ముసుగులు తొలగించే వస్తురూప క్రీడ-కీమో

థ ఎందుకు రాస్తున్నాను? ఏం చెప్తున్నాను? ఎలా చెప్తున్నాను?… ఇవి కథకుడికి కచ్చితంగా తెలియాల్సిన అవసరం లేదు. కానీ విమర్శకుడికి మాత్రం తెలియాలి. లేదంటే కథకుడి అంతరంగాన్ని, కథాకథన లోతులను తవ్వలేడు. కథాకాలాన్ని, సామాజిక చారిత్రక స్థితులను, పాత్రల స్వభావాలను, ఎత్తుగడ నుంచి ఎండింగ్ వరకు గల ఇంటర్ లింక్ ను కనుగొనలేడు. కథనం వాస్తవికమైందా, ఊహాత్మకమైందా, అంతరార్థకథనమా, చైతన్యస్రవంతా, మ్యాజిక్ రియలిజమా… లేక వీటిలో కొన్నింటిని కలగాపులగం చేశాడా అన్నది అవగతం కాదు.

కొన్ని కథలు రాయడానికి ధైర్యం దమ్ము ఉండాలి. ముసుగులేసుకున్న మనుషులకు వాటి వెనకున్న రహస్యాలను చూపడానికి నిజాయితీ కావాలి. ఉన్నది ఉన్నట్లు, లేనిది లేనట్లు, అనుకున్నది అనుకున్నట్లు చెప్పడానికి మధనపడాలి, మండించుకోవాలి. లోపల దాగున్న మలినాలను ఫినాయిల్ వేసి కడగాలి. తొడుగుల్ని చించి అంతరంగాల్ని అక్షరాల్తో సమాజంపై ఆరవేయాలి. అందుకే కొన్ని కథలు కొందరే రాయగలరు. అలాంటివి రాస్తున్న అంతరేద్రియ చైతన్య కథకుడు డా।। వంశీధర్ రెడ్డి. “చౌరస్తా”, “ఐస్ క్యూబ్”, “జిందగీ”, “ఔటర్ రింగ్ రోడ్”, “కీమో”… వంటి తక్కువ కథలు రాసినా, కవిత్వరహస్యాల లోతుల్లోంచి తనను ఎక్కువగా అనుభూతించుకుంటున్నాడు. ఆయన చిన్నపిల్లల డాక్టర్ కూడా.

“కీమో” కథ గురించి మాట్లాడుకుంటే ఇది వైద్యపరిభాషకు చెందిన కీమోథెరఫీ లాంటి టెక్నికల్ పదం కాదు. క్యారెక్టర్ పేరు. క్రిష్ణ మోహన్ పాత్రను షార్ట్ గా కీమో అన్నాడు కథకుడు. దగ్గరైనవాళ్లను షార్ట్ కట్ తో పిలవడం చాలామందికి అలవాటే. రిలేషన్ షిప్ కు ఆ పిలువు సింబల్ కూడా. కథకు ఆ పేరు పెట్టడం వెనక ఎంత ఔచిత్యం ఉందో తెలియాలంటే కథ తప్పక చదవాల్సిందే..!?

కథ సాగర్, దివ్యల బెడ్ రూమ్ లో ప్రారంభమవుతుంది. వారి మధ్యనున్న శారీరక మానసిక సంఘర్షణలను, బిహేవియర్ లో తేడాను, వ్యక్తిగత జీవితాలను, ఆలోచనల్లో బేధాలను సూటిగా, స్పష్టంగా వారి మాటల్లో చేతల్లో అక్కడే చెప్పాడు వంశీధర్. ఒకరి నుంచి మరొకరు ఏం కోరుకుంటున్నారో, ఎందుకు రాజీ పడలేకపోతున్నారో కూడా వివరిస్తాడు. ఒకరికి డబ్బు సంపాదించడమే లోకం. మరొకరిది ఆనందంగా బతకాలనే మనస్తత్వం. “పెళ్లంటే సెక్స్ ఏ అనుకుంటే కనీసం శాంతిగా బ్రతకొచ్చు… అదే, పెళ్ళాడిన మనిషిని సంతోషపెట్టాలనే పిచ్చి పనుల్చేస్తే ఎప్పటికీ అశాంతే.. ఎప్పటికీ..”, “ప్రాణం లేని రాళ్ళు సంభోగిస్తున్నట్టు కానీ తప్పదు… అరగంట తర్వాత ఎవరోడిపోయారో ఎవరు గెలిచారో తెలీని అరుపులు గదంతా ప్రతిధ్వనిస్తూ…” ఇలాంటి అసంకల్పిత సంకల్పిత చర్యల్లోంచి, ఆలోచనా తరంగాల్లోంచి సాగర్ కు తన మిత్రుడు కీమో గుర్తొస్తాడు.

ఇలా మొదటి సన్నివేశంలోనే సాగర్ క్యారెక్టర్ పై కీమో ప్రభావం ఉందని పాఠకులకు సిగ్నల్ ఇస్తాడు కథకుడు. పైగా వాళ్లు విడిపోయి ఐదేళ్లయిందని కూడా గుర్తు చేస్తాడు. కానీ వెంటనే కీమోను కథలో ప్రవేశపెట్టడు. అందుకు తగిన ప్లాట్ ఫామ్ ను సిద్ధం చేస్తాడు. అదే హాస్పిటల్ లో జరిగే రెండో సన్నివేశం. సాగర్ కు కీమో నుంచి ఫోన్ కాల్ రావడం, దానికి సాగర్ ప్రతిస్పందించే తీరు… కీమోపై పాఠకుల్లో ఆసక్తిని పెంచుతాయి. రోగికి అపెండిసైటిస్ ఆపరేషన్ చేస్తానని చెప్పి మర్చిపోవడం, గుర్తొచ్చి వేరే డాక్టర్ కు పురమాయించడం లాంటివి. ఈ సన్నివేశంలో ఫోన్ లో కీమో పేరు వినగానే సాగర్ పెద్దగా అరవడం, రిసిప్షనిస్ట్ భయపడటం, ఆనందంగా ఉత్సాహంగా సాగర్ కీమోతో మాట్లాడడం… చదువరులకు మంచి విందులా అనిపించనా అంతరంగంలో ఉత్కంఠత రగులుతూనే ఉంటుంది.

ఆ ఉత్కంఠను ఆపకుండా రచయిత ఫ్లాష్ బ్యాక్ కథనంతో వాళ్ల కాలేజ్ రోజులకు తీసుకెళ్తాడు. మొదటిరోజు క్లాస్ లోంచి సాగర్ ను కీమో బయటకు తీసుకెళ్లడం, ర్యాగింగ్, బూతు సినిమాలు చూడ్డం, కీమో అనాటమీ గురించి లెక్చరర్ తో వాదించడం, రూమ్ లో మద్యం తాగడం, కీమో ఐడియాలజీ, నాలెడ్జీ, అభిరుచులు, ఆలోచనలు, కళలు, కలలు, బాధ, వ్యక్తిత్వం… అన్నింటిని రచయిత సన్నివేశాలుగా, సంభాషణలుగా చెప్పుకొస్తాడు. కీమో మనుషులను, సమాజాన్ని చూసే అంతర్ బహిర్ దృష్టిని పాఠకులకు అర్థమయ్యేలా చూపిస్తాడు.

“బతకాలంటే కాస్తంత సంగీతం, అర్థమైనంత సాహిత్యమూ తెలిసుండాలి” అనుకునే కీమో, పెళ్లి కుదిరినరోజు సాగర్ తో మాట్లాడుతూ “జీవితంపట్ల నేనెప్పుడూ సంతోషంగా లేన్రా.. నిజం చెప్పాలంటే నన్ను నేనెప్పుడో కోల్పోయాను.. ఆమ్ జస్ట్ ట్రావెలింగ్ టు ఫైండ్ మైసెల్ఫ్ ఇన్ దిస్ బరియల్ గ్రౌండ్.. హహ.. ఫక్ మై స్టొటోస్టిక్ బ్రెయిన్స్…” అని తనలోని అశాంతిని బయటపెట్టేస్తాడు. ఆ అశాంతికి శాంతి దొరికిందా? ఐదేళ్ల తర్వాత ఎలా ఉన్నాడు? అనే ప్రశ్నలకు సమధానాల కోసం మన కళ్లు కథ వెంట పరుగులు పెడతాయి.

కథకు పరకాష్ట సన్నివేశం, కీమో చెప్పే అతడి గతం. కీమో మానసికంగా, శారీరకంగా ఎందుకు శిక్ష విధించుకన్నాడో చెప్పేది. సమాజంలోని విలువలకు, బతుకులకు మధ్య కుదరని అసంబద్ధ నైతికతను వెల్లడించేది. చట్రాన్ని బద్దలు కొట్టే కోరికల కరుణరస ప్లావితం. అదే “వైఫ్ స్వాపింగ్”. అత్తామామ, అమ్మానాన్న, భార్య ను అలా చూసి… తనేం అనుకున్నాడో కీమో సాగర్ కు చెప్తూ “నవ్వొచ్చింద్రా, తప్పు నాది కాదని ఒకరి మొఖాలొకరు చూస్కున్న మౌనపు సంజాయిషీలు విని, నిజంగా నవ్వొచ్చింద్రా, అక్కడేదో జరిగినట్టు పాప పంకిలంలో పడి కొట్టుకుపోయినట్టు వాళ్లు అనుకుంటుంటే…” అంటాడు. కీమో వాళ్లను అర్థం చేసుకున్న తీరుకు, సమాజంలోని విలువలను అవగతం చేసుకున్న విధానానికి నిదర్శనం. ఈ కథకు ఇదే ఆయువుపట్టు కూడా.

సాగర్, కీమో ఇద్దరూ కలిసి మద్యం తాగాలనుకోవడం, పాత మిత్రుడు కలిసి కాలేజ్ డేస్ ను గుర్తుచేయడం, షాపతను సాగర్ ను గుర్తుపట్టడం, కీమోకు లివర్ ఫెయిల్యూర్ అయిందని తెలియడం, చివర్రోజున సాగర్ తో కలిసి మద్యం తాగాలన్న అతడి కోరిక… ఇలా కథ సన్నివేశాలుగా సాగుతూ… సాగర్ మద్యం, సిగరెట్స్ కొనడంతో ముగుస్తుంది.

మధ్యలో సాగర్ ను, పాఠకులను కథా వర్తమానంలోకి తీసుకరావడానికి సాగర్ కు భార్య నుంచి వచ్చే ఫోన్స్ సన్నివేశాలను సృష్టిస్తాడు రచయిత. అవి మరింత సంఘర్షణాత్మకంగా, భార్యభర్తల మధ్య దూరాన్ని పెంచేవిగా, కీమోపై దివ్యకున్న అభిప్రాయాన్ని చెప్పేవిగా, సాగర్ ను మానసికంగా ఇబ్బంది పెట్టేవిగా ఉన్నాయి. వస్తువును కథనం మరింత గాఢతగా ఎలా మారుస్తుందో వెల్లడిస్తాయి.

కథలో ముఖ్య పాత్రలు మూడు. ఎవరి వ్యక్తిత్వం వాళ్లదే. దివ్యకు డబ్బు, హోదా కావాలి. సాగర్ సంతోషంగా జీవిస్తూ అవసరాల వరకూ డబ్బుంటే చాలనుకుంటాడు. ఇద్దరి మధ్య సంఘర్షణ మొదటినుంచి చివరి వరకూ అలాగే సాగుతుంది. కీమో తనను తాను కోల్పోలేక, చుట్టూ ఉన్న పరిస్థితులతో రాజీపడలేక తనతో తాను యుద్ధం చేస్తూ వైయక్తికంగా నాశనం చేసుకుంటాడు. ప్రారంభం నుంచి ముగింపు వరకు ఒకేవిధమైన వ్యక్తిత్వానికి కట్టుబడే ఫ్లాట్ క్యారెక్టర్స్.

కథంతా సాగర్ దృష్టికోణం నుంచే నడుస్తుంది. తన గురించి చెప్పుకుంటూనే, భార్యను తన దృక్పథం నుంచి చూస్తాడు. చూసే క్రమంలో తనను వాస్తవీకరించుకుంటాడు. తన ఐడియాలజీపై ప్రభావం చూపిన కీమో గురించి గొప్పగా వ్యక్తీకరిస్తాడు. పాత్రలు వాటి నేపథ్యం నుంచి మాట్లాడతాయి. క్యారెక్టర్లు మూడు డాక్టర్లే. అందుకు తగిన వైద్య పరిభాష, ఇంగ్లీష్ పదాలతో నిండిన వాక్యాలను సందర్భానుసారంగా కథకుడు సహజంగా ప్రయోగించాడు. కీమోలోని ఆర్టిస్ట్ ను, సైకాలిజిస్టును చూపించడానికి ఫ్రాయిడ్ థియరీపై చర్చను, అతడు రాసిన “రెండోరాత్రి” కవితను కథలో భాగం చేశాడు. కవితలో కీమోలోని సృజనాత్మకతని, మానసిక స్థాయిని, హృదయాన్ని ఆవిష్కరించాడు. కథలో ఇంత గాఢమైన కవిత పాఠకులకు ఏమేరకు చేరుతుంది అనే ప్రశ్న ఎదురైనా, అది కథకు ప్రాణం. కవితాత్మకంగా కథ రాయడం, కథలో కవితాత్మక వాక్యాలు జోడించడం వేరు. కానీ వంశీధర్ పాత్ర స్వభావాన్ని, అతడిలోని కళను కవిత ద్వారా చెప్పాడు.

కథ నాటకీయ శిల్పంలో ఎక్కువగా నడుస్తుంది. బెడ్ రూమ్ లో సాగర్ దివ్య సంభాషణలు, హాస్పిటల్ లో కీమో నుంచి ఫోన్ వచ్చినప్పుడు సాగర్ ప్రవర్తన, కాలేజ్ లో సాగర్, కీమో క్లాస్ నుంచి బయటకు వెళ్లడం. క్యాంటిన్ లో ర్యాగింగ్, స్టూడెంట్స్ సంభాషణలు, ఐదేళ్ల తర్వాత సాగర్ కీమోను చూసే సన్నివేశాన్ని కథకుడు చిత్రించిన విధానం… అన్నీ సినిమాలో సన్నివేశాల్లా కనిపిస్తాయి.

కథ నడక మొదటి నుంచి ఒకే టెంపోలో సాగుతుంది. ఉత్కంఠ, ఆసక్తిలోంచి పాఠకులు బయటకు రారు, రాలేరు. సన్నివేశానికి సన్నివేశానికి మధ్య బిగి సడలదు. బెడ్ రూం సీన్ లో భార్యాభర్తల గొడవ నుంచి కీమో తన లివర్ ఫెయిల్యూర్ కు కారణాన్ని చెప్పే వరకు, సాగర్ దివ్యతో ఫోన్ లో చేసే వాగ్వివాదం నుంచి ఇంటికి రానని కచ్చితంగా చెప్పేవరకు… గుండె వేగాన్ని తట్టుకుంటూ కథను ఆపకుండా చదవించేలా రాశాడు వంశీధర్ రెడ్డి.

“అసల్డబ్బెందుకు… రేపు బ్రతకడమనే ఊహల్లో ఈ రోజుని నరకం చేసుకుంటున్నందుకు లోకమ్మనకిచ్చే బహుమతే డబ్బా… మంచి స్నేహితుడు… హ హ… మంచి వ్యక్తి మంచి స్నేహితుడు కాగలడా… మరి మంచి స్నేహితుడు మంచి వ్యక్తవ్వాలనే అవసరముందా…”. “ఈ ఒక్కరోజైనా మనస్ఫూర్తిగా నవ్వరా వాడ్తోపాటూ… వాడు చచ్చేలోపు. కీమో.. తొందరగా చచ్చిపో.. కొత్తగా ఉందేంటో నాకిదంతా… అలవాట్లేదుగా చాన్నాళ్ల నుండి… దీన్నే జనాలు సంతోషమనో ఆనందమనో అంటుంటారా… నాకూ చావాల్నుందివాళ కాస్తంత, నన్ను నేను మండించుకోవాలనుంది.” కథలోని ఇలాంటి ఎన్నో వాక్యాలు ఎవర్నివాళ్లు నిక్కచ్చిగా వెతుక్కునేలా చేస్తాయి. అంతరంగాల్ని ఆవిష్కరించే చైతన్యస్రవంతి శిల్పం అక్కడక్కడా కవితాత్మకంగా సాగుతుంది. మనల్ని మెలిపెడుతుంది. మసలబెడుతుంది. సాగర్, కీమో దగ్గరకు వెళ్లినప్పుడు తన గురించి తాను చెప్పుకుంటూ “అసలీనాకొడుక్కి నేనేమౌతా… ఎవరైనా ఎవరికైనా ఏమౌతారు… రెండు గంటల క్రితపు నేనెక్కడ… ఇప్పటి నేనెక్కడ… ఎన్ని గడ్డకట్టిన తామస జ్నాపకాల్లో తలదాచుకుని నన్ను నే హింసించుకుని… హింస శరీరానికీ… ఆలోచన్లక్కూడానా… సూర్యుడు సింబాలిగ్గా రెక్కల్నరుక్కుని అంతరాళంలోకి నశిస్తూ… రాత్రి మెల్లగా మొలుస్తూ… బేగంబజార్ సందుల్లోంచి సంధ్య శవమ్మీదికి..” అని వర్ణించుకుంటాడు.

ఒకే కథలో భిన్న కథనాలు, రాజీకుదరని పాత్రల వైయక్తిక దృక్పథాలు, ముసుగుల్ని తొలగించే ఆలోచనలు, హృదయ గవాక్ష అద్దాల్ని బద్దలుకొట్టే నిజాయితీతో కలిసిపోయిన కథనం… ఇలా ఎన్నో ఈ కథలో కనిపిస్తాయి. కొందరు అంగీకరించొచ్చు, మరికొందరు తిప్పికొట్టొచ్చు. కానీ కథగా, కథనంగా ఇదో సంచలన చైతన్య స్రవంతి.

 

కీమో

 • -డా. వంశీధర్ రెడ్డి

 

“ఇంక చాలు, చేతుల్తీసేయ్ సాగర్..
దీంతో కలిపి ఏడు బ్రాలు.. ఈ సంవత్సరం చించేసినవి..”
……………..
“స్టాప్ దట్..ఇట్స్ పెయినింగ్..
నీ పర్వర్షన్సన్నిటికీ నువ్ మరో పెళ్ళి చేస్కోవాలైతే..”
………………..
“సాగర్..ఉమ్. ఎంతసేపు నీ బ్రెస్ట్ ఎక్సామినేషన్.. ఎనీ లంప్స్? హ హ..
చెక్ అగేన్.. తెలుసుగా.. మా చుట్టాలావిడ పోయింది లాస్ట్ యియరే..
BRCA1 పాజిటివ్.. పోస్ట్ సర్జికల్ రేడియో కీమోథెరపీ తీస్కుంది..ఐనా..”
“కీమో.. కీమోనా..”
“రేయ్ కుక్కా.. డోంట్ స్క్వీజ్..పేషెంట్సుక్కూడా ఇలాగే చేస్తావా..
వేస్ట్ ఫెలో..నీకూ ఉంటే తెల్సేవి..డోంట్ కిస్..వొద్దు..డోంట్ కం క్లోజర్..
య్ యాక్.. బ్లడీ..యువర్ మౌత్ స్టింక్స్.. ”
“హ హ..వాట్ ఫ్రాగ్రన్స్ డు యూ ఎక్స్ పెక్ట్ ఎట్ ఎర్లీ త్రీ ఇన్ ద మార్ణింగ్..
పేషెంట్స్ కి ఇలా చేస్తే నేనే నెంబర్‌వన్ సర్జన్నౌతా తెల్సా..హా ”
“తెలుస్తుంది… పోయిన్నెల నా గైనిక్ ఔట్ పేషెంట్ కలెక్షన్ డెబ్బైవేలు,
ఆబ్స్టెట్రిక్స్ (obstetrics) ఆపరేషన్ల కలెక్షన్ ఎనిమిది లక్షలు.. నీదెంతో చెప్పు.హహ్..”
“ఎన్ని సార్లు చెప్పాను బెడ్రూంలో హాస్పిటల్ విషయాలు మాట్లాడొద్దని.”.
“మరేం మాట్లాడను, నీకు తెలిసినంత నాకు తెలీదుగా”
వెకిల్తనం దాగలేదు బెడ్‌ల్యాంప్ వెల్తుర్లో కూడా..
“ఛ.. ”
“ఎక్కడికెళ్తున్నావ్.. కం టు మి, ఐ నీడ్ యూ.. ఆన్ బెడ్..”
“ఆమ్ సారీ.. ఐ కెన్ నాట్.. పడుకో.. టెర్రేస్ పైకెళ్తా..”
“పౌరుషమా..ఐతే నాకంటే ఎక్కువ సంపాదించాకే రా నాదగ్గరికి..పో.”
అడ్రినలిన్ గుండెల్లోకి చిమ్మిందొక్కసారే..
“హేయ్..లిజన్..ఆమ్ నాట్ లివింగ్ ఫర్ మనీ..ఐ డింట్ డు మెడిసిన్ ఫర్ మనీ..
ఐ అడ్మిట్..యూ ఆర్ ది బెస్ట్..ప్లీజ్ డోంట్ ఎవర్ ఫక్ విత్ మి అబౌట్ ద ఫకింగ్ మనీ..
చచ్చేదాకా నిన్ను బాగుంచడానికి సరిపడా సంపాదిస్తున్నా కానీ
సంపాందించడానికి చచ్చిపోవడం నాతో కాదు..

ఐ ఈవెన్ టోల్డ్ దిస్ విత్ యువర్ ఫాదర్ ఆన్ అవర్ మారేజ్..సో ప్లీజ్ లెట్ మి లివ్ ఇన్ పీస్..”
“నేనూ చెప్పాను మా నాన్నకి, పీడియాట్రీషియన్ని చూడండి సర్జన్ వొద్దు అని,
వినకుండా ఇలా.. ”
కోపం పెరుగుతుంది.. కళ్ళలో నీళ్ళు కూడా..
దివ్యా ఎందుకిలా చేస్తావపుడపుడు..ఎప్పుడూ నవ్వితే నీకు నచ్చదా..
ఇప్పుడు నేన్నీతో పడుకుంటేనే రేపు నన్ను బ్రతకనిస్తావ్..అంతే గా..
లేపోతే, ఐ విల్ బి ది సిన్నర్.. డామ్ ఫక్..మొహానికో మాస్కేస్కోవాలా..
“హనీ ఆమ్ సారీ, నిన్ను బాధపెట్టాలని కాదు,
ఆమ్ సారీ.. ఉమ్మ ఉమ్మ ఉమ్మ..”
ప్రాణం లేని రాళ్ళు సంభోగిస్తున్నట్టు..కానీ తప్పదు..
అరగంట తర్వాత ఎవరోడిపోయారో ఎవరు గెలిచారో తెలీని అరుపులు గదంతా ప్రతిధ్వనిస్తూ..
కీమో.. ఎక్కడున్నావ్రా..యూ ఆర్ రైట్..
పెళ్ళంటే సెక్స్ ఏ అనుకుంటే కనీసం శాంతిగా బ్రతకొచ్చు..
అదే, పెళ్ళాడిన మనిషిని సంతోషపెట్టాలనే పిచ్చిపనుల్చేస్తే ఎప్పటికీ అశాంతే..ఎప్పటికీ..
కీమో వేర్ ద ఫక్ యు ఆర్..కట్నానిక్కక్కుర్తిపడి నేనిలా ఐ,
దివ్యకీ నాలాగే అన్పిస్తుందా..మే బి షి ఈజ్ రైట్.. నాకే బ్రతకడం రాదా..
లేకపోతే అందర్లా బ్రతకడం ఇష్టం లేదా..ఐదేళ్ళైనా ఎందుకింకా మేమిలా..
రాత్రి మూడింటిదాకా సర్జరీల్చేసి శరీరమంటేనే సాంకేతిక పదాలు గుర్తొచ్చేంత ఙ్నానం సంపాదించాక అందరికీ ఇలాగే ఉంటుందా.. మాకేనా..
చెప్పరా కీమో.. ఏదో ఒకట్చెప్పు..
ఐదేళ్ళైంది కన్పించి..ఉన్నావా పోయావా..అదైనా చెప్పరా..

*******            ********         *********
“హెలో..దివ్యా..పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారు..లంచ్ కి లేటవ్వొచ్చు.
డోంట్ వెయిట్ ఫర్ మి..నువ్ తినెయ్..సరేనా…..
బాలు, తర్వాతి పేషెంట్‌ని పంపించు..”

ట్రింగ్ ట్రింగ్… ట్రింగ్ ట్రింగ్… ట్రింగ్..
ఎవరూ..ఫోన్..అన్నౌన్ నంబరా.. సర్లే..తర్వాత చూద్దాం..
“అమ్మా.. మీకు కడుపులో పేగు వాచింది. అపెండిక్స్..ఆపరేషన్జేయాలి అర్జెంట్‌గా..
బాలు, అనెస్థెటిస్ట్ డాక్టర్రాం కి ఫోన్‌చేసి రమ్మను, నైన్టీన్ యియర్స్ ఫిమేల్ విత్ అక్యూట్ అపెండిసైటిస్ అన్చెప్పు..తర్వాతి పేషెంట్‌ని పంపిచలాగే.. ”
ట్రింగ్ ట్రింగ్ …..ట్రింగ్ ట్రింగ్…. ట్రింగ్..
మళ్ళీ ఎవరూ..అదే నంబర్.. ఎవరై ఉంటారు..
“అమ్మా.. మీరు కూర్చొండి, ఒక్క రెండ్నిమిషాలు..
హెలో..హా..ఆమ్ డాక్టర్ సాగర్..ఎవరు..క్రిష్ణ మోహన్..ఎవర్..రేయ్..కీమో.. ”
(నేనరిచిన అరుపుకి రిసెప్షనిస్ట్ లోపలికొచ్చి భయంగా..)
ఎక్కడున్నావ్, బాస్టర్డ్, ఇన్నాళ్ళూ ఎక్కడ్చచ్చావ్రా..
హైద్రాబాద్కొచ్చావా..ఉస్మానియా హాస్పిటల్ బేగం బజార్దగ్గర లాడ్జ్ లో దిగావా..
నేను బయల్దేర్తున్నా.. చస్తావెక్కడికైనా వెళ్తే..హా సరే మనోళ్ళెవరికీ చెప్పన్లే..
రెండు గంటల్లో నీ ముందుంటా.. సరేనా ..”
ఏంటిది ఏమైంద్నాకు..కీమో గాడు.. ఫోన్.. నిజమేనా..
ఐదేళ్ళుగా అడ్రస్లేన్నాకొడుకు ఇవాళ సడన్‌గా ఫోన్.. అదీ బేగంబజార్ లాడ్జ్ నుండి..ఇంటికెందుకెళ్ళలేదు..
“బాలు, నేను బైటికెళ్తున్నా.. ఎమర్జెన్సీస్ ఏం లేవ్ గా..
ఏమైనా ఉంటే ఫోన్చెయ్, ట్రీట్మెంట్ చెప్తా..ఓహ్..ఆమ్ సారీ అండీ, మీకు టైఫాయిడ్,
ఈ మందుల్వాడండి.. రాసిస్తా..”
ప్రిస్క్రిప్షన్ పర్రున చిరిగిన చప్పుడు ముందో, నేను బైటికెళ్తూ గిరాటేసిన తలుపు చప్పుడు ముందో పోల్చుకునేప్పటికే వెనక బాలూ, రెసెప్షనిస్టమ్మాయ్ నాకు దయ్యం పట్టిందన్నట్టు చూస్తూ..
రెండు గెంతుల్లో హాస్పిటల్ముందున్న కార్ డ్రైవింగ్ సీట్లోకి దూరి అక్యూట్ అపెండిసైటిస్ పేషెంట్ సర్జరీ గుర్తొచ్చి..
-“బాలూ, ఒక్కమాట, చాలా ముఖ్యమైన పని, ఐ విల్ ఆస్క్ డాక్టర్ సురేష్ టు కం ఓవర్ హియర్ ఫర్ సర్జరీ.. ఆ అమ్మాయి పేరెంట్స్ కి చెప్పు నా మాటగా.. సారీ కూడా..అలాగే ఫీజేం తీస్కోకు..ఇవాళ బావుందెందుకో.. విల్ బి ఇన్ టచ్ విత్ యూ..ఫోన్లో.. ”
స్విప్ట్ డిజైర్ ఫస్ట్ గేర్లోంచి నాల్గో గేర్‌కి మూడు సెకండ్లలో మారి..
మెయిన్‌రోడ్ పక్కన రిలయన్స్ బంకులో ట్యాంక్ ఫుల్ చేయించి వాడిస్తున్న చిల్లర తీస్కోడంకూడా మర్చిపోయి హైద్రాబాద్ వైపు గాల్లో కలిసి ..
కారొక్కటే ముందుకెళ్తూ ..నేను కాలంలో వెనక్కి..
*******       ********     *********

మెడికల్కాలేజీలో మొదట్రోజు..
“గుడ్ మార్ణింగ్ స్టుడెంట్స్.. వెల్‌కంటు ది ప్రెస్టీజియస్ కాలేజ్..
నేను అనాటమీ H.O.D ని.. ఇంట్రొడ్యూస్ యువర్సెల్ఫ్ టు ఆల్..వన్ బై వన్.”.
హై ..ఆమ్….. ఫ్రం…..హై ఆమ్…..ఫ్రం…
“రేయ్.. రేయ్ నిన్నే బైటికెళ్దాం పద”
సెంటర్ క్రాఫ్‌తో ప్రేమికుల్రోజు హీరో కునాల్ గాడిలా ఉన్నాడెవడీడు..
” H.O.D ఉన్నారు, ఎలా”
ఇంట్రోలు వినాలంటే విసుగే, రెండొదలమంది మరి..
“ఇక్కడ అన్ని లెక్చర్ హాల్స్ కి ముందూ వెనకా తలుపులుంటాయ్రా..
బ్యాక్ డోర్దగ్గరికి పద.. వొంగో.. లేస్తే కన్పిస్తావ్.. స్ట్రెయిట్ అండ్ రైట్.. కాంటీన్ వైపు..
నేను క్రిష్ణ మోహన్..మీ సీనియర్ని. ఫస్టియర్ ఎక్సామ్స్ రాయక, సంవత్సరంఆగి ఇప్పుడు మీతో కలిసా..నీ పేరేంట్రా ” సన్నగా ఎవరికీ విన్పించకుండా బెంచీ డెస్కుల కిందనుండి పాక్కుంటూ ..
“సాగర్..”
“పద పద.. క్యాంటిన్‌కి.. ఆకలేస్తుంది..”
క్యాంటిన్లో ఆరు గడ్డాలూ మీసాలున్న టేబుల్మధ్యలో నన్నుంచి కీమో గాడు ఓ పక్కనుండి..
ప్రశ్నలు ..ర్యాగింగా..పోయి పోయి వీడికెందుకు దొరికాన్రా.
అసలెవడు పిలిస్తే వాడివెనక పరిగెత్తడమేనా..
“రేయ్ సాగర్, కొట్టుకున్నావా ఎప్పుడైనా..”
“హా సర్, చిన్నప్పుడు బాగా కొట్టుకునేవాళ్ళమ్.. క్రికెట్ మాచుల్లో..”
అసంకల్పితంగా అఙ్నానంతో నేనేసిన జోక్ కి పద్నిమిషాలు క్యాంటిన్ కామెడీ క్లబ్ ఐ..
“ర్హేయ్.. ర్హేయ్ హౌ.. హౌలే కా బాల్..హమ్మ..కొట్టుకోడం రా..”
చేతివేళ్ళతో అత్యద్భుత అశ్లీల సంఙ్న సృష్టిస్తూ ఓ గడ్డం..
“మాట్లాడవేం రా.. ఆహ్..హ హ ..ర్హేయ్..ఏమన్న..హేమన్న.. ఝోక్ హ హ జోకేశ్నవా అసలు.. మిలీనియం జోక్రా.. అబాహ్ అబ ఆ కొట్టుకోవడమ్మీద..హ” మరో గడ్డం స్లైస్ తాగుతూ….
“రేయ్ ఛోటే, బ్లూ ఫిల్ముల్చూసావా ఎప్పుడైనా.”.ఓ పెద్దమీసం తల గోక్కుంటూ….
“కీమో లాభం లేద్రా.. వీడు చాలా వెనకబడున్నాడు.. బోధిచెట్టెక్కియ్యాల్సిందే..
సాగర్‌గా సిన్మాకెళ్దాంపద, చీకటి రాత్రులు అని..మాంఛి సైంటిఫిక్ సిన్మా..హ హ,
అందుకే అంటార్రా..డైరెక్ట్ ఇంటర్ పిల్ల నాయాళ్ళని మెడిసిన్ చేయనివ్వొద్దని, మినిమం ఓ లాంగ్ టర్ముండాలి..” స్లైస్ గడ్డం
“ఏ కాలేజ్రా సాగరూ.. శ్రీ చైతన్య కదా.. విజయవాడ వ్యాస్ భవన్ బ్రాంచా.. అక్కడ్నుండే వొస్తారు నీలాంటి అన్నపూర్ణ ఆటా గాల్లంతా.. పా పా..ఎక్కు బండి..షకీలాన్జూసొద్దాం కాటేదాన్ స్వప్న ల..”
నేన్జూసిన మొదటి బూతు సిన్మా వాడితోనే..
చేసిన మొదటి బూతు పనీ వాడు చెప్తేనే..కీమో.. యూ బాస్టర్డ్..
********     ********     **********
ట్రింగ్ ట్రింగ్… ట్రింగ్ ట్రింగ్…..
“హెలో..దివ్య..”
“ఎక్కడున్నావు.”.
“హైద్రాబాద్కెళ్తున్నా, చాలా ముఖ్యమైన పని, అందుకే నీక్కూడా చెప్పకుండా బయల్దేరిపోయా..”
“ఏంటంత ముఖ్యం..ఇవాళ సాయంత్రమ్ డాడీ వొస్తున్నారని చెప్పాగా..”
“ఓహ్ షిట్..సారీ రా..నిజంగా మర్చిపోయా..”
“అంటే.. అబధ్దంగా ఇంతకుముందెన్నిసార్లు మర్చిపోయావ్..ఐ నో..యు డిడ్ ఇట్ పర్పస్ఫుల్లీ..
నన్ను హర్ట్ చేయడానికేగా..”
“లేదు రా.. డోం ట్ సే లైక్ దట్..”
“మరి నాకు తెలీకూడనంత అర్జెంట్ పనేంటి నీకు..”
“కీమో.. కీమో ఫోన్చేసాడు..హైద్రాబాద్కొచ్చాట్ట..”
“ఎవరూ.. దట్ డ్రగ్ అడిక్ట్.. ఆల్కహాలిక్..ఎందుకు రమ్మన్నాడు తాగడానికేగా.. ఐతే రాత్రి వరకూ రావా.. ఒక్క మంచి స్నేహితుడైనా ఉన్నాడా నీకు, తాగుబోతెదవల్తప్ప..”
“వొచ్చేస్తా ఎంత రాత్రైనా వొస్తానే..వాడికారోగ్యం బాలేదు..
సీరియస్‌గా ఉన్నాడంటే వెళ్తున్నా.”అబధ్దం అవలీలగా గొంతుదాటి..
“నీ ఇష్టం..డు వాటెవర్ యు వాంట్..గో టు హెల్..”
బీప్ బీప్ బీప్ బీప్..
అసల్నేన్దీన్నెందుకు చేస్కున్నాను..
నేన్నిజంగా తప్పు చేస్తున్నానా.. కావాలనే దివ్యని బాధిస్తున్నానా..
లేపోతే తనకి చెప్పే బయల్దేరొచ్చుగా ..ఎందుకు చెప్పలేదు.. వొద్దంటుందనా..
మా నాన్న కొనిచ్చిన కార్లో వెళ్ళొద్దంటుందనా..
నాకు నిజంగా సంపాదించడం రాదా..తను బానే సంపాదిస్తుందిగా..
నేనూ జనాల్ని పీడించి అనవసరమైన టెస్టూ మందుల్రాస్తేగానీ పూటగడవదా..
అసల్డబ్బెందుకు..రేపు బ్రతకడమనే ఊహల్లో ఈరోజుని నరకం చేసుకుంటున్నందుకు లోకమ్మనకిచ్చే బహుమతే డబ్బా..
మంచి స్నేహితుడు..హ హ..మంచివ్యక్తి మంచి స్నేహితుడు కాగలడా..
మరి మంచి స్నేహితుడు మంచి వ్యక్తవ్వాలనే అవసరముందా..
చెప్పరా కీమో..క్లీన్ షేవ్ కీమో..
*******       ********     **********

“కీమో ఫస్టియర్ పరీక్షలొస్తున్నాయ్, అనాటమీ పాసవడం కష్టమటగా..”
“రేయ్ అనాటమీకి ఐదు, ఫిజియాలజీకి ఒకటి, బయో కెమిస్త్రీకొకటి..ఏడు పుస్తకాల్లోంచే వాడడుగుతాడ్రా..కష్టమేముంది..”
“మరి నువ్వెందుక్రాయలేదు..”
“……………………………”

“చెప్పు కీమో..ఎందుక్రాయలేదు..”
“ఓ రోజు అనాటమీ రిప్రొడక్టివ్ సిస్టం క్లాస్ జరుగుతున్నప్పుడు, తిక్కదొబ్బి
వి కెన్ రీడ్ దిస్ షిట్ ఇన్ బుక్స్ మామ్, కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ ప్లెయిన్ ది సైకలాజికల్ ఫాక్టర్స్ ఇన్ఫ్లూయెన్సింగ్ సెక్స్ అండ్ సెక్సువాలిటీ..అని అడిగా.. అంతే ఎక్సామ్ రాయనివ్వలేదు..”
“మిగతా రెండైనా రాసుండాల్సిందిగా..”
“తాగి పడుకున్నా.. లేవలేదు..”
“నువ్ తాగుతావా..”
“వాట్ ఎ ఫూలిష్ క్వచ్చన్.. ఏ నువ్ తాగవా.. చూస్తాగా .. ”
ఫస్టియరెక్సామ్స్ ఐపోయిన్రోజు బార్ మా హాస్టల్ గదికొచ్చినప్పుడు
మందెక్కి

పిట్టగోడ పైకెక్కి పాడిన కిశోర్‌కుమార్ పాటల్లో దేవతల భాష వెతుక్కుంటూ ..

(మైనే..తేరేలియే.. సాథ్ రంగ్ కీ సప్నె చురీ.. సప్నే.. చూరీ హై.. సప్నే..)
********     ********     *******

“రేయ్ సాగర్…సెకండియర్ సంవత్సరంన్నర ఉంటుంది..చివరార్నెల్లూ చదూతే డిస్టింక్షనొస్తుంది..
మిగిల్న సంవత్సరం బేవార్స్ గా ఉండక నాతో సెంట్రల్లైబ్రరీకి రా..
విల్ ఇంట్రడ్యూస్ సమాఫ్ మై ఫ్రెండ్స్ టు యూ..”
“యులిసిస్ అర్ధమవ్వాలంటే గిల్బర్ట్ <ఎ స్టడీ ఆఫ్ యులిసిస్> చదూరా,
ఏంట్రోయ్ పోయెట్రీ రాస్తున్నావ్ అప్పుడే.. క్లాస్‌లో ఎవరైనా నచ్చారా ఏంటి..
బావుంది గానీ రైమింగ్ కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకు, లెట్ ద రివర్ ఫ్లో..
డోంట్ ఎవర్ ఇమిటేట్ ఎనీబడీ..ఒక్కసారెవడ్నైనా నీ ఆలోచనల్లో కలుపుకున్నావంటే చచ్చేవరకూ పోడు వాడు..క్రియేట్ ఎ లాంగ్వేజ్ ఫర్ యువర్సెల్ఫ్..నెవర్ యూస్ ది రొటీన్ వర్డ్స్ అండ్ ఫ్రేజెస్..ఇంకా ఎన్నాళ్ళురా జర్నలిజం భాష పోయెట్రీ లో..”
“ఫ్రాయిడ్ కంటే తోపు సైకాలజిష్టులు చాలామందున్నారు,
ఫ్రాయిడ్ ఇమ్మచ్యూర్గా ఇగో, లిబిడో, డ్రీమ్స్ మీద చేసిన సిధ్దాంతాలు అప్పటి మెచ్యూర్ రైటర్ల ఇమ్మచ్యూర్ బుర్రలకు ఇన్‌కంప్లీట్ గా అర్ధమై ఇంకా అర్ధమ్కానిదేదో ఉందని ఫ్రాయిడియన్ థియరీస్ని నవలల్లో కథల్లో రాయకపోతే పుస్తకాలెవడూ కొనడేమో అని రాసి చచ్చారు.. కానీ, ఫ్రాయిడ్ చేసిన గొప్పపనేంటంటే..
తను చెప్పిందాన్ని తనే తప్పని చెప్పుకుంటూ కొత్తవి చెప్పడం..”
“యానిమల్ ఇన్ స్టింక్ట్స్ వెరీ కామన్రా.. డోంట్ గెట్ అప్సెట్, నీకింకా రోడ్మీదో క్లాస్‌లో కన్పిoచే స్త్రీత్వాన్ని
కామించాలన్పిస్తుంది, నాకు..నా పిన్ని కూతుర్నే.. ఇదేదో పెద్ద పాపమన్నేననుకోను..
ఇట్స్ క్వైట్ నాచురల్..దేరార్ మెనీ మదర్ ఫకర్స్ అరౌండ్ అజ్..ఆలోచన ఆచరణ్లోకి మార్తేనే నేరం.”
“ప్రేమించామని పొదల్లో తిరగడం, నమ్మకాల్చచ్చి విడిపోయి గడ్డాలు పట్టుకు బ్రతిమాల్డం..
ఇదంతా ట్రాష్. టైమ్ వేస్ట్ ఫినామినా..నీకెవరైనా నచ్చితే ఆస్క్ హర్ టు స్పెండ్ సం టైమ్ విత్ యు..
మరీ నచ్చితే పెళ్ళిచేస్కో.. అంతేకానీ ఎప్పుడూ ఎవర్నీ పూర్తిగా సంతృప్తిపర్చాలని చూడకు..
మనం మనుషులంరా.. ఆకలెక్కువ..”
“రేయ్ రాత్రి రూం కి రాను, బైటికెళ్తున్నా..హా ..హా అమ్మాయితోనే..
షి ఈజ్ నాట్ స్లట్.. షి ఈజ్ మై ఫ్రెండ్..”
“గంజాయి తాగడం అలక్కాద్రా చింటూ.. గట్టిగా పీల్చి ఊపిర్నలాగే బిగపట్టాలి ..
అప్పుడే ఊపిరితిత్తులు మండుతాయి..ఇట్స్ నాట్ లైక్ సిగరెట్ స్మోకింగ్..”
“సాగర్, ఎందుక్రా ఈ చదువులు, మనం చదూకోలేమా..కొత్తవేమైనా చెప్పండ్రా..
ఎలా గెలవాలో కాద్రా..ఎలా ఓడకూడదో చెప్పండెవడైనా..”
“అమ్మాయిన్చూస్తే తొక్కాలని కాక మొక్కాలన్పించాల్రా.. పాత సిన్మాల్లో ముచ్చెర్ల అరుణ, పూర్ణిమ లాగా.. రేయ్ నువ్వు బ్రతకాలంటే కాస్తంత సంగీతం, అర్ధమైనంత సాహిత్యమూ తెలిసుండాలి..
పక్కవాడ్ని బ్రతికించాలంటే డ్రైవింగ్, స్విమ్మింగ్ వొచ్చుండాలి..నేర్చుకో..”
“ఎవడ్రా నిన్ను కొట్టింది..సీనియరైతేనేం ఎవడైతేనేం. .. హూజ్ దట్ సన్నాఫె బిచ్.”.
“సాగర్.. ఐపోయింద్రా..అంతా ఐపోయింది..ఆమ్ డెడ్,
నాకు పెళ్ళంట, మా నాన్న స్నేహితుడి కూతుర్తో..చెప్పాగా అర్పిత అని..”
“సంతోషమా.. ఎందుక్రా హ్యాప్పీ.. పీ.జీ లో 21 ర్యాంకొచ్చినందుకా.. ఆర్ధోపెడిక్స్ సీట్ వొస్తున్నందుకా.. హెల్ విత్ ఆర్ధో.. నేనెప్పుడూ డాక్టర్నౌదామనుకోలేద్రా.. మై డ్రీమ్ వాజ్ టు ఎక్సెల్ ఇన్ ఫైనార్ట్స్..
ఐ ఫకింగ్ లవ్ కలర్స్.. నాన్న హాస్పిటల్నేనే చూస్కోవాలని దె మేడ్ మి టు ల్యాండ్ హియర్..
జీవితంపట్ల నేనెప్పుడూ సంతోషంగా లేన్రా..నిజం చెప్పాలంటే నన్ను నేనెప్పుడో కోల్పోయాను..
ఆమ్ జస్ట్ ట్రావెలింగ్ టు ఫైండ్ మైసెల్ఫ్ ఇన్ దిస్ బరియల్ గ్రౌండ్..హ హ..
ఫక్ మై స్కొటోయిస్టిక్ బ్రెయిన్స్.. ”
**********           *********             ***********

పీప్ పీప్ పీప్ పీప్ పీప్ పీప్
పీప్ పీప్… పీప్ప్ ప్ ……ప్ పీప్ …పీప్..
అప్పుడే సిటీలోకొచ్చానా..ట్రాఫిక్ చంపుతుందిగా… పీప్ పీప్ పీప్..
ఎంత మంచి కవిత్వం రాసేవాడు తెల్లనాకొడుకు..
* రెండో రాత్రి*సమాంతర లోకాలనడుమ
పోగొట్టుకున్న కళ్ళనీ, కన్నీళ్ళనీ
చర్మపు గోడనీడన వెతుకుతూ
రక్తపు నాలిక..ఎండిన చెట్టుమీద
అద్దం
పగిలిన నిశ్శబ్దపు నిమురువాసనలతో
కాలిన రాబందుల రతిబాల్యపు మలంలో
అజీర్ణమైన ఓ
“అయోమయపు కల” సమాధిన
ఇసుక చల్లుతూ
సాయంత్రాకాశపు అసంతృప్త సముద్రం

అక్షరాలు కప్పుకున్న సీసాలోంచి
శాపగ్రస్థపు బల్లిమూతి
విదిల్చిన నిషిధ్దవాక్యపు
రంగుపువ్వుల చెమట బూడిద..
నోటికో..నుదుటికో..

నేలతవ్విన వెన్నెలల్లో
కాళ్ళు కడుక్కుంటూ
మొండెంలేని కాలం
చెప్పుల్లో చేరని క్షితిజమ్మీద

చేతివేళ్ళదాకా మెలితిరుగుతున్న
కడుపులో దుఃఖపు నొప్పికి
ఙ్నాపకాల జెండా మీద
అదృశ్య గతాల అవనతం..
ఆత్మనొంటరి చేసి ప్రాణం
మంచు కురిసిన మురిక్కాలవలో
ఈదుతున్న
రెండో రాత్రి సమీపిస్తోంది

కళ్ళనీ కన్నీళ్ళనీ తొడుక్కోవాలి
ఒక్క మనిషైనా కనపడకపోతాడా
ఉమ్మేసిన మొహాన్ని తుడుచుకోడానికి..
కనీసం వినపడకపోతాడా
కప్పేసిన మోహాల్ని తెరుచుకోడానికి..
ఒక్క మనిషైనా !!!

రేయ్ కీమో.. వొస్తున్నా..
ఇప్పుడెలా ఉన్నాడో అలాగే తెల్లగా సన్నగా.. సెంటర్క్రాఫ్తోనేనా..
బేగం బజార్ మౌసం లాడ్జ్ చేరేసరికి ప్రదోషం పలకరిస్తూ..లాడ్జ్ కింద మెహందీ ముజ్రాల అంగడి మాంసo గంటల్లెక్కన అమ్ముడుబోతూ..
“సాబ్, ఆదాబర్సే.. దేఖ్తా క్యా జరా కమ్రే మే..తందురుస్తు మాల్..
అఠారా సాల్ కీ జవానీ ఆప్‌కేలియే..” కండరాల వొంపుల్నీ, కళ్ళని పట్టేసే ఛోళీకేపీఛే నో మాన్స్ ల్యాండ్ నీ వక్రరేఖల్తో కొలుస్తూ, మొదటoతస్థు కీమో గదిచేరి తలుబ్బాదగా..బాధగా..
పులిసిన మందు, గంజాయ్ వాసనా ముoదొచ్చి వెనకో నీడ..
అనాఛ్చాదిత లావుపాటి అసైటిస్(ascitis) పొట్టతో లివర్ ఫెయిల్యూర్ లక్షణాల బట్టతల కీమో…. పళ్ళనడుమ రక్తపు చారికల ఈసోఫాజియల్ వారిసెస్(esophageal varices) వాంతుల కీమో….
వొళ్ళంతా పచ్చబొట్లతో రాక్షసంగా అప్పటి అమాయకపు నవ్వుల్నవ్వలేక గంభీరంగా కీమో…. జననేంద్రియాల్ని కప్పేసిన చీకటి దారుల్నడుమ మెరుస్తున్న ఖడ్గానికి పిన్ వేయించుకున్నవియర్డ్ కీమొ… వల్గర్ కీమో… ఇన్సిస్టిక్ ఇన్సెక్ట్ కీమో….
అసలీనాకొడుక్కి నేనేమౌతా..ఎవరైనా ఎవరికైనా ఏమౌతారు..రెండు గంటలక్రితపు నేనెక్కడ..
ఇప్పటి నేనెక్కడ.. ఎన్ని గడ్డకట్టిన తామస ఙ్నాపకాల్లో తలదాచుకుని నన్ను నే హింసించుకుని …
హింస శరీరానికేనా.. ఆలోచన్లక్కూడానా..
సూర్యుడు సింబాలిగ్గా రెక్కల్నరుక్కుని అంతరాళంలోకి నశిస్తూ..
రాత్రి మెల్లగా మొలుస్తూ.. బేగంబజార్ సందుల్లోంచి సంధ్య శవమ్మీదికి..
“కీమో.. ఏంట్రా ఇది, వాట్స్ రాంగ్ విత్ యూ.. ఇక్కడేంట్రా..ఇంటికెళ్ళకుండా..పద.”
కావలించుకోడానికి భయమేసిందెందుకో.. వాడి నగ్నత్వాన్ని చూసా.. నేనూహించని రూపంలో ఉన్నాడనా.. “రేయ్, ఇంకా నీకా రోగమ్ పోలేదా..ఆబ్సెంట్ సీజర్( absent seizure) ఫెలో..
రిఫ్లెక్సులు కాస్త తొందరగా ఇవ్వు.. భయపడ్తున్నవా నన్ను చూసి, నీ కీమోన్చూసి..కమిన్..”
“ఎన్నాళ్ళైందిక్కడికొచ్చి.. ఎక్కడున్నావ్రా ఇన్నాళ్ళు..నాకో మాట కూడా చెప్పకుండా..బాస్టర్డ్..”
“ఎక్సాక్ట్లీ.. అయామె బాస్టర్డ్.. నీ పెళ్ళైన్రోజు మందెక్కువై ఇంటికెళ్ళిపోయా త్వరగా గుర్తుందా..
ఆ రోజింట్లో మాజిక్ రియలిజమంటే(magic realism) తెల్సింది కొత్తగా.. హ హ..”
“అర్ధమయ్యేట్టు మాట్లాడ్రా పిచ్చినాకొడకా.. అర్పితా ఎక్కడుంది..”

“ఆ రోజింటికెళ్ళేప్పటికీ.. ఫక్ ఫెస్ట్..బెడ్రూంలో మూల్గులూ అరుపుల్విన్పిస్తుంటే వెళ్ళా,
బెడ్‌మీద నాన్న అర్పిత వాళ్ళమ్మతో, బాత్రూం షవర్కింద అమ్మ, అర్పితా వాళ్నాన్నతో..
ఇదంతా వీడియో తీస్తూ అర్పిత.. అందరమ్ తాగున్నామేమో.. సమయం ఆగిందో, మరి జీవక్రియలాగాయో తెలీని అనుమానంలో అరుపు విన్పించింది ..నాదే…
నవ్వొచ్చింది, నగ్నత్వాల్ని దాచుకోవాలన్న వాళ్ళ ఆందోళన చూస్తే,
నవ్వొచ్చింద్రా, తప్పు నాది కాదని ఒకరిమొఖాలొకరు చూస్కున్న మౌనపు సంజాయిషీలు విని,
నిజంగా నవ్వొచ్చింద్రా, అక్కడేదో జరిగినట్టు పాప పoకిలంలో పడి కొట్టుకుపోయినట్టు వాళ్ళు అనుకుంటుంటే.. తర్వాత అమ్మా నాన్న విడిపోయారు, కొన్నాళ్ళకి అర్పితా వాళ్నాన్న సూసైడ్..
అర్పిత ఎక్కడ్కెళ్ళిందో తెలీలేదు..” నోట్లోంచి ఖాలీ విస్కీ సీసాలోకి రక్తమూస్తూ కీమో..
అండర్వేర్ చిన్నగా వొణికి అరిచిందోసారి .. హై ఫై కుటుంబాల్లో వైఫ్ స్వాపింగ్ ఉంటుందన్తెల్సుగానీ ,
కీమో గాడింట్లోనే.. హుహ్..
“అందుకు బాధపడి అందర్నీ వొదిలి వెళ్ళిపోయావా..”
“బాధా..ఫక్, జాలేసింద్రా, మనకు నచ్చిన పనిని లోకమొప్పుకోదని బ్రతుకాపేసుకున్న వాళ్ళన్చూసి జాలేసింది..దేవుడి కృత్రిమత్వాన్ని నేనెప్పుడూ నమ్మలేదు..మనిషి కూడా దేవుడైపోతున్నట్టన్పించింది.. మూడేళ్ళు కేరళలో ఓ హాస్పిటల్లో పన్జేసా..రెండేళ్ళు కాశ్మీర్లో.. సంవత్సరమైoది లివర్ దొబ్బి,…
సిరోసిస్ విత్ పోర్టల్ హైపర్‌టెన్షన్..(cirrhosis with portal hypertension)..
నాదొదిలేయ్ గానీ నీ ప్రాక్టీసెలా ఉoది, టౌనుల్లో సర్జెన్ కి చాలా గిరాకీ గా.. హ హ ,
ఫిజీషియన్ కెన్ నాట్ డు ఎ సర్జెరీ, బట్ ఎ సర్జన్ కెన్ ఆల్వేస్ హ్యాండిల్ ఎ మెడికల్ కేస్..కదా..
రెండు చేతులా సంపాదిస్తున్నావా.. ఇంకా నోట్లో నాలిక లేనట్టే ఉన్నావా.. దివ్యెలా ఉంది.”
“………………………”
“చెప్పరా.. దివ్యెలా ఉంది, పిల్లలూ.. ”
“రెండు సార్లు అబార్షన్చేయించుకుంద్రా.. ఇప్పుడే పిల్లలెందుకు కొన్నాళ్ళెంజాయ్ చేద్దామని..”
“అఫ్కోర్స్, నిజమేగా, అమ్మలమైతే తెలిసేది మనకూ..మగముండాకొడుకులమైపోయాం.. సాగర్‌గా..ఆకలేస్తుంద్రా.. తిండానికేమైనా….తెచ్చుకున్న డబ్బులన్నీ మందుకే….
రెండ్రోజులైంది కడుపు చచ్చి….మనవాళ్ళెవర్తో మాట్లాడాలన్పించక, నీకు, ఫోన్‌చేసి..
రేయ్ ఒకవేళ నువ్ నంబర్ మార్చుంటే నేనిక్కడే ఈ మందిరంలోనే..పైకి..హ హ”
(అతి మామూలుగా నాపైకో విధ్వంసపు శకలాన్ని విదిల్చి
రాలుతున్న గోడ పెచ్చుల్ని అరచేత్తో అదిమిపెడ్తూ..)
రేయ్ అలాగే ఓ హాఫ్… ఐపోయింది రాత్రిది.. చచ్చేముందు నీతో తాగాలనుంద్రా..
ఒక్కసారే, అంతే, ఎండిపోయిన కాలేయానిక్కాస్త వరద పారించరా..”
*********             *********             **********

బగ్గా వైన్స్ ..కోఠి..
“భాయ్, ఏక్ ఫుల్ సిగ్నేచర్దో..”
వీడిపని బావుంది.. అప్పటికీ ఇప్పటికీ బానే బలిసాడు సింగ్ గాడు..
“సర్.. హాయ్..మీరేంటి ఇక్కడ”
అయోమయంగా చూస్తున్న నా చూపుల్ని పసిగట్టాడో ఏమో..
“సర్ నేను, కమల్, మీరు పీ.జీ చేసేప్పుడు నేను యూ.జీ, సెకండియర్‌లో.. 545 రూంలో..”
“హా కమల్, వరంగల్ కదరా, ఎలా ఉన్నావ్, నేను బావున్నారా, పెళ్ళైంది, ప్రాక్టీస్ ఊర్లోనే..” బూతేంలేదుగా చివరి మాటల్లో..
“మీ ఫ్రెండ్ క్రిష్ణ మోహన్ ..అదే కీమో సర్..ఎక్కడున్నారు,MS orthopedics సీట్ కూడా వొదిలేసుకున్నారుగా.. ఆయన గిటారింకా మా దగ్గరే ఉండిపోయింది ..”
“కీమో నా.. ఆమ్.. సిమ్లాలో సెటిల్ అయ్యాడ్రా, వాళ్ళ నాన్నగారి వ్యాపారాల్చూస్కుంటున్నాడక్కడే..
అవ్నూ, హాస్టలెలా ఉంద్రా.. అలాగే ఉందా ఇంకా.. నీళ్ళురాని బాత్రూంలూ కంపు టాయిలెట్లతో..
హ హ..” నిజంగా నవ్వుతున్నానా.. నవ్వడానికే నవ్వుతున్నానా..
“ఎవ్రీథింగ్ ఫైన్ సర్, కొత్త ప్రిన్సిపాలొచ్చాడు, యమా స్ట్రిక్ట్, హాస్టల్‌కి మంచి రోజులొచ్చినట్టే..
మర్నేనెళ్తా సర్.. బర్త్ డే పార్టీ ఉందొకర్ది, సరుక్కోసమొచ్చా..”
ఎవడీ కమల్, ఎప్పుడో ఆరేళ్ళకింద చూసిన కీమో గాడి గురించడిగి..
దివ్యా.. నీకెందుకర్ధం కాలేదే వాడింకా.. అంతేలే,
సంఘానికి పొరలు విప్పుకుని బ్రతికేవాడెప్పటికీ నచ్చడు ,
ట్రింగ్ ట్రింగ్… ట్రింగ్.. ట్రింగ్ ట్రింగ్…
దీనికి నిజంగా వందేళ్ళు..
“చెప్పు.. దివ్యా..”
“ఎక్కడున్నావ్, తాగుతున్నావా, డాడీ ఎదుర్చూస్తున్నారు.వొస్తావా లేదా..”
“కీమో ఈజ్ ఆన్ డెత్ బెడ్, లివర్ ఫెయిల్యూర్, ట్రాన్స్ ప్లాంట్ చేసినా కష్టమే.”.
“నేననుకుంటూనే ఉన్నా, అతను పోతాడని, లేపోతే ఇన్నేళ్ళుగా.. “.
“దివ్యా కెన్ యూ ప్లీజ్ షట్ యువర్ మౌత్.. నేనిప్పుడ్రాలేను..అంకుల్‌తో తర్వాత మాట్లాడ్తా..
అర్ధం చేస్కో.. కీమో నీడ్స్ మి నౌ..” పిడికిలి బిగిసి గొంతు మీది నరముబ్బి ఎగసి..
బీప్ బీప్.. బీప్ బీప్.. బీప్ బీప్..
రేయ్.. నిన్నే విన్పిస్తుందా..
ఈ ఒక్కరోజైనా మనస్ఫూర్తిగా నవ్వరా వాడ్తోపాటూ.. వాడు చచ్చేలోపు,
కీమో.. తొందరగా చచ్చిపో..కొత్తగా ఉందేంటో నాకిదంతా..అలవాట్లేదుగా చాన్నాళ్లనుండి…
దీన్నే జనాలు సంతోషమనో ఆనందమనో అంటుంటారా..
నాకూ చావాల్నుందివాళ కాస్తంత, నన్ను నేను మండించుకోవాలనుంది,
మర్చిపోయిన గతాల పొగలేవో గుండెల్లోకెక్కించుకుని ఎగరాలనుంది..
ఎన్నేళ్ళైంది సిగరెట్ తాగి, ఒక్కడ్నే తాగలేన్రా కీమో..ఇవాళ నువ్వున్నావ్‌గా.. కాల్చేద్దాం..
భుజాల మీద మోసుకుతిరుగుతున్న ముఖాలనన్నింటినీ కాల్చేద్దాం..
“తమ్ముడూ.. రెండు పెద్ద గోల్గ్ ఫ్లాక్ డబ్బాలియ్, మాచిస్ భీ.. హా..”
బుస్ స్ స్ స్ స్ స్ స్ స్ స్……

——————

Avatar

ఎ.రవీంద్రబాబు

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • డా. వంశీధర్ ‘కీమో’ కథపై డా. రవీంద్ర విశ్లేషణ చదివాక… బయటకు కనిపించని బతుకులో యెంత బీభత్సమో ీఅనిపించింది. ముసుగులు తొలగించిన కథా వస్తువు , కథా రూపాల క్రీడ వంశీధర్ కీమో కథ. కథ యెంత విచిత్రానుభూతి కలిగించిందో రవీంద్ర విశ్లేషణ అంతగా బతుకులోలోతులను తెలుసుకునేలా చేసింది. పైకి కనిపించే బాడీ లోలోపలి అవస్థలను స్టెత్ స్కోప్ ద్వారా మాత్రమే వినిపిస్తుంది. ఎక్స్ రే మాత్రమే చూపిస్తుంది. ఈ కథ అనే బాడీకి రవీంద్ర స్టెత్ అండ్ ఎక్స్ రే. -ఉదయ్, ఈటీవి.

 • నాకు ఇప్పటికీ వంశీధర్ అన్న మీద కోపమే! ఇలాంటి ఎఫెక్టివ్ కథలు రాసిన మనిషి ఎందుకు ఇప్పుడు రాయటం లేదే అని ఎప్పుడూ అనిపిస్తుంటుంది. ‘ఐస్ క్యూబ్’, ‘ఔటర్ రింగ్ రోడ్డు’ ఎట్లాంటి కథలివి? మళ్లీ రాయాలి. తప్పకుండా రాయాలి!❤️❤️

 • “ఒకే కథలో భిన్న కథనాలు, రాజీకుదరని పాత్రల వైయక్తిక దృక్పథాలు, ముసుగుల్ని తొలగించే ఆలోచనలు, హృదయ గవాక్ష అద్దాల్ని బద్దలుకొట్టే నిజాయితీతో కలిసిపోయిన కథనం… ఇలా ఎన్నో ఈ కథలో కనిపిస్తాయి. కొందరు అంగీకరించొచ్చు, మరికొందరు తిప్పికొట్టొచ్చు. కానీ కథగా, కథనంగా ఇదో సంచలన చైతన్య స్రవంతి.”

  ఇక చెప్పేదేముంది రవీంద్రా?
  కీమోలోని కిటుకు మీకు పూర్తిగా తెలిసిపోయింది. మీరన్నది అక్షరాల నిజం ఈ కథని కొందరు అంగీకరించ వచ్చు. మరికొందరు తిప్పికొట్టొచ్చు. మరికొందరికి పుండు మీద కారమై సలపొచ్చు కూడా. దట్ ఈస్ వంశీధర్ రెడ్డి. ఈ కథ గుర్తొచ్చినపుడల్లా అర్జున్ రెడ్డి సినిమా గుర్తుకొస్తుంది నాకు. తెలిసో తెలియకో ఈ కథ ప్రభావం మాత్రం ఆ దర్శకుడి పై ఉందేమో అని అనుమానం. వంశీ కవిత రాసినా కథ రాసినా సెటైర్ రాసినా ఒక ప్రకంపన. ఒక లావా. తీసుకున్న వారికి తీసుకున్నంత అనుకో! కీమో మీద మీ రివ్యూ ఆ కథకి న్యాయం చేసింది – అభినందనలు .

 • వంశన్న ( డా. వంశీధర్ రెడ్డి ) కీమో… వెంకట్ సిధ్ధారెడ్డి సోల్ సర్కస్ కధ చిత్వాన్ లను తలచుకున్నప్పుడు నాకూ కోపం వస్తుంది… గొరుసన్న మీద! మాయమ్మ గజయీతరాలు, పాలమూరు వలసపక్షులు గురించి రాసినోడు ఉప్పుడు కధా సాహిత్య క్షేత్రానికి దూరమైనందుకు.

  Dr. Vamsidhara Reddy, M.S. అనే బోర్డు చెరిపేసి మళ్లీ మరో కొత్త బోర్డు Dr. Vamsidhara Reddy, M.Ch ( Super Speciality Degree – Master of Chirurgical ) రాయించుకునే పనిలో బిజీగా ఉండి ఉన్నాడనుకుంటా వంశన్న. అలాంటి జిందగీ కి సంబంధించిన చిన్నా చితకా పనులు చక్కబెట్టుకుని వంశన్న మళ్లీ రాస్తాడు. తప్పకుండా రాస్తాడు మాజిక్ రియలిజం లోనో, చైతన్య స్రవంతి లోనో…ఎండిపోయిన పాఠకుల రుదయాల మీద వరదలా ప్రవహిస్తూ. వంశన్న గారి రాములు డాక్టర్ సాబ్ మీదొట్టు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు