మీటూ….నాకు సైతం

ఇది సినిమా రంగంతో ఆగిపోకూడదు. మన ఆడబిడ్డలు నోరువిప్పాలి.  పనికోసం చదువు చెప్పే పాఠశాలలు, కళాశాలలలో ఇది ప్రవేశించాలి. నోరు విప్పటం తప్పనుకునే మనస్తత్వం పోవాలి.

1

మీటూ ఉద్యమం అన్ని పని స్థలాల లోకీ విస్తరించాలన్న ఆకాంక్షతో ఫేస్బుక్కులో రెండు టపాలు పెట్టాను. అవి చదివారు నా ఆత్మీయులు దాసరి అమరేంద్ర. మీరు దీనిమీద సమగ్రమైన వ్యాసం రాయాలని అన్నారు. వారికి ఆదేశమిచ్చేంత చనువూ దానిని ఒప్పుకునేంత ప్రేమా మామధ్య ఉన్నాయి. కాని నాకు స్వయంగా ఏదో చెప్పాలనిపించాలి. చెప్పటం బాధ్యతగా అనిపించాలి. అప్పుడే కదలగలను.

ఆ తర్వాత నేనీ విషయం మీద ఆలోచిస్తూనే ఉన్నాను. ఇటీవల ప్రచురితమైన ఒక కథ తారసపడింది. అది ఒక మహిళ రాసింది. బాధల్ని దాచుకోవటం ఒక సాధన అంటుంది ఆ కథ. ఇది మన సమాజంలో అనాదిగా ఉన్న ఒక భావనని ఒక కొత్త పదంతో గౌరవించటమే. అది చాలామంది భారతీయ స్త్రీలు అనుకుంటున్నదే, ఆచరిస్తున్నదే. అనేక విధాల ప్రస్తుతించబడిన “సహన స్వరూపిణి భారతీయ స్త్రీ” అనేది ఒక భావన. అది ఒక సంకెల. స్త్రీలు ఆ సంకెల విడిపించుకోవాలి. ఇలా వంద సంవత్సరాలుగా మన సమాజంలోని చైతన్యవంతులు భావిస్తున్నారు. దాంపత్యంలోనూ, కుటుంబంలోనూ భారతీయ స్త్రీ పరిస్థితి ఏవిధంగా ఉందో పురుషులు జాలితోనో, వివేచన తోనో, సహఅనుభూతి చెందుతూనో చెప్పటం ఆరంభించారు.

20 శతాబ్దపు తొలి దశకంలో బ్రహ్మాండం కనకసుందరమ్మ అనే ఆమె పద్యాలలో స్త్రీ పరిస్థితిని అర్ధం చేసుకోమని పురుషులకి వేడుకోలుగా చెపుతుంది. గుండెలని పిండే పద్యాలవి.  ఆ వేడుకోలు స్థాయినుంచి ఈ వంద సంవత్సరాలలో స్త్రీ కనీసం సాహిత్యంలోనైనా పురుషుని నిలదీసే స్థాయికి వచ్చింది. మీటూ ఉద్యమం మనం ఆహ్వానించాలన్న వినతి చేస్తే చాలదు. అది వచ్చిన సందర్భంలో మనం చాలా మాటలాడుకోవలసిన విషయాలున్నాయి. ఆ అవసరాన్ని ఈ కథ మరింత గుర్తు చేసింది.

“బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్ ఆ ఎరుకే నిశ్చలానందమోయ్ బ్రహ్మానందమోయ్” అన్నదో ఫిలాసఫీ.(నిజమే అది ప్రేమ బాధే. మగాడి ఏడుపే.) దానికి కాస్త అటూయిటూ సర్ది తయారు చేసిన మాటే “బాధే సాధననే భావన రానీవోయ్ ఆ ఎరుకే…” ఓ కథ అయింది.(నిజమే ఈ బాధ నిత్యమూ తన్నే మొగుడనే మొగాడు ప్రసాదించినదే. తన్నులు కలిగించే నొప్పి కన్న అవి తన్నులు అనే ఎరుకే ఎక్కువ బాధిస్తుంది.   “పడ్డవాళ్లు చెడ్డవాళ్లు కాదు.” “కిందున్న ఆకు కిందే ఉండిపోదు.” “ఇది గతజన్మ  కర్మ ఫలితం. వచ్చే జన్మలో ఉత్తమజన్మ పొందుతావు. తక్కువగా తన్నేవాడో, లేకపోతే కేవలం తిట్టేవాడో లభిస్తాడు” అన్న ఎరుకతో ఇవి తన్నులనే తప్పుడు ఎరుకను సరిదిద్దుకునే సాధన చెయ్యి.) ఇలాంటివెన్నో వేల సంవత్సరాలుగా ప్రభావితం చేస్తున్నాయి. కనీసం నోరు మెదపకుండా చేసాయి. చేస్తున్నాయి. పురుషుల మీద ఈ ఫిలాసఫీల పర్యవసానం ఇక్కడ చర్చించను.

2

సంసారం గుట్టు రోగం రట్టు అన్న మాట అందరూ వినే ఉంటారు. దీని అర్ధం విప్పి చెప్పనక్కరలేదు. ఇది పురుషాధిక్యసమాజం పుట్టించిన మాటే. ఈ గుట్టు మగాడూ పాటించాలి మరి. పురుషాధిక్యసమాజంలో పురుష పాలన ఉంటుంది. కాని పురుషుడు ఆ పాలన(అంటే ఆడదాని మీద పెత్తనం, తన్నటం, ముగుదాడు వెయ్యటం) సరిగ్గా చెయ్యలేకపోతే ఆడంగి వెధవ అంటారు. పెళ్లాన్ని దోవలో పెట్టలేక ఇక్కడకొచ్చిన ఏడుపుగొట్టు వెధవ అంటారు. పెట్టమారి మగడు అంటారు. తల్లి కొంగు వదిలి పెళ్లాం కొంగు పట్టుకున్నాడంటారు. ఇలా అనిపించుకున్న మగాళ్లెంత మంది ఉంటారో ఆ పురుషపాలన చేసే స్త్రీలూ కాస్త అటూఇటూగా అంతమందే ఉంటారు. వాళ్లని మనం గంపగయ్యాళి అంటాం. మగరాయుడు అంటాం. మొగుడిని కొట్టి మొగసాలకి ఎక్కింది అంటాం. బరితెగించింది అంటాం. ఇలాంటి మగా, ఆడా చిల్లరా చితకా మొత్తం జనాభాలో చాలా తక్కువేనని- సర్వేలు చెయ్యకుండానే- సులువుగానే చెప్పవచ్చు. చెప్పి సులువుగానే ఒప్పించవచ్చు.

సరిగ్గా ఈ గుట్టుని మన ఆడబిడ్డలకి పుట్టిన దగ్గరనుంచీ ఉగ్గుబాలతో పట్టేస్తాం. గోరుముద్దలు చేసి తినిపిస్తాం. కోరలు పీకిన పాముల్లాగా సర్కస్ జంతువుల్లాగా తయారు చేస్తాం. మన బోధనలతో నత్తగుల్లలు కట్టి దానికింద రక్షణ ఉంటుందని నమ్మించి వీధిలోకి వదులుతాం. మన బిడ్డలను వీధిలోకి నెట్టిన పాపాన్ని ఆధునికతా, ఆంగ్లవిద్యా, పారిశ్రామికీకరణల మీదకి నెట్టివేస్తాం. మన సాంప్రదాయాలను తుంగలో తొక్కేసాయనీ గంగలోకి నెట్టేసాయనీ  లోలోపల సణుక్కుంటాం. కొంతకాలం నీకేం కర్మ ఉద్యోగం చెయ్యటానికి అనీ అన్నాం.

అలా వెళ్లిన మన ఆడబిడ్డలు ఏమయ్యారు?

3

ఈనాడు మీటూ – నాకు సైతం- అంటున్నారు మన ఆడబిడ్డలు. ఎవరంటున్నారు? ఏంటంటున్నారు? ఏం జరుగుతోంది? ఏం జరగాలి? జరుగుతున్నది ఎంతకాలం ఉంటుంది? ఇది పురుషుని చింతనలో ఏ మార్పు తెస్తుంది? స్త్రీ స్థైర్యంలో ఏమైనా మార్పు తెస్తుందా? ఏ మార్పు తేవాలి?

నిజమే..

మీటూ ఉద్యమం సినిమారంగంలోనే ఈనాడు ఆరంభమయింది. సినిమా రంగం తళుకుబెళుకుల రంగమే. దానిలో ఉన్నవీ లేనివీ ఊరించి ఊహించి చెప్పటంలోని మెతుకులకే అలవాటు పడిన మీడియా(దృశ్య, లేఖన మాధ్యమాలు) ఈ ఉద్యమం పెట్టే గుడ్లకోసమైనా పెద్దది చేసి చూపిస్తుంది. కాకపోతే అక్కడికి వెళ్లి పనిచేస్తున్న ఆడబిడ్డలూ మన సంతానమే. వారూ గుట్టు రట్టు చేసుకోకుండా బ్రతకటంలో తరిఫీదు పొందిన వారే. వీధిలోకి నెట్టబడ్డ నత్తగుల్లలే.

నిజమే..

సినిమారంగానికీ అంతకు ముందున్న కళాకారవృత్తి పనివారికీ కాస్త దగ్గర సంబంధం ఉంది. భక్తి పేరిట కొందరిని బలవంతంగా నెడితే.. భుక్తికోసం కొందరు స్వయంగానే ఒడిగడితే.. రాజులూ మహారాజులూ పర రాజ్యాలపై విజయం సాధించి అక్కడి స్త్రీలను చెరపడితే..  ఏర్పడిన ఈ సమూహం నుంచే కొన్ని కళలకి పోషణ లభించింది. సినిమా పరిశ్రమ ఆరంభంలో ఎక్కువమంది స్త్రీలు ఈ సమూహం నుంచే సహజంగా వచ్చారు. అక్కడ పనిచేసే స్త్రీలతో పురుషుల వ్యవహారశైలి ఎలా ఉంటుందనేది మన ఊహకి అందని విషయం కాదు. పత్రికల ద్వారా సినిమా ఆరంభం నుంచీ ఈ వార్తలు వింటూనే ఉన్నాం. చదువుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు కూడా పత్రికలలో గాసిప్ పేరుతో సినిమా ఆడబిడ్డల గురించి రాసే అవాకులూ చదువుకుంటూ మనని మనం తృప్తిపరుచుకుంటూనే ఉన్నాం.  ఎందరో తము జీవిస్తున్న జీవితంపై ఆసంతృప్తితో నలిగిపోతూ.. ఆర్ధికంగా చితికిపోతే, నమ్మినవారు చేయి విదుల్చుకుని పోతే  ఆత్మహత్యలు చేసుకుంటుంటే అయ్యోపాపం అంటూనే ఉన్నాం. ఆ ఆత్మహత్యలకి మన్నూ మసానం పూసి ఏ సత్యమూ చెప్పకుండానే ఎన్నో చెప్పినట్టు సరుకు తయారు చేసి అమ్మితే చొంగ కార్చుకుంటూ కొనుక్కుని మరీ తింటున్నవాళ్లమే. అలా బట్టలు విప్పి చూపించిన లం.. పాపానికి సరైన శిక్ష పడిందని పబ్లిగ్గానే మనలో కొందరు థీరీలు తీస్తూనే ఉన్నాం. కాని ఈరోజు ఈ నోరు విప్పటం ఈమాత్రమైనా అక్కడ ఆరంభమయిందంటే అక్కడ స్త్రీల ఉన్నతవిద్య వారి ఆత్మవిశ్వాసం, తమని తాము గౌరవించుకునే లక్షణం వాటికి దన్నుగా ఆర్ధిక నిర్భరత కొంత కారణమే.

4

నిజమే..

వాళ్లతో సరస్వతీదేవి వాసముండే విద్యామందిరాలలో చదువుకోసం, పనికోసం వెళ్లే ఆడబిడ్డలకూ సినిమా పరిశ్రమలో పనిచేసే ఆడబిడ్డలకూ పోల్చరాదు. ఉద్యోగాలలో చిన్ని పనులు చేసే వాళ్లనీ పెద్ద అధికారులుగా ఉండే ఆడబిడ్డలనూ పోల్చరాదు. గ్రామపంచాయితీలలో కేటాయింపులవల్ల ప్రెసిడెంట్లైన వాళ్లతో అసెంబ్లీకి వెళ్లే ఆడబిడ్డలను పోల్చరాదు. పొలాలలో అనాదిగా పనిచేస్తున్న వాళ్లనూ, భవన నిర్మాణాలలో కూలికోసం కూటికోసం రాళ్లెత్తే వాళ్లనూ.. వాళ్లూ ఆడబిడ్డలైనా సరే.. వేన్నీళ్లకి చన్నీళ్లు చేర్చే చిన్ని చిన్ని ఆదాయాల కోసమో.. ఇపుడిపుడే ఆత్మసంతృప్తి కోసమో..  నెలసరి జీతగాళ్లుగా చేరేవారిని  పోల్చరాదు.  ఆర్ధిక అంతస్తు వల్ల తేడాలుంటాయి. మానసిక తాహతులో తేడాలుంటాయి. సామాజిక అంతస్తులు సరేసరి.

నిజమే తేడాలుంటాయి.. పోల్చటానికి కుదరనంత తేడాలు కూడా ఉండొచ్చు కాని.. అందరినీ కలిపేవి రెండు. ఒకటి వారంతా స్త్రీలే. భారతీయ సంస్కృతిలో పుట్టి పెరిగిన వారే.. రెండవది వారంతా కూలికి పని చేస్తున్నవారే. అంటే పనిస్థలాలలో పురుషులతో పనిచేస్తున్నవారే. ఆ పురుషుల మనస్తత్వం వల్ల లైంగిక వేధిపులకి గురవుతున్నవారే! కామ సంబంధాలు వేరు.  వేధింపులు వేరు. లైంగిక వేధింపులు వేరు. తనతో పనిచేసే స్త్రీని లొంగదీసుకోజూస్తాం. లొంగకపోతే బెదిరిస్తాం. అవమానిస్తాం. ఇవన్నీ లైంగిక వేధింపులే.

ఎంత చిన్ని అధికారం ఉన్నా-

స్త్రీని లొంగదీసుకోజూడటం భారతీయ పురుషుని మనస్తత్వం. పనికోసం వచ్చే ఆడబిడ్డ పక్క మీదకి రాటానికి సిద్ధమైనదిగా భావించే లక్షణం. ఆ వచ్చిన మనిషిపై తనకి లభించిన అధికారాన్ని సరిగ్గా అమలు చెయ్యలేకపోతున్నానన్న కాంప్లెక్సు కొందరిది. ఎందరిని లొంగదీసుకుంటే అంత మగతనమనే మానియా మరి కొందరిది. అందుబాటులో ఉన్నదాన్ని అంకించుకోవాలన్న లౌల్యం ఇంకొందరిది. దీనికి మూలం భారతీయ సంస్కృతిలో ఇంకా పాతుకుపోయి ఉన్న ఫ్యూడల్ తత్వం. ఈ తత్వానికి మూలం ఏమిటి? కామవాంఛ. దాని కన్న కామం ఒక అధికార ప్రదర్శనా చిహ్నంగా భావించటం.

ఎందుకంటే-

బానిస దశలో బలవంతులే యజమానులు. వారికింద శ్రమ చేసేవారు స్త్రీలైనా పురుషులైనా బానిసలే. వారిని తమ ఇచ్ఛానుసారం వాడుకోవచ్చు. లైంగిక వేధింపులనేవి ఉండవు, లైంగికంగా అనుభవించటం తప్ప. మానవాళి తన ఆహారం కోసం భూమిని ఉపయోగించటం నేర్చుకుంది. ఫ్యూడల్ దశ ఆరంభమయింది.

రెండు పనిస్థలాలు ఏర్పడ్డాయి. ఒకటి ఇల్లు. రెండవది పొలం. స్వజనుల మధ్య శ్రమ ఇంట్లో జరుగుతుంది. పరజనుల కింద శ్రమ పొలాలలో మొదలయింది. అక్కడ ఆడబిడ్డలపై తొలి లైంగిక వేధింపులు ఆరంభమయాయి. ఈ పరజనులెవరు? వారు కుటుంబేతరులు మాత్రమే. గ్రామస్థులే. ఒకే రాజు పాలనలోని వారే.

మరి వేరే రాజులుంటారు కదా! వారు పరరాజ్యాలలో చేసేదేమిటి? ఆ రాజులనూ వారి అనుయాయులనూ ఓడించామని తెలియజెయ్యటానికి చూపేదేమిటి? జులుం. పర రాజ్య ప్రజలను బానిసలు చేసుకోటం. వారి ఆస్తిని కొల్లగొట్టటం. ఆ ఆస్తిలో భాగమైన స్త్రీలను అనుభవించటం, చెరపట్టటం. వారిని వేశ్యలు కావించటం.  ఆ వేశ్యలను ధనవంతులకీ వర్తకులకీ అద్దెకిచ్చి సొమ్ము చేసుకోటం. ఆ సొమ్ముతో సైన్యాలనూ దేవాలయాలనూ పోషించటం. ఇలా రకరకాల రూపాలలో ప్రపంచమంతటా ఈ ఫ్యూడల్ దశలో ఆడబిడ్డల శ్రమనీ, శరీరాలనీ నిర్నిబంధంగా వాడుకున్నారు. అలా వాడుకోవచ్చు అనే ఆశ, పురుషుని శారీరక లౌల్యం కూడా సైన్యాన్ని నిర్మించటంలో కొంత పాత్ర వహించింది.

ఈ దశలో అధికారప్రదర్శనకి చిహ్నంగా బలపడినది ఒకటుంది. పురుషుడిని అవమానించటానికి అతని స్త్రీమీద అధికారాన్ని చూపాలి. శత్రువు ఉత్తమాంగమైన తలని తన అధమాంగమైన పాదంతో తన్నటంతో సమానమైనది శత్రువు యొక్క స్త్రీల గుప్తాంగాలను తాకటం. దానిమీద అధికారం చెలాయించటం. ఇది యుద్ధ భీభత్సం. పురుషాధిపత్య సమాజం ప్రసవించిన వికృత శిశువు ఈ భావన. కామవాంఛ కన్న అధికార ప్రదర్శనకీ, స్థాపనకీ కామాన్ని ఒక ఆయుధంగా, జయకేతనంగా ఆడబిడ్డలపై వాడటం.

సామాజిక అసమానతలు – అంటే ఒక సమూహం కన్న మరో సమూహం అధికమో అల్పమో కావటం-  ఉన్న చోటల్లా ఇది వాడబడింది. భారతదేశంలో ఇలాంటి అసమానతలున్న సమూహాలు ఒక గ్రామంగా ఒకరిమీద ఒకరు ఆధారపడి జీవించే ఏర్పాటు రూపొందింది. పనిస్థలాలో లైంగిక వేధింపులకి కామేతర కారణం ఈ భావనే.  ఈ లైంగిక వేధింపులు పొలాలలో- అంటే పని స్థలాలలో – సామాన్యమయాయి. ఇంట్లో శ్రమకే కట్టివేయబడిన కొంతశాతం స్త్రీలకి ఈ వేధింపులనుంచి కొద్దిపాటి మినహాయింపు లభించి ఉండవచ్చు. గ్రామాలు ప్రధానమై, అందులో సామాజిక హెచ్చుతగ్గుల సమూహాలు కలిసి జీవించవలసిరావటం, దాని  నుంచి బలపడిన నిచ్చెనమెట్ల కుల వర్ణ వ్యవస్థా, పట్టణాలకీ, ఆ తర్వాత నగరాలకీ, ఇటీవల విదేశాలకీ వెళ్లినా పూర్తిగా పోని కుల గుర్తింపులూ వెరసి భారతీయ సంస్కృతి అనిపించుకుంది. నిజానికి అనేక గర్వపడదగిన లక్షణాలూ, చరిత్రా ఉన్నా వాటన్నింటినీ మసకబరిచే కులసంస్కృతే భారతీయ సంస్కృతిగా పరిగణింపబడటం ఒక దురదృష్టం.

ఇలాంటి మనోవైకల్యంతో పెరిగిన పురుషుడు ఒకవైపుంటే అతనితో పనిచేసే స్త్రీ స్థితి ఏమిటి?

5

నిరంతరం పోరాడితే తప్ప తన ఆత్మాభిమానాన్ని కాపాడుకోలేని దుస్థితి భారతీయ స్త్రీది. ఎంతమందితో పోరాడాలి.. ఎంతకాలమని పోరాడగలరు.. పోరాటానికి ఎంత శక్తి కావాలి.. పోనీ ఎవరితోనైనా చెప్పుకుందామంటే నువ్వేమీ చెయ్యకపోతే వాడెందుకు చేస్తాడని ప్రశ్నించే వారే ఎక్కువ. మనం వీధిన పడితే మనకే నష్టమమ్మా.. అని వెనక్కిలాగేవారు కొందరు. అందరూ కుక్కలే కరవకుండా మన జాగ్రత్తలో మనం ఉండాలి తప్ప చెయ్యగలిగిందేమని కన్నీరు తుడిచే వారింకొందరు. చట్టాలు చేసినా దానిని అమలు చేసే వ్యవస్థలలో కూడా పనిచేసేది అదే పురుషులు. “నీ కూతురు ఆక్సిడెంటులో చనిపోయింది. దానివల్ల నీకు ఖర్చు తగ్గింది. నీకు కాంపెన్సేషన్ ఎందుకివ్వాల”ని ప్రశ్నించే న్యాయమూర్తులున్నారు. న్యాయం కోసం కోర్టుని ఆశ్రయిస్తే బాధితురాలి శీలం సరైనది కాదని రుజువు చేసే న్యాయవాదులున్నారు. భర్త కానివానితో అర్ధరాత్రి బస్సెక్కటమే శీలరాహిత్యానికి నిదర్శనంగా ఆరోపించేవారున్నారు.  కట్టిన బట్టని బట్టి, తాగిన మందుని బట్టి వ్యభిచారిగా వాదించే పెద్దమనుషులున్నారు. ఇలాంటి పురుషప్రపంచంలో పనిచేసే స్త్రీల నోళ్లు విడటమనేది అంత సులభమా?

మీటూ అంటూ ఒకరితో ఒకరు చేరుతున్నారు. ఇది సినిమా రంగంతో ఆగిపోకూడదు. పనిచేసే ప్రతిచోటా ఇది వ్యాపించాలి. ఫ్యాక్టరీలలో, కార్యాలయాలలో మన ఆడబిడ్డలు నోరువిప్పాలి.  పనికోసం చదువు చెప్పే పాఠశాలలు, కళాశాలలలో ఇది ప్రవేశించాలి. నోరు విప్పటం తప్పనుకునే మనస్తత్వం పోవాలి. ముప్పనుకునే తలిదండ్రుల భయం పోవాలి. తన ప్రవర్తనను తాను సరిచూసుకుని, సరిదిద్దుకునే, నియంత్రించుకునే వివేచన పురుషునికి కలగాలి. ప్రతి ఆడబిడ్డకీ స్థైర్యం పెరగాలి.

ఈ సందర్భంలో మనకి అనేక ప్రశ్నలు కలుగుతాయి.

స్త్రీలది తప్పులేదా?

పనికి పోవటం తప్పనే రోజులున్నాయి. అదీ కొన్ని సమూహాల స్త్రీలకి. ఇప్పుడు దాన్ని తప్పనేవారు తగ్గిపోయారు. అనుచిత వస్త్రధారణే పురుషుల అనుచిత ప్రవర్తనకి కారణమేమో అనే సందేహం మనలో ఉంది. స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ సహజ ప్రవృత్తి కదా..  దాన్ని నియంత్రించుకోమనే ఒత్తిడి కేవలం పురుషులకేనా? అనికూడా మనకి బాదేస్తుంది. ఎండుగడ్డినీ అగ్గిరవ్వనీ పక్కపక్క ఉంచి అంటుకోవద్దంటే ఆగుతుందా? ఒకరిని చూస్తే ఇంకొకరికి కలిగే రసాయనిక స్పందనలు సంగతి ఏంటి?

అనుచిత వస్త్రధారణ గురించి ఆలోచించుకుందాం.

అంటే స్త్రీ రెచ్చగొడుతుంది కనక పురుషుడు దోషి అవుతున్నాడు. ఇది వెనక అనుకున్నదే. నువ్వేమీ చెయ్యకపోతే వాడేందుకు చేస్తాడు?  ఏ అనుచిత వస్త్రధారణ వల్ల సీతమ్మవారిని రావణుడు చెరపట్టాడు? దేవేంద్రుడు అహల్యని మోసంచేసాడు? ఎప్పటి సంగతులో ఎందుకు ఇప్పుడు జరుగుతున్న అత్యాచారాలలో ఎంత శాతం అనుచిత వస్త్రదారణ కారణంగా జరిగాయి? ఆఫీసులలో పనిచేసే ఆడబిడ్డలను “అదీ” “ఇదీ” “ఆ లంజకి పొగరెక్కువ మనం చూసినా చూడదు” “ఇది మగాడు కనిపిస్తే చాలు తినేద్దామన్నట్టు చూస్తుంది” ఇలాంటి వ్యాఖ్యలు ఎన్ని వినలేదూ.. అందులో సరైన వస్త్తధారణ చేసినవారినైనా అలా అనవద్దని మన సహోద్యోగులను మందలించామా.. ?

అసలు ఆడబిడ్డ పైట జారటం జార్చటమే(intentional) అనే సూత్రీకరణకి ఎంత సుదీర్ఘ చరిత్ర ఉందో ఒకమారు గుర్తు చేసుకుందాం. ఎనిమిదేళ్లకే కన్య అన్నారు మన పూర్వీకులు. ఆ బిడ్డ ఒళ్లు విరుచుకోటం, పైట జారటం, కుతూహలంగా చూడటం కామాహ్వానాలే అని తీర్మానించాడు వాత్సాయన మహర్షి. అలాంటి బిడ్డని సవరదియ్యటంలో ప్రావీణ్యతని ప్రస్తుతించారు మన కవిపుంగవులు. ఇలాంటి భావాలతో పెరిగిన మనం కొంత మారాం కాని ఇంకా ఎంత మారితే కాని అత్యాచారాలకీ, లైంగిక వేధింపులకీ స్త్రీలో దోషం చూసే లక్షణం ఫోతుంది?

సహజ ప్రేరణలని నియంత్రించటమే మానవ సంఘ నిర్మాణానికి ఆవశ్యకం కదా.. వివాహ వ్యవస్థ అలాంటి నియంత్రణనే చేస్తుంది గదా.. దానిని మనం ఆవశ్యకంగా భావించటం సహజ ప్రేరణలనూ, రసాయనిక చర్య లనూ అదుపు చేయటానికే కదా..

కనక మనం అన్ని సందేహాలూ విడిచి మీటూకి మేమూ తోడున్నాం అని ఇంగితం గల పురుషులుగా ఆహ్వానం పలకాలి. ప్రతి స్త్రీ తనపట్ల జరిగిన వేధింపులను చెప్పుకునే వాతావరణం ఏర్పరచాలి. వారికి స్థైర్య కలగటానికి తలిదండ్రులుగా అన్నదమ్ములుగా భర్తగా సహోద్యోగులుగా బాధ్యత తీసుకోవాలి.  ప్రతి ఉద్యమంలోనూ కొన్ని చెదురుమదురు తప్పుడు దోషారోపణలు జరుగుతాయి. ఏ ఉద్యమమైనా రకరకాల కారణాల వల్ల అవాంఛనీయ ఫలితాలు ఇవ్వవచ్చు. అవేవీ ఇలాంటి ఉద్యమాల ప్రాధామ్యం తగ్గించవు.

మనం మారాలి. మార్చాలి. మార్పుకి దోహద పడాలి.

*

పెయింటింగ్: పఠాన్ మస్తాన్ ఖాన్ 

Avatar

వివిన మూర్తి

తెలుగు సాహిత్యంలో పరిణత వాణి వివిన మూర్తి సాహిత్యం. కథ, నవల, విమర్శ అనే మూడు బంధాల మధ్య రచనతో పాటు ఆచరణని జీవనమార్గంగా సూచిస్తున్న బుద్ధిజీవి.

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • వివరంగా బాగా చెప్పారు. “మనం మారాలి. మార్చాలి. మార్పుకి దోహద పడాలి.”

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు