ముగింపు లేని కల అతని కథ!

మూడు దశాబ్దాల పాటు తన ప్రత్యేక శైలితో కథా ప్రపంచాన్ని అబ్బుర పరచిన నిరంతర రచనాశీలి కలం ఆకస్మాత్తుగా ఆగిపోయింది.

మూడు దశాబ్దాల పాటు సాహితీ క్షేత్రంలో నిలబడి రచనలు చేయటం అంత తేలికైన విషయమేమి కాదు. దాదాపు 90 కథలు, మూడు నవలలు, పాతిక పైగా వ్యాసాలుగా విస్తరించిన డా. చంద్రశేఖరరావు సాహితీ జీవితం ఆరుపదులు నిండకుండానే ముగియటం తెలుగు సాహిత్య రంగానికి పెద్ద లోటు.

తెలుగు సాహిత్యంలో ప్రయోగాత్మకమైన వచనానికి పేరు  చంద్రశేఖర రావు. కథా వాక్యానికి స్వాప్నిక అధివాస్తవిక భాషనిచ్చినవాడు. కథనంలో అత్యాధునిక రాస్తాలో నడిచినవాడు. మంచి చదువరి. మృదుభాషి.

దుఃఖాన్ని క్రోధాన్ని , భయాన్ని అక్షరాలుగా అనువదించి మరణం అంటని ముగింపును కలగన్న కలం యోధుడు , కథకు కొత్తకు రంగులద్దిన కథా చిత్రకారుడు డా. వి. చంద్రశేఖరరావు ప్రథమ వర్థంతి సందర్భంగా జూలై 8 2018 ఆదివారం….ఆయన కథల పుస్తకం  “ముగింపుకు ముందు”….ఆవిష్కరణ గుంటూరులో జరుగుతోంది. ఈ సందర్భంగా ఆ కథా సంపుటిలో వీసీఆర్ గురించి నాలుగు  వాక్యాలు….సారంగ పాఠకుల కోసం…..

 

***

ముగింపు తరువాత.

రేళ్ల క్రితం చంద్రశేఖరరావు రాసిన ఒక కథ పేరు “ముగింపుకు ముందు” తో తన మరణానంతరం ఇలా కథా సంపుటి తీసుకురావాల్సి వస్తుందని ఎవరమూ ఊహించలేదు.

మూడు దశాబ్దాల పాటు తన ప్రత్యేక శైలితో కథా ప్రపంచాన్ని అబ్బుర పరచిన నిరంతర రచనాశీలి కలం ఆకస్మాత్తుగా ఆగిపోయింది. ఆరు పదులు నిండని వయసు, అందులో మూడు పదుల రచనా జీవితం అనేక వత్తిడులతో కూడిన ఉద్యోగ నిర్వహణలో ఉంటూనే రచనే ప్రధాన కార్యక్షేత్రంగా సాగిన నిబద్ద జీవితం ఆయనది.

2012లో ఒకే సారి రెండు నవలలు- ఆకు పచ్చని దేశం, నల్లమిరియం చెట్టు, ద్రోహ వృక్షం కథా సంపుటిని ప్రచురించుకున్నారు. ఆ తరువాత ఎంపిక చేసిన 31 కథలతో విశాలాంధ్ర వారు చిట్టచివరి రేడియో నాటకం కథా సంపుటిని ప్రచురించారు. 2012 తర్వాత చంద్రశేఖర రావు తరచూ అనారోగ్యానికి గురవుతూ వచ్చారు. బహుశా అందువల్లే కొద్ది కథలు వ్యాసాలు మాత్రమే రాయగలిగారు.

వివిధ అంశాలపై చంద్రశేఖర రావు రాసిన పాతిక పైగా వ్యాసాలు, ఆయన సాహిత్యాన్ని వివిధ సంధర్భాల్లో విశ్లేషిస్తూ వెలువడిన వ్యాసాలు ఇంకా వెలుగు చూడవలసి ఉంది. భవిష్యత్తులో ఈ రచనలను పాఠకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం.

మరణం అంటని ఒక ముగింపును కలగన్నరచయిత మరణానంతరం వస్తున్న కథా సంపుటి ఇది.

                                            -చంద్రశేఖర రావు కుటుంబ సభ్యులు, మిత్రులు

 

“చంద్ర” భాష

~

సాయంత్రపు ధూళి అంతా కడిగేస్తూ
కొన్ని మాటల్ని నెమ్మదిగా
పూల కన్నా సుతారంగా
రాల్చావు నువ్వు
అంతకుముందు తెలిసిన అర్థాలన్నీ
మూగవై పోతూ వుండగా-

వచనంలోని శబ్దాల చప్పుళ్ళ మధ్య
కాసింత మౌనాన్నీ,
నీ/ నా/ మనల మధ్య ఖాళీల్లో
కొంత హంస గానాన్నీ
పాల కన్నా మెత్తగా వొలికించావని
నమ్ముతూ వుంటానా,

మూత పడిన పుస్తకం కింద
వొత్తిపెట్టిన సంద్రాలన్నీ వులిక్కిపడి లేస్తాయి
వొక జలపాతమేదో వొళ్ళు విరుచుకొని
వెనక్కి జారుకుంటుంది.

భాష దానికదే మృత దేహం.
దాని రక్తమాంసాల్లోకి మళ్ళీ పంపే నెత్తురు
నీ/ నా చిర్నామా చీటీ.

ఆ చీటీ పట్టుకొని
తరుముకుంటూ వెళ్తాం తెలియని వీధుల్ని!

–అఫ్సర్ 

స్కెచ్: అక్బర్ , పరిచయం: చందు తులసి 

ఎడిటర్

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఎందుకనో గుండె కలుక్కుమంది … ఒక కల అదృశ్యమైంది ….డాక్టర్ కూడా మరణిస్తాడా అని సైన్సు ఏడ్చింది … రూమి సమాదిలొంచి లేచాడు … తెలుగు నేలపైన ఎందరో కమ్లీలు అన్నా అని ఏడుస్తున్నారు … ఎక్కడో సవర గూడెం తన కలను శాశ్వతంగా పోగుట్టుకుని ఎండిన ఆకుల గుట్టలపై నిట్టూరుస్తోంది … ఏమిటో !!!! ఎన్ని రాయాల్సి ఉంది ? ఇలా ఎందుకైంది అని మెదడు మొద్దుబారింది పాఠక ఆత్మబంధువు మహాభినిష్క్రమణం తో ….దుఃఖిస్తూ ….

  • మనం ఈ లోకంలోంచి నిష్క్రమించడానికి ఏదో ఒక తేదీ ఫిక్స్ అయ్యి ఉంటుదనేది నగ్నసత్యమే. కానీ, మనం ప్రేమించే వాళ్ళు మనముందే కనుమరుగయితే – అది ఎంత మానసిక క్షోభో ! సార్, మీ రూపం కళ్ళల్లో , మీ వాచికం చెవుల్లో నిరంతరం గుర్తు చేస్తూ నన్ను నిర్వీర్యుణ్ణి చేస్తూనే ఉంటుంది. ఆల్బమ్ చూడాలంటె భయంగా ఉంటుంది సార్ – మనం కలిసి దిగిన ఫోటోలు … మనసుని కలిచివేస్తాయవి. మీరు వెళ్ళిపోయినప్పుడు నాకు సమీపంలోనే ఉన్నారు , అయినా మీ పార్థివ దేహాన్ని చూడ్డానికి నా మనసు వణికి పోయింది. మన్నించండి. పునర్జన్మలు ఉండవని నమ్మేవాణ్ణి గనక మీరు మళ్ళీ పుట్టారని తెలుసు. నేను ఈ నేల మీద ఉన్నంత కాలం మీ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ నే ఉంటాను. మీ “నిప్పు పిట్ట ఎర్ర కుందేలు మరియు అదృశ్యమవుతున్న జాతుల కథ ” లో నన్నూ ఒక పాత్రని చేశారు – నేనంటే మీకెందుకంత ప్రేమ సార్ ! గుండె నిండా నివాళితో మీ “రెడ్డి ” (మీ సంబోధన ” రెడ్డి” కదా !)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు