మా నాన్నెందుకు మంచోడంటే…!

”అమ్మా చెప్పు శ్రీరాముడు ఎందుకంత కోపంగున్నాడు” ఫలక్‌ మళ్ళీ అడిగింది. ‘బొమ్మ వేసినవాడు సరిగా వెయ్యలేదమ్మా’ అని చెప్పాను.

నాకూ అమ్ముండేది. మా అమ్మ తప్పిపోయింది. ఏడేళ్ళ చిన్ని కళ్ళ నీళ్ళతో చేతులు తిప్పుతూ చెబుతున్నది. పక్కనున్న లక్ష్మి ఒక్కసారి నవ్వింది గలగల గవ్వలు రాలినట్లే ఉంది. మీ అమ్మకాదు తప్పిపోయింది నువ్వే మీ అమ్మ కాడ్నించి తపిపోయావు అంది. చిన్ని మొఖం మరింత చిన్నబోయింది. ఏడవబాకులే… మనకీ అదిగో అట్లాంటి అమ్మ దొరుకుతుంది లక్ష్మి చిన్నిని ఓదారుస్తూ నన్ను చూపిస్తూ చిన్ని కళ్ళనీళ్ళని తన చిరిగిపోయిన లంగాతో తుడుస్తూ అంది. నా గుండెలో బాధ సుళ్ళు తిరిగింది. నా చేతిని గట్టిగా పట్టుకున్న ఫలక్‌ తలెత్తి నావైపు సంతోషంగా చూసింది ఆ కళ్లల్లో వెలుగుల జలపాతాలు… అప్పటి దాకా ఏడ్చిందేమో… కళ్ళింకా తడిగానే ఉన్నాయి. నా వైపు చూస్తున్న ఫలక్‌ అక్కడి చెట్టుకింద రాళ్ళమీద కూర్చున్న పిల్లలందర్ని చూపిస్తూ వాళ్ళకీ అమ్మలు కావాలి” అంది. నా గుండె కలుక్కుంది. ప్రభాకర్‌ ఇంకా రాలేదు ఎవరో ఫ్రెండ్‌కి చిల్డ్రన్‌ హోమ్‌ అడ్రస్‌ దొరకడం లేదంటే బండి తీసుకుని వెళ్ళాడు. వచ్చేస్తే బాగుండు, ఊపిరాట్టం లేదు. ‘దొరుకుతారు ఫలక్‌’ అన్నాను బలహీనంగా నేనూ అక్కడ వాళ్ళతో రాళ్ళమీద కూర్చుంటూ…

‘మాయమ్మ నాకు పెరుగన్నం పెట్టేది తెలుసా’ మాసిపోయిన గౌనేస్కున్న పాప చెబుతోంది – శూన్యంలో దేన్నో వెతుక్కుంటూ’ అవును నాకు మా అమ్మ పప్పన్నం నెయ్యి వేసి తినిపించేది. పార్కులో మా నాన్న నాతో ఆడుకునేవాడు తెలుసా… ఇంకోపాప అంటోంది. ఇక్కడి అమ్మ ఎంత చెడ్డదో తెలుసా… అంట్లు తోమిస్తుంది. వాకిలి ఊడ్పిస్తుంది…

నాకైతే… అమ్మే తప్ప నాన్న లేడు… వేరే దేశానికి పోయాడంటది మా అమ్మ… అని ఒక పాప అంటే అవును నాకూ నాన్న లేడు సచ్చిపోయాడంట పక్కనే కూచున్న మరో పాప అక్టోబర్‌ నెల చలి అప్పుడే కమ్ముకొంటున్నది రాత్రి ఏడున్నర అవుతున్నది. చిల్డ్రన్‌ హోమ్‌ కాంపౌండ్‌లో ఇసుక కుప్పల మీద, కంకర రాళ్ళ మీద కూర్చున్న ఈ తల్లిదండ్రులు ఉన్నా లేని పిల్లలు ఆకాశంలోని నక్షత్రాలను తోడు తెచ్చుకుంటూ అమ్మలతో ఉన్నప్పటి జ్ఞాపకాలను వెలిగించుకొంటున్నారు. వాళ్ల కళ్ళల్లో కన్నీటి చెమ్మ కూడా కళ్ళతో పాటు మెరుస్తున్నది. ”హోమ్‌ వాళ్లు మన అమ్మా నాన్నలను పిలుస్తారంట తెలుసా”… ”ఏమో మా అమ్మను జైల్లో వేసారంట… మా అమ్మకు ఊరూరికే జ్వరం వస్తుంది… అదేదో చచ్చిపోయే జరమంట జైల్లో మందులివ్వరంట మా అమ్మ బతదు మందులేస్కోకబోతే… ఒక పాప గుడ్ల నీళ్ళతో చెబుతున్నది. ”మా అమ్మను కూడా జైల్లో వేసారంట మా అమ్మ కడుపులో చిట్టి చెల్లి ఉందంట తెలుసా’… మొన్న, మున్నీని వాళ్ళమ్మా నాయనొచ్చి తీసుకుపోయారంట తెలుసా… ఆరేళ్ళప్పుడు రైలుస్టేషన్‌లో తప్పిపోయిందంట. ఎవరో ఒకాయన ఇక్కడ గుట్ట కాడ మున్నిని అమ్మేసినాడంట మనెమ్మకు. ఇంగ అప్పటికెల్లి మున్నిని ఎన్ని కష్టాలు పెట్టిందో తెలుసా మనెమ్మ. ఇంటి పని చెయ్యాల, కూలీకి పోవాల, ఎవరైనా గలీసు మొగోల్లొస్తే వాళ్ళ గలీసు పనులు చెప్తె చెయ్యాల… చ్ఛీ చ్ఛీ మున్నెంత ఏడ్సేదో తెలుసా నాకు చెప్పుకోని? ఎల్లి పోయేపుడు అమ్మ దొరికింది కదా ఆయమ్మ కన్న తల్లి కదా మరి గలీసు పనులు చేయించదు కొట్టదు… పన్నెండేళ్లుంటాయేమో… నాకు పరిచయం అయిన సందీప చెబుతుంది. అవును మా చిట్టెమ్మ నాక్కూడా ఎన్ని వాతలు పెట్టింది చూడు గలీసు పనులు చెయ్యనందుకు అంతే వయసున్న గాయత్రి తన కాలి పిక్కలు చూపిస్తూన్నది. ఎండకు కమిలిపోయిన ఆకులలాగా గాయత్రి కాళ్ళ మీద మచ్చలు. వెన్నల, అక్కడి లైట్లు, ఆ చీకటిని వెలిగించలేకపోతున్నాయా… లేక నా మనసే ఆ మాటలు వినలేక చీకటైపోయిందా అనిపిస్తున్నది. సెక్స్‌ రాకెట్‌ బట్టబయలై ఆ వ్యభిచార గుహాల్లో పట్టుబడ్డ పిల్లలు వీళ్ళంతా. ప్రభాకర్‌ ఇంకా రాలేదు. వస్తే బాగుండు ఫలక్‌ మొఖం ఆ కబుర్లు వింటూ చిన్నబోతున్నది. త్వరగా వెళ్లాలి. మనసు ఆందోళనగా ఉంది. అదిగో ప్రభాకర్‌ వస్తున్నాడు. ఫలక్‌ ఒక్కసారి తన దోస్తులను కలుస్తానంటే తీస్కొచ్చాం ఇక్కడికి.

***

”ఏంటీ పొయ్యి పొయ్యి తురక పిల్లను పెంచుకుంటున్నది కాకుండా పూజగదిలోకి ఇంత కూడా తెలివి లేకుండా వచ్చిన పిల్లను కొట్టద్దంటావా…” అత్తెమ్మ ఆవేశంతో ఎగరొప్పుతూ అరిచింది. పూజగదికి అడ్డంగా నిలబడింది అత్తమ్మ. ఫలక్‌ బిక్కచచ్చిపోయి ఎగరొప్పుతూ చిగురుటాకులా ఒణికిపోతూ, హాల్లో సోఫాలోకి ఒక మూలకు ఒదిగిపోయింది. నేను ఇంటికొచ్చేటప్పటికి ఇదీ దృశ్యం. నన్ను, ప్రభాకర్‌ను చూడగానే ఫలక్‌ పెద్దగా ఏడుస్తూ పరిగెట్టుకు వచ్చి నన్ను హత్తుకుపోయింది. ఒక పామో, తేలో, దెయ్యమో, రాక్షసో ఇంట్లోకి రాబోతుంటే సర్వశక్తులూ కూడదీస్కుని కర్రో, కత్తో, పట్టుకుని చంపడానికి సిద్ధంగా నిల్చున్నట్లు పూజగదికి అడ్డంగా నిలబడింది అత్తమ్మ. ఆమె మొఖం కోపంతో ఎర్రబడింది. రెండు చేతులూ పూజగది రెండు వైపులా పెట్టి యుద్ధానికి సిద్ధమైన సైనికురాలిలాగా కౄరంగా చూస్తూ నిలబడ్డది అత్తమ్మ. ఆ పసిబిడ్డ మీద ఇంత దౌష్ట్యమా… ద్వేషమా… నేనెలాగూ భరిస్తున్నా చాలదూ? ”కడజాతి దాన్ని తెచ్చుకున్నాడు నా కొడుకు పెళ్ళాంగా మన బ్రాహ్మల కొంపల్లో పిల్లే దొరకనట్లు” అని ఇరుగు పొరుగు వాళ్ళకు బంధు జనాలకు చెప్పుకుంటూ ముక్కు చీదుతూనే ఉంటుంది అత్తమ్మ.

”మాదిగ కులందాన్ని కోడలిగా తెస్తా అంటే ఊర్కోని ఉంటానికి ఇక్కడెవ్వరూ రోషాలు చచ్చిలేరు మన బ్రాహ్మణ కులాన్ని బ్రష్టు పట్టించబాకు ప్రభా… నేను ఉరోస్కుని చచ్చిపోతాను” తను, ప్రభాకర్‌ రిజిస్టర్‌ పెళ్లి చేస్కోని వచ్చేదాకా అత్తమ్మ జానకమ్మ ఇదే బెదిరింపుల తంతు నడిపిస్తూనే ఉంది. పెళ్ళై ఏడేళ్లు, ఇద్దరిలో లోపం. పిల్లలు పుట్టలేదు. దత్తత నిర్ణయాన్నీ అడ్డుకుంది అత్తమ్మ… తీస్కుంటే బ్రాహ్మల పిల్లల్నే తీస్కోవాలనీ ఇంట్లోకి ఇంకో కడజాతి సంతానం రావటానికి వీలులేదనీ… ఉపకులాలపైన పరిశోధన చేస్తున్న ప్రభాకర్‌, మహిళా సంఘంలో పనిచేస్తున్న తనూ ఇద్దరం కల్సి కొద్ది కాలం క్రితం చైల్డ్‌ ట్రాఫికింగ్‌లో సంరక్షించబడి చైల్డ్‌ హోంకి తరలించబడ్డ పిల్లలలో ఫలక్‌ను బిడ్డగా దత్తత తీస్కున్నాము. ముందు నాతో… తర్వాత ఫలక్‌ తురక మతంతో తన ఇల్లు బ్రష్టు పట్టిపోయిందని అత్తమ్మ గుండెలు బాదుకుంటూనే ఉంది. తనను, ఫలక్‌ను పూజగది పరిసరాలకు రానివ్వదు. వంటింట్లోకి తనకు స్నానం చేస్తేనే ఎంట్రీ. అతికష్టం మీద తను చేసిన వంట తింటుంది అదీ తనకు బాగో లేనప్పుడు. బాగున్నప్పుడు వంటింటి పక్కనే అరుగు మీద మడి వంట నా గాలి కూడా తాకని ప్రదేశంలో చేస్కుంటుంది. బాగోలేనప్పుడు ఎందుకు తింటుందో ఆ సడలింపు ఏమిటో… ప్రభాకర్‌ నవ్వుతాడు ”అమ్మా ఎలా తింటున్నావు మరి ఇప్పుడు? తినకూడదు కదా చంద్రిక వంట” అంటూ. ”పోయేకాలం వచ్చిందిరా అందుకే తిని సస్తున్నా” అనేది కసిగా… చాలాసార్లు తన వంట ఎక్కడ తినాల్సి వస్తుందో అని కూతురింటికెళ్ళిపోవడం చేసేది. తను కాకుండా ఆమె బ్రాహ్మణ నిష్ట పాడు చేస్తున్న వాళ్ళలో ఫలక్‌ చేరింది ఇప్పుడు.

”అయితే మటుకు అలా కొట్టేయటేమేనా?” ప్రభాకర్‌ ఫలక్‌ని ఓదారుస్తూ తల్లి మీద అరిచేసాడు. ”కొట్టక… లోపలికి పిలిచి స్వామివారి ప్రసాదం పెడతానా ఏంటీ” అత్తమ్మ అంతే కోపంగా అరిచింది. స్వామి, బీబీ నాంచారి, పద్మావతి దేవి అంటావే… చూడు నీ స్వామి రెండో భార్య బీబీ నాంచారమ్మ ముస్లిం తెలుసా నీకు… ఆమెకు పూజలు చేస్తావు కదా? ఆ రాతి విగ్రహాలు నీ నైవేద్యం తింటాయా? పిల్లులూ, చీమలు, ఎలుకలూ తప్ప? వాటికంటే తక్కువైందా ఈ పసిది? ప్రభాకర్‌ రెట్టించాడు.

”నాంచారమ్మ తురకది కాదు అదంతా కట్టు కథ. నేను నమ్మను. అయినా అదంతా కాదు… ఇది నా పూజగదిలోకి రావద్దంతే.. వచ్చిందా ఇప్పుడే ఏ వృద్ధాశ్రమంలో చేరిపోతాను ఏవనుకుంటున్నావో ఇల్లంతా చిల్లర మందితో నింపింది చాలదనా. ఒద్దు ఒద్దంటూనే ఉన్నా తురకపిల్ల ఒద్దని… నాకంటే నీకు ఆ పిల్ల ఎక్కువైంది” అత్తమ్మ భోరుమని ఏడుస్తూ పూజగది ముందు కూలబడిపోయింది. ఆమె చేతిలో ఉన్న కోటి సంతకాల లక్ష్యంతో రాస్తున్న రామకోటి పుస్తకమూ టప్‌మని నేలమీద పడింది.

వంటింట్లో ఆమె ఉపవాసాలప్పుడు నేను పొరపాటున వెళ్ళానా… పొయ్యి, గద్దె, వంటిల్లూ తిట్టుకుంటూ కడుక్కునే మనిషి అత్తమ్మ… అంతపనీ చేస్తుంది… ”ప్రభా… పద” అని పాపను తీస్కుని బెడ్రూంవైపు నడిచా నేను. ఆమెతో వాదన చేసి గెలవలేము అని తెలిసి ప్రభాకర్‌ కూడా నాతో పాటు బెడ్రూం వైపు నడిచాడు.

నేను కానీ, ప్రభాకర్‌ కానీ ఫలక్‌కి ఎప్పుడూ పూజగదిలోకి వెళ్ళొదని చెప్పలేదు… వెళ్ళడం తప్పని చెబుతున్న అత్తమ్మ వాదన సరైనదనీ ఫలక్‌కి చెప్పట్లేదు. ప్రసాదం కోసం వెళ్ళిందా లోపలేముందో చూద్దామన్న ఆశక్తితో వెళ్ళిందా అన్నది మాత్రం తెలుసుకున్నాం అంతే.

అత్తమ్మ పూజగది కడుక్కోడం మొదలెట్టింది. కడుక్కుంటున్నంత సేపూ ‘శ్రీరామ పాప పరిహారం క్షమించు తండ్రీ’ అని గొణుక్కుంటూనే ఉంది.

”అమ్మా… పూజగదిలో శ్రీరాముడు ఎందుకంత కోపంగున్నాడు భయం వేసింది.” రాత్రి నిద్ర పట్టని ఫలక్‌ అడుగుతోంది. లోపలికెళ్ళడం రాముడెట్లా ఉన్నాడో చూడ్డం… ఆ చిన్ని పాప తెలివికి ఆశ్చర్యం వేసింది.

మొన్న కాలనీలో శ్రీరామ నవమి పండగ జరిగింది. కాలనీ అంతా కాషాయమయం అయిపోయింది. దేశమంతటితో పాటు ఈ మధ్య కాలనీలో కూడా కొత్తగా మేం హిందువులం అన్న స్పృహతో మెలిగే కుటుంబాలు ఎక్కువైపోయాయి. దాని గుర్తుగా గేటు పిల్లర్‌ మీద హనుమంతుడి ఎగురుతున్న బొమ్మతో కాషాయ జెండాలు రెపరెపలాడిస్తున్నారు. హనుమంతుడి జయంతి దగ్గర్నించి వరలక్ష్మి వ్రతాలు – గుంపు లలితా సహ్రసనామ పఠనాలు ఎక్కువ అవడమే కాదు బహిరంగమై పోయినాయి. యువకులు చిన్న పిల్లలు కాషాయ వస్త్రాలు జై శ్రీరామ్‌ పేరుతో ఉన్న నుదుటి రిబ్బన్లు చుట్టుకుని కరపత్రాలు పట్టుకొని రామ్‌లాలా పాటలతో డాన్సులు చెస్తున్నారు. ఈ సారి శ్రీరామనవమి పండగకు ఇంటింటికి శ్రీరాముడు పటం ఫ్రేమ్‌కట్టి మరీ పంచారు. నిజమే ఫలక్‌ చెప్పింది నా చిన్నప్పుడు కనీసం ఒక ఆరేడేళ్ళ క్రితం వరకూ శ్రీరాముడి మొఖంలో ఎంత శాంతం ఉండేదనీ? కళ్ళల్లో ఎంత దయ ఉండేదనీ? అందరిలాగా మామూలు దేహ సౌష్టవంతో ఉన్న రాముణ్ణి గుళ్ళ ముందూ, పోస్టర్‌లలో చూసింది తను. తమను గుళ్ళల్లోకి రానిచ్చిందెక్కడా?

ఇప్పుడు…? రథం మీద కత్తీ కరవాలం పొడుగాటి త్రిశూలం… సిక్స్‌పాక్‌ కండల దేహ ధారుడ్యం… అన్నింటికీ మించి కళ్ళలో శాంతం పోయి ఎర్రని రక్తపు జీరలతో నిండిపోయిన క్రౌర్యం… ఎవరినో నరకడానికో… యుద్ధం చేయడానికో బయలు దేరుతున్నట్లు.. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే రాముడి దుస్తులు… నీలం, తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగుల దుస్తుల్లో ఉండే రాముడు ఇప్పుడు పూర్తిగా కాషాయిధారుడు. క్రోధాగ్నుడైన రాముడి చిత్రపటమే అత్తమ్మ పూజగదిలో ఉంది. నిజమే పెద్ద వాళ్ళకే భయం, సంశయం కలిగేంత భీభత్సం ఉంది. ఆ రాముని మొఖంలో ఇంక చిన్న పాప ఫలక్‌కి ఎందుకు వెయ్యదు భయం?

”అమ్మా చెప్పు శ్రీరాముడు ఎందుకంత కోపంగున్నాడు” ఫలక్‌ మళ్ళీ అడిగింది. ‘బొమ్మ వేసినవాడు సరిగా వెయ్యలేదమ్మా’ అని చెప్పాను. శాంతంగా ఉన్న రాముడు సీతను అనుమాంచి భూస్థాపితం చేయలేదనా క్రూరమైన అడివికి పంపలేదనా? అని మనసులో అనుకుంటూనే…

అది సరేగానీ ఇక నిద్రపో అన్నా.. ఫలక్‌కి దుప్పటి కప్పుతూ.

ఫలక్‌ మెల్లగా నిద్రలోకి జారుకుంది. నా గదిలోకి వచ్చాను. వాట్సప్‌లో ఏదో మేసేజ్‌ వచ్చింది. బీహార్‌లో బీజేపి నాయకుడు గర్ల్స్‌ హాస్టలల్లో ఆడపిల్లల మీద సంవత్సరాల నించి లైంగిక అత్యాచారం చేస్తున్నట్లు, వీడియోలో ఐదారేళ్ల పసి ఆడపిల్లలు మాట్లాడుతున్నారు. ”రాత్రంతా బట్టలు లేకుండా పడుకోవాలి. ఆయన పక్కన లేకపోతే బెల్టుతో కొడతారు. వార్డెన్‌ కూడా… అలా పడుకుంటేనే పొద్దున్న ఒక బ్రెడ్డుముక్కో, జిలేబో మొఖం మీద విసిరి కొడతారు. లేకపోతే పస్తే ఒక పాప చచ్చిపోతే ఇక్కడే హాస్టల్‌ వెనకాల పాతి పెట్టారు” అని గుండె భారమయ్యింది. కొద్దిగా మగత నిద్ర పట్టనివ్వని కలతతో రాత్రి మెల్లగా కరుగుతోంది. సన్నగా వెక్కిళ్లతో ఏడుస్తున్న చప్పుడుకి చటుక్కున మెలకువ వచ్చింది నాకు. దూరాన ఎవరో ఏడుస్తున్న ధ్వని… ఆ చిక్కటి చీకటికి ఏదో రహస్యాన్ని అతికింది.

పరుగున ఫలక్‌ గదిలోకి పరిగెత్తాను… నిర్ఘాంతపోయాను.

ఒంటి మీద నూలుపోగు లేకుండా మూడుక్కొని వెక్కిళ్ళు పడుతున్నది. పక్కనే రాత్రి వేసిన నైట్‌ డ్రెస్‌ పడేసి ఉన్నది… ప్యాంట్‌తో సహా.

ఫలక్‌… ఫలక్‌… కుదిపాను ఖంగారుగా.

బెదిరిపోయి కూర్చుని… బిత్తరపోయి చూసింది.

”ఏమైందమ్మా బట్టలెందుకు విప్పావు?” ఆశ్చర్యంగా అడిగాను… నన్ను కరుచుకుపోయింది. ఏడుస్తున్నది. ఆ లేత బక్క శరీరం… చిగురుటాకులా ఒణుకుతున్నది.

”లే బట్టలేసుకొందువు” అన్నా…

”ఊఁహూ… వాళ్లు కొడతారు, వాతలు పెడతారు” అంది భయంగా. వాళ్ళెవ్వరు అన్నాను.

”చిట్టెమ్మ, మనెమ్మ అంటీ శంకర్‌ అంకుల్‌” అంది భయంగా చుట్టూ చూస్తూ వాళ్ళిక్కడే ఉన్నట్లు.

”ఎందుకు అన్నా” మెల్లగా వణుకుతూ.

”రాత్రి బట్టలేసుకుంటే కొడతారు – ఆంటీల దగ్గర అంకుల్స్‌ వస్తారు కదా. వాళ్ల గదిలోనే ఉండి వాళ్ళు బట్టలిప్పుకుంటుంటే కూర్చుని చూడమంటారు. చూడకపోతే వాతలు పెడతారు…”  ఫలక్‌ చెబుతోంటే నా మెదడు స్తంభించింది… ప్రభాకర్‌ ఎప్పుడు వచ్చాడో… ”నిద్ర పుచ్చు చందూ పాపను” అని నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు.

”సరే… సరే… నువ్వు ఇప్పుడు అక్కడ లేవు కదా నైట్‌ డ్రెస్‌ వేస్కో దా” అని గబా గబా ఫలక్‌కి నైట్‌ డ్రెస్‌ వేసేసాను నన్ను హత్తుకుని పడుకుంది. ”అమ్మా… నన్ను మళ్ళీ అక్కడకు పంపవుగా” అంటుంది. ”పంపను నువ్వింక ఎప్పటికీ నా బిడ్డవు ఫలక్‌…” అన్నా కళ్ళ నీళ్లు కారుతుంటే.

ఫలక్‌ నిద్రపోయింది. ఏ తల్లి కన్నబిడ్డో వ్యభిచార గృహంలో తేలింది.

”నేను రైలు స్టేషన్‌లో దొరికానంట మనెమ్మ అంటీకి…” ఫలక్‌ మాటలు జ్ఞాపకానికొచ్చాయి. నాలుగేళ్ళట ఫలక్‌కి అప్పుడు మూడేళ్ళుగా ఈ నరకయాతన.

”రాత్రి అయితే చాలు గలీసు పనులు చూడమంటారు. చేయిస్తారు. చేయమంటే తిట్లు, కొట్లు, వాతలు అన్నం పెట్టరు ఆకలికి శోష వచ్చి పడిపోయే దాక… ఆ పన్లు చేస్తేనే ఇంత అన్నం పెడతారు. ఆకలికి తట్టుకోలేక… దెబ్బలు వాతలు తాళలేక ఆ గలీసు పనులు చేస్తాం” గాయత్రి, సందీప, మున్నీ, దేవకి… ఫలక్‌.. నా చుట్టూ చేరి నా చెవుల్లో అరుస్తున్నారు. నిలువెల్లా చెమటలు మగత – కలత నిద్రలోంచి మళ్ళీ మెలకువ ఫలక్‌ నా చేతుల్లో నిద్రపోతున్నది. మధ్య మధ్యలో ఒక చిన్న కేక, వెక్కిళ్ళతో కూడిన దుఃఖధ్వని.. చేస్తూనే ఉంది. మూడేళ్ళ నిత్య నరకానికి ఆ చిన్ని దేహం.. మనసూ ఎంత వేదన అనుభవించిందో… ఫలక్‌.. ఫలక్‌నే ఎందుకు తీస్కుంది తను దత్తత? ఏమో తెలీదు… చిల్డ్రన్‌ హోంలోకి వెళ్ళాక అంతమంది పిల్లల్లో ఫలక్‌ పరిగెత్తుకుంటూ వచ్చింది. తన చేతి వేళ్ళు పట్టుకుని ”నువ్వేనా మా అమ్మవి… నన్ను తీస్కెళ్ళు” అంది… తలెత్తి పెద్ద పెద్ద కళ్ళతో భయంగా తనని చూస్తూ… ఎంత కాంతి కళ్ళల్లో ఎంత ఆశ మొఖంలో? తన హృదయం కరిగిపోయింది ప్రభాకర్‌ వెంఠనే పాపను నడిపించుకుంటూ అక్కడ కుర్చీ మీద కూర్చోబెట్టి తనూ పక్క కుర్చీలో కూర్చుని ‘నీ పేరేంటి పాపా’ అన్నాడు. ‘ఫలక్‌’ వెంఠనే చెప్పింది. ‘ఫలక్‌’ ఆశ్చర్యపోయిన నన్ను చూస్తూ అక్కడి వార్డన్‌ ”అవును మేడం తురకోల్ల పిల్ల దొరికిన కాన్నించి తన పేరు ఫలక్‌ అని అమ్మీ, అబ్బా కావాలని ఏడ్చేదిట. బురఖాలో ఎవర్నన్నా చూస్తే అమ్మీ అని అరిచేదట. మెల్లగా తగ్గిందట. కొనుక్కున్న మనెమ్మ కూడ పేరేమీ మార్చలేదు” అంది. ”ఎవరూ రాలేదా మరి ఈ పాప కోసం పేరు కూడా మార్చలేదు కదా” అంది తను. ”లేదంటమ్మ ఎవరూ రాలేదు ఇప్పటి దాకా” అంది వార్డెన్‌. ఇద్దరం ఫలక్‌నే దత్తత తీస్కోవాలని నిర్ణయించుకున్నాం.

తను… ‘అత్తమ్మ ఒప్పుకోదేమో అంది కొద్దిపాటి జంకుగా.. ఏం ఫరవాలేదు నేను చెప్పుకుంటా” అన్నాడు ప్రభాకర్‌.

***

”పేరైనా మార్చరా… పెద్ద అప్రాచ్యపు పని చేసావు కానీ… కనీసం ఈ మాటన్నా వినూ…” అత్తమ్మ మొత్తుకుంది. ”పేరుతో తురక పిల్ల అని తెలుస్తుంది కదరా. మనింటికి బంధువులు ఎవరూ రారురా” అంటూ ”తెలియని ఏం కాదు ఫలక్‌ చాలా మంచి పేరు. దానర్థం తెలుసా నీకూ! నక్షత్రాలు వెదజల్లుతూ చీకటిలో వెలుగును చూపే ఆకాశం అని అర్థం. మా జీవితాల్లో వెలుగు నింపడానికే వచ్చింది ఫలక్‌” ప్రభాకర్‌ చెబుతుంటే ”పోనీ కాంతి… జ్యోతి అని హిందువుల పేర్లు పెట్టరా” కొంచెం తగ్గి బతిమిలాడుతూన్నట్లు అంది అత్తమ్మ. ”ఊహూ… కావలిస్తే నువ్వు పిల్చుకోమ్మా కాంతి” అని మాకు మాత్రం ఫలక్‌… బాగుంది” అన్నాడు ప్రభాకర్‌.

అత్తమ్మ కాంతీ అనే పిలుస్తుంది. ఒట్టి కాంతి కాదు ”ఒసే కాంతి, ఉష్ష్‌ కాంతీ’ అని పిలుస్తుంది.

తెల్లారినా చాలా ఆందోళనగా అనిపించింది… రాత్రి ఫలక్‌ చెప్పిన మాటలు, చేష్టలు దిగులు పుట్టించాయి. ”ఏం కాదు, డీప్‌ట్రామా కదా… పసిపిల్ల… గాయాలు త్వరగా తగ్గవు. మనదగ్గరికొచ్చి వారమే కదా అయ్యింది” ప్రభాకర్‌ ఓదార్చాడు.

రెండ్రోజులు ఫలక్‌ గదిలో పడుకున్నా ఫలక్‌లో కొంత ఆందోళన భయం తగ్గినట్లు అన్పించింది.

నేను ఎక్కడికి వెళ్ళినా, వీలైనప్పుడల్లా ఫలక్‌ను తీస్కెళుతున్నాను. సాయంత్రం రోజూ ఇంటి దగ్గరే ట్యూషన్‌ చెప్పిస్తున్నా వచ్చే యాడాది మంచి స్కూల్లో చేర్పిద్దామని ఆలోచిస్తున్నా. బంధువుల్లో కాలనీలో ఫలక్‌ను మా బిడ్డగా పరిచయం చేస్తున్నాము.

ప్రభాకర్‌తో ఫలక్‌ ప్రవర్తన వింతగా ఉంటుంది. ఒకసారి సంతోషంగా ‘నాన్నా’ అని పలకరిస్తుంది. పిలిస్తే సందేహిస్తూ దగ్గరికెళ్తుంది… పక్కన కూర్చోపెట్టుకుంటే విదిలించుకుని నా పక్కకొచ్చి కూర్చుంటుంది. ”ఊహూ… నీ దగ్గరే కూర్చుంటా” అంటూ.

ఇంకా టైం పడ్తుంది ఫలక్‌ కోలుకోవడానికి. తనున్న వ్యభిచార కూపంలో బట్టలిప్పించే మనెమ్మా అలాగే పక్కన పడుకోబెట్టించుకునే మగాళ్ళూ అంటే భయమూ, అపనమ్మకమూ అలానే ఉన్నాయి. ఇంకా ప్రభాకర్‌ దగ్గరికి వెళ్ళడానికీ, పక్కన కూర్చోవడానికి సందేహించడమూ, రాత్రిళ్ళూ కలత నిద్రలూ ఫలక్‌ గాయాల్ని పట్టిస్తున్నాయి.

ఫలక్‌ తోటి కేరమ్స్‌ ఆడ్డమూ డ్రాయింగ్‌ పుస్తకాల్లో బొమ్మలు రంగులూ వేయించడమూ షటిల్‌ ఆడ్డమూ లాంటి వాటితో ప్రభాకర్‌ ఫలక్‌కి దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. నేనూ బయట తిరగడం తగ్గించి ఫలక్‌తో ఎక్కువగా గడుపుతున్నాను.

***

రాత్రి మళ్ళీ గావుకేకలు వేయసాగింది ఫలక్‌… మళ్ళీ ఒంటి మీద బట్టలేదు. ఒంటి మీద వాతల మచ్చలు తేలి, వీపు మీద తొడల మీద చిన్నవి పెద్దవీ నగ్నంగా నిలబడి ఉంది పరిగెత్తుకెళ్ళాం. గబగబా నైట్‌ డ్రెస్‌ వేసేసాను. ”వాళ్ళొచ్చారు, ఆ అంకుల్‌ వస్తాడు…” అంటూ ఏడుస్తోంది. గుండెలకదుముకున్నాను. ”మన దగ్గరే పడుకో బెట్టుకుందాం ప్రభా కొన్ని రోజులు అన్నా” ఏడుస్తూ.

పద… అన్నాడు ప్రభాకర్‌. నా దగ్గర పడుకోబెట్టుకున్నాను. ఏం చెయ్యాలో ఇద్దరికీ అర్థం కావట్లేదు. ”డాక్టర్‌ దగ్గర్కి తీస్కెళదాం” ప్రభాకర్‌ మెల్లగా అన్నాడు. ”అమ్మో… ఇప్పట్నించే మందులు అలవాటు చేస్తే ఎట్లా?” భయంగా అన్నాను. ”మందుల దాకా ఇప్పుడే వెళ్లరులే. కౌన్సిలింగ్‌ ఇప్పిద్దాం చైల్డ్‌ సైకాలజిస్ట్‌ దగ్గరికి వెళ్దాం అపాయింట్‌మెంట్‌ తీస్కుంటాను” అన్నాడు ప్రభాకర్‌. ఇద్దరం నాలుగు రోజులూ నిద్ర పోకుండా కాపలా కాసాం. అర్థరాత్రి ఉన్నట్లుండి లేచి నైట్‌ డ్రెస్‌ గుండీలిప్పే ప్రయత్నం చేసేది. నేను ”అమ్మ దగ్గరున్నావు తల్లి” అని గుండీలు పెట్టేసేదాన్ని. తేరుకుని నా మొఖంలోకి మౌనంగా చూస్తూ నిద్రలోకి జారుకునేది. వారం రోజుల నుంచే మళ్ళీ మా గదిలోనే నిద్ర పోసాగింది ఫలక్‌… ఆ రోజు నాక్కూడా మంచి నిద్ర పట్టింది. ఫలక్‌ నన్ను హత్తుకుని పడుకుంది.

”చంద్రికా… చంద్రికా లే” ప్రభాకర్‌. ఉలిక్కిపడి లేచాను. ప్రభాకర్‌ తన కుడిచేత్తో నన్ను కుదుపుతున్నాడు. లేచిన నేను దిగ్భ్రాంతికి గురి అయ్యాను. ఒంటి మీద బట్ట లేకుండా ఫలక్‌ ప్రభాకర్‌ పొట్ట నడుము మీద పడుకొని ఉంది. ప్రభాకర్‌ ఫలక్‌ను విడిపించే ప్రయత్నం చేస్తున్నాడు. నేను తేరుకుని వెంఠనే ఫలక్‌ను లేపాను. గాఢనిద్రలో ఉంది తట్టి తట్టి లేపాను. ఒక్కసారి మెలకువ వచ్చింది ఫలక్కి.

”నైట్‌డ్రెస్‌ వేసాక… ఎందుకమ్మా అలా పడుకున్నావు నాన్న మీద” అన్నా…

”అలా పడుకోకపోతే మనెమ్మ వాతలు పెడుతుంది. రాత్రి అంతా అట్లాగే పడుకోవాలని చెప్తుంది.” ఫలక్‌ మబ్బు మొఖంతో మెల్లగా చెబుతోంది… ‘రోజూ రాత్రి అందరం అంకుల్స్‌ దగ్గర అట్లానే పడుకుంటాం” ప్రభాకర్‌ను చూపిస్తూ చెబుతున్నది. ప్రభాకర్‌ దుఃఖంతో భోరుమన్నాడు.

సైకాలజిస్టు దగ్గర్కి వెళ్ళి వస్తున్నా ఫలక్‌ తీస్కుని… ఆ డాక్టర్‌ చెప్పే పద్ధతులు రోజూ పాటిస్తున్నాం. ప్రభాకర్‌ ముభావంగా మారిపోయాడు. అయినా ఫలక్‌లో ఆడుకుంటూనే ఉన్నాడు. రాత్రి పూట మాత్రం నన్నే వెళ్ళి ఫలక్‌ బెడ్రూంలో పడుకో బెట్టుకోమంటున్నాడు.

***

”ఆ పాప ఎందుకు సచ్చిపోయింది అమ్మా” ఫలక్‌ టీవీ వైపు చూపిస్తూ అడుగుతున్నది.

ఖతువాలో ఏడేళ్ళ పాప ఫాతిమా మీద గుడిలో పూజారి, ఇంకొంత మంది సామూహిక అత్యాచారం చేసి చంపేసిన సంఘటన టీవీలో గాయాలలో చితికి కమిలిపోయిన ఫాతీమా దేహంతో సహా ప్రచారం చేస్తున్నారు. టీవీ ఆఫ్‌ చేసి ”దెబ్బలు తగిలాయమ్మా” అన్నా బలహీనంగా ”మొఖం మీద నాకులాగా మచ్చలెందుకున్నాయ్‌. మరి మనెమ్మ వాతలు పెట్టిందా అక్కకి కూడా” అని అడిగింది ఫలక్‌ ఉలిక్కిపడి టీవీ చూస్తూనే. మా మాటలు వింటున్న అత్తమ్మ ”ఆఁ వాళ్లేమీ చేసి ఉండరు. ఈ తురకదే గుళ్ళోకెళ్ళుంటుంది. తగిన శాస్తి జరిగింది… లేకపోతే మన హిందువుల గుళ్ళోకెళ్ళడానికి ఎంత ధైర్యం? మెటికలు విరుస్తూ అంటోంది. పసిపిల్ల మీద కనికరం లేని ఇంత విషాన్నెలా భరించాలి?

”బుద్దుందా మీకు ఏడేళ్ల పిల్లమీద అత్యాచరం చేసి గుళ్లో చంపేస్తే… ఇంత కౄరంగా ఎట్లా మాట్లాడుతున్నారు మీరు మనిషేనా అసలు? అరిచేసాను అత్తమ్మ మీద. బిత్తరపోయింది.

ఫలక్‌ కోలుకుంటోంది. సైకాలజిస్టు మంచి స్పర్శకీ – చెడు స్పర్శకీ, మంచి మగాళ్ళకీ – చెడు మగాళ్ళకీ తేడా తన పద్ధతిలో చెబుతోంది. ప్రభాకర్‌ ఎంత మంచి నాన్నో చెబుతుంది. ఫలక్‌లో మెల్లగా మార్పు రాసాగింది. ప్రభాకర్‌కి కొంత దగ్గరవసాగింది. ఇద్దరం స్థిమితపడ్డాం.

”ఏంటీ కాంతిని ఎక్కడికి తీస్కెళుతున్నారు రోజూ… డాక్టర్‌ అంటుందేంటి”… అత్తమ్మ అనుమానంగా అడుగుతోంది. ఏమీ లేదు పార్కుకి తీస్కెళుతున్నాం అని చెబుతున్నాం.

***

”అవునే నా కొడుకు మంచాడు నాకు తెల్సు నువ్వు చెప్పేదేంటి?” అత్తమ్మ ఎకసెక్కెంగా అంటోంది ఫలక్‌తో… ”మా నాన్న మంచోడు” అంటోంది ఫలక్‌ అప్పచెబుతున్నట్లు. ఈ మధ్య ఫలక్‌లో కొంచెం నెమ్మదితనంతో ఉంటుంది అత్తమ్మ… ఇక తప్పదనుకుందేమో నన్ను అంగీకరించినట్లు మనవరాలిగా ఇక ఫలక్‌ని అంగీకరించక తప్పదని అర్థమయినట్లుంది. నేనూ ప్రభాకర్‌ నవ్వుతూ చూస్తున్నాం.

ఇంకో పక్క టీవీలో ఖతువా-ఫాతీమ అత్యాచారం హత్య మీద డిబేట్‌ నడుస్తున్నది.

”సరే… మీ నాన్న… అదే నా కొడుకు మంచోడు ఎందుకు మంచోడు నాకు తెలుసు మరి నీ కెందుకు మంచోడో చెప్పూ… ఒరే ప్రభా టీవీ సౌండ్‌ తగ్గించరా” కొద్దిగా కసిరింది అత్తమ్మ.. ప్రభాకర్‌ టీవీ సౌండ్‌ తగ్గించి ఆశక్తిగా ఫలక్‌ వైపు చూసాడు. ”చెప్పూ” అని రెట్టించింది అత్తమ్మ. నేనూ ఆశక్తిగా చూస్తూన్నా… ”మరేమో… మరేమో… మా నాన్న రాత్రి పూట నా బట్టలు ఇప్పడుగా… అందుకనే మంచోడు” అమాయకంగా చేతిలో ఉన్న బొమ్మ చేతుల్ని అటు ఇటూ ఊపుతూ చెపుతోంది ఫలక్‌.

అత్తమ్మ బిత్తరపోయి… ”ఏవిట్రా ఇలా అంటోంది ఇదీ… ఎక్కడ్నించి తెచ్చార్రా దీన్ని చెప్పండ్రి” అని గావు కేక వేసింది. ప్రభాకర్‌ చేతిలో రిమోట్‌ కింద పడిపోయింది. నా నోరు తడారిపోయింది. ఫలక్‌ తన చేతిలో పాప బొమ్మ మీది గౌను విప్పేస్తోంది!

 

Avatar

గీతాంజలి

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అద్భుతమైన ప్రచారం. భారతదేశంలో కేవలం బిజెపికి తలుపులు తెరచే హాస్టల్స్ వార్డెన్స్ మాత్రమే వున్నారు. కేవలం రాముడు, బిజెపి మాత్రమే కథువాలాంటి సంఘటనలకి కారణం. భారతదేశంలో కేవలం మైనారిటీల మీద సంఘపరివార్ శక్తులు మాత్రమే అత్యాచారాలు పాల్పడుతున్నాయి. దేశంలో వున్న వేలాది (బహుశా లక్షలాది) మిషనరీ, మరియు మైనారిటీ స్వచ్ఛంద సంస్థల హాస్టళ్లలో ఆడపిల్లలు సురక్షితంగా వున్నారు. వాటిలో ఏ అత్యాచారాలు జరగడంలేదు. ఎందుకంటే అవి ఇతర మతాలకి చెందినవి. ఇతర మతాలవారందరూ పరిశుద్ధాత్మలు. కొందరు పాస్టర్లు, బిషప్ లు పిల్లలని చాలా గౌరవంగా అత్యాచారాలు చేయకుండా చూసుకుంటున్నారు. ‘మా బిషప్పులలో 50 మందికి ఒకరు చిన్నపిల్లలపై లైంగిక దాడులు చేసేవారే‘. అన్న పోప్ ఫ్రాన్సిస్ మాటలు వినబడవు. గత 65 ఏళ్లలో ప్రపంచమంతటా తమ పూజారులు చేసిన లైంగిక అకృత్యాలని సెటిల్ మెంట్ చేసుకోెడానికి రోమన్ క్యాథలిక్ చర్చ్ ఖర్చుచేసింది (పైపైన లెక్కలు మాత్రమే. అవుటాఫ్ కోర్టు సెటిల్ మెంట్ దీనికి 100 రెట్లు వుంటుంది) 65 బిలియన్ల డాలర్లు. అంటే మన రూపాయలలో అక్షరాలా 4 లక్షలా 22 వేల 500 వేలకోట్ల రూపాయలు, 42500,00,00,000 మాత్రమే. సంవత్సరానికి ఈ విషయమై RCM కు అవుతున్న ఖర్చు. 13 వేల కోట్ల రూపాయలు. దానికి కారణం కూడా సంఘపరివారే. అలాగే, ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలోని మదరసాలలో జరిగే పిల్లలమీది లైంగిక అకృత్యాలకి కూడా బహుశా, బిజెపి, రాముడే కారణం అయివుండవచ్చు. వాటి లెక్కలు తీసిన కేరళ జర్నలిస్టుపై లించింగ్ అంటే మూకదాడి చేసింది కూడా బహుశా సంఘపరివారే అయివుండాలి. కథువా సంఘటన జరిగిన తరువాత అలాంటివే పది సంఘటనలు హిందూయేతర ముద్దాయిలుగా వున్నవి జరిగాయి. (ఆంధ్రప్రదేశ్ తో సహా) వాటి గురించి మాత్రం మనం స్పందించం.
    విషయం పిల్లలపైన జరిగే లైంగిక అకృత్యాలే అయితే దాని గురించి మత, కుల, వర్గ, రాజకీయ భావజాలాలకు అతీతంగా అన్నింటిలోనూ జరిగే ఘోరాలని చెప్పాలి, పరిష్కారాలు వెదకాలి. కేవలం కథువా సంఘటనను, బిజెపి అనుకూల వార్డెన్ ను, రాముడిని కలిపి కిచిడీ వండితే అది రాజకీయ ప్రేరేపిత ప్రాపగాండా అవుతుంది కానీ ఫలక్ లాంటి పిల్లలకు ఏవిధమైన సాంత్వనను చేకూర్చదు. విషయం పిల్లల శ్రేయస్సా లేక మన భావోద్వేగ రాగద్వేష జనిత విశ్లేషణా అనేది వ్యాస రచయితే తేల్చుకోవలసివుంటుంది. ఇంకా దారుణమైన వివరాలు మిగిలిన ప్రపంచ దేశాలన్నింటిలో జరుగుతున్నవి వున్నాయి. ఈ దేశంలో జరిగేవి కూడా. వాటి వివరాలు తెలియపోతే చెప్పగలను.

  • What a painful story madam.. it’s reflecting the present society! Feeling ashamed to live in these kind of circumstances… No safety for girl child indeed!

  • నరకంలో నుంచీ తప్పించబడ్డ చిన్న పిల్లని దత్తత తీసుకుని పెంచుకుంటు న్నప్పుడు ఆ పిల్లని గతంలోని చెడ్డరోజులు గుర్తుకొచ్చి ఎలా బాధపెడతాయో, ఆ తల్లిదండ్రులు ఎలాంటి పరిస్థితులని ఎదుర్కొంటారో అన్న విషయాలమీద సున్నితంగా కథే కాదు నవలే అల్లవచ్చు. అయితే, ఈ కథలో, మతమూ, కులమూ, రాజకీయమూ ప్రవేశించి అవి కథని చెప్పడానికి కాక రచయిత్రి (కలం పేరుతో రచయిత?) అభిప్రాయాలని వ్యక్తం చెయ్యడానికి మాత్రం ఉపయోగపడ్డాయి.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు