళ్ళని పోలీసులు చంపేశారే అనే బాధ కనిపిస్తోంది
అలాంటి చెప్పారాని దుఃఖమేదో
జీవితాంతం వెంటాడుతుంది.
నా కైతే రోజు గుర్తుకు వస్తారు.
మారుతున్న దినం రాత్రుల్లా…
కొంతమంది మనుషులు చనిపోకపోతే బాగుణ్ణు అన్నట్లే, కొన్ని కథలూ, కథనాలూ ముగియకపోతే ఎంత బాగుణ్ణు అనిపింపించింది.
థాంక్స్ సుధాకర్ గారు.
–ఎమ్. శ్రీధర్
ఎంతటి నిస్సహాయత!