ముల్లు కుచ్చుకున్న నొప్పి

లోలోపల కవిత్వం ఎలా మొదలవుద్ది

మరింత తెలుసుకోవలన్న ఉబలాటం

 

గుండె కలుక్కుమన్నప్పుడు వచ్చిన నొప్పి

మనోఫలకం మీద చమక్కున మెరుస్తుంది

తక్షణమే పద్య బీజావాపనం

 

ఒక్కుదుటనే రూపు కడుతుందా ?

ఉత్సుకత కొనసాగుతున్న ఆసక్తి

 

గూడు కట్టుకున్న బాధల్లోని అక్షరాలు కదా

ఆకాశం మీద కొంగల గుంపులా తిరిగి తిరిగి

తెల్ల కాయితం మీద ఇలా వాలిపోతాయి

 

ఎకాఎకిన కవనమై ఎట్లా అల్లుకుంటది?

 

అదంతా నిరంతర అధ్యయన సారం

నిరలంకార కావ్యాచరణ రూపం

 

ఊహల్లోంచి పదపదం పద చిత్రమైతది

ఉపమా రూపకాలు ఉదారంగా వస్తాయి

భావాలు ఉప్పొంగి కావ్యాలై పుష్పిస్తాయి

 

నడకా నిర్మాణ శిల్పమూ మరి ?

 

కాలికి ముల్లు గుచ్చిన నొప్పి నుంచి

జలజలా రాలిన ఆ కన్నీళ్ళ చరణాలు

పందిరి మీద బీరతీగలా ఎగబాకుతాయి

 

కులవృత్తి దారుల చేతిలో ఇసిరెలు తయారైనట్టుగ

సృజనాత్మకత కూడా సహజమైన ఉత్పత్తి

 

తిరిగే సారి మీద సుతారంగా కుండ వానినట్టు

తటిల్లున కవిత్వం తనకు తానే శిల్పమైతది

 

నలుగురితో కలిసి లోకానికి

గొంతు నివ్వడమే కవిత్వ పరమార్ధం

ప్రకృతితో కవి మమేకవ్వడమే రచన

(ప్రఖ్యాత కవి కె. శివారెడ్డి తో కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో వాహ్యాళి తర్వాత)

అన్నవరం దేవేందర్

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మొత్తానికి రాశేశారు — గుడ్ నిజంగా మంచి సమయం గడిచింది

  • కవిత్వం ఎలా పుడుతుంది… అనేది అతి సున్నితమైన ఓ పురిటి నొప్పి… అది దేవేందర్ గారి వంటి కవులకే ఎరుక అవుతుంది

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు